మార్పు మన(సు)తోనే మొదలు-14

0
1

[ప్రసిద్ధ రచయిత్రి డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి రచించిన ‘మార్పు మన(సు)తోనే మొదలు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. తెలుగులో మానసిక ఆరోగ్యం కేంద్రంగా రచించిన నవల ఇది.]

[ఒక నెల గడిచి, గగన్ మరో ఔట్‍రీచ్‌కి వెళ్లాల్సిన సమయం వస్తుంది. కామాక్షి వస్తుందా రాదా అన్న అనుమానం గగన్‍కి కలుగుతుంది. కానీ ఓ రోజు కామాక్షి ధైర్యం కూడదీసుకుని వచ్చి గగన్‍ని కలుస్తుంది. ఆమెకి మందులు రాసిచ్చి, ఏం చదువుకుందో అడుగుతాడు గగన్. ఓ అరగంట తర్వాత రమ్మని ఆమెకి చెప్పి – ఫోన్‍లో మాట్లాడి – ఓ నిర్ణయం తీసుకుంటాడు గగన్. ఆమెకు శిక్శణనిచ్చి నర్సుగా ఉద్యోగం ఇవ్వాలని అనుకుంటాడు. ఆమె వచ్చాక, తన నిర్ణయం చెప్పి, ఆమెని ఒప్పిస్తాడు. ఆమెకు అవసరమైన సహాయం చేసేందుకు దివిజ్‍తో మాట్లాడుతాడు. దివిజ్ కూడా ఎందుకు ఏమిటి అన అడగకుండా ఆమెకి సాయం చేస్తాడు. బాగా ఆలోచించి – కామాక్షికి బస కూడా ఏర్పాటు చేస్తాడు గగన్. మహావీర్ అనే పేషంట్‌ని ఉద్యోగంలోంచి తీసేసారని దివిజ్‍ గగన్‍తో చెప్తాడు. ఇప్పుడు దివిజ్ ఎన్నో సేవలందించే సంస్థని నడుపుతున్నాడు. తన సంస్థ ద్వారా పలువురికి మేలు చేస్తున్నాడు. మహావీర్ విషయంలో అడ్వకేట్ జాయ్ సలహా తీసుకోమని చెప్తాడు గగన్. గగన్, దివిజ్ – జాయ్‍ని కలుస్తారు. మహావీర్ కేసు గురించి చర్చిస్తారు. అక్కడికి వచ్చిన మహావీర్ కాలేజీలో జరిగినదంతా వివరిస్తాడు. మానసిక రోగినని ప్రిన్సిపాల్ తనని ఎలా హేళన చేసినది చెప్తాడు. ప్రిన్సిపల్ గురించి దివిజ్ ఆ కాలేజ్ ఛైర్మన్‍తో మాట్లాడినా ఉపయోగం ఉండదు. ఈ కేసులో భయపడాల్సిందేమీ లేదని, గెలుపు తమదేనని అంటాడు జాయ్. ఒక రోజు ఔట్‌రీచ్ నుంచి ఇంటికి వచ్చిన గగన్ – తనకి తారసపడిన తన బంధువు స్వయంప్రకాశ్ గురించి భార్య పూర్ణిమకి చెప్తాడు. అతనికి ఉన్న ఆబ్సెస్సివ్ కంపల్సివ్ డిజార్డర్‌ని నయం చేసేందుకు పూర్ణిమ సాయాన్ని కోరతాడు. సరేనంటుంది పూర్ణిమ. ఒకరోజు అమిత ఫోన్ చేసి ఒక బైపోలార్ ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించకుండా కాపాడామని చెప్తుంది. ఆమె చెప్పిన వివరాలు విని ఆమెను అభినందిస్తాడు గగన్. – ఇక చదవండి.]

[dropcap]“స్వ[/dropcap]యం, నువ్వు రోజూ టైమ్ ఎలా స్పెండ్ చేస్తావ్? అదే, చదువుకోని సమయాల్లో?” అడిగింది పూర్ణిమ. “నేనా, ది గ్రేట్ డిటెక్టివ్ షర్లాక్ హోమ్స్ పాత్ర పోషిస్తుంటాను”, అన్నాడు స్వయంప్రకాష్.

