[ప్రసిద్ధ రచయిత్రి డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి రచించిన ‘మార్పు మన(సు)తోనే మొదలు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. తెలుగులో మానసిక ఆరోగ్యం కేంద్రంగా రచించిన నవల ఇది. ]
***
[dropcap]ఎం[/dropcap]దుకో డా॥ గగన్‌కి నిద్ర పట్టడం లేదు. కారణం తెలియదు. ఆలోచించగా చించగా బహుశః ఆ రోజు పొద్దున్న చూసిన ఒక కేస్ వల్లనేమో అనుకున్నాడు.
***
తాను ఔట్‌రీచ్‌కి చుట్టుపక్కల ఊళ్ళు వెళ్తుంటాడు. అంటే ‘ప్రజల వద్దకు చికిత్స’ అన్నమాట. అక్కడ ఒక రోగిని పరీక్ష చేస్తూండగా, ఒక పేదరాలు లోపలికొచ్చి, తన కొడుకుని అర్జెంటుగా పరీక్ష చేయమని కోరింది. క్యూలో రమ్మని చెప్పాడు తను. ఆమె పట్టు వదలకుండా, “బాబూ ఒక్క పాలి బైటికి రండి.. మీ కళ్ళతో మీరే సూద్దురు”, అని తనని అనునయించబోయింది. ఈ లోగా ఓ పసివాడి గుక్కతిప్పుకోని రోదన వినబడింది.
“అవతల ఎమర్జెన్సీ ఏదో ఎదురయ్యేట్టు ఉంటే నీ గోలేమిటమ్మా! ఈ ఊరొచ్చాక కేసులన్నీ చూస్తే గాని వెళ్ళను కదా! మీ అబ్బాయిని చూశాకనే ఊరెళ్తా, సరేనా?” అని విసుక్కుంటూ బయటకి నడిచాడు. ఆమె తనను వెంబడించినా పట్టించుకోకుండా రోదన వినపడిన వైపుకి వేగంగా వెళ్ళాడు.
అక్కడ జరుగుతున్నది చూసి ఒక్క క్షణం నిర్విణ్ణుడై, వెంటనే తేరుకుని, “ఏం మనిషివయ్యా నువ్వు? చంటాడి మీద చెయ్యి చేసుకుంటున్నావ్?” అని బిగ్గరగా అరిచాడు. వ్యూహాత్మకమైన ఆ అరుపు అవతలి వాళ్ళని బిత్తరపోయేటట్టు చేయడానికే తప్ప తన మనసులోని ప్రశాంతతను భగ్నం చేయడానికి మాత్రం కాదు. “ఈ మెంటలోడితో పడలేక సస్తన్నాను డాటర్ బాబూ.. నానేటి సేసేది ఈడు కోతిలా కుప్పిగంతులేస్తుంటే?” అన్నాడా మనిషి.
ఇంతలో ఆ ఆడమనిషి వచ్చి, “ఈడే మావోడు బాబూ”, అని పిల్లాణ్ణి ఊరడించడానికి ప్రయత్నించింది. డాక్టర్ పిల్లాణ్ణి పరీక్షగా చూశాడు. ఓ నాలుగేళ్ళు ఉండవచ్చు. మెదడు ఎదుగుదల సరిగ్గా లేదని తన అనుభవం చెప్పింది. పరీక్ష చేసి ఎటువంటి చికిత్స చెయ్యాలో నిర్ణయించాలి, అనుకున్నాడు తను.
ఆ పిల్లాణ్ణి చూస్తే డాక్టర్‌కి తన కొడుకు గుర్తు వచ్చాడు.
***
వర్తమానంలోనికొచ్చి, తనకీ, భార్యకి మధ్య పడుకున్న శశాంక్ తల నిమిరాడు. దేవుడి దయవల్ల తను భార్యని మంచి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాడు కనుక, పూర్ణిమ ప్రసవానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులూ ఎదుర్కోలేదు. పాపం పొద్దున్న చూసిన పేదరాలు, మంచి డాక్టర్ వద్దకి వెళ్ళే డబ్బుల్లేక, ఏ మంత్రసాని చేతో పురుడు పోయించుకుని ఉంటుంది.
అప్పుడేమైనా కాంప్లికేషన్ వస్తే పాపం ఆ మంత్రసాని మాత్రం ఏం చేయగలదు? తల్లిని, బిడ్డని కాపాడింది, అదే పదివేలు. కానీ, చదువుకున్న వాళ్ళకే మానసిక రుగ్మతలపై అవగాహన లేని ఈ రోజుల్లో నిరక్షరాస్యులైన వీళ్ళకెక్కడ ఉంటుంది? మళ్ళీ గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు.
***
పిల్లాణ్ణి ముందు ఊరుకోబెట్టడానికి వాడిని తను మాటల్లో పెట్టాడు. “నీకు ఎక్కడికైనా వెళ్ళాలని ఉందా?” అని అడిగాడు. పిల్లాడు ఏడుపాపి, “గుర్రమెక్కి కొండమీదికి వెళ్ళాలి”, అని జవాబిచ్చాడు. తన దగ్గరున్న ఒక పక్షి బొమ్మని చూపించి, “నా దగ్గర గుర్రం లేదుగానీ, నా మాట విన్నావంటే, ఈ పక్షి సాయంతో నిన్ను కొండ మీదకి పంపిస్తాను”, అన్నాడు. అలాంటి పిల్లల్ని పక్కదారి పట్టించగలిగితే, ఆ మొదటి విషయం వాళ్ళకి మళ్ళీ అంత సులువుగా గుర్తు రాదని తనకి తెలుసు.
ఆ తరువాత అతణ్ణి పరీక్షించాడు. ఆ కోపిష్ఠి తండ్రిని కొన్ని ప్రశ్నలడిగాడు. “మీ అబ్బాయిని స్కూల్లో వేశారా?” అని.
“ఏసాం బాబూ, కానీ సదుకోడు. అలాగని ఆటలు కూడా తిన్నగా ఆడడు. అందరితోనూ పేచీ పెట్టుకుంటాడు.
మనం ఏమైనా పన్లో ఉన్నప్పుడు ఆడేమైనా అడిగాడనుకోండి, మనం బదులివ్వలేదనుకోండి – ఇహ సూస్కోవాలి.. రచ్చ రచ్చ సేసేస్తాడు. అసలే లేనోల్లం.. ఉన్న కాసిన్ని సామాన్లూ సొట్ట పెట్టేస్తే ఊరుకుంటామేటి బాబూ.. అందుకే రోజూ నా చేత్తో దండిగా దెబ్బలు తింటాడు గానీ. ఈడితో యేగలేక సస్తన్నాం.. పురిట్లోనే పోయుంటే పీడా పాయే”, అని విసుక్కున్నాడు.
“అలా అనకూడదు.. పాపం చిన్నవాడు కదా! ఇది చెప్పు- ఏవైనా తిళ్ళు తిన్నప్పుడు బాబు ఎక్కువగా తిక్కపెట్టేవాడా?” అడిగాడు గగన్. వాళ్ళమ్మ అందుకుని, “అవునండీ, గుడ్లు తిన్నప్పుడు ఆడి మారాం ఎక్కువయ్యేది”, అంది.
గగన్ అనుకున్నట్టుగానే, ఆ అబ్బాయిని బాధ పెడుతున్న రోగం పేరు అటెన్షన్ డెఫిసిట్ హైపర్ఆక్టివ్ డిసార్డర్ (ఏడీహెచ్‌డీ). అంటే, ఆ పిల్లాడు అత్యంత చురుగ్గా ఉంటాడుగాని, ఏ పనినీ ఏకాగ్రతతో చెయ్యడు. మనుషుల మధ్య ఉన్నా మరో లోకంలో ఉంటాడు. ఇతరుల మాటలకి విలువివ్వడు; తనెంతంటే అంతే; మిగిలిన వారు తనని లెక్క చేయడంలేదని తను అనుకుంటే చాలు, అది నిజమైనా, అబద్ధమైనా, ఇల్లు పీకి పందిరేస్తాడు. ఈ వ్యాధి వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది కూడాను.. అతడి తండ్రి పద్ధతి చూస్తే చాలు, ఈ విషయం బోధపడడానికి.
ఈ వ్యాధి నయమవడానికి మందులు కొంతవరకే సహాయపడతాయి. తల్లిదండ్రులు, చుట్టుపక్కలవాళ్ళు అబ్బాయి పరిస్థితిని ఆర్థం చేసుకుని మెలగాలి. దానికి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఈ ఊళ్ళోనే గనక కౌన్సిలర్ ఉండుంటే ఎంచక్కా రోగులకి, వారి కుటుంబాలకి అవసరరమైన అవగాహన కలిగించి, ఆందోళన చెందుతున్న వారి మనసులు ఉపశమనం పొందేలా చూస్తారు కదా! అని నిర్లిప్తంగా కిటికీలోంచి బయటికి చూశాడు.
మన దేశంలో మానసిక వ్యాధులపై అవగాహన చాలా తక్కువ. ఇంగ్లీషు వైద్యం కోరేవారు మరీ తక్కువ. చాలా మంది భూతమాంత్రికుల్ని ఆశ్రయిస్తారు; వారిచే దోపిడీకి గురౌతారు. పోనీ ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళకి వైద్యం చేసేవాళ్ళు తక్కువ. మానసిక రోగాల గురించి నేర్చుకోవడం అంత సులువు కాదు. దేశంలో అతి తక్కువ వైద్యశాలల్లోనే ఈ చదువు సాధ్యమవుతుంది.
అందుకని, మానసిక రోగులకే వైద్యం చేయడం గగనమవుతున్న మన దేశంలో కౌన్సిలింగ్ అందించడం ఇంకా కష్టం. దేశంలోనే కౌన్సిలర్ల లోటు ఇంకా ఎక్కువగా ఉంది; ముఖ్యంగా జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమంలో, అదే, డిఎంహెచ్‌పిలో అయితే మరీ ఎక్కువ. కౌన్సిలర్ డాక్టర్ డిగ్రీ చదవనక్కరలేదు. కానీ, తనే, అదే డాక్టరే కౌన్సిలింగ్ చేయాలంటే, చాలా సమయం వెచ్చించాల్సి వస్తుంది. అంటే, తన కుటుంబంతో కలిసుండే సమయం తగ్గిపోతుంది.
అయినా సరే, తను చికిత్సలో ఏ మాత్రం తేడా రానివ్వడు. తను చేసేది ఉద్యోగమనుకుని ఉంటే బాధపడుండే వాడేమోగాని, తను చేసేది సేవనుకుంటున్నాడు గనుక శక్తి వంచన లేకుండా సేవలందిస్తూంటాడు.
“బాబూ, మావోడికి నయమవదా?” అని ఆ కోపిష్ఠి అనేసరికి ఎక్కడికో తీసుకు వెళ్తున్న ఆలోచనలనుండి బయటపడ్డాడు తను.
“అబ్బెబ్బే లేదు; నేను చెప్పినట్లు చేస్తే, బాబుకి త్వరగా నయమవచ్చు”, అన్నాడు తను.
“పిల్లాడు, ఆఁ, ఆనంద్, ఏ పనులు చేయగలడో, ఆ పనులే చేయించాలి. తన వయసు వాళ్ళతో పోల్చి, ‘ఫలానా వాడు నీ కన్నా బాగా చదువుతాడు, బాగా ఆడతాడు’, అంటూ అతనిపై ఒత్తిడి తేకూడదు.
మంచి ప్రవర్తన అంటే ఏమిటో నచ్చజెప్పాలి. దానికి తగ్గట్టు అతడు ప్రవర్తిస్తే, వెంటనే మెచ్చుకోవాలి. తప్పుగా ప్రవర్తిస్తే, తిట్టకూడదు, కొట్టకూడదు! ఓపిగ్గా నవ్వుతూ మందలించాలి. కోపంగా వ్యవహరిస్తే, ఆనంద్ మిమ్మల్ని ద్వేషించే ప్రమాదం ఉంది.
పిల్లాడికి మౌనంగా ఉండడం ఒక ఆటలా ఆడించండి. మొదట కష్టపడతాడు, ఆ తరువాత నేర్చుకోవచ్చు. ముఖ్యంగా పెద్దలు మీరిద్దరూ మీ విసుగుని వాడిపై చూపించకూడదు”, అని ఆగి, చీటీ మీద మందులు రాసిస్తూ, “వచ్చే నెల ఇదే రోజున నేనిక్కడికి వస్తాను. అప్పటికి ఆనంద్ పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిద్దాం”, అంటూ అప్పటికి ముగించాడు. వాళ్ళు వెళ్ళిపోతుంటే, ఇది త్వరగా తెమిలే కేసు కాదని, ఆనంద్ తండ్రిలో కూడా మార్పు తెప్పించాలని, మనసులో అనుకున్నాడు.
***
కొంత సేపు మంచంపై అటూ-ఇటూ దొర్లి నిద్రలోకి జారుకున్నాడు గగన్. అతను అందరికీ మేలు జరగాలని కోరుకునే వాడు గనుక ఎవరికి బాగాలేకపోయినా బాధపడే నైజం తనది. రోగికి నయం చేయడానికి శాయశక్తులా కృషి చేసే రకం.
***
“అమ్మగోరూ, మా ఇంటాయన నా మీద సేతబడి సేయిస్తన్నాడండీ! కాపాడండీ!” అంటూ బాలింతైన పనిమనిషి మంజుల భయపడుతూ, తన చంటిపిల్లని చంకనేసుకుని పరుగెత్తుకుంటూ వచ్చింది. పూర్ణిమ ఆశ్చర్యపోయి, “ఏమైంది మంజులా, మీ ఆయన మీద అలాంటి నేరాలు చెప్తున్నావు? మీ ఆయన మంచివాడని చెప్పావు కాదమ్మా?” అంది పూర్ణిమ.
“నేనూ అలాగేననుకున్నానమ్మగోరూ.. నాకు ఆడ బిడ్డుట్టగానే ఆడి మొగం మాడిపోనాది.. ఇప్పడు ఆడెవడో బూతమాంత్రికుడంట.. ఆడిచే చుద్ర పూజెలు సేయిస్తన్నాడు దొంగ సచ్చినోడు..”, అని ఇంకా పరుషపు తిట్లందుకుంది వాళ్ళాయన మీద.
ఆ రోజు ఆదివారం కావడం వల్ల, మిట్టమధ్యాహ్నం కావడం వల్ల, గగన్ లోపలినుండి బయటికొచ్చి, వాళ్ళాయన్ని పిలిపించి విషయం కనుక్కున్నాడు. అతను, “అది చేతబడి కాదండీ బాబో.. పిల్ల పుట్టినాక అది పాలివ్వడం తప్ప గుంటతో ఓ ముద్దూ, మురిపెం.. ఏటీనేదు.. ఆ మజ్జ.. పిల్లేడుత్తా ఉంటే, ఇది దాన్ని ఊరుకోబెట్టకుండా ఏడుత్తా కూకుంది..
మరో పాలి.. నేను బోజనాలకొచ్చే ఏలకి.. గుంట మీద పగడరు డబ్బా అంతా ఒంపేసి.. ‘నిన్న నేను నిన్ను సరిగ్గా సూసుకోలేదు గదా.. అందుకే ఇప్పుడు ముత్తాబు సేత్తన్నా’, అంది.. ఇదేం ఇడ్డూరమండయ్యా..
మొన్నటికి మొన్న.. కత్తితో మణికట్టు కోసేసుకుంటానందండీ.. నాను సమయానికింట్లో ఉన్నాను గనుక.. ఆడపిల్లంటే మొహం మాడ్సుకున్నది నిజమే గాని ఇంటిదాన్ని ఒదులుకోలేను గదండీ.. ఎవరు దానిమీద ఎదవ కల్లేసారో.. ఆ దిట్టి పోడానికి బూత మాంత్రికున్ని పిలిసినాను బాబూ..”, మొరపెట్టుకున్నాడు మంజులపతి.
గగన్ అలోచించి, “మీరిద్దరూ నా మాట వింటారా?” అడిగాడు. వాళ్ళిద్దరూ ఔనన్నట్టు తలూపారు. “రోజూ మంజుల, పాపతో సహా అమ్మగారి దగ్గరకి వచ్చి, సాయంకాలం ఐదు నుండి ఆరు వరకూ గడపాలి, నేనిచ్చిన మందులు క్రమం తప్పకండా మింగాలి. సరేనా?” అన్నాడు భార్యాభర్తలిద్దరూ ఒప్పుకుని వెళ్ళారు.
***
“ఏమిటి గగన్ ఇదంతా? నీ ఉద్యోగాన్ని హాస్పిటల్లోనే ఉండనియ్యి. నీ పేషంట్ విషయంలో నన్ను ఇరికిస్తున్నావు?” అడిగింది పూర్ణిమ. “సీరియస్‌గా అనవులే.. నాకు తెలుసు.. నువ్వు క్లినికల్ సైకాలజీలో ఎంఫిల్ చేశావనే కదా నిన్ను పెళ్ళి చేసుకున్నాను ఆపాటి కౌన్సిలింగ్ చేస్తావులే”, జవాబిచ్చాడు గగన్. “నీ సహధర్మచారిణిని కదా.. ఆపాటి సాయం చేయనా, ఏం?” నవ్వుతూ అంది పూర్ణిమ.
