[సంచిక పాఠకుల కోసం ‘యూ హర్ట్ మై ఫీలింగ్స్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]
[dropcap]మీ[/dropcap] వ్యాపారం లేదా ప్రాక్టీసులో మీ కస్టమర్లు మీపై అసంతృప్తితో ఉన్నారా? లేక మీరు మీ కస్టమర్లపై అసంతృప్తితో ఉన్నారా? లేక మీ వ్యాపారం లేదా ఉద్యోగమే మీకు అసంతృప్తిగా ఉందా? లేక మీ యజమాని మీపై అసంతృప్తిగా ఉన్నాడా? అయితే మీరు ఒక్కరే కాదు, మీలాంటివారు చాలామంది ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇంట్లో గొడవలు ఒక ఎత్తు. మీ భర్త కానీ, మీ భార్య కానీ, మీ తలిదండ్రులు కానీ మీ ప్రతిభ గురించి మీకు ఉత్తుత్తి పొగడ్తలు ఇస్తున్నారా? నిజం చెప్పమన్నా అబద్ధం చెబుతున్నారా? ఇదేమిటి, మామూలుగా విమర్శలే ఉంటాయిగా, పొగడ్తలేమిటి అనుకుంటున్నారా? ఇద్దరూ సంపాదిస్తూ ఆర్థికంగా మంచి స్థాయిలో ఉంటే ఒకరినొకరు పొగుడుకుని, మరో అడుగు ముందుకు వేసి ఉత్తుత్తి పొగడ్తలు చేసే రోజులు వచ్చేశాయి. పిల్లల మనోభావాలకి కూడా ఎంతో విలువనిచ్చే రోజులివి. వారి మనోభావాలు దెబ్బతినకూడదని తలిదండ్రులు వారి తరఫున పోరాడుతున్నారు. ఒకప్పుడు సంపాదన కోసం పోరాటం చేస్తుంటే ఇంట్లో విమర్శలే విమర్శలు. ‘ఈ సంపాదనేం సరిపోతుంది?’, ‘ప్రమోషన్ ఎప్పుడు?’, ‘పక్కింటివాళ్ళని చూడు’ అని గొడవ. సంపాదన బాగుంటే పొగడటం లేదని విమర్శలు. ‘బావుందని చెబితే నోటిముత్యాలు రాలిపోతాయా?’, ‘నీకు నా మీద అసూయ’ అని సణుగుడు. సంపాదన ఎక్కువైతే ఉత్తుత్తి పొగడ్తలు మొదలవుతాయి. నిజం చెప్పకుండా కేవలం ఘర్షణ తప్పించుకోవటానికి చేసే పొగడ్తలు కూడా అసంతృప్తికే దారితీస్తాయి. ఇంటా బయటా అసంతృప్తులే. ఈ అసంతృప్తులను హాస్యస్ఫోరకంగా చూపించిన చిత్రం ‘యూ హర్ట్ మై ఫీలింగ్స్’ (2023). అంటే ‘నా మనసుని గాయపరిచావు’ అని. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం.
డాన్ ఒక సైకియాట్రిస్టు. పేషెంట్లు అతని దగ్గరకి కౌన్సెలింగ్ కోసం వస్తారు. అతనిలో నిరాసక్తత పెరిగింది. ఆ నిరాసక్తత వల్ల అయోమయం కూడా పెరిగింది. ఒక యువతి తన బాయ్‌ఫ్రెండ్ తనని ప్రతిదానికీ విమర్శిస్తున్నాడని చెబితే “మీ నాన్న గురించి కూడా నాకు ఇలాగే చెప్పావు కదా” అంటాడు. “మా నాన్న చాలా సౌమ్యుడు. మీరు వేరెవరి గురించో ఆలోచిస్తున్నారు” అంటుందామె. ఒక సైకియాట్రిస్టు ఇలా అయోమయపడితే పేషెంట్లకి ఏం మేలు చేస్తాడు? అతని పేషెంట్ ఒకతను కౌన్సెలింగ్ సెషన్స్ అయ్యాక అతనికి వినపడటం లేదనుకుని ‘వీడో మూర్ఖుడు’, ‘ఇదంతా వ్యర్థం’ అనుకుంటూ ఉంటాడు. మరో పేషెంట్ అతని ముఖం మీదే “మీ వల్ల మాకేమీ లాభం కనపడటం లేదు” అనేస్తాడు. ఆ పేషెంట్ భార్య “పోనీలే. ఆయన అలసిపోయినట్టు కనపడుతున్నారు” అంటుంది. వారిద్దరూ మ్యారేజ్ కౌన్సెలింగ్ కోసం వస్తుంటారు. డాన్ తన ముఖంలో ముడతల వల్ల అలసిపోయినట్టు ఉన్నానని అనుకుంటాడు. తన భార్యకి పేషెంట్ల అసంతృప్తి గురించి చెప్పడు. తన ముఖానికి బోటోక్స్ (ముడతలు పోగొట్టే ఇంజెక్షన్) చేయించుకుంటానంటాడు. ముఖంలో ముడతలు పోతే ఉత్సాహం వచ్చి బాగా పనిచేయగలనని అతని ఆలోచన. అంతః ప్రశాంతత కన్నా బాహ్య రూపానికే ప్రాముఖ్యం ఇచ్చే సంస్కృతి పెరిగిపోతోంది.
డాన్ భార్య బెత్ రచయిత్రి. ఔత్సాహిక రచయితలకి ‘రచనలు చేయటం ఎలా?’ అనే పాఠాలు చెబుతుంది. ఆమె తన చిన్ననాటి జ్ఞాపకాలతో ఒక పుస్తకం రాసింది. అందులో తన తండ్రి తనని మాటలతో ఎలా హింసించేవాడో (మానసిక వేధింపులన్నమాట) రాసింది. ‘తెలివిలేనిదానా’, ‘చెత్తబుర్ర’ లాంటి మాటలతో ఆమె తండ్రి ఆమెని అవమానించేవాడు. అయితే ఆమె రాసిన పుస్తకం అంత గొప్పగా అమ్ముడుపోలేదు. ఇప్పుడొక నవల రాసింది. అది అచ్చువేయటానికి ఆమె ఏజెంటు ఒప్పుకోవట్లేదు. “ఇందులో పస లేదు. ఇప్పుడు కొత్త రచయితలు వచ్చేశారు. శరణార్థులు, క్యాన్సర్ నుంచి బయటపడినవారు, హంతకులు, లైంగిక వేధింపులకి గురైనవారు పుస్తకాలు రాస్తున్నారు” అంటుంది. నిజమైన కథల్లో ఉన్న సంచలనం ముందు నవలలేం నిలుస్తాయి? ఒక సందర్భంలో బెత్ “నా తండ్రి నన్ను మానసికంగా మాత్రమే వేధించాడు. లేకపోతేనా!” అంటుంది. పుస్తకాలు బాగా అమ్ముడుపోవటానికి దారుణమైన అనుభావాలు కోరుకునేవారు కూడా ఉంటారు! డాన్ మాత్రం బెత్‌కి ఆమె నవల తనకి నచ్చిందని చెబుతాడు. “ఆ ఏజంటుని వదిలేసి వేరే ఏజెంటుని పెట్టుకో” అంటాడు.
డాన్, బెత్‌ల కొడుకు ఎలియట్. అతనికి 23 ఏళ్ళు. అతను కూడా రచయిత కావాలని అనుకుంటాడు. ఒక నాటకం రాస్తుంటాడు. పూర్తి చేయటానికి తంటాలు పడుతుంటాడు. ఒక చిన్న గంజాయి దుకాణం(అమెరికాలో గంజాయి అమ్మకాలు చట్టబద్ధమే) లో మ్యానేజర్‌గా పనిచేస్తుంటాడు. అతని గర్ల్‌ఫ్రెండ్ లా చదువుతుంటుంది. ఆమె గురించి బెత్, డాన్‌లకి తెలుసు. ఎలియట్ గంజాయి దుకాణంలో పనిచేయటం అతని గర్ల్‌ఫ్రెండ్‌కి ఇష్టం లేదు. బెత్ కూడా తన కొడుకు వేరే పని చూసుకోవాలని అనుకుంటుంది. అతను చేసేది ప్రమాదకరమైన వ్యాపారమని ఆమె భయం. అమెరికాలో యువతీయువకులు కాలేజ్ చదువు అయ్యాక సొంతంగా బతుకుతారు. సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఎలియట్‌కి ఏది ఎలా ఉన్నా ఒక విషయంలో మాత్రం తలిదండ్రులంటే అసూయ. వారిద్దరికీ ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ. ఒక్కోసారి వారి ప్రేమ చూసి తాను వారి మధ్య అడ్డంగా ఉన్నానని ఫీలవుతుంటాడు.
