మార్పు మన(సు)తోనే మొదలు-15

0
2

[ప్రసిద్ధ రచయిత్రి డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి రచించిన ‘మార్పు మన(సు)తోనే మొదలు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. తెలుగులో మానసిక ఆరోగ్యం కేంద్రంగా రచించిన నవల ఇది.]

[తమ బంధువు స్వయంప్రకాశ్‌కి  ఉన్న ఆబ్సెస్సివ్ కంపల్సివ్ డిజార్డర్‌ని నయం చేయడానికి నడుం బిగిస్తారు డా. గగన్, పూర్ణిమ. స్వయంప్రకాశ్‍తో మాట్లాడి, వివరాలు కనుక్కుని గగన్‍కి చెప్తుంది. ఓసీడీని ట్రీట్ చెయ్యాలంటే మందులు, కౌన్సిలింగ్‌తో పాటు కుటుంబ సభ్యుల మద్దతు కూడా చాలా అవసరమని అతని తల్లిదండ్రులతో వేరుగా కూర్చుని అతడితో ఎలా మసలుకోవాలో చెప్తుంది పూర్ణిమ. గగన్ కూడా స్వయంప్రకాశ్‍తో మాట్లాడి అతని అనుమానాలను దూరం చేస్తాడు. రేషనల్ ఎమోటివ్ బిహేవియరల్ థెరపీ అనే పద్ధతిలో ట్రీట్ చేస్తాడు. జాగ్రత్తగా ఉండాలని, మందులు డోస్ మిస్ అవకుండా చూసుకోవాలని, ప్రతి రెండు నెలలకీ ఒక్క సారి అబ్బాయిని తీసుకురమ్మని అతని తల్లిదండ్రులకి చెప్తాడు గగన్. ప్రభాత్‍లో ఎంతో మార్పు వస్తుంది. తనలోని మార్పు గురించి గగ‍న్‍తో వివరంగా చర్చిస్తాడు. తన భయాలు, అపోహలు అన్నీ దూరమయ్యాయని అంటాడు. ఆనంద్, అతని తండ్రి నుంచి; నిరూప్ నుంచి, త్రయంబకేశ్వర్ గారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్తాడు. అతనిలో ఇన్ని మంచి మార్పులు రావడానికి ముఖ్య కారణం, తానిచ్చిన మందులేనని అంటాడు గగన్. చక్కగా ఆత్మావలోకనం చేసుకున్నందుకు గాను అతనికో బహుమతి అంటూ మృగనయనిని లోపలికి పిలుస్తాడు గగన్. ఆమెని చూసిన ప్రభాత్ ఆశ్చర్యపోతాడు. రోగిష్ఠి మనిషిలా ఉన్న ఆమెను చూసి బాధపడి ఏం జరిగిందో తెలుసుకుంటాడు. అతని బెంగతోనే ఆమె మానసిక రోగం బారిన పడిందని గగన్ చెప్తాడు. ప్రభాత్, మృగనయని చేయి పట్టుకుని పసిపిల్లవాడిలా ఏడుస్తాడు. వాళ్ళిద్దరిని ఏకాంతంలో వదిలి తాము అక్కడ్నించి వెళ్ళిపోతారు గగన్, పూర్ణిమ. – ఇక చదవండి.]

[dropcap]“గ[/dropcap]గన్, మా వాడు మళ్ళీ కొత్త నాటకాలు మొదలెట్టాడు”, వచ్చే కోపాన్ని అణచుకుంటూ ఫోన్‌లో గుసగుసలాడాడు స్వయంప్రకాష్ తండ్రి. కరోనా అప్పుడప్పుడే ప్రబలుతోంది. వీడు మరో ఆబ్సెషన్ అలవరచుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. “ఏం చేస్తున్నాడేమిటి?” అని ప్రశ్నించాడు గగన్, ఒక పక్కన జవాబు ఏదైయ్యుంటుందో ఊహిస్తూనే!

