Site icon Sanchika

మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-13

[box type=’note’ fontsize=’16’] కొవ్వలి, భయంకర్ పేరుతో రచించిన జగజ్జాణ ఆ కాలం పాఠకులను సమ్మోహితులను చేసింది. ఆనాటి జగజ్జాణను ఈనాటి పాఠకుల కోసం సరళంగా, సంక్షిప్తంగా అందిస్తున్నారు డా. సి.హెచ్. సుశీల. [/box]

[dropcap]రెం[/dropcap]డు బారల పొడుగు కలిగిన తన ఆకారాన్ని ఒక వేలెడు పొడుగు లోకి కుదించుకున్నాడు సర్ప రూపంలో ఉన్న పకీరు. ఆ పాము రాక్షస దంపతులు తేరుకునే లోగానే వారి చేతుల్లోంచి జారి కింద పడి చీకట్లో పాకి ఎటో పోయింది.

పకీరు వాయువేగంతో మహాబల చక్రవర్తి ఆస్థానానికి వచ్చాడు.

ఆరోజు ఉగాది. పంచాంగ పఠనంతో పాటు, వింతవింత, విచిత్ర వస్తువుల ప్రదర్శన కూడా ఉంటుంది. అత్యంత విచిత్రమైన వస్తువులకు బహుమతులు కూడా ఉంటాయి. జనులందరూ ఆ వింతలను చూడటానికి వచ్చి ఉన్నారు. అంతేకాక ప్రతి ఉగాది పండుగ నాడు చెరసాలలో ఉన్న ఖైదీలను విడుదల చేసి ఆ ఒక్క రోజు వారి వారి బంధుమిత్రులతో సంతోషంగా గడపనిచ్చి, ఆ మర్నాడు యథాప్రకారం ఖైదు చేయటం రివాజు. అలా విడుదల చేయబడిన వాళ్ళలో రణధీర్ కూడా ఉన్నాడు. తండ్రి రాకను తెలుసుకున్న రాగలత సంతోషంతో వెళ్లి, ఆయన్ని కలిసి, చిలుక చెప్పే కథల వల్లే ప్రతి రాత్రి తను గండం గడిచి వస్తోందని చెప్పింది.

పంచాంగ శ్రవణం తర్వాత వింత వింత వస్తువుల ప్రదర్శన జరుగుతూ ఉన్నది. అంతలో గుండా పకీర్ వచ్చి, తన దగ్గర ఒక విచిత్రమైన వస్తువు ఉన్నదని చెప్పాడు. అది అందరి కంటే విచిత్రమైన వస్తువు అని, బహుమతి తనకే కావాలని చెప్పాడు. ప్రజలతో పాటు రాజుగారు కూడా ఆసక్తితో విని, వెంటనే అనుజ్ఞ ఇచ్చాడు. ఫకీరు తన చేతిలో ఉన్న తోలు గుర్రాన్ని తీసి, దానిని గాలితో పూరించాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా దానిని అధిరోహించి, పరిగెత్తించి, ఒక్కసారిగా ఆకాశంలోకి లేచాడు. ఆ ఆవరణ పైనంతా వలయాకారంగా తిరుగసాగాడు. ప్రజలందరూ ఆ విడ్డూరాన్ని ఆశ్చర్యంగా తిలకిస్తుండగా, రాగలత, ఆమె చెలికత్తెలు మాత్రం భయభ్రాంతులయ్యారు. ఉద్యానవనంలో తమని భయపెట్టింది గంటల మాంత్రికుడు అతనేనని వారు గుర్తించారు. ఏమి చేయాలో, రాజు గారికి ఈ మోసగాడి గురించి ఎలా చెప్పాలో తెలియక, ఖంగారు పడుతున్న సమయంలో, ఆకాశంలో సుదీర్ఘ దూరంలో చిలుక వస్తుండటం గమనించారు. ప్రజలు గమనించనంత వేగంగా చిలుక రూపంలో ఉన్న జయదేవ్ రివ్వున వచ్చి, ఆ గాలి గుర్రాన్ని ఒక్కపోటు పొడిచాడు ముక్కుతో. గాలి పోవటంతో గింగిరీలు కొడుతూ ఎక్కడో పడిపోయాడు పకీరు.

