Site icon Sanchika

మార్పు మన(సు)తోనే మొదలు-2

[ప్రసిద్ధ రచయిత్రి డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి రచించిన ‘మార్పు మన(సు)తోనే మొదలు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. తెలుగులో మానసిక ఆరోగ్యం కేంద్రంగా రచించిన నవల ఇది.]

[డా. గగన్‍కి ఆ రాత్రి నిద్రపట్టదు. కారణం ఆలోచించగా, పొద్దున్న చూసిన ఓ కేసు గుర్తొస్తుంది. తాను ఔట్‍రీచ్‍కి వెళ్ళిన ఒక ఊరిలో భార్యాభర్తలిద్దరు తమ కొడుకుని తీసుకుని వస్తారు. ఆ అబ్బాయి విచిత్ర ప్రవర్తనని వివరిస్తారు. ఆ అబ్బాయిని పరిశీలించిన గగన్ – ఆ పిల్లాడు అటెన్షన్ డెఫిసిట్ హైపర్ఆక్టివ్ డిసార్డర్ అనే రోగంతో బాధపడుతున్నాడని గ్రహించి, తగిన మందులిచ్చి, ఆ అబ్బాయితో ఎలా నడుచుకోవాలో తల్లిదండ్రులకు వివరిస్తాడు. దేశంలో మానసిక రోగులకు వైద్యం లభించటం, కౌన్సిలంగ్ దొరకటం కష్టమవుతోందని భావిస్తాడు. మర్నాడు వాళ్ళ పనిమనిషి మంజుల తన భర్త తనపై చేతబడి చేయిస్తున్నాడంటూ ఏడుస్తూ వస్తుంది. గగన్ భార్య పూర్ణిమ ఆమెని ఊరడించి, అసలేం జరిగిందో కనుక్కుంటుంది. గగన్ మంజుల భర్తని పిలిపించి వివరం అడగగా తన భార్య ప్రవర్తనలో వచ్చిన మార్పులను, ఆమె చేష్టలను వెల్లడిస్తాడు. మంజులది మానసిక సమస్యని అని గుర్తించిన గగన్ ఆమెకు మందులిస్తాడు, మంజులని తన కూతురితో సహా వచ్చి పొద్దున్న నుంచి సాయంకాలం వరకూ తమ ఇంట్లో పూర్ణిమతో ఉండాలని అంటాడు. క్లినికల్ సైకాలజీలో ఎంఫిల్ చేసిన పూర్ణిమ భర్త అలా చెప్పడంలోని కారణం గ్రహిస్తుంది. పూర్ణిమ తల్లి సుధకి ఒంట్లో బాలేదని, ఏదో గైనిక్ సమస్యని అని ఆమె తండ్రి ఫోన్ చేసి చెప్తే, కొడుకు శశాంక్‍ని తీసుకుని ఊరు వెళ్తుంది. సమయానికి సెలవు దొరకక గగన్ వెంటనే వెళ్ళలేకపోతాడు. ఆదివారం సెలవు రావడంతో అత్తగారింటికి వెడతాడు. ఆవిడని మాటల్లో పెట్టి ఆవిడ సమస్యని గుర్తిస్తాడు. మందులు రాసిచ్చి వస్తాడు. తన సమస్యని అల్లుడితో చెప్పినందుకు కూతురిని తిడుతుందామె. – ఇక చదవండి.]

[dropcap]అం[/dropcap]తే! సుధ కోపంగా, “అయ్యో అయ్యో.. చూశారా? ఆ పిచ్చి డాక్టర్ గాణ్ణి అల్లుడిగా తెచ్చుకోవద్దంటే విన్నారా? వెనుకబడిన జిల్లాలో కాపురం, అక్కరకు రాని చుట్టం లాంటి వాడు..”, అని ఇంకా ఏదో చెప్పబోతే, రామారావు, “సుధా, ఇవన్నీ ముందే తెలిసిన విషయాలే కదూ! ఇప్పుడు నీకతని మీద కొత్తగా వచ్చిన కోపమేమిటో కాస్త సెలవియ్యి”, అన్నాడు దీనంగా.