“ఈ కరోనా దెబ్బతో వాడు ఊరికే చేతులు కడుక్కుంటున్నాడు. నెల రోజులు వచ్చే సోప్‌లు నాలుగు రోజుల్లో మటాష్ అయిపోయాయి తెలుసా? ఇప్పుడు సూపర్ మార్కెట్‌లో ఉన్న మామూలు సోప్‌లూ, లిక్విడ్ సోప్‌లన్నీ కొనుక్కొచ్చేశాడు. మా హౌసింగ్ సొసైటీలో ఆ మాట అట్టుడికిపోతోంది – ‘ఏం మీ కుటుంబం ఒక్కటే బ్రతికితే సరిపోతుందా? మేం బ్రతకక్కరలేదా?’ అని.

“మేమిద్దరం దొంగతనంగా మా స్టాక్‌లో కొన్నిటిని మిగిలిన వాళ్ళకి పంచి పెట్టాం. మా వాడు పాత పాట పాడడం మొదలెట్టాడు, మా ఇంట్లో దొంగ పడ్డాడని”, అని ఒగరుస్తూ బాధని పంచుకున్నాడాయన. “మీరు వాడితో మాట్లాడలేదా, వాడు చేస్తున్న పని, అదే, మిగిలిన వాళ్ళకి మిగల్చకుండా స్టాక్ చెయ్యడం తప్పని?” ఎదురు ప్రశ్న వేశాడు గగన్.

“అలా అడిగితే, వాడు ప్రభుత్వం వారి ప్రెస్ నోట్ నుండి టీవీలో వచ్చే ప్రకటనల వరకూ ముక్త కంఠంతో నినదిస్తున్న మాటలు, ‘చేతులను సబ్బుతో తరచుగా, కనీసం ఇరవై సెకన్ల పాటు, కడుక్కోండి’, అనే మాటని మాకు అప్పచెప్తున్నాడు. ఎక్కడ చస్తాం చెప్పండి? ప్రతీ నిముషానికి పది సార్లు చేతులు కడుక్కుంటున్నాడు. ఈ లెక్కన వాడి చర్మం ఉంటుందో ఊడుతుందో!”

“నేను మందులు ఇచ్చినంత మాత్రాన జబ్బు నయమవదు. ఎందుకంటే, ఇప్పుడు మనం కలవడం కుదరదు కదా! మీరు మాటలతో అతణ్ణి ఒప్పించాలి. అది చాలా టైమ్ పడుతుంది. అప్పుడప్పుడు వీడియో కాల్‌లో మాట్లాడుకుందాం. దాని వల్ల అతణ్ణి పర్ఫెక్ట్‌గా గమనించడం కుదరదు. కానీ, ఈ ఆబ్సెషన్ వల్ల మీ వాడికి కరోనా వ్యాధి సోకదు. ఆ పెద్ద గీత కన్నా ఈ గీత చిన్నది గనుక సంతోషించడం తప్ప ప్రస్తుతానికి ఇంకేమీ చేయలేం”, అని అప్పటికి చేతులెత్తేశాడు గగన్.

***

ప్రభాత్‌కి కుటుంబం దగ్గరయ్యింది గనుక, నిరూప్ ఇప్పుడు తన కాళ్ళ మీద నిలబడగలుగున్నాడు గనుక గగన్, అతణ్ణి వేరే ఇల్లు వెతుక్కోమని చెప్పాడు. ఏమైనా ఇబ్బంది ఉంటే, తను సాయం చేస్తానని కూడా చెప్పాడు. తాను సంస్కరింపబడిన తాగుబోతని చెప్పినా, గగన్‌తో సహవాసం వల్ల పెద్దగా కష్టపడకుండానే అతను అద్దె ఇల్లు సంపాదించాడు. సాంగత్య మహిమంటే అదే! అర్థాంతరన్యాసాలంకారంలో ‘పూలతో కూడి ఉండడం వల్ల దారం కూడా తలపై ధరింపబడుతోంది కదా!’ అనే ఉదాహరణ ఇస్తారు.