బెత్ చెల్లెలు సారా ఇంటీరియర్ డిజైనర్. ఆమెకి కస్టమర్ల డిమాండ్లు తట్టుకోవటం కష్టంగా ఉంటుంది. ఆమె భర్త మార్క్ నటుడు. అతనికి ఒక నాటకంలో అవకాశం వచ్చింది కానీ తాను తూగగలనా అని అనుమానం. డాన్, మార్క్ కూడా మంచి స్నేహితులు. డాన్ తన భార్యకి చెప్పని విషయాలు మార్క్‌కి చెబుతాడు. తాను పేషెంట్లకి సరిగా సాయం చేయలేకపోతున్నానని చెబుతాడు. పేషెంట్లు తనని తిట్టుకుంటున్నారని మాత్రం చెప్పడు. ఒకరోజు డాన్ మార్క్‌తో కలిసి షాపింగ్ చేస్తున్నప్పుడు తనకు బెత్ నవల నచ్చలేదని అంటాడు. “ఆమెకి చెప్పటానికి మనసొప్పటం లేదు” అంటాడు. అప్పుడే అనుకోకుండా అక్కడికి వచ్చిన బెత్, సారా ఆ మాటలు వింటారు. అయితే డాన్, మార్క్ వారిని చూడలేదు. బెత్ మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేస్తుంది. సారా ఆమెని సముదాయించటానికి ప్రయత్నిస్తుంది. బెత్ మాత్రం డాన్ తనకి అబద్ధం చెప్పాడని, ఇక మీదట అతన్ని నమ్మటం ఎలా అని ఆదుర్దా పడుతూంటుంది. సారా “ఇలాంటివి మామూలే. ఒక్కోసారి మార్క్ నటన నచ్చకపోయినా నేను బావుందని అంటాను” అంటుంది. కానీ బెత్ ఆదుర్దా తగ్గదు. భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు నిజాయితీగా ఉండాలని ఆమె అభిప్రాయం.
ఇక్కడొక హాస్యప్రధానమైన సన్నివేశం వస్తుంది. అసలు మొత్తం వ్యవహారం ఒక ప్రహసనం లాగే ఉంటుంది. బెత్ ఇంటికి వెళ్ళలేక ఒక బార్‌కి వెళుతుంది. అక్కడొక జంట కనపడుతుంది. ఇద్దరూ స్త్రీలే. లెస్బియన్లు. బెత్ వారిని “మీరేం చేస్తుంటారు?” అని అడుగుతుంది. వారికి ఆమె ప్రశ్న వింతగా ఉన్నా సమాధానం చెబుతారు. ఒకామె పువ్వుల అలంకరణ చేస్తుంది. ఒకామె చిత్రకారిణి. వారి పని ఒకరిదొకరికి నచ్చుతుందా అని బెత్ అడుగుతుంది. “ఆమె పువ్వుల అలంకరణ చక్కగా ఉంటుంది” అంటుంది రెండో ఆమె. “’చక్కగా’ అనేది అంత గొప్ప పదం కాదు” అంటుంది మొదటి ఆమె. “నువ్వు నా పెయింటింగుల గురించి నీ అభిప్రాయం చెప్పమంటే కంటికి ఆహ్లాదంగా ఉంటాయి అన్నావు. చక్కగా ఉంది అనటం కంటే అది మరీ ఘోరం” అంటుంది రెండో ఆమె. బెత్ అనుకోకుండా వారిద్దరి మధ్యా చిచ్చు పెట్టేసింది. ఈ సన్నివేశం ద్వారా దర్శకురాలు చెప్పదలచుకున్నదేమిటంటే చాలా జంటలు ఇలాంటి విషయాల్లో పూర్తి నిజాయితీగా ఉండరు. అయినా ఇది సంపన్నవర్గాల్లో ఉన్న సమస్య. కడుపు నిండి ఏ అభద్రతా లేకపోతే ఇలాంటి విషయాలు పట్టుకుని దెబ్బలాడుకుంటారు. ఇది పెద్ద విషయం కాదని వారికి తట్టదు. నమ్మకం, గౌరవం లాంటి పదాలు వాడి గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటారు. ఇలాంటివే విడాకుల దాకా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. డాన్ తనకి నిజం చెప్పలేదన్న బాధ కంటే తన నవల బాగాలేదన్న బాధే ఎక్కువ బెత్‌కి. ఆమె ఏజెంటుకి కూడా నవల నచ్చలేదు. మరి ఆ బాధ లేదా? ఆ బాధనే ఇలా చూపిస్తుంది. మొగుడు లోకువ కదా!
