Site icon Sanchika

మార్పు మన(సు)తోనే మొదలు-7

[ప్రసిద్ధ రచయిత్రి డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి రచించిన ‘మార్పు మన(సు)తోనే మొదలు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. తెలుగులో మానసిక ఆరోగ్యం కేంద్రంగా రచించిన నవల ఇది.]

[ఇన్‌స్పెక్టర్ భరత్ కృషి వలన కనబడకుండా పోయిన చినభూపతి జాడ తెలుస్తుంది. ఒక ఫారెస్టాఫీసర్ చినభూపతిని ప్రభాత్ వద్దకు చేరిస్తే, ప్రభాత్ అతన్ని డా. గగగ్‍కి అప్పగిస్తాడు. అన్నావదినలకి అప్పగిస్తే, వారు చినభూపతిని మళ్ళీ ప్రమాదం తలపెట్టే అవకాశం ఉందని భావించి, డా. గగన్, తన మిత్రుడు, లాయర్ అయిన జాయ్ సహాయం కోరుతాడు. మల్లిక తాను చినభూపతిని పెళ్ళి చేసుకుంటాని అంటుంది. వారిస్తాడు డా. గగన్. అయినా మల్లిక పట్టువీడదు. చట్టప్రకారం ఆ పెళ్ళి చెల్లదని లాయర్ జాయ్ చెప్తాడు. అయినా అతని సంరక్షణ బాధ్యత తనకి వచ్చేలా కోర్టులో కేసు వేయమని అడుగుతుంది మల్లిక. అలాగే వేస్తాడు జాయ్. తాను చినభూపతిని కంటికి రెప్పలా చూసుకుంటానని, అతని ఆస్తి తనకి అవసరం లేదనీ, అందుకని తమ పెళ్ళికి అనుమతించాలని న్యాయమూర్తిని కోరుతుంది మల్లిక. కొన్నాళ్ళకి కోర్టు అనుమతి లభిస్తుంది. గగన్ పర్యవేక్షణలో మందులు వాడిన ప్రభాత్ మామూలు మనిషవుతాడు. తనలో వచ్చిన మార్పును గగన్‍కి వివరిస్తాడు. ఊరు వెళ్ళి వచ్చిన గగన్ తన ఇద్దరు వ్యక్తులను తీసుకువస్తాడు. ఒకరు ఏ‌డీహెచ్‌డీ పేషెంట్, ఆనంద్, మరొకరు అతడి తండ్రి. వాళ్ళిద్దరిని ప్రభాత్ ఇంట్లో దింపి – ఆ అబ్బాయిని ఎలా చూసుకోవాలో వివరంగా చెప్పి – వాళ్ళిద్దరి బాధ్యతని అతనికి అప్పజెప్తాడు గగన్. ఆనంద్ అల్లరిని, దుందుడుకు చేష్టలని భరిస్తూ, అతని తండ్రిని గమనించుకుంటూ – ఇద్దరికి సర్దిచెబుతూ – తనకి గగన్ అప్పజెప్పిన బాధ్యతను జాగ్రత్తగా నిర్వహిస్తాడు ప్రభాత్. వాళ్ళిద్దరి మానసిక ఆరోగ్యమూ మెరుగౌతుందన్న ఆశ, అతని మనసులో చిగురిస్తుంది. – ఇక చదవండి.]

[dropcap]ఔ[/dropcap]ట్‌రీచ్‌లో ఉన్న గగన్‌కి యథాప్రకారం ఒక అడిక్షన్ కేసు తగిలింది. అలాగని అది రొటీను కాదు. నిరక్షర కుక్షులైన మద్య దాసులు సర్వ సాధారణంగా తారసిల్లుతుంటారు కానీ ఈ గ్రీకు వీరుడు చదువుకున్న వాడు, విజయాలు సాధించిన వాడూను.

అతని పేరు నిరూప్. గగన్ స్కూలుకెళ్ళే సమయంలో అతని చిత్రాలు స్పోర్ట్స్‌స్టార్ లాంటి ఆటల పత్రికల్లో ప్రచురితం అయ్యేవి. అతణ్ణి చూడగానే చిన్ననాటి జ్ఞాపకాలు తనను చుట్టుముట్టాయి.

