Site icon Sanchika

మార్పు మన(సు)తోనే మొదలు-9

[ప్రసిద్ధ రచయిత్రి డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి రచించిన ‘మార్పు మన(సు)తోనే మొదలు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. తెలుగులో మానసిక ఆరోగ్యం కేంద్రంగా రచించిన నవల ఇది.]

[గగన్, పూర్ణిమ మాట్లాడుకుంటుంటారు. తన ఫ్రెండ్ అమిత గుర్తుందా అని భర్తని అడుగుతుంది. గుర్తుందంటాడు గగన్. అమితకి ‘సూపర్ ఉమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఇస్తున్నారని చెప్తుంది. వివరాలు చెప్పమని అడుగుతాడు గగన్. కార్పోరేట్ సెక్టార్‌లో పని చేసే మహిళలకి ఈ అవార్డుని ఇస్తారని చెప్తూ, ఉన్నత స్థానంలో ఉంటూ కూడా ఇంటినీ, ఆఫీసునీ సమతూకంగా మేనేజ్ చేసే స్త్రీకి ఈ ఉన్నతమైన పురస్కారం అని చెప్పి, ఆ అవార్డు తన స్నేహితురాలికి వచ్చినందుకు సంతోషపడుతుంది పూర్ణిమ. ఓ రోజు దినపత్రికతో పాటు వచ్చిన ఓ పాంప్లెట్ గగన్‍ని ఆశ్చర్యపరుస్తుంది. ఆ ఊర్లో పబ్ పెడుతున్నారని అందులో ఉంటుంది. అది చూసి బాధపడతాడు గగన్. కాసేపటికి నిరూప్ వచ్చి గగన్ ముందు నిల్చుంటాడు. ఏంటని అడిగితే, కొత్తగా పెట్టబోయే పబ్‍కి బౌన్సర్లు కావాలన్న ప్రకటన చూపించి, తాను ఆ ఉద్యోగానికి వెళ్ళదలచినట్టు చెప్తాడు నిరూప్. ముందు వద్దంటాడు గగన్. పబ్‍లో మద్యాన్ని చూసి మళ్ళీ తాగాలన్న కోరిక కలిగితే ఏం చేస్తావని నిరూప్‍ని అడుగుతాడు. మనసుని మంచి విషయాల మీద లగ్నం చేస్తే తాగాలన్న కోరిక కలగదని అంటాడు నిరూప్. అయితే తాను ప్రయోజకుడిని అనిపించుకోవాలన్న నిరూప్ పట్టుదల చూసి, చివరికి అంగీకరిస్తాడు గగన్. రాబోయే ఆదివారం నాడు అమిత తమ ఇంటికి వస్తోందని చెప్తుంది పూర్ణిమ. తన ఫోన్ నెంబర్ సంపాదించడానికి తాను ఎంత కష్టపడ్డదీ చెబుతుంది. ఆదివారం రానే వస్తుంది. అమితకి ఇష్టమైన వంటలు చేస్తుంది పూర్ణిమ. మధ్యాహ్నం భర్త, పిల్లలని తీసుకురాకుండా అమిత ఒక్కర్తే వస్తుంది. అందరూ భోజనాలు చేస్తారు. స్నేహితురాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకోమని చెప్పి, తాను అక్కడ్నించి వెళ్ళబోతాడు గగన్. అమిత – గగన్‍ని అక్కడే ఉండమని, తాను వాళ్ళిద్దరితోనూ మాట్లాడాలని అంటుంది. – ఇక చదవండి.]

[dropcap]కా[/dropcap]స్సేపు మౌనం రాజ్యమేలింది. గగన్, పూర్ణిమలిద్దరికీ మానసిక శాస్త్రంలో ప్రవేశం ఉంది గనుక వాళ్ళు మొదట మాట్లాడరు; ఓపిగ్గా వింటారంతే. అవతలి వాళ్ళు వాళ్ళ కష్టాలని బయటకి చెప్పుకోవడం అంత తేలికైన సంగతి కాదు. చెబుదామని అనుకున్నా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు, మాటలు బయటికి రావడానికి నిరాకరిస్తాయి. ఇటువంటి అనేక స్టార్టింగ్ ట్రబుల్స్ అధిగమించిన తర్వాతే మనుషులు తమ బాధ చెప్పుకుని, గుండెని తేలిక పరుచుకుంటారు.

