మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-5

7
5

[box type=’note’ fontsize=’16’] కొవ్వలి, భయంకర్ పేరుతో రచించిన జగజ్జాణ ఆ కాలం పాఠకులను సమ్మోహితులను చేసింది. ఆనాటి జగజ్జాణను ఈనాటి పాఠకుల కోసం సరళంగా, సంక్షిప్తంగా అందిస్తున్నారు డా. సి.హెచ్. సుశీల. [/box]

సాహిత్య సార్వభౌమ కొవ్వలి

ఏలూరులో కొవ్వలివారు నవలలను విరివిగా రాస్తున్న సమయంలో ఎదురింట్లో ఉండే పదేళ్ల పాప మాలతి (చందూర్) ఆసక్తిగా చదివేది. చదవడం అనే అద్భుతమైన ఆసక్తిని అలవాటుగా మార్చిన ‘కొవ్వలి’ అంటే ఆమెకు చాలా అభిమానం. “చలికాలంలో గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఎలా ఉంటుందో కొవ్వలి నవల చదివితే అలా ఉంటుంది” అంటారామె. సమాజంలో సంప్రదాయం పేరుతో స్త్రీలపై నున్న ఆంక్షలు, ఆవిరైపోతున్న వారి ఆశలు ఆకాంక్షలు గురించి రాశారు కొవ్వలి. అందుకే కట్టుబాట్ల పంజరాల్లో ఊపిరాడక కొట్టుమిట్టాడే స్త్రీలకు, ఉత్సాహం ఉరకలు వేసే యువతరానికి ఆయన అభిమాన రచయిత అయ్యారు. అదే సమయంలో కొందరికి కంటగింపుగా తయారయ్యారు. ఒక ప్రణాళిక ప్రకారము తెలుగు నవలా చరిత్రలో ఆయన పేరు రాకుండా చేశారు. సమాజంలోని సమస్యల్ని వెయ్యి విధాల నిశితంగా పరిశీలించిన “సహస్రాక్షుడు” ఆయన.

ఒరిస్సా మహారాజు విక్రమ్ దేవవర్మకి కొవ్వలి వారి నవలలు అంటే అభిమానం. వారిని రాజాస్థానానికి పిలిపించి ఘన సన్మానం చేశారు కూడా.

ఇంకో చిత్రం ఏమంటే – ఆయన రాయబోయే, రాబోయే నవలలకి తెలుగులో ఏ నవలకీ రానంత గౌరవమైన, ప్రత్యేకమైన “అడ్వర్టైజ్మెంట్” లభించింది. పబ్లిషర్ అయిన కొండవీటి వీర వెంకయ్య గారు ఇచ్చే ప్రకటన కూడా ఆకర్షణీయంగా ఉండేది – “తెలుగు గాలి ఉన్నంత మేరా, తెలుగు గాలి సోకినంత దూరం, అంతఃపురం లోనూ, ఆ మూల సౌధాల లోనూ ఎక్కడ చూసినా కొవ్వలి వారి నవలలే…!'” ఇలా.

ఆ నాటి భారత ప్రధాని పి.వి నరసింహారావు గారు వారానికి ఒకరోజు అక్కడి కొందరు ప్రఖ్యాతులైన తెలుగు వారిని పిలిచి ఢిల్లీ ఆంధ్రాభవన్‌లో ఉదయం అల్పాహారం విందు ఏర్పాటు చేసేవారు. కొవ్వలి లక్ష్మీనారాయణ గారి కజిన్ అయిన కొవ్వలి ఆంజనేయశర్మ గారు MTNL లో ఉన్నత ఉద్యోగిగా ఉంటూ తెలుగు సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండేవారు. ఒకసారి సమావేశంలో ఆయనను చూసిన పి.వి. గారు కొవ్వలి ఇంటి పేరు చూసి వివరాలు అడిగారు. “ఒక్క వేయిపడగలు హిందీ అనువాదానికి ఎంతో కష్టపడ్డాను. కొవ్వలి వారు ఒక్క చేతితో వెయ్యి నవలలు ఎలా రాసారో కదా! ఆయనకి రావాల్సినంత, దక్కవలసినంత ప్రతిష్ఠ దక్కలేదు” అన్నారా తెలుగు భాషా, సాహిత్యాభిమాని.

ముళ్ళపూడి వెంకటరమణ తన “కోతికొమ్మచ్చి” లో కొవ్వలి ప్రస్తావన తెచ్చారు. ఆ రోజుల్లో పెళ్లి చూపులకు వచ్చిన పెళ్ళికొడుకుని “ఏం చేస్తున్నారు” అని అడిగితే “కొవ్వలి గారిలా నవల రాస్తున్నాను” అని గొప్పగా చెప్పుకోవడం రివాజుగా ఉండేదట.

ఔచిత్యం చెడకుండా, బిగి సడలకుండా, కథ ఏ వేగంతో మొదలైందో చివరి వరకూ కథనం అంత వేగంగానే సాగుతూ పాఠకుడిని కట్టిపడేసే శైలి ఆయనది. అయితే, స్త్రీల జీవితాల లోని కష్టాల గురించి రాస్తున్నా, ఎక్కడా నిరాశావాదం కనిపించదు. రెచ్చగొట్టేలాంటి సంభాషణలు ఉండవు. వారిలో సరియైన ఆలోచన కలిగేలా, తాము ఎంత మోసపోతున్నారో, దగా పడుతున్నారో గ్రహించేలా రాస్తూ, పరిష్కారాన్ని సున్నితంగా సూచిస్తారు. ఇతివృత్తమే కాక, చదివింపజేసేలా ఉన్న సంభాషణలు, ప్రాక్టికల్‌గా ఉండే సన్నివేశాలు, రచనా శైలి లోనూ ఒక “మాయ” ఉంది. అందరూ అందుకే ఆ “మ్యాజిక్”లో పడి పోయారు.

ఆయన రాసిన నవలలలో సంఘ సంస్కరణ ప్రధాన ధ్యేయంగా 500 పైగా నవలలు రాశారు. పోతులూరి వీరబ్రహ్మం చరిత్ర స్క్రిప్ట్ సినిమా కొరకు వ్రాశారు కానీ ప్రారంభించిన కొద్ది కాలానికి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. మహాసాధ్వి మల్లమ్మ అనే తెలుగు సినిమాకి కథ రాశారు. కానీ తెలుగులో అది ఆగిపోయింది. అదే కథను కన్నడ వారు తీసుకొని సినిమా నిర్మించారు.

కొందరు పౌరాణికాలు రాస్తారు. కొందరు జానపదాలు, కొందరు సాంఘికాలు, కొందరు సినీ కథ మాటలు రాస్తారు. పేరు తెచ్చుకుంటారు. కానీ ఈ అన్ని రకాల కథలు కొవ్వలి వ్రాసారు. మెప్పించారు.

ముఖ్యంగా జంట నవలలు (సీరియల్) ఆయన మరో ప్రత్యేకత. ఇంతి చామంతి పూబంతి, నీలాంబరి కనకాంబరి, గంగా యమునా సరస్వతి, నీవే నా భార్యవు, నేనే నీ భర్తను… వంటివి. ఒక నవల నాణానికి ఒక వైపు చూపిస్తే రెండో నవల రెండో వైపు చూపించడానికి తోడ్పడేది. గతంలో చాలా కొద్దిగా ఇలాంటివి వచ్చినా బాగా ప్రాచుర్యం పొందినవి మొదటిగా ఆయనవే. ప్రజల్లో ఆయన సాధించిన ఘనత తక్కువేమీకాదు. కానీ తర్వాత కాలంలో నవలాలోకం ఆనాటి గత వైభవాన్ని, చరిత్రను విస్మరించటం దురదృష్టకరం.

శ్రీ కొవ్వలి లక్ష్మీనరసింహారావు, శ్రీమతి లక్ష్మీదేవి

వివాహ ధర్మాన్ని, విలువల్ని, స్త్రీలు తమ జీవితాన్ని పండించు కోవడానికి – ఏది వదులుకోవాలో ఏది సాధించుకోవాలో చెప్పారాయన. కొవ్వలి – అన్న ఇంటి పేరు వినగానే “ప్రఖ్యాత నవలా రచయిత కొవ్వలి లక్ష్మీనరసింహారావు మీకు ఏమవుతారు” అన్న ప్రశ్న ఎదురయ్యేంతగా జన బాహుళ్యంలో ఆయన ఇంటిపేరు ప్రాచుర్యం పొందింది. ఛాందస భావాలను తుత్తునియలు చేసి, స్త్రీలకు అభ్యుదయ మార్గాన్ని చూపిస్తూ రచనలు చేసిన కొవ్వలి గారిని నాటి “అభ్యుదయ రచయితల సంఘం” ప్రశంసించింది. మొదటి తరం అరసం వారు అనిశెట్టి సుబ్బారావు గారే స్వయంగా ఇంటికి వచ్చి కొవ్వలికి అరసం సభ్యత్వం ఇప్పించారు.

