మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-19

4
2

[box type=’note’ fontsize=’16’] కొవ్వలి, భయంకర్ పేరుతో రచించిన జగజ్జాణ ఆ కాలం పాఠకులను సమ్మోహితులను చేసింది. ఆనాటి జగజ్జాణను ఈనాటి పాఠకుల కోసం సరళంగా, సంక్షిప్తంగా అందిస్తున్నారు డా. సి.హెచ్. సుశీల. [/box]

[dropcap]స[/dropcap]ముద్రపుటొడ్డున వక్రనాధుడు తన అనుచరులతో వలపన్ని ఎంత సేపు వేచి ఉన్నా ఎవరూ చిక్కు కోలేదు. మదనమంజరి కూడా అక్కడే ఉండి పరిశీలించ సాగింది. కాసేపటికి వలలో ఎవరో చిక్కినట్లు తెలిసి అనుచరులు లాగబోతే చాలా బరువుగా ఉంది. ‘లాల్ ఇంత బరువు ఉన్నాడు ఏమిటి’ అని ఆశ్చర్యపోతూ ఎంతో కష్టం మీద ఆ వలని పైకి లాగారు. వలలో ఒక్కడు కాదు ముగ్గురు ఉన్నారు. మకరంద్, మనోరమ, తారానాథ్‌లు.

వారిని చూసి వక్రనాధుడు ఆశ్చర్యపోయాడు. వాళ్లు అతనిని గుర్తించలేదు. వాయస రూపంలో వచ్చిన వక్రనాధుడిని తానేనని చెప్పాడతడు. తన ఆతిథ్యం తీసుకోవాల్సిందిగా ఆహ్వానించాడు. చేసేదేమీ లేక అతని వెంట వెళ్లారు. వారికి మర్యాదలు చేయటం మదనమంజరికి అంతగా ఇష్టం లేదు.

బిలం ద్వారా లోపలికి ప్రవేశించిన లాల్‌కి చిత్రరేఖ మృత కళేబరం ఉన్న పెద్ద స్పటిక శిలాపేటిక కనిపించింది. మృత కళేబరంలా కాకుండా సజీవమైన స్త్రీమూర్తి లాగా కళకళలాడుతోంది. ఆ పేటికను తెరవటానికి చుట్టూ తిరుగుతూ, అన్ని విధాల ప్రయత్నించాడు. చివరకి మాతృమూర్తిని తలుచుకొని, “శిలా భేది” అనే మహా మంత్రాన్ని పఠించగా పేటిక బీగాలు వాటంతట అవే విడిపోయాయి. వెంటనే తన దగ్గర ఉన్న కరవాలంతో తన కంఠం దగ్గర చిన్న గాయం చేసికొని, వెలువడిన రక్తంతో కొన్ని చుక్కలు మృత కళేబరం ముఖాన తిలకంలా పెట్టాడు. వెంటనే చిత్రరేఖ లేచి నిలుచుంది. ఎదురుగా ఉన్న భీకరాకారం చూసి భయకంపితురాలైంది.

“నేను నీకు కొత్తవాడిని కాదు. ఒకప్పుడు నీవు వేటాడుతుండగా కలుసుకున్నాం. నీ భర్త నా పైన కత్తి విసిరినప్పుడు నేను తప్పించుకున్నాను, అది నీకు తగిలి నువ్వు మరణించావు. ఆ నా కోరిక తీర్చుకోవడానికే నిన్ను ఇప్పుడు బ్రతికించాను” అన్నాడు లాల్మియా.

భయంతో చిత్రరేఖ బిలమార్గం గుండా బయటికి పరిగెత్తింది. ఆమెను వెన్నంటి లాల్ కూడా బయటకు వచ్చాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మదనమంజరి వారిని చూసి ఆశ్చర్యపోయింది. “నీవు ఈమెని చంపలేదా” అంది.

“ఈ సౌందర్యరాశిని నా కంఠ రక్తంతో నేనే బ్రతికించాను” అన్నాడు లాల్ తమకంతో.

“నా సవతిని మళ్లీ బ్రతికించావా! నాకు ఈ పీడా వదలదా! నువ్వు ఇంత తుంటరివి అని తెలిస్తే ఈ రహస్యాన్ని నీకు చెప్పేదాన్ని కాదు” అన్నది గట్టిగా ఏడుస్తూ.