“నాకేవో పిచ్చి మందులిచ్చాడండీ.. వీడెక్కడి అల్లుడండీ బాబూ..”, అని ఇంకా అల్లుణ్ణి ఆడిపోసుకుంటోంది సుధ. “మెనోపాజ్ అందరు ఆడాళ్ళకీ వచ్చే సమస్యే కదా!” అన్నాడు రామారావు. “ఆఁ, మీరు కనిపెట్టిన ఈ వింతకి మీకు నోబెల్ ప్రైజ్ ఇస్తారు లెండి”, అంది సుధ వెటకారంగా. “అలా కాదు సుద్దూ, నా మాట పూర్తిగా వింటావు కదూ!” అని బుజ్జగించాడు రామారావు. ఆమె కొంత శాంతించింది.

“అత్తయ్యకి ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేసింది?” అడిగాడు రామారావు. “ఏం చేయగలదు? మనసులో బాధపడడం తప్ప!” కళ్ళు చెమరుస్తూండగా చెప్పింది. “కదా! ఆవిడ ఎలా పోయారు?” అన్నాడు రామారావు. “నేను అల్లుడు గురించి గింజుకు చస్తుంటే మధ్యలో రామాయణంలో ఈ పిడకలవేట ఏమిటి? మా అమ్మ మిమ్మల్ని రాచిరంపాన పెట్టిందా ఏం?” విసుక్కుంది సుధ. “ఆవిడ అచ్చం నీలాగే అత్యుత్తమ ఇల్లాలు. ఆవిణ్ణి ఏమైనా అంటే కళ్ళు పోవూ?” అన్నాడు ఆచితూచి. కొంచెం ప్రసన్నమైంది సుధ.

“సుద్దూ, ఆవిడ హఠాత్తుగా గుండె ఆగి, పోయారు కదా! ఆవిడ మెనోపాజ్‌లో పైకి చెప్పుకోలేక అనుభవించిన వేదన ఆవిడ గుండె ఆగిపోవడానికి కారణం అయ్యుండచ్చేమో?” అన్నాడు. కాస్సేపాలోచించింది సుధ. “అవునూ”, అని మొదలెట్టగానే, బాంబు బద్దలౌతుందేమో అని భయపడ్డాడు రామారావు. “కాదూ”, అని ఆలోచిస్తూ మాట మార్చి, “ఇన్ని ఆలోచనలు మీకెలా వచ్చాయి?” అడిగింది సుధ.

ఇలాంటి విషయాల్లో లాజిక్ మహా బాగా పనిచేస్తుంది ఆమెకు, అని మనసులో అనుకున్నాడు రామారావు. “మన అమ్మాయి, అల్లుడు – వీళ్ళిద్దరితో మాటలాడి తెలుసుకున్నాను లేవోయ్”, అన్నాడు. వెంటనే సుధ మొహంలో రంగులు మారాయి.

“‘ముందొచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి’, అని ఊరికే అన్నారా? చూశారా చూశారా, అమ్మాయి మనల్ని సమర్థించకుండా, అల్లుణ్ణి వెనుకేసుకొస్తోంది! వాళ్ళని అనుకుని ఏం లాభం లెండి, మన బంగారం, అంటే మీరు, నా తరఫున ఉంటే, ప్రతీ అడ్డమైన వాళ్ళనీ సహాయం అడగక్కరలేదు కదా!” అని రామారావుని కూడా కలిపి, టోకుగా తిట్టిపారేసింది సుధ.

ఈ లోగా అక్కడికి వచ్చిన పూర్ణిమని చూసి, ఆమె ఈ సంభాషణ విన్నదేమోనన్న భయంతో కొంచెం గుమ్మడికాయల దొంగ లాంటి లుక్కొకటిచ్చాడు రామారావు. పూర్ణిమ అతడికి అభయమిచ్చినట్లు చెయ్యి చూపి, సుధతో, “అమ్మా, టూ మచ్. చదువుకున్నదానివి, ఇలా మాట్లాడడం నీకు భావ్యమా? మూడ్ స్వింగ్స్ ఈ టైమ్లో ఉంటాయన్న విషయం తెలియదూ? వేళాకోళం కాకపోతేను?” అంది. “హాహా, గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించడమంటే ఇదే!” అని లంకించుకుంది సుధ. “అన్నట్టు ఇప్పుడు భక్తి ఛానెల్లో ఏ ప్రోగ్రాం వస్తుంది?” అని సుధ మనసుని విజయవంతంగా మళ్ళించింది పూర్ణిమ.

