మరుగునపడ్డ మాణిక్యాలు – 102: పీసెస్ ఆఫ్ అ వుమన్

0
2

[సంచిక పాఠకుల కోసం ‘పీసెస్ ఆఫ్ అ వుమన్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

‘పీసెస్ ఆఫ్ అ వుమన్’ (2020)లో బిడ్డ మరణిస్తే తలిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందనేది చూపించారు. ఇది అందరికీ వర్తించకపోవచ్చు. ఈ తలిదండ్రుల కథ ఇది. పురిటిలోనే బిడ్డ మరణిస్తుంది. ఆ బాధతో తలిదండ్రులు ఎలా సతమతమయ్యారనేది ఒక పార్శ్వం. ఆ తల్లికి పురుడు పోసిన మంత్రసాని మీద కోర్టు కేసు రెండో పార్శ్వం. ఇలాంటి కథల్లో కోర్టు కేసు ఏమయిందనే దాని మీద దర్శకులు దృష్టి పెడతారు. ఈ చిత్రంలోనూ పతాక సన్నివేశాలలో కోర్టు కేసునే చూపించారు. కానీ ఆ తలిదండ్రుల జీవితాలలో ఏమయిందనేది నాకు మరింత ఆసక్తికరంగా అనిపించింది. అయితే ఒక హెచ్చరిక. ఈ చిత్రంలో ఇబ్బందికరమైన సన్నివేశాలు కొన్ని ఉంటాయి. పెద్దలే జీర్ణించుకోలేకపోవచ్చు. ఇలాంటి సన్నివేశాలు అవసరమా? పాత్రల మనఃస్థితిని పూర్తిగా అర్థం చేసుకోవటానికి అవసరమే అని నా అభిప్రాయం. ‘పీసెస్ ఆఫ్ అ వుమన్’ అంటే తెలుగులో సంక్షిప్తంగా అర్థం చెప్పటం కష్టం. ‘ఓ స్త్రీ శకలాలు’ అనేది శబ్దార్థం. ఓ తల్లికి అంతులేని విషాదం ఎదురయితే ఆమె మనఃస్థితి ఎలా ఉంటుందో చెప్పటానికి సంకేతంగా ఈ పేరు పెట్టారనిపిస్తుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం.

ఇంతకీ ఈ రోజుల్లో కూడా మంత్రసాని పురుడు పోయటమేమిటి? హాస్పిటల్లో అయితే సిజేరియన్లు, మందులు వాడి డాక్టర్లు కాన్పుని నియంత్రిస్తారు. కొందరు తలిదండ్రులు అలా కాకుండా సహజంగా కాన్పు కావాలని కోరుకుంటారు. దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటి తలిదండ్రులే మార్తా, షాన్. మార్తా ఒక కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తుంటుంది. షాన్ ఒక కార్మికుడు. ఒక వంతెన నిర్మాణంలో పని చేస్తుంటాడు. వారిద్దరూ సహజీవనం చేస్తుంటారు. మార్తా తల్లి ఎలిజబెత్‌ ధనవంతురాలు. ఆమెకి షాన్ అంటే పడదు. తన కూతురితో సహజీవనం చేస్తున్నాడని కాదు, అతను కేవలం ఒక కార్మికుడని. షాన్‌కి ఇది తెలుసు. మార్తాకి ఒక చెల్లెలు కూడా ఉంటుంది. ఆమెకి పెళ్ళయింది. మార్తా గర్భవతి. పుట్టబోయేది అమ్మాయి అని వారికి తెలుసు. షాన్ కూతుర్ని చూడాