Site icon Sanchika

మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-7

[box type=’note’ fontsize=’16’] కొవ్వలి, భయంకర్ పేరుతో రచించిన జగజ్జాణ ఆ కాలం పాఠకులను సమ్మోహితులను చేసింది. ఆనాటి జగజ్జాణను ఈనాటి పాఠకుల కోసం సరళంగా, సంక్షిప్తంగా అందిస్తున్నారు డా. సి.హెచ్. సుశీల. [/box]

మైనాకుడు మురారి నగరాధీశుడైన సింహబలుని కుమారుడు. అల్లారుముద్దుగా పెరగటం వల్ల విద్యలేమి నేర్వక ఆటలందు, చిత్రలేఖన మందు కాలం గడుపుతూ ఉండేవాడు. ఒకనాడు మిత్రులతో వేటకు పోయి మూడు దినాలట్లే తిరిగి అలసి ఉన్న సమయంలో కొందరు సాయుధులైన వారు వారిని చుట్టుముట్టారు. మిత్రులు పారిపోగా, మైనాకుణ్ణి బంధించి ఒక గుర్రానికి కట్టి తీసుకుపో సాగారు. అరణ్యంలో కొన్ని మైళ్ళు పోయిన తర్వాత గుర్రాలూ, వారూ అలసిపోయి ఒకచోట విశ్రాంతి తీసుకుంటుండగా, మైనాకుడు మెల్లగా తప్పించుకొని పారిపోయాడు.

మైనాకుడు చాలా దూరం పరిగెత్తిపోగా ఒక వృద్ధుడు గొడ్డలితో కట్టెలు కొట్టుకుంటూ కనిపించాడు. అలిసిపోయిన అతడిని చూసి ఆ వృద్ధుడు జాలిపడి ఇంటికి తీసుకొని వెళ్లి అన్నపానీయాలు ఇచ్చి ఆదరించాడు. వృద్ధుడైన ఆ ధర్మదాసుకు తన వృత్తాంతాన్ని తెలుపగా, “సుల్తాన్ అమీర్ ఖాన్ నీ దేశాన్ని ఆక్రమించుకొని నీ తండ్రిని హతమార్చాడు. నీకు తెలియదా! నిన్ను బంధించమని ఆ భటులను పంపి ఉంటాడు” అని చెప్పాడు. గత్యంతరం లేక తనను ఆదరించిన ధర్మదాసు బాగా వృద్ధుడై పోవడం వల్ల కట్టెలు కొట్టి సంపాదించే వృత్తిని తాను స్వీకరించి అతనిని విశ్రాంతి తీసుకోమని చెప్పాడు మైనాకుడు.

ఒకరోజు అడవిలో దారి తప్పి చాలా దూరం వెళ్ళిన మైనాకుడికి ఒక పెద్ద మర్రి వృక్షం కనిపించింది. ఆ ఒక్కటి చాలు నెలరోజులకి సరిపోయే కట్టెలు వస్తాయి అనుకొని మొదలు మీద దెబ్బలు వేసాడు. రెండు మూడు దెబ్బలకే చెట్టు నేలకొరిగింది. మొదలు నుంచి ఒక పెద్ద తొర్ర కనిపించింది. అక్కడున్న మెట్ల ద్వారా కిందికి వెళ్ళాడు. సుమారు ఒక వంద మెట్లు దిగాక, మాణిక్య దీప కాంతులతో వెదజల్లే వస్తు సముదాయాలు, వెండి బంగారా లతో నిర్మింపబడిన ద్వారాలను చూసి ఆశ్చర్యపోతూ, పక్క గదిలోకి వెళ్లగానే భయంకరమైన ఆకారంతో, కోరలుతో, నోరు తెరిచి ఎఱ్ఱని పెద్ద కనుగ్రుడ్లతో ఉన్న ఒక పెద్ద ఆకారం కనిపించింది. దాని ముందున్న పళ్లెంలో కణకణలాడే ఎర్రని నిప్పుల్లో ఒకవిధమైన ధూపం వస్తోంది. ధైర్యం చేసి ఆ ఆకారం రొమ్ము మీద ఒక్క గుద్దు గుద్దాడు. కానీ అది ఒక శిలా నిర్మితం అని తెలుసుకొని నిశ్చింతగా మరొక గదిలోనికి ప్రవేశించాడు.

అక్కడ ఉన్నది ఒక అద్భుత సౌందర్యరాశి ఎత్తుగా పోయబడి ఉన్న పూల రాశి మీద నగ్న రూపంలో నిలబడి. మేలిమి రంగు మేని ఛాయతో, పసిడి నిగ్గులు తేలే పరిపూర్ణ యవ్వనంతో చక్కని చుక్క, చెక్కిన శిల్పంలా ఉంది. ఒకవైపు ఆమె దివ్య సౌందర్యానికి అబ్బుర పడుతూనే, పరపురుషుని ఎదుట నగ్నంగా ఎలా నిలుచుంది అని ఆశ్చర్య పోతూ ఉండగా ఆమె పలికింది సుమధురంగా….

