మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-8

6
4

[box type=’note’ fontsize=’16’] కొవ్వలి, భయంకర్ పేరుతో రచించిన జగజ్జాణ ఆ కాలం పాఠకులను సమ్మోహితులను చేసింది. ఆనాటి జగజ్జాణను ఈనాటి పాఠకుల కోసం సరళంగా, సంక్షిప్తంగా అందిస్తున్నారు డా. సి.హెచ్. సుశీల. [/box]

కథ చెప్పటం ప్రారంభించింది చిలుక.

భారతదేశంలో అలకాపురి అనే నగరంలో ఒక శ్రీమంతుని తనయ అవంతి. విద్యా వివేకములు గల అద్భుత సౌందర్యరాశి. చిన్నప్పుడే తల్లి చనిపోగా, ఇటీవల సముద్ర యానంలో తండ్రి కూడా చనిపోయాడు.

ఒకరోజు ఆమె వద్దకు ఒక వృద్ధురాలు వచ్చి తన మనవరాలికి వివాహము కుదిరిందని, పెళ్లి కుమారుడు, వారి కుటుంబం, కొందరు గురువులు వచ్చి ఉన్నారని, వారందరూ ధర్మాత్మురాలైన అవంతి దర్శనం చేయగోరు తున్నారని ఒకసారి ఇంటికి వేంచేయవలసిందిగా ప్రార్థించింది. గర్వం ఏమాత్రం లేని అవంతి ఆ పెళ్లి కూతురు కోసం ఆభరణాలు, ఖరీదైన వస్త్రాలు తీసుకొని ఆ వృద్ధురాలు వెంట బయలుదేరింది. ఆ వృద్ధురాలు కాలినడకన కొంత దూరం నడిచి ఒక దివ్య భవనం ముందు ఆగి అవంతిని లోపలికి తీసుకొని పోయింది. ఆ దేవేంద్ర భవనం లోపల ఉన్నటువంటి వైభవాన్ని చూసి ఆశ్చర్యచకితురాలైనదామె. ఒక ఉన్నతాసనం మీద అవంతిని కూర్చుండబెట్టి ఆమె లోనికేగినది.

ఒక పదహారేళ్ల అందమైన యువతి వచ్చి కుశల ప్రశ్నలడిగి, తన పేరు మనోరమ అని చెప్పి, ప్రేమగా “వదిన” అని సంబోధించడంతో ఆశ్చర్య పోయింది అవంతి. “నీవు పోయిన వసంత ఉత్సవాలకు నాగప్పకి వెళ్ళావు కదా! అక్కడికి మా అన్న మకరంద్ కూడా వచ్చాడు. నీ సౌందర్య సంపదను, దాన గుణమును తిలకించి నీ యందు మనసు కలిగి ఉన్నాడు” అని చెప్పింది. అంతలో అన్నగారు విచ్చేయగా వాళ్ళిద్దరినీ మాట్లాడమని చెప్పి ఆమె లోపలికి వెళ్లి పోయింది.

అవంతి మకరంద్ పరస్పరం మాటలు పంచుకోవడమే కాక మనసులు పంచుకున్నారు. అదే సమయంలో మనోరమ ఆమె భర్త తారాచంద్, దాసదాసీ జనం, బంధుమిత్రులు అందరూ వచ్చి సందడిగా, సంతోషాతిశయములతో వధూవరులుగా అలంకరించి, పురోహిత వాక్యాలతో వివాహ శుభకార్యం కూడా మహా వైభవంగా జరిపించారు.

అవంతి మకరంద్‌లు ఎంతో ఆనందంగా దాంపత్య జీవితం గడుపుతున్నారు. మనోరమకు అన్నతో పాటు వదినంటే ఎంతో ప్రేమ. తారాచంద్ కూడా ఆమె అంటే ఇష్టమే, కానీ అది పలు పర్యాయాలు వాచ్యం చేయటంతో మనోరమతో పాటు మకరంద్‌కి కూడా విసుగ్గా ఉండేది.