మరి కొద్ది సేపట్లోనే అమిత, “నేను సూపర్ ఉమన్ అయ్యానని ఇంత పిసరు కూడా సంతోషం లేదు”, అని మొదలుపెట్టింది. విషయాన్ని కొంచెం ఊహించినా, ఆమె ఇంత డైరెక్ట్‌గా సంగతి చెప్తుందని వీళ్ళిద్దరూ అసలు అనుకోలేదు. అందుకే విస్తుపోయారు.

“నాకు చిన్నప్పటి నుండీ ఉత్సాహం, కుతూహలం ఎక్కువ. ఎలాంటి పనైనా, ‘నాకు చేత కాదు’, అనే మాట అనేదాన్ని కాదు. అందుకే, అబ్బాయిల్లా గోళీకాయలు, కోతి కొమ్మచ్చి ఆడేదాన్ని; సైకిల్ తోక్కేదాన్ని; చెట్టెక్కి కాయలు కోసేదాన్ని; జిమ్నాస్టిక్స్ నేర్చుకునేదాన్ని; అబ్బాయిలతో క్రికెట్ ఆడేదాన్ని. నన్నొక సంప్రదాయబద్ధమైన అమ్మాయిలా మా వాళ్ళు పెంచలేదు; అలాగని టామ్‌బాయ్‌లా ఉండేదాన్ని కాను.”

“ఒక రోజు పనిమనిషి నా గది సరిగ్గా తుడవలేదని కోప్పడితే, అక్కడే ఉన్న మా అత్తయ్య, ‘తప్పులెన్నడం చాలా సులువు. ఒకసారి తుడిచి చూడు, ఎంత బాగా తుడుస్తావో’, అని హేళన చేసింది. ఈ రోజుల్లో, ‘ఛాలెంజ్ ఆక్సెప్టెడ్’, అనే ట్రెండ్ ఉంది కదా! అలాగ అప్పట్లో లేకపోయినా, నేను వెంటనే చేసి చూపించాను. అలవాటు లేని పని గనుక కాస్త ఎక్కువ టైమ్ పట్టింది; అంతే!”

“బట్టలు పొందికగా, ఎక్కువ నీళ్ళూ, సోపూ వాడకుండా ఉతకడం నాకు వచ్చు. నేను ఎందులో చెయ్యి వేస్తే అందులో నాది అందె వేసిన చెయ్యి అవుతుందన్న స్థాయికి చిన్న వయసులోనే వచ్చేశాను. వంటా-వార్పూ, చిరుతిళ్ళు, మిఠాయిలు – ఒకటేమిటి, అన్నిట్లో నాకు ప్రవేశమే కాదు, పాండిత్యం ఉంది. ‘ఆల్‌రౌండర్’ అనిపించుకోవాలనే తపన నాలో ఎప్పుడూ ఉండేది.”

“నాకుండే తెలివితేటలకి నాకో మంచి ఉద్యోగం దొరుకుతుంది, అని ఆశ పడ్డాను. అలాగే జరిగింది. రాజ్యాంగంలో లింగ వివక్ష ఉండదని రాసినా, నిజానికి అలా జరగదు. కార్పొరేట్ ప్రపంచంలో స్త్రీ ఎప్పుడూ తక్కువ స్థాయికి చెందిన మనిషే. వీటన్నిటిమీదా పరిశోధనా వ్యాసాలున్నాయి. నేను నొక్కి వక్కాణించక్కరలేదు.”

“నా జీవితంలో ఇది ఎలా ప్రత్యక్షమయ్యిందంటే – నాకన్నా తక్కువ బుర్ర, తక్కువ జీతగాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యం లభించేది – కేవలం వాళ్ళు మగాళ్ళు కనుక. పాలసీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు నా అభిప్రాయానికి విలువ ఉండేది కాదు, జస్ట్ నేను ఆడదాన్ని గనుక. ‘నేను మగాడిలా పని చెయ్యిలేనా?’ అనుకుంటూ ఒకొక్కరికీ రెండు మూడు రెట్లు పని చేసేదాన్ని. కొంత ప్రాముఖ్యం వచ్చింది.”