***

పూర్ణిమ, శశాంక్ తిరిగి వచ్చిన కొన్ని రోజులకి..

“అదేవిఁటి మంజులా, పాపని ఇంటిలో వదిలేసి వచ్చావు?” అడిగింది పూర్ణిమ. “అదేటమ్మా, దానివల్లే కదా నేనింత నీరసించిపోయాను”, అంది కటువుగా. పూర్ణిమ విని వదిలెయ్యకుండా, “అందుకేనా, ఆ రోజు దాన్ని చంకనేసుకుని పరుగెత్తి వచ్చావు?” అంది ఆమెను బాగా గమనిస్తూ. మంజుల పెడబొబ్బలు పెట్టింది. ఆమెను ఓదార్చేసరికి తలప్రాణం తోకకి వచ్చింది పూర్ణిమకి. అయినా, తను వేసిన ఎత్తు, మంజులని చిత్తు చేసింది.

“ఏటోనండి అమ్మగోరూ, దీన్ని సాకే ఓపిక నాకు లేదనిపిత్తాంది.. ఎంతో కట్టపడి దీన్ని కన్నానాండీ? ఇది నా పాలు తాగుతాందో, నా పేనాలు తాగుతాందో ఎరుక నేదండి”, అని కళ్ళు తుడుచుకుంది. “అలా అనుకుంటే ఎలా? తల్లిపాలు బిడ్డకి మేలు కదా”, అంది పూర్ణిమ.

“పోనీ, అదొగ్గియ్యండి.. పిల్ల బిగ్గరగా ఏడుత్తాదండి.. నాకైతే ఎక్కడలేని బయమూ ఒచ్చేస్తాదండీ.. విసుగు ఒస్తాదండీ.. ఎక్కడ సస్తానండీ.. నాకే ఓపిక లేకపొతే ఇదెవత్తండీ నన్ను యేపుకు తిండానికి? అందుకే పిచ్చ కోపమొచ్చి దీన్ని తిట్టుకుంటానండి”, అంది మంజుల. “అసలు దాని వయసెంతని, నువ్వు బాధ పడుతున్నావని తెలుసుకోవడానికి? చంటి పిల్లని, అందులోనూ నీ కూతుర్ని ఇలా తిట్టుకోవడం భావ్యమేనా?” అని పూర్ణిమ మంజులని అడిగింది.

“అవునమ్మగోరూ, నేనేటిలా సేత్తన్నానని అప్పుడప్పుడు బాద ఏత్తాదండి.. అప్పుడు నేను చేసిన నిర్లక్ష్యానికి పరిహారం చేత్తానండి.. దానికి పగడరు పూత్తానండీ.. ముత్తాబు చేత్తానండి, గారాబం కూడా”, అంది.

గగన్ పూర్ణిమతో ఏ కేసు విషయమూ చర్చించడు. కారణం- ఇంటిలో ఉండే ఆ కొద్దిసేపట్లో ఆసుపత్రిని చర్చకి తీసుకుని రాకూడదనుకుంటాడు గనుక. ఈ విషయంలోనూ వాళ్ళిద్దరూ చర్చించుకోలేదు. కారణం – పూర్ణిమ చేయవలసిన పని తనకు తెలుసు గనుక. మంజులను వేధిస్తున్న ఆ జబ్బు పేరు పోస్ట్ పార్టమ్ క్రుంగుబాటు (డిప్రెషన్).

కాన్పు అనే కష్టమైన సంతోషం పొందడానికి స్త్రీలు పరితపిస్తారు. దాని తరువాత వచ్చే శారీరిక, మానసిక మార్పులను తట్టుకోలేక చాలామంది ఈ క్రుంగుబాటుకి గురయ్యి, అనేక విధాలుగా కష్టపడుతుంటారు. భారతదేశంలో ఎప్పుడైనా ఇంచుమించు ఒక కోటి మంది స్త్రీలు ఈ జబ్బుకి గురౌతారు.

కొంత మంది నిరాశ, నిస్పృహలకు లోనైతే, మరి కొందరు నిష్కారణంగా బెంబేలు పడిపోయి పెడబొబ్బలు పెడుతూ ఉంటారు. కొందమందికి ఏకాగ్రత, నిద్ర లోపిస్తే, మరి కొందరికి నీరసమొస్తుంది. కొందరికి ఇవన్నీ రావచ్చు.