***

మరునాడు ప్రభాత్ ఇంట్లో..

“నయనీ, ఎలా నిన్ను అనుమానించాను? నువ్వెందుకు గమ్మునున్నావ్? గట్టిగా చెంపలు రెండూ వాయించలేకపోయావా?” ఆమె తల నిమురుతూ అడిగాడు ప్రభాత్. “మీరున్న పరిస్థితిలో అంతకన్నా ఏం చేయగలను?” అంది మృగనయని.

సాలోచనగా, “ఏమో, నువ్వంటే నాకిష్టం, నమ్మకమూను.. మరి, అలాంటప్పుడు, నీ స్కూల్‌మేట్ గాడి కోసం నువ్వు నాపై విషప్రయోగం చేసి, అడ్డు తొలగించాలని చూస్తున్నావని ఎందుకనుకున్నా చెప్మా?” అని అడిగాడు.

“అతను ఒక సైకియాట్రిస్ట్. మీరేమో మందులు వేసుకోనని మొండికేశారు. ప్రాబ్లం ముదిరితే హాస్పిటలైజ్ చేయాల్సి వస్తుందని డాక్టర్లంతా ముక్త కంఠంతో ఘోషిస్తుంటే మీకు తెలియకుండా..” అని ఆమె నీళ్ళు నములుతుండగా, “దొంగతనంగా ఇచ్చానంటావ్”, అని ముగించాడు ప్రభాత్. అతనిలో మునుపటి అనుమానపు చూపులు, పిచ్చి కోపం ఇప్పుడు లేవు.

మళ్ళీ తనే, “మరి నాకు విడాకులు ఎందుకిచ్చావ్?” అని అడిగాడు. “ఎందుకంటే.. ఎందుకంటే..” అని ఏడవడం మొదలెట్టింది మృగనయని. “సారీరా, నా బుద్ధిలేని తనాన్ని క్షమించు”, అని లెంపలేసుకున్నాడు ప్రభాత్. “మీ మాట తప్పని నేను నిరూపిస్తే, మీ ఉద్యోగం ఎక్కడ పోతుందో అన్న భయం. నాకేమైనా ఫరవాలేదు గానీ, మీకేమీ కాకూడదన్న ఆరాటం”, అంది మృగనయని, చేదు జ్ఞాపకాలు తెచ్చిన బాధ ముఖంలో ప్రతిబింబిస్తుండగా.

ప్రభాత్‌కి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. గతంలో కొన్ని గ్యాప్‌లు కనిపిస్తున్నాయి. ఎలా అడగాలో తెలియలేదు. నయని మనసు నొప్పించే ఉద్దేశం అతనికి లేనేలేదు. తన పరిస్థితిని గమనించి, ఎదుటి వాళ్ళ మనోభావాలకి ప్రాముఖ్యం ఇవ్వగలిగినందుకు సంతోషించాడు. కానీ, విషయాల్లో స్పష్టత లోపిస్తే తనకి చిరాకు వస్తుంది. దాన్నెలా తట్టుకోవడంరా బాబూ, అని మనసులో మథనపడ్డాడు ప్రభాత్.

భర్త మనోగతం తెలిసిన మృగనయని, “మరి నాకు జైలు శిక్ష ఎందుకు పడలేదనేగా మీ అనుమానం?” అనేసరికి ప్రభాత్ విస్తుపోయి, “నా మీద నీకు ఇంకా కోపం రావడం లేదా?” అని అడిగాడు. ఆమె, “స్కిజోఫ్రేనిక్ మీద ఉండాల్సింది కోపం కాదండీ, సానుభూతి, అర్థం చేసుకోవడం. మీరు అప్పుడు అలా ప్రవర్తించినప్పుడు, మీలోని రోగం మీకు కోపం తెప్పించి, అందరినీ అనుమానించేలా చేస్తోందని గగన్ అన్నయ్య చెప్పారు.”

