మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-14

7
3

[box type=’note’ fontsize=’16’] కొవ్వలి, భయంకర్ పేరుతో రచించిన జగజ్జాణ ఆ కాలం పాఠకులను సమ్మోహితులను చేసింది. ఆనాటి జగజ్జాణను ఈనాటి పాఠకుల కోసం సరళంగా, సంక్షిప్తంగా అందిస్తున్నారు డా. సి.హెచ్. సుశీల. [/box]

[dropcap]మై[/dropcap]నాకుని ప్రేమించిన మంజూషాదేవి అతని మనసు హేమాంగి నుండి తనవైపుకి ఏ మాత్రం మరలటం లేదని తెలిసి లోలోన వికలమనస్కయై ఉంది. మైనాకుడు మాత్రం హేమాంగి పూర్వ స్మృతిని కోల్పోవటం, తనను గుర్తించకపోవడంతో దిగులుగా ఉద్యానవనంలో కూర్చొని చింతించ సాగాడు. అంతలో అటుగా వచ్చిన చతురిక మైనాకునితో చెప్పింది “మొదట నిన్ను చూసి మోహించి నాగలోకం తీసుకొని వచ్చినది నేనే. కానీ మా రాణికి నీపై మనసు ఉందని తెలిసి నేను మౌనంగా ఊరుకున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా కోరిక తీర్చు” అన్నది. “అసంభవం” అన్నాడు మైనాకుడు. “నీవు నా కోరిక తీరిస్తే, నీ మనోవేదనను పోగొట్టే ఉపాయం చెప్తాను. నా కోరిక తీరుస్తావా” అన్నది.

అనుమానంగా చూశాడు అతడు. “అదే నీ ప్రేయసి హేమాంగి గురించి” అన్నది. ” ఏమిటో చెప్పు” ఆతృతగా అడిగాడు.

“మా రాణి మంజూషాదేవి సిగలో ఎప్పుడూ ఒక ‘దేవ మందారం’ ఉంటుంది. అది ఎంతో మహిమాన్వితమైనది. దానిని హేమకి తాకిస్తే ఆమె తన పూర్వ స్మృతిని తిరిగి పొందుతుంది. ఈ ఉపకారం నీకు చేసినందుకు నాకు నీవు ఇచ్చిన మాటను మర్చిపోకూడదు మరి” అన్నది.

“కానీ దేవమందారంని అపహరించడం అంత తేలిక కాదు. చాలా ప్రమాదం కూడా” అని చెప్పింది. ఆమెకు ధన్యవాదాలు చెప్పి మైనాకుడు రాణి మంజూష మందిరానికి వెళ్ళాడు. అతని మోము ప్రసన్నంగా ఉండటం చూసి మంజూష దేవి చాలా సంతోషించింది.

“చెప్పు. ఇప్పటికైనా నీ మనసు మార్చుకున్నావా? నిన్ను ఈ నాగలోకానికి అధిపతిని చేస్తాను” అన్నది. “నిన్ను బాధ పెట్టడం నాకూ బాధగానే ఉన్నది” అన్నాడు మైనాకుడు తెలివిగా. ఆ మాత్రానికే సంతోషించిన ఆమె అతని చేయి పట్టుకొని తల్పం మీదకు తీసుకుని వెళ్లి మధుర ఫలాలను అందించింది. అక్కడే ఆమె పక్కన బిడియంగా మేను వాల్చాడు మైనాకుడు. మనసు కుదుట పడిన మంజూష నిద్రలోకి జారుకుంది. చాలాసేపు కాచుకుని ఉన్న మైనాకుడు ఆమె గాఢనిద్రలోకి వెళ్లిపోయిందని నిర్ధారణ చేసుకున్న తర్వాత మెల్లగా ఆమె సిగలో ఉన్న దేవమందారాన్ని తీసుకోవాలని చేయి వేయబోయాడు. అంతలో ఒక భయంకరమైన సర్పం ఆ పుష్పం నుండి వెలువడి బుస కొడుతూ అతనిని కాటు వేయబోయింది. ఒక్క ఉదుటున మంచం మీదనుండి కింద పడ్డాడు మైనాకుడు. ఆ అలికిడికి మేల్కొన్న రాణి ఏమైంది అని కంగారుగా అడిగింది ఏమీ లేదు అని తత్తరపాటుతో లేచి వెళ్లిపోయాడు మైనాకుడు.