మానసిక వైద్యుణ్ణి సంప్రదిస్తే కొన్ని నెలల్లోనే మటుమాయమౌతుంది. స్పష్టమైన అవగాహన లేక జనాలు బాధపడుతూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు. మంజుల కూడా అంతే! పిల్ల మీద విసుక్కోవడం, లేదా అతి ప్రేమ ఒలకబోయడం – ఇవన్నీ ఈ వ్యాధి లక్షణాలే!

***

అటుపక్క సుధ విసుగు వల్లరి కొనసాగుతోంది. వేసవి సెలవులకి ఎప్పటిలాగే పూర్ణిమ, శశాంక్‌లు వాళ్ళ ఇంటికి వెళ్ళారు.

ఎండాకాలంలో ఊరగాయలు, వడియాలు పెట్టే పని మహాజోరుగా జరుగుతోంది సుధ వాళ్ళింట్లో. పైగా ఆమెదే పెత్తనం. తను చేసినంత చేసి, రామారావుకి, పూర్ణిమకీ పనులు పురమాయిస్తోంది.

“ఏవఁడోయ్, గేటు తాళం పెట్టమన్నాను కదా! పెట్టారా, లేదా? ఏ అల్లరి చిల్లరి అర్ధాయుష్ వెధవో మీకిష్టమైన గుమ్మడి వడియాలెత్తుకుపోతే, ఇంతే సంగతులు – పడ్డ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరౌతుంది!” అని జవాబు కోసం ఎదురు చూడకుండా, సుధ చెప్పుకుపోతోంది. “వేసి గూట్లో పెట్టానులే సుద్దూ! చిన్న విషయానికి ఇంత రాద్ధాంతం ఎందుకు?” అని విసుగు (క)వినబడకుండా చెప్పాడు రామారావు.

“ఒరేయ్ ఒరేయ్ ఆకతాయి బడుద్ధాయీ, ఏవిఁట్రా, ఎండబెట్టిన మాగాయ ముక్కలన్నీ లాగించేస్తున్నావ్? పూరీ, మీ సుపుత్రుణ్ణి కాస్త అదుపులో పెట్టు. లేకపోతే ఈ ఏడు నో మాగాయ్. చూసుకో.. నీ ఫేవరెట్.. ఇదేం పెంపకమే తల్లీ.. మీ వాణ్ణి బకాసురుడిలా పెంచావు?” అని శశాంక్‌ని ఆడిపోసుకుంటూ పూర్ణిమని బెదిరిస్తోంది.

పూర్ణిమ మనసులో నవ్వుకుంది. ఎవడో తెలియనివాడు దొంగతనం చేస్తే అల్లరి చిల్లరి అర్ధాయుష్ వెధవ, తన మనవడే ఆ ఘనకార్యం చేపడితే ఆకతాయి బడుద్ధాయీను. మనుషుల ద్వంద్వ ప్రమాణాలు ఇలాగే ఉంటాయి, అనుకుంది.

వాళ్ళ మనవడంటే ఎంత గారం ఒకప్పుడు! వెనుకటికి ఒకసారి వాడు ఇదే పని చేస్తే, తను వారిస్తే, ‘నా మనవడు.. వాడికిష్టమొచ్చినంత తింటాడు. ఖాళీ అయితే మళ్ళీ పెట్టుకుంటాం గానీ వాణ్ణేమీ అనకు’, అంది వాళ్ళమ్మమ్మ. అదే అమ్మమ్మ, ఇప్పుడు ఎలా మారిపోయిందో! కాల మహిమ కాదు, మెనోపాజ్ మహిమ!

కొంతసేపటికి గావుకేక, వంటింట్లోంచి. అసలే ఎండా కాలం, కొంపలేమైనా అంటుకున్నాయేమోనని రామారావు, పూర్ణిమ పరుగెత్తారు. వాళ్ళు వంటింటికి దగ్గర పడిన కొద్దీ మాడు వాసన వేసింది. భయం భయంగా వాళ్ళు వెళ్ళి చూస్తే, గదంతా దట్టమైన పొగవల్ల ఏమీ కనిపించలేదు. అప్పుడు వినిపించాయి సుధ మాటలు, “మీరంతా నా దృష్టి మరల్చడం వల్ల, మాగాయ పోపు పొయ్యి మీద పెట్టి మరచిపోయాను. నన్ను ఇలా డిస్టర్బ్ చేయడం ఏమైనా బాగుందా?” అని.

