Site icon Sanchika

మార్పు మన(సు)తోనే మొదలు-13

[ప్రసిద్ధ రచయిత్రి డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి రచించిన ‘మార్పు మన(సు)తోనే మొదలు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. తెలుగులో మానసిక ఆరోగ్యం కేంద్రంగా రచించిన నవల ఇది.]

[దివిజ్‍తో మాట్లాడుతుంటాడు డా. గగన్. తన కార్పోరేట్ ఉద్యోగాన్ని వదిలేస్తున్నట్లు చెప్తాడు దివిజ్. గగన్ ఆశ్చర్యపోతాడు. అప్పుడు తనలో మార్పుకు కారణమైన సంఘటనలని వివరిస్తూ – తన బాల్యం నుంచి సాధించిన విజయాలు, ఉద్యోగంలో అందుకున్న ప్రమోషన్లు, తనకెదురైన ఒత్తిళ్ళు, ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా కొందరిని మోసం చేయాల్సి రావడం తదితర వివరాలు గగన్‍కి చెప్తాడు. గగన్ అతన్ని పరీక్షించేందుకు – రెచ్చగొట్టేలాంటి ప్రశ్నలు వేస్తాడు. మీరు నన్ను టెస్ట్ చేసున్నారంటూ గగన్‍తో అని తన ఉద్దేశాల్ని వివరిస్తాడు. చక్కటి విద్యార్హతలు సాధించి, విదేశాలలో స్థిరపడే అవకాశం ఉన్నా, ఇండియాలోనే ఉండి ప్రభుత్వ రంగంలో చేరి మానసిక రోగులకు సేవలందిస్తూ – మేగ్‍సేసే అవార్డు గెల్చుకున్న గగన్‍ని తాను ప్రేరణగా తీసుకున్నట్లు చెప్తాడు దివిజ్. నీ ప్రణాళికలు ఏంటి అని గగన్ అడిగితే తన ఆలోచనలు పంచుకుంటాడు దివిజ్. గగన్ సూచన మేరకు తాను స్థాపించదలచిన సంస్థకి ‘మార్పు మనతోనే మొదలు’ అనే పేరు నిశ్చయిస్తాడు. పిల్లలలో మానసిక ఆరోగ్యం పరిరక్షణ నుంచి ప్రారంభించాలని అనుకుంటాడు. గగన్ దివిజ్‍ని మెచ్చుకుని అభినందిస్తాడు. ఔట్‍రీచ్‍కి వచ్చి తనని కలిసిన కామాక్షిని ఓదారుస్తాడు గగన్. కొన్నాళ్ళపాటు మందులు వాడాలని చెప్పి, ఆమెకు ఫించను వచ్చే ఏర్పాట్లు చేస్తానని చెప్తాడు. ఆమెకి ఏం పనులు వచ్చు అని అడిగితే మంత్రసాని పని వచ్చని చెప్తుంది. దివిజ్ స్థాపించిన సంస్థ కార్యకలాపాలు ఊపందుకుంటాయి. గగన్ సూచనలు, సలహాలు ఇస్తాడు. కామక్షికి విడో పెన్షన్ వచ్చే ఏర్పాటు చేయమని చెప్పి, లక్ష్యాలను హోలిస్టిక్‌గా చూడాలని చెప్తాడు. అంగీకరిస్తాడు దివిజ్. – ఇక చదవండి.]

[dropcap]మ[/dropcap]రో ఔట్‌రీచ్ విజిట్‌కి సమయమయ్యింది- అంటే, కాల చక్రం గిర్రున ఒక నెల తిరిగేసిందన్నమాట! కామాక్షి వస్తుందా రాదా అన్న అనుమానం లేకపోలేదు గగన్‌కి. కన్సల్టేషన్ సమయం పూర్తయ్యాక, వీళ్ళు తెచ్చుకున్న వస్తువులు సర్దుకుంటుంటే, బెదిరిన లేడిలా భయం భయంగా, అటూ-ఇటూ చూస్తూ బిక్కుబిక్కుమంటూ లోపలికి వచ్చిందామె.

