మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-2

4
2

[box type=’note’ fontsize=’16’] కొవ్వలి, భయంకర్ పేరుతో రచించిన జగజ్జాణ ఆ కాలం పాఠకులను సమ్మోహితులను చేసింది. ఆనాటి జగజ్జాణను ఈనాటి పాఠకుల కోసం సరళంగా, సంక్షిప్తంగా అందిస్తున్నారు డా. సి.హెచ్. సుశీల. [/box]

వెయ్యికి పైగా నవలల కొవ్వలి:

[/dropcap]వె[/dropcap]య్యి నవలలు రాసి ప్రపంచంలోనే రికార్డు సృష్టించినది భారత దేశంలోని మన తెలుగు రచయిత అయిన శ్రీ లక్ష్మీ నరసింహారావు గారు. సాహిత్యం అనేది కేవలం పండితుల మేధస్సులకు అవగాహన కలిగించేదిగా ఉండే ఆ రోజుల్లో రాయటం, చదవటం వచ్చిన సామాన్య జనం కూడా హాయిగా చదువుకునే వ్యావహారిక భాషలో రాయటమే ఆయన్ని సామాన్య పాఠకులకు దగ్గర చేసింది.

పైగా, తన నవలలు సామాన్యులు కొనుక్కోవటానికి ఆర్థిక భారం పడకూడదని తక్కువ ధర ఉంచమని పబ్లిషర్స్‌ని కోరారు. ‘అలాగైతే మీ రెమ్యూనరేషన్ తగ్గుతుంది’ అంటే సరేనన్న సహృదయులు ఆయన.

భాషా చైతన్యంతో పాటు ఇతివృత్తం, పాత్రచిత్రణలో నవ్యత, భావ చైతన్యం – అంటే నాటి సాంఘిక దురాచారాలు, స్త్రీల సమస్యలు అన్నీ వీరు తన రచనల్లో నిర్మొహమాటంగా ఖండించడం జరిగింది. ఆయనలోని ఆ అభ్యుదయ భావాలు, చైతన్యానికి, పాఠకుల్లో ఆయన పట్ల ఉన్న అభిమానానికి అరుణాచలంలో ఉన్న ప్రఖ్యాత రచయిత చలం గారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

కొవ్వలి రచనల్లో సంస్కృత పదాడంబరత, పాండిత్య ప్రకర్ష ప్రభావం లేనట్లే – అశ్లీలత అసభ్యత కూడా ఉండవు. అవి లేవు కనుకనే ఆనాడు జనబాహుళ్యంలో – ముఖ్యంగా మధ్యతరగతి స్త్రీలలో పఠనాసక్తి పెరిగింది. ఆ నవలలోని విశేషాలను అభిమానులు కథలు కథలుగా (నిజాలు) చెప్పుకొనేవారు. పుస్తకాల షాపుల్లో పుంఖానుపుంఖాలుగా ఎప్పటికప్పుడు కొవ్వలి గారి నవలలు సరికొత్తవి ప్రత్యక్ష మవుతూ ఉండేవి. కొన్ని రోజులు కొత్త నవల రాకపోతే ఆయన అభిమాన పాఠకులు ఆత్రంగా ఎదురు చూసేవారు. తన దైనందిన జీవితంలో జరిగే ప్రేమ, భగ్నప్రేమ, విషాదాలు, కన్నీటి గాథలు, పన్నీటి జల్లులు అన్నీ ఆ నవలల్లో ఉండేవి కనుక పాఠకులను అంతగా ఆకట్టుకునేవి. కథ ఎంత చిన్నదైనా దాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దే నేర్పు, చదివించే సరళ శైలి ఆయన ప్రత్యేకత కాబట్టి కేవలం ఉబుసుపోకకో, ధనార్జన కొరకో రాసిన నవలలు కావవి. ఈనాడు చాలా మందికి ఆయన తెలియకపోవచ్చు కానీ ఆరేడు దశాబ్దాల క్రితం ఆ నవలలు సాధించిన విజయం మాత్రం తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచిపోతుంది.

