ఒక యేడు మృత్యుముఖమున
ప్రకటగ్రసితమయి నూత్నమైన వర్షము సద్యో
వికసితమయి క్షణమున వి
శ్వకటాహము నందు నూత్న సాంగీతకమై.
ఆకురాలి చివురు మొల్చుటంత రెప్ప
పాటులో సంభవించె లిప్తయు గడువదు
ఎడములేని కాలగతి సమీక్షింపలేము
దాని తాత్పర్యమెడదకందదును మిగులు.
ఏ లిప్తకడుపులో సం
చాలితమయి దుఃఖమింత దాగినదేమో
ఏ లిప్త ప్రీతి నుంచునొ
కాలము నేలెడి విరించికైన తెలియునో.
మామిడి పూయలేదు పికమండలి కూయనులేదు రాని ఆ
ఆమని గుర్తులే యెడలనైనను కానగరావు, చిల్కలున్
కోమల వాక్కులన్ పలుకకున్నవి గ్రీష్మము ముందె వచ్చె కాం
తా మధురస్మృతుల్ విధుర తాపములున్ బ్రతుకాక్రమించెడున్.
బ్రతుకు సర్వము స్వరభంగమౌ పాటయై
గిరుల పగుల్చు దుర్భరరవమ్ము
ఎట విశ్రమించుటో ఎరుగని పరుగుల
బరువున భావముల్ భంజితములు
దరి చేర లేక దౌదవ్వుల చనలేక
బిడ్డలు శూన్యతా బిలము జేర
పలుకరెవ్వరు ఎద పగులునో మిగులునో
క్రమమున నేకాంత గహ్వరమున
హిమము శిశిరము తరలిన నిపుడు పూల
కారు నిప్పుల కారు నా కటిక తనము
చూప ఎటులో ఉగాది వచ్చినది వేప
పూవు దాల్పదు దుఃఖితు మోము జూచి.
కూడికలు తీసివేతల తోడ దుఃఖ
మాడుచున్న దీర్ఘానంతమైన రూప
కమ్ము బ్రతుకు, దీనికి తుదమందు మృత్యు
వన్న తెరపాటు పిదపనేమగునొ ఎరుగ.
వ్యర్థములేకదా సకల వాంఛలు నెగ్గిన వెంబడించు సం
వర్ధితమైన కోరికల వాడిమి కోతల నోర్వలేవు స
ర్వార్థము లిప్తమైనను హృదంతర మందాకటేదొ కోరెదున్
అర్థముకాని దొక్కటి రహస్యము సౌఖ్యమటన్న శబ్దమే.
వెలితి లేని మనికి కలుగునో జగతిని
లేని దాని గూర్చి లోన కలత
చివురు పత్రమగచు చివరకు రాలును
వ్యక్తమెల్ల విలయమందు మునుగు.
వచ్చిన కోకిలన్ గురుతు పట్టదు లోకము, వేరొకండు తా
వచ్చునటంచు వేచు స్వరవైఖరి మెచ్చదు పాతదంచు లో
మచ్చరమింత, స్వాతిశయ మానితయింత, నిరంతరాయమీ
హెచ్చులు లొచ్చులున్ సమత నిల్వగనీయవు స్వాంతమందునన్.
– కోవెల సుప్రసన్నాచార్య