“క్షమించండి డాక్టర్ గారూ! మనుషుల అనుమానపు చూపులు తప్పించుకుని రావడానికి ఇంత లేట్ అయ్యింది”, అంది బాధపడుతూ. గగన్ ఆమె ముఖాన్ని పరిశీలనగా చూశాడు. కాస్త తేటగా ఉంది, అంతే! ఆమె మళ్ళీ, “పూలమ్మిన చోట కట్టెలమ్మడమంటే ఒక సామెతని సరిపెట్టుకున్నా. నాకిష్టమున్నా, లేకపోయినా, ఆచరణలో ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే అనుభవపూర్వకంగా తెలుసుకున్నా.”

“బతుకు దుర్భరంగా ఉందయ్యా! పోనీ వేరే ఊరు వెళ్దామంటే, దిక్కులేని దాన్ని, ఎక్కడికని వెళ్ళను?” అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. ముందుగా ఆమెకు మందుల చీటీ రాసిచ్చి, వాటిని తీసుకోమని చెప్పి, “ఇంతకీ, ఎంత దాకా చదువుకున్నావేమిటి?” అని అడిగాడు గగన్. “ఇంటర్ పరీక్ష తప్పాను”, అని జవాబిచ్చింది కామాక్షి. “ఓ అరగంట తరువాత నన్ను కలువమ్మా. మేమంతా ఇక్కడే ఉంటాం”, ‘మేమంతా’ అన్న మాటని కాస్త గట్టిగా అన్నాడు గగన్, ఆమె మరోలా అర్థం చేసుకోవడానికి వీల్లేకుండా.

అరగంటలో ఎన్నయినా జరగవచ్చు- మనసులో తర్జన భర్జనలు, ఫోన్‌లో మంచి-చెడ్డలు, వాదోపవాదాలు- ఇలా. ఆమె వచ్చేసరికి నిర్ణయం తీసుకున్న వాడిగా, “అమ్మా, నువ్వు మానసిక వైద్య రంగంలో నర్సమ్మగా పనిచేస్తావా?” అనడిగాడు గగన్. “అంటే.. నేను.. నేనూ..  చెయ్యగలనా? చదివిన చదువు సరిపోతుందా? ఏ ఊళ్ళో చెయ్యాలి?” బాధ-సంతోషం కలబోసిన భావనతో, కళ్ళ నీళ్ళ వల్ల మాటలు తడబడుతుండగా అడిగిందామె.

“ముందు కొన్ని నెలలపాటు శిక్షణ ఉంటుంది. ఆ తరువాత మా ఊళ్ళోనే పోస్టింగ్”, అంటూ ఒక చీటీ అందిస్తూ, “ఈ నెంబర్‌కి ఫోన్ చేస్తే, దరఖాస్తు ఎలా పెట్టాలి, శిక్షణకి ఎక్కడికి వెళ్ళాలి- ఇలాంటివన్నీ ఒక స్వచ్ఛంద సేవకుడో, సేవికో చెప్తారు”, అన్నాడు గగన్.

కామాక్షి ఇంత త్వరగా తన బ్రతుకుని బాగు చేసుకునేందుకు సిద్ధపడుతుందని తను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అందుకని, ఆమె శిక్షణకి సాయం చేసేందుకు దివిజ్‌తో మాట్లాడడానికి సమయం అవసరమయ్యింది. ఈమాటు అతను ‘ఇవన్నీ అనవసరపు పనులు’, అని గొణగలేదు. బహుశః కామాక్షి మనసులోకి పరమనః ప్రవేశం చేసి, ఆ లోతుల్లోని దుఃఖంలో ఈది, బయటకి వచ్చి ఉంటాడు.