1972లో ఆయనకు షష్ట్యబ్ది పూర్తి సందర్భంగా నాటి భారత రాష్ట్రపతి నుండి, తమిళనాడు గవర్నర్ నుండి, శ్రీ జగద్గురు మహా సంస్థానం ‘శారదా పీఠం’ (శృంగేరి మైసూరు స్టేట్) నుండి, చీఫ్ జస్టిస్ మద్రాసు నుండి, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, ఉస్మానియా యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తెలుగు శాఖా అధ్యక్షులతో పాటు చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి, ప్రఖ్యాత నిర్మాత చక్రపాణి, కవి దాశరథి, సాహిత్య అకాడమీ (సదరన్ రీజనల్ ఆఫీస్) మద్రాస్ నుండి, పిలకా గణపతి శాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావు వంటి ప్రముఖుల నుండి ప్రశంసాపత్రాలు, అభినందన లేఖలు పంపారు సావనీర్ ప్రచురణార్థం.

ఆధునికాంధ్ర సాహిత్యంలో ఒక అధునాతన భావ, భాషా విప్లవాన్ని సాధించిన మహా రచయిత కొవ్వలి లక్ష్మీ నరసింహారావు 1 జులై 1912 లో తణుకులో కొవ్వలి లక్ష్మీ నారాయణ, కాంతమ్మ గార్లకు కనిష్ట పుత్రుడుగా జన్మించారు. వృత్తిరీత్యా తండ్రి రాజమండ్రిలో ఉండటం వల్ల ఆయన బాల్యమంతా రాజమండ్రి లోనే గడిచింది. చిన్నతనంలోనే తల్లి గతించడంతో తండ్రే పిల్లల ఆలనా పాలనా చూసుకోవలసి వచ్చింది. భోజనార్థం పిల్లలతో పూటకూళ్ళ ఇంటికి భోజనానికి (మూడణాలు – 19 పైసలు) వెళ్లేవారు కానీ ఆయన మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ప్లీడర్ గుమస్తాగా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ గారు బాగా సంపాదించుకునే అవకాశం ఉన్నా, నిజాయితీగా వచ్చిన దానితో తృప్తి పడి పిల్లలను పెంచుకున్నారు. 16 సంవత్సరాలకు కొవ్వలి వారు స్కూల్ ఫైనల్ పరీక్ష రాశారు. వేసవి సెలవులకు అక్కగారి ఇంటికి వెళ్ళిన కొవ్వలి అక్కడున్న గ్రంథాలయంలో పుస్తకాలను విస్తృతంగా చదివేసారు.

ఒకరోజు పొరుగింటి ఆవిడ ఒక మహా కవి రాసిన ఖండ కావ్యంలోని ఒక పేజీని చించి తన బిడ్డ మలాన్ని ఎత్తి పారెయ్యడం చూసి కొవ్వలి ఆక్రోశం చెంది ఆవిడని అడిగారు ‘ఆ పుస్తకం ఏమిటో తెలుసా’ అని. ‘చదవలేదు, అయినా ఆ భాష అర్థం చేసుకునే శక్తి తనకు లేదు’ అని ఆమె అంది. ఆ క్షణం ఆయన మనసు విలవిలలాడింది. ఏదో ఆవేదన, ఆలోచన , ఏదైనా చెయ్యాలన్న ఆకాంక్షతో, అంతర్ముఖుడై, ఒక రకంగా అన్వేషణతో మూడేళ్లపాటు ఊరూరు తిరిగారు. కనిపించిన ప్రతి పుస్తకాన్ని, ప్రతి మనిషిని, ప్రతి సంఘటనని అర్థం చేసుకుంటూ చదివారు. జీర్ణం చేసుకున్నారు.

తిరిగి తిరిగి ఇల్లు చేరారు. తండ్రి ఎంతో చెప్పారు ఏదైనా ఉద్యోగం చూసుకొమ్మని. అలా చేసి ఉంటే తెలుగు సాహిత్యం ఒక మహోన్నత రచయితని కోల్పోయి ఉండేది. అప్పుడే నిర్ణయించుకున్నారు అందరికి అర్థమయ్యే సామాన్య సరళ భాషలో రచనలు చేయాలని, అందరూ కొనుక్కోగలిగే తక్కువ ధరలో పుస్తకాలు అందించాలని.

