మార్పు మన(సు)తోనే మొదలు-12

1
1

[ప్రసిద్ధ రచయిత్రి డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి రచించిన ‘మార్పు మన(సు)తోనే మొదలు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. తెలుగులో మానసిక ఆరోగ్యం కేంద్రంగా రచించిన నవల ఇది.]

[ఒకరోజు జాయ్ – గగన్‍కి ఫోన్ చేసి, కామాక్షి గురించి అప్‍డేట్ ఇస్తాడు. మతిభ్రమించిన కారణం చేత పిల్లల హత్యానేరం కేసు కొట్టేసారని, ఆవిడ ఇప్పుడు గగన్ ఔట్‍రీచ్‍లో ఉంటోందని, గగన్‍ని కలవమని చెప్పానని చెప్తాడు.  త్రయంబకేశ్వర్ ప్రసంగం వినడానికి గగన్, నిరూప్, ప్రభాత్ కారులో బయల్దేరుతారు. జాన్ నాష్ స్కిజోఫ్రెనియాతో పడిన బాధల గురించి ప్రభాత్, గగన్ చర్చించుకుంటారు. నిరూప్ పక్కన ఉండగానే ప్రభాత్ ఇలా మాట్లాడడం గగన్‌కి ఆనందాన్నిస్తుంది. పరిచయాలు పూర్తయ్యాకా, త్రయంబకేశ్వర్ తన ప్రసంగాన్ని మొదలుపెడతాడు. మొదట్లో తనెంత ఉత్సాహంగా ఉండేది, ఎన్ని ఘనతలు సాధించినది చెప్పి, ఆ తరువాత తనలో క్రమక్రమంగా వచ్చిన మార్పు గురించి సభికులకు చెప్తాడు. ఒత్తిడి పెరిగిపోయి మానసిక వ్యథకి గురయి ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాననీ, భార్యా బిడ్డలకి దూరమయ్యానని చెప్తాడు. థాయ్‍లాండ్ ట్రిప్‍కి వెళ్ళినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనిపించి సముద్రంలో ప్రయత్నిస్తే లైఫ్ గార్డ్ కాపాడాడని చెప్తాడు. తర్వాత ఆత్మావలోకం చేసుకుని సైకియాట్రిస్ట్‌ని కలిసి, ఇది బై-పోలార్ జబ్బు అని తెలుసున్నాననీ, మందులు రెగ్యులర్‍గా వాడానని చెప్తాడు. తర్వాత నెగెటివ్ ఆలోచనలు ఎప్పుడు, ఎలా వస్తాయో, వాటిని ఎలా ఎదుర్కోవచ్చో నేర్చుకున్నానని వివరిస్తాడు. మానసిక రోగాలు, వాటిని ఎదుర్కొనే విధానాలు – అన్నీ నేర్చుకున్నాననీ, ఇవన్నీ జరగడానికి ఒక దశాబ్దం పట్టిందని చెప్తాడు. తనకి స్ఫూర్తినిచ్చిన మహిళ గురించి సభికులకు వివరిస్తాడు. సభ ముగిసాకా, బయటకి వస్తుండగా – అమిత కలిసి తను ఆరోగ్యవంతురాలిని అయ్యానని గగన్‍కి చెప్తుంది. తిరిగి వస్తుండగా ప్రభాత్ ముభావంగా ఉండడం చూసి కారణమడుగుతాడు గగన్. తన ప్రవర్తన వల్ల తాను చాలా నష్టపోయానేమోనని అనిపిస్తోందని అంటాడు ప్రభాత్. నిరూప్ ముందే ఈ సంభాషణ జరిగినా సంభాషణలో జోక్యం చేసుకోకపోవడం నిరూప్‍లోని సంస్కారాన్ని సూచిస్తోందని గగన్ భావిస్తాడు. అతడికి మగ నర్స్ ఉద్యోగం ఇప్పించవచ్చని అనుకుంటాడు. – ఇక చదవండి.]

