మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-29

1
5

[box type=’note’ fontsize=’16’] కొవ్వలి, భయంకర్ పేరుతో రచించిన జగజ్జాణ ఆ కాలం పాఠకులను సమ్మోహితులను చేసింది. ఆనాటి జగజ్జాణను ఈనాటి పాఠకుల కోసం సరళంగా, సంక్షిప్తంగా అందిస్తున్నారు డా. సి.హెచ్. సుశీల. [/box]

శ్రీ కొవ్వలి నాగేశ్వరరావు గారితో ముఖాముఖి:

రచయిత్రి: ప్రపంచ భాషా రచయితల లోనే వెయ్యిన్నొక్క నవలలు రాసిన ‘తెలుగు’ రచయిత మీ నాన్నగారు. ఆయన గురించి అప్పుడూ ఇప్పుడూ ఉపేక్ష వహించిన పరిస్థితికి కారణాలు ఏమిటి?

కొ.నా.: సభలూ సత్కారాలకూ దూరంగా ఉండి, ఎవరేమన్నా తన ఉద్యమాన్ని చివరి వరకూ కొవ్వలి సాగించారు. అవి సాంఘిక నవలలే కానివ్వండి, జానపదాలు, చారిత్రక నవలలు, పౌరాణిక నవలలు, Scientific Fiction కానివ్వండి ఏ నవలైనా దానికదే సాటి!

ఎందరో అంగీకరించినట్లుగా ఆయన పాఠకులను సృష్టించారు. నిలబెట్టి చదివించారు. అంతకన్నా ఏ గుర్తింపు కావాలి! అయినా కూడా ఈనాటి పండితులు, సాహితీవేత్తలందరూ పూనుకుని ఆయనకు ఆధునిక నవలా సాహిత్యంలో తగు స్థానం కల్పిస్తే ఆధునిక నవలా సాహిత్య లోకం గర్విస్తుంది. సమాజానికి శ్రీ కొవ్వలి నిస్వార్థంగా తన కలం ద్వారా అంత సేవ చేసినప్పుడు, సమాజం ఆయనకేమి చేసింది? ప్రతి ఒక్కరూ తమ అంతరాత్మలని ప్రశ్నించుకుంటే సమాధానం దొరుకుతుంది! అది మీరందరూ కలిసి చేయవలసిన పని. అది మనందరి బాధ్యత! అది మీరందరూ ఇక విస్మరించరనే నమ్మకం నాకున్నది.

ప్రజలు ఇదివరకే ఆయనను గుర్తించారు. కానీ సాహిత్యవేత్తలు, ఆయన సమకాలీనులు కానీ ఎక్కడా ఎక్కువగా ప్రస్తావించకపోవటం చాలా దురదృష్టకరమే! ఎందుచేతనంటే ఆయన నవలను, ఆయన రచనలను ఒక నిష్పక్షపాతమైన బుద్ధితో స్వీకరించలేదు. ఆ రోజుల్లో కొవ్వలి నవలలు ఎంత జనాదరణ పొందినా, అది చవుకబారు సాహిత్యమనీ, రైల్వే సాహిత్యమనీ, శృంగారం ఎక్కువగా ఉంటుందనీ, ఒక విధమైన అపోహను సృష్టించి, సమాజంలో ఒక దుష్ప్రచారం చేశారు కొంతమంది ప్రబుద్ధులు. ‘పది మంది మాట పాడియగు’ అన్నట్లు అదే భావాన్ని అందరికీ కలిగించారు. నిజము దేవుడెరుగు, నీరు పల్ల మెరుగు అన్న చందాన ఆ నవలల విలువనీ, ఆయన చేసిన సాహిత్య సేవనూ ఈనాటి పెద్దలు, సాహితీవేత్తలు అంగీకరించి గుర్తిస్తున్నారు. ఆనాడు జరిగిన పొరపాటుని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు మీలాంటి కొందరు. ఇదే ప్రయత్నం నిరవధికంగా సాగించినట్లయితే కొవ్వలికి మీరనుకున్న నవలా లోకంలో సముచిత స్థానం తప్పకుండా కలుగుతుంది.

పూర్వం ప్రబంధ కాలంలో కవులకు రాజాదరణ రాజపోషణ ఉండేది. కవులలో ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. కవులకు స్వేచ్ఛ ఉండేది. అందుచేత ఆనాటి కావ్యాలు చరిత్రలో సుస్థిరంగా వుండిపోయినాయి.