అలా వచ్చిన మొదటి నవల ‘పల్లెపడుచు’. ‘మాకొద్దీ తెల్ల దొరతనం’ అనే విప్లవ శంఖం పూరించి తెల్లదొరల ఆగ్రహానికి గురై కారాగార శిక్ష అనుభవించిన దేశభక్తుడు శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారికి ఆ నవల చూపించారు. ఆయన అభినందించి, ఆశీర్వదించి, పీఠిక కూడా రాశారు. ఆ నవల అంతగా ప్రజాదరణ పొందలేదు. తర్వాత ‘దాసీపిల్ల’ నవల రాసి శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారికి పంపారు. ఆయన అభినందిస్తూ రాసిన లేఖతో పాటు ‘దాసీపిల్ల’ నవలను ప్రచురించారు కొవ్వలి. తర్వాత మూడో నవల ‘తానాజీ’ ప్రచురించాక నిరంతర రచనా వ్యాసంగం చేసే ఉత్సాహం ఆత్మస్థైర్యం వచ్చింది.

ఆ రోజుల్లో రాజమండ్రిలో పెద్ద ప్రచురణకర్తలు శ్రీ కొండపల్లి వీరవెంకట అండ్ సన్స్ కంపెనీ ద్వారా ప్రచురింపబడితే తన రచనకు బహుళ ప్రచారం వస్తుందని కొవ్వలి ఆయనకు నవల ఇచ్చారు. ఒక పెద్ద పండితుడు (?) అభిప్రాయం మేరకు, వీర వెంకయ్య గారు కొవ్వలి నవల వేయటానికి ఉత్సాహం చూపలేదు. మనం గతంలో చెప్పుకొన్న పోస్ట్‌మన్ సంఘటన ఇప్పుడే జరిగింది. పండిత అభిప్రాయం ఎలా ఉన్నా – ఒక సాధారణ పాఠకుని అభిప్రాయానికి విలువ ఇచ్చిన వెంకయ్య గారు ఆ ‘ఫ్లవర్ గర్ల్’ అనే నవలను ప్రచురించారు. ఇక ఆర్డర్ల మీద ఆర్డర్లు. ముద్రించిన కాపీలన్నీ అమ్ముడుపోయాయి. కొవ్వలి వారి ప్రతిభ గుర్తించిన ఆ వ్యాపారవేత్త అయిన వెంకయ్య గారు ఒక డజను నవలలు వ్రాయమని పారితోషికం నిర్ణయించి, ఇతర ప్రచురణకర్తలకు ఇవ్వకూడదని ఆంక్ష కూడ పెట్టారు. అలా ఒక సంవత్సరం దాదాపు 100 నవలలు రాశారు కొవ్వలి. సాంఘిక దురాచారాలు, మధ్య తరగతి జీవితాల వెనుకబాటుతనం ఉన్న ఆనాటి సమాజానికి నవచైతన్యం ఉత్సాహం కలిగించే ఔషధాలులా ఉండేవి ఆ నవలలు. బాల్య వివాహాల వల్ల స్త్రీ జీవితంలోని విషాదాలు, వితంతు వివాహాల ప్రోత్సాహం, కుల మత వర్ణాంతర విభేదాల ఖండన వంటి విషయాలన్నీ నిర్మొహమాటంగా చర్చించారు కనుకనే అవి పాఠకుల హృదయాన్ని ఆకట్టుకున్నాయి. ఇతర ప్రచురణకర్తలు ఎక్కువ పారితోషికం ఇస్తామని ఆశ చూపినా, మాట ఇచ్చినందుకు వీర వెంకయ్య గారికి దాదాపు రెండేళ్ల లో రెండు వందల పుస్తకాలు వ్రాసి ఇచ్చారు. ఆంధ్రదేశమంతటా కొవ్వలిగారి పేరు మారు మోగిపోయింది.

వివిధ ప్రదేశాల్లో వివిధ సంస్థల ద్వారా తక్కువ ధరలో నవలలు ప్రజలకు అందిస్తే మరింత మంది చదివే అవకాశం కలుగుతుందని భావించారు. ఆ ఉద్దేశంతో రౌతు బుక్ డిపో, వెంకటేశ్వర పబ్లిషింగ్ హౌస్, పాండురంగ బుక్ డిపో, ఎస్. ఏ.స్వామి అండ్ కంపెనీ, సరస్వతి బుక్ డిపో మొదలైన సంస్థల ద్వారా ప్రచురించబడ్డ కొవ్వలి నవలలు ఆంధ్ర దేశమంతటా విస్తృతంగా వీరవిహారం చేశాయి.