[dropcap]కు[/dropcap]శల ప్రశ్నలూ-పిచ్చాపాటీ అయ్యాక అసలు విషయం చెప్పాడు దివిజ్. “దివిజ్, నేను వింటున్నది నిజమేనా? షాక్ మీద షాక్ ఇస్తే ఎలాగయ్యా?” అని ఇప్పటికీ తగ్గని ఆశ్చర్యంతో అడిగాడు గగన్.  “అవును అంకుల్”, నవ్వుతూ సమాధానం ఇచ్చాడు దివిజ్. “నేను మీకంతా వివరిస్తానుండండి. నేను ఒకొక్క విజయం సాధించినప్పుడు నా ఐశ్వర్యం పెరిగింది గానీ నా మనసులో సంతోషం పెరగలేదు. ఏదో వెలితిని ఫీల్ అయ్యేవాణ్ణి.”

“విజయం అంటే ఏమిటి? నేను, మా బ్యాంక్- ఈ ఇద్దరూ బాగుపడితే సరిపోతుందా? నేను క్యాట్ పరీక్ష రాసినప్పుడు, మా అమ్మ, ‘బెస్ట్ పిల్లలు క్వాలిఫై అవా’లని దేవుణ్ణి ప్రార్థించింది. వాళ్ళొస్తేనే దేశానికి, ప్రపంచానికి మేలు జరుగుతుందట. బిజినెస్, విలువలతో కూడి ఉంటుందట. అమ్మ ఎప్పుడూ చెప్పేది- అందరూ కలిసి ముందుకు వెళ్తేనే అది విజయం అట. కొందరు మాత్రమే పురోగమిస్తే అది స్వార్థమట.”

“ఈ రోజుల్లో మనం ఫ్రాడ్‌లకి ఇచ్చే ప్రాముఖ్యం నిజంగా అవసరమైన వాటికి ఇవ్వడం లేదు. అమ్మ నాతో అనేది, ‘మనం సోషల్ స్టడీస్‌ని ఎప్పుడైతే లెక్కపెట్టకుండా అంకెల వెంట పడ్డామో, అప్పుడే మనం విలువలకి తిలోదకాలు ఇచ్చేశా’మని! ఆఫ్ కోర్స్, దీనిమీద గట్టిగా వాదించచ్చు. ఒకప్పుడు పెడదారిలో డబ్బు సంపాదిస్తే, సంఘంలో మర్యాద ఉండేది కాదట కదా! ఎందుకంటే, ఆ పెడదారి అందరికీ అర్థం అయ్యేది.”

“నేను సంపాదించుకున్న మిలియన్ల డాలర్లు అక్విజిషన్ పేరుతో సామాన్య ఉద్యోగుల పొట్టలు కొట్టి సంపాదించింది, అనిపించింది. వెంటనే, నా దేశంలో జనాలకి ఏమైనా చెయ్యాలనిపించింది”, అన్నాడు దివిజ్. నిర్విణ్ణుడయ్యాడు గగన్. “ఈ మధ్యన ఇలాంటి థీమ్స్‌తో తెలుగు సినిమాలు వచ్చాయి. వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యావా?” అడిగాడు గగన్.

“అమ్మ నేర్పిన విలువలు నా దగ్గర భద్రంగా ఉన్నాయి. ఒక సిక్ ఫర్మ్ కోలుకునేందుకు వీలుగా అక్వైర్ చేస్తూన్నామనుకున్నాను, కానీ ఇందులో, చాలా మంది నిరుద్యోగులు అవుతారన్న విషయం నేను గమనించలేదు. లెక్కల పండితుణ్ణి కదా!…” ఇంకా ఏదో చెప్పబోతున్న దివిజ్‌ని అడ్డుకుని, “పోయే ఉద్యోగాలు ఎలాగూ పోతాయి కదా, అని అనిపించలేదా? నువ్వు ఆ కంపెనీని బతికిస్తే మాత్రం వాళ్ళ ఉద్యోగాలు నిలబడేవా, ఏం?” అని అడిగాడు గగన్.

“యెస్ అంకుల్, ఆ విషయం నాకు తెలుసు. కానీ ఆ పని నా చేత్తో చేయబుద్ధి కాలేదు. కొత్త మేనేజ్మెంట్ వీళ్ళకే ఉద్యోగాలిస్తుందన్న గ్యారంటీ ఎప్పుడూ ఉండదు. అందుకే ఆ రాట్‌ రేస్‌ని వదిలి..”, అని చెప్పేలోపు మళ్ళీ అడ్డుతగిలాడు గగన్.