పాపం ఏమయ్యాడో, ఎక్కడ పడిపోయాడోనని ప్రజలు, రాజు గారు నిట్టూర్చి, అక్కడి నుంచి వెడలిపోయారు. అంతలో చిలక వచ్చి రాగలత భుజం మీద వాలింది. రాగలత చిలుకను తండ్రికి చూపించింది. “నీ వల్లనే నా కూతురు బ్రతికి ఉంది. కానీ గతంలో నిన్ను ఎప్పుడు చూసిన గుర్తు లేదు” అన్నాడు రణధీర్.

“మీరు, మీ కూతురు సుఖులై ఉంటారు. ధైర్యంగా ఉండండి” అని చిలుక పలికింది.

ఆ రాత్రి శయనమందిరం ప్రవేశించిన రాజుగారు ఖిన్నురాలిగా ఉన్న రాగలత, పలుకే లేక పంజరంలో ఉన్న చిలుకను చూసి ఆశ్చర్యపోయి “ఏమైంది” అని ప్రశ్నించాడు. సమాధానం లేదు. మరీ మరీ ప్రశ్నించగా “మేము మీకు పరాయివాళ్ళని కదా. మా యోగక్షేమాలు మీకెందుకు” అన్నది రాగలత.

“ఇక నుండి నేను కథలు కూడా చెప్పను” అన్నది చిలుక. “అసలు మీ శపథం ఏమిటి? ప్రతి రోజు ఒక స్త్రీ ని మీ కరవాలానికి బలి చేయటం ఎంతకాలం’ అన్నది.

“నేను వరించిన కన్య జాణలలో ‘జగజ్జాణ’ అయి, నన్ను ఎప్పుడు జయిస్తుందో అంతవరకు…” నవ్వాడు మహారాజు.

“అంటే?”

“నేను వరించిన కన్యలలో ఎవరైనా తెలివితేటలతో, నన్ను ఏమార్చి, నాకు తెలియకుండా పరపురుషుని ద్వారా గర్భం దాల్చినప్పుడు నా ఓటమిని అంగీకరించి, స్త్రీజాతికి నమస్కారం చేసి, నా శపథాన్ని విరమించుకుంటాను” అన్న మహారాజు మాటలను విని రాగలత “అసలు ఇటువంటి కఠోర శపథాన్ని ఎందుకు వహించారు? మీ అర్ధాంగిని మొదట ఎందుకు సంహరించారు?” అని అడిగింది. “నన్ను జయించిన జగజ్జాణకు తప్ప ఇతరులకు చెప్పదలుచుకోలేదు” అన్నాడు మహారాజు.

“ఇక కథ మొదలు పెట్టవే చిలుక'” అన్న రాజు గారి మాటలతో కథ మొదలు పెట్టింది చిలుక.

***

లాల్మియా కీటక రూపంలో ఉన్న గాజు సీసాని పట్టుకున్న తారానాథ్, గురవయ్య, బాణంభట్టు చేతులు సీసాకి అంటుకుపోయి, ఎంత లాగినా రాలేదు. వెక్కి వెక్కి గగ్గోలు పెడుతున్న వారి దగ్గరకు ఒక ఛాయారూపం వచ్చింది. ఆశ్చర్యంతో, భయంతో చూస్తున్న వాళ్లతో “ఎందుకు ఇలాంటి సాహసం చేశారు బిడ్డలారా! అసలు మీరెవరు” అన్నది. జరిగిన విషయం చెప్పారు. ఆ ముగ్గురి చేతులను ఒక్కసారి తన చేతితో తాకింది ఆ ఛాయారూపం. తక్షణం వారి చేతులు విడివడ్డాయి. అదే అదనుగా పరిగెత్తి పారిపోయారు.

ఆ ఛాయారూపం అక్కడ ఉన్న సీసాను అలవోకగా తన చేతులతో పైకెత్తి “లాల్ “అన్నది. సీసా నుంచి ఆమె ఆశించిన జవాబు రాలేదు.