“‘మన భుజాల మీద కోతి కూర్చుంటే, దాన్ని వదిలించుకోవడానికి రకరకాల వేషాలు వేయమూ?’ అని ఉపమానం కూడా వాడారు ఆయన. మీ మంచి కోసం, నేను ఫ్యామిలీ కోర్టు జడ్జీ గారితో మాట్లాడాను. ఆయన మీకొచ్చిన రోగానికి విడాకులివ్వకూడదని అన్నారు. నేను ఆయన్ని బ్రతిమిలాడాను.”

“నన్ను అనుమానించినా ఫరావలేదని, ఇప్పుడు విడాకులు ఇవ్వకపోతే మీరు ఏమైపోతారో, ఎటువంటి చర్యకి పాల్పడతారో అని భయపడ్డానని, మీకు డాక్టర్లిచ్చిన ప్రిస్క్రిప్షన్లు చూపించి ప్రాధేయపడ్డాను. నన్ను అనుమానిస్తున్న మీకు, నాతో పాటే అనుమానం దూరమౌతుందని ఆశపడ్డాను. అదే విషయం తండ్రి లాంటి ఆ జడ్జీ గారితో చెప్పాను. ఆయన ఒప్పుకున్నారు. నా తప్పు లేదు కనుక నాకు శిక్ష పడలేదు”, అని వివరించింది మృగనయని.

“నేను మళ్ళీ పెళ్ళి చేసుకుని, నువ్వు చేయని తప్పుకి శిక్షిస్తానని అనుకోలేదా?” అడిగాడు ప్రభాత్. “అంత ఆలోచన నాకు రాలేదు. మీరు బాగుంటే అంతే చాలనుకున్నాను”, అంది మృగనయని. “మరి నీ డిప్రెషన్ సంగతి?” అడిగాడు ప్రభాత్.

“మన విడాకుల తరువాత నాన్న గారొచ్చి, నేను వద్దన్నా వినకుండా నన్ను, అనామికనీ మా ఊరు తీసుకుని వెళ్ళిపోయారు. మీ ఆరోగ్యం గురించి ఆరాట పడుతున్న నన్ను తిట్టిపోసేవారు. ఇటు మిమ్మల్ని, మీ ఆలోచనలనీ వదులుకోలేక, అటు నాన్న ఆవేదననీ కాదనలేక నలిగిపోయాను. ఇక డిప్రెషన్ లోకి వెళ్ళడానికి ఎక్కువ కాలం పట్టి ఉండదు. పొద్దున్న లేచింది మొదలు మీ ఆలోచనలే! తరువాత వచ్చేవి కన్నీళ్ళే” అని కన్నీళ్ళు పెట్టుకుంది మృగనయని.

“సారీ డియర్, నాకు మతిలేకపోవడం వల్ల నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో! నేను కొన్నాళ్ళ పాటు ఉద్యోగం వెలగబెట్టాను గానీ, మనసు దేనిమీదా లగ్నం చెయ్యలేక, లేనిపోనివి ఊహించుకుని, ఆఖరుకి వీఆర్ తీసుకున్నాను. ఇక్కడికి వచ్చాక మీ అన్న వల్ల బాగుపడ్డాను”, అన్నాడు ప్రభాత్.

“నాకు తెలుసు. ఆయన చెప్పారు. ఆయనే నాకు ట్రీట్మెంట్ చేసి, బతికించారు”, అంది మృగనయని. “ఆయనకి ఎలా..” అని అనబోతూ, తమాయించుకున్నాడు. “మిమ్మల్ని చూసిన తరువాత మీకు తెలియకుండా నా గురించి వాకబు చేసి, నన్ను కలిశారు. నాకు ట్రీట్మెంట్ మొదలుపెట్టి ఎక్కువ కాలం అవలేదు, కానీ త్వరలోనే కోలుకుంటానన్న ఆశ నాలో చిగురించింది. ఒక్క విషయం, నాన్నలోని తండ్రితనం నామీద కరుకుగా ప్రవర్తించేటట్టు చేసి ఉండచ్చు గానీ, తల్లీ, తండ్రీ ఆయనే అయ్యి, మన అనామికని పెంచారు”, అంది మృగనయని.