వివాహమైన తర్వాత నెల రోజులు కూడా గడవకముందే, హఠాత్తుగా ఒకరోజు అవంతి బావిలోకి దూకింది. ఆమె ఎందుకు ఆత్మహత్యకు ప్రయత్నించిందో ఎవరికీ అర్థం కాలేదు. వైద్యులు వచ్చి ప్రథమ చికిత్స చేసి విశ్రాంతి అవసరమని చెప్పారు. మూడు రోజులుగా మకరంద్ గాని, మనోరమ గాని ఎంత అడిగినా ఆమె సమాధానం చెప్పలేదు. ఆమె బుగ్గ మీద ఉన్నటువంటి మనిషి పంటి గాట్లు చూసి ఆగ్రహావేశ పరుడైనాడు మకరంద్. అతన్ని ఓదార్చింది మనోరమ. అసలు ఏమైందో మకరంద్ అడిగాడు మనోరమను. “మొన్న తను చక్కగా తయారై, అంగడికి వెళ్లి కొత్త చీరలు తెచ్చుకుందాము రమ్మని నన్ను అడిగినది. నాకు తయారయ్యే సమయం లేదని, రుద్రమ్మని తీసుకుని వెళ్ళమని చెప్పాను. వారిద్దరూ వెళ్లి వచ్చారు. ఇంతలో ఇంత ప్రమాదము జరిగినది” అని చెప్పింది మనోరమ. రుద్రమ్మని పిలిచి అడిగినా ఆమె అదే సమాధానం చెప్పింది.

మర్నాడు మనోరమ రుద్రమ్మని పిలిచి ప్రశ్నించగా రుద్రమ్మ ‘మీ అన్న ఇదే అడిగినాడు, నీ భర్త ఇదే అడుగుతున్నాడు, నాకేమీ తెలియదు’ అని విసురుగా వెళ్లబోతుండగా ఆమె చీర చెంగు నుంచి పది బంగారు నాణాలు కింద పడ్డాయి. అవి ఎక్కడివి అని మనోరమ ప్రశ్నించగా ‘అవంతి ఇచ్చింది, హారము చేయించు కోమ’ని అని చెప్పి హడావిడిగా బయటికి వెళ్లి పోయింది. అంతలో అవంతి రాగా “ఏమమ్మా వదినా, రుద్రమ్మకి ఇచ్చిన పది బంగారు నాణాలతో హారం వస్తుందా” అని మనోరమ అనగా “నేను ఎక్కడ ఇచ్చాను బంగారు నాణాలు? ఏమిటో ఈమధ్య ఇంట్లో అన్నీ విచిత్రాలు..” అంటూ అవంతి వెళ్ళిపోయింది. మనోరమకు రుద్రమ్మ ఏదో దాస్తుంది అన్న అనుమానం కలిగింది. భర్త తారానాథ్‌ని పిలిచి అవంతి కొని తీసుకువచ్చిన చీరలు చూపించింది. అతను ఖరీదైన ఆ చీరలను చూసి ‘ఇవి మన దేశంలో తయారయ్యేవి కావు. ఇటువంటి చీరలు దొరికే అంగడి వెదుకుదాం’ అని ఆమెను తీసుకు వెళ్ళాడు.

“కళామందిర్” అని వ్రాయబడి ఉన్న మందిరములోనికి ప్రవేశించింది మనోరమ. స్త్రీలకు మాత్రమే ప్రవేశం అని ఉండటంతో తారానాథ్ బయట గుర్రపు బండి దగ్గరే ఆగిపోయాడు. స్త్రీలకు నచ్చే వివిధ రకాలైన రంగురంగుల చీరలు, అందమైన వస్తువులను ఆశ్చర్యంతో చూస్తున్న మనోరమ దగ్గరకు, అక్కడ ఉన్న మఖమల్ తెరను తొలగించుకొని ఒక వ్యక్తి వచ్చాడు. పచ్చటి శరీరం, చిరుగడ్డం, సన్నని మీసం, తలపై పట్టుటోపి ధరించి ఉన్నాడు. అతనొక మహమ్మదీయుడై ఉంటాడని మనసులో అనుకొంది మనోరమ.