“లాల్ ! నీకు ఇంకా ఎప్పుడు బుద్ధి వస్తుంది? నేనెవరో గుర్తించావా!”

“మాతృమూర్తి రోహియాబేగం. ఈ కార్యం ఇంకెవరికి సాధ్యమవుతుంది?” అన్నాడు.

“పెళ్లాడిన మాధురిని హింస పెట్టావు. లోకంలోని ఎందరో స్త్రీలను భంగపరిచి ఎంత పాపం సంపాదించావు! మాధురి తన మంత్రశక్తితో నిన్నీ సీసాలో బంధించింది. శాశ్వతంగా కీటకంగా దీంట్లోనే ఉండేవాడివి. కానీ తల్లి ప్రాణం చూడలేక మీకు విముక్తి కలిగిస్తున్నాను. వెళ్ళిపో. ఇక నా కళ్ళ ఎదుట ఉండకు” అని సీసా మూత తీసి వెళ్ళి పోయిందామె. దాని కోసమే చూస్తున్నట్టు వడివడిగా నడిచి చీకట్లో కలిసిపోయాడు లాల్మియా.

అమాయకంగా కనిపిస్తున్న ఆ ముగ్గురు మిత్రులను సాధనాలుగా ఉపయోగించుకోవాలనుకొన్నాడు లాల్మియా. తారానాథ్‌ని పట్టుకొని మాయ మాటలు చెప్పి అతని కంటికి ఒక అంజనం లాంటిది పెట్టి, కళామందిరం లోపలికి వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని రమ్మన్నాడు.

అంజనం వల్ల అదృశ్యంగా మారిన తారానాధ్ కళామందిరం లోకి ప్రవేశించాడు. అక్కడ భార్యను చూసి మురిసిపోయాడు. ఆమె చెంపను తాకాడు. రకరకాల తినుబండారాలను, పానీయాలను చూసి ఆకలికి ఆగలేక అవన్నీ తినటం మొదలు పెట్టాడు. ఇవన్నీ అదృశ్యరూపంలో ఉన్న లాల్మియా చేస్తున్నాడని భయపడ్డారు అవంతి, మనోరమ, మకరంద్. భటులు కూడా ఈ చిత్రాలను మాధురీ బేగంకి చెప్పారు.

మాధురీ బేగం పక్క గదిలోకి వెళ్లి అక్కడ పసుపుకుంకుమలతో, ముగ్గుతో పద్మాకారం ఏర్పరచి, మధ్యలో గుడ్డతో చేయబడిన జానెడు బొమ్మను ఉంచింది. అది కళ్ళు ముక్కు చెవులు నోరు మొదలైనవి కలిగి ఉంది. దాని ఎదురుగా పీటపై కూర్చొని కొంచెం సేపు ఏదో మంత్ర పఠనం చేసింది. ఆ బొమ్మ కళ్ళకు ఏదో అంజనం రాసింది.

“నీది ఏ ఊరు? నీ పేరు ఏమిటి? ఈ రూపంలో ఎందుకు ఉన్నావు?'” అని అడిగింది. ఆ బొమ్మలోకి వచ్చిన తారానాథ్ తన వృత్తాంతం మొత్తం చెప్పాడు. భర్త జాడ తెలిసి మనోరమ సంతోషించింది, అతని స్థితికి దుఃఖించింది.

“మీరందరూ పక్క గది లోకి వెళ్లండి. ఇతను తన రూపాన్ని పొంది, ఈ బొమ్మపై ఉన్న ముసుగు లాంటి దానితో బయటకు వస్తాడు. నేను వచ్చి ఆ ముసుగు తీసి అతన్ని లాల్మియా చేసిన మాయ నుండి బయట పడేస్తాను” అని చెప్పింది మాధురి. ముగ్గురు పక్క గదిలోకి వెళ్లి ఎదురుచూడసాగారు.

