మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-20

7
2

[box type=’note’ fontsize=’16’] కొవ్వలి, భయంకర్ పేరుతో రచించిన జగజ్జాణ ఆ కాలం పాఠకులను సమ్మోహితులను చేసింది. ఆనాటి జగజ్జాణను ఈనాటి పాఠకుల కోసం సరళంగా, సంక్షిప్తంగా అందిస్తున్నారు డా. సి.హెచ్. సుశీల. [/box]

[dropcap]ఫా[/dropcap]లాక్షునితో నాగలోకం నుంచి బయలుదేరిన నాగరాణి మంజూషాదేవి కొన్ని దినములు ప్రయాణించి శివాలయ ప్రాంతానికి చేరింది. ఆమెకు ఏదో చెప్తూ, పలకరిస్తూ, మైనాకుని మోసం గురించి ఆమె అభిప్రాయం అడుగుతూ, అతన్ని మర్చిపోయి మరొకరిని పెళ్లి చేసుకోవచ్చు కదా అంటూ మాటలు కలిపాడు. ఎలాగైనా తన ప్రేమను వెల్లడించాలని అతని ప్రయత్నం.

“మీ చెల్లెలు చతురిక చెప్పిన శివాలయం ఇదే అనుకుంటాను. ఆలయప్రవేశం సాధ్యంకాలేదని తిరిగి వచ్చింది. మనమా విధంగా భంగపడకూడదు” అంది రాణి. “అంత శ్రమ మీకెందుకు! మీరు ఇక్కడే విశ్రాంతి తీసుకుంటూ ఉండండి. ఆ దేవమందారాన్ని, దాన్ని అపహరించిన వారిని పట్టి తీసుకువస్తాను” అని ఫాలాక్షుడు ముందుకు వెళ్ళాడు.

ఆలోచిస్తూ కూర్చున్న నాగరాణి తనకు దగ్గరగా వచ్చిన రాక్షసాకారులను చూసి భయపడింది. “నాగలోకపు వాసి లాగా ఉన్నావు ఎవరు నీవు” అన్నారు దుందుభి, దంతనాధులు.

“నన్నెరుగుదురా” అని ఆశ్చర్యపోయిన ఆమెతో “పూర్వం మీ వంశీకులలో నాగరాజు మాకు మిత్రుడు. మా గురువుగారు శివ స్వాములవారు దేవమందార విషయం చెప్పి ఆ నాగరాజు దంపతులను సంతానవంతులుగా చేశారు” అన్నాడు దంతనాధుడు.

“వారి పుత్రికను మంజూష రాణిని నేను. బహుశా హేమాంగి, మైనాకులను రక్షిస్తున్న వారు మీరేనా” అన్నది.

“ఓహో. నీవు వారికి చేసిన అన్యాయాలన్నీ మాకు తెలిసినవి. అయినా వారిరువురు ఇప్పుడు మా దగ్గర లేరు. మైనాకుడు మురారి నగరాధీసుని కుమారుడు. సుల్తానులు అతని తండ్రిని సంహరించి, రాజ్యమును అపహరించారు. తన రాజ్యాన్ని తిరిగి వశం చేసుకోవాలని హేమాంగితో కలిసి వెళ్ళాడు. నీవు మా ఆతిథ్యంలో రెండు దినములు వుండి వెళ్ళవచ్చు” అన్నాడు.

“మీ ఆలయంలోకి అన్యులు ప్రవేశించటం అసంభవమట” అన్నదామె.

“అవును. మేము లేకుండా ఒంటరిగా ప్రవేశించిన వారికి ప్రాణాపాయమే. మేము దగ్గర వుండి నిన్ను కొనిపోతాము” అన్నారు.

“అయ్యో. ఫాలాక్షుడు ఒంటరిగా వెళ్ళాడే!” ఆందోళనతో అంది.

ముగ్గురు శివాలయం లోనికి వెళ్లి చూడగానే, గుమ్మం దగ్గరే గాలిలో ఫాలాక్షుడు గిరగిరా తిరుగుతుండడం చూశారు. ఫక్కున నవ్వారు. రాణి ఎదుట తన నిస్సహాయ స్థితికి సిగ్గుపడ్డాడు. తన మంత్రశక్తితో పైకెగిరి అంతా చూస్తున్నానన్నాడు. దిగి రమ్మంది నాగరాణి.

“అతను రాలేడులే” అంటూ దంతనాథుడు స్వామి విగ్రహం దాపున ఉన్న అక్షతలు తీసి, కన్నులకు అద్దుకొని, శివస్వామిని ధ్యానిస్తూ, గాలిలో తిరుగుతున్న ఫాలాక్షుని మీదకు విసిరాడు. అక్షతల మహిమతో మరుక్షణం ఫాలాక్షుడు కిందికి దిగాడు.