“నా తప్పిదానికి మీరంతా శిక్ష అనుభవించారు. ఆయన నిన్ను కోపడ్డారంటే అది ఆయన తప్పు కాదు. ఇంతకీ, అడగడం మరిచేపోయాను, అనామిక ఏం చేస్తోంది?” అడిగాడు ప్రభాత్. “ఎంబీయే పూర్తి చేసి, కార్పొరేట్ ఉద్యోగం ఇష్టపడకుండా, మా ఊళ్ళో చేనేత కార్మికులకి చేయూతనిచ్చే ఓ ఎన్‌జి‌ఓలో పని చేస్తోంది. అన్నట్టు మహానుభావా, మన జీవితం ఒక గాడిలో పడింది కదా! అమ్మాయికి పెళ్ళి సంబంధాలు చూడాలి మరి!” అని సాలోచితంగా అంది మృగనయని.

“ముందు మనకి పెళ్ళి కానీ! తరువాత అమ్మాయి సంగతి చూడొచ్చు”, అన్నాడు ప్రభాత్. అయోమయంగా చూస్తున్న ఆమెతో, “నీ లెక్కలో మనం విడిపోకపోయినా, ఇప్పడు చట్టరీత్యా భార్యాభర్తలు అవకుండా ఒకే ఇంట్లో ఉంటే, లోకం కోడై కూయదూ?” నవ్వుతూ అన్నాడు ప్రభాత్.

విషయం ఆకళింపు చేసుకున్న మృగనయని, చటుక్కున దూరం జరిగిపోయి, “అవును ఇదొకటుంది కదూ! త్వరగా ముహూర్తం పెట్టించండి. అన్నట్టు ఇప్పుడు కరోనా రోజులు కూడా. సామాజిక ఎడాన్ని పాటించాలి. మనమ్మాయి విషయంలో ఒక చిన్న రిక్వెస్ట్ – మనమిద్దరమూ మానసిక రోగులమే గనుక దానిపై అవగాహన ఉండే అబ్బాయికే పిల్లనిద్దాం”, అంది. తలూపాడు ప్రభాత్.

కొన్నాళ్ళ తరువాత, ఓ మంచి ముహూర్తాన, స్థానిక రిజిస్ట్రార్ వారి కార్యాలయంలో, ప్రభాత్, మృగనయని మళ్ళీ చట్టపరంగా దంపతులయ్యారు. సాక్షి సంతకాలు గగన్, అనామికలు చేశారు. తల్లిదండ్రులకి అరవయ్యో ఏట మళ్ళీ పెళ్ళిని వేడుకగా చేసే సంప్రదాయమున్న ఈ దేశంలో, వారి చట్టబద్ధమైన వివాహానికి సాక్షి సంతకం పెట్టే అవకాశం కేవలం అనామికకే దక్కిందేమో!

గగన్ ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన వాళ్ళ పెళ్ళి విందుకి వచ్చిన గెస్ట్‌లు డి‌ఎం‌హెచ్‌పికి సంబంధించిన వారు, వారి కుటుంబ సభ్యులు మాత్రమే. అంటే, ‘సేవిక’ మల్లిక, చిన భూపతి, ఆమె అన్న మధు కుటుంబం, నర్సులు నిరూప్, కామాక్షి, ఇన్స్‌పెక్టర్ భారత్ కుటుంబం, ఆడ్వకేట్ జాయ్ కుటుంబం, ఫారెస్ట్ ఆఫీసర్ కుటుంబం, దివిజ్, పెళ్ళి పెద్దలైన గగన్, పూర్ణిమ, శశి. పైగా, ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి, నలభై మంది దాటలేదు! శశి, దివిజ్‌లు హడావుడంతా చేశారు. విందు సింపుల్‌గా ఉంది, కానీ ఆత్మీయంగా ఉందని అందరికీ అనిపించింది.