తను ఒక మామూలు స్కూల్లో అందరిలాగా, వందలాది విద్యార్థుల్లో ఒక అనామకుడిలా చదువుకుంటూంటే, అతను, స్వయంకృషితో ఛాంపియన్ అయ్యాడు. ఆ స్కూల్ బయట ఎంత మందికి తన పేరు తెలుస్తుంది? కానీ, ఈ అబ్బాయి పేరు అప్పుడే దేశంలో మారుమ్రోగిపోతోంది, అనుకునేవాడు తను.

అతను ఒక వెయిట్ లిఫ్టర్. అతను ఒక పేద కుటుంబంలోంచి వచ్చినా, వాళ్ళ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రోత్సాహం వల్ల పైకి వచ్చాడు. పల్లెలో సరైన ట్రైనింగ్ వసతులుండవని పట్నానికి వెళ్ళాడు. ఒక స్పాన్సర్ కూడా లేకపోయినా, కడుపు కట్టుకుని, ఉండడానికి సరైన వసతులు లేకపోయినా, ఆట మీద ఏకాగ్రత పెట్టి, జాతీయ క్రీడలలో బంగారు పతకం సంపాదించుకుని, మన్ననలు అందుకున్నాడు.

“మిమ్మల్ని ఈ పరిస్థితిలో చూస్తానని అనుకోలేదు. చిన్న వయసులో మీరు సాధించిన విజయాలు చాలా ఎక్కువ కదా! అప్పట్లో నేను మీ అభిమానిని!” అన్నాడు గగన్.

“అప్పట్లో.. అవును.. అప్పట్లోనే! ఇప్పుడు నన్ను ఎవరూ గుర్తుపట్టరు.. గుర్తు పట్టారంటే నన్నో తాగుబోతు గానే! హ హ హా.. అవునూ.. మీరెలా గుర్తు పట్టారు? నేను సాధించిన విజయం, ప్రఖ్యాతులు వాటి వెంట కొంత డబ్బు, బోలెడు ఈర్ష్యాద్వేషాలని తెచ్చి పెట్టాయి. నేను గొప్పింటి బిడ్డని కానని గేలి చేసేవారు కొందరైతే, నేను ప్రిస్టేజ్ ఉండే స్కూళ్ళలో చదవలేదనే వారు కొందరు. ఎవరైనా బాగుపడితే వాళ్ళలో లోపాలు వెతికే వారికి ఈ లోకంలో కొదవ లేదు.

నేను పొగడ్తలకి పొంగిపోలేదు. విమర్శలకి, అవమానాలకీ కృంగిపోలేదు. ఏమీ పట్టనట్టు నా విజయ పరంపరని కొనసాగించాను. మీరు గమనించే ఊంటారు. నాకు అత్యంత ఆనందాన్నిచ్చింది ఆసియా క్రీడల్లో నా విజయం. బ్యాంటమ్ వెయిట్ వర్గంలో మొట్టమొదటి పతకం, అందునా బంగారు పతకం భారతదేశం తరఫున సాధించడమంటే మామూలు విషయం కాదు కదా!

అప్పట్లో ఏ ఇద్దరు మాట్లాడుకున్నా, నా గురించే, అని ఎవరైనా అంటే, నా మనసు ఉప్పొంగేది.  రాబోయే ఒలింపిక్ క్రీడల్లో భారత్‌కు ఖచ్చితంగా బంగారు పతకం సంపాదించి పెట్టే ఆటగాళ్ళలో నా పేరు అందరికన్నా ముందుండేదంటే అతిశయోక్తి కాదు. నాకు ఆ సత్తా ఉందని నేనూ నమ్మేవాణ్ణి.