“తరువాత నాకు పెళ్ళయ్యింది. అతను నచ్చిన వాడే, కానీ ఉద్యోగస్థురాలైన భార్యకి చేదోడు-వాదోడుగా ఉండే వాడు కాడు. ఇల్లూ, ఆఫీసూ రెండూ సమతౌల్యం, సంతులనం – ఆఁ, ఏమిటింత గ్రాంథికంగా వాగేస్తున్నాను? అదే, ఈక్విలిబ్రియమ్, బాలెన్స్ సాధించడం కష్టతరమయ్యేది. మా అత్తామామలు సోఫాలో కూర్చుని టీవీ చూస్తారు తప్ప పనిలో ఏ సాయమూ చేయరు. పైపెచ్చు, వంటమనిషి చేతి తిండి తినరు.”

“నాకు మేనేజ్ చేయడం కష్టమని అనిపించినప్పుడల్లా రెండు మాటలు చెప్పుకుని నన్ను నేను ప్రోత్సహించుకునేదాన్ని – ఒకటి, భరించలేని కష్టాలు దేవుడు ఎవరికీ ఇవ్వడు; రెండు, ఈ కష్టానికి పరిహారంగా నా ఉద్యోగం త్యాగం చేసి, ఒక గృహిణిగా బతకగలనా అని అంచనా వేసుకునేదాన్ని. అంతే, ఉద్యోగం మానేసే ప్రసక్తి లేదు గనుక ఈ గడసాని నడక మరికాస్త కొనసాగించవలసిందే, అని స్పష్టమయ్యేది.”

“పిల్లలు బయలుదేరాక, వారిని క్రెష్‌లో వదలచ్చు. కానీ, కుటుంబం నేర్పించే సంస్కారాలు మిస్ అయిపోరూ? ఇలా అనుకుని, మా అమ్మానాన్నల్ని పిలిచి, మాతో ఉండమని అడుగుదామనుకున్నాను. ఈ విషయం ఇంట్లో చెప్తే, మా అత్తామామలు, ‘ఈపాటి దానికి మీవాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకూ, మేం ఉన్నాముగా?’ అన్నారు.”

“సాయం అడిగుంటే వంటలో కూడా చేసేవారేమో, అని అప్పుడు అనిపించింది. కానీ, గతాన్ని తలచుకుని వగచడానికి నేను దేవదాసుని కాను కదా, అందుకని ఆ విషయాన్ని అక్కడే వదిలేశాను.”

“పరిపూర్ణత అనేది ఒక ఎండమావి అని తెలుసు. కానీ, దాని కోసం పరితపించి, తెగ కృషి చేసేదాన్ని. ఏం పని చేసినా మనసు పెట్టి చేస్తాను కనుక ఓ మోస్తరుగా విజయాన్ని సాధించాననే చెప్పవచ్చు. కానీ ఆ విజయం ఖరీదు ఎంత, ఆన్న విషయమే నాకు స్ఫురించలేదు. అందరికీ వాళ్ళకి కావలసినవి అమర్చి, నా అవసరాలేమిటో, అసలు నాక్కూడా అవసరాలనేవి ఉంటాయనీ మరచిపోయాను. అందరినీ పైకెత్తడం కోసం నన్ను నేనే పాతాళంలోకి తోక్కేసుకున్నాను.”

“నా వ్యక్తిత్వాన్ని చంపుకుని, ఆటలాడాలనే నా చిన్న చిన్న ఆశలని వదులుకుని అందలం ఎక్కితే, అది ఆనందాన్ని ఇస్తుందా? నేను సర్దుకుపోయిన కొద్దీ, ఇంట్లోను, ఆఫీసులోనూ కూడా అదనపు పనులు పురమాయించి,  నా సమయాన్ని- మై టైమ్‌ని- ఇంకా కుదించేస్తే, ఎంత వరకూ సమంజసం? నేను సర్దుకుపోవడం వల్ల ఇంట్లో వాళ్ళు, ఆఫీసు వాళ్ళూ వాళ్ళ నిఘంటువులోంచి ‘సర్దుబాటు’ అనే పదాన్ని తీసిపారేశారు.”

“నా బాధలు ఏకరువు పెట్టి, ఎప్పుడైనా అభ్యంతర పెడితే, ‘టేక్ యువర్ ఓన్ టైమ్’, అంటారు గాని మినహాయింపు ఇచ్చి, విశ్రాంతిని ఇవ్వరు. పోను పోను, నాలో విసుగు, నిస్పృహ, పారనోయా ఎక్కువైపోతున్నాయి. ‘నువ్వొకతెవే చేయగలవు’, అని ఎవరైనా మెచ్చుకుంటే నా సామర్థ్యానికి గౌరవంగా భావించాను; హహ, పక్కా వెర్రిపప్పని. అది ఒక వ్యూహమని, మిగతా వాళ్ళు పనిని ఎగ్గొట్టడానికి నన్ను మునగ చెట్టెక్కిస్తున్నారని తెలుసునేందుకు ఇన్నేళ్ళు పట్టింది.”