రోజులు మారిపోయినాయి. ప్రజలే పాలకులైనారు. కవులకు రాజాదరణ లేదు. ప్రజలే ప్రభువులు. ప్రచురణకర్తలు సాహితీ పోషకులు. సుమారు వంద సంవత్సరాల నుండీ, ఆధునిక కవులు వారి వారి కవితా సౌరభాన్ని వారే నలుదిక్కులూ వెదజల్లే పరిస్థితి ఏర్పడింది. ప్రచురణకర్తలు, వార్తాపత్రికలు ఇతర మాధ్యమాలు సంధానకర్తలైనాయి.

కొవ్వలి కాలంలో కేవలం వారి నవలా సుగంధాలను, తెలుగునాట అంతఃపురాల్లోనూ, ఆమూల సౌధాల్లోను, తెలుగు గాలి సోకినంతమేర ఆబాలగోపాలమూ, స్త్రీ పురుష భేదం లేక, పండిత పామరులూ, ధనికులూ, మధ్యతరగతి కుటుంబీకులూ, కాస్తంత అక్షర గంధం ఉన్న ప్రతి ఒక్కరూ కొవ్వలి నవలలను చదివి ఆనందించేవారు. కొనుక్కుని చదివే తాహతు లేని అట్టడుగు వర్గానికి చెందిన పాటవ జనం సహితం గ్రంథాలయాల్లో పుస్తకాన్ని చదివేవారు. అద్దె లైబ్రరీలో కాణీ, అర్ధణా ఇచ్చి చదివేవారు. ఈ అద్దె వ్యాపారంతో ఆ రోజుల్లో ఇళ్ళు వాకిళ్ళు కొని, కొవ్వలి పేరు చెప్పుకుని స్థిరపడ్డవారు ఉన్నారు.

కానీ ముందుచూపుతో కొవ్వలి పేరుని స్థిరంగా భావితరాలవారికి తెలియజేయటానికి ఎవరూ నడుంబిగించి ప్రయత్నించలేదు. అందుచేత ఆధునిక నవలా సాహితీలోకంలో, కొవ్వలి పేరు ఎక్కువగా ప్రస్తావించలేదు. అయినా ఈ నాటికీ ఎవరిని కొవ్వలి గురించి పలకరించినా, కొవ్వలి ప్రజాదరణ పొందిన రచయిత అనీ, కొన్ని వేలు, లక్షల మంది పాఠకులను స్పష్టించిన మహనీయుడనీ ఒప్పుకుంటారు. ఈ వాస్తవాలను ముందు తరం వాళ్ళకి తెలియ చేయవలసిన బాధ్యత ఈనాటి చరిత్రకారులకీ, మీలాంటి సాహితీవేత్తలకూ ఉన్నది. అది మనందరి కనీస బాధ్యత. గతం గతః. ఇకనైనా మనమందరమూ పూనుకొని ఒక కార్యాచరణ ప్రణాళికను రూపకల్పన చేసినట్లయితే, కొవ్వలి కొంత మేరైనా న్యాయం చేసిన వారమవుతాము.

కొవ్వలి ఎప్పుడూ ప్రచార సభలు పెట్టుకోలేదు. తనకు పేరు ప్రతిష్ఠలు రావాలని ఏనాడూ ప్రాకులాడలేదు. తనకంటూ ఒక వర్గాన్ని పెట్టుకోలేదు. కానీ ఈనాడు రెండు, మూడు పుస్తకాలు వ్రాస్తే, బహుళ ప్రచార సభలు పెట్టించుకుంటున్నారు. ఒక్కొక్కప్పుడు తమ డబ్బును ఖర్చు పెడుతూ, సన్మానాలు చేయించుకుంటున్నారు. అటువంటి వాటికి కొవ్వలి చాలా దూరం. అతి నిరాడంబరగా జీవితాన్ని గడిపి, తను రాసిన పుస్తకం పదిమంది చదివి ఆనందిస్తే, ఆయన బ్రహ్మానందం పొందేవారు. పాఠకులు అనేకానేక లేఖలు వ్రాసేవారు. అదే గుర్తింపనుకొని పొంగి పోయేవారు. ఆయన చాలా అల్పసంతోషి. ఇదే కొవ్వలి ఏలూరు లోనూ, చెన్నై లోనూ, ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని, డబ్బు ఖర్చు పెట్టి పదిమంది పెద్దలచే సత్కారాలు పెట్టుకుంటే, కొవ్వలికి కూడా మీరన్నట్లుగా నవలా సాహిత్యంలో పేరు నిలిచిపోయేదేమో!

ఆయనది ఒకటే ధ్యేయం. ప్రజలు చదవాలి, అందుచేత వారికి ఉత్తమ సంస్కారం కలగాలి. అది ఆయన జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాడు. అది నెరవేరింది. అదే బ్రహ్మరథం ఎక్కినట్లు సంతోషించాడు ఆ అల్పసంతోషి.