క్రీడాస్పర్ధలకి తయారీ జోరుగా సాగుతోంది. నాలో మనోధైర్యం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఒలింపిక్స్‌లో ఖచ్చితంగా ఏదో ఒక పతకం సాధించగలనన్న ఆత్మవిశ్వాసం నాలో నానాటికీ వేళ్ళూనుతోంది. ఇవన్నీ టీవీ చర్చలలోను, న్యూస్ పేపర్లలోనూ చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. నా గురించి నేను చెప్పనక్కర లేదు.

అలాంటి సమయంలో, ఒలింపిక్స్ హీట్స్లో జరిగిన మూత్ర పరీక్షలో నేను ప్రొహిబిటెడ్ డ్రగ్స్ తీసుకున్నానని తేలింది. అంతే! అంతవరకూ నన్ను ఆకాశానికెత్తిన వాళ్ళంతా నా విలువరాహిత్యాన్ని దుమ్మెత్తి పోశారు. కొందరైతే నా పేదరికాన్ని వేలెత్తి చూపి, ‘ఒకేసారి ఇంత డబ్బు, కీర్తీ చవి చూసేసరికి, ఒంటి మీద స్పృహ లేకుండా అడ్డదార్లు తొక్కుతారు ఈ నడమంత్రపు సిరి కలిగిన వాళ్ళు’, అని వెటకారంగా మాట్లాడారు.

నేను తెలిసి ఎటువంటి తప్పూ చేయలేదు. కానీ, నా మాట వినిపించుకునే వాళ్ళు ఎవరు?” భోరుమంటూ, నీళ్ళు తాగాడు. “కొంపదీసి, అది తప్పుడు రిపోర్టా ఏమిటి?” ఆదుర్దాగా అడిగాడు గగన్. “అది కరెక్టే. ప్రైజ్ గెలుచుకోవడానికి తప్పుడు దారి తొక్కే వాళ్ళు చేతకాని దద్దమ్మలు. నాకు అంత ఖర్మేం పట్టింది? అంటే, నా మీద కుళ్ళు ఉన్న వాళ్ళు ఈ పని నాకు తెలియకుండా చేసుంటారన్న ఆలోచన ఒక్కరికీ రాలేదేమి?” బాధపడ్డాడు నిరూప్.

“పోనీ, మీ కోచ్‌తో చెప్పలేకపోయారా?” అడిగాడు గగన్. “మిగిలిన వాళ్ళు నన్ను ప్రత్యక్షంగా తిట్టిపోస్తూ ఉంటే, ఆయన నన్ను పరోక్షంగా తిట్టారు. అంతే గాని, నా బాధని పంచుకునే ప్రయత్నం చేయలేదు. చెరువులోని కప్పల సామెత నా విషయంలో నూరు శాతం నిజమయ్యింది. అందరూ వెలివేసే ఒంటరినైపోయాను”, అన్నాడు నిరూప్. “మరి, ఈ డ్రగ్ ఎలా మీ ఒంట్లోకి చేరింది?” అడిగాడు గగన్.

“ఒలింపిక్స్ ముందర, నా తోటి ట్రైనీలంతా మందు పార్టీ అడిగారు. ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం రావడం చాలా అరుదైన అదృష్టం కదా అని, నేను వాళ్ళకి పార్టీ ఇచ్చాను. ఎవరైనా కలిపారేమో, నన్ను పక్కకి తప్పించడానికి”, అన్నాడు నిర్లిప్తంగా. “ఎవరో కనిపెట్టారా?” ప్రశ్నించాడు గగన్.

“నా సహచరుల్లో ఎవరో ఒకరు దొంగ దెబ్బ తీశాక, అది ఎవరని కనిపెట్టి ఏం లాభం? పోనీ, కనిపెట్టానే అనుకోండి, న్యాయస్థానంలో దాన్ని నిరూపించగలనా? నాకు శివుడి పేరుందని మురిసిపోయేవాణ్ణి. ఇలా నా జీవితం విషమయమౌతుందని అనుకోలేదు; నిరూప్ అంటే అనామకుడిగా మిగిలిపోవాలని ఏదైనా నాకు తెలియని ఒక కొత్త అర్థం ఉందేమో”, అంటూ భోరున ఏడవసాగాడు నిరూప్.