నేటి అరసం రాష్ట్ర కార్యదర్శి, ప్రముఖ నాటక కథారచయిత వల్లూరి శివప్రసాద్ మాట్లాడుతూ “చాలా చిన్నతనంలో విద్యార్థిగా ఉన్నప్పుడే “భయంకర్” పేరుతో కొవ్వలి రాసిన “విషకన్య” “చాటు మనిషి” “జగజ్జాణ” వంటి ఆసక్తికరమైన జానపద నవలలు చదవడం తోనే నా అధ్యయనం ప్రారంభమైంది. తరువాత శరత్ నవలలతో సాహిత్యాభిమానం మరింతగా పెరిగి, తర్వాతి కాలంలో నేను కూడా వ్రాయటానికి ప్రయత్నించినప్పుడు ప్రారంభంలో చదివిన కొవ్వలి నవలలు నాపై కొంత ప్రభావాన్ని కలిగించాయి” అన్నారు.

మద్దాలి రఘురామ్ గారు (కిన్నెర ఆర్ట్స్, హైదరాబాద్), వేదగిరి రాంబాబుగారు, ఓలేటి పార్వతీశం గారు, ద్వా.నా.శాస్త్రి- నలుగురూ నాలుగు స్తంభాలుగా “కొవ్వలి భవంతి”ని నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ, నాటి సెక్రటరీగారి సౌజన్యంతో 2014లో రవీంద్రభారతిలో ఒక పూర్తి రోజు సెమినార్ కొవ్వలి రచనల మీద చేశారు. నాటి సభకు ఆచార్య ఎన్.గోపి గారిని ఆహ్వానించడానికి రఘురామ్ గారితో కలిసి కొవ్వలి లక్ష్మీనారాయణ గారు వారి ఇంటికి వెళ్లారు. ఆచార్య గోపి ఆత్మీయంగా కౌగిలించుకొని “మీరు నా ఇంటికి వస్తే ఒకానొక నవలా యుగమే నడిచి వచ్చినట్లుగా ఉంది” అన్నారుట ఆనందంతో.

మూలస్తంభాల వంటి ఆ నలుగురితో కలిసి కొవ్వలి వారి కుమారులు ఇద్దరు ప్రతి సంవత్సరము కొవ్వలి జయంతి నాడు పురస్కారాలు – ఇప్పటివరకూ, కాళీపట్నం రామారావు, భువనచంద్ర, సలీం, అంపశయ్య నవీన్ , రావికొండలరావు, జమున వంటి కళా రంగానికి చెందిన ప్రముఖులకు పురస్కారాలు ఇచ్చారు.

దాశరథి రంగాచార్య “నా జీవనయానం” రాస్తూ “ఆ రోజుల్లో ఏ షాప్ కి వెళ్ళిన కొవ్వలి నవలలు కనిపించేవి. తెలుగు వారి గుండెల్లో ఆయనకు గొప్ప స్థానం ఉంది” అన్నారు.

పోరంకి దక్షిణామూర్తి, కొమర్రాజు లక్ష్మణరావు వంటి ప్రముఖులు – అలాగే ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో జరిగినప్పుడు సావనీర్ లో శ్రీ గుమ్మా సాంబశివరావు గారు కూడా కొవ్వలి గురించి రాశారు. వెయ్యిన్నొక్క నవలలలో ఈనాడు కొన్ని మాత్రమే లభ్య మవుతున్నాయి. తిరుపతి ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీలో 18 పైనే కొవ్వలి నవలలు ఉన్నాయి. గుంటూరులో శ్రీ లంకా సూర్యనారాయణ గారు కొన్ని సంవత్సరాల నుండి పుస్తకాలను సేకరించి, భద్రపరుస్తున్నారు. వారు ఏర్పరిచిన అన్నమయ్య గ్రంథాలయంలో కొవ్వలి వారి పుస్తకాలు దాదాపు 25 పైనే ఉన్నాయి. “మనసు” ఫౌండేషన్ వారు కూడా తెలుగు సాహిత్యాన్ని చాలా వరకూ డిజిటలైజ్ చేస్తున్నారు. తెలుగు భాష, సాహిత్యాలకు “మనసు” ఫౌండేషన్ వారు చేస్తున్న సేవ భవిష్యత్ తరాలకు గొప్ప వరం అనే చెప్పాలి.

కొవ్వలి వారి వెయ్యిన్నొక్క నవలలలో దాదాపు 80 వరకు పునర్ముద్రణ పొందాయి. చాలా నవలలు నేడు అలభ్యం. ( ఎవరి దగ్గరైనా కొవ్వలి వారి పాత నవలలు ఉంటే తెలియజేయ వలసిందిగా ఈ సందర్భంగా వారి కుమారులు కోరుతూ ఉన్నారు ).

అంతర్యామి … అలసితి….

