మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-18

4
4

[box type=’note’ fontsize=’16’] కొవ్వలి, భయంకర్ పేరుతో రచించిన జగజ్జాణ ఆ కాలం పాఠకులను సమ్మోహితులను చేసింది. ఆనాటి జగజ్జాణను ఈనాటి పాఠకుల కోసం సరళంగా, సంక్షిప్తంగా అందిస్తున్నారు డా. సి.హెచ్. సుశీల. [/box]

[dropcap]హే[/dropcap]మాంగి, మైనాకులను నయానో భయానో జయించి, దేవ మందారం తీసుకొని వెళ్లాలని చతురిక, వారు ఉన్న శివాలయం బయట, చుట్టూ సర్పాకారంలో తిరగసాగింది. వారెవ్వరూ బయటికి రాలేదు. ఒక రోజు మైనాకుడు ఏదో పని మీద బయటికి వచ్చినప్పుడు నిజరూపంతో అడ్డు పడింది. దేవ మందారం ఇవ్వమని అడిగింది. లేదా, హేమాంగి మతిమరుపుని పోగొట్టే దేవమందార రహస్యాన్ని చెప్పినందుకు ప్రతిగా తన కోరికను తీర్చమని అడిగింది. వేధించింది. బెదిరించింది. ఒప్పుకోకపోవడంతో ఆగ్రహావేశాలతో “ఏ హేమాంగి కోసం నన్ను తిరస్కరిస్తున్నావో ఆమెకు నీవు దక్కకుండా పోగాక! నపుంసకుడవై పో” అని శాపమిచ్చి సర్ప రూపం దాల్చి చరచరా వెళ్ళిపోయింది. ఆందోళనతో విభ్రాంతి చెందిన మైనాకుడు లోనికి వెళ్లి, చెప్పలేక చెప్పలేక విషయాన్ని అంతా చెప్పాడు హేమాంగితో. మొదట దిమ్మెర పోయిన హేమాంగి, వెంటనే తేరుకొని అతనికి ధైర్యం చెప్పింది. ఎంతో ఆత్మవిశ్వాసంతో, సంయమనంతో ఓదార్చింది.

నాగలోకం తిరిగివచ్చిన చతురికని చూసి ఆతృతగా వివరాలు అడిగింది రాణి మంజూషాదేవి. దేవ మందారాన్ని ధరించిన హేమాంగి దుందుభి దంతనాధులనే రాక్షసుల సంరక్షణ ఉండటంతో, తన శక్తి చాలక తిరిగి వచ్చేసాను – అని చెప్పింది చతురిక. మైనాకుడు ఎందుకో విచిత్రంగా ప్రవర్తిస్తూ, దేవమందారం లేకుండా పురుష సమాగమం జరిగితే తాను చనిపోతానని తెలిసికూడా కామావేశం ప్రదర్శించాడని, అందుకే కోపంతో అతన్ని ఖైదు చేయించానని చెప్పింది రాణి.

మైనాకుడి వేషంలో ఉన్న తన అన్నగారు ఖైదులో ఉన్నాడని తెలిసి, కంగారుగా చెరసాల వద్దకు వెళ్ళింది. జరిగిన పరిణామాలు ఇద్దరూ చెప్పుకొని ఏమి చేయాలో మంత్రాంగం జరిపారు. దాని ప్రకారం మైనాకుని రూపం వదిలి తన అసలు రూపంతో సోదరితోపాటు బయటికి నడిచాడు ఫాలాక్షుడు. కాపలాదారులు ‘మీ అన్న ఎక్కడ నుంచి వచ్చాడు’ అని ఆశ్చర్యంతో అడిగితే, ‘నాతోనే వచ్చారుగా! మీరు గమనించ లేదా!” అని దబాయించి ఫాలాక్షునితో బయటకి వెళ్ళిపోయింది. తర్వాత కాపలాదారులు ఖైదులో ఎవరూ లేకపోవడం చూసి, రాణి దండనకు పాత్రులవుతాం అని భయపడి ‘మనకు ఏం తెలియదు అని చెబుదాం’ అని నిర్ణయించుకున్నారు.

***

ఆ రాత్రి మహారాజు వచ్చి సారంగితో చెప్పారు మరొక ఎనిమిది రోజులలో కథ పూర్తి చేయాలి అని.

సరేనంటూ కథను కొనసాగించింది సారంగి.

వాయసం హెచ్చరించడంతో కళామందిరం వదిలి మకరంద్, మనోరమ, తారానాధ్ తమ ఇంటికి పెడుతుండగా బాణంభట్టు ఎదురుపడి, మాధురీబేగం అవంతితో సింహళం బయలుదేరిందని, త్వరలో బయలుదేరబోతున్న ఓడలో మిమ్మల్నందర్నీ రమ్మని చెప్పింది అని చెప్పాడు. అవంతి జాడ తెలిసినందుకు సంతోషిస్తూ వారు ప్రయాణమయ్యారు.

ఓడలో ఉన్న మాధురీబేగం అవంతి వద్దకు వాయస రూపంలో ఉన్న వక్ర నాథుడు వచ్చి ‘సముద్రంలో పడిన లాల్మియా చచ్చిపోలేదని, నీటి మీద తేలుతూ వస్తున్నాడని చెప్పాడు. ‘వాయుస్తంభన విద్యతో సముద్రంలో మునగకుండా తేలి వస్తున్నాడన్న మాట’ అంది. వక్ర నాథుడు తన కథనంతా చెప్పి చిత్రలేఖ మృతదేహాన్ని రసాయనాలు ఉన్న పేటికలో దాచి ఉంచానని, లాల్మియా కంఠరక్తంతో ఆమె పునర్జీవితురాలౌతుందని, అందుకే వాడెక్కడికి వెళ్ళినా అనుసరిస్తున్నానని చెప్పాడు.

“మీ ఓడ నారికేళ ద్వీపం సమీపానికి వచ్చింది. నేను ఇక్కడ దిగి పోతాను. మీరు కనుక ఈ ద్వీపం దాటిపోయారంటే ఇంక పరవాలేదు. వెనుక నుంచి వస్తున్న లాల్‌ని నేను నా అనుచరులు అక్కడ ఎదుర్కొంటాం” అని చెప్పి వెళ్ళిపోయాడు. ఒకసారి రోహిణి బేగం గోరీ దగ్గర, మరొకసారి కళామందిరంలో సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపింది జయంత్ రూపంలో ఉన్న అవంతి.

పగడాల దీవికి సింహళ ద్వీపానికి కొంచెం ఇంచుమించుగా మధ్య మార్గంలో ఉన్న నారికేళ దీపం సార్థక నామధేయం. కొన్ని యోజనాల వైశాల్యం కలిగిన ప్రాంతం, కొబ్బరిచెట్లు ఎక్కడ చూసినా విపరీతంగా పెరిగి ఉండి, గుత్తులు గుత్తులుగా కాయలు వేలాడుతూ ఉంటాయి. చుట్టూ దట్టమైన కీకారణ్యం. నిశ్శబ్దంగా గంభీరంగా ఉండే వాతావరణం. సింహళం నుండి వచ్చే ఓడలకు, అలకాపురం పోయే ఓడలకు ఇది ముఖ్య రేవు పట్టణంగా ప్రసిద్ధి పొందింది. అయితే దట్టమైన అరణ్యం, రాక్షస నివాసమైనది కావడం వల్ల వ్యాపార ప్రాముఖ్యం లేకుండా పోయింది. ఎక్కడో రాక్షసులు నివసించే ఇళ్లు, సొరంగ మార్గాలు, గుహలు, రహస్య మార్గాలు ఉన్నాయని చెప్తారు.