“ఊరుకోండి నిరూప్ గారూ! మీకు పెళ్ళయ్యిందా?”

నిరూప్‌కి ఒక వెటకారపు నవ్వొచ్చింది. “ఈ రోజుల్లోలాగ సెలబ్రిటీల చుట్టూ అమ్మాయిలు తిరిగే రోజులు కావవి. నాపై చెరగని మచ్చ పడ్డాక, నన్నెవరు ఇష్టపడతారు చెప్పండి? అందలం ఎక్కించిన వాళ్ళే అరికాలితో తొక్కాలనుకుంటే, నన్ను పిలిచి, పిల్లనెవరిస్తారు?” నిస్పృహతో అన్నాడు నిరూప్.

“అలా బాధపడకండి. నా డౌట్ ఏమిటంటే, ఇప్పుడు డీ-అడిక్షన్ కోరి రావడానికి ఏమైనా బలమైన కారణం ఉందా?” అడిగాడు గగన్.

“నాకు బతుకు, చావుకి మధ్య తేడా ఉండేది కాదు, ఈమె నాకు బుద్ధి చెప్పే వరకూ!

నా చెల్లెలు. ఇప్పటి వరకూ పెళ్ళి చేసుకోలేదు, నా బాగోగులు చూసుకునేందుకు! ఒక అబ్బాయి దాన్ని ఇష్టపడ్డాడు. తనకీ ఇష్టమే అయినా, నా కోసం అతణ్ణి చేసుకోనని భీష్మించుకుని కూర్చుంది. అవన్నీ ఈ మధ్యనే తెలిశాయి.

నేను ఆమెను వారించబోతే, ఆమె ఒక షరతు పెట్టింది- నేను మందు పూర్తిగా మానేసిన ఆరు నెలలకి చేసుకుంటానంది”, జవాబిచ్చాడు నిరూప్. “ఆరు నెలల లెక్క ఏవిఁటి?” సందేహం వెలిబుచ్చాడు గగన్. “మళ్ళా రీ-లాప్స్ అవలేదుకదా అని చెక్ చేయడనికి అది దానికిచ్చుకున్న టైమ్”, వివరించాడు నిరూప్.

“మీ అంతట మీరే మందు మానెయ్యాలనే అభిలాషతో రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే, నాతో మా ఊరు రండి. మా పక్కింట్లో ఉండి, మీ జీవితంతో బాటు మరి కొన్ని జీవితాలని చక్కదిద్దుదురు గాని”, అని అభ్యర్థించాడు గగన్. కాస్సేపు ఆలోచించి, సరేనన్నాడు నిరూప్.

***

నిరూప్‌కి నోరు పిడచ కట్టుకునిపోయింది. తాగాలని అనిపించినప్పుడు ఏ మంచి నీళ్ళో తీసుకోమన్నాడు డాక్టర్. ట్రీట్మెంట్ మొదలుపెట్టిన కొత్త గనుక మందులు తన మీద అంత గొప్పగా పనిచేయడం లేదేమో, అనుకున్నాడు నిరూప్. డీ-అడిక్షన్లో మొట్టమొదటి మెట్టు డీటాక్స్. శరీరంలోను, మెదడులోను, రక్తానాళాలలోను, ఇంకా ఎక్కడెక్కడ మద్యం పేరుకుపోయి ఉంటుందో, దాన్ని మొత్తంగా బహిష్కరించడమే డీటాక్స్. అచ్చ తెలుగులో చెప్పాలంటే నిర్విషీకరణ. దీనికి సరైన మందులు అప్పటికే తన శరీరంలోకి తనే ప్రవేశింపజేశాడని నిరూప్‌కి తెలియదు.

డీటాక్స్ సమయంలో రోగి కొన్ని విత్డ్రాయల్ సింటమ్స్ కనబరుస్తాడు. రోగం తీవ్రతని బట్టి చేతులు వణకచ్చు, లేనివి ఉన్నట్టుగా కనిపించవచ్చు. ఇలా మరి కొన్ని లక్షణాలు కనుబరుచవచ్చు. వీటి ప్రాబల్యం మొదటి మూడు-నాలుగు రోజుల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇవి వస్తే తీసుకొవలసిన జాగ్రత్తలు ప్రభాత్‌కి చెప్పి ఉన్నాడు గగన్, అవసరమైతే నిరూప్ని ఆసుపత్రిలో చేర్పించడానికి.

