మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-4

5
4

[box type=’note’ fontsize=’16’] కొవ్వలి, భయంకర్ పేరుతో రచించిన జగజ్జాణ ఆ కాలం పాఠకులను సమ్మోహితులను చేసింది. ఆనాటి జగజ్జాణను ఈనాటి పాఠకుల కోసం సరళంగా, సంక్షిప్తంగా అందిస్తున్నారు డా. సి.హెచ్. సుశీల. [/box]

[dropcap]ఆ[/dropcap]కాశవాణి, తర్వాత దూరదర్శన్‌లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా చేరి కాలక్రమేణా సాహిత్య కార్యక్రమాలు రూపకల్పనలో సాటిలేని మేటిగా పేరుగాంచిన శ్రీ వోలేటి పార్వతీశం గారు “తెలుగు సాహిత్య ప్రపంచం కొవ్వలి గారిని ఎందుకు విస్మరించింది, ఆధునిక నవలా సాహిత్య చరిత్రలో ఆయన గురించి ఒక్క వాక్యమైన ఎందుకు లేదు” అని ఆవేదన చెందారు. సాధారణ ప్రజలు, ముఖ్యంగా స్త్రీలు విరివిగా కొవ్వలి సాహిత్యాన్ని చదివేవారు.‌ వేలల్లో లక్షల్లో ఆయనకి అభిమానులు ఏర్పడ్డారు. ఇది సమకాలీనులైన (అధికారపక్షం) పండిత లోకం హర్షించ లేకపోయింది. ఆయనకు వచ్చిన పేరు ప్రఖ్యాతులకు దుగ్ధ కలిగింది. కొవ్వలి స్త్రీల సమస్యలను చర్చించారు, కానీ అసభ్యత అశ్లీలత లేనే లేదు. అయినా వారు కావాలనే కొవ్వలి నవలలు చదవకూడదని, స్త్రీలు చెడిపోతారని ఒక విష ప్రచారం చేశారు. సాహిత్యపరంగా గట్టిగానే దెబ్బ కొట్టారు (అంతేకాకుండా ఆయనపై భౌతిక దాడులకు తెగబడ్డారు. ఒకానొక సమయంలో ఆయనను హత్య చేయడానికి కూడా వెనుకాడలేదు). తర్వాతి కాలంలో సాహిత్య చరిత్ర రాసేవారు కూడా పండితులే కాబట్టి కావాలని పక్కన పెట్టారు. విశ్వవిద్యాలయాల పాఠ్యాంశాలలో కూడా ఆయన ప్రస్తావన రానీయలేదు – అన్నది పార్వతీశం గారి అభిప్రాయం.

ఇక సినిమాల విషయానికొస్తే ఆ రోజుల్లో సినీ ప్రపంచంలో కూడా కొవ్వలి రచనలను విరివిగా చదివేవారు. వైవిధ్యభరితమైన ఇతివృత్తంతో, ఆకర్షణీయమైన సంభాషణలతో ఉండే ఆయన నవలల లోని కథాంశం వారికి బాగా నచ్చేది. పైగా తమ మొదటి సినిమా ఆయన కథ తోటే ప్రారంభించాలి అన్న సెంటిమెంట్ ఉండేది. అలాగే చాలామంది నటీనటులకు ఆయనే మొదటి సినిమా అవకాశం ఇచ్చారు. ప్రముఖ నటుడు కె.వి. చలం చిన్న వయసులోనే సినిమాల పట్ల ఆకర్షితుడై, కొవ్వలికి ఉన్న పేరు ప్రఖ్యాతలు మీద నమ్మకంతో, ఇంట్లో చెప్పకుండా మద్రాసు వచ్చి సరాసరి కొవ్వలి వారి ఇంట్లో దిగారు. చాలా రోజులు వారి ఇంట్లోనే ఉండి సినిమా ఛాన్స్ కోసం ప్రయత్నించి తర్వాత నిలదొక్కుకున్నారు.

అప్పటికి హాస్య నటిగా పేరు తెచ్చుకున్న మీనాకుమారి 1962లో తన సొంత ప్రొడక్షన్లో భర్త సుబ్బారావు గారి సహకారంతో “మరపురాని కథ” అనే సినిమాని ప్రారంభించాలని అనుకున్నారు. కథ మాటలు స్క్రీన్ ప్లే కొవ్వలి గారే. దర్శకత్వం వేదాంతం రాఘవయ్య. జగ్గయ్య హీరో. నృత్య దర్శకత్వం పసుమర్తి కృష్ణమూర్తి. కానీ ఆర్థిక ఇబ్బందులతో సినిమా సగంలోనే ఆగిపోయింది.

