మరో తెలుగు సూరీడు

0
1

[dropcap]తె[/dropcap]ల్లవారి ఏడుగంటలైంది. శ్రీమతి అందించిన కాఫీ రుచి చూస్తూ పడక్కుర్చీలో కూర్చున్నాను. హేమంత ఋతువు కావడంతో ఎటు చూసినా మంచు. వాతావరణం చల్లగా ఆహ్లాదంగా ఉంది. బాలాదిత్యుని లేతకిరణాలు మంచుపొరని చీల్చుకుంటూ రావాలని ప్రయత్నిస్తున్నాయి. అద్భుతమైన ఈ ఉషోదయాన్ని ఆస్వాదిస్తూ పడక్కుర్చీలో కూర్చుని కాఫీ తాగడం నాకు చాలా ఇష్టం. ఇంటి ముందు గేటుకు రెండు వైపులా ఓ చిన్నపాటి తోట పెంచాము నేను, నా భార్య సావిత్రి. బంతి, చేమంతి, విరజాజులు, పారిజాతాలు, గన్నేరు, నందివర్దనం లాంటి పూలెన్నో చోటు చేసుకున్నాయి మా తోటలో.

రసాస్వాదనలో నాది అందెవేసిన చెయ్యి. పువ్వుల గుబాళింపును ఆస్వాదిస్తూ, పడక్కుర్చీలో కూర్చుని కాఫీ తాగడం నాకెంతో ఇష్టం. ఋతువు హేమంతమైనా, గ్రీష్మమైనా నా శ్రీమతి కాఫీతో కలిపి ఆస్వాదించడం నా దినచర్యలో భాగం. మాతృభాషోపాధ్యాయుడుగా పదవీ విరమణ చేసిన నేను పిల్లలకు దగ్గరగ ఉండవచ్చని పట్నంలోనే సెటిలయ్యాను. నా అభిరుచి కనుగుణంగా ఇల్లు కట్టుకున్నాను. నాలుగేళ్ళ నుండి అమెరికాలో ఉన్న నా కొడుకు కూడా మాతృదేశానికి తిరిగి వచ్చాడు. అందరం కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉండాలనే వాళ్ళ అమ్మ కోరికను మన్నిస్తూ పిల్లలతో కలిసి ఉండే అదృష్టం అందరికీ రావడం లేదీ రోజుల్లో. అందుకే మా అంత అదృష్టవంతులు లేరేమో అనిపిస్తుంది నాకు, నా భార్యకు. నాలుగేళ్ళ మనవడిని మా దగ్గర వదలి ఉద్యోగాలకి వెళ్తారు కొడుకు కోడలు. వాడి ముద్దు ముచ్చట్లతో రోజులు శరదృతువు లేని వెన్నెలలా చాలా హాయిగా గడచిపోతున్నాయి.

రసాస్వాదనలో మునిగిపోయిన నేను ఇంటి ముందు కారు ఆగిన చప్పుడవటంతో తలెత్తిచూశాను. ఎవరో ఒకతను గేటు తీసుకుని వస్తున్నాడు. బ్యాగ్ తగిలించుకుని లోపలికి వస్తున్నాడు. నా కొడుకు వయసే ఉంటుంది. ముఖం చూస్తే ఎక్కడో చూసినట్లనిపించింది. కానీ ఎవరో గుర్తురాలేదు. వస్తూనే అతను “నమస్కారం మాష్టారూ” అన్నాడు. ఎవరబ్బా అనుకుంటూ ప్రతి నమస్కారం చేశాను.