“నేను విగ్రహాన్ని కాను. మనిషిని. నా పేరు హేమాంగి. పసిదానిగా ఉన్నప్పుడే ఒక మాయావి అయిన గుండా పకీరు నన్ను ఎత్తుకొని వచ్చి ఇక్కడ ఉంచాడు. పుట్టినప్పటిలాగే నగ్నంగా ఉంచాడు. నాకు ఐదేళ్లు వచ్చే వరకు స్వేచ్ఛగా ఇక్కడ నన్ను తిరిగనిచ్చాడు. యవ్వన ఛాయలు పొడ చూసినప్పటినుండి ఇలా చలనం లేకుండా మంత్రించి నిలిపివేశాడు. అక్కడ ఉన్న కాపాలి విగ్రహానికి పూజలు చేస్తాడు. రక్తంతో అభిషేకాలు చేస్తాడు. దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత మరొక పురుషుణ్ణి చూస్తున్నాను. ఇప్పుడు నీ రాకలో భగవంతుని ప్రేరణ ఉన్నది. నా నగ్న సౌందర్యం నువ్వు తిలకించావు. నిన్ను చూసిన నాలోనూ కొత్త ఆనందం. గుండా పకీరు మంత్రశక్తితో నన్నిలా శిలా ప్రతిమలా చేశాడు. నువ్వు విగ్రహం ముందున్న పళ్లెంలోని భస్మం తెచ్చి నాపై చల్లినట్లయితే నేను కదలగలను. అప్పుడు మనిద్దరం క్రీడా విలాసాలలో తేలియాడవచ్చు” అన్నది ఆమె.

అతడు కాపాలి విగ్రహం దగ్గరకు వెళ్లగానే విగ్రహం మాట్లాడసాగింది.. “నువ్వు నన్ను కొట్టినప్పుడే నీ సాహసాన్ని అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నీ బుద్ధి పరీక్షిస్తాను. నేను అడిగే మూడు ప్రశ్నలకు జవాబులు చెప్పు” అన్న మాటలు కాపాలి నుండి వెలువడ్డాయి.

“సర్వ చరాచర ప్రపంచంలో అందరికంటే మహాభాగ్య వంతుడెవరు?”

“తృప్తి గలవాడు” అన్నాడు మైనాకుడు.

“గుణములన్నిటిలో ఉత్తమ గుణం ఏది?”

“త్యాగ గుణం”

“అధిక సౌందర్యవంతుడు ఎవరు అని చెప్పవచ్చు?”

“సద్గుణ సంపన్నుడు అధిక సౌందర్యవంతుడని చెప్పాలి”

అంతవరకు గిరగిరా తిరుగు తున్న నిప్పుల పళ్ళెం నిలిచింది. కాపాలి విగ్రహం నుండి ఇంక మాటలు రాలేదు. మైనాకుడు భస్మం తీసుకొని వచ్చాడు. కొంత హేమాంగి మీద జల్లి, కొంత దాచి ఉంచాడు. గూండాఫకీరు వచ్చినప్పుడు తిరిగి భస్మం జల్లితే వాడికి అనుమానం రాకుండా తాను నిశ్చల ప్రతిమగా మారతానని ఆమె చెప్పింది.

ఎన్ని దినాలు, వారాలు మైనాకుడు హేమాంగి సర్వసౌఖ్యాలలో తేలియాడారో వారికే తెలియదు. ఒకరోజు గుండాఫకీరు వస్తున్నట్లు గంటల చప్పుడు వినిపిస్తోంది. ఆమె హెచ్చరించినట్లు విభూదిని ఆమె పై జల్లగా ఆమె ప్రతిమా సుందరిగా మారి పూల రాశిపై నిలిచింది. పారిపోయే అవకాశం లేక కాపాలి విగ్రహం వెనుక దాగాడతడు. కానీ బయట మరచి వచ్చిన గొడ్డలి గూండాఫకీరుకి అతని రాకను పట్టి ఇచ్చింది. రాగానే కాపాలిపై, హేమాంగిపై విరుచుకు పడ్డాడు. ఆ సంరంభంలో పరుగు పరుగున బయటపడ్డాడు మైనాకుడు. ఒక్క వూపున ధర్మదాసు ఇంటిలో వచ్చి పడ్డాడు. ‘ఎక్కడికి వెళ్ళావు నాయనా ‘ అంటున్న అతనికి ఏదో సర్ది చెప్పాడు.

