Site icon Sanchika

మర్దానీ 2 : ప్రస్తుతం నడుస్తున్న చరిత్రే

[box type=’note’ fontsize=’16’] “రేపులకు కారణం ఆడవారి అందం, వస్త్ర ధారణ, యవ్వనం, ఇవేవీ కావు; కరడు గట్టిన పురుష స్వామ్యం అని బల్ల గుద్ది చెప్తుందీ చిత్రం” అంటున్నారు పరేష్ ఎన్. దోషిమర్దానీ 2‘ సినిమాని సమీక్షిస్తూ. [/box]

[dropcap]1[/dropcap]980 లో బీ ఆర్ చోప్రా తీసిన “ఇన్సాఫ్ కా తరాజూ” వచ్చింది. ఇప్పుడు అతని తమ్ముడి కొడుకు ఆదిత్యా చోప్రా నిర్మాణంలో “మర్దానీ 2” వచ్చింది. రెంటి మధ్యా పోలిక కథ రేప్ చుట్టూ తిరగడం. 1980 నాటికి బాలీవుడ్ సినెమా రేప్ ని ఎట్లా అర్థం చేసుకుంది, ఇప్పుడు ఎలా చూస్తుంది చూద్దాం. ఇన్సాఫ్ కా తరాజు చూసినప్పుడు నేను ఇంటర్ చదువుతున్నాను. అప్పుడు నచ్చింది. చూసి ఆవేశపడ్డాను కూడా. అంతకంటే ఎక్కువ ఆలోచించలేదు. ఇన్సాఫ్ కా తరాజు అంటే న్యాయదేవత చేతిలో వున్న తక్కెడ. మోడెల్ అయిన జీనత్ అమాన్ ని చూసి ధనవంతుడైన రాజ్ బబ్బర్ మోహించి ఆమెతో చనువుగా మెలుగుతూ పథకం ప్రకారం వో రోజు మానభంగం చేస్తాడు. ఆమె వూరుకోకుండా అతనిమీద కేసు పెడుతుంది. కాని వొకసారి జరిగిన రేపును మరలా అదే రేపుకు కోర్టులో మరిన్ని సార్లు ఆమె గురి అవుతుంది, లాయర్ల క్రాస్ ఎక్సామినేషన్ లో. మన న్యాయవ్యవస్థలో లొసుగులు, సమాజ వైఖరి కారణంగా ఆమె కేసు వోడిపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె చెల్లెలికి మళ్ళీ అదే గతి పడుతుంది. రేప్ చేసినదీ అతనే. ఈ సారి కోర్టు తలుపు తట్టకుండా జీనత్ అతన్ని చంపేస్తుంది. చాలా భావోద్రేకాలతో డ్రామా పండించాడు దర్శకుడు. న్యాయ దేవత కళ్ళకు కట్టు వుండడం, చూడలేక పోవడం, న్యాయం జరగకపోవడం. మరో పక్క స్త్రీ మానం భంగపడితే వో మందిరం కూల్చిన లాంటి పోలికేదో తేవడం. ఇక దొరికిందే సందని చెప్పి ఆ రేప్ సీన్స్ ను ఎక్స్ప్లాయిట్ చెయ్యడం చూస్తాం. కోర్టులో ఆడదానికి న్యాయం జరగడం లేదు అన్న వొక్క మాట తప్ప, సినెమాలో అన్నీ అపసవ్యంగా వుంటాయి.