“నా పేరు వల్ల అమితమైన ఆనందం, కీర్తి వస్తాయి అనుకున్నాను పిచ్చి మొహాన్ని! అమితమైన గాడిద చాకిరీ, నిరాశ, నిస్పృహ – ఇవీ నాకు సంక్రమించినవి. ఇవ్వాళ మా వాళ్ళని తెచ్చి, ఈ మితమైన సమయంలో నేను మీతో విషయాలు చెప్పి, పొందాలనుకున్న అమితమైన ఉపశమనాన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేకపోయింది. నన్ను మీరు క్షమిస్తారని అనుకుంటున్నాను.”

“నా పరిస్థితి మీద నాకు అవగాహన ఏర్పడింది గనుక ఈ అవార్డు వచ్చినందుకు నేను పొంగిపోలేదు. ‘నేను చేయలేను’, అని నోరెత్తనీయకుండా ఉండేందుకు ఇచ్చే ప్రోత్సాహకమిది. ఇప్పుడు చెప్పండి – నేను పొంగిపోవాలా, కృంగిపోవాలా?” కన్నీళ్ళు టిష్యూ పేపర్‌తో తుడుచుకుంటూ, “ఈ సో-కాల్డ్ ఉన్నత స్థాయి వల్ల, మనసారా ఏడవడానికి కూడా అవకాశం లేదు”, అని ముగించింది అమిత.

మళ్ళీ మౌనం. ముందుగా పూర్ణిమ తేరుకుని, “నీకు మనసారా ఏడవాలని ఉంటే, ప్లీజ్ క్యారీ ఆన్. ‘ధైర్యవంతులు కన్నీరు కార్చరు’, ‘ఏడ్చిన వాళ్ళు దుర్బలులు’.. ఇలాంటి ట్రాష్‌కి మా ఇంటా, వంటా చోటు లేదు”, అని అమిత పక్కనే కూర్చుని, ఆమె భుజంపై చెయ్యి వేసింది.

ప్రవాహంలో కొట్టుకుపోయే వాడికి ఊత దొరికినట్టు, అమితకి ఆ చేయి దొరకాగానే, దాన్ని పట్టుకుని, గుండెని బరువు చేసే కన్నీళ్ళని వెంటనే బయటికి పంపి, ఆ బరువు తగ్గించుకుంది. ఈలోగా మర్యాదస్థుడైన గగన్ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు.

“నీ మనసు కుదుటపడ్డాక మాట్లాడుదాం”, అన్న ఓ కొన్ని నిముషాలకి అమిత ‘రెడీ’ అన్నట్టు మొహం పెట్టుకుంది. “అమితా, నిన్ను నువ్వే త్యాగం చేసుకుంటూ, ఒక మానసిక రుగ్మత తలుపు తట్టావు”, అని మొదలు పెట్టింది పూర్ణిమ.

ఆశ్చర్యపోయి చూస్తున్న అమితతో, “యెస్ మై డియర్, ఆ ప్రాబ్లం పేరు ‘సూపర్ ఉమన్ సిండ్రోమ్’. గారడీ చేసే వాళ్ళు అయిదారు బంతులని గాల్లో ఉంచి మేనేజ్ చేసినట్టు జీవితాన్ని గడిపే వారికి ఈ కష్టం వస్తుంది. మగవాళ్ళు తాము అనుకున్నదే చేస్తారు సాధారణంగా. కానీ, ఆడవాళ్ళకి అలా కాదు.”

“భర్త గొంతెమ్మ కోరికలన్నీ తీర్చాలి; అత్తమామలకి పనిమంతురాలని నిరూపించాలి; బాస్‌కి తానొక అసెట్ అని నిరూపించుకోవాలి; ఫ్రెండ్స్ సర్కిల్లో తన కుటుంబం ఉన్నతమైనదని ప్రూవ్ చేసుకోవాలి. అన్నిటిలోనూ తానే పర్ఫెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి. అంటే, `‘కార్యేషు దాసి’, అనే నానుడిని ప్రూవ్ చెయ్యాలా? నాన్సెన్స్ కాదూ!”