అంతలో “మంజూషా” అని ఎవరో పిలిచినట్లు అనిపించింది ఆమెకు. కొన్ని రోజుల క్రితం కూడా ఇలాగే గోడ మీద ఒక ఆకారం లాగా కనిపించి “తల్లీ” అని తనను పిలిచినట్లు అనిపించింది.

‘ఎవరు’ అని అడిగింది.

“అమ్మా! నరుని గూడిన నాగకన్య పతనమవుతుంది సుమా! కోరిక నరికట్టుకో. కామానికి లొంగి పతనంగాకు” – తిరిగి అదే గొంతుక.

మంజూష లేచి కరవాలమును బూని చుట్టూ వెతికింది. ఎవరూ కనిపించలేదు. కానీ, అది తన పితృదేవుల స్వరమని గుర్తించింది.

ఉద్యానవనములో కూర్చుని దీర్ఘాలోచనలో మునిగిన చతురిక దగ్గరకు ఒక యువకుడు వచ్చాడు. అతన్ని చూడగానే “అన్నా, నువ్వేనా” అని చతురిక సంభ్రమాశ్చర్యాలతో అడిగింది. పదేళ్ల క్రితం ప్రపంచయాత్రకు వెళ్లి ఎన్నెన్నో ప్రదేశాలు తిరిగి ఎన్నెన్నో మాయమంత్రాల నేర్చుకొని వచ్చిన అతను చతురిక సోదరుడు ఫాలాక్షుడు.

“ఇప్పుడే ఇంటికి వెళ్లాను. నీవు ఇక్కడున్నావని తెలిసి వస్తున్నాను. ఒక అద్భుత సౌందర్యరాశి ఎవరో కనిపించింది. ఎవరు” అన్నాడు.

“ఆమే మన నాగలోకపు రాణి. తండ్రి మరణించిన తర్వాత ఆమె సింహాసనాన్ని అధిష్ఠించింది” అని చెప్పింది చతురిక.

రాణి మంజూష దేవి ఎవరో నరుని తెచ్చి తన అంతఃపురంలో ఉంచుకొని అతని ప్రేమ కోసం ఆరాటపడుతున్నది అన్న విషయం క్రమక్రమంగా ప్రజలలో ప్రచారమై, చివరకు మంత్రి, దండనాధులకు వద్దకు చేరింది. ప్రజలు అనుకుంటున్న విషయం రాణికి తెలియజేయాల్సిన బాధ్యత తమకుందని, పైగా ఆమె చేసే ఈ కార్యం వలన నాగలోకంలో ఆమె తండ్రి పేరు చెడిపోతుందేమోనన్న బాధతో వారిద్దరూ మంజూషాదేవి వద్దకు వచ్చి ఈ విషయం తెలియజేసి ఆమెను వారించ పోయారు. “మీకు అనవసరం. నేనేం చేయాలో, చేస్తున్నానో నాకు తెలుసు. మీ పని మీరు చూసుకోండి” అని ఆమె కఠినంగా చెప్పడంతో మరలి వెళ్ళిపోయారు.

చాలా రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన అన్నగారికి రకరకాల పిండివంటలు చేసి అతన్ని సంతోష పెట్టాలి అనుకుంది చతురిక. కానీ అతని మోము చిన్నబోయింది ఉండటంతో ఏమీ అర్థం కాక అడిగింది. అతను చెప్పిన విషయం వినగానే భయపడిపోయింది. మంజూషాదేవిని చూసిన మొదటి క్షణంలోనే ఆమెని ప్రేమించాడు అని తెలిసి బెదిరిపోయింది. ఎంతో వారింప చూసింది.