ఆ రాత్రి ఆమె ఆలస్యంగా ఇంటికి వచ్చి పడగ్గదిలోకి వెళ్ళకుండా సోఫాలో పడుకుంటుంది. ఎలియట్ వస్తాడు. అతను గర్ల్‌ఫ్రెండ్‌తో వేరుగా ఉంటాడు కానీ ఆరోజు తలిదండ్రుల ఇంటికి వస్తాడు. తన గర్ల్‌ఫ్రెండ్ తనని వదిలేసిందని బెత్‌కి చెబుతాడు. అందుకే అతను తలిదండ్రుల దగ్గరకి వచ్చాడు. చప్పుడు విని డాన్ పడగ్గది నుంచి వస్తాడు. “అసలేమయింది?” అని బెత్ అడుగుతుంది. “ఆమె వేరొకరితో పడుకుంది” అంటాడు ఎలియట్. డాన్ “ఎఫెయిర్లు అనుకోకుండా జరుగుతాయి. మర్చిపోతేనే మంచిది” అంటాడు. “అనుకోకుండా ఏం జరగవు. మీ ఇద్దరికీ ఎఫెయిర్లు లేవుగా. మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారుగా” అంటాడు ఎలియట్. అవునంటాడు డాన్. బెత్ విరక్తిగా నవ్వి మొహం తిప్పుకుంటుంది. డాన్ తనకి అబద్ధం చెప్పాడని ఆమె అక్కసు. బెత్ ప్రవర్తన డాన్‌కి వింతగా ఉంటుంది. ఇక్కడ డాన్ ఇచ్చిన సలహా గురించి చెప్పుకోవాలి. అతను సైకియాట్రిస్ట్ కాబట్టి పేషెంట్లు వారి ఎఫెయిర్ల గురించి అతనికి చెప్పటం మామూలే. దాన్ని పొరపాటుగా భావించి క్షమించాలని అతను పేషెంట్లకి చెప్పి ఉంటాడు. అదే సలహా కొడుక్కి ఇచ్చాడు. పూర్తిగా విషయం తెలుసుకోకుండా అందరికీ ఒకే సలహా ఇవ్వటం డాన్ నిరాసక్తతకి నిదర్శనం.
తర్వాత బెత్ ఎలియట్‌తో మాట్లాడుతుంది. ఆమె ఎడ్డెమంటే అతను తెడ్డెమంటాడు. ఆమె “నువ్వు మంచి బాయ్‌ఫ్రెండ్‌వని నా నమ్మకం” అంటే అతను “కాదేమో. ఆమె చేసిందే సబబేమో” అంటాడు. “అదేంటి? ఆమె నిన్ను మోసం చేసింది” అంటే “ఆమె చెయ్యాలని అనుకోలేదు. తాను ఒంటరిననే భావం వల్ల చేశానంది” అంటాడు. “ఆమె చేసిన పనికి నిన్ను దోషిని చేస్తోంది” అంటే “కాదు” అంటాడు. ఆమె మాట మార్చి “ఇదంతా కెరియర్ వల్ల చేస్తోందేమో. ఆమెకి ఏవో ఆశయాలున్నాయి, లాయరు కావాలని” అంటే “చాలా బావుంది! అంటే నేను పనికిమాలిన వాడిని కాబట్టి చేసింది కదా?” అంటాడు. ఇంక బెత్ నిస్పృహతో మాట్లాడటం ఆపేస్తుంది. ఇదంతా చూస్తుంటే మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయో కదా అని ఆశ్చర్యంగా ఉంటుంది. నిజానికి ఎలియట్‌కి తను చేసే ఉద్యోగం అల్పమైనదనే భావన ఉంది. తలిదండ్రుల మధ్య ఉన్న అనురాగం తనకి ఎవరితోనూ దక్కదన్న భయం ఉంది. ఆ భయాలని ఎదుటివారికి ఆపాదిస్తున్నాడు. తన భావాలే ఎదుటివారి నోటి నుంచి వస్తే ‘అంత మాట అంటావా?’ అన్నట్టు మాట్లాడతాడు.
అదే రాత్రి సారా మార్క్‌కి డాన్ మాటలు బెత్ వినేసిందని చెబుతుంది. బెత్ చాలా బాధపడిందని చెబుతుంది. “ఇలాంటి విషయాల్లో నువ్వు నాకు ఎప్పుడైనా అబద్ధం చెబుతావా?” అని అడుగుతుంది. “ఏ విషయం?” అంటాడతను. “నా డిజైన్లు, నా టేస్టు విషయంలో” అంటే “నీ టేస్ట్ చాలా గొప్పది” అంటాడతను. ఆమె “థాంక్యూ” అంటుంది కానీ ఆమెలో అనుమానం అలాగే ఉంటుంది. అతని నటన విషయంలో ఆమె అప్పుడప్పుడు అబద్ధం చెబుతుంది. మరి అతను నిజం చెబుతున్నాడని ఏమిటి నమ్మకం? అతన్ని గట్టిగా అడగటానికి ఆమె అంతరాత్మ ఒప్పుకోదు. ఇక్కడ ఇంకో కోణం కూడా ఉంది. సారా చేత ప్రస్తుతం ఇంటీరియర్ డిజైన్ చేయించుకుంటున్న కస్టమర్ ఒకామె ఒక లైట్ అమరిక విషయంలో ఎన్ని అమరికలు చూపించినా నచ్చలేదంటుంది. సారాకి తన టేస్ట్ మీద తనకే అనుమానం వస్తుంది. కస్టమరే దేవుడు అంటారు. దాని అర్థం తప్పు కానంతవరకు కస్టమర్ కోరినది చేయమని. అంతే కానీ కస్టమర్ కోరుకున్నది మనకి కూడా నచ్చాలని కాదు. సారా ఈ విషయంలో కస్టమర్‌కే సరైన టేస్ట్ లేదని అనుకోవచ్చు. కానీ ఆమె అలా అనుకోదు.