అదృష్టవశాత్తూ, నిరూప్‌కి చేయి వణుకుడు తప్ప మరేమీ జరగలేదు. కానీ, గండం గడిచినట్లే, అని అనుకోవడం కుదరదు ఇలాంటి జబ్బుల్లో. ఎందుకంటే, దురలవాట్ల బారిన పడడం కన్నా, వాటి వాత నుంచి బయటపడడం ఇంకా చాలా కష్టం గనుక.

తాగాలని అనిపించినప్పుడు ఏదైనా మంచి పనిపై మనసు మళ్ళించమన్నాడు గగన్. అందుకు వీలుగా ఆనంద్‌ని, అతడి తండ్రినీ గమనించాడు. తన మనసుకి స్ఫురించిన విషయాలు డాక్టర్‌తో చర్చించాడు కూడా!

కొన్ని కొన్ని రోజుల్లో ఆనంద్ చాలా రెస్ట్‌లెస్‌గా ఉండేవాడు. ధ్యానం చేయడానికి కూడా మారాం చేసేవాడు. కోపంతో వస్తువులు గిరవాటు వేయడం, విరిచి పారెయ్యడం లాంటివి అప్పుడు చేసేవాడు. అంటే, పాత లక్షణాలు పునరావృతమౌతున్నాయన్న మాట.

బుద్ధి పెరగకపోయినా, దేహం పెరిగి, హార్మోన్లు మార్పు చెంది, అతనిలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి అని చెప్తే అర్థం చేసుకునే స్థాయి అతడి తండ్రికి లేదు; ఆనంద్‌కీ లేదు. కానీ ఇప్పుడు నిరూప్ రాకతో ట్రీట్మెంట్ మారింది – నిరూప్ ఆనంద్‌ని కుస్తీ పట్టు పట్టేవాడు. దేహదారుఢ్యం ముందు పిచ్చికోపం ఓడిపోక తప్పలేదు.

అదీకాక, ఇప్పుడు ఆనంద్ పరిస్థితి కాస్త మెరుగయ్యింది గనుక ఆటల నిబంధనలు పాటిస్తున్నాడు. గోల పెట్టట్లేదు. అందుకని, ఆ మంచి ప్రవర్తనకి బదులుగా అతనికి (ఇప్పటికీ) ఇష్టమైన స్వీట్, పీచు మిఠాయి, ఇవ్వడం జరిగింది. తరువాత, ప్రభాత్‌ ఆధ్వర్యంలో అందరూ ధ్యానం చేసేవారు.

ఆ తరువాత, మనసు మళ్ళించడం కోసం, వ్యాయామం, కోసం నిరూప్ తోట పని చేసేవాడు. ఇటుకలు తెప్పించమని చెప్పి, క్రోటన్లు వేరుగా, పూజ కోసం వాడే పూల చెట్లు, మొక్కలు వేరుగా, ఇంకా తలలో పెట్టుకునే పూల మొక్కలు- చామంతి, కనకాంబరం, మల్లి, బంతి, రోజాల మొక్కలు- వేరుగా ఉండేట్టు మళ్ళు కట్టాడు; పెద్ద చెట్లకి బోదెలు కట్టాడు. అతని ప్లానింగ్ చూస్తే, చిన్నప్పుడు మొక్కల మీద చాలా అసక్తి కలవాడని తెలుస్తుంది.

ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఆనంద్, అతని తండ్రి, నిరూప్ – ముగ్గురి ఆరోగ్యమూ గమనించదగ్గ స్థాయిలో మెరుగయ్యింది. సరైన వ్యాయామం, నిద్ర, ధ్యానం, సత్కాలక్షేపం దొరికాయి గనుక నిరూప్‌కి తాగుడుపై మనసు పోలేదు.