మకరందాదులను వెంటబెట్టుకొని వస్తున్న వక్రనాథుడా ఏడుపు ఆలకించి, తన అనుచరులతో అక్కడికి వచ్చాడు. అతన్ని చూసి చిత్రరేఖ పరుగున వచ్చి కౌగలించుకున్నది.

వారందరినీ చూసి లాల్ ఒక్క ఉరుకున పారిపోయాడు. వెంటనే వక్రనాథుడు వాయస రూపంతో అతని వెంట పడగా, అనుచర రాక్షసులందరూ అదే రూపంతో అతడిని వెంటబడి తరమసాగారు.

మకరందాదులకు ఆతిథ్యం ఇవ్వడానికి మదన మంజరి నిరాకరించడంతో, చిత్రరేఖ తన ఇంటికి పిలుచుకొని పోయి సకల మర్యాదలతో ఆతిథ్యమిచ్చింది. రూపసౌందర్యాలతోపాటు ఆమె సంస్కారమునకు, మంచి మనసుకు ఆనందించారు వారందరూ.

వందలు, వేల కాకుల గుంపు ఆకాశంలో తన వెంట పడగా, లాల్మియా సత్తువ తగ్గి, అంతలో అడ్డు వచ్చిన ఒక మబ్బుతునక వెనకకు తప్పుకొని, తానూ ఒక కాకి రూపంలో ఆ గుంపులో కలిసిపోయాడు. లాల్మీయా కనపడకపోవడంతో వక్రనాథుడు తన అనుచరులతో తిరిగి వచ్చేసాడు. కానీ ఊహించని విధంగా చిత్రరేఖ హత్యగావింపబడి, రక్తపుమడుగులో పడి ఉండటం గాంచి పెద్ద పెట్టున రోదించసాగాడు. ఆమెను ఎవరు హత్య చేశారో అర్థం కాలేదు ఎవరికి!

మాధురి బేగం వెంట సింహళ ద్వీపానికి వచ్చిన జయంతుడు అంటే అమీర్ ఖాన్‌కి ఎందుకో ద్వేషం కలగసాగింది. ఎలాగైనా అతడిని మట్టుపెట్టాలని ఆలోచనతో వేటకి వెళదామని మాధురి బేగంతో చెప్పాడు. జయంతుని పరాక్రమం మిగిలిన వారికి తెలియాలనే ఆశతో ఒప్పుకొంది ఆమె. కానీ ‘జయంతుడు ఎప్పుడు అలసిపోతే అప్పుడు వెనుకకు వచ్చేయా’లని అమీర్‌కి మరీ మరీ చెప్పింది.

సూర్యాస్తమయానికి వెను తిరిగి వచ్చాడు అమీర్. జయంతుడు ఏడని ప్రశ్నించింది మాధురి బేగం.

“పొద్దు పడమట వాలగానే తలనొప్పిగా ఉందని వారు బయలుదేరి వచ్చేసారు దేవీ. ఈ పాటికి ఇల్లు చేరి ఉంటారు అని మేము అనుకున్నాం. తమతో అనుచరులు రానవసరం లేదని వారు నిరాకరించడంతో మేము వెంట రాలేకపోయాం” అన్నాడు.

“కాగడాలు సిద్ధం చేసుకొని తక్షణం మీరందరూ నాతో బయలుదేరండి” అని ఆజ్ఞాపించి మాధురీ బేగం అడవిదారి పట్టింది. ఎటు వైపు వెళ్లారు అని వారిని ప్రశ్నిస్తూ ముందుకు సాగింది, అమీర్ వారిస్తున్నా వినకుండా.

ఏదైనా మృగం బారిన పడ్డాడా జయంతుడు అని ఆరాటపడ సాగింది. ఆమె అనుమానించినట్లే రక్తపు గాయాలతో పడి ఉన్నాడు ఒకచోట జయంతుడు. దివిటీల వెలుగులో అనుచరుల సహాయంతో అతనిని లేవదీసి మందిరానికి తీసుకొని వచ్చింది. రక్తంతో తడిచిన దుస్తులను మార్చుతూ ఉండగా ఆమె తెల్లబోయింది. జయంతుడు పురుష రూపంలో ఉన్న స్త్రీ అని తెలిసి నిర్ఘాంత పోయింది.