గగన్ మరో ప్రశ్నకి కూడా జవాబు ఆలోచించుకున్నాడు. ఆమెని తమ ఊళ్ళో ఎక్కడ ఉంచడం? ఇప్పటి వరకు అందరూ మగవారే కాబట్టి, ఉభయతారకంగా ఉంటుంది కాబట్టి, వాళ్ళని ప్రభాత్ ఇంట్లో దింపాడు. ఇప్పుడు ఆ వెసులుబాటు లేదు కదా! మల్లిక తన సంసార సాగరం తను ఈదుతోంది. మరి ఆమె ఎక్కడుంటుంది? తనుండే చిన్న ఊళ్ళో ఉద్యోగినుల హాస్టళ్ళు ఉండవు కదా!

అప్పుడు పూర్ణిమ గుర్తు చేసింది, మల్లిక పక్కింట్లో వాళ్ళు హైదరాబాద్‌లో ఉండే వాళ్ళబ్బాయి దగ్గరకి శాశ్వతంగా వెళ్ళిపోయారు; అద్దెకి గాని, కొనుగోలుకి గాని ఎవరైనా ఉంటే చూడమని ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులతో చెప్పారని! ఇప్పటికి తన సమస్య తీరినట్టే, అనుకుని నిట్టూర్చాడు గగన్.

***

“అంకుల్, మీ పేషెంట్ మహావీర్‌ని ఉద్యోగంలోంచి తీసేశారట. ఇందాక వస్తుంటే, ఆంటీ కనబడి, మీతో చెప్పమన్నారు!” అన్నాడు దివిజ్. “నాన్సెన్స్.. అతనిలో ఇప్పుడు ఆ లక్షణాలు కనిపించడం లేదే! పైగా మందులు కూడా”, అని ఆగి, “కొంపదీసి వాడడం మానేశాడా ఈ స్కిజోఫ్రేనిక్?” అన్నాడు గగన్.

దివిజ్ ఇప్పుడు ‘ఇందుగలడందు లేడను సందేహము వలదు’ చందాన కొత్త పంథాలో పయనిస్తూ ఒక పక్క పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందిస్తూ, మరొక పక్క ఈ విషయాన్ని పాఠ్యాంశం చేయాలని ఉన్నతాధికారుల్ని కోరుతూ, మూడో పక్క మానసిక వైకల్యం ఉండీ, ఇప్పుడు మెరుగుపడి, వ్యాధి లక్షణాలకి దూరమైన వాళ్ళకి ఉద్యోగాలిప్పించడానికి తెగ కృషి చేస్తున్నాడు.

సేవా తత్పరత ఉండే వాళ్ళని ఎన్‌జి‌ఓలో చేర్పించుకుని, వాళ్ళకి జీతాలిచ్చి, గగన్, పూర్ణిమలలాంటి వాళ్ళ ద్వారా మానసిక ఆరోగ్యం, మానసిక రుగ్మతల గురించి కనీసపు జ్ఞానాన్ని పంచి, తరువాత వాళ్ళని పనిలోకి పెట్టేవాడు.

వాళ్ళకి పని మీద ఉండే ఏకాగ్రత, గౌరవం, భక్తిభావం వల్ల వాళ్ళు చెప్పిన విషయాలు త్వరగా నేర్చుకుని, ప్రతీ అడుగూ ఆశయసాధన వైపే వేసేవారు. అనతి కాలంలోనే వాళ్ళు చేసే మంచి పనుల గురించి ప్రజలకు తెలియవచ్చింది. తద్వారా ప్రజల అవగాహన కూడా పెరిగింది.

ఈ కొత్త నెట్వర్క్‌ని, సద్వలయాన్ని (అంటే విషవలయానికి వ్యతిరేక పదమన్న మాట)  ఉపయోగించుకుని, మానసిక రోగ లక్షణాల నుండి బయటపడి, బుద్ధిగా మందులు వేసుకునే రోగులకి ఉద్యోగాలు ఇప్పించేవాడు దివిజ్. ఇంకా, ‘మంచి మాట’ అనే పేరిట ఒక యూట్యూబ్ చానెల్ కూడా మొదలు పెట్టాడు. అక్కడి వీడియోలన్నీ ఏదో ఒక అంశంపై పాజిటివ్ ఆలోచనలతో ఉండేటట్టు తానే స్వయంగా పర్యవేక్షించాడు దివిజ్.

ఇప్పుడు ఈ మహావీర్‌కి ఉద్యోగం పోతే నష్టం అతనొక్కడికే కాదు, ఉద్యమంలా వ్యాపిస్తున్న వీళ్ళ ఆదర్శాలకి. జబ్బు లక్షణాలు తగ్గితే, మామూలు మనుషులే కోర్సు పూర్తయ్యే వరకూ మందులు వేసుకోరు. పిసరో, కొసరో మిగిలిన సూక్ష్మ క్రిములవల్ల తరువాత పెద్ద జబ్బునే మోసుకుని వస్తారు; అలాంటిది, తాము ఆరోగ్యంగా ఉన్నామనుకునే స్కిజోఫ్రేనియా రోగులు మరి వేసుకుంటారా?

“వాళ్ళ ప్రిన్సిపాల్‌తో మాట్లాడతాను”, అన్నాడు గగన్. “ఆంటీ ఆల్రెడీ ట్రై చేసి, ఫెయిల్ అయ్యారట. అతను అందరి ఎదురుగుండా హిస్టీరియా వచ్చినట్లు అరిచాడట. ఇంకా ఏమన్నా ట్రై చేయండి”, అన్నాడు దివిజ్.

వారిద్దరి మధ్యా కాస్సేపు మౌనం రాజ్యమేలింది. “యెస్, ఐ గాట్ ఇట్. ఛలో టు ఆడ్వకేట్ జాయ్!” అరిచినంత పని చేశాడు గగన్. “ఆయన మన ఎన్‌జి‌ఓ విషయంలో చట్టపరంగా ఏమేం చెయ్యాలో చెప్పారు కదా! ఆయన్ని ఎలా మరచిపోయానబ్బా!” అని స్వగతంలా గొణిగాడు దివిజ్.

***

జాయ్ ఆఫీసులో బ్రైన్‌స్టార్మింగ్ జరుగుతోంది. “మన కేసులో ఉన్న ఏకైక వీక్ పాయింట్ ఏమిటంటే మానసిక వైకల్యం ఉన్నవాళ్ళకి రిజర్వేషన్ లేకపోవడమే! రెండు మూడు సినారియోలని చూద్దాం. ఒకటి, అతను మందులు వేసుకుంటున్నాడు, వర్క్‌లోడ్‌ని మేనేజ్ చేస్తున్నాడు. కానీ అతని మానసిక అనారోగ్యం మీద ఏవగింపు పెంచుకున్న వాళ్ళ ప్రిన్సీ అతణ్ణి రెచ్చగొట్టి, అతని చేత అవాకులూ-చవాకులూ పేలిస్తే, వాటికి అతణ్ణి బాధ్యుణ్ణి చేసి, ఉద్యోగం పీకేసి ఉంటారు. ఇది మహావీర్‌కి బెస్ట్ ఛాన్స్.”

“మహావీర్ మందులు వేసుకుంటున్నాడు, కానీ చెయ్యాల్సిన పనిని నిర్ణీత సమయంలో చేయలేకపోతున్నాడు. మిమ్మల్ని వచ్చి కలవడానికి తటపటాయింపు ఉండనే ఉంటుంది గనుక, ఈ ఒత్తిళ్ళన్నీ కలిసి అతణ్ణి అరిచేలా చేశాయి. ఇప్పుడు కేస్ ప్రిన్సీ వైపు మొగ్గుతుంది”, వివరించాడు జాయ్.

“ఉద్యోగమిచ్చిన వాడు, ఇలాంటి ఉద్యోగి విషయంలో కాస్త అర్థం చేసుకుని మెలగాలిగా?” అన్నాడు దివిజ్. “మనసా- వాచా మీ ఐడియాలని నమ్మి ఉద్యోగమివ్వడం వేరు; మీరు సంఘంలో గౌరవనీయులు గనుక మీ మెప్పు పొందడానికిస్తే ఇలా ఉండొచ్చు కదా!” వివరించాడు జాయ్.

మళ్ళీ అతనే, “ఇక మూడవ సినారియోకి వద్దాం. ప్రతీ కాలేజీలోనూ రాజకీయాలుంటాయి. ఇతని అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని, ఏదైనా విషయంలో ఇరికించి ఉండొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే, బోలెడన్ని పెర్ముటేషన్స్ ఉంటాయి. సో, ముందు మహావీర్ తన తరఫున ఏం చెప్తాడో విందాం”, అన్నాడు.

కాస్సేపటికి మహావీర్ వచ్చాడు. “నువ్వు మమ్మల్ని నమ్ముతున్నావా?” అడిగాడు గగన్. “నా జీవితాన్ని నిలబెట్టిన వారు, మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని నమ్మమంటారు?” అని, “ఈయనెవరు?” అన్నాడు జాయ్ కేసి చూసి. “మా ఇద్దరిలాగే ఈయన కూడా నీ శ్రేయోభిలాషే! ఆడ్వకేట్ జాయ్”, అన్నాడు గగన్.

అతను మహావీర్ బాడీ లాంగ్వేజ్‌ని జాగ్రత్తగా గమనించాడు. సాధారణంగా పైత్యోద్రేకం వచ్చి, తగ్గాక, ఆ రోగి ముఖంలో ప్రశాంతత ఉండదు. అలాంటప్పుడు రోగి మౌనంగా ఉన్నా, మనసులో ఎవరినో ఒకర్ని తిట్టుకుంటూ, శాపనార్థాలు పెట్టుకుంటూ ఉంటారు. మాట బయటికి రాకపోయినా, పెదవులు కదులుతూ ఉంటాయి. అలాంటి సూచనలేవీ మహావీర్‌లో కనిపించలేదు గనుక ఏం జరిగిందో చెప్పమని కోరాడు గగన్.

“ప్రిన్సీ గారు లోకానికి మంచివాడిలా బిల్డప్ ఇస్తారు గానీ అదొక రకం మనిషి. నేను చేరిన రోజే, ‘మెంటలోడికి మేనేజ్మెంట్లో ఇంత పరపతా?’ అని మేమిద్దరం మాత్రం ఉన్నప్పుడు గేలి చేశారు. ఇలా చాలా సార్లు జరిగింది.”

“నేను రియాక్ట్ అవలేదు గనుక ఆయనకి పరోక్షంగా ప్రోత్సాహం దొరికినట్టయ్యింది. నా గురించి మిగిలిన వాళ్ళతో ‘మెంటల్ మహావీర్’ అని చెప్పేవారట. 19వ శతాబ్దపు విధవరాలిలా అనిపించింది నాకు. అయినా ఊరుకున్నాను.”

“ఇవ్వాళ కొత్తగా చేరిన ఒక ఫ్యాకల్టీ మెంబర్‌కి నన్ను వరండాలో పరిచయం చేశారు. అందులో తప్పేమీ లేదు. అది ఇంటర్వల్ సమయం. విద్యార్థులు కూడా అటూ-ఇటూ వెళ్తున్నారు. ఆయన, ‘ఈయనే మన మేథమేటిక్స్ లెక్చరర్, ఉరఫ్ మెంటల్ మహావీర్’, అని పబ్లిక్‌గా అనేసరికి నాకు చిర్రెత్తుకొచ్చింది.”

“ఒక్కసారి అందరి ముందూ తిట్టేస్తే, ఇక మీదట నన్ను వెక్కిరించకుండా నోరు మూసుకుని ఉంటారని అనుకున్నా. ఇలా బెడిసికొట్టింది. నో బిగ్ డీల్. ఇలాంటి వాడి దగ్గర ఉద్యోగం చేస్తూ పడుండే బదులు, ఇంట్లో ఖాళీగా పడుండడం బెటర్. బట్, తిండి ఎలా గడుస్తుంది?” అన్నాడు మహావీర్.

“ఇప్పుడొక కొత్త విషయం బయటికి వచ్చింది. ప్రిన్సీకి మేనేజ్మెంట్ వాళ్ళంటే పడదో ఏమో తేల్చుకోవాలి. దివిజ్, ప్లీజ్”, అని గగన్ దివిజ్‌ని కోరాడు. అతను పక్కకి వెళ్ళి, కుడి అరచేతిని మూతికి అడ్డంగా పెట్టుకుని మిగిలిన వాళ్ళకి వినబడకుండా మాట్లాడి, మళ్ళీ జాయ్ టేబుల్ దగ్గరకొచ్చి పెదవి విరిచాడు.

“సారీ అంకుల్, ‘మా కాలేజీ క్రమశిక్షణకి మారుపేరు, పబ్లిక్‌గా ప్రిన్సిపాల్‌ని తిడితే ఎలా?’ అని చైర్మన్ అడుగుతున్నారు. కానీ ఆ ప్రిన్సీ గారు మాత్రం పబ్లిక్‌గా ఒక లెక్చరర్‌ని అవమానించవచ్చు ఏం? డబుల్ స్టాండర్డ్స్! డిస్‌గస్టింగ్!” అన్నాడు దివిజ్.

కాస్సేపు ఆగి, తనే, “మహావీర్, నువ్వు వ్యక్తిగతంగా ఆలోచిస్తున్నావ్. సమాజపు కోణం నుండి చూడు – ఏ సమాజంలో అయినా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఉంటారు. ఈ రోజు ఫలానా వాళ్ళకి కష్టం లేదని మిగతా వాళ్ళని కించపరచడం తప్పు కదూ! అందుకే, ఈ విషయాన్ని ఇక్కడితో వదలకూడదు. ఇంతకీ, మందులు రెగ్యులర్‌గా వాడుతున్నావా?” అడిగాడు దివిజ్.

“హావ్ నో డౌట్”, అని వెంటనే జవాబిచ్చాడు మహావీర్. అంతవరకూ మౌనంగా ఉన్న గగన్, “మహావీర్‌లో వ్యాధి లక్షణాలు లేవు. ఇంకెవరైనా సైకియాట్రిస్ట్ చేత పరీక్ష చేయించుకోవచ్చు. పక్కా!” అన్నాడు.

జాయ్ అందుకున్నాడు. “ఈ కేస్ మనం గెలుస్తాం. అది పక్కా! ప్లస్, మరో విషయాన్ని నేను కోట్ చేస్తాను. జీవిత భాగస్వామికి స్కిజోఫ్రేనియా ఉందని విడాకులు తీసుకోలేరు, ఆ సదరు రోగి మందులు తీసుకుంటూ ఉంటే! జీవిత భాగస్వామికే ఇంత వెసులుబాటుంటే, ఒక ఉద్యోగికి ఆ పాటి ఉండదా? ఆయ్.. ఎలా ఉండదో చూద్దాం, కోర్టులో తేల్చుకుందాం!” అన్నాడు జాయ్.

***

ఒక రోజు ఔట్‌రీచ్ నుండి ఇంటికి వచ్చి, షూస్ విప్పుతూ, “ఈ ప్రయాణంలో ఒక పదనిస వినబడిందోయ్”, అన్నాడు గగన్ పూర్ణిమతో. భర్త మీద నమ్మకమున్న పూర్ణిమ, “నాక్కూడా వినిపించు మరి”, అంది. “ఒక ‘మహానుభావు’ణ్ణి కలుసుకున్నాను”, అని హింట్ ఇచ్చి ఆగాడు గగన్. “ఓ గాడ్! ఓసీడీ? అదే, ఆబ్సెస్సివ్ కంపల్సివ్ డిజార్డర్? ఎవరా మనిషి? ఏమైనా సాయం చేశావా లేదా?” ప్రశ్నల వర్షం కురిపించింది పూర్ణిమ.

“మా వేలు విడిచిన మేనత్త మనవడు. పేరు స్వయంప్రకాష్. వాడికుండే అలవాటు, సూట్‌కేస్‌ ఉందా లేదా అని, పదే పదే చెక్ చేసుకోవడం. ఫస్ట్ ఏ‌సిలో, టూ సీటర్ కుపేలో ఉన్నాం. దానికి, వాడు వాడి సూట్‌కేస్‌కి తాళం పెట్టాడు. పోనీ, నా మంచితనం నాకు తెలుసు గానీ వాడికి తెలియదు కదా, అని ఆ విషయాన్ని పక్కకి పెట్టొచ్చు. పైన పడుక్కున్న వాడు పదే పదే, అంటే, ఓ పావుగంటలో పదిహేను-ఇరవై సార్లు ఎక్కుడు, దిగుడూను, సూట్‌కేస్‌ ఉందో లేదో చెక్ చేసేందుకు.

ఇంక లాభం లేదని నేను రంగంలోకి దిగాను, వాణ్ణి మాటల్లో పెట్టాను. అప్పుడే ఈ బీరకాయపీచు చుట్టరికం కలిసింది. ఎందుకు అదే పనిగా చెక్ చేస్తున్నాడంటే, పక్క కుపే వాళ్ళు ఎవరైనా వాళ్ళ సీటు కిందకి దూరి, చిల్లు చేసి, అటుపక్క నుండి వీడి పెట్టె లాగేసి, దొబ్బేస్తారేమోననిట, ‘అతడు’కి ఇంప్రొవైజ్డ్ వర్షన్‌లా. ఇంకా, అది చాలనట్టు, కాస్త వెలుతురు కోసం కర్టెన్‌ని మూలకి జరిపితే, వాడు దాన్ని మూయమన్నాడు. స్టేషన్లో రైలు ఆగినప్పుడు ఎవడైనా చెయ్యో, కర్రో పెట్టి వాడి పెట్టెని లాగెయ్యవచ్చట.”

“మా మామయ్యకి, అదే అతని తాతకి అనుమానం ఉండేది. భార్య కూరగాయల వాడితోనో, పాలవాడితోనో మాట్లాడినా అనుమానమే!  అప్పట్లో అనుమానస్థుడు అని వదిలేసేవారు. ఇప్పుడు టెస్ట్ చేస్తే ఎక్కడ తేలుండేవాడో!”

“సో, మన వాడికి వంశపారంపర్యంగా సంక్రమించిందనడానికి ఇది చాలు. అతని తల్లిదండ్రులని ఇక్కడ కొన్నాళ్ళు ఉండడానికి రమ్మంటాను, కర్తవ్యం అర్థమయ్యిందిగా!” అన్నాడు గగన్.

“అయ్యింది మహాశయా! ముందు నేను, తర్వాత నువ్వూ ‘టాక్ థెరపీ’ చేద్దాం, అంతేనా?” అడిగింది పూర్ణిమ. “బింగో”, అని స్నానానికి బయలుదేరాడు గగన్.

***

కొన్నాళ్ళకి అమిత ఫోన్ చేసింది. “సక్సెస్, గగన్ గారూ, సక్సెస్!” అంది ఉత్సాహంగా. గగన్ ఆ సక్సెస్ ఎలాంటిది అవుతుందో అన్న ఆలోచనలో పడ్డాడు. “యూ”, అని ఆమె మొదలెట్టగానే, “మా యూట్యూబ్ చానెల్ చూశారా? మొరాల్ బూస్టర్‌లా ఉందా లేదా?” గుమ్మడి కాయల దొంగ స్టైల్లో ఆమెని అడిగాడు. “అది కాదు గగన్ గారూ, నన్ను పూర్తి చెయ్యనియ్యండి. యూ నో వాట్? ప్రైవేట్ సెక్టార్లో కూడా ఒక బైపోలార్ ఉద్యోగిని ఇంటికి పంపించకుండా ఉద్యోగం నిలిపాం”, అంది అమిత. “వావ్.. బట్, అదెలా సాధ్యపడింది?” అడిగాడు గగన్.