“కాలేజీ డే కోసమా? చెప్పు చెప్పు, నాకు షర్లాక్ అంటే మహా పిచ్చి అనుకో. అందులో నీకు ఏ కథ అంటే ఇష్టం? నాకైతే, ‘సాలిటరీ సైక్లిస్ట్’ అంటే చాలా ఇష్టం. అందులో ఆ అమ్మాయి చేతివేళ్ళు చూసి ఆమె పియానో వాయిస్తుందని కనిపెడతాడు మన గ్రేట్ డిటెక్టివ్! సారీ, షర్లాక్ పేరు వినగానే నాకు ఒంటిమీద స్పృహ ఉండదు. నీ సాహసాలు చెప్పు బాబూ”, అని అతణ్ణి మాటల్లో పెట్టింది పూర్ణిమ.

అతను కాస్త విసుగుతో, “అసలు నాకు ఆ పేరు మీద తప్ప, ఆ పుస్తకం మీద ఆసక్తి లేదాంటీ! మా ఇంట్లో వస్తువులన్నీ, ఉన్నవి ఉన్నట్టే ఉన్నాయంటే నా వల్లే!” గొప్పగా చెప్పాడు స్వయంప్రకాష్.

“అదెలాగ?” తెలియనట్టు అడిగింది పూర్ణిమ.

“ఎవరైనా మా ఇంట్లోకి దూరి మా సామాన్లూ అవీ కొట్టెయ్యకుండా నేను కాపలా కాస్తాను. ముఖ్యంగా మా స్టోర్ రూమ్‌లో”, అన్నాడు స్వయంప్రకాష్.

“స్టోర్ రూమ్‌లోనా? అక్కడ వాడని వస్తువులే కదా ఉండేది?” కుతూహలంతో అడిగినట్టు అడిగింది పూర్ణిమ.

“అక్కడే కదా ఎక్కువ సామాన్లు ఉండేది! టోకుగా దొంగతనం చేయాలంటే ఆ రూమ్‌కి వస్తేనే కదా జరుగుతుంది?” ఎదురు ప్రశ్న వేశాడు స్వయంప్రకాష్.

పూర్ణిమ అక్కడితో ఆపేసింది. వివరాలు గగన్‌కి చెప్పింది. ఓసీడీని ట్రీట్ చెయ్యాలంటే చాలా కష్టం. మందులు, కౌన్సిలింగ్‌తో పాటు కుటుంబ మద్దతు కూడా చాలా అవసరం. అతని తల్లిదండ్రులతో వేరుగా కూర్చుని అతడితో ఎలా మసలుకోవాలో బోధపరిచింది. ఏదైనా డౌటుంటే తనతో గాని, గగన్‌తో గాని మాట్లాడమని చెప్పి, వాళ్ళ ఫోన్ నెంబర్లు అతని తల్లిదండ్రుల దగ్గర ఉండేటట్టు చూసుకుంది.

ఈ లోగా, “ప్రకాష్, నాకు కొన్ని అనుమానాలున్నాయ్.. తీరుస్తావా?” అడిగాడు గగన్. ‘‘ఊఁ’’, అన్నాడు స్వయంప్రకాష్.

“ఆ రోజు నేను నా సూట్‌కేస్‌కి తాళం కూడా వెయ్యలేదు కదా, తాళం పెట్టి ఉన్న నీదాన్ని దొంగలు ఎత్తుకుపోతారని ఎందుకు అనిపించింది?” సూటిగా అడిగాడు గగన్, సుత్తి లేకుండా, స్ప్రైట్ తాగకపోయినా!

“ఎన్ని సినిమాల్లో చూడలేదు, తాళం తియ్యడం అనేది దొంగలకి వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఎవడైనా వస్తాడేమోనని”, అన్నాడు స్వయంప్రకాష్.