“అయితే, మా డిఎంహెచ్‌పిలో కౌన్సిలర్‌గా వచ్చెయ్యవోయ్”, అన్నాడు గగన్. “అమ్మో, ఇంకేమన్నా ఉందా? నువ్వు నన్ను ప్రమోట్ చేస్తున్నావని మీ హెడ్‌క్వార్టర్స్ వాళ్ళకి ఫిర్యాదులెళ్ళవూ?” మళ్ళీ నవ్వుతూ అంది పూర్ణిమ. ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు.
గగన్ పూర్తిగా మానసిక రోగుల వైద్యానికే అంకితం అవుతాడు గనుక తను సీరియస్‌గా అలా అన్నా ఆశ్చర్యంగా ఉండదు పూర్ణిమకి. కానీ, తనకి మాత్రం శశాంక్ పెద్దయ్యేదాకా ఉద్యోగం చేసే ఉద్దేశం లేదు. ఆ విషయం గగన్‌కి తెలుసు కనుక ఆమె ఉద్యోగానికి సంబంధించిన ఏ సంభాషణైనా నవ్వులతోను, ఛలోక్తులతోను ముగుస్తుంది.
***
“గగన్, అమ్మకి ఒంట్లో బాలేదని నాన్న ఫోన్ చేశారు. నేను శశాంక్‌ని తీసుకుని ఈ రోజు సాయంత్రం బండికి బయల్దేరుతాం. నువ్వు కూడా వస్తే బాగుంటుంది”, అంది పూర్ణిమ. ఆశ్చర్యపోయిన గగన్, “అరెరే.. అసలు ప్రాబ్లం ఏమిటి?” అనడిగాడు. “ఏదో గైనిక్ విషయం అన్నారు”, అంది పూర్ణిమ.
“నేను పిచ్చి డాక్టర్నమ్మా.. నువ్వు గైనిక్ విషయాలలో నన్ను ఎందుకు ఇరికిస్తావ్?” అన్నాడు. “అదే అర్థం చేసుకోవాలి. నీకు సంబంధమున్న ప్రాబ్లం బాబూ.. మెనోపాజ్.. ఎప్పుడూ అంటావుగా.. ఆడవాళ్ళకి ఆ సమయంలో సైకియాట్రిక్ సపోర్ట్ అవసరమని.. అందుకే రమ్మంటున్నా!” జవాబిచ్చింది పూర్ణిమ. “సరే అయితే. సెలవు పెట్టొస్తా”, అన్నాడు గగన్.
***
మరి కొద్ది సేపటికి, “సారీ డియర్, రిలీవర్ లేకపోవడంవల్ల లీవ్ శాంక్షన్ అవలేదు. నువ్వు మాత్రం ఎప్పటికప్పుడు నాకు విషయాలు చెప్తూ వుండు”, అని చేతులెత్తాడు గగన్. చేసేదిలేక పూర్ణిమ కొడుకుతో సహా ఊరికి బయల్దేరింది. ‘ఇదేదీ కొత్త విషయం కాదు. పురుడు పోసుకునేటప్పుడు కూడా ఇదే ప్రాబ్లం. డిఎంహెచ్‌పి ప్రోగ్రామింగే అంత. ఒక రిలీవరుండడు.. ఉద్యోగం చేస్తున్న వాడికి సెలవు దొరకదు. ఆఖరుకి, శశాంక్ పుట్టిన తరువాతొచ్చే ఆదివారంనాడు వచ్చి కన్నకొడుకుని కన్నాడీ కన్నతండ్రి’, అని గుర్తుకి తెచ్చుకుంది.
***
‘పిల్లాడి బారసాల, తొట్లో పెట్టడం వగైరా ముచ్చట్లకి ఆదివారం రోజో, లేదా వేరే సెలవు రోజో సరిచూసుకుని ముహూర్తం పెట్టుకోవలసి వచ్చింది. ఏదో దేవుడి దయవల్ల, గగన్ ఆరోగ్యవంతుడు గనుక సెలవు పెట్టేంత జ్వరాలూ గట్రా రాలేదుగాని, వస్తే ఏమైయ్యుండేదో ఈ డిఎంహెచ్‌పి?’ అని మనసులోనే విసుక్కుంది పూర్ణిమ. అంతలోనే, నాలుక కరుచుకుని, ‘ఛీ, ఛీ, ఇదేం పాడు ఆలోచన? డిఎంహెచ్‌పిని ఆడిపోసుకోవడానికి గగన్‌లి వాడుకుంటున్నానేమిటి?’ అని తనని తనే మనసులో కసురుకుంది.