మర్నాడు బెత్ ముభావంగా ఉంటే డాన్ ఏమైందని అడుగుతాడు. ఆమె ఏమీ లేదంటుంది. “నీ నవల ఏజెంటుకి నచ్చలేదని దిగులుపడుతున్నావా?” అంటాడతను. “నా నవలే బాగాలేదనిపిస్తోంది” అంటుందామె. “ఆ ఏజెంటుకి టేస్ట్ లేదు. వేరే ఏజెంటుని పెట్టుకుంటే మంచిది” అంటాడతను. “ఇక ఆపు. నా నవల నచ్చినట్టు నటించకు” అని ఆమె తన క్లాసుకి వెళ్ళిపోతుంది. అతను అవాక్కయి ఉండిపోతాడు. ఆరోజు బెత్‌కి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. క్లాసులో జరిగే చర్చలో ఒక విద్యార్థి “ఒక్కోసారి మన కథ చెప్పటం కంటే మించి ఏ ఉద్దేశమూ ఉండదు” అంటాడు. బెత్ “అది నిజం! అందుకే నేను నా పుస్తకం రాశాను” అంటుంది తన జ్ఞాపకాలతో రాసిన పుస్తకం తలచుకుంటూ. విద్యార్థులందరూ మొహాలు చూసుకుంటారు. ఆమె పుస్తకం రాసిందన్న సంగతి వారెవరికీ తెలియదు. బెత్ హతాశురాలవుతుంది. తన విద్యార్థులు కూడా తన పుస్తకం గురించి వినలేదు. ఇదంతా హాస్యస్ఫోరకంగా ఉంటుంది. ఒకరి బాధ వేరొకరికి హాస్యం కదా! బెత్ ఇలా కుంగిపోయి ఉంటే సారా “డాన్‌తో మనసు విప్పు మాట్లాడొచ్చు కదా” అంటుంది. “అతను ఏమంటాడో అని భయంగా ఉంది” అంటుంది బెత్. చివరికి బెత్ డాన్‌కి అతనన్న మాటలు తాను విన్నానని చెబుతుంది. మరో పక్క మార్క్ నాటకంలో పాత్రని కోల్పోతాడు. దర్శకుడికి అతని నటన నచ్చలేదు. తర్వాత బెత్ విషయంలో డాన్, మార్క్ విషయంలో సారా ఏం చేశారు? వారి వారి కస్టమర్లని ఎలా ఎదుర్కొన్నారు అనేది మిగతా కథ.
మన జీవితాలలో జరిగే సంఘటనల ఆధారంగా చిత్రాలు తీయటం రచయిత్రి, దర్శకురాలు నికోల్ హొలాఫ్‌సెనర్‌కి అలవాటు. వీటిని ‘Slice of life’ చిత్రాలంటారు. ఈ చిత్రంలో పాత్రల అవస్థలు చూసి మనకి నవ్వొస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి అవస్థలే అందరూ పడతారు. తన అవస్థలు చూసి తానే నవ్వుకుంటే ఆ మనిషి యోగి కింద లెక్క. ఈ చిత్రంలో బెత్‌గా జూలియా లూయీ-డ్రైఫస్ నటించింది. హాస్యపాత్రలని అలవోకగా పోషించే నటి ఈమె. ‘సైన్‌ఫెల్డ్’, ‘వీప్’ సీరియల్స్ ద్వారా ఈమె ఖ్యాతి గడించింది. మిగతా పాత్రల్లో టొబియాస్ మెంజీస్, ఓవెన్ టీగ్, మికేలా వాట్కిన్స్, ఏరియన్ మొయేద్ నటించారు. చిత్రంలో బెత్, సారాల తల్లి ఒక ఉపకథలో వస్తుంది. అందులో కూడా హాస్యం బాగా పండుతుంది.
ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.