“అసలు ఎవడైనా రావడానికి ఆస్కారం ఉందా?” అడిగాడు గగన్.

“వై నాట్? మన కుపేలోకి ఇదివరకే వచ్చి దాక్కుని ఉండొచ్చు”, అన్నాడు స్వయంప్రకాష్. “దాక్కుంటే మరి మన సామాన్లు పెట్టగలిగే వాళ్ళమా?” అన్నాడు గగన్.

ఆలోచనలో పడ్డాడు స్వయంప్రకాష్. కానీ, అతడి మొహం చూస్తే ఆందోళన పడుతున్న వాడిలా ఉన్నాడు. “అవును, మన సామాన్లు ఎలా పడతాయ్, మన సామాన్లు ఎలా పడతాయ్, మన సామాన్లు ఎలా పడతాయ్.. మన.. ఎలా…. హా తెలిసింది.. తెలిసింది.., వెనుక కుపే నుండి పార్టిషన్ కట్ చేస్తే, దొంగ అటుపక్క ఉండొచ్చు.. ఉండొచ్చు కదా! కరెక్ట్, కరెక్ట్.. కరెక్ట్.. అంతే.. అంతే.. కరెక్ట్.. అంతే..” అని నసిగాడు స్వయంప్రకాష్.

“దొంగ అవతల పక్క కట్ చేసి ఉంటే, మన సూట్‌కేసెస్ మనకి కనిపించకుండా లోపలికి పోయేవి కదా.. అలాగ జరగలేదు కదా! ఆలోచించు”, అన్నాడు గగన్. మళ్ళీ ఆపసోపాలు పడుతున్నట్టు ఆలోచిస్తూ, “అవును కదా.. మనకి సూట్‌కేసెస్ కనిపించాయి కదా! కనిపించాయి కదా! కదా.. కదా!” అన్నాడు స్వయంప్రకాష్.

“సో, దొంగ ఎవడూ లేనప్పుడు ఎందుకు మళ్ళీ, మళ్ళీ చెక్ చేశావ్?” అడిగాడు గగన్. స్వయంప్రకాష్‌కి మళ్ళీ కష్ట కాలం మొదలయ్యింది. “పోనీ, ట్రైన్ స్టార్ట్ అయ్యాక వెనుక.. నుండి కట్ చేస్తేనో?” అని మళ్ళీ కాలికేశాడు.

“అప్పుడు సౌండ్ ఏమైనా నీకు వినబడిందా? రంపం శబ్దం? ఊఁ, చెప్పు”, అన్నాడు గగన్. “రంపం శబ్దం.. రంపం సౌండు.. అదీ.. రంపం.. సౌండు.. అవును.. రాలేదుగా.. వినబడలేదుగా”, చెప్పాడు స్వయంప్రకాష్.

“మరి?” రాబోయే కోపాన్ని అణచుకుంటూ అన్నాడు గగన్.

“మరి.. మరి.. ఆఁ, ప్లాట్ఫాం మీద నిలబడ్డ దొంగ..” అతనికి అడ్డుతగులుతూ, “ఏం చెయ్యగలుగుతాడు వాడు?” అన్నాడు గగన్. “కర్టెన్ తీసి.. తీసి ఉన్నప్పుడూ.. హుక్కో, కర్రో పెట్టి మన సామాన్లు దొంగతనం చెయ్యచ్చు”, అన్నాడు స్వయంప్రకాష్.

“ఆ కర్టెన్ వెనక్కాల ఏముంది?” మళ్ళీ గగన్ ప్రశ్న.

“కర్టెన్ వెనక్కాల.. వెనక్కాల.. ఆఁ, గ్లాస్ విండో ఉంది”.

“గ్లాసు విరిగి ఉందా, బాగానే ఉందా?”

“గ్లాసు.. గ్లాసు.. గ్లాసు.. మీద గీతలున్నాయ్”.

“గీతలా.. ఎటువంటివి? కాస్త గుర్తు చేసుకుని, చెప్పు”.

“గీతలంటే.. గీతలు.. గీతలు కావు. ఎవరో సూదిగా ఉండే వస్తువుతో గీశారేమో”.

“కంగ్రాట్స్. ఇప్పుడు చెప్పు, ఆ గ్లాస్ సరిగ్గా ఉందా, విరిగి ఉందా?”

“విరిగి.. విరిగి.. నో.. సరిగ్గానే ఉంది”.

“సరిగ్గా ఉన్నప్పుడు దొంగ ఎలా దొబ్బేస్తాడు?”

“దొంగ ఎలా దొబ్బేస్తాడు.. దొంగ ఎలా దొబ్బేస్తాడు.. అవును, ఎలా దొబ్బేస్తాడు?”

“రైట్. దొబ్బలేడు కదా!”

“దొబ్బలేడు కదా.. దొబ్బలేడు కదా!”

“మరి మనకి టెన్షన్ వద్దు కదా!”

“టెన్షన్.. ఎలా వద్దు. మరో దొంగ వస్తే?

“ఏ దొంగైనా రాలేడు కదా!”

“ఏ దొంగైనా.. ఏ దొంగైనా.. నిజంగా రాలేడా? నిజంగా? ప్రామిస్?” అడిగాడు స్వయంప్రకాష్.

“నా ప్రామిస్ వద్దు. నువ్వే ఆలోచించు”. వేదనాభరితమైన ఆలోచనాపర్వం పూర్తయ్యాక ఎవడూ దూరి రాలేడని రూఢి చేసుకున్నాడు స్వయంప్రకాష్.

***

“ఇప్పుడు నేను చేసిన ట్రీట్‌మెంట్, రేషనల్ ఎమోటివ్ బిహేవియరల్ థెరపీ. అంటే, రోగిని హేతుబద్ధంగా ఆలోచింపజేయడం. ఇది అప్పుడప్పుడు పని చేస్తూ ఉంటుంది. పని చేశాక మళ్ళీ ఆ ఆబ్సెషన్ జోలికి పోడు.”

“అలాగని రోగం నయం అయినట్టు కాదు- మరో విషయంలో ఇలాంటి ప్రవర్తన చూపించవచ్చు. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. మందులు డోస్ మిస్ అవకుండా చూసుకోవాలి. ప్రతి రెండు నెలలకీ ఒక్క సారి అబ్బాయిని తీసుకు రండి”, అని స్వయంప్రకాష్ తల్లిదండ్రులకి చెప్పాడు గగన్.

***

ప్రభాత్ గగన్‌తో తన గురించి డిస్కస్ చేద్దామనుకున్న రోజు రానే వచ్చింది. అతను డైరీతో సహా గగన్ వాళ్ళ డ్రాయింగ్ రూమ్‌లో కూర్చున్నాడు. ఓ నాలుగు నెలలపాటు అతని దినచర్య ఆ డైరీలో నిక్షిప్తమై ఉంది. తను తన ప్రవర్తనని విశ్లేషించుకుంటే అతనికి కొన్ని తోచాయి – ఇదివరలో ముక్కుమీదుండే కోపం, ఇప్పుడు చుట్టుపక్కల కూడా కనిపించడం లేదు. తన మాట కాదంటే వచ్చే పిచ్చి కోపం, ఆనంద్‌ని నియంత్రించడంలో తనని తానే నియత్రించుకుంది! ఇప్పుడు అనుమానాలు తగ్గి తను మనుషులని నమ్మగలుగుతున్నాడు.

అందరు మనుషులూ నమ్మదగిన వారు కాదన్న సత్యాన్ని కూడా గుర్తుపెట్టుకోగలుగుతున్నాడు. మొన్నోసారి పాలవాడు కూతురికి ఒంట్లో బాగాలేదని ఓ రెండు వేల రూపాయలు అప్పు చేశాడు. తరువాత కల్తీ సారాయి తాగి, చావు తప్పి కన్ను లొట్టపోయి, వాళ్ళావిడ తన దగ్గర నుండి అప్పుగా తీసుకున్న డబ్బుతో చికిత్స చేయించుకుని, బతికి బయటపడ్డాడు.

తాను ఇదివరకటి ప్రభాత్ గనుక అయ్యుంటే, పాలవాణ్ణి నానా శాపనార్థాలూ పెట్టుండేవాడు. ఇంకా, ఈ విషయంలో తను ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నాడు. ఇలా ఎవరైనా చెప్తే, దగ్గరుండి డాక్టర్ వద్దకి తీసుకుని వెళ్ళి, ఫీజు చెల్లిస్తే, తనకు సాయం చేసిన తృప్తి మిగులుతుంది, ఎవరైనా అబద్ధాలు చెప్తే అవి బయటపడి, వాళ్ళ ఆరోగ్యం కూడా రక్షింపబడుతుంది.

తనకి మరో విషయం కూడా స్ఫురించింది. పూర్వాశ్రమపు బ్యాంక్ వాసనలు పోక, అప్పుగా డబ్బులు ఇచ్చాడే గాని, వాటిని తిరిగి తీసుకునే ఉద్దేశం తనకు ఇసుమంతైనా లేదు. ఒకటి, రెక్కాడితేగాని డొక్కాడని వాళ్ళు వాళ్ళు, పాపం. అందుకని ఇవ్వలేకపోవచ్చు. సపోస్, వాళ్ళు ఇస్తే? ఆఁ, తనకు ఆపాటి లేదా, పోదా, ఇంకాస్త వేసి, పిల్ల పేరిట ఒక ఎఫ్డీ తెరిస్తే పోలే?.. ఇలా తన పురోగమనంతో పాటుగా తనలో పెరిగిన మంచితనాన్ని కూడా గమనిస్తూ సంతోషిస్తున్నాడు ప్రభాత్.

“హాయ్ ప్రభాత్, ఆర్ యూ రెడీ?” అడిగాడు గగన్, డ్రాయింగ్ రూమ్‌లోకి వస్తూ. “అఫ్ కోర్స్”, అన్నాడు ప్రభాత్, డైరీ గగన్ చేతికి అందిస్తూ. “చెప్పండి, మీ అనుభవం ఎలా ఉంది?” అడిగాడు గగన్. అప్పుడే తన మనసులో ఏదో ఒక రిహార్సల్‌లాగ మెదలైన ఆలోచనలను అన్నింటినీ కూడగట్టి సవ్యంగా, ఎక్కడా కూడా పొల్లుపోకుండా చెప్పాడు ప్రభాత్.

“మీ హౌస్-మేట్స్ గురించి మీ అభిప్రాయం?” అడిగాడు గగన్ టూకీగా. “వాళ్ళతో మెలిగే అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు సర్వదా కృతజ్ఞుణ్ణి”, అని, గగన్ మొహంలో మారిన ముఖ కవళికలు చూసి, “ఓ, గగన్, మిమ్మల్ని నేను పొగడడం లేదు, ప్లీజ్, నన్ను నమ్మండి. ఆనంద్, అతని తండ్రితో కలిసి ఒకే ఇంట్లో ఉన్నాక కోపం తగ్గించుకోవడం, మరొకళ్ళ మాటకి విలువిచ్చి మనం వెనక్కి ఉండడం వంటి విషయాలు అవగాహన చేసుకున్నాను. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ విషం వెదజల్లే నా నాలుక, మరొకళ్ళ గురించి మంచి చెప్పడం మరచిపోయిన నా నాలుక, మౌనంగా ఉండడం, వాళ్ళ చిన్నచిన్న విజయాలను మెచ్చుకోవడం అలవాటు చేసుకుంది.”

“నిరూప్ నుండి క్రియాశీలకంగా ఉండడం నేర్చుకున్నాను. పిచ్చి ఆలోచనలు రానీయకుండా ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నుడై ఉండేవాడు. అతని తాగుడు అలవాటు సంగతి ఏమో గాని అతని నడవడిక ఎప్పుడైనా సరే, తప్పు పట్టేందుకు అవకాశం ఇవ్వకుండా ఉండేది. అలాంటి నడవడిక నాకే లేదు!”