అదే సమయంలో కొవ్వలి మీద పాఠకాభిమానం వెల్లువై పొంగటం చూసి కొందరు అసూయాపరులు విష ప్రచారం ప్రారంభించారు. పత్రికల్లో విమర్శల పరంపరలు కొనసాగాయి. ‘భాషని పాఠకలోకాన్ని అధోగతికి ఈడ్చే నవలలు’ అన్న ప్రచారం ప్రారంభించారు. ‘కొవ్వలి నవలలు చదివితే పాడై పోతారు’ అని దుష్ప్రచారం చేశారు. ఒక మంచి ధ్యేయంతో రచిస్తున్న తన మీద వస్తున్న అపవాదుకి ఆయన హృదయం ఆక్రోషించింది. రైల్వే స్టేషన్స్ లోని హిగ్గిన్ బాదమ్స్ లోనే కాక, తోపుడుబళ్ళ మీద, చేతి సంచులుతో కూడా కొందరు పట్టుకొని (టీ కాఫీల కంటే కూడా ఎక్కువగా) అమ్మేవారు. విపరీతంగా నవలలు అమ్ముడుపోవడం, ప్రయాణికుల చేతుల్లో కొవ్వలి నవలలు ఉండటంతో ‘రైల్వే సాహిత్యం’ అని ఈర్ష్యతో కొందరు వ్యాఖ్యానించడం చూసి మౌనంగా బాధపడ్డారు. ఎంతో మంది ఆసక్తిగా చదివే అపరాధ పరిశోధక సాహిత్యాన్ని ‘శవసాహిత్యం’గా వర్ణించి అక్కసు తీర్చుకున్నారు కొందరు తోటి రచయితలు.

కానీ తనకంటూ కొంత మంది ప్రత్యేక అభిమానులున్నారు. నవల రెండు మూడు రోజులు కాస్త ఆలస్యమైతే ఏదో కోల్పోయినట్లు నిరాశ పడేవాళ్ళు ఉన్నారు అని తెలుసు ఆయనకి. వారు అభిమానంతో రాసే ఉత్తరాలను ఓపిగ్గా చదివి జవాబులు ఇచ్చేవారు ఆయన. కనుకనే ఆయనకు భూషణ దూషణలు సమానంగా లభించాయి. వాటికి పొంగిపోనూ లేదు,కుంగిపోనూ లేదు.

1940, 42 ప్రాంతాల్లో నందిగామలో ఒక ఖద్దరు షాపు అతను (తెలివైన వ్యాపారి) తన వస్త్రాల కంటే కొవ్వలి నవలలు అమ్మకమే ఎక్కువ చేసేవాడు. “అణా” డిపాజిట్ కడితే ఒక్కో నవల “కానీ” కి అద్దెకి ఇచ్చేవాడు. కొన్ని వందల మంది ఆ స్కీమ్‌లో చేరి విరివిగా నవలలు చదివే వారు. వేలాదిమంది – అందులోనూ ఐదో క్లాస్ వరకు చదువుకొని కాపురానికి వచ్చిన స్త్రీలు ఆ నవలలలో తమ జీవితాలను, అభిప్రాయాలను దర్శించుకునేవారు. ఉపన్యాస ధోరణిలో కాకుండా, సంభాషణ రూపంలో సాగుతూ, కళ్లకు కట్టినట్లు ఉండే ఆ కథనం ఆంధ్రదేశంలోని నగరాల్లోనే కాక పల్లెటూర్లలో కూడ బహుళ ప్రచారం పొందింది. ఆ ప్రభావంతో ఎందరో ఆయనకి శిష్యులు, పరోక్ష శిష్యులు గా మారి ఉత్సాహంగా రచనలు చేయటం ప్రారంభించారు.

రచయితగా పేరు రావాలంటే ఆయన శైలిని అనుసరించక తప్పలేదు నాటి తోటి రచయితలకు. అక్షరాస్యత కోసం, చదివించే ఆసక్తి కోసం ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఎంతవరకు విజయవంతం అయ్యాయో కానీ తన రచనల వల్ల ఆ మహాయజ్ఞం చేయగలిగారు కొవ్వలి. అయస్కాంతంలా ఆ రచనాశైలి అందర్నీ ఆకర్షించింది.