ఇదే డాక్టర్ సుశీలమ్మ గారి లాంటి పెద్దలు – ఆనాడు సుమారు 60 సంవత్సరాల క్రితం – పూనుకున్నట్లయితే కొవ్వలి పేరు ఇంకా ఎంత ప్రచారం పొందేదో!

అయినప్పటికీ ఈనాడు గత 15 సంవత్సరాల నుండి స్వర్గీయ ద్వా.నా. శాస్త్రి గారు, శ్రీ మద్దాలి రఘురామ్ గారు, శ్రీ వోలేటి పార్వతీశం గారు, శ్రీ భువన చంద్ర గారు, ద్విభాష్యం రాజేశ్వరరావు లాంటి మహనీయులు కొవ్వలి పేరిట ఏటేటా సభలు పెట్టి ఆయన్ని స్మరించుకుంటున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారు దాదాపు 8 సంవత్సరాల క్రితం ప్రత్యేక సాహితీ కార్యక్రమాన్ని (Seminar) నిర్వహించి, అనేక మంది పెద్దలు అనగా, ఆచార్య గోపి గారు, మలయవాసినీ గారు, గుమ్మా సాంబశివరావు గారు, ద్వా.నా. శాస్త్రి గారు మొదలైన వారు కొవ్వలి నవలా లోకానికి చేసిన సేవలను శ్లాఘించారు. ప్రస్తుతం డా. సుశీలమ్మ గారు కూడా కొవ్వలి కోసం నిస్వార్ధంగా తపిస్తూ, కొవ్వలికి తగినరీతి గుర్తింపు, ఈనాటి సమాజంలో తీసుకురావాలనీ ఒక తపస్సుగా కృషి చేస్తున్న మహనీయురాలు. ఇంకా ఇతర పెద్దలు, సాహితీవేత్తలు, ప్రచురణకర్తలు (ఎమెస్కో/అమరావతి పబ్లికేషన్స్) నాటి కొవ్వలి నవలలను గుర్తించి, ఆయన చేసిన సామాజిక సేవను ఈనాటి పాఠకులకు, యువతకు అందించాలనే తపనతో కృషి చేస్తున్నారు.

సంక్షిప్తంగా కొవ్వలి నవలలకు తగిన గుర్తింపు ఆధునిక నవలా సాహిత్యంలో సముచిత స్థానం కలగకపోవటానికి గల ముఖ్య కారణాలు:-

  1. శ్రీ కొవ్వలి తనకి పేరు ప్రతిష్ఠలు కలగాలనీ, కీర్తి కలగాలనీ ఎన్నడూ ఆశించలేదు. అందుకు తగిన ప్రయత్నమూ చేయలేదు.
  2. ఆనాటి సమకాలీనులు కొవ్వలికి ఆనాటి సమాజంలో పెరుగుతున్న ఆదరణని, విశేషంగా స్త్రీ జనాల నుండి వెల్లువలా ప్రవహిస్తున్న అనురాగ జ్వాలలను, గౌరవ ప్రపత్తులను చూసి ఉదాసీనత వహించారు. కొవ్వలి అందుకు ఏమాత్రం చలించలేదు.
  3. కొవ్వలికి ఏ ‘వర్గ’మూ వెన్నుదన్నుగా లేదు. ఆయన ఏర్పరచుకొనలేదు. అందుకు ఆయన డబ్బు ఖర్చు పెట్టలేదు. కారణం – ఆయనకి స్తోమత లేకనూ, ఆయన కీర్తి కండూతి కోసం వెంపర్లాడకపోవటమూ తగిన కారణాలు.
  4. కొవ్వలి నవలలు గురించి ఆయన కీర్తిని అడ్డుకట్ట వేయాలన్న తలంపుతో ఆ నవలలు చదివితే ‘చెడిపోతారు’ అన్న అపోహనూ దుష్ప్రచారం చేశారు. నిజానికి అలాంటివి ఎప్పుడైనా, ఏదైనా తాత్కాలికమే.

మహాకవి భర్తృహరి గారు చెప్పినట్లుగా,

“అంధక జన దూషితంబులు ఘణములు గావె, అమూల్య రతనముల్”

ఎవరు దూషించినా, పొగిడినా రతనాల కుండే విలువ రతనాలకు ఉంటుంది. విలువ ఏమాత్రం తరిగిపోదు. ఎప్పటికీ రత్నము రత్నమే!

శ్రీ కొవ్వలికి అదే వర్తిస్తుంది.

రచయిత్రి: మాలతీ చందూర్ వంటి రచయిత్రులు అత్యంత అభిమానంతో మెచ్చుకున్నారంటే కొవ్వలి గారి రచనలో ఉన్న ప్రత్యేకత ఏమిటి?

(కొవ్వలి నాగేశ్వరరావుగారి స్పందన వచ్చేవారం…)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here