“ఇన్‌ఫాక్ట్, మనం త్రయంబకేశ్వర్ గారి లెక్చర్ నుండి వస్తున్నప్పుడు నేను వ్యక్తిగత విషయాలు ప్రస్తావించాను. అయినా, అతను ఒక మామూలు మనిషిలా కాకుండా ఒక బుద్ధుడిలా మెదలకుండా కూర్చున్నాడు. పక్కవాళ్ళ పర్సనల్ విషయాల్లో తల దూర్చకూడదని అందరం అంటాం, కానీ ఫాలో అవం! అతను అంత సిన్సియర్‌గా ఫాలో అవుతుంటే నేను కూడా అతడి నుంచి నేర్చుకోవచ్చనిపించింది. ఏమంటారు?” అని ముగించాడు ప్రభాత్.

“ఏమంటాను? మీకు సెల్ఫ్-అప్ప్రైసల్ బాగా అబ్బిందంటాను! మీ తప్పులు ఒప్పుకునే జ్ఞానం వచ్చిందంటాను! గ్రేట్ అని కూడా అంటాను! వృత్తిపరమైన నియమావళిని ఉల్లంఘించి మీకు ఒక సీక్రెట్ చెప్పనా? మీరు నాపై కోపం తెచ్చుకోకూడదు మరి”, అన్నాడు గగన్. ప్రభాత్‌లో అసక్తి ఎక్కువైపోయింది. “చెప్పండి, గగన్, చెప్పండి, చెప్పండి”, అని తొందరపెట్టసాగాడు.

“మీలో ఇన్ని మంచి మార్పులు రావడానికి ముఖ్య కారణం, నేను ఇచ్చిన మందులు!” అన్నాడు గగన్.

అటుపక్క మౌనం. చంపేసే మౌనం. పది నిముషాలు పది యుగాల్లా గడిచాయి. ఈ లోగా ప్రభాత్ ముఖ కవళికల్లో ఎటువంటి మార్పులొస్తాయో గమనించడానికి గగన్ అతణ్ణి తదేక దృష్టితో చూడసాగాడు. హిస్టీరియాని సూచించే మార్పులేవీ కనపడలేదు. అసంకల్పితంగా ఒక చిన్న నిట్టూర్పు విడిచాడు గగన్.

మరో నిముషంలో ప్రభాత్ అతని చెయ్యి పట్టుకుని, “థాంక్ యూ వెరీ మచ్, డాక్, థాంక్ యూ”, అని సంతోషంగా అన్నాడు. ఆ తరువాతి కొన్ని నిముషాల్లో గగన్, అతనిలో ఈ మార్పు మందుల వల్ల ఎలా వచ్చిందో వివరించాడు.

ఈలోగా నేతి అరిసెలు వచ్చాయి. ప్రభాత్ ఈ నిజాన్ని అంగీకరించలేకపోతే అతని మనసుని మళ్ళించడం కోసం గగన్ పూర్ణిమతో ముందుగానే చెప్పి, చేయించాడు. అదృష్టవశాత్తు, అటువంటి విపత్తు ఏమీ వాటిల్లలేదు.

“ప్రభాత్, మీరు ఇలా రియాక్ట్ అవడం నాకెంతో ఆనందాన్ని ఇస్తోంది. అరిసెల కన్నా తీయనిది మీ రియాక్షన్”, అని అరిసె తింటూ మెచ్చుకున్నాడు గగన్. “ఇదివరలో నేను ఎలా రియాక్ట్ అయ్యేవాణ్ణో, ఇప్పుడెలా రియాక్ట్ అవుతున్నానో తేడా కనిపెట్టగలుగుతున్నాను. నా పాత ప్రవర్తన తలుచుకుంటే సిగ్గేస్తోంది”, అన్నాడు ప్రభాత్.