“ఇలా ఎన్నో, ఎన్నెన్నో! ఈ రుగ్మత పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళకే కాదు, హోమ్ మేకర్స్‌కి కూడా వస్తుంది. భర్త, పిల్లలకి కావలసినవన్నీ సరైన సమయానికి అమరుస్తూ పోతే, కొన్నాళ్ళకి వాళ్ళ అవసరాలు పెరుగుతాయి గాని, పాపం వీళ్ళకి రెస్ట్ దొరకదు; వీళ్ళ కోరికలు తీర్చుకోవడాని సమయం ఉండనే ఉండదు. కానీ, ఇదంతా ఎవరి కోసం? వాళ్ళ అభిప్రాయం అంత గొప్పదా, అది లేకపోతే బతకలేకపోవడానికి?” శాంతంగా అడిగింది  పూర్ణిమ.

“అంత ఓపిక ఎక్కడ ఏడిసిందీ? ఇదివరకటిలా నాకు ఓపిక లేదు. ఆత్మస్థైర్యం లేదు. ఉత్సాహం పూర్తిగా పోయి నిరుత్సాహం నన్ను దెయ్యంలా పట్టుకుంది. సంతోషం అంటే ఏమిటో మరచిపోయాను, పని చేసే మరబొమ్మలా నన్ను మార్చుకుని. ఏది చెయ్యాలన్నా, చేయలేకపోతానేమో అన్న ఆందోళన. నా ఇమేజ్ దెబ్బతింటుందేమోనన్న భయం. కుంభకర్ణుడి చెల్లెల్లా తయారయ్యాను – కొన్ని రోజులు నిద్రపోకుండా, కొన్ని రోజులు అదే పనిగా పడుక్కుంటూ!”

“మరికొన్నాళ్ళు ఒళ్ళు నొప్పులు. కాళ్ళు, కీళ్ళు-అలా. ఒక్కో రోజు ఒక్కో బాడీ పార్ట్ లాగేస్తున్నట్టు, పీకేస్తున్నట్టు, తన్నుకుపోతున్నట్టు. ఎక్కడ చస్తాను? గైనికాలజిస్ట్ దగ్గరకి వెళ్ళాను. అంతా ఓకే అన్నారు. ఆర్థోపెడీషియన్ దగ్గరకి వెళ్తే, అర్థ్రైటిస్ ఉందేమో అని బోన్ డెన్సిటీ టెస్ట్, అదే ఎముకల సాంద్రతకి సంబంధించిన టెస్ట్,  చేయించమన్నారు. అదీ ఓకే. మరి నాకేం జబ్బు?”

“కొన్ని సార్లు నిష్కారణంగా చర్మం ఉబ్బిపోతూ ఉంటుంది. అలెర్జీ అన్నారు. ఎప్పుడూ లేనిది, ఏమిటి ఇవి అన్నీ? అప్పుడప్పుడు మతిమరపు కూడా నన్ను ఆవహిస్తుంది. కార్ తాళాలు ఎక్కడ పెట్టానో గుర్తుండదు. ఏదో చేద్దామనుకుని, ఇంకేదో చేసేస్తూ ఉంటాను. ఓ ఫోకస్ ఉండదు, పాడూ ఉండదు. ప్రాణం మీదకి వచ్చేదాకా ఏం చేద్దామనుకున్నానో గుర్తొచ్చి చావదు. నిన్నొకటి అడగనా?” అంది అమిత. సరేనన్నట్టు తలూపింది పూర్ణిమ.

“నాకు డిప్రెషన్, అల్జీమర్స్, కాన్సర్, పార్కిన్సన్స్ లాంటివి ఉన్నాయా లేక రాబోతున్నాయా?” అడగాలా, వద్దా అని అనుకుంటూ అడిగింది అమిత. పూర్ణిమ చిరునవ్వుతో, “డోంట్ వర్రీ. నేను చెప్పిన సూపర్ ఉమన్ సిండ్రోమ్ లక్షణాలన్నీ కొద్దో గొప్పో నీలో ఉన్నాయి. ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు గనుక ఒక పక్క మందులు వాడుతూ, నీ  అలవాట్లను మార్చుకో. పరిపూర్ణత, పర్ఫెక్షన్ అనేది మాయ, మిధ్య అని నువ్వే అన్నావు కదా! ఆ అలవాటుని అర్జంటుగా వదులుకో. చెప్పడం సుళువు, చేయడం కష్టం.”