చెట్లతోపులో నుంచి, గుబుర్ల సందుల్లోంచి దారి చేసుకుంటూ ఒక స్త్రీ నడుస్తూ వస్తున్నది. దుస్తులను బట్టి, ఆకారాన్ని బట్టి ఆమె రాక్షస జాతికి చెందినదై ఉండవచ్చునని తెలుస్తున్నది. ఆమె సముద్రతీరం చేరుకొని జాగ్రత్తగా పరిశీలించ సాగింది. సముద్రం అలల మీద ఆసీనుడై, తేలి వస్తున్న లాల్‌ని ఆశ్చర్యంగా చూసింది. చేయి ఊపి పిలిచింది. అతను ఒడ్డుకు చేరి ఆమెను సమీపించాడు. ఆమె ఎవరో వివరం తెలియక అడిగాడు. “కాకాసుర రూపంతో నీపై కత్తి కట్టి నిన్ను నాశనం చేసుకోవాలని కంకణం కట్టుకున్న వక్ర నాథుని పెద్ద భార్యను. రెండో భార్య చిత్రలేఖ మీద అతనికి ప్రేమ ఎక్కువ. నీ వల్ల ఆమె చనిపోయింది కదా! అందుకే కక్ష పెంచుకొని, నిన్ను అంతమొందించాలని అతడు నిన్ను అనుసరిస్తున్నాడు. తన అనుచరులతో ‘సముద్రం మీద తేలి ఈ మార్గాన లాల్ వస్తున్నాడు’ అని నీ గురించి చెప్పటం విన్నాను” అని, అతని కోసం పన్ని ఉంచిన వలను చూపించింది. ‘నాకెందుకు సహాయం చేస్తున్నావ్’ అన్నాడు లాల్. “నేను సుఖ పడాలి అంటే నా సవతి బ్రతకకూడదు. మృత కళేబరం ఎక్కడ భద్రపరచబడి ఉందో నాకు తెలుసు. నువ్వు ఆ కళేబరాన్ని కనుక నాశనం చేయగలిగావంటే వక్ర నాథుడు ఇక చిత్రలేఖ బ్రతికే ఆశ వదులుకొంటాడు. నీ ప్రాణానికి రక్షణ ఉంటుంది. నా ప్రాణానికి సుఖం ఉంటుంది” అని చెప్పింది.

ఆమె అతనిని ఆ అడవి లోపలకి తీసుకుని వెళ్లి, ఒక అందమైన పుష్పవనంలో, ఒక గుహలో దాచిన ధవళవర్ణంతో ధగధగా మెరుస్తున్న శిలను చూపింది. దానిని తొలగించి, లోపలికి ప్రవేశించమని చెప్పి వెళ్ళిపోయింది. అక్కడ కాపలాగా ఉన్న బలిష్టుడైన రాక్షసుల మీద మంత్ర పూరితమైన విభూతిని చల్లి, వారు అపస్మారకం లోకి వెళ్ళగానే, ఆ బిలం లోపలకు వెళ్ళసాగాడు లాల్మియా.

చిరకాలానికి స్వదేశం వచ్చిన రాణి మాధురీబేగంకి సింహళ ప్రజలు అఖండ స్వాగతం ఇచ్చారు. ఆమె వెంటఉన్న జయంతుని చూసి ఆమె ప్రేమించి ఉంటుంది అనుకున్నారు. కానీ ప్రశ్నించే ధైర్యం చేయలేకపోయారు ప్రజలు, పరివారం. మాధురీబేగం అమాత్యుడు అమర్‌కి మాత్రం జయంతుని చూడగానే ఎంతగానో ద్వేషం కలిగింది. అమూల్య వస్త్రాభరణాలు ధరింపజేసి, మాధురీబేగం జయంతుని సభలో ప్రవేశపెట్టి, వివాహం చేసుకోబోతున్నట్లు సభలో అందరి ఎదుట ప్రకటించింది కూడా. మౌనంగా, గంభీరంగా ఉన్న జయంతి రూపంలో ఉన్న అవంతికి ఈ ‘విచిత్ర వివాహం’ అంటే అంతులేని ఆందోళన కలిగింది. ఈ ఆపద ఎలా గట్టెక్కాలో తెలియక మకరందాదుల రాక కోసం ఆతృతగా ఎదురు చూడసాగింది.

(పురుష రూపంలో ఉన్న జయంతికి రాణీబేగంకి ఈ విచిత్ర వివాహం జరుగుతుందా? లాల్మియా చిత్రరేఖ మృత కళేబరాన్ని నాశనం చేశాడా?… తరువాయి భాగంలో..)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here