“నో, నో, గతం గతః. మనుషులన్నాక కష్టాలొస్తాయి. ప్రతీ మనిషికో కష్టం, ఒక్కో మనిషిదో స్పందన. ‘డియర్ జిందగీ’ సినిమాలో షారూఖ్ ఖాన్ ఒక మాటంటాడు, ‘బాధ తెప్పించే మన గతాన్ని వర్తమానంలో మనల్ని బ్లాక్‌మెయిల్ చెయ్యనిస్తే, మన బంగారు భవిష్యత్తు మన చేజారిపోతుంద’ని. సంఘం, సమాజం ఎట్‌సెట్రా ఎప్పుడూ అందరినీ ఏదో ఒకటి అంటూంటాయి- ఇవే ఆ బ్లాక్‌మెయిల్‌కి సంబంధించినవి. అందుకని, వాటి ప్రమాణాలకి లోబడి మనం ఆత్మన్యూనతా స్వభావం అలవరచుకోకూడదు; మన సంతోషాన్ని పోగొట్టుకోకూడదు”, అన్నాడు గగన్.

“నో డాక్, ఇది ఆత్మన్యూనత కాదు. ఆలోచిస్తూ ఉంటే, పాపం మృగనయనిలో తప్పు లేదేమో అనిపిస్తోంది”, అన్నాడు ప్రభాత్. “కొంచెం వివరాలిస్తారా?” అని ఏమీ తెలియనట్టు అడిగాడు గగన్. “అప్పట్లో నాకు లేనివి ఉన్నట్టు కనిపించేవి. అసలు, ఆమె ఏమైనా కలిపిందా లేక నేను భ్రమపడ్డానా?” వాపోయాడు ప్రభాత్.

“మీరు ఇంతటి ఆత్మావలోకనం చేసుకుంటున్నారు కాబట్టి మీకోక సర్‌ప్రైస్”, అన్నాడు గగన్. పూర్ణిమ లోపలినుండి మృగనయనిని తీసుకుని వచ్చింది. ప్రభాత్ ఆశ్చర్యపోయాడు. గుండ్రంగా ఉండే ఆమె మొహం పీక్కుపోయింది. బంగారం రంగులో మెరిసిపోయే ఆ మేని ఛాయ ఇప్పుడు పేలవంగా ఉంది. మనిషి బక్కచిక్కిపోయింది. మొత్తానికి ఒక రోగిష్ఠి మనిషిలా ఉంది.

ప్రభాత్ ఆమెను చూడగానే కన్నీళ్ళ పర్యంతం అయ్యాడు. “ఏమైందిరా నయనూ.. ఏమిటిలా అయిపోయావు? ఒంట్లో ఎలా వుందమ్మా బంగారం..” అంటూ ఆమెతో సంభాషణ మొదలుపెట్టాడు. “మీ మీది బెంగతోనే కృంగిపోయింది. దీన్నే క్లినికల్ డిప్రెషన్ అంటారు. మీకొచ్చిన స్కిజోఫ్రేనియా లాంటిదే! తీవ్రమైన మానసిక రోగం తెలుసా?” అన్నాడు గగన్.

“ఆమెకి భరణం బాగానే ఇచ్చానుగా? ఇంకెందుకు డిప్రెషన్?” అన్నాడు ప్రభాత్. “ఆవిడకి కావలసింది డబ్బు కాదు, ప్రభాత్ అనే మీరు.. తెలుసుకోండి. అసలే ఒంటిమీద స్పృహ లేని మీరు ఈ దుర్మార్గపు ప్రపంచంలో ఎలా నెట్టుకు వస్తున్నారో అని ఆవిడ బెంగ!”

అయోమయంగా చూసి ప్రభాత్, మృగనయని చేయి పట్టుకుని పసిపిల్లవాడిలా ఏడ్చేశాడు. వాళ్ళిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకునేందుకు వీలుగా గగన్-పూర్ణిమలు ఆ గదిలోంచి నిష్క్రమించారు. తమాషాగా ఆ సమయంలో మౌనం రాజ్యమేలింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here