మార్క్ నాటకంలో పాత్ర కోల్పోవటంతో కుంగిపోతాడు. సారా అతన్ని సముదాయిస్తుంది. “పోతే పోనీ” అంటుంది. మర్నాడు డాన్, బెత్ వారి ఇంటికి భోజనానికి వస్తారు. మార్క్ “నేను నటన మానేస్తాను” అంటాడు. డాన్, బెత్ అతన్ని నిరాశ పడవద్దని అంటారు. సారా “నువ్వు రెటైర్ అయితే ఎలా? నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నాను. మనుషులంటే విరక్తి వచ్చింది. ప్రపంచం మండిపోతుంటే వీళ్ళ ఇళ్ళు డెకరేట్ చెయ్యాలా?” అంటుంది. బెత్ “నేను రచనలు చేయటం ఆపేస్తే మంచిదేమో” అంటుంది. డాన్ “నీ ఏజెంటుకి నీ నవల అర్థం కాలేదంతే. అంతమాత్రాన రచనలు ఆపేస్తావా?” అంటాడు. బెత్ “నేను నీ మాటలు విన్నాను. నీకు నా నవల నచ్చలేదు” అని అక్కడి నుంచి వచ్చేస్తుంది. డాన్ ఆమె వెనకాలే వెళతాడు. “నిన్ను నిరుత్సాహపరచకూడదని నీకు చెప్పలేదు. నాకు నవలల గురించి ఏం తెలుసు? నాకు నచ్చినా నచ్చకపోయినా నిన్ను ప్రోత్సహించాలనుకున్నాను” అంటాడు. “నీ అభిప్రాయాలకి నేనెంత విలువ ఇస్తానో నీకు తెలుసు. నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి” అంటుందామె. అప్పటి నుంచి అతనికి దూరం దూరంగా ఉంటుంది. అతను ఏం చేయాలో పాలుపోక మథనపడుతుంటాడు.
అతనికి కూడా దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. అతని పేషెంట్లయిన భార్యాభర్తలు “మీ వల్ల లాభం లేదు. ఇక మీ దగ్గరికి రాం. మేం రెండేళ్ళ నుంచి మీ దగ్గరకి వస్తున్నాం. మేం కట్టిన డబ్బు తిరిగి ఇచ్చేయండి” అంటారు. డాన్ సౌమ్యంగా మాట్లాడతాడు కానీ చివరికి సహనం కోల్పోయి “మీరు విడాకులు తీసుకుంటే మంచిది” అంటాడు. ఇది ఒక మ్యారేజ్ కౌన్సెలర్ అనకూడని మాట. ఒక వయసు వచ్చాక చాలామందికి ఉద్యోగాల్లో నిరాసక్తత వస్తుంది. డాన్‌కి కూడా వచ్చింది. దీన్నే బర్న్‌ఔట్ అంటారు. సమాజం ఒత్తిడికి లొంగి అలాగే కొనసాగితే మంచిది కాదు. ఆరోగ్యం, ప్రతిష్ఠ దెబ్బతినవచ్చు. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవచ్చు. లేకపోతే అభిరుచి ఉన్న వేరే పని చేసుకోవచ్చు. ఆ పనే కొనసాగించాలంటే సవరణలు చేసుకోవాలి. కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి.
బెత్ కొత్త ఏజెంటుతో మాట్లాడుతుంది. అతనికి ఆమె నవల నచ్చింది. ఏ కళారూపమైనా అందరికీ నచ్చదు. నచ్చనివాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కళాకారుల పని కళని సృజించటం మాత్రమే. ఎవరూ ఆస్వాదించకపోతే కళ ఎందుకు అని కొందరు అడగవచ్చు. మనకి ఆత్మానందం కలిగిందా లేదా అనేది ముఖ్యం. ఆత్మానందంతో కడుపు నిండదు కదా అనవచ్చు. కడుపు నింపుకోవటానికి బోలెడు డబ్బు, ఖ్యాతి అవసరం లేదు. సంతృప్తే నిజమైన సంపద. ఇతరులతో పోల్చుకోవటం, పోటీపడటం వల్లే కళాకారులు అధోగతి పాలవుతారు. కొత్త ఏజెంటుకి తన నవల నచ్చింది కాబట్టి ఇప్పుడు బెత్ సంతోషంగా ఉంది. అయితే కొత్త ఏజెంటుకి తన నవల నచ్చిన విషయం ఆమె భర్తకి వెంటనే చెప్పదు. చెబితే తనే దోషిగా నిలబడాలి. ఇదో రకమైన అహంకారం. ఇలాంటివి మన జీవితాల్లో జరుగుతూనే ఉంటాయి. ‘నిన్ను తప్పుబట్టటం నా తప్పు’ అని ఒప్పుకోవటానికి అహం అడ్డొస్తుంది. ఆ అహాన్ని అధిగమిస్తే ప్రశాంతంగా ఉండొచ్చు.