“నువ్వు ఉద్యోగం నా వల్ల మానేశావని మీ అమ్మానాన్నలు అనరు – ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోగలరు. మిగిలిన వాళ్ళంటే నాకు ఫరవాలేదు. కొన్నాళ్ళకి, ‘అరే, తప్పు చేశానే, ఈ గగన్ అంకుల్ రాట్‌ ‌రేస్ అనే మాట అనకుండా ఉంటే, నేను ఆ ఉద్యోగం వదులుకోకుండా, ఇంకా డబ్బులు గడించి, ఫోర్బ్స్ లిస్ట్‌లో నా పేరు చూసుకునే అవకాశాన్ని దక్కించుకుని ఉండేవాణ్ణి’, అని బాధపడతావా?” అడిగాడు గగన్.

“హహహ.. నన్ను టెస్ట్ చేస్తున్నారు అంకుల్ మీరు! నేను నా బాధతో కోప్ అప్ అవడానికి మిగిలిన వాళ్ళ మీద నెపాలు పెట్టను. నేను తీసుకున్న నిర్ణయం ఫెయిల్ అయితే నాదే బాధ్యతా, పూచీను. సరేనా?”

“మెంటల్ హెల్త్‌లో ఏవైనా చేద్దామని డిసైడ్ అవడానికి కారణం మాత్రం మీరు. నింహాన్స్‌లో అప్పటి వరకూ ఉన్న బాచ్ టాపర్స్‌లో మీరే టాపర్. అంటే, టాపర్ ఆఫ్ ద టాపర్స్! అలాంటి మీరు ఏది కావలిస్తే అది చేసి ఉండొచ్చు.”

“ఏ కెనడాకో, ఆస్ట్రేలియాకో వలస పోయుండొచ్చు. కానీ మీరు దేశభక్తులు గనుక ఆ పని చేయలేదు. పోనీ, నింహాన్స్ లాంటి విశ్వవిఖ్యాత వైద్య కళాశాలలో ప్రొఫెసర్‌గా ఉంటూ, పరిశోధనలు చేస్తూ ప్రపంచంలోని నలుమూలలా రిసర్చ్ పేపర్లు సమర్పించొచ్చు. ఊహూ, మీరు అది కూడా చేయలేదు. మాంచి లైఫ్‌స్టయిల్‌ని ఇవ్వగలిగే మెట్రో సిటీలలో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో కన్సల్టెంట్‌గా ఉండి డబ్బుని కుప్పలుతెప్పలుగా సంపాదించి ఉండొచ్చు. ప్చ్, అదీ చేయలేదు!”

“మీరు మాత్రం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్‌లో, తక్కువ జీతానికి, మానసిక వైద్య సేవలను అందించారు, ఎటువంటి ఫలాపేక్షా లేకుండా! అందుకే, మీరు మ్యాగ్సేసే అవార్డు పొందారు. దాని గురించి నాకు తెలుసు లెండి. ఆసియా దేశాల్లో గుర్తింపుని ఆశించకుండా తమ పరిధిలో సేవ చేసే వ్యక్తులకు గుర్తింపునివ్వడమే ఈ పురస్కారపు ముఖ్యోద్దేశం. నిజమే, ఒక మానసిక వైద్యుడి సేవను రోగులు కూడా గుర్తించరు. అందుకనే ఈ స్థితప్రజ్ఞుడికి ఈ అవార్డు లభించిందని గ్రహించలేనా అంకుల్?”

“మీరు గొప్ప పనులు చెయ్యొచ్చు గాని, ఈ పూర్ దివిజ్ మాత్రం మ్యాన్‌హట్టన్‌లో జాబ్ వదులుకుని, వేన్నీళ్ళకి చన్నీళ్ళలా, మానసిక ఆరోగ్యంపై పిల్లల్లో అవగాహన పెంచడానికి ఒక ఎన్‌జి‌ఓని స్థాపిస్తాడంటే తప్పుపడుతున్నారు. మంచి పనులు మీ కాపీరైట్ కాదు కదండీ అంకుల్? అందుకే, అన్యాయం, అక్రమం అధ్యక్షా!” అని చమత్కారంతో వాద ప్రతివాదాలకి తెర దించాడు దివిజ్. గగన్ మెచ్చుకోలుగా, “గట్టి పిండానివే బుజ్జీ! ఈపాటి స్ట్రాంగ్‌గా లేకపోతే, ఇక్కడ బతకలేం!” అన్నాడు.