తారానాథ్‌ని కళామందిర్ లోకి పంపించిన లాల్మియా ఎందుకైనా మంచిదని గురవయ్యకి కూడా అంజనం పెట్టి అదృశ్య రూపం లోకి మార్చి అతని చేతిలో కొంత విభూతి పెట్టి, “నువ్వు కళామందిర్ లోకి వెళ్ళు. నీకు ఒక అందమైన స్త్రీ కనిపిస్తుంది. ఆమెపై ఈ విభూతి చల్లు. మాట్లాడకుండా నీ వెనకాలే వస్తుంది. ఎక్కడా ఆగకుండా వచ్చేయ్” అని చెప్పాడు.

సరిగ్గా గురవయ్య కళామందిరం లోపలికి ప్రవేశిస్తున్నప్పుడే మంత్ర ప్రభావం వల్ల ముసుగు రూపంలో గది బయటకు వస్తున్నాడు తారానాథ్. ‘ఓహో ఘోషా కాబోలు’ అనుకుంటూ విభూతిని చల్లాడు. ముసుగులో ఉన్న తారానాథ్ తనను అనుసరిస్తూండగా బయటికి వెళ్లిపోయాడు గురవయ్య.

కాసేపటికి మంత్ర ప్రక్రియ అంతా పూర్తి చేసుకొని బయటకు వచ్చిన మాధురీబేగం అక్కడ ఉన్న ముగ్గురిని అడిగింది “ఏడీ మీ తారానాథ్ “అని. “రాలేదే” అన్నారు. “ఇదంతా లాల్మియా చేసిన మాయ” అని మాధురీ బేగం అనడంతో ముగ్గురు దిగులు పడిపోయారు.

***

అంతటితో చిలుక కథను చెప్పటం ఆపడం వల్ల మహారాజు వెళ్ళిపోయాడు. “ఏమి జరిగింది” అని రాగలత అడగటంతో జరిగిన విషయమంతా చెప్పాడు చిలక రూపంలో ఉన్న జయదేవ్.

సర్పరూపంలో ఉన్న గుండా పకీర్ తప్పించుకుపోయాడని జయదేవ్ చెప్పగా, ఇక్కడకు వచ్చి తోలు గుర్రంతో విచిత్రాలు చేసాడని రాగలత చెప్పింది. “మళ్లీ తప్పించుకు పోయాడు” అన్నాడు జయదేవ్.

“పోనీలే నీ శరీరము క్షేమంగా ఉంది కదా! మనం అక్కడికి వెళ్ళగలమా” అన్నది రాగలత.

“తలచుకుంటే సాధ్యం కానిది ఏముంది” అన్నాడు జయదేవ్.

దుందుభి దంతనాధుల సాయంతో చిలక రూపంలో ఉన్న జయదేవ్ రాగలతను తన శరీరం ఉన్న గుహ దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. అంతకుముందే అక్కడకు చేరిన పకీరు అక్కడ ఉన్న ఒక మొండి గోడ వెనుక నక్కి చూడసాగాడు. చిలుక శరీరాన్ని ఒక రాతి పలక వెనుక వదిలి, తన శరీరంలోకి ప్రవేశించి, బయటకు వచ్చాడు జయదేవ్. అక్కడ ఉన్న పెద్ద శివలింగానికి రాగలత, జయదేవ్ ముకుళిత హస్తాలను జోడించి ప్రార్థించారు.

“ఇద్దరూ యథేచ్ఛగా విహరించి రండి” అన్న దుందుభి దంతనాధుల మాటలకు ఇద్దరూ ఆనందంగా ఆ ప్రాంతాలన్నీ ఇచ్ఛారీతుల విహరించసాగారు. లతా నికుంజములలో తిరిగి, కేరింతలతో పొదరిళ్లలో ఆడిపాడి, జలపాతాలలో జలకాలాడి, అనురాగ దంపతులుగా స్వర్గ సుఖాలు అనుభవించారు.