మరోపక్క సారా తనని ఇబ్బంది పెడుతున్న కస్టమర్‌కి ఒక కొత్త లైట్ అమరికని చూపిస్తుంది. అది సారాకి నచ్చలేదు. కానీ ఆ కస్టమర్‌కి అది నచ్చుతుంది. దాంతో సారా కుదుటపడుతుంది. మనకి నచ్చినది ఒక్కోసారి ఇతరులకి నచ్చదు. ఇతరులకి నచ్చినది మనని నచ్చదు. దీనికి తర్కం ఉండదు. సర్దుకుపోవటమే దీనికి సమాధానం. సారాకి ఈ విషయం అర్థమవుతుంది. మార్క్ మాత్రం నటన మానేస్తానని పట్టుబడతాడు. “నీకు ఇష్టం లేకపోతే మానేసెయ్. కానీ నువ్వు మంచి నటుడివి” అంటుంది సారా. ఆమె నిజాయితీగానే ఈ మాట అన్నదని నాకనిపించింది. ఎంత ప్రతిభావంతుడైనా కొన్నిసార్లు తడబడతాడు. దాని వల్ల అతని ప్రతిభని తక్కువ చేయకూడదు. అతను “నేను కేవలం పేరు కోసమే నటుడినయ్యాను. ఇక నా వల్ల కాదు” అంటాడు. ఇలా చిత్రంలో అందరూ తమ తమ వ్యాపకాలతో కుస్తీ పడుతూ ఉంటారు.
ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.
ఒకరోజు ఎలియట్ తాను రాస్తున్న నాటకం గురించి డాన్‌తో మాట్లాడుతూ ఉంటాడు. “నాకు రచనలు చేసే ట్యాలెంట్ లేకపోతే?” అంటాడు. బెత్ అప్పుడే అక్కడికి వస్తుంది. “నీ నాటకం తప్పక అద్భుతంగా ఉంటుంది” అంటుంది. “నువ్వెప్పుడూ నేను బెస్ట్‌గా ఉండాలని ఎందుకు ఆశిస్తావు? చిన్నప్పుడు స్విమింగ్ క్లాసుకి వెళ్ళినప్పుడు నాకు ఈత బాగా వచ్చునని చెప్పి అడ్వాన్స్‌డ్ క్లాసులో చేర్పించావు. నేను వద్దన్నా సరే. అక్కడి కోచ్ బిగినర్స్ క్లాసులో చేరమంది. నాకేం అర్థం కాలేదు. మా అమ్మ అబద్ధం చెబుతుందా? అనుకున్నాను” అంటాడు. “నీలో సామర్థ్యం ఉందని తెలిసి నిన్ను ప్రోత్సహించాననుకోవచ్చుగా” అంటుందామె. “కానీ నేను ఫెయిల్ అయ్యేలా చేశావు. ఒకసారి నాకో వ్యాసరచనలో సీ గ్రేడ్ వచ్చినందుకు నేను బాధపడుతుంటే టీచర్‌తో వాదించి బీ గ్రేడ్ ఇప్పించావు. నేను ఇతరుల కంటే మెరుగని అనిపించేలా చేశావు. నేను ఇతరులకంటే మెరుగు కాదని నాకు తర్వాత తెలిసింది. ఇదంతా నువ్వు గిల్టీగా ఫీలవ్వకుండా ఉండేందుకు చేశావు. ఎందుకంటే మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఉన్న ప్రేమ నా మీద లేదు” అని ఎలియట్ వెళ్ళిపోతాడు. డాన్, బెత్ అవాక్కయి ఉండిపోతారు. ఎలియట్ తల్లి మీద చీటికీమాటికీ విసుక్కోవటానికి కారణం ఇదన్నమాట. పిల్లలని అనవసరంగా ఒత్తిడి చేస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయి. పిల్లలని తిట్టే తలిదండ్రులు ఒక రకంగా హాని చేస్తే, పిల్లల కోసం టీచర్లతో పోరాడే తలిదండ్రులు వేరేగా హాని చేస్తారు. పిల్లవాడు బాధపడుతున్నాడని టీచర్లతో గొడవపడటం తప్పు. టీచర్ చేసింది నేరం అయితే అది వేరే విషయం. టీచర్ ఒక దెబ్బ వేసినా తప్పు లేదు. అలా కాదంటే పిల్లల్లో అధిక్యభావం పెరుగుతుంది. అదే తర్వాత నిరాశకి దారి తీస్తుంది. ఇక్కడ విషయమేమిటంటే బెత్ తండ్రి ఆమెని ఎప్పుడూ నిరుత్సాహపరిచేవాడు కాబట్టి ఆమె తన కొడుకుని ప్రోత్సహించాలని అత్యుత్సాహం చూపించింది. తలిదండ్రుల ప్రవర్తన పిల్లల మీద జీవితాంతం ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లల పెంపకంలో జాగ్రత్తగా ఉండాలి.