ఈలోగా వంట అబ్బాయి టీ తెచ్చి టీపాయ్ మీద పెట్టాడు.కప్పుని దూరం నుండి చూస్తూ, “ఈపాటి స్ట్రాంగ్‌గా లేకపోతే, దాన్ని త్రీ రోజెస్ టీ అనరు”, అంటూ మళ్ళీ చమత్కరించాడు దివిజ్. “గుడ్. కానీ, మనింట్లో వాడే టీ టైఫూ ఆరెంజ్ ఇన్ఫ్యూషన్. తాగి చెప్పు బాగుందో లేదో! పూర్తిగా కఫెయిన్ ఫ్రీ”, అన్నాడు గగన్. ఒక సిప్ చేసి, “ఊఁ, చాలా బాగుంది అంకుల్. థాంక్ యూ ఫర్ ద టీ”, అన్నాడు దివిజ్.

“మరి మన ప్రణాళిక ఏమిటి?” అడిగాడు గగన్. “ఇప్పటికి టూకీగా మాత్రమే చెప్పగలను. ఎన్‌జి‌ఓ పేరు, ‘జవాబుల జల్లు’. ఎలా ఉంటుంది ఆ పేరు?” అని గగన్ అభిప్రాయాన్ని అడిగాడు. “బాగానే ఉంది, ప్రశ్నలు లేకుండా జవాబుల జల్లు ఎలా కురిపిస్తావ్?” అడిగాడు గగన్. “పాయింటే! ‘ప్రశ్న మీది- జవాబు మాది’- ఈ టైటిల్ బాగుందా అంకుల్?” ఆమోదముద్ర కోసం చూస్తూ అడిగాడు దివిజ్.

“బాగుంది, ఈ మధ్య వచ్చే టీవీ ప్రోగ్రాంల లాగా! కానీ, ఎక్కువ కాలం మన్నే ఒక పేరు చెప్పనా? ‘మార్పు మనతోనే మొదలు’. ‘ఎలా ఉంది ఎలా ఉంది అబ్బాయా’”, అనే పాత పాట లంకించుకుని, “ఇప్పుడు చెప్పు, వాట్ ఇస్ ది ప్లాన్?” అడిగాడు గగన్. “చాలా బాగుంది అనుకుంది మదిలోలో”, అని కొత్త పాటతో జవాబిచ్చాడు దివిజ్.

“ఇక ప్లాన్‌కి వస్తే- కాచ్ దెమ్ యంగ్- ఇదే మన పిలుపు, ప్రజలకి మేలుకొలుపు. మానసిక ఆరోగ్య పరిరక్షణ గురించి స్కూల్ పిల్లలకి చెప్దాం. వాళ్ళకి ఉండే సందేహాల గురించి డాటాబేస్ తయారు చేసి, ఫాక్స్, అదే ఫ్రీక్వెంట్లీ ఆస్క్‌డ్ క్వశ్చన్స్ తయరు చేద్దాం. కామన్‌గా పిల్లలకి ఉండే అనుమానాలు, భయాలని విశ్లేషించి, ప్రత్యేక సదస్సులు పెట్టి, ఆంటీ లాంటి వారు, అంటే, స్వచ్ఛందంగా పాల్గొనే సైకాలజిస్ట్‌ల చేత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పిద్దాం.”

“ఉత్తీర్ణత-విజయం రెండూ పర్యాయ పదాలు కాదని, లైఫ్‌లో బాలన్స్, అదే సంతులనం చాలా ముఖ్యమని, కొన్ని కేస్ స్టడీస్‌తో వాళ్ళకి బోధపరుద్దాం. నా బాచ్‌మేట్, కార్తీక్ వైద్యనాథన్, మద్రాసులో ‘ప్లే-టు-లర్న్’ అనే స్టార్టప్ పెట్టాడు. వాడి సాయం తీసుకుని పిల్లలు జీర్ణం చేసుకోవలసిన ముఖ్యమైన విషయాలని ఆటల ద్వారా నేర్పిద్దాం.”