ఆనంద్‌తో ప్రభాత్‌ ఎలా నడుచుకుంటున్నాడో గమనించిన అతని తండ్రికి, తన బిడ్డతో తాను ఎలా మసలుకోవాలో నెమ్మదిగా తెలుసుకున్నాడు; ఆనంద్‌ని అయినదానికీ, కాని దానికీ ఆడిపోసుకోవడం తగ్గించాడు. తన కుమారుడిలో వచ్చే మెరుగుదలని గమనిస్తూ సంతోషించాడు. పైగా, ధ్యానం వలన కోపాన్ని నిగ్రహించుకోగలుగుతున్నాడు కూడా.

ఆనంద్ లేచిన వెంటనే కొంత గోల చేసినా, ధ్యానం చేస్తున్నాడు. ఆ తరువాత తను విరగ్గొట్టిన వాటిని అతికించడం నేర్చుకుంటున్నాడు. ప్రభాత్ అతనికి నేర్పిస్తున్నాడు. ఇంకా, అతుకులు కనిపించకుండా వాటి మీద పెయింటింగులు, వగైరా కూడా వేసి, కొత్త అందాన్ని ప్రసాదించడం నేర్పిస్తున్నాడు జూనియర్ గగన్, అదే మన శశాంక్. ఈ కొత్తవి నేర్చుకోవడం వల్ల అతని మనసులోని కల్లోలం కొంత అదుపులోకి వచ్చింది. దానికి నిదర్శనం ఈ మధ్యనే ఆనంద్ చేత పడ్డ ఒక పూల సజ్జ. ఇంకా ఎన్నో కూడా ఉన్నాయి.

***

జీవితం ఇలా మూడు రోగాలు, ఆరు పేషెంట్లులా కొనసాగుతుండగా, ఒక రోజు మధ్యాహ్నం గగన్‌కి అనుకోని సంతోషాన్ని తెచ్చి పెట్టింది – అతడు మ్యాగ్సేసే పురస్కారాన్ని పొందాడట! ఇలా తనకో పురస్కారం వస్తుందని కల్లో కూడా అనుకోలేదు!

మరో రోజు గగన్‌కి ఒక ఫోన్ వచ్చి, సంబర పడిపోయాడు. తన స్నేహితుడి కొడుకు, దివిజ్, ఎంబీయే పూర్తవగానే మ్యాన్హట్టన్ లోని ఒక పెట్టుబడుల బ్యాంకులో ఉద్యోగం వచ్చిందట. “దివిజ్, నీ ఘనతకి నేను సంతోషిస్తున్నాను. ఒక పెద్దవాడిగా చెప్తున్న మాట విను. నువ్వు రాట్‌రేస్‌లో పాల్గొనబోతున్నావ్.. జాగ్రత్త.. తేనె పూసిన కత్తులు అన్ని చోట్లా ఉంటాయి”, అని నాలుగు మంచి మాటలు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు.

“శుభం పలకరా అంటే, మంకన్న ఏదో అన్నాడట. అలా ఉంది నీ వరస. పాపం, ఆ పిల్లాడు ఒక పెద్ద ఉద్యోగానికి వెళ్ళబోతుంటే, తేనె పూసిన కత్తులూ, గాడిద గుడ్డూ- ఏవిఁటివి?” కాస్త విసుగూ, మరికాస్త కోపమూ మేళవించిన గొంతుతో అంది పూర్ణిమ.

తనకు వచ్చిన ఒక వాట్సాప్ మెసేజ్‌ని టూకీగా వివరించాడు గగన్: ‘ఒక తెలివైన యువకుడు ఐఐటీలో చదివి, అమెరికాలో ఒక ప్రఖ్యాత విశ్వవిద్యాలయం నుండి ఎంబీయే పట్టభద్రుడై, ఎక్కువ జీతమున్న ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఒక అందమైన అమ్మాయిని పెళ్ళి చేసుకుని, ఐదు బెడ్రూంల ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవిస్తూ ఉండేవాడు. ఒకనాడు భార్యా బిడ్డల్ని చంపి, తన ప్రాణం తీసుకున్నాడు.’