తర్వాత డాన్ బెత్‌తో “నేను చేసిందే నువ్వు చేశావు, ఎలియట్ విషయంలో. అతన్ని ప్రోత్సహించటానికి అబద్ధం చెప్పావు” అంటాడు. “నేను చిన్నపిల్లని కాదుగా” అంటుందామె. “నువ్వెప్పుడూ నాకు చిన్న చిన్న అబద్ధాలు చెప్పలేదా?” అంటాడతను. “నువ్వు కొనిచ్చిన చెవి రింగులు నాకు నచ్చలేదు. కానీ నచ్చాయని చెప్పాను” అని చెవి రింగులు తెచ్చి చూపిస్తుందామె. అన్నీ ఆకుల ఆకారంలో ఉంటాయి. వాటిని చూసి అతనికి నవ్వొస్తుంది. వాతావరణం తేలికపడుతుంది. “నువ్వు కొనిచ్చిన వీ-నెక్ స్వెటర్లు కూడా నాకు నచ్చలేదు” అంటాడు. ఆమె కూడా నవ్వుతుంది. అతను “ఇంకో విషయం. నేను గొప్ప సైకియాట్రిస్టునని అంటూ ఉంటావు కదా? నేను నిజానికి చెత్త సైకియాట్రిస్టుని” అంటాడు. ఈవిధంగా చివరికి తన మనసుని తొలిచేస్తున్న విషయాన్ని భార్యకి చెప్పాడు. అంతగా ప్రేమించే భార్యకి ఇన్నాళ్ళూ ఎందుకు చెప్పలేదు? తనకి పనిలో సామర్థ్యం తగ్గిందని చెప్పటం ఇష్టం లేదు. ఇది ఇంకో రకం అహంకారం. ఇలాంటివి భార్యాభర్తలు మనసు విప్పి చెప్పుకోవాలి. భార్యకి భర్త, భర్తకి భార్య కన్నా ఆప్తులు ఎవరు ఉంటారు? తర్వాత డాన్ తనని చాటుగా ‘వీడు మూర్ఖుడు’ అన్న పేషెంటుకి ఒక మంచి సలహా ఇస్తాడు. ఆ పేషెంటుకి ఆ సలహా నచ్చుతుంది. డాన్ కుదుటపడతాడు. మనిషి స్వభావం ఎలాంటిదంటే ఒక సమస్యని అధిగమించగానే ఇక ఏ సమస్యలూ రావనుకుంటాడు. సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటిని దాటుతూనే ఉండాలి.
ఒకరోజు ఎలియట్ దుకాణంలో బెత్ ఉండగా కొందరు దుండగులు తుపాకీ చూపించి గంజాయి, డబ్బు దోచుకుని వెళతారు. అందరూ భయంతో నేల మీద పడుకుంటారు. బెత్ ఎలియట్‌ని కాపాడటానికి అతన్ని తన శరీరం కింద అదిమిపట్టి పడుకుంటుంది. అప్పుడు ఎలియట్‌కి తల్లిప్రేమ అంటే ఏమిటో అవగతమవుతుంది. తల్లిప్రేమ షరతులు లేనిది. ఓ సంవత్సరం తర్వాత బెత్ నవల అచ్చవుతుంది. అయితే ఇంకో నవల బావుందనే సమీక్షలు చూసి ఆమె చిన్నబుచ్చుకుంటుంది. దీనికి అంతెక్కడ? మరో పక్క డాన్ తన కళ్ళ కింద ముడతలకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటాడు. మనుషులు అంత తొందరగా బాహ్యసౌందర్యం మీద మోజుని వదులుకోలేరు. సారా తను చేసే ఇంటీరియర్ డిజైనింగ్ వల్ల సమాజానికి ఏం ఉపయోగం లేదని బాధపడుతుంటుంది. ఏ పనీ తక్కువ కాదు. ఆమె కస్టమర్లకి ఆహ్లాదాన్ని పంచుతోంది. మార్క్ ఒక నాటకంలో నటిస్తాడు. అతనిది ముఖ్యపాత్ర కాదు. ముఖ్యనటుడు వేరే ఉంటాడు. ప్రదర్శన తర్వాత మార్క్‌తో ఫోటోలు తీసుకోవటానికి ఇద్దరు ప్రేక్షకులు వస్తారు. అది చూసి ముఖ్యనటుడు అసూయపడతాడు. జయాపజయాలు వస్తుంటాయి, పోతుంటాయి. విజయానికి పొంగిపోకూడదు, అపజయానికి కుంగిపోకూడదు. ఎలియట్ ఎట్టకేలకు నాటకం రాయటం పూర్తి చేసి చదవమని తలిదండ్రులకి ఇస్తాడు. ఇద్దరూ చదువుతుండగా చిత్రం ముగుస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది? వారికి ఆ నాటకం నచ్చుతుందా? నచ్చకపోతే ఏం చేస్తారు? నిజం చెబుతారా? నిజం చెబితే ఎలియట్ ఏం చేస్తాడు? ఇలాంటి ప్రశ్నలు అందరి జీవితాలలో వస్తాయి. ఒకరి భావాలను ఒకరు గౌరవించుకుంటూ సాగిపోవాలి కానీ అనవసరంగా చిన్న చిన్న విషయాలకి బాధపడుతూ కూర్చోకూడదు.