ప్రముఖ నటులు వి.నాగయ్య, అల్లు రామలింగయ్య, వంగర వెంకట సుబ్బయ్య, లింగమూర్తి, సూర్యకాంతం మొదలైనవారు తరచూ కొవ్వలి ఇంటికి వచ్చేవారు. ఇంటి నుంచి రకరకాల వంటలు తయారు చేసి తీసుకువచ్చి షూటింగ్ విరామ సమయంలో అందరికీ అమ్మలా వడ్డించే సూర్యకాంతం అంటే ఆయనకి మాతృభావన. తన వెయ్యవ నవల “మంత్రాలయ”ను ఆమెకు అంకితం ఇచ్చారు. ఆమె ఎంతో ఆత్మీయతతో కృతజ్ఞతతో స్వీకరించారు. 1973 ఆగస్టు 3 సాయంత్రం మద్రాస్ పాండీ బజార్, మధుర కళానికేతన్‌లో జరిగిన ఆ సభకు జె.వి.సోమయాజులు అధ్యక్షత వహిస్తే, ప్రముఖ హాస్యనటుడు రాజబాబు గారు గ్రంధావిష్కరణ చేశారు. తర్వాత శ్రీ పి.బి.శ్రీనివాస్ బృందం పాటకచేరీ చేశారు. గొప్ప సంరంభంగా జరిగిందానాటి సభ.

“ఆయన నవలల వల్లే 70 ఏళ్ళ క్రితం ఆడవాళ్ళు పుస్తకం పట్టుకునే ప్రయత్నం జరిగింది. పాకశాలకు పరిమితమైన స్త్రీలను పాఠకులుగా మార్చింది కొవ్వలి” అంటారు ఆచార్య కె. మలయవాసిని.

తెలుగు నవలలకు ఇంగ్లీషు హిందీ శీర్షికలు పెట్టటం అనే ప్రత్యేక పద్ధతి మొదలు పెట్టింది కొవ్వలిగారే. డాన్సింగ్ గర్ల్, టార్చ్ లైట్, బర్మా లేడీ, డార్క్ రూమ్, ఫిలిం స్టార్, డోంట్ కేర్ పంటి ఇంగ్లీష్ టైటిల్స్, నసీబ్, దిల్ ఖుష్, ఉల్టా సీదా, చోరీ, నిశానీదార్, బడా చోర్ పంటి ఆకర్షణీయమైన హిందీ పేర్లు పెట్టే వారాయన. నవల ప్రారంభంలోనే ఆ నవల ఏ విషయం పై రాస్తున్నారో సూచనగా తెలియజేసేవారు. ఇది మరో ప్రత్యేక విషయం. దీనివల్ల పాఠకుడు తాను చదవబోయే విషయం గురించి ముందుగానే అంచనా వేసుకుంటాడు.

“నేను ‘ఇల్లాలి ముచ్చట్లు’ రాసేటప్పుడు వాటికి టైటిల్స్ కోసం వెతుక్కునేటప్పుడు ఏ టైటిల్ అయినా ఎప్పుడో ఒకప్పుడు కొవ్వలి వారు తమ నవలకు పెట్టుకున్నదే అయి ఉండేది” అన్నారు పురాణం సుబ్రహ్మణ్య శర్మ. మరి 1000 నవలలు కదా కొవ్వలి వారివి!

డా. వేదగిరి రాంబాబు కొవ్వలి జీవితంలోని అనేక సంఘటనలను సేకరించి, “వెయ్యిన్నొక్క నవలల కొవ్వలి జీవితం-సాహిత్యం” అని చిన్న పుస్తకం 2016 జులైలో ప్రచురించి, “తండ్రి శ్వాసే తన శ్వాసగా ఆయన రచనల ద్వారా ఆయనను ఈ తరం పాఠకులకు పరిచయం చేయడమే తన బాధ్యతగా కృషి చేస్తున్న కొవ్వలి వారి ద్వితీయ పుత్రుడు కొవ్వలి లక్ష్మీనారాయణకి ఈ కొవ్వలి వారి జ్ఞాపకాల్ని జ్ఞాపికగా అందిస్తున్నాను” అంటూ అంకితం ఇచ్చారు.

కాశీ మజిలీ కథలు, భట్టి విక్రమార్క, బాలనాగమ్మ, పండ్రెండు రాజుల కథలు, పదహారు రాజుల కథలు, మదన కామ రాజు కథలు, మదన కామేశ్వరి కథలు, భోజరాజు కథలు, శుక సప్తతి వంటి విభిన్న రచనలు కొవ్వలి వారి ప్రతిష్టను మరింత పెంపొందించాయి.