“ఆమెని పెళ్ళి చేసుకోకపోతే నేను మళ్లీ దేశాంతరం వెళ్ళిపోతాను” అని అతను మొండిగా చెప్పటంతో ఏమి చేయాలో తోచక ఉండిపోయింది. దానికి ఉపాయం కూడా తనే చెప్పాడు. ఎన్నో దేశాలు తిరిగి మాయలు మంత్రాలు నేర్చుకుని వచ్చిన అతను తనకు తెలిసిన విద్యతో మైనాకునిలా మారిపోయాడు.

మంజూష దేవి మందమతిలా ఉన్న హేమాంగిని పిలిచి “నీవు వెళ్లి మైనాకుని పిలుచుకురా” అని చెప్పింది. మతిలేని హేమాంగి అతని కోసం వెతుకుతూ ఉంటే చతురిక ‘మైనాకునిలా మారిన’ తన అన్నగారిని చూపించి, ఇతనే మైనాకుడు అని చెప్పింది. రాణి పిలుస్తున్నది రండి అని పిలిచిన హేమాంగి వెంట నడిచాడతడు.

రోజు లాగానే ఆలయంలో స్వామిని పూజించడానికి వెళ్ళింది మంజూషాదేవి. నియమానుసారం స్వామిని అర్చిస్తూ సిగలోని దేవ మందారాన్ని తీసి స్వామి ముందు ఉంచింది. డోలాయమానంగా ఉన్న ఆమె మనస్సానాడు పూజాదులపై నిలవలేకుండా ఉంది. అంతలో హేమాంగి “దేవి… దేవి” అని పిలవడంతో ఆలయం బయటకు వచ్చింది. “మైనాకుని తీసుకు వచ్చాను” అన్న ఆమె మాటలకి సంతోషంతో అక్కడి నుండి చకచకా వెళ్ళింది.

దేవమందారం నుండి వస్తున్న పరిమళానికి ఆశ్చర్యపోతూ ఆలయం లోపలికి వెళ్ళింది హేమాంగి.

పరమశివుని ఎదుట మోకరిల్లింది. అటుగా వచ్చిన మైనాకుడు హేమాంగిని చూసి మంజూషా దేవిగా భ్రమించి బెదురుతో వెళ్లబోయి, ఆమె మంజూష కాదని తెలిసి, దేవ మందార సువాసనకి ఆకర్షితుడై లోపలికి వచ్చాడు. మోకరిల్లి ఉన్న హేమాంగిని గుర్తించి వెంటనే ఆ మందారాన్ని తీసి ఆమెకు తాకించాడు. తక్షణమే పూర్వ స్మృతి కలిగిన హేమాంగి అతన్ని చూసి ఆశ్చర్య పోయింది.

“మనం ఇక్కడ ఉంటే ప్రమాదం. జరిగిన విషయాలన్నీ తర్వాత చెప్తాను. త్వరగా వచ్చెయ్” అంటూ మైనాకుడు ఆమెను తీసుకొని గబగబా బయటికి వెళ్లాడు. కానీ ఎక్కడకు వెళ్లాలో తెలియలేదు. చతురిక చూసిందంటే ప్రమాదం. మంజూష చూస్తే మరీ ప్రమాదం.

ఏ ప్రవాహం గుండా నాగలోకం లోకి చేరారో, అదే ప్రవాహంలోకి ఉరికి మన లోకానికి చేరాలి – అని నిశ్చయించుకొని ఇద్దరు తమ శరీరాలని ఒక చీరతో బలంగా బంధించుకొని జలగర్భం లోకి దూకారు.