ఇప్పుడు మర్దానీ 2 కథకు వద్దాం. మొదట్లోనే వో సంతలో మాస్క్ పెట్టుకున్న వో కుంటివాడు (acting lame), అడుక్కునేవాడికి తన చేతిలో వున్న తినే వస్తువు ఇస్తూ మనతో అంటాడు : ఆకలి అలా తీరి, మళ్ళి గంటకే నకనకలాడుతుంది. నాకు తినడానికేమిచ్చినా సర్దుకుపోతా కాని, మరో ఆకలి విషయం లో అమ్మాయి ఎలా వుండాలి అన్నది నాకు ఖచ్చితమైన ప్రమాణాలున్నాయి. అలా చెబుతూ అవతల వాదులాడుకుంటున్న వో జంటను చూస్తాడు. చెప్పిన ప్రకారం వేళకు రాని తన ప్రేమికుడితో దెబ్బలాడి, అతన్ని తిట్టి పోస్తుంది. ఇలాంటి పొగరున్న పిల్లే తనకు నచ్చుతుంది అని అతను మనతో అంటాడు. అమ్మాయి ఇలా గరం గరం గా వుండాలి అంటాడు.అల్లంటి పొగరు వున్నప్పుడే దాన్ని అణచి నేను తృప్తి చెందుతాను. అప్పుడే మజా. అసలు అమ్మాయిలు ఎలా వుండాలి? సంస్కారవంతంగా, అణిగి మణిగి వుండాలి. అన్నిటికీ పురుషులతో సమానం అంటూ చెలరేగిపోతే వాళ్ళను అణచడం నాకు తెలుసు. యెవరెక్కడుండాలో అక్కడుండాలి, లేదంటే వాళ్ళ స్థానం వాళ్ళకు చూపించడం నాకు బాగా తెలుసు అంటాడు. ఆమె ప్రియుడిని గుద్దుకుని, సారీ అంటూ అతని మొబైల్ ని కొట్టేస్తాడు. తర్వాత అదే ఫోన్ లోంచి ఆమెకు కాల్ చేసి అతనికి ఏక్సిడెంట్ అయ్యింది, ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఈ ఫోన్ కావాలంటే వచ్చి తీసుకోవచ్చు అంటాడు. ఆమె వచ్చాక ఆమెను వో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి అతను సని (విశాల్ జేఠ్వా) రేప్ చేసి చంపేస్తాడు. అతని వయసు 18. మన దేశంలో మనం చూస్తున్న కొత్త పరిణామం ఇలాంటి నేరాలు ఎక్కువగా టీనేజి పిల్లలే చేస్తున్నారు. కోటా లో కొత్త ఎస్ పీ గా శివాని ( రాణీ ముఖర్జీ ) వస్తుంది. రావడంతోటే ఈ కేసును తీసుకుని అంతు కేసు చూడాలని నిశ్చయించుకుంటుంది. ఆమెకంటే సర్వీసులో సీనియర్, కాని హోదాలో జూనియర్ అయిన బ్రిజ్ శేఖావత్ (సుమీత్ నిఝావన్) కి ఆడవాళ్ళంటే చిన్న చూపు. ఆడవారికి సామర్థ్యం తక్కువ. తప్పి జారీ కెరీర్ లో పైకి రావాల్సిందే, కానీ మగవారితో సమానంగా వుండరు. అలాంటి భావాలు గల అతను ఆమెకు పూర్తి సహకారాన్ని అందించడు. వొక మీడియా చర్చల్లో ఆమె అంటుంది నేను ఎలాగైనా ఆ నరరూప రాక్షసుడిని పట్టిస్తాను. టీవీ వార్తల్లో ఇది చూసిన సని ఆమెను తన తర్వాతి బలిపశువుగా చెయ్యాలని, అదీ ఆమెకు అన్ని హింట్లు ఇస్తూనే ఆమె కళ్ళుగప్పి, ఆడించి, తిప్పి మరీ చంపాలనుకుంటాడు. అక్కడినుంచి వారిద్దరి మధ్యా దొంగా పోలీస్ ఆట మొదలవుతుంది. రెండు గంటలకు లోపే వున్న ఈ చిత్రం ఎక్కడా బోరైతే కొట్టదు. ఇలాంటి కథాంశం తీసుకుని సినెమా తీస్తే చివరికి న్యాయమే గెలిచి దోషికి శిక్ష పడాలని తెలిసిన ప్రేక్షకుడు చివరి సీన్ లో శివాని బెల్టుతో సని ని తరిమి తరిమి కొట్టడం ఆశ్చర్యం వెయ్యదు, కానీ ఈ మధ్యే హైదరాబాదులో వో డాక్టర్ రేప్ హత్య జరిగిన తర్వాత ప్రజలంతా ఆ దోషులకు ఉరి పడాల్సిందే అని ఆవేశపడిపోవడం గుర్తొస్తుంది. అక్కడా ఇక్కడా ఆవేశమే.