పూర్ణిమకి విషయం అర్థమయ్యింది. ఆ తాత్కాలిక మతి మరపు, రెండు మూడు పనులు, అదే మల్టీ-టాస్కింగ్ చేయలేకపోవడం, విసుగు, అలసట – ఇవన్నీ మెనోపాజ్ లక్షణాలే! వీటిని చాకచక్యంగా మేనేజ్ చేయడం కష్టం, శరీరం నీరసిస్తోంది గనుక. అందరు ఆడవాళ్ళకీ ఈ స్థితి వస్తుందని తెలుసు. అయినా, తట్టుకోగలమనుకుంటారు, ఎప్పటిలాగే ఉండాలని ప్రయత్నించి, డిప్రెషన్ బారిన పడతారు!

తల్లి చేసే పనులని ఎలాగైనా తగ్గించాలన్న నిర్ణయానికి వచ్చి, తండ్రితో మాట్లాడి, మరుసటి రోజు నుండీ తనే వంట చేస్తానని, తల్లికి తగ్గ తనయురాలవుతానని తల్లిని ఛాలెంజ్ చేసింది పూర్ణిమ. సుధ సందిగ్ధంలో పడింది. కూతురు పనిమంతురాలు కాకపోతే, ఆ లోపానికి బాధ్యురాలు తనవుతుంది. పూర్ణిమ పనిమంతురాలు అయితే, తన పెత్తనం  గట్టెక్కుతుంది.

రెండవ దారే నయమనిపించి, పెత్తనం కూతురికి అప్పజెప్పి, తను విశ్రమించడం మొదలెట్టింది. గగన్ చెప్పిన మందులు వేసుకోవడం, పూర్ణిమ చెప్పిన ధ్యానం, యోగాసనాలు క్రమం తప్పకుండా చేయడం వల్ల సుధ త్వరలోనే కోలుకుంది.

శశాంక్ స్కూల్ మొదలుపెట్టే సమయం దగ్గర పడడం వల్ల, పూర్ణిమ ఇంక బయలుదేరక తప్పలేదు. వెళ్తూ, మందులూ, మెడిటేషనూ మరచిపోవద్దని చెప్పింది తల్లితో. సుధ, “నా దగ్గర సద్గురువు గారి ఆశీస్సులున్నాయి. జీవితంలో ఏ కష్టమొచ్చినా అధిగమించగలను”, అంది నవ్వుతూ. సద్గురువు గారు ఎప్పుడూ ఆ మాటే అంటారు, ‘ధ్యానం చేస్తే, సమస్యలు సమసిపోవు గాని, వాటిని ఎదుర్కొనే శక్తి లభిస్తుంది’, అని. తల్లి పడే బాధ ఇక తీరినట్టే అని, సంతోషంతో శశాంక్‌తో సహా రైల్వే స్టేషన్‌కి బయలుదేరింది పూర్ణిమ.

***

“ఏమిటి మంజులా మీ పాపేమంటోంది?” అంది పూర్ణిమ యథాలాపంగా. అలా మొదలెట్టి, మంజులకి రోజుకొక కథ చెప్తోంది పూర్ణిమ. అన్నీ మన పురాణ ఇతిహాసాల్లోవే! వినాయకుడు, రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, గరుత్మంతుడు, ధ్రువుడు, మార్కండేయుడు, ఆది శంకరులు, గోదాదేవిలాంటి దేవుళ్ళు, దైవ భక్తుల బాల్య కార్యకలాపాల గురించి కళ్ళకి కట్టినట్టు చెప్పింది. తన కూతురి చేష్టలలో వాళ్ళందరినీ చూసుకోవచ్చని, తెలియని భయాల వల్ల ఆ ఆనందాన్ని వదులుకోవద్దని నచ్చజెప్పింది.

అదే సమయంలో రకరకాల వ్యాయామ భంగిమలు నేర్పి, రోజూ చేయించేది. శ్వాసని నిదానించే పద్ధతులు బోధించేది.