“పుస్తకాలు చదవటమంటే రామాయణ భారత భాగవతాలు చదవడమని, చదవలేకపోతే వాటిని పురాణాలుగా చెబుతూ ఉంటే వినడమనీ జనబాహుళ్యం అనుకునే రోజుల్లో తెలుగు పుస్తకాలు చదవటం విషయంలో విప్లవం తెచ్చిన విప్లవ రచయిత కొవ్వలి. తెలుగు చదవటం రాని వాళ్ళు ఆయన పుస్తకాన్ని చదవటం కోసం తెలుగు నేర్చుకున్నారు అంటే అది అతిశయోక్తి అనిపించుకోదు” అన్నారు డా. కొత్తపల్లి వీరభద్రరావు.

“కొవ్వలి రాసిన పుస్తకాలు చాలావరకు సాంఘికాలు. కొవ్వలి వారి కథలు మన దైనందిన జీవితంలో జరిగేవి కనుకనూ, తరచూ మనం వింటుండేవి కనుకనూ ఏదీ వీటిలో మనకు కొత్తదనం కనిపించదు. అటువంటి ఇతివృత్తాలు గ్రహించి కూడా అందరినీ ఆకర్షించుకునే విధంగా కథను మలచి రచనగా సాగించడమన్నది అనుకున్నంత సులభం కాదు. వైపు – వాటం ఎరిగిన రచయిత. కథ ఎటువంటిదైనా దానిని కళాత్మకంగా తీర్చిదిద్దే శక్తి కొవ్వలి వారిలో ఉండటం వల్లనే ఆయన రచనలు చాలామందిని ఆకర్షించాయి” అంటారు రాధాకృష్ణ శర్మ గారు.

“తెలుగులో పఠనాసక్తిని పెంపొందించడానికి కృషి చేసిన వారిలో కొవ్వలి ప్రథముడు. ఆ కృషి ఫలితాన్ని ఈనాడు అనేక పత్రికలు, రచయితలు అనుభవించడం మనం చూస్తున్నాం. ఆ ఫలితం ఆయనకు అంతగా దక్కక పోవడం శోచనీయం” అన్నది కొడవటిగంటి కుటుంబరావు గారి నిశ్చితాభిప్రాయం.

ప్రముఖ నటులు చిత్తూరు వి. నాగయ్య గారికి కొవ్వలి వారన్నా, వారి నవలలు అన్నా చాలా అభిమానం. “ఆంధ్రుల అభిమాన నవలా రచయిత కొవ్వలి గారే అంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు. నా మట్టుకు నేను వారి నవలలని చదివి, అందలి కల్పనా శక్తికి, రచనా కథనానికి ముగ్ధుణ్ణి అయ్యాను. పెద్దవాడిని కనుక ఆశీర్వదిస్తున్నాను” అన్నారాయన.

“ఈరోజు పిల్లల్లోనూ పెద్దల్లోనూ చదివే అలవాటు చాల పెరిగింది. 40 ఏళ్ళ క్రితంతో పోలిస్తే ఈ నాడు పత్రికల సంఖ్య చాలా ఎక్కువ. పత్రికలు కూడా పూర్వం కన్నా అనేక రెట్లు అమ్ముడవుతున్నాయి. అయితే ఈ మార్పు ఒక్కసారిగా రాలేదు. ఎందరో రచయితలు దీర్ఘకాలం కృషి చేసిన మీదట భాషలోనూ, భావంలోనూ. ఇతివృత్తాలలోను ఎన్నో మార్పులు వచ్చిన మీదట ఆధునిక సాహిత్యం జన సామాన్యానికి చేరువ కాగలిగింది. ఆ విధంగా నానాటికీ ప్రజలలో ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ఈ మార్పు పాఠకుల అందరిలో వచ్చినప్పటికీ పురుషులలో కన్నా స్త్రీలలో మరింత హెచ్చుగా వచ్చింది. కారణం కొవ్వలి. మధ్యతరగతి స్త్రీల ఆమోదంగా ఆయన రచనలు చేశారు, మెప్పించారు” అన్నారు ప్రముఖ నిర్మాత శ్రీ చక్రపాణి.