“దయచేయండి రాణి సర్కార్” అన్నాడు.

“నేనే దేశానికీ రాణిని కాను” అంది మనోరమ.

” దేశాలకు కాదు. అందాలకు రాణి అని మా భావం” అన్నాడతను.

మనోరమ రెండు చీరలు తీసుకొని “వీటి ఖరీదు ఎంత” అన్నది.

“రెండు ముద్దులు” అన్నాడతను.

అవంతిని భంగపరిచింది అతడే అని అర్థం చేసుకున్నది మనోరమ. చీరలు తీసి అతని మొహాన కొట్టి వెనుతిరగ పోతుండగా, అక్కడే ఉన్న ఒక మీట నొక్కాడతను. ఒక సాంబ్రాణి లాంటిదేదో ఆమెను చుట్టుముట్టి ఆమె మైకంలో పడిపోయింది. కాసేపటికి తెలివి వచ్చి ఆమె లేచి చూసుకొని వడివడిగా బయటకు వచ్చింది. గుర్రపు బండిలో ఎక్కింది. “బుగ్గ మీద రక్తం ఏమిటి” అని అడిగాడు తారానాథ్. తడిమి చూసుకొని కన్నీటి పర్యంతమైంది. ఇద్దరూ ఇల్లు చేరారు.

అంతలో తెల్లవారిపోయింది. సారంగి కథ చెప్పటం ఆపింది. “కథనం మంచి రసపట్టులో ఆగింది. తర్వాత కథను ఈ రాత్రి కి విందాం” అన్నాడు మహారాజు. “ప్రభూ ఈ రాత్రికి కూడా నేను బ్రతికి ఉంటానా!” అన్నది రాగలత. “సారంగి చెప్పే కథ పూర్తవ్వాలి, నీతో రతి క్రీడలు సంపూర్ణంగా అనుభవించాలి, ఆ మరునాటి వరకు నువ్వు బతికే ఉంటావు” అంటూ రాజు వెళ్ళిపోయాడు.

రాగలత ఆనందంతో సారంగిని తన చేతుల్లోకి తీసుకుంది. చిలుక రెక్కల మధ్యనుండి రవ్వల ఉంగరం కింద పడింది. “ఇది నా ఉంగరం నీకెలా లభ్యమైంది” అని అడిగింది. “నా పంచలోహ ఉంగరం నీ చేతికి ఎలా వచ్చిందో నీ ఉంగరం కూడా నాకు అలాగే వచ్చింది ప్రేయసీ” అన్నది చిలుక.

“ఈ మాయ ఏమిటి? అసలు నువ్వు ఎవరు? నన్ను ప్రేయసి అని ఎందుకు పిలుస్తున్నావు” అని అడిగింది రాగలత.

చిలుక శరీరంలో ఉన్న జయదేవ్ తన వృత్తాంతమును మొత్తం వివరించి చెప్పాడు. నాకు తెలిసిన విద్యలలో “పరకాయప్రవేశం” ద్వారా ఈ చచ్చిపడి ఉన్న చిలుక శరీరంలో ప్రవేశించాను. నా శరీరాన్ని ఉద్యానవనంలో ఉన్న గుబురు మొగలి పొదల మధ్య దాచి ఉంచాను” అని చెప్పాడు. “నన్ను కూడా నీవు చూసావు నీ తండ్రిని ఉరితీయబోయే సమయంలో వచ్చాను” అన్నాడు. “అవును సరిగ్గా చూడలేదు. ఎవరో వీరుడు అనుకున్నాను” అంది రాగలత.