‘ఈ విషయమై మానసిక శాస్త్ర నిపుణులు ఆరా తీయగా అతను సబ్-ప్రైమ్ సంక్షోభంలో తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడని, తక్కువ జీతానికి కూడా పని దొరకలేదని, కిస్తు కట్టలేక ఇల్లు కూడా పోగొట్టుకున్నాడని, ఆ బాధ భరించలేక భార్యాభర్తలు మరణమే శరణమనుకున్నారని తెలిసింది.’

‘దీన్ని బట్టి నిపుణులు ఏమన్నారంటే…’ అని చెప్పబోతుండగా, “అతడు విజయాలను తప్ప మరేదీ అంగీకరించలేని స్థితిలో తన మనసుని ఉంచుకున్నాడట.. నాక్కూడా వచ్చింది బాబూ ఈ మెసేజ్. బట్ గగన్, బీ ఆన్ ఆప్టిమిస్ట్.. ఆశావాదిగా ఉండు.. ఎవడో ఒకడు పరాజయాన్ని భరించలేకపోతే, అది అందరికీ అన్వయించకు, ప్లీజ్. బ్లెస్ హిం”, అని అడ్డు తగిలింది పూర్ణిమ.

“ఏం జరిగింది?” అయోమయంగా అడిగాడు గగన్. “మా అమ్మా వాళ్ళ పక్కింటి రావు లేడూ, నాకు రెండేళ్ళు సీనియర్?” గుర్తు చేసింది పూర్ణిమ. “ఆఁ, అవును”, అన్నాడు గగన్. “వాళ్ళబ్బాయి విశేష్ తెలుసు కదా”, అంది పూర్ణిమ. “ఇంజనీరు”, అన్నాడు గగన్. “వాడు నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడట. కారణం – వాడు ఇప్పటికి మూడు క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఫెయిల్ అయ్యాడట. బుద్ధుందా వాడికి, అసలు బుద్ధుందా అని”, అనేసి వెక్కి వెక్కి ఏడ్చింది పూర్ణిమ.

గగన్ పక్కనే కూర్చుని, ఆమె భుజంపై చేయి వేశాడు, ఓదార్పుకి సూచనగా. ఆమె అతని గుండెల్లో తల దాచుకుని ఏడ్చింది. కాస్త ఊరట పొందాక, “తల్లిదండ్రులకి కడుపుకోత మిగిల్చాడు వాడు”, అని మళ్ళీ కన్నీరు కార్చింది.

“పాపం, ఆ పిల్లాడు చనిపోయింది మిగిలిన వాళ్ళు ‘బెస్ట్ ఆఫ్ లక్’ చెప్పి ఉండరని కాదు. అన్నీ తెలిసిన దానివి, నువ్వు కూడా ఒక మామూలు మనిషిలా రియాక్ట్ అయితే ఎలా? వాడు చిన్నప్పుడు గార్డెనింగ్ మీద చాలా ఆసక్తి చూపించినప్పుడు, వాళ్ళ పెద్ద వాళ్ళు వాణ్ణి ప్రోత్సహించారా? లేదు కదా!

‘ఏమిటీ, తోటమాలిగా బతుకుతావా? నువ్వు డాక్టరో, ఇంజినీరో అయితే తప్ప లాభం లేదు’, అని వాణ్ణి బెదిరించలేదూ? వాడి మనసుని గాయపరచలేదూ? వాడి ఆశలని అడియాసలుగా మార్చలేదూ? ‘హార్టీకల్చర్‌కి మంచి భవిష్యత్తు ఉంది. మంచి నాణ్యత ఉన్న పూలను పూయిస్తే ఎగుమతి చేసుకోవచ్చు’, అని వాణ్ణి ప్రోతహించారా? లేదు కదూ!

మనసుని చదువుపై పెట్టలేని వాడు ఎన్నెన్ని గొంతెమ్మ కోరికలని తీర్చగలడు చెప్పు? నువ్వు సరిగ్గా కనుక్కుని ఉంటే, మరిన్ని విషయాలు తెలిసుండేవి.