నూనూగు మీసాల యువకుల నుండి పండిపోయిన ముది వయసువారు, పెద్దగా చదువుకోని మధ్యతరగతి స్త్రీలు వరకు, కటిక పేదలు నుండి కోటికి పడగలెత్తిన సంపన్నులు వరకు కొవ్వలి వారి ‘కొత్త నవల ఎప్పుడొస్తుందా’ అని ఎదురు చూసే వారే. మరి అలాంటి మహా యజ్ఞానికి కొవ్వలి తనను తాను త్యాగం చేసుకున్నారు. తన జీవితాన్ని పణంగా పెట్టారు. పుట్టి పెరిగిన ఊరికి బంధువర్గానికి దూరంగా మద్రాసులో ఉండిపోయారు. దక్షిణ కాశీ గా పేరుపొందిన ద్రాక్షారామంలోని భీమేశ్వరుని గురించి 1001వ నవల “కవి భీమన్న” రాసి, తన భార్య లక్ష్మికి అంకితమిచ్చారు. పుస్తకం ఇంకా ముద్రింపబడలేదు, అంతలో ఎందుకో పిల్లలకి తమ బంధువుల నందరినీ పరిచయం చేయాలని అనిపించింది ఆయనకు.

రెండవ కుమారుడు లక్ష్మీనారాయణను, ఇద్దరు ఆడపిల్లలను తీసుకొని ఆంధ్ర ప్రాంతానికి వచ్చారు…..

కొవ్వలి వారి చిన్న కుమారుడు కొవ్వలి లక్ష్మీనారాయణ, పెద్ద కూతురు రాజ్యలక్ష్మి, చిన్న కూతురు రత్నలత

గోదావరి జిల్లాలలోని అందరినీ కలుసుకొని పిల్లలకు పరిచయం చేశారు….

ద్రాక్షారామం వచ్చారు….. భీమేశ్వరుని దర్శించుకున్నారు..,. ఏమి ప్రార్థించారో, ఏమి నివేదించుకున్నారో…. కానీ సంతృప్తిగా దర్శించుకుని, రాత్రి బంధువు మాణిక్యమ్మ గారి ఇంటిలో నిద్ర చేశారు…!

కానీ అదే శాశ్వత నిద్ర అవు తుందని ఎవరూ ఊహించలేదు!

సూర్యోదయం కాకముందే గుండె పోటు వచ్చింది..!

కారణజన్ముడైన ఆ మహానుభావుడు ఎక్కువ శారీరక బాధ అనుభవించకుండానే… డాక్టర్ వచ్చేలోగానే …

ఆయన ప్రాణదీపం భీమేశ్వరునిలో ఐక్యమై పోయింది.

(చివరి పుస్తకం “కవి భీమన్న”ను ఆయన మరణానంతరం కుమారులు అచ్చు వేయించారు.)

ప్రారంభంలో రాసిన “దాసి పిల్ల” నవలలో భీమేశ్వరుని చరిత్రను కొంత రాశారు. చివరి నవల “కవి భీమన్న”. చివరి రాత్రి భీమేశ్వరుని దర్శించుకొని శాశ్వతంగా వెళ్ళిపోయారు. ఇదంతా యాదృచ్ఛికం అనిపించడం లేదు. ఎప్పుడూ పిల్లలతో భీమేశ్వరుని గురించి ముచ్చటిస్తూ ఉండే ఆయన మనసులోని ఒక గొప్ప “సంకల్పం” అనుకోవాలి. “భీమేశ్వరునితో నాన్నగారికి ఏదో అవినాభావ సంబంధం, రుణానుబంధం ఉంది” అంటారు వారి పెద్ద కుమారుడు నాగేశ్వరరావు.

భౌతికంగా కొవ్వలి మనల్ని వీడిపోయినా ఆయన నవలలు తెలుగు వారి గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నాయి. సాంఘిక నవలలు కావచ్చు, జానపదాలు కావచ్చు, పౌరాణికాలు కావచ్చు. ఏదైనా ఆయన ప్రత్యేకత విలక్షణమైనది. ఆ రోజుల్లో నవలలు సీరియల్‌గా రావటం ఒక పద్ధతి. అలా వచ్చిన వాటిలో ఒకరిది 24 నవలలు ఒక రికార్డు. కొవ్వలి వారి జగజ్జాణ 25 భాగాలుగా వచ్చి ఇప్పటివరకు ఆ రికార్డ్‌ని ఎవరు దాటలేక పోయారు.

ఆ మహత్తర జానపద మిస్టరీ నవలను ముచ్చటించుకుందాం.

జగజ్జాణ ఎవరు? ఆమెకు ఆ పేరు ఎందుకు వచ్చింది? మాయలు ఏమిటి? మర్మం ఏమిటి? మిస్టరీ ఏమిటి? కొవ్వలి వారి ప్రత్యేకత ఏమిటి? 25 భాగాల పాకెట్ సైజు నవలలు ఇంతగా ప్రజాదరణ పొందటానికి కారణం ఏమిటి?

వచ్చే వారమే కథ ప్రారంభం…!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here