మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-9

2
2

[box type=’note’ fontsize=’16’] కొవ్వలి, భయంకర్ పేరుతో రచించిన జగజ్జాణ ఆ కాలం పాఠకులను సమ్మోహితులను చేసింది. ఆనాటి జగజ్జాణను ఈనాటి పాఠకుల కోసం సరళంగా, సంక్షిప్తంగా అందిస్తున్నారు డా. సి.హెచ్. సుశీల. [/box]

[dropcap]క[/dropcap]ళామందిర్‌లో తనకు జరిగిన పరాభవం అంతా భర్త తారానాధ్, అన్న మకరంద్‌లకు వివరంగా చెప్పింది మనోరమ. అంత పరాభవం పొందింది కాబట్టే ఆత్మాభిమానం గల అవంతి ఆత్మహత్య చేసుకోబోయింది అన్నది.

వెంట తీసుకు వెళ్ళిన రుద్రమ్మకి ఈ కుట్రలో భాగం ఉందని తలచి మకరంద్ ఆమెని పిలిచి బెదిరించాడు. చంపబోయినంత పని చేశాడు. గజగజ వణికి పోతూ తన తప్పును క్షమించమని, “అవంతిని మీరు చెప్పినట్లు ఆహ్వానించడానికి ఆమె ఇంటికి వెళ్తున్న సమయంలో నాకు ఒక సింహళద్వీపవాసియైన మహమ్మదీయుడు ఎదురయ్యాడు. తన కళామందిరానికి వస్తే నాకు ఎంతో లాభం చేసే విషయం ఉందని చెప్పాడు. మీ పెళ్లి అయిన తర్వాత ఒకసారి నేను ఆ అంగడి వెదుక్కొని వెళ్లాను. అతను అక్కడున్న వింతవింత దుస్తులు, అలంకరణలు చూపించి ఒకసారి అవంతిని అక్కడికి తీసుకురమ్మని చెప్పి, ఏం కావాలన్నా ఇస్తాను అని చెప్పాడు. వాడి వస్తువులు అమ్ముకోవడానికి కాబోలు అనుకున్నాను. అవంతికి ఆ చీరల గొప్ప పనితనం గురించి ఎంతో చెప్పాను. మొదటి రానుంది కానీ, తర్వాత ఎంతో చెప్పగా ఒప్పుకొంది. ఆమెను తీసుకొని నేను అక్కడికి వెళ్లాను. నన్ను బైట ఉండమని చెప్పాడు. తర్వాత లోపల ఏం జరిగిందో తెలియదు, అవంతి ఏడుస్తూ వచ్చి బండి ఎక్కింది. ఇంటికి తిరిగి వచ్చాం. వాడు నాకు ఇచ్చిన బంగారు నాణాలు, అవంతి కొన్న చీరలు లోపల పెట్టిన వచ్చే లోపు ఆమె బావిలో దూకింది” అని రుద్రమ్మ తనకు తెలిసినంతవరకు చెప్పింది.

మర్నాడు మకరంద్ స్త్రీ వేషం ధరించి రుద్రమ్మతో పాటు కళామందిర్‌కి వెళ్ళాడు. రుద్రమ్మ లోపలికి వెళ్లి కళామందిర్ యజమాని “లాల్మియా”తో తానొక అందమైన స్త్రీని తీసుకు వచ్చినట్లుగా చెప్పింది. సంతోషంతో ఆమెని ఆహ్వానించాడు. పరిసరాలని గమనిస్తూ, లాల్మియాని సరసమైన మాటలతో మత్తు ఎక్కిస్తూ, స్త్రీ వేషంలో ఉన్న మకరంద్ అతని బుగ్గ మీద బలం కొద్దీ పంటితో గాట్లు పెట్టాడు. అల్లాడిపోతూ వాడు ఆ స్త్రీ జుట్టు పట్టుకొని లాగగా జుట్టు చేతికి ఊడి వచ్చింది. “స్త్రీ రూపంలో వచ్చిన రాక్షసుడా నన్ను మోసం చేస్తావా” అంటూ పరిచారకులని పిలిచి “వీడిని మన ‘విహారి’కి ఆహారంగా వేయండి” అని అరిచాడు. వారందరూ మకరంద్‌ని లాక్కు వెళ్లారు.

కాసేపు వేచి చూసిన రుద్రమ్మ ఇంటికి తిరిగి వచ్చి అవంతికి, మనోరమకి ‘లోనికి వెళ్ళిన మకరంద్ మళ్లీ బయటకు రాలే’దని చెప్పింది. కాసేపటికి తారానాధ్ వచ్చి “కళామందిర్” అన్న ఫలకం ఉంది కానీ అక్కడ ఏ అంగడీ, ఏ మనిషీ కనిపించడం లేదు అని చెప్పాడు. “అయినా నేను కనుక్కొని వస్తాను” అని మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అవంతి తన భర్త మకరంద్ దుస్తులు ధరించి, ఎలాగైనా భర్త ఆచూకీ తెలుసు కోవాలని చీకట్లో బయల్దేరి వెడలిపోయింది. మర్నాడు మనోరమ ముగ్గురిని వెతుక్కుంటూ బయలుదేరింది.