“వాడు ఫెయిలయిన ప్రతీ సారీ వాణ్ణి వాళ్ళు ఓదార్చి, వాడికి ధైర్యం చెప్పి ఉంటారా? వాణ్ణి ఛీత్కరించుకుని ఉంటారా? ఆలోచించు. మన ఆశలు పిల్లలపై రుద్ది, వాళ్ళు అవి తీర్చలేక, వత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే ఎవరు కారణం? మనమే కదూ!” అన్నాడు గగన్. నిజమేనన్నట్టు తల ఊపింది పూర్ణిమ. కానీ, వాళ్ళు అది గ్రహించడం లేదే, అని మనసులో అనుకుంది పూర్ణిమ.

“సింగపూర్ లో అయితే ఒక స్కూల్ ప్రిన్సిపాల్ పరీక్షల సమయంలో తల్లిదండ్రులకి ఒక ఉత్తరం రాశారట. ఇది రెండేళ్ళ క్రితం రాసినా, ఇప్పటికీ, ఎప్పటికీ గుర్తుంచుకోవలసినది. మన దేశంలో ఎందుకు ఫాలో అవరో”, అని ఆ ఆఖరి వాక్యాన్ని ఇంచుమించు స్వగతం లా అన్నాడు గగన్. “దాంట్లో వాళ్ళు చెప్పిన విషయాలు చదివి, నా కళ్ళు చెమర్చాయి. మన భారతీయ సంస్కృతికి అన్వయించి, విషయం చెబుతాను విను”, అని చెప్పడం మొదలుపెట్టాడు.

‘త్వరలో మొదలవబోయే పరీక్షల్లో మీ పిల్లలు మంచి మార్కులు తెచ్చుకోవాలని మీరు బెంగ పెట్టుకుని ఉంటారు. కానీ, ఆ పిల్లల్లో లెక్కలతో పనిలేని ఓ రవివర్మ ఉండచ్చు; చరిత్ర, భాషల మార్కులతో సంబంధం లేని ఓ పారిశ్రామికవేత్త ఉండచ్చు; రసాయన శాస్త్రం మీద ఆసక్తిలేని ఒక త్యాగరాజులవారు ఉండచ్చు; భౌతిక శాస్త్రం కన్నా భౌతిక ఫిట్నెస్ పై ధ్యాస ఉండే ఓ ఉసైన్ బోల్ట్ కూడా ఉండచ్చు.

‘మీ పిల్లలకి మంచి మార్కులొస్తే మంచిదే! రాకపోతే, వాళ్ళ ఆత్మగౌరవాన్ని, ఆత్మస్థైర్యన్నీ దెబ్బ తీయకండి. అది కేవలం ఒక పరీక్షేనని, ఇందులో ఓడినా జీవితంలో పెద్ద ఎత్తులకి ఎదగచ్చనీ వారికి చెప్పండి. వాళ్ళు ఎన్ని మార్కులు తెచ్చుకున్నా, వాళ్ళని ఎప్పటిలాగే ప్రేమిస్తామని చెప్పండి.

‘మీరిలా చేస్తే, ఒక పరీక్షనే కాదు, ప్రపంచన్నే జయిస్తారు. ఎందుకంటే, వాళ్ళలో ఉన్న ప్రతిభని, వాళ్ళు గొప్పగా ఎదగాలని కనే కలలని ఒక్క పరీక్షో, ఒక తక్కువ మార్కో తరిమికొట్టలేవు కాబట్టి. కేవలం డాక్టర్లూ, ఇంజనీర్లూ మాత్రమే సంతోషంగా ఉంటారని భ్రమ పడకండి. నమస్సులు’”. అని ముగించాడు గగన్. సూక్ష్మం గ్రహించింది అనడానికి చిహ్నంగా తడి కళ్ళతో ఆలోచిస్తూ నిలబడిపోయింది పూర్ణిమ.

(ఇంకా ఉంది)

Exit mobile version