“రాట్‌ రేస్‌లో గెలిచినంత మాత్రాన మనిషి సింహం గాని, మరేదైనా కూడా అవడని, ఎలుకగానే మిగిలిపోతాడని చెప్పడానికి నా అనుభవం పంచుకుంటాను. ఇంకా ఒక ముఖ్యమైన విషయం- ఆత్మహత్య వైపు మొగ్గే నైజం ఉండే పిల్లలని నెమ్మదిగా, ఓపిగ్గా కనిపెట్టి, కౌన్సిలింగ్ చేయిద్దామని నా కోరిక.”

“స్కూల్ పాఠ్యాంశాల్లో మానసిక ఆరోగ్యపు అవగాహన ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా. ఎయిడ్స్ గురించిన విషయాలు పిల్లలతో చర్చిస్తుంటే, మానసిక రుగ్మతల గురించి మాట్లాడుకోవడంలో తప్పేమిటో నాకు పాలుపోవట్లేదు. విద్య అనేది రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి చెందిన విషయం కాబట్టి, తెలిసిన వాళ్ళ ద్వారా స్టేట్ లెవెల్లో దీనికోసం ట్రై చేయాలి”, సీరియస్‌గా అన్నాడు దివిజ్.

“అబ్బో, లాబీ చేసేంత పెద్దవాడివి అయిపోయావా?” వెటకారంగా అన్నాడు గగన్, దివిజ్‌లో పూర్వాశ్రమ కార్పొరేట్ వాసనలు ప్రకటితమౌతుంటేను. “అంకుల్, ప్లీజ్, అపార్థం చేసుకోకండి. నెట్వర్కింగ్ అందరూ చేస్తారు. అందులో స్వార్థం ఉందో లేదో అర్థం చేసుకోవాలి. ఇందులో మనకేమైనా ముడుతుందా, సంతోషం తప్ప?” ముక్కుకి సూటిగా జవాబిచ్చాడు దివిజ్.

మళ్ళీ తనే, “మన దేశపు మానసిక ఆరోగ్య విధానం స్టడీ చేశా. అందులో మానసిక దివ్యాంగులకి కొన్ని సదుపాయాలుండాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది, అన్నారు. మనం కాస్త నిలదొక్కుకున్నాక, లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్, అదే బ్రతుకు తెరువు కోసం కావలసిన నైపుణ్యాన్ని అందించడానికి ప్రయత్నిద్దాం. మన ఎన్‌జి‌ఓ ముఖ్యంగా నిరుపేదలకు, అంటే, డి‌ఎం‌హెచ్‌పికి సంబంధించిన రోగులకి సేవలని అందిస్తుంది. ఖాళీలుంటే మిగిలిన వారికి కూడా అందించొచ్చు, కొంత రుసుము వసూలు చేసి.”

“ఇప్పుడు చెప్పండి, ఒక్కణ్ణీ పరుగెత్తి, ముందుండడమే మనుగడ అనుకునే ఆ ఉద్యోగం ఎక్కడ? మనం వెనుకపక్క కాపు కాస్తూ, ఎవరూ వెనుకబడకుండా చూసుకునే ఈ వృత్తి ఎక్కడ? నక్కకీ, నాకలోకానికీ ఉన్నంత తేడా లేదూ? అందులో ఆటవిక న్యాయం కనిపించడం లేదూ? ఇందులో సంక్షేమ రాజ్యపు ఆదర్శాలు పొడసూపట్లేదూ? అందులో స్వార్థం, ఇందులో పరోపకారం లేవూ?” అని అనర్గళంగా ప్రసంగించాడు దివిజ్.

గగన్ నవ్వి, “దివిజ్, నువ్వు భవిష్యత్తులో పొలిటీషియన్, కాదు కాదు రాజకీయ నాయకుడివి, కావాలనుకుంటే, ఈ గ్రాంథిక భాష బ్రహ్మాండంగా ఉపయోగిస్తుందిరా బాబూ! నాగలోకం అనకుండా నాకలోకం అన్నావు చూడు, దానికి నీకు నూటికి నూరు మార్కులు వేస్తున్నాను. నీ స్వచ్ఛంద సంస్థ కార్యకలాపాల్లో మమైకం అయిపో”, అన్నాడు. ఇద్దరూ పగలబడి నవ్వుకున్నాక, ధన్యవాదాలు చెప్పి కదిలాడు దివిజ్.