***

పది మంచి కార్యాలు చేసి తమ శాపం నుండి విముక్తులు కావాలని తిరుగుతున్న దుందుభి దంతనాధులకు ఒక వేటగాని బాణానికి గురి కాబోతున్న ఒక పక్షి కనిపించింది. ఆ పక్షిని రక్షించిన తర్వాత అది హేమాంగి అని, మైనాకుని కోసం వెతుకుతున్నది అని తెలుసుకొని దానిని మైనాకుని వద్దకు చేర్చారు. వారిరువురు రాక్షస దంపతులకు అనేకానేక కృతజ్ఞతలు తెలియజేసి, తమ శాపవిమోచనం కూడా తెలియజేయమన్నారు. తమకు తెలియదని, కానీ తమ గురువైన శివస్వామి చెంతకు చేరితే ఆయన చెప్పగలరని, శివస్వామి వింద్యావళీ పర్వత ప్రాంతంలో ఆశ్రమం ఉన్నారని తెలిపారు.

హేమాంగి, మైనాకులు బయలుదేరారు. దారిలో ఒక 12 ఏళ్ల బాలికను తీసుకొని వెళుతున్న ఒక యక్షుని చూచి, అనుమానంతో అడ్డగించారు. భీకర పోరాటం ఆడుతుండగా, మైనాకుని రెక్కలు విరుగగా, హేమాంగి పోరాడు తుండగా, శివస్వామి అక్కడికి వచ్చారు. తను పెంచుకుంటున్న శైలజను ఎత్తుకుపోతున్న యక్షుని శిలారూపం కమ్మని శపించారు శివ స్వామి.

హేమాంగి, మైనాకుల కథ తెలుసుకొని “ఇక్కడికి ఉత్తరంగా 200 యోజనముల దూరం పోయిన యెడల హిమాలయ పర్వత పంక్తులు గోచరిస్తాయి. వాటికి దక్షిణంగా రెండు లోయలు ఉన్నాయి. ఒకటి క్షీరపర్ణి. రెండవది అమృతవల్లి. ఆ రెండు సరస్సులను వరదరాజు అనే ఒక మదపుటేనుగు సంరక్షిస్తూ ఉంటుంది. మీరు ఎంత శ్రమ కైనా ఓర్చి ఆ సరస్సులు చేరండి. నా పేరు చెప్పండి. ఆ ఏనుగు సహాయం చేస్తుంది. మొదటి సరస్సులో మునిగితే మైనాకునికి విరిగిన రెక్కలు మళ్ళీ వస్తాయి. తర్వాత ఇరువురు అమృతవల్లిలో మునిగితే ఇరువురికి పూర్వం మానవ రూపాలు వస్తాయి” అని చెప్పారాయన.

ఎంతో కష్టపడి క్షీరపర్ణి చేరిన తర్వాత మైనాకుడు దానిలో మునిగాడు. కొంత తడవు వేచి ఉన్న హేమాంగితో వరదరాజు ఈ లోపున నీవు అమృతవల్లిలో స్నానమాడమని చెప్పాడు. ఆమె అమృతవల్లిలో స్నానం చేసి, తనపూర్వ మానవ రూపం పొంది వచ్చింది. కానీ భర్త జాడ తెలియక విలపించసాగింది.

ఆమె స్థితికి జాలిపడిన వరదరాజు ఆ నీటిలో తిరిగాడుచున్న ఒక బాతుని పిలిచి, హేమాంగిని దానిమీదకు ఎక్కమని, ఎన్ని అవాంతరాలు వచ్చినా కదలక మెదలక, దాని కంఠమును పట్టుకొని కూర్చొనమని చెప్పాడు. అలాగే నంటూ బాతుపై కూర్చొని సరస్సు లోలోపలకి వెళ్లి పోసాగింది హేమాంగి.

(కళామందిర్‌లో ప్రవేశించిన మకరంద్‌ని ‘విహారి’కి ఆహారంగా వేయమన్నాడు లాల్మియా. విహారి ఎవరు? శివస్వామి శపించిన ఆ యక్షుని వృత్తాంతమేమిటి? సరస్సులో దిగిన మైనాకుడు ఏమైనాడు? బాతుపైనున్న హేమాంగి ఎక్కడకు చేరింది?…… వివరాలు తర్వాత ‘సంచిక’లో.)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here