అంతలో సాయుధభటులు వచ్చారు, ఎప్పటిలా మహారాజు సంహరించిన రాణి గారి కళేబరం తీసుకొని వెళ్లేందుకు. “అన్నలారా, నేను మరణించలేదు, మరొక రోజు నా ఆయుష్షు నిలబడింది” అని చెప్పింది రాగలత. వాళ్లు వెళ్లిపోయారు. “నేను చనిపోయానని నా తండ్రి ఎంత బాధ పడుతున్నాడో! నా తండ్రిని ఒకసారి చూడాలి. అలాగే నీ సుందరమైన శరీరాన్ని కూడా ఒకసారి దర్శించాలి” అన్నది రాగలత. “అదుగో నీ చెలులు వస్తున్నారు. రాత్రి నిద్ర లేక బడలికగా ఉందని చెప్పి వారిని పంపి వేయి. తర్వాత రాజు గారి అనుమతి అయిందని చెప్పి చెరసాలకు వెళ్లి నీ తండ్రిని పలకరించి, ఉద్యానవనంలో ఉన్న నా శరీరం పరిరక్షితంగా ఉందో లేదో చూసి రా” అని చెప్పాడు చిలుక శరీరంలో ఉన్న జయదేవ్.

చెలికత్తెలు వచ్చి ప్రాణాలతో ఉన్న రాగలతను చూసి ఆశ్చర్యపోయారు. ఆమె వెళ్ళి పొమ్మని చెప్పగా ‘పోనీలే రేపు ‘పోయే’దానివేగా! ఈ రోజు అన్నా విశ్రాంతి తీసుకో” అని చెప్పి వెళ్లిపోయారు.

ఖైదులో ఉన్న రణధీర్, కూతురు చనిపోయిందన్న వార్త ఎవరి ద్వారా వినవలసి వస్తుందోనని భయపడుతూ ఉండగా “నాన్న” అన్న పిలుపు విని ఆశ్చర్యానందాలకు లోనయ్యాడు. ఒక చిలుక కథ చెప్తూ తనను ఈరోజు రక్షించిందని చెప్పింది రాగలత. ఆ మాటకి కాసింత సంతోషించాడు రణధీర్.

అక్కడ నుంచి అంతపుర ఉద్యానవనం అయిన, దట్టంగా అలముకుని ఉన్న, తరులతా దులతో ఉన్న చిన్న అడవిలా ఉన్నటువంటి ప్రదేశానికి చేరుకుంది రాగలత.

అక్కడ అంతా ప్రశాంతంగా ఉంది.

నిర్మానుష్యంగా ఉంది.

స్తబ్ధత తో నిండి ఉంది.

ఎవరు లేరు.

నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రదేశంలో – “అక్కా… అక్కా..” అన్న పిలుపు ఎక్కడో దూరం నుంచి వినిపిస్తోంది.

ఒక్క గొంతు కాదు… గొంతుకలు… 100 గొంతుకలు. రాగలత ముందుకు నడిచి చూసింది. ఒక బావిలోంచి వస్తున్నాయి ఆ స్వరాలు. తొంగి చూసింది. ఒక పెద్ద బావిలో సగం వరకు ఉన్నాయి కళేబరాలు. ఒక అడుగు వెనక్కి వేసింది. “భయపడకు అక్క. మేము కూడ ఒకప్పుడు నీలాగా అందగత్తెలమే. ఆ రాజు మమ్మల్ని ఈ బావిలో పడ వేశాడు. మా కోరికలు తీరక మరణించి ఇలా పడి ఉన్నాం. నీవే మాకు సాయం చేయాలి” అన్న మాటలు వినిపించాయి. “నేనేం చేయగలను? రేపోమాపో మీలాగే ఇక్కడికి చేరుకునే దాన్నే”అన్నది రాగలత.