నేను మాష్టారునని ఇక్కడెవరికీ తెలియదు. బహుశా మా ఊరివాడై ఉంటాడు అనుకున్నాను. దగ్గరకు వచ్చి “బావున్నారా మాష్టారు? నేను రవిని. మీ దగ్గర చదువుకున్నాను. మీ ప్రియ శిష్యుడిని. అప్పట్లో మీ మాటలకు, మీ పాఠాలకు చెవి కోసుకొనేవాడిని. తెలుగు పిరీయడ్ అంటేనే చాల ఇష్టంగా ఉండేది నాకు. మంచి, మంచి నీతి కథలు చెబుతూ పాఠం చెప్పేవారు. మా స్నేహితులం నలుగురం. మీలా మంచి తెలుగు ఉపాధ్యాయుడు కావాలని కోరుకునేవాళ్ళం. ముఖ్యంగా నేను మీలా మంచి తెలుగు టీచర్ అవ్వాలని అనుకున్నాను. నా కోరికను నేను మీముందు వెల్లడించడం మీరు నా తరుపున మా అమ్మా, నాన్నతో మాట్లాడటం జరిగాయి. కానీ వాళ్ళకు నేను ఇంజనీరవ్వాలని దేశాలు చుట్టి రావాలని ఉంది. చివరకు వాళ్ళే గెలిచారు. మొదట ఇష్టం లేకపోయినా, ఇంజనీరింగ్‍లో చేరిన నేను క్రమంగా అలవాటైపోయాను. అప్పట్లో ఆశయం నెరవేర్చుకోలేకపోనందుకు చాలా బాధపడ్డాను మాష్టారు” అన్నాడు రవి. అతను చెబుతుంటే గతం నా కళ్ళముందు మెదిలి అతని భుజం మీద చెయ్యివేసి నిమురుతూ ఉండిపోయాను.

“కులాసానా బాబు! ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? చాలారోజుల తర్వాత కనిపించావు. ఇలా కూర్చో” అంటూ కుర్చీ చూపించాను.

“ఐదేళ్ళు అమెరికాలో ఉద్యోగం చేశాను మాష్టారు! సంవత్సరం క్రితం ఇక్కడికి వచ్చేశాను. ఇది కూడా మీరు పెట్టిన భిక్షే మాష్టారు. నా స్కూల్‍డేస్ నాకు బాగా గుర్తు ఉన్నాయి మాష్టారు. ఒకరోజు మన స్కూల్లో మీ అధ్వర్యంలో మాతృభాషా దినోత్సవం జరిగింది. ఆ రోజున మీరు చెప్పిన ఉపన్యాసాన్ని నేనెప్పటికి మర్చిపోలేను. ఏ వ్యక్తి అయినా తన మాతృభాషలో పూర్తిగా పరిజ్ఞానం సంపాదించుకోలేకపోతే, అన్యభాషలలో ఎలా రాణిస్తాడు? మాతృమూర్తిని మరచిన వాడు మాతృభూమికి ఏం న్యాయం చేస్తాడు?” అని మీరు చెప్పిన మాటలు నా మనసులో ఎప్పుడు మెదులుతూ ఉంటాయి. ఒక ప్రసిద్ద కవి  చెప్పిన

ఉగ్గుపాల నుండి ఉయ్యాలలో నుండి

అమ్మపాట పాడినట్టి భాష

అనే పద్యం తెలుగు భాషలోని మాధుర్యానికి, ఉచ్చారణ సౌలభ్యానికి గుర్తు అని మీరు ఆ రోజే మాకు చెప్పారు. అందుకే విదేశీయులు సైతం తెలుగు భాషను ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ గా అభివర్ణించారని మీరు చెబితేనే మేము తెలుసుకున్నాము. ఆ కార్యక్రమం  మా మనసులో చెరగని ముద్రవేసింది. పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా మాచేత ‘భువన విజయం’ పద్యనాటకం వేయించారు. మా అభినయానికి కార్యక్రమానికి వచ్చిన పెద్దలంతా విస్తుపోయారు. మాకు చక్కటి శిక్షణ ఇచ్చి, కార్యక్రమాన్ని రక్తికట్టించిన మిమ్మల్ని అందరూ ఎంతగానో మెచ్చుకున్నారు” అని చెప్పుకుంటూ పోతున్నాడు రవి.

రవి మాటలకు ఆనందంతో బాటు ఆశ్చర్యం కూడా కలిగింది. నా భోదన ఇతనిలో ఇంత స్పూర్తినిచ్చిందా? ఒక మాష్టారికి ఇంతకన్న ఏం కావాలి? అనుకున్నాను.