***

అనుకున్నట్టుగానే ఔట్‌రీచ్‌కి వెళ్ళినప్పుడు వచ్చి కలిసింది కామాక్షి. తన బాధ చెప్పుకుని విలపించింది. “లాయర్ గారు మిమ్మల్ని కలవమన్నారని వచ్చాను. నా బాధ పోయేది కాదు. నా పిల్లల ఆకలి తీర్చలేకపోయాను, వాళ్ళని బతికించుకోలేక పోయాను. మరి నా బాధ ఎవరు తీర్చగలరు?” అని రోదించింది.

గగన్ నిట్టూర్చి, “నిజమేనమ్మా. నువ్వు పడ్డ బాధ పగవాళ్ళు కూడా పడకూడదు. తలుచుకుంటూంటే నాకే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. మరి ఇంత క్షోభ అనుభవించిన దానివి, నీకెలా ఉంటుందో అర్థం చేసుకోగలను. కొన్నాళ్ళ పాటు మందులు వాడాలి. నీ బ్యాంక్ అక్కౌంట్ నెంబర్ ఇస్తే, నీకు రావలసిన పింఛను వచ్చే ఏర్పాట్లు చేస్తాను”, అన్నాడు.

ఆమె ధన్యవాదాలు చెప్పుకుని, ఇంటికి వెళ్ళి, బ్యాంక్ అక్కౌంట్ వివరాలు ఒక చీటీలో వ్రాసిస్తూ, “బాబూ, మీబోటి మనుషులు లోకంలో ఇంకా ఉన్నారని తెలిసుంటే, పాము తన పిల్లల్ని మింగినట్టు మా వాళ్ళని నేను పొట్టన పెట్టుకోక పోదును”, అని వెక్కి వెక్కి ఏడ్చింది.

“ఇక్కడ మీకు ఎవ్వరున్నారు?” అడిగాడు గగన్. “నావాళ్ళే ఉంటే ఇంతటి దారుణానికి ఒడిగట్టి ఉండేదాన్ని కాను కదండీ!” అంది. “ఏం పనులు వచ్చు?” అని అడిగేసరికి ఆమె ముందు మౌనంగా ఉండి, “మంత్రసాని పని నాకు తెలుసండీ”, అని జవాబిచ్చింది. సాలోచనగా, మౌనంగా ఉండిపోయాడు గగన్.

***

“అంకుల్, మన వ్యూహం ఫలించింది. వేసిన బాణం గురి తప్పలేదు. మేము ఏయే స్కూల్స్‌కి వెళ్ళామో, అక్కడ వాళ్ళు నేను ఊహించినట్టు అభ్యంతర పెట్టకుండా, మమ్మల్ని స్వాగతించారు. పిల్లలు కూడా కొంత స్టార్టింగ్ ట్రబుల్ తరువాత వాళ్ళ కష్టాలు చెప్పుకున్నారోచ్!”

“అమ్మానాన్నల మధ్య కీచులాటలు, ఆడపిల్లలపై వేధింపులు తలపెట్టే దుష్ట చుట్టాలు, స్నేహితులు, వాటివల్ల ఈ పిల్లలకి తగిలిన మానసిక గాయాలు, చదువుల వత్తిడి, ట్వీన్లు, టీన్లు హార్మోన్ల వల్ల పడే మానసిక ఇబ్బందులు- అన్నీ జస్ట్ రెండు స్కూల్స్‌కి వెళ్తే తెలిసింది. నాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది”, అన్నాడు దివిజ్.

“బాగుందబ్బాయ్.. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో కొత్త ఆలోచనలని స్వాగతిస్తారు. మరి మన మాతృభాషా మీడియం స్కూళ్ళలో ఆ ఇబ్బందులు లేవనుకుంటున్నావా? అక్కడికి కూడా వెళ్ళాలి. ఇంకా స్పెషల్ స్కూల్స్‌కి కూడా వెళ్ళాలి. అందరికీ ఈ అవగాహన అవసరం. మా చిన్నప్పుడు ఉమ్మడి కుటుంబాలు దండిగా ఉండేవి; నేను వైద్య విద్య చదివే సరికి వేరు కుటుంబాలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు, సింగల్ పేరెంట్ హోమ్స్ కామన్ అయ్యాయి.”