హడావిడి తగ్గాక తాతయ్యతో పాటు బయలుదేరడానికి సిద్ధపడిన అనామికతో, “నాపై నీకు కోపం వుండొచ్చు. కానీ, మా ఇద్దరి తరఫున ఒక వెడ్డింగ్ గిఫ్ట్ అడుగుతాను, కాదనవుగా”, అన్నాడు ప్రభాత్. అనామిక పైకి నిండుకుండలా తొణకకపోయినా, లోలోపల ఆమెకు తన తండ్రిపై కోపం – తల్లి ఇన్ని కష్టాలు పడడానికి అతడే కారణం అనుకుంది గనుక. అసలే తాతయ్య పెంపకంలో పెరిగిన పిల్ల, కనీసం కొంతైనా ఆయన బుద్ధిని ఇనుమడింపజేసుకోదూ, మరి!

‘ముసలి వయసొచ్చాక తల్లిని మళ్ళీ పెళ్ళి చేసుకోవడం ఒక పెద్ద ఘనతన్నట్టు, ఇప్పుడు ఈయన గారిని అభినందిస్తూ ఓ గిఫ్ట్ కూడా ఇవ్వలా? తల్లి కోరికపై పెట్టిన సాక్షి సంతకం సరిపోదా?’ అని మనసులో అనుకుంటూ, “చెప్పండి”, అంది ముక్తసరిగా.

 “మా తల్లివి కదూ, మాతోపాటు ఇక్కడ ఉండిపోమ్మా!” అన్నాడు ప్రభాత్. అగ్నిపర్వతం బద్దలయ్యి, లావా పెల్లుబికినట్టు, ఆమెలో ఇన్నాళ్ళుగా కరుడు కట్టి, పేరుకుపోయిన దుఃఖమంతా ఒకేసారి బయటికి వచ్చింది. “తండ్రి ప్రేమకు తపించినప్పుడు నాకు అది దొరకలేదు. ఇప్పుడు అది లేకపోయినా బతకడానికి అలవాటు పడ్డాను. నాలాగే లేని వాళ్ళు నాకోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళాలి”, అంది కంట తడి పెట్టుకుంటూ. “నాకు ప్రేమ లోపించింది, వాళ్ళకి చేతిలో కళ ఉండీ, కడుపు నింపుకునే ఆధరువు లోపించింది”, మళ్ళీ తనే అంది, విడమర్చి చెప్పినట్టు.

ఇక్కడే ఉండిపొమ్మని కూతుర్ని ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తున్న ప్రభాత్‌కి ఆపద్బాంధవుడల్లే ప్రత్యక్షమయ్యాడు గగన్. “తండ్రీ కూతుళ్ళ కబుర్ల మధ్యకి నేను అనవసరంగా వచ్చినట్టున్నానే?” అన్నాడు. “మా అమ్మ హెల్త్‌ని బాగుచేసిన దేవుడు మీరు. మీరు వస్తే ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు.” టూత్ బ్రష్ వ్యానిటీ కిట్‌లో పెట్టుకుంటూ మనసారా అంది అనామిక.

గగన్ ఆమె మాటల్లోని విశేషం గమనించాడు. ‘అమ్మ హెల్త్’ అంది గాని ‘నాన్న ఆరోగ్యం’ అనలేదు ఆమె! దాన్ని బట్టి ఆమెకు ఎవరంటే ప్రియమో తేటతెల్లమయ్యింది. సర్ది ఉన్న సూట్‌కేసు, అనామిక అప్పుడు చేస్తున్న పని, ఆమె ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పాయి.