ముందు, “ఆల్లంతా గొప్పోల్లు. పైగా ఎక్కువగా మొగోల్లు. ఎవైఁనా సేస్తారు. నా పిల్లకేటి తెలుసు? ఏటి సెయ్యగలదు?” అని వాపోయేది మంజుల. తరువాత, ఆ కథలు వింటూ, తన కూతురి కేసి చూసి మురిసిపోయేది. సాక్షాత్తూ, గోదాదేవే తన కూతురిగా పుట్టిందని అనుకునేది. ఆ తరువాత, స్వాతంత్ర్య దినోత్సవానికి పూర్ణిమ, పాపాయికి త్రివర్ణ గౌను కొనిచ్చి, తొడగమంది. దీన్ని ఐడియాగా తీసుకుని, జన్మాష్టమికి పాకే తన కూతురికి కృష్ణుడిలా అందంగా ముస్తాబు చేసింది మంజుల. ఆ తరువాత విజయదశమికి ఎఱ్ఱటి గౌను – ఇలా అందంగా ముస్తాబు చేసి, మురిసిపోయేది మంజుల.

ఇలా గగన్ ఇచ్చిన క్రుంగుబాటు వ్యతిరేక మందులు, పూర్ణిమ చేసిన కౌన్సిలింగ్, నేర్పిన శారీరిక-మానసిక వ్యాయామాల వల్ల కొన్ని నెలల్లోనే కోలుకుంది మంజుల. సంక్రాంతికి, మంజుల, పాపతోను, తన అన్నా వదినలతోను వచ్చి, తనని బాగుచేసిన ఈ దంపతులు ‘శివపార్వతులు’, అని పరిచయం చేసింది. వాళ్ళు సంతోషంతో కూడిన అణకువతో వీళ్ళకి నమస్కారం చేసి, నిష్క్రమించారు.

***

పెడబొబ్బలు పెడుతున్న ఒక యువతిని తీసుకుని వచ్చారు కొందరు. తన వయసు ఇరవై రెండు- ఇరవై మూడు కన్నా ఉండవు. ఆమె దెయ్యం పట్టిన చంద్రముఖిలా తనకడ్డు తగిలిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా కొట్టేస్తోంది. ఆమెను చూస్తే, చిన్నప్పుడు తనకి అమ్మ చెప్పే ఒక కథ గుర్తొచ్చింది గగన్‌కి. అది పిచ్చి సుబ్బమ్మ కథ. ఆమె చిన్నప్పుడు ఉండే ఇంటికి పక్కింటి యజమాని చెల్లెలుట ఆవిడ.

మామూలుగా బాగానే ఉండేదిటగాని, కోపం వస్తే పట్టెమంచాన్ని సైతం తలకిందులు చేసేదట. అందుకని ‘చంద్రముఖి’లో జ్యోతిక మంచాన్ని ఎత్తిపడేసే సీన్ చూసి, దర్శకుడి ఎరుకలో ఏ సుబ్బమ్మో, రావమ్మో ఉన్నారేమో అని అనుకున్నాడు తను. ఇప్పుడు తన వద్దకి వచ్చిన ఆవిడకి కరెంటు షాక్ ఇస్తే పైత్య ప్రకోపం వెంటనే తగ్గుతుంది గానీ, ఈ రోజుల్లో ఆ పద్ధతిని మరీ అత్యవసర పరిస్థితుల్లో తప్ప వాడడానికి వెనుకాడతారు.

పైగా, రోగి స్పృహలో ఉన్నప్పుడు కరెంటు షాక్ ఇవ్వకూడదు. రోగి పరిస్థితి చూసి, తగిన మోతాదులో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి, ఆమె మత్తులోకి జారుకున్నాక షాక్ ఇవ్వాలి. ఏ మోతాదులో ఇంజెక్షన్ ఇవ్వాలో బేరీజు వెయ్యడానికి తనకి క్వాలిఫికేషన్ లేదు. వెనుకబడిన జిల్లాలోని డి‌ఎం‌హెచ్‌పికి ఒక మత్తు డాక్టర్ని పోస్ట్ చేసేటంత అవకాశం లేదు. అందుకని, ఆమె నరాలు విశ్రమించే ఇంజెక్షన్ ఇచ్చి, ఆమె బాగోగులు కనుక్కున్నాడు.