మర్నాడు పొద్దున్నే గుమ్మంలో నిలబడ్డాడు గుండా ఫకీరు గొడ్డలి పట్టుకొని. ధర్మదాసు ఎంత చెప్తున్నా వినకుండా మైనాకుణ్ణి లాక్కుపోయాడు హేమాంగి వద్దకు. ఇద్దర్నీ రకరకాల ప్రశ్నలు వేశాడు. తామెవరో గుర్తించనట్లు ప్రవర్తించారు ఇద్దరు. ‘అయితే ఈ కత్తితో నరకు’ అని ఇద్దర్నీ అడిగాడు. వణికి పోయారు ఇద్దరూ. ఆగ్రహావేశ పరుడైన పకీరు “మీరిరువురు రెండు గరుడ పక్షులుగా, ఒకరికొకరు కానకుండా, నపుంసకులై, ఆకాశములో తిరగండి” అని శాపం ఇచ్చాడు. ఇదీ మా కథ. నా హేమాంగి ఎక్కడైనా కనబడితే చెప్పండి” అని ముగించాడు మైనాకుడు.

రాక్షస దంపతులిరువురూ రాగలత జయదేవ్‌లను వేరు చేయడం ఇష్టం లేక ఇరువురిని ఆమె యొక్క అంతఃపురంలోని శయ్య పైకి చేర్చి వెళ్లిపోయారు.

తెల్లవారి మేల్కొన్న జయదేవ్ తన పక్కనున్న జగదేక సుందరిని గాంచి విస్మయం చెందాడు. తానక్కడ ఎక్కువ తడవు ఉండటం క్షేమం కాదని తలచి, ఆమె వేలికున్న రవ్వల ఉంగరం తీసి తాను ధరించి, తన పంచలోహ ఉంగరం ఆమె వేలి కుంచి అక్కడి నుండి వెళ్లిపోయాడు.

చెలులు వచ్చి రాగలతను చూచి ఆశ్చర్యపోయారు. “మూడు దినాలు ఎక్కడికెళ్ళావమ్మా! నీ కోసం వెతికి వేసారి దండోరా వేయించారు రాజుగారు. నిన్ను తానే మాయం చేశాడని మీ తండ్రిగారైన రణధీర్‌ని ఈరోజు ఉరితీయ బోతున్నారు” అని చెప్పారు. ఆ మాట వినగానే కుప్పకూలిపోయింది రాగలత.

జయదేవుడు రాజ్యమంతా తిరగసాగాడు. దివ్యమైన భవనాలు, రమ్యోద్యానవనాలు, తటాకాలు, అంగడులతో అందంగా ఉన్నా – నగరంలో ప్రజలు మాత్రం ఆందోళనతో ఉండటం గమనించాడు. విషయాలు నెమ్మదిగా రాబట్టాడు. మహాబలుడు ఒకప్పుడు మంచి రాజుగా పేరు పొందిన వాడే. సరళాదేవి అనే తన ధర్మపత్నితో ఏమి గొడవ జరిగిందో తెలియదు కానీ, నిర్దాక్షిణ్యంగా కంఠంలో కత్తితో పొడిచి చంపాడు. ఆనాటి నుంచి పట్టణంలోని అందమైన కన్యలను రోజుకొకరిని వివాహమాడటం, రాత్రంతా సుఖించడం, ఉదయమే సంహరించి, పాడుబడినబావిలో కళేబరాన్ని పడటం. ఇలా నూరు మంది పూర్తి అయ్యారు. తనకు కన్యలను వెతికి తెచ్చిన దండనాయకుడు రణధీర్ కుమార్తెను కూడా ఆశించాడు. తల్లి లేని ఆ పిల్ల గొంతుకోయడానికి ఒప్పుకోలేదని రణధీర్‌ని ఖైదు చేశాడు. ఇంతలో ఆ రాగలత మూడు రోజుల నుంచి కనిపించడం లేదు. తండ్రే తప్పించాడని, అతన్ని బహిరంగంగా ఉరితీయాలని ఆజ్ఞాపించాడు మహారాజు. అందుకే అందరూ గుంపుగా చేరు కుంటున్నారు. జయదేవ్ కూడా చేరుకున్నాడు అక్కడికి.