***
“నాన్నా, అమ్మకెలా ఉంది?” అడిగింది పూర్ణిమ. తలపట్టుకుని కూర్చున్న ఆయన, నీరసంగా, “ముప్ఫై ఏళ్ళ మా కాపురాన్ని చాకిరేవులో బండకేసి చితకబాదినట్టు బాదుతోంది. ఏమీ చేయలేక తలపట్టుకుని కూర్చున్నాను”, అని జవాబిచ్చినంతలోనే, “మళ్ళీ మొదలెట్టారూ! ఇన్నేళ్ళుగా చేసిన గొడ్డు చాకిరీకి విలువ లేదు గానీ, సిగ్గు లేకుండా మీ కూతురితో చెప్తున్నారా, చాడీలు? రోజురోజుకీ మీకు సిగ్గు లేకుండా పోతోంది”, అని దూదేకినట్టు వాళ్ళాయన్ని ఏకి పారేసింది సుధ.
మళ్ళీ, కాలుగాలిన పిల్లిలా వెంటనే ఆ గదిలోంచి నిష్క్రమించింది. “పూరీ, చూశావూ, మీ అమ్మ వాలకం? తలపట్టుకోక వేరేం పట్టుకోను?” అన్నాడు రామారావు. పూర్ణిమ మౌనంగా ఉండి, ఆలోచించింది. పరిస్థితి చేయిదాటేలోపు మందులు పడాలి. గగన్ లేడుగా, ఎలా?
ఈలోగా వాళ్ళ నాన్న, “పేరుకి సుధగాని, నోరు తెరుస్తే చాలు, చేదు మాటలూ, విషపు తిట్లూను!” అని గుసగుసలాడాడు రామారావు. ‘అసలే అమ్మ మండిపడుతూ ఉంటే, ఈ చాడీలిప్పుడవసరమా?’ అన్నట్టు పూర్ణిమ చూసింది తండ్రి వైపు. నిస్సహాయంగా చూశాడాయన.
***
అల్పాహారాలూ, వగైరా అయిన తరువాత, సుధ దగ్గరకెళ్ళి, “అమ్మా, మనమిద్దరం కలిసి ఒక ధ్యానం చేద్దామా? ఇది చేస్తే బోలేడంత బలమొస్తుంది. నేను ట్రై చేశాను”, అని మొబైల్లో సద్గురు ఆప్ ఆన్ చేసి, ‘చిత్త శక్తి’ ధ్యానాలలో ఒకటైన ఆరోగ్య ధ్యానం పెట్టింది. సద్గురువుగారి గొంతు వశీకరించినట్టయి, సుధ ఇందాక భర్తని ఏ స్థాయిలో ఆడిపోసుకుందో, అదే ఏకాగ్రతతో ధ్యానంలో లీనమైపోయింది.
గగన్ ఎప్పటిలాగే ఆదివారం రోజొచ్చి అత్తగారిని మాటల్లో పెట్టాడు. అవిడకి చిన్నప్పుడు నెలసరి సమయాల్లో ఎటువంటి అనుభవాలు కలిగేవో కనుక్కున్నాడు. ఆవిడకి ఆ సంభాషణ అంత నచ్చుబాటుగా లేదని ప్రస్ఫుటంగా తెలుస్తోంది. అయినా ఆవిడ చిన్నతనంలో పీఎమ్మెస్ సమస్య అనుభవించిందో లేదో కనుక్కున్నాడు.
ఓ అరగంట తరువాత, పూర్ణిమకి మందులు రాసిచ్చి, మళ్ళీ ఊరెళ్ళిపోయాడు. “అవునూ, అల్లుడు గైనిక్ డాక్టర్ కాడు కదా! ఏదో అల్లుడు కదా అని జవాబు చెప్తుంటే, నాతో ఆ మాటలేవిఁటి? ముసలి పీనుగుని, పైగా అత్తగారిని, కొద్దిపాటి గౌరవమైనా ఉండక్కరలేదూ? హవ్వ, హవ్వ! బుద్ధి ఉందా, లేదా? ఇంకా, ఏవో మందులూ, గట్రా రాసిచ్చినట్టున్నాడేవిఁటీ?” అనుమానంతో అడిగింది సుధ. పూర్ణిమ అటూ ఇటూ చూసి, సుధ చెవిలో విషయం చెప్పింది.
(ఇంకా ఉంది)