మంజూషాదేవి మాయామైనాకుని చూసి అపరిమితానందం పొందింది. అతను కూడా తనతో ప్రేమగా మాట్లాడటం చూసి ఆనందించి, “ఇక అలస్యం వద్దు, త్వరలో మనం  వివాహం చేసుకుందాం” అని చెప్పింది. “రేపే వివాహం” అని కూడా చెప్పింది. అతను అంగీకరించాడు.

మర్నాడే తమ వివాహం గురించి సభలో ప్రకటించింది మంజూషా దేవి. కానీ నాగ లోకవాసులు తమ నాగరాణి ఒక నరుని వివాహ మాడటానికి అంగీకరించలేక పోయారు. వారి అభ్యంతరాలను పట్టించుకోదలుచుకోలేదు ఆమె.

చెలులు ఆమెను సర్వాలంకార భూషితురాలనుగా చేయుచుండగా దేవ మందరము కనిపించక పోవటంతో ఆమెతో సహా అందరూ కంగారుపడ్డారు. నిన్న ఆలయంలో మరిచి వచ్చిన సంగతి గుర్తుకొచ్చిందామెకు.

“నేను తీసుకొస్తాను” అని చతురిక బయలుదేరి వెళ్ళింది. రిక్త హస్తాలతో తిరిగివచ్చిన చతురికని చూసి వివాహ మండపంలోని నాగ వాసులందరూ అల్లకల్లోలం అయిపోయారు. ఎంతో మహిమగల దేవ మందారం పోవటం తమ లోకానికి అరిష్టమని, దానికంతటికి కారణమైన ఈ నరుడు ఎవడో కదా అందరూ వాపోవటం మొదలు పెట్టారు.

దేవమందారం లేకుండా తను వివాహమాడటం తన ప్రాణాలకే ముప్పు అని విలపించసాగింది మంజూషాదేవి. అక్కడ హేమాంగి కనిపించకపోవటం గమనించిన చతురిక “ముందు హేమాంగి ఎక్కడ ఉందో వెతకండి” అని బిగ్గరగా అరిచింది.

రాణి విభ్రాంతురాలై, నిన్న తాను దేవాలయంలో ఉన్నప్పుడు ఆమె వచ్చిన విషయం గుర్తుకు వచ్చింది. దేవ మందారాన్ని అపహరించుకుని హేమాంగి పారిపోయింది అని దేవి నిర్ధారించుకొంది. కానీ దేవ మందారంతో హేమాంగి మైనాకులు ఇద్దరూ పారిపోయారని ఊహించుకున్నారు చతురిక, ఫాలాక్షుడు.

“ఆ మోసగత్తె హేమాంగి ఎక్కడ ఉన్నా బంధించుకువస్తాను” అంటూ చతురిక, మెల్లగా అన్నగారి చెవిలో ఏదో చెప్పి, సర్వ సన్నద్ధురాలై, కొందరు సైనికులతో బయలుదేరింది హేమాంగిని అన్వేషిస్తూ.

జలప్రవాహంలో కొట్టుకుని పోతున్న హేమాంగి మైనాకులను ఆకాశమార్గాన వెళ్తున్న దుందుభి దంతనాథులు చూసి రక్షించి ఒక పడవలోనికి చేర్చారు. వారు గతంలో పక్షిరూపులుగా ఉన్నప్పుడు తాము రక్షించిన హేమాంగి, మైనాకులు అని తెలుసుకుని సంతోషించారు. దేవ మందారాన్నీ గుర్తించారు.

పూర్వం పాతాళలోకవాసి అయిన నాగరాజు సంతానలేమితో బాధపడుతూ, ఎవరైనా భూలోకంలో అందమైన పాపని తెచ్చి పెంచుకునే ఉద్దేశంతో అతడు భూలోకానికి వచ్చి అన్వేషించసాగాడు. ఒకరోజు శివస్వామి ఆశ్రమంలో ఉన్న అందమైన చిన్న పాపను చూసి తస్కరించ బోయాడు.