“తల్లి, తండ్రి కోరిక తీర్చడం కొడుకుగా నా విధి మాష్టారు. అందుకే అమెరికాలో కొన్నాళ్ళు ఉన్నాను. ఇక్కడ మన దేశంలో మాతృభాషా స్థానం ఎటువంటిదో ఆకళింపు చేసుకున్నాను. ముఖ్యంగా నగరీకరణ అతివేగంగా పెరుగుతున్న ఈ రోజుల్లో ఇంగ్లీషు భాషావ్యామోహం అతివేగంగా వేళ్ళూనుకుంటుంది. ‘జాతీయ తెలుగు సదస్సు’ను స్థాపించాను మాష్టారు. నేను ఉన్న చోటు నుండే ఈ సదస్సును ప్రచారం చేయాలనుకున్నాను.

ఈ సదస్సు ద్వారా తెలుగు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. అక్కడ వారం వారం తెలుగువాళ్ళందరం కలిసి ఈ సమస్యలన్ని చర్చించుకుంటాము. విశ్వనాథ సత్యనారాయణ, నారాయణ రెడ్డి, శ్రీశ్రీ లాంటి గొప్ప కవుల గురించి వారి రచనా వైశిష్ట్యం గురించి మాట్లాడుకుంటాము. అక్కడకు వచ్చే వాళ్ళలో కవులు, రచయితలు, సాహితీవేత్తలు మీలాంటి గొప్ప గొప్ప మేధావులున్నారు మాష్టారు. వాళ్ళందరిలో నేను మిమ్మల్ని చూసుకుంటూ ఉంటాను. నేను చేస్తున్న ఈ కార్యక్రమం గురించి నా స్నేహితులతో కూడా చర్చించాను. వాళ్ళు నన్ను చాలా పోత్సహిస్తూ తమ సహకారాన్ని అందిస్తామన్నారు” ఇలా భావోద్వేగంగా చెప్పుకుంటూ వెళ్తున్న రవి మాటాలకు ఎలా స్పందించాలో కూడా నాకు అర్థం కాలేదు.

“యువకులంత నీలా భాషాభిమానులైతే, భవిష్యత్తులో మన భాష ప్రపంచవ్యాప్తం అవుతుందనడంతో సందేహం లేదు రవీ” అన్నాను.

“మాస్టారూ,

‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా

గతమెంతో ఘనకీర్తి కలవాడా

అంటూ ఆంధ్రజాతి ఔన్నత్యాన్ని గుర్తుచేసే ఈ పద్యాన్ని నేనెప్పటికీ మర్చిపోను మాష్టారు.

ఈ జాతీయ సదస్సుకు మరింత ప్రచారం పెంచాలి మాష్టారు. దానికోసం మీలాంటి వారి సలహాలు మాకు కావాలి. ఈ గురుతర భాద్యతను మీరు స్వీకరించి మమ్మల్ని మా ‘తెలుగు సదస్సు’ను ముందుకు నడిపించాలి. అందుకే మీరు ఒకసారి అక్కడకు రావాలి మాష్టారు. త్వరలో అన్ని ఏర్పాట్లు చేసి మీకు ఆహ్వానం పంపుతాను. మీరు తప్పకుండా వచ్చి, అందులోని లోటుపాట్లు పరిశీలించాలి” అంటూ మరోసారి నా కాళ్ళకు నమస్కరించాడు రవి.

నాకు నోటమాట రాక అతని భుజం తడుతూ ఉండిపోయాను. “వస్తాను మాష్టారు” అని వెళ్ళిపోయాడు రవి. నా గొంతునిండా అమృతం పోసినట్లయింది. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న గురజాడ వారి పాట మనసులో మెదిలి ఆ చిరంజీవిని మనసారా ఆశీర్వదించాను. అతని కోరికను అంగీకరించాను. తెలుగు తల్లి ఋణం తీర్చుకొనే సదవకాశం కల్పించిన రవి నిజంగా మరో సూరీడే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here