“నా చిన్ననాడు అంటే 1940 ప్రాంతంలో నేను చిన్న తరగతుల్లో చదువుకుంటున్నప్పుడు మా ఊర్లో ప్రతి వాళ్ల చేతిలో కొవ్వలి నవల కనిపించేది. ఆయన ఒక్కరాత్రిలో ఒక నవలను అవలీలగా రచించే వారని చెప్పేవారు. అయితే రచనకు కాలం కొలబద్ద కాదు. తనకి 60 సంవత్సరాలు నిండే నాటికి సహస్ర సంఖ్యలో నవలలు వ్రాశారు అంటే అది వారి విశేష ప్రజ్ఞకు నిదర్శనం అని చెప్పాలి” అన్నది దాశరథి గారి ఉవాచ.

తన రచనల ద్వారా సాంఘిక విప్లవాన్ని సాధించిన కొవ్వలి వారి సేవ గుర్తించి ఆనాడు శ్రీ వెంకటేశ్వర, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు యోగ్యతా పత్రాలు ఇచ్చాయి. వాటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ సముచిత రీతిన గౌరవించింది. నెలకు యాభై రూపాయలు కుటుంబ పోషణార్థం పంపించింది. దానికే చాలా సంతోషించారు ‘అల్పసంతోషి’ అయిన కొవ్వలి. ఆత్మాభిమానం పుష్కలంగా ఉన్న కొవ్వలి ఎవరికి పడితే వారికి, ఏదైతే అది రాసి ఇచ్చేవారు కాదు. తను నమ్మిన సిద్ధాంతం, కళ్ళ ఎదుట కనిపిస్తున్న గాథలు, అహంకార పూరితమైన – అన్యాయాలు చేసే కొందరి మనుషుల గురించి నిర్మొహమాటంగా రాసేవారు. ఆర్థికంగా ఏమి పుంజుకోలేదు ఆయన మరణించే నాటికి పెద్ద కుమారుడు నాగేశ్వరరావు గారికి మాత్రమే వివాహమైంది గాయత్రి గారితో.

1972లో ఆయన అభిమానులందరూ ఆయనకి షష్టిపూర్తిని మద్రాసులో చేశారు తన. ప్రముఖ కవులు, సినీ ప్రముఖులు ఎందరో ఆయన సాహిత్యాన్ని, సంస్కరణలని వివరిస్తూ రచనలు చేసి ఒక ప్రత్యేక సావనీర్‌ను తీసుకు వచ్చారు.

ప్రముఖ రచయిత ద్విభాష్యం రాజేశ్వరరావు గారు తను అబ్బురపడ్డ ఒక సంఘటనని చెప్పారు. తను హైస్కూల్లో చదివే రోజుల్లో అప్పలకొండ అనే పేద విద్యార్థి తనకు సీనియర్‌గా ఉండే వాడు యలమంచిలిలో. చాలా సంవత్సరాల తర్వాత, విశాఖలో ఉంటూ రాజేశ్వరరావు గారు కథలు రాస్తూ, ఒకసారి యలమంచిలి వెళ్లారు. ఆయనను చూసిన అప్పలకొండ పరిగెత్తుకు వచ్చి ఆప్యాయంగా కౌగిలించుకుని, కథలు చాలా బాగా రాస్తున్నావు అని మెచ్చుకొని, బలవంతాన తన ఇంటికి తీసుకు వెళ్లారు. అయిష్టం గానే వెళ్ళిన రాజేశ్వరరావుగారు అక్కడున్న అప్పలకొండ చిన్న ఇంటి ముందు ఒక ఫలకం పైన “కొవ్వలి” అని రాసి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు.

“టీ తాగటానికి కూడా డబ్బులు లేని రోజుల్లో కొవ్వలి వారి పుస్తకాల్ని అద్దెకు తిప్పుకొని నేను, మా అమ్మ గంజి నీళ్లు తాగాము. ఈమాత్రం ఇల్లు ఈ వేళ కట్టుకున్నానంటే ఆయన పుస్తకాలు చలవే” అన్నాడు అప్పలకొండ ఉద్వేగంగా.

“ఒక రచయిత తన రచనలతో సమాజంలో చైతన్యం తెస్తాడని విన్నాం కానీ పేదవాళ్లకు సరాసరి భుక్తిని కలిగించగలడని ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది. ఇంతటి ఘనత పొందిన కొవ్వలి వారి గురించి, ఆయన నవలల గురించి ఎంత చెప్పినా తక్కువే” అంటారు ద్విభాష్యం గారు.

(ఎందరికో భుక్తిని కలిగించిన కొవ్వలి వారు తన కుటుంబానికి ఎంత మిగిల్చారు, ఏమి ఇచ్చారు, వారి కుటుంబ సభ్యుల వివరాలు, వారి అభిప్రాయాలు వచ్చే వారం.,.. “సంచిక” పాఠకులకు… ప్రత్యేకంగా…!!)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here