“రెండు మూడేళ్ళ క్రితం మా ఆఫీసులో ఒకబ్బాయి ఉండేవాడు. చాలా షార్ప్. అంకెలు, అంకాలలో అందె వేసిన చెయ్యి. మిగిలిన వాళ్ళు విశ్లేషించే లోపు అతను ఓ పదడుగులు ముందు ఉండేవాడు. దిష్టి తగిలినట్టు, కొన్నాళ్ళకి అసలు బేసిక్ పనులు కూడా చెయ్యలేకపోయేవాడు. అతడి ప్రాబ్లం ఏమిటో మాకు తెలియదు. మా కంపెనీకి లాభాలు పెంచని వాళ్ళు వాళ్ళకి అక్కరలేదు. అతడికి గుడ్‌బై చెప్పేశారు.”

“నిరుడు మరో పిల్లాడు చేరాడు. పని రాక్షసుడు. అతని కష్టం వల్ల మా కంపెనీ వాళ్ళు గత మూడేళ్ళలో చేసిన అమ్మకాలని, ఆరు నెలల్లో రెండింతలు చేయగలిగారు. అతనికి వెంటనే ప్రమోషన్ ఇచ్చారు కూడా! ఒక మూడు నెలల తరువాత ముఖ్యమైన మీటింగులున్న రోజుల్లో ఎగ్గొట్టడం, ఇవ్వబడిన సూచనలు పాటించకపోవడం, ఆఫీసు సమయంలో కునికిపాట్లు పడడం, రోజూ ఆలస్యంగా రావడం- ఇలాంటి పనులు చేసేవాడు.”

“ఉద్యోగం ఊడేదాకా వెళ్తే, మరో ఛాన్స్ ఇమ్మని బతిమాలుకున్నాడు. అతడి వల్ల ఇన్ని వస్తువులు అమ్మగలిగాం గనుక మేనేజ్మెంట్ అతడి విన్నపాన్ని మన్నించింది. తరువాత మళ్ళీ కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. మళ్ళీ మా సేల్స్ పెరిగాయి. మొన్నీమధ్యనే తిక్కపనులు మళ్ళీ మొదలుపెట్టాడట.”

“ఈ మాటు మా ఎండీ అతడికి ఉద్వాసన చెప్పే మూడ్‌లో ఉన్నారు. సేల్స్ సంగతి పక్కన పెడితే అతని ప్రవర్తనని చూసి మిగిలినవాళ్ళు తప్పుదోవ పట్టే అవకాశముందని ఆయనకి అనిపించింది. డబ్బులే కాదు, మా కంపెనీలో క్రమశిక్షణకి కూడా పెద్దపీట వేస్తారని తద్వారా సందేశాన్ని ఇద్దామని ఆయన అనుకున్నారు”, ఇంకా చెప్పుకు పోతోంది అమిత.

“మరెలా నిలిపారు అతని ఉద్యోగం?” అడిగాడు గగన్, ‘శుభం’ కార్డు కనిపించే సీను లేకపోతే! “అప్పుడే నేను ఈ విషయంలో తల దూర్చాను, త్రయంబకేశ్వర్ గారి లెక్చర్ విన్న తరువాత! నేను ఆ రోజు మీతో మా కంపెనీలో రాబోయే ఒక కొత్త ఒరవడి గురించి మాట్లాడాను కదా! అదే ఇది. దానికి నేనే నడుం బిగించాను.”

“మాకు మేలు చేసిన మనిషి, ఏదో రోగంతో బాధ పడుతున్నాడంటే, అతణ్ణి ఉద్యోగం నుండి తీసెయ్యడం ‘ఉపకారికి అపకారం’ లాంటిది, అని వాదించాను. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరిట ఏటా కోట్ల కొద్దీ ఖర్చు చేస్తుంది మా కంపెనీ. అలాంటిది, ఇతనికి  జీతం, అంటే, కేవలం కొన్ని లక్షలు మాత్రమే ఇవ్వడానికి వెనుకంజ వేయకూడదని వాదించి, సాధించాను”, అని ముగించింది అమిత. “వావ్”, అన్నాడు గగన్, అతని గొంతులో బ్రహ్మానందం తాండవిస్తుండగా!

(ఇంకా ఉంది)

Exit mobile version