తెల్లవారటంతో కథను ఆపు చేసింది సారంగి.

తనకు ప్రాణప్రదమైన దేవమందారాన్ని అపహరించుటమే కాక, లేని ప్రేమ నటిస్తున్న వాడిలాగా తన ప్రాణానికి సైతం హాని తెచ్చిపెట్టే విధంగా ప్రవర్తించిన (మాయ) మైనాకుని గురించి ఆలోచిస్తున్న నాగరాణి వద్దకు చతురిక తన అన్నను తీసుకొని వచ్చింది. ‘ఎవరు’ అని అడిగింది మంజూషా దేవి. దేశాంతరం వెళ్ళిన తన అన్న ఫాలాక్షుడని, అనేక విద్యలు నేర్చుకొని వచ్చాడని, అతని సహాయంతో దేవమందారాన్ని తిరిగి సంపాదించవచ్చు అని చెప్పింది చతురిక.

వారిరువురిని తీసుకొని చెరసాల వద్దకు వచ్చింది నాగరాణి. అక్కడ (మాయ) మైనాకుడు లేకపోవడంతో ఏమైయ్యాడని గద్దించింది. తమకు తెలియదని, ఎలా మాయం అయ్యాడో! అన్నారు వారు.

“ముందు దేవమందారంతో హేమాంగిని తప్పించాడు. ఇప్పుడు తను తప్పించుకున్నాడు. ఇక లాభం లేదు. నేనే స్వయంగా వెళ్లి, వారిని శిక్షించి, దేవమందారాన్ని సంపాదించుకుని వస్తాను” అన్నది నాగరాణి. ఆమె రక్షణార్థం అన్నట్టు తనూ బయలుదేరాడు ఫాలాక్షుడు.

ఒకేరోజున నగరంలో ఎనిమిది మంది కన్యలు అపహరించ బడడంతో రాజ్యంలో పెద్ద గగ్గోలు బయలుదేరింది. ప్రజలందరూ గుంపులుగా వచ్చి మహాబల చక్రవర్తికి విన్నవించుకున్నారు. ఎవరై ఉంటారు, ఏమై ఉంటుంది అనుకొన్నాడు మహారాజు. “నూరుగురు కన్యలను సంహరించిన మీకు రాజ్యంలో చాలా మంది శత్రువులు ఉండవచ్చు” అన్నారు మంత్రులు. నగరం నలుమూలల గాలించమని సైనికులను ఆజ్ఞాపించి, తాను మారువేషంలో బయలుదేరాడు మహారాజు.

అడవిలో కొంత దూరంగా ఒక భల్లూకము ఒక బాలికను నోటకరచుకొని వెళ్ళటం గమనించి దానిని అనుసరించాడు మహారాజు. అది ఒక చెట్టుతొర్రలోకి వెళ్లి, బాలికను దించి మరలా బయటకు వచ్చి, ఎటో వెళ్ళినది. అది వెళ్ళిన తర్వాత మహారాజు తొర్ర లోపలికి వెళ్ళాడు.

సమ వయస్కులైన ఎనిమిది మంది బాలికలు బంధించబడి ఉన్నారు. “మమ్మల్ని ఒక ఎలుగుబంటి ఎత్తుకొని వచ్చింది. మా అమ్మ నాన్న దగ్గరికి చేర్చండి” అంటూ రోదించసాగారు వారు. బంధనాలు విప్పి వారిని బయటకు తీసుకుని వచ్చాడు మహారాజు.

అంతలో ఒక భల్లూకాన్ని వెంబడిస్తూ సైనికులు రావడం గమనించాడు. నిజరూపమును బహిర్పరుస్తూ, “కొందరు ఆ ఎలుగుబంటిని వెంబడించండి. కొందరు మీ అశ్వాలపై ఈ బాలికలను తీసుకొని నగరమునకు చేర్చి, వారి తల్లిదండ్రులకు అప్పగించండి” అని ఆజ్ఞాపించాడు.

(చిత్రరేఖను హత్యచేసింది ఎవరు? నాగరాణి, హేమాంగి, మైనాకుల కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది? దేవమందారం ఎవరికి సొంతమవుతుంది? తరువాయి భాగంలో….!)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here