“ఇప్పుడు ఒకళ్ళతో మరొకళ్ళు మాట్లాడుకునేంత తీరికా ఓపికా ఎవరికి ఉన్నాయి? సాంకేతిక పరిజ్ఞానం మనుషుల్ని ఏకాకులని చేస్తోంది. జీవితంలో వత్తిళ్ళు పెరిగిపోతున్నాయ్. కానీ, బయటకు చెప్పుకుని, గుండె తేలిక చేసుకోవడానికి ఎవరున్నారు?”

“ఇలాంటి క్లిష్ట సమయాల్లో మానసిక ఆరోగ్యం గురించి అవగాహన లేకపోతే ఎలా? అందుకని, మన సేవలు అందరికీ అందేలా చూసుకోవాలి. ఇంగ్లీష్‌లో కౌన్సిలింగ్ చేసే వాళ్ళు దొరుకుతారు. తెలుగులో ఆ పని చేయడం కష్టమౌతుంది. మీ ఆంటీ సాయం తీసుకో. మా శశిని ఇప్పుడు కనిపెట్టుకుని ఇరవై నాలుగ్గంటలూ ఉండక్కరలేదు కదా! తను నీకు సాయపడుతుంది”, అని ముగించాడు గగన్.

మళ్ళీ తనే, “అన్నట్టు దివిజ్, ఒక హృదయ విదారకమైన కేస్ ఉంది. ఆవిడకి విడో పెన్షన్ వచ్చే ఏర్పాటు చెయ్యి”, అని కామాక్షి వివరాలున్న కాగితాన్ని అందించాడు గగన్. “మనం మానసిక ఆరోగ్యం గురించి పాటుపడుతుంటే, పిడకల వేటలా ఈ కొత్త ఆక్టివిటీ ఏమిటి అంకుల్?” అని కొంచెం విసుక్కున్నాడు దివిజ్.

“మానసిక ఆరోగ్యం అని గిరి గీసుకున్న వలయం ఉండదురా అబ్బీ! లేమితో ఆత్మహత్య తలపెట్టి, ఫెయిల్ అయితే, అలాంటి వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న సహాయాలు కూడా అందివ్వాలి నాయనా! అర్జునుడు పక్షి కంటికేసి చూసినట్టు చిన్న వాటి మీద మాత్రమే ఫోకస్ ఉంటే సరిపోదు. హోలిస్టిక్‌గా చూడాలి. అంటే పరిపూర్ణంగా! అర్థమయిందా బాబూ?” అన్నాడు గగన్.

“ఆహా, పరిపూర్ణంగా అర్థమయ్యింది పరిపూర్ణానందులవారూ!” అని దివిజ్ ఛలోక్తి వేశాడు. “మరొక్క విషయం – నో లంచం.. ఏదైనా ఇబ్బంది ఉంటే నేను డబ్బు సర్దుతాను కానీ, నో బ్రైబింగ్!” విడమర్చి చెప్పాడు గగన్. “అసలు మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చుంటుందబ్బా!” అని మాటల్ని బయటికి అనేసి, ఆలోచించ సాగాడు దివిజ్.

“టెక్నికల్ చదువులు చదివిన వాళ్ళు ఊరికే యుటిలిటీ థియరీని ప్రయోగిస్తారు. మనకి అందులో వచ్చే ఉపయోగం, మనం ఇచ్చే డబ్బు కన్నా ఎక్కువుంటే డబ్బులివ్వడానికి వెనుకాడరు. ఇది లెక్క కాదురా అబ్బీ, జీవితం!” అని ముగించాడు. “చట్టబద్ధంగా పొట్టలు కొట్టే ఉద్యోగమే వదులుకున్న వాణ్ణి! ఈ విషయంలో దిగజారను. ఇట్స్ మై ప్రామిస్!” అని భీష్మ ప్రతిజ్ఞని తలపించే మాటిచ్చాడు దివిజ్. ‘వీడి విలువలు గట్టిగా ఉంటే, వాటి ఆధారంగా వాడు నిర్మించబోయే మానసిక ఆరోగ్య సౌధం మరింత బలిష్ఠంగా ఉంటుంది’, అని మనసులో అనుకున్నాడు గగన్.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here