ఇంతి చామంతి పూబంతి, చదువుకున్న భార్య, నీవే నా భార్య, నీవేనా భర్తవు, గంగా యమునా సరస్వతి వంటి నవలలు పాఠకుల మనః ఫలకాలలో చెరగని ముద్ర వేశాయి. యువతీ యువకులు, నూతన వధూవరులు ఆ సున్నితమైన ప్రేమ, ఆకర్షణీయమైన సంభాషణల కోసం పదేపదే చదివేవారు. మూడు రోజులకో నవల మార్కెట్లోకి వచ్చేది. రెండో నెల లోని పునర్ముద్రణ పొందేది.

కానీ ఏనాడు సన్మానాలను, బిరుదులను ఆశించలేదు ఆయన. ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. అందంలో బెంగాలీ రచయిత ‘శరత్ బాబు’ నవలలోని ‘హీరో’లా ఉండేవారు. వ్యక్తిత్వం హుందాగా ఉండేది. ఆయన రచనల పట్ల ఆకర్షితులై, ఆయన రూపానికి మనసు పారేసుకున్న స్త్రీలు అనేకులు లేఖల ద్వారా ప్రేమని వ్యక్తం చేసేవారు. స్త్రీల గురించి విరివిగా రాసిన కొవ్వలి గారు స్త్రీలతో పరిచయాలకి మాత్రం దూరంగానే ఉండిపోయారు. కొన్ని పుస్తకాలు కొందరికి మాత్రమే నచ్చుతాయి. కానీ కొవ్వలి నవలలు స్త్రీ పురుష వయో బేధం లేకుండా అందరూ ‘నవల మొదలుపెడితే పూర్తయ్యేదాకా’ వదిలేవారు కాదు. అత్యంత ప్రముఖ రచయితగా పేరు వచ్చింది కానీ, ఎన్ని నవలలు రాసినా ఆర్థిక లాభాలు ఏమి పెద్దగా రాలేదాయనకి. ఆ లాభాలను పొందింది పుస్తక వ్యాపారులే. ఆయన నవలల ప్రవాహ పోటీకి ఎవరు ఎదురు నిలువలేక పోయారు. ఆయనకు ఆయనే పోటీ. ఆయనకు ఆయనే సాటి. కువిమర్శకులు అక్కసు వెళ్లగక్కినట్లు ఆయన నవలల్లో అశ్లీలత ఉంటే ఇందరు అభిమాన పాఠకులు – ముఖ్యంగా స్త్రీలు చదివేవారా!!

ఒకదానితో ఒకటి పోలిక లేకుండా విభిన్నకథా వస్తువులతో సాగే ఆ సృజనాత్మకత, సమ్మోహనశక్తి, నిర్మాణాత్మకమైన ఆ రచనా శక్తి సర్వ ప్రజానీకాన్ని ఆకర్షించ గలిగింది. సామాన్య పాఠకుల్లో పఠనాభిరుచిని, పాఠక జనాన్ని పెంచగలిగిన ఈ రచయితకు తెలుగు ప్రజలు ఏమి ఇచ్చుకోవాలి!! 1000 పుస్తకాల పేర్లు మనకు తెలుసు, కానీ జాబితాకి అందకుండా ఇంకెన్ని నవలలు రాసిచ్చేసారో పబ్లిషర్స్‌కి!

మళ్లీ ముద్రించాలి అన్నా ఇప్పుడు కొన్ని పుస్తకాలు దొరకటం లేదు.

ఇదే సమయంలో అనుకోకుండా ఆయన జీవితం మరో మలుపు తిరిగింది. శ్రీ కడారు నాగభూషణం, శ్రీమతి కన్నాంబ గారు ఒక చిత్రం నిర్మించి తల పెట్టి ఆయనను కథ రాయమని ఆహ్వానించారు. కానీ సినీ జగత్తులో అడుగు పెట్టటం ఆయనకు అప్పుడు ఇష్టం లేకపోయింది.

(మరి కొవ్వలి సినిమా రచనల్లోకి వెళ్లారా? ఏ ఏ రచనలు, సినీమా కథలు రాశారు? అన్న వివరాలు వచ్చేవారం…..)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here