***

కొత్తగా పక్కింట్లోకి ఎవరో రాబోతున్నారని చెప్పకనే చెప్పాయి ఆ దులుపుళ్ళు, సర్దుళ్ళూ. ఓపీ నుండి ఇంటికి తిరిగి వస్తున్న గగన్ కుతూహలం కొద్దీ విషయం కనుక్కున్నాడు. ఆ ఇంటి వాళ్ళు దిగబోతున్నారట. ఆశ్చర్యపోయాడు. ఈ రోజుల్లో అంతగా ఓ మోస్తరు చిన్న ఊళ్ళో స్థిరపడడానికి ఎవరొస్తారబ్బా అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళాడు గగన్.

కొన్నాళ్ళకి ఆసుపత్రికి వెళ్తూండగా పక్కింటి గేటు దగ్గర ప్రభాత్ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు గగన్. మనిషి శుష్కించిపోయాడు. పలుకరిద్దామా, వద్దా అని తను తటపటాయిస్తుండగానే, అతను వచ్చి, “నమస్కారం గగన్ గారూ! మీరేమిటిక్కడ?” అన్నాడు. “నేనుండేదిక్కడే! ఆ ప్రశ్న నేనే వేయాలి! ఈ వెనుకబడిన జిల్లాలో ఋణాల మంజూరు పెంచమని పంపిందా మీ బ్యాంకు? చెల్లాయి, పాప ఎప్పుడొస్తున్నారు? ఈ పాటికి అనామిక ఏ పదో క్లాస్లోకో వచ్చి ఉంటుంది కదా!” అని పలుకరించాడు గగన్.

ఆ మాటలకి ప్రభాత్ మొహంలో రంగులు మారాయి. “ఆ రాక్షసి పేరెత్తకండి గగన్ గారూ! అదొక ద్రోహి.. భర్తకి ద్రోహం చేసే టైపు”, అని కటువుగా అన్నాడు. ఆ సమయంలో ఇంక ఆ సంభాషణ పొడిగించకుండా, “నేను మిమ్మల్ని సాయంత్రం కలుస్తాను. భోజనం కోసం కష్టపడకండి. మా ఆవిడ క్యారియర్ పంపిస్తుంది. ఇంకా ఏమైనా కావాలంటే మా ఇంటికి కబురెట్టండి చాలు!” అని తన దారిన తను వెళ్ళాడు. చేరగానే, పూర్ణిమకి ఫోన్ చేసి, టూకీగా విషయం చెప్పి, జాగ్రత్తగా ఉండమన్నాడు.

***

ఆసుపత్రిలో కాస్త ఊపిరి పీల్చుకునే టైమ్ దొరికినప్పుడు ప్రభాత్ పరిచయం గుర్తుకి తెచ్చుకున్నాడు గగన్. చాలా ఏళ్ళ క్రితం..

***

డాక్టర్ నుంచి పిలుపు రాగానే, మిగిలిన వాళ్ళ అనుమానపు చూపుల్ని చూసీ, చూడనట్టు లోపలి వెళ్ళింది మృగనయని. లోపలికి వస్తున్న ఆమె పరిస్థితి గమనించి, “మీతో పాటు ఎవరొచ్చారు?” అడిగాడు గగన్. “అంటే.. సార్.. నేను పేషెంట్‌ని కాను. మా వారు పేషెంట్”, అంది. “నాకు తెలుసు. తార  చెప్పింది. కానీ, ఆయన్ని తీసుకురాలేదేం?” అడిగాడు డాక్టర్. “అయన ఉద్దేశంలో అయన ఆరోగ్యానికేమీ ఢోకా లేదట”, జవాబిచ్చిందామె. “చెప్పండి”, అన్నాడతను. జరిగింది జరిగినట్టుగా గుర్తు తెచ్చుకుందామె.

***

“ఆయన బ్యాంకు ప్రొబేషనరీ ఆఫీసర్ల పరీక్ష పాస్ అయి, ప్రతీ పోస్టులోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఏ బ్రాంచిలోనైనా మునుపెన్నడూ లేనంతగా బ్యాంకు వ్యాపారాన్ని వృద్ధిలోకి తెచ్చేవారు. ఋణాలు ఇప్పించడంలోనైనా, వసూలు చేయడంలో అయినా ఆయనదే అందె వేసిన చెయ్యి. ఆయన పనిచేసే శాఖలో ఎన్‌పీయేలు ఇంచుమించుగా లేవంటే అతిశయోక్తి కాదు.”

(ఇంకా ఉంది)

Exit mobile version