తిరిగివచ్చిన రాగలత జయదేవులకు శివుని పూజించిన తీర్థాన్ని ఇచ్చింది దుందుభి. తన శరీరాన్ని శివలింగం వెనుక ఉంచి, చిలుక శరీరంలోకి ప్రవేశించ వచ్చిన జయదేవ్‌కు అక్కడ చిలుక శరీరం కనబడలేదు. దుందుబి దంత నాథులు నివ్వెరపోయారు. అక్కడికి కొంత దూరంలో ఫకీరు చిలుకని రెండు చేతులతో పట్టుకొని దాని గొంతు కొరక సాగాడు. ఆ దృశ్యాన్ని చూస్తూ ఏడుస్తూ మూర్చపోయింది రాగలత. జయదేవుడు చిలుకలో ప్రవేశించాలని ప్రయత్నిస్తూ ఉండగానే, దానిని పళ్ళతో కొరికి మింగేశాడు పకీరు. గాలిగుర్రం ఎక్కి ఆకాశంలోకి ఎగిరి మబ్బుల్లో మాయమయ్యాడు. జయదేవుడి జీవుడు పకీరుని వెంటబడి తరమసాగాడు.

మూర్ఛితురాలైన రాగలతను కనీసం అంతఃపురం చేరిస్తే మహారాజు ఏ వైద్యునిని అయినా పిలిపించి చికిత్స చేయించే అవకాశముందని తలచి దుందుభి ఆమెను తీసుకొని దేవగిరి పట్టణం అభిముఖంగా గగనమార్గాన బయలుదేరింది.

పకీరుని, అతనిని తరుముకుంటూ వెళ్ళిన జయదేవుని అన్వేషిస్తూ దంతనాధుడు బయలుదేరాడు. కొంత దూరం పోగానే అతనికి గట్టిగా ఎవరివో ఆర్తనాదాలు వినిపించసాగాయి. “ఎవరది” అన్నాడు. ” దంతనాధా! నాకు కూడా ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. వెతుకుదాం పద” అన్నాడు అదృశ్యరూపంలో ఉన్న జయదేవ్.

కడుపు నొప్పి అంటూ కడుపు పట్టుకొని నేల మీద దొర్లుతూ ఉన్నాడు ఒక సాధువు. అతన్ని చూసి జాలిపడ్డాడు సహజంగానే సాయం చేసే లక్షణం ఉన్న దంత నాథుడు. అతనిని పట్టుకొని “ప్రమాదం లేదు” అని ఓదార్చాడు.

“ప్రకృతి సిద్ధమైన ఆకులలములు తినేవారికి కడుపునొప్పి రావడం ఏమిటి?” అన్నాడు జయదేవ్. “మీ ఆలోచనలు తర్వాత. ఏదైనా చికిత్స చేసి రక్షించండి. ప్రాణం పోయేలా ఉంది” అన్నాడు సాధువు.

అతనిచే కొంచెం నీరు తాగించారు. సాధువు భళ్ళున కక్కుకున్నాడు. నీటితో పాటు అతని నోటి నుంచి బయటపడింది చిలుక. హమ్మయ్య అనుకుంటూ ఒక్క పరుగున పారిపోయాడు సాధువు రూపంలో ఉన్న పకీరు.

చిలుక పకీరు పొట్టలో జీర్ణం కాకపోవడం చూసి ఆశ్చర్యపోతున్న దంతనాధునితో “శివస్వామి శిష్యుడనైన నేను చిలుక శరీరం కొంత కాలం ఉండటం వల్ల దానికి కొంత అమరత్వ సిద్ధి కలిగింది” అని సంతోషిస్తూ చిలుక శరీరంలో ప్రవేశించాడు జయదేవ్. రాగలత స్థితిని తలచుకొని, ఆమె ఎలావుంటుందోనని ఆందోళన పడుతూ, గురువు శివస్వామిని మనసులో తలుచుకుంటూ వాయువేగ మనో వేగాలతో దేవగిరి నగరాభిముఖంగా పోతున్నాడు జయదేవ్.

(మూర్ఛితురాలైన రాగలత పరిస్థితి ఏమైంది? గూండాపకీరు మళ్ళీ ఏం ఎత్తులు వేసాడు? చిలుక చెప్పే కథలో లాల్మియా మాయలు మంత్రాలు వల్ల ఇంకెందరు బాధపడతారు ?….. తరువాయి భాగంలో..,!)

(సశేషం)

Exit mobile version