ఇప్పుడు మళ్ళీ ఇన్సాఫ్ కా తరాజు చిత్రానికి వద్దాం. అందులో వొక రేప్ అంటే అది స్త్రీ శరీరం మీద, మనసు మీద, బహుశా పవిత్రత మీద కూడా అత్యాచారం. ఆడవారి దుస్తులు వగైరా చర్చలు జరుగుతాయి కోర్టులో. రేపిస్టు కూడా అదొక బలహీనతగా అమ్మాయిలను రేప్ చేస్తుంటాడు, మరో కారణం కనిపించదు. 1980 తర్వాత రేప్ పట్ల మన అవగాహన చాలా ముందుకెళ్ళింది. అది శరీరానికి సంబంధించింది కాదు. స్త్రీ మీద మగ జాతి పెత్తనం చెయ్యడానికి పనికొచ్చే వొకానొక ఆయుధం. ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా చదువుకుని, అన్ని రంగాలలో పోటీపడి పైకి వస్తుంటే మగజాతికి (అలాంటివారికి) ఉక్రోషం ఎక్కువై అలాంటి సంఘటనలు రోజూ పేపర్లలోకెక్కుతున్నాయి. సగటున రోజుకి 93 రేపులు జరుగుతున్నాయిట మన దేశంలో. ఆమె పని చేసే చోట వున్న మగవాళ్ళ దృక్పథం వొకటి. అంత కంటే ముఖ్యంగా సని దృక్పథం. అతను ప్రేక్షకుడితో మాట్లాడుతూ వుంటాడు. ఈ పధ్ధతి అవలంబించడం వలన అతని నోటే అలాంటి వాళ్ళ మనసుల్లో ఆడవారి పట్ల వున్న వైఖరి మనకు దర్శకుడు చెబుతున్నాడు. అతని చిన్నతనంలో జరిగిన సంఘటన, అతని మానసిక ఆవరణ అతన్ని అలా చేస్తాయి. వివరాల జోలికి వెళ్ళడం తగదు. రేపులకు కారణం ఆడవారి అందం, వస్త్ర ధారణ, యవ్వనం, ఇవేవీ కావు; కరడు గట్టిన పురుష స్వామ్యం అని బల్ల గుద్ది చెప్తుందీ చిత్రం. ఆ కోణం నుంచి చూస్తే 1980 నుంచీ చాలా ముందుకు వచ్చాం. మన అవగాహన క్రమంగా మెరుగు పడుతూనే వుంది కాబట్టి దీన్నికూడా అంతిమం అనుకోవడానికి లేదు.

ఇక సినెమాలో లోపాలు లేవా అంటే తప్పకుండా వున్నాయి. మామూలు చిత్రాల్లో హీరోకి వున్న రకం లాంటి హీరోయిజమే ఇక్కడ హీరోయిన్ కి వుంటుంది. విపరీతమైన తెలివితేటలు, ఖచ్చితంగా కరక్టుగా వూహించగలగడం, అసాధ్యంలా తోచే సందర్భాల్లో కూడా మితిమీరిన ఆత్మ విశ్వాసం ఇవన్నీ కాస్త టూ మచ్ అనిపిస్తాయి. మన పోలీసు వ్యవస్థ పని తీరు బాగా వుండి నేరస్థుడిని పట్టుకోవడం అన్నది నిజ జీవితంలో ఎన్నో రేపులకు గురైన స్త్రీలకు న్యాయం అందకపోవడం తో పోలిస్తే తిరకాసుగా అనిపిస్తుంది. నిర్భయా దోషులకు ఇంకా శిక్ష అమలు చేయనే లేదు. కొన్ని రేపులు చేసిన, వో పద్దెనిమిదేళ్ళ కుర్రవాడికి హత్య చేసే పని వో రాజకీయ నాయకుడు ఇవ్వడం కూడా అలాంటిదే. మామూలు స్త్రీలకు అన్యాయం జరిగితే అది వొకరకమైన స్పందనకు నోచుకుంటే రాజకీయ హత్యలు మాత్రం పెద్ద విషయంగా చర్చల్లోకొస్తాయి. దాగదు. అది కాస్త అతకలేదు. ఇలా చిన్న చిన్నవి వున్నాయి. కాని అంతిమంగా అవసరమైన చోట సరైన దృక్పథాన్ని మన ముందు పెట్టినందుకు మెచ్చుకోవాలి. ఇకపోతే రేపుల చిత్రీకరణలో కెమెరా తటస్థంగా వో ఇంటిని చూపిస్తూ కేవలం కేకలతో, శబ్దాలతో ఆ హేయమైన చర్యను “చూపించి” మనకు వొళ్ళు గగుర్పొడిచేలా చేశాడు.

రాణి ముఖర్జీ, విశాల్ జేఠ్వా ల నటన చాలా బాగుంది. గోపీ పుత్రన్ కి దర్శకుడుగా ఇది మొదటి చిత్రం. దీనితో పాటు ఇదివరకు వచ్చిన మర్దాని చిత్రానికి కూడా స్క్రీన్ ప్లే తనే వ్రాశాడు. ఇతని నుంచి మంచి చిత్రాలు ఆశించవచ్చు. జిష్ణు భట్టాచార్జీ చాయాగ్రహణం బాగుంది.

ఇది హాళ్ళల్లో రెండో వారం ఆడుతున్నది. వీలైతే చూడండి.

Exit mobile version