తనకేమీ తెలియదని, కూతురు ఏమైందోనని ఆందోళన పడుతున్నానని విలపిస్తున్నాడు రణధీర్. కఠినంగా శిక్షను అమలు పరచమని ఆజ్ఞాపించాడు మహారాజు. పరుగుపరుగున అక్కడికి వచ్చింది రాగలత. “నా తండ్రి నన్ను మాయం చేయలేదు. నాకేం అయిందో నాకే తెలీదు. నా తండ్రిని విడిచి పెట్టండి మహారాజా. నన్ను వివాహమాడండి” అని రోదిస్తూ ప్రార్థించింది. ఆమెను చూచి రణధీర్ మొదట ఆశ్చర్యానందాలకు లోనైనా, తర్వాత ఎంతగానో వారించాడు. కానీ ఆమె తన తండ్రిని రక్షించుకోవాలన్న దృఢ నిశ్చయంతో ఉంది. వివాహమైతే, మరునాడు కూతురు ఏమవుతుందో ఊహించిన రణధీర్ తనను ఉరి తీయమని గట్టిగా అరిచాడు. మహాబలుడు మొండిగా శిక్షను అమలు చేయమని ఆజ్ఞాపించాడు. అంతలో జనంలో నుంచి జయదేవ్ ముందుకు వచ్చాడు.

 “ఓరీ రాజాధమా! ఇంతవరకు వంద మంది అమాయక కన్యలను బలి చేసి ఇప్పుడీ తండ్రి కూతుర్లను హింసిస్తున్నావా” అంటూ కత్తిని దూసాడు. అతనిని చూసి ప్రజలలో కూడా చైతన్యం కలిగి ముందు కురికారు. రాజు సైనికులకు సైగ చేశాడు. సైనికులు విజృంభించారు. అక్కడంతా రణరంగంగా మారిపోయింది. ఎక్కడివారక్కడ హాహాకారాలతో తరలిపోసాగారు.

మహాబలుడు జయదేవ్‌పై కత్తి విసరగా జయదేవ్ తప్పించుకున్నాడు. అతన్ని ఎవరూ సరిగ్గా చూడనైనా లేదు. ఎవరా సాహసికుడు అని రాగలత కూడా ఆలోచించింది. రాగలత ఒప్పు కుంది కదా అని మహాబలుడు స్థిమితపడి, రణధీర్‌ను సంహరించకుండా, చెరసాలకు తరలించి, రాగలతను సర్వాలంకార భూషితని చేసి రాత్రికి వివాహానికి సిద్ధం చేయమని పరివారానికి ఆజ్ఞలు జారీ చేశాడు.

* * *

రాగలతను రాత్రికి అనువుగా అలంకరణలు చేస్తున్న సమయంలో ఒక చెలికత్తె హడావుడిగా ఒక చిలుకను తీసుకొని వచ్చింది. “మహారాజు గారికి ఎంతో ఇష్టమైన ఈ సారంగి చచ్చిపోయిందని ఎవరు బయట పడవేశారు. ఇది బ్రతికే ఉంది” అంది. మరొకామె భయపడుతూ తానే నన్నది. “కానీ ఇది రెక్కలు కొట్టుకుంటుంది. రాజు గారికి తెలిస్తే ఎంత ప్రమాదం” అని సారంగిని జాగ్రత్తగా తెచ్చింది. “ఎవరూ భయపడకండి. పొరపాటు ఎవరికన్నా వస్తుంది లేమ్మా” అంది సారంగి. దాని మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. గతంలో ఏవో చిన్న చిన్న మాటలు మాట్లాడేది. కానీ ఇంత స్పష్టంగా అయితే లేదు.

(మద్రాస్ లోని ‘స్టూడియో కేతా’ అధినేత అయిన శ్రీ కేతా గారు కొవ్వలి గారి జగజ్జాణ 25 భాగాలకు అందమైన ముఖచిత్రాలను అద్భుతంగా చిత్రించారు. వాటిని మరోసారి చూసి ఆనందిద్దాం.)

చాలా ఇష్టంగా సారంగిని తన చేతుల్లోకి తీసుకుంది రాగాలత. “నీకు ఒక కథ చెప్తాను వింటావూ” అడిగింది సారంగి.

అంతలో రాజుగారు వేంచేశారు. రాగాలత చేయి పట్టుకొని తన పక్కన కూర్చుండ చేశారు. “మహారాజా! మీ చిలుక ఏదో మంచి కథ చెప్తుందట విందామా!” అంది రాగాలత, అతని నుండి కొంత తడవైనా తప్పించు కోవాలనే ఉద్దేశంతో. తనకిష్టమైన సారంగి కథ చెప్పటానికి ఆనందంతో అంగీకరించాడు మహారాజు.

(సారంగి చెప్పబోయే కథ ఏమిటి? మరునాడు ఉదయం యధాప్రకారం మహాబలుడు రాగాలతను సంహరిస్తాడా? గుండా పకీరు శాపం వల్ల పక్షి రూపాలు గా ఉన్న హేమాంగి, మైనాకుడు క్షేమంగా తిరిగి కలుసుకుని, తమ ప్రేమను సార్థకం చేసుకుంటారా? తరువాత ఆ భాగంలో…,.)

(సశేషం)

Exit mobile version