“అదృష్టవశాత్తు నువ్వు బ్రతికితే, అంతఃపురానికి దక్షిణ దిక్కులో ఒక తులసి కోట ఉంది. దాని వెనుక ప్రక్క ఒక రాతి పలక మూయబడిఉంది. దానిని తొలగించి నట్లయితే శంఖారావం ముమ్మారు వినపడుతుంది. మూడు శంఖారావాలకు మూడు రక్తపు చుక్కలు నేల పై రాల్చి, లోన ప్రవేశించాలి. అక్కడ “రాజరాజేశ్వరి” మహాబలుని వంశానికి కులదేవత ఉన్నది. ఆ కులదేవతను మరచిన వంశం నిర్మూలన కావాలని దేవి సంకల్పం. కనుకనే మహారాజును వివాహ మాడిన ప్రతి ఒక్కరూ దుర్మరణం పొందారు. ఆ దేవి ఏ విధంగా ప్రసన్నురాలవుతుందో తెలుసుకుని ఆరాధించినట్లయితే, ఆమె ఇచ్చిన తులసీదళంతో మేము అందరం తిరిగి బ్రతుకుతాం. ఆ పుణ్యము నీకు దక్కుతుంది” అని చెప్పారు.

రాగలత వెనుతిరిగి వచ్చేసింది.

***

అక్కడ పాతాళ గృహంలో మైనాకుణ్ణి, హేమాంగిని గరుడ పక్షులుగా మార్చిన తర్వాత గుండా పకీరు ఆపుకోలేని అహంకారంతో కాపాలిని నానా విధాలుగా దూషించాడు. కాపాలి సలహా మేరకు హేమాంగిని వెతుకుతూ బయల్దేరాడు. వేగంగా వెళ్ళటానికి తన దగ్గర ఉన్న తోలు గుర్రమును తీసి నోటితో దాని నిండా గాలిని పూరించాడు. దానిపైకి ఎక్కి కుడి చెవి భాగంలో ఉన్న ఒక సిలను తిప్పాడు. తక్షణమే అది భూమి పై నుండి లేచి అంతరిక్షానికి ఎగిరింది. ఎడమ చెవి భాగంలో ఉన్న మరొక సిలను తిప్పగా దాని వేగం హెచ్చి మేఘ మండలం గుండా ఎగిరిపోవటం మొదలుపెట్టింది. గగన మార్గంలో అనేక పట్టణాలు, పర్వతాలు పైనుండి తిరుగుతూ ఉండగా ఒక ఉద్యానవనంలో తిరుగుతున్న సౌందర్యరాశిని గమనించాడు. హేమాంగికి పక్షి రూపం నుండి తిరిగి ఎలా మానవరూపం వచ్చింది అని ఆశ్చర్యపోతూ కిందకు దిగి వచ్చాడు. తోలు గుర్రం గాలిని తీసి జాగ్రత్త పరుచుకుంటూ ఉండగా కొందరు స్త్రీలు వచ్చి “ఏమమ్మా రాగలత, మహారాజు గారు విచ్చేసే సమయమైంది. నిన్ను అలంకరించాలి పదపద” మంటూ ఆమెని వెంట తీసుకొని వెళ్ళడం గమనించాడు. ‘మహారాజు ఏమిటి, హేమాంగి కదా, రాగలత అంటారేమిటి’ అని ఆశ్చర్య పోయాడు.

రాగలత తిరిగి వచ్చి సారంగితో చెప్పింది ‘మనోహరా, నీవు చెప్పిన ఆ మొగలిపొద నాకు కనిపించలేదు’ అని. ‘రేపు నీతో పాటు ఆ వనంలోకి నన్ను కూడా తీసుకొని వెళ్ళు’ అన్నాడు చిలుక రూపంలో ఉన్న జయదేవ్. అంతలో మహారాజు రావడంతో కథనం ప్రారంభించాడు.

***

(కళామందిర్‌లో ఏమి జరుగుతోంది? అక్కడ ఉన్న ఆ దుర్మార్గుడు ఎవరు? ఆ రహస్యం ఏమిటి? గుండా పకీరు రాగలతను చూసి హేమాంగి అని ఎందుకు అనుకున్నాడు? తరువాయి భాగంలో…)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here