***

ఫకీరు భల్లూక రూపంలో తొమ్మండుగురు కన్యలను బలి ఇచ్చి కాపాలిని ధర్మదేవత నుండి తప్పించడానికి తలపెట్టిన కార్యం మహాబలమహారాజు వల్ల విఫలమైంది. కాపాలికి విముక్తి కలగకపోతే తనకు కావలసినప్పుడు శక్తులు ఎవరిస్తారు! మరల తొమ్మండుగురు కన్యలను సంపాదించాలని వడివడిగా వెళుతున్న ఫకీరుకి దూరం నుండి మాటలు వినిపించాయి. దగ్గరికి వెళ్లి చూస్తే హేమాంగి, ప్రక్కన ఎవరో స్త్రీ పురుషుడు కానీ శరీరాకారం. ఒక్క ఉదుటన వెళ్ళి హేమాంగి చెయ్యి పట్టుకోబోయాడు. హఠాత్తుగా ఆమె సిగలోని దేవ మందారం నుండి ఒక సర్పము బుస్సున లేచి భల్లూకాన్ని కరిచి, అంతలోనే అదృశ్యమైపోయింది. బ్రతుకు జీవుడా అంటూ హేమాంగి మైనాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

భల్లూకం గిలగిలా తన్నుకుని కింద పడి ప్రాణాలు వదిలింది. ఆ మృతకళేబరం నుంచి ఫకీరు నిజరూపంతో వెలువడి, ఆ సిగపూవు మహిమకు అచ్చెరవందుతూ, హేమాంగి మైనాకుల కోసం వెతుకుతూ వెళ్ళసాగాడు. దూరంగా ఇరువురు స్త్రీ పురుషులు వస్తున్నట్లు గోచరించింది. మారువేషంలో వస్తున్నారు కాబోలు అనుకుని చాటునుంచి, తయారుగా ఉంచుకున్న ఒక ఉచ్చును ఇరువురి శిరస్సులను బంధించేలాగున విసిరాడు. కానీ అది ఆ పురుషుని శిరస్సుకు మాత్రమే తగిలింది. ఆ స్త్రీ కోపంతో “ఎవరు” అని గట్టిగా అరిచింది. “నేను ఎవరో తెలియని వారు ఈ లోకంలో ఉన్నారా” అన్నాడు గట్టిగా నవ్వుతూ.

“మాది ఈ లోకము కాదు. నాగ లోకం. మమ్ములను మోసగించి, దేవమందారమునపహరించిన హేమాంగి మైనాకులను వెతుకుతూ ఇక్కడికి వచ్చాము” అన్నది నాగరాణి.

ఫకీరు ఆమె ముందుకు వచ్చి “ఆ హేమాంగి సిగలోని పుష్పము నన్ను కాటు వేయబోయినది. అదేనా దేవ మందారం” అన్నాడు.” ‘ఇతడు ఎవరు? కొంపదీసి నీలాంటి సౌందర్యరాశి వీడిని ప్రేమించలేదు కదా!’ అన్నాడు మళ్ళీ. ఆమె ఏమి చెబుతుందోనని ఆతృతగా చూశాడు ఫాలాక్షుడు. ఆమె “ఛీఛీ” అనడంతో చిన్నబోయాడు.

“అవును. నాలాంటి మంత్రసిద్ధుని ప్రేమించాలి” అంటూ ఆమె చేయి పట్టుకోబోయాడు ఫకీరు.

చప్పున నాగరాణి సర్పాకారం దాల్చి, విసురుగా కాటు వేయబోయింది. భయంతో వెనకకు తగ్గిన ఫకీరు పరుగందుకున్నాడు.

నాగరాణి ఫాలాక్షుని మెడకు ఉన్న ఉచ్చును తొలగించి, అంతలో అతని వేలికి ఉన్న ఉంగరమును చూసి “ఇది మైనాకునిది. నీకెలా వచ్చింది” అని నిలదీసింది. “నిజం చెప్పకపోతే దండించబడతావు” అన్నది తీక్షణంగా.

జరిగినదంతా చెప్పక తప్పలేదు అతనికి. మాయ మైనాకునిగా అతను చేసిన పనులన్నీ విన్న నాగరాణి ఛీత్కరించి “మరి నా వెంట రాకు” అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాసేపాగి మనసు ఆగలేక, ఆమెను వెతుకుతూ బయల్దేరిన ఫాలాక్షునికి మళ్లీ ఫకీరు ఎదురయ్యాడు. “ఏమి! ఒక్కడివే వస్తున్నావ్! మీ నాగరాణి ఏమైంది!” అన్నాడు.

“ఆమెనే అనుసరించి వస్తున్నాను. ఆమె ఆకాశమార్గంలో ఎగిరిపోయింది. నాకంత శక్తి లేక ఇక్కడే ఉండిపోయాను. హేమాంగి, మైనాకులను వెదుకుతూ మురారి నగరానికి వెళ్ళి వుంటుంది” అన్నాడు దిగులుగా.

ఆ పేర్లు వినగానే ఫకీరుకు ఆత్రుత కలిగి మొత్తం వివరాలు చెప్పమని అడిగాడు. ఫాలాక్షుడు జరిగిన కథంతా చెప్పి ‘ మీరు నాకేమైనా సాయం చేయగలరా’ని అడిగాడు.

“అంతరిక్షాన నేను నిన్ను మురారి నగరంలో దించుతాను. తర్వాత నీకు కనబడను. నా విషయం ఎవరికీ చెప్పకూడదు” అని హెచ్చరించి, గాలి గుర్రమును తీసి, గాలి పూరించాడు. ఫాలాక్షుని తనతో పాటు గాలి గుర్రము పై నెక్కించుకొని, ఆకాశమార్గాన మురారి నగరాభిముఖంగా బయలుదేరాడు.

(తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకోవాలన్న మైనాకుని ప్రయత్నం ఏమైంది? ఫకీరు, ఫాలాక్షుడు మురారి నగరం చేరి ఏం చేసారు? …. తరువాయి భాగంలో…!)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here