“భగవద్గీతలో చెప్పినట్టు ఫలాపేక్ష లేకుండా పని చేయాలి. ‘కార్పొరేట్‌లో మేం రిజల్ట్స్‌నే కదా కోరుకుంటాం’, అని అనకు. వాటివల్లేగా ఈ స్థితి! ‘గెలుపు తప్ప మరొకటి ఎరగని దానికి ఇదేం కర్మరా బాబూ’, అని అనిపిస్తోందా?’” నిక్కచ్చిగా అడిగింది పూర్ణిమ. మొహమాటంతో కూడిన ఒక నవ్వు నవ్వింది అమిత. “నేను అర్థం చేసుకోగలను. నీకు కొన్ని టిప్స్ ఇస్తాను. పాటిస్తావా?” అడిగింది పూర్ణిమ. ఊఁ కొట్టింది అమిత.

“నీ మొబైల్ ఓపెన్ చేసి ఇటియ్యి”, అని, అమిత మొబైల్ తీసుకుని, వాళ్ళింటి వైఫై పాస్వర్డ్ ఎంటర్ చేసి, అది ఐఫోను కనుక ఐస్టోర్‌కి వెళ్ళి, సద్గురు ఆప్‌ని డౌన్లోడ్ చేసి, “ఇందులో ‘ఈశా క్రియ’ అనే గైడెడ్ మెడిటేషన్ ఉంది. అందులో కనీసం ఏడు నిముషాల పాటు, ‘నేను ఈ శరీరాన్ని కాను, నేను ఈ మనసు కూడా కాదు’, అనే మాటలపై శ్రద్ధ చూపాలి.”

“ముందు మనం ఆ మాటలని ధ్యానం కోసం శ్రద్ధగా విన్నా, కొన్నాళ్ళకి మనలో ఉండే అహం దానంతట అదే పారిపోతుంది, మనతో చెప్పకుండా! గెలుపోటములపైనే జీవితం ఆధార పడిందనే భ్రమ నుండి అలా పరోక్షంగా నువ్వు బయటికి వస్తావని ఆశిస్తున్నాను”, అంటూ ముగించింది పూర్ణిమ. మనసారా నవ్వింది అమిత. “ఇలాంటి నవ్వు ఎన్నాళ్ళకి నవ్వానో”, అని కూడా అంది. గగన్‌ని కలిసి, మందులు రాయించుకుని తన ఇంటికి బయలుదేరింది ఉమన్ ఆఫ్ ది ఇయర్.

***

గగన్, పూర్ణిమ వెళ్ళి ఆ ఇంటి తలుపు తడితే, వయసులో ఉన్న ఒక అమ్మాయి తలుపు తెరిచింది. ఆమెను “బాగున్నావా అమ్మా”, అని పలుకరించాడు తను. “బాగున్నాం అంకుల్, రండి”, అని డ్రాయింగ్ రూమ్ వైపు దారి తీసింది. అక్కడ తెల్లటి పంచె, తెల్ల జూబ్బా వేసుకున్న ఒక పెద్దాయనతో, “తాతయ్యా, నేను చెప్పలేదూ. గగన్ అంకుల్, పూర్ణిమ ఆంటీ- వీళ్ళే!” అంది. గగన్ దంపతులిద్దరూ చేతులు జోడించి నమస్కరించారు. ఆయన కూడా అలాగే బదులిచ్చారు.

కాఫీ తెస్తానని అమ్మాయి లోపలికి వెళ్ళింది. “విషయం వాకబు చేసి, మీరంతా ఎక్కడున్నారో కనిపెట్టడానికి ఇంత కాలం పట్టింది. ఆవిడకి ఎలా ఉంది?” అని అడిగాడు గగన్. పెద్దాయన, “ఏం బాగో దేవుడికే తెలియాలి. మీరే చూడండి”, అని వాళ్ళిద్దరినీ లోపలికి తీసుకువెళ్ళారు.

కొంత సేపటి తరువాత-

“మీరు ఆమెను విడాకులు ఎందుకు తీసుకోనిచ్చారు?” అడిగాడు గగన్.

“తను అడ్డుకుంటే వాళ్ళాయన పరువు పోతుందట- అందుకని”, అని పెడసరంగా జవాబిచ్చాడు ఆ రోగి తాలూకు తండ్రి. “ఇంకా, అతగాడి గురించే ఆమె ఆలోచనలన్నీ”, అని కూడా వాపోయాడు ఆయన.

(ఇంకా ఉంది)

Exit mobile version