గురువుగారైన శివస్వామి ఆగ్రహించబోగా అతను తన వృత్తాంతమంతా చెప్పాడు. “మూర్ఖుడా, ఇతరుల బిడ్డలు నీ కన్నబిడ్డల కారు కదా. ఇక్కడికి నూరు ఆమడల దూరంలో అరుణాచలం అనే పర్వతమున్నది. అక్కడ పగలే గాని రాత్రి ఉండదు. అందుకే దానికి ఆ పేరు వచ్చింది. దాని శిఖర భాగమున ఉన్న దేవమందార వృక్షంన ఉన్న మందారాన్ని అందరూ కనులకద్దుకుంటూ ఉంటారు. ఆ పుష్పాన్ని తెచ్చి నీ భార్యకిస్తే ఆమె గర్భవతి కాగలదు. అందమైన పాప జన్మిస్తుంది. కానీ ఆ పుష్పమును ధరించక ఆమె పరపురుషుని గూడితే తక్షణం మరణం సంభవించగలదు. కనుక ఆ పుష్పాన్ని పరిరక్షించుకోవాల్సినది” అని చెప్పగా నాగరాజు కష్టపడి ఆ దేవమందారాన్ని తీసుకుని వెళ్లినట్లుగా మాకు తెలిసినది” అన్నారు వారు.

ఆ తర్వాత స్వస్వరూపాల కోసం తాము పడిన కష్టాలను, నాగరాణి అహంకారము, దేవ మందారాన్ని తీసుకొని తాము వచ్చిన విధానాన్ని వివరించారు మైనాకుడు హేమాంగి.

అంతలో వారు ఎక్కిన పడవ విపరీతంగా ఊగిసలాడసాగింది. నీరు లోపలికి వచ్చేస్తోంది. ఏమైందో పరిశీలించగా ఒక పెద్ద సర్పం దానిని కొట్టసాగింది. చతురికని గుర్తించి హేమాంగి కంపించి పోయింది.

దుందుభి దంతనాథులను చూసి కొంతజంకినా, చతురిక ధైర్యంతో ముందుకు వచ్చి “మా లోకపు దేవమందారాన్ని అపహరించుకొని పోతున్న వీరిని మాకు అప్పగించండి” అన్నది.

“అది అసంభవం” అంటూ మునిగిపోయిన పడవ నుంచి హేమాంగి మైనాకులను తమ భుజాలపై వేసుకొని వేగంగా ఈద సాగారు ఆ రాక్షస దంపతులు. చాలా దూరం వారిని అనుసరించినా, వారి వేగాన్ని అందుకోలేక మరలిపోయింది చతురిక.

హేమాంగి మైనాకులను క్షేమంగా తీసుకొని వచ్చి ఆలయము నందుంచి సపర్యలు చేయసాగారు. వారి ఉపచర్యలకు ఇరువురు మేల్కొని లింగాకారంలో ఉన్న శివుని దర్శించి తన్మయత్వంతో చేతులు జోడించి ప్రార్థించసాగారు హేమాంగి మైనాకులు.

(తిరిగివచ్చిన చతురికను మంజుషాదేవి బంధించిందా? మైనాకుని వేషంలో ఉన్న ఫాలాక్షుని మోసం బయట పడిందా? దేవ మందారాన్ని పోగొట్టుకున్న నాగరాణి తదితర నాగలోక వాసుల పరిస్థితి ఏమిటి? రాగలతను మరణం నుండి తన కథల ద్వారా రక్షిస్తున్న చిలక రూపంలోని జయదేవ్ ప్రయత్నం విజయవంతం అయిందా? చిలుక కథ లోని మకరంద్ అవంతిలపై లాల్మియా మాయ ఎంతవరకు పనిచేసింది? తరువాయి భాగంలో…..!)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here