కానీ, ఒక సైకియాట్రిస్ట్ ఆ కుటుంబాన్ని కలపాలనుకుంటాడు కదా! అందుకే, గగన్, “నేనిప్పుడు వచ్చింది నీతో మాట్లాడాలని”, అన్నాడు, అనామిక వైపు తిరిగి. “నాతోనా?” అంది, విషయాన్ని కనిపెట్టలేక. “‘మార్పు మనతోనే మొదలు’ అనే ఎన్‌జి‌ఓ ఉంది కదా!” అన్నాడు. “తెలియదంకుల్”, అంది వాచీ వైపు చూసుకుంటూ. “వెళ్ళేది కార్ లోనే కాబట్టి, ఇవ్వాళ కాకపోతే రేపు బయలుదేరుదువు గాని. కానీ, ఇప్పుడు నా మాట విను”, అన్నాడు గగన్.

అయిష్టంగా వినడానికి సిద్ధపడింది అనామిక. గగన్ దివిజ్ గురించి, వాళ్ళ ఎన్‌జి‌ఓ గురించి, వాళ్ళు చేస్తున్న, చేయబోతున్న పనుల గురించి, సాధించిన విజయాల గురించీ టూకీగా చెప్పి, ఆ మహా యజ్ఞంలో తనని కూడా పాలుపంచుకోమని కోరాడు. ఆలోచనలో పడింది ఆమె.

తాను అంగీకరించినా, లేకపోయినా, తన తల్లిదండ్రులిద్దరూ మానసిక రోగగ్రస్థులు. అటువంటి వారికి సహాయపడడం, సమాజంలో వాళ్ళ మీద అవగాహన పెంపొందించడం ఉత్తమమైన ఆదర్శాలే! తాను ప్రాణప్రదంగా చూసుకునే చేనేత ఎన్‌జి‌ఓ ఇప్పుడొక స్వావలంబన సంతరించుకుంది. తాను లేకపోయినా మనగలదు. ఏదైనా సంక్షోభం వస్తే తను ఉండనే ఉంది.

పంతం కొద్దీ తను వెళ్ళిపోదామనుకుంటోంది గానీ, ఈ ఎన్‌జి‌ఓలో పనిచేస్తే భలే స్ఫూర్తిదాయకంగా ఉండొచ్చు. ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, గగన్ అంకుల్ అండదండలుంటే, సత్తు గిన్నె అయినా బంగారమవుతుంది. ఇంత మంచి అవకాశం వదులుకోవడం ఎందుకు?

తనేదో ఎంబీయే చేసి, కార్పొరేట్ ఉద్యోగం చెయ్యడంలేదని గొప్పగా ఫీల్ అవుతోంది గానీ, ఇక్కడి అబ్బాయి ఇంకా పెద్ద ఉద్యోగాన్ని వదులుకుని మానసిక రోగులకి సేవలందించే మహత్తర కార్యానికి పూనుకున్నాడు. తను కూడా ఓ చెయ్యేసి సాయం చేస్తే బాగుంటుంది కదా!

“అనూ, ఏమిటి, ఎక్కడికి వెళ్ళిపోయావు?” అడిగాడు గగన్. “నేను ఆలోచించడానికి ఓ రెండు రోజులు కావాలి”, అందామె. “అయితే, నీ ప్రయాణం మానుకున్నట్టే కదా?” తెలివిగా అడిగాడు గగన్. “నో, నో, సపోస్ ఇక్కడకు రావాలంటే తాతయ్యా, నేనూ వైండ్అప్ చెయ్యాలిగా!” అంది అనామిక. “మనసులో మాట తెలియకుండానే బయటకి వచ్చేస్తుంది”, అన్నాడు గగన్. అందరూ నవ్వుకున్నారు.

చెప్పినట్టే ఒక నెల రోజుల్లో అనామిక, తన తాతయ్యతో కలిసి గగన్ వాళ్ళ ఊరికొచ్చి, మార్పు కోరే యోధుల్లో ఒకరయ్యింది. అనుకోకుండా కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కావలసిన మనోధైర్యం విషయంలో తను కూడా ఓ చెయ్యేస్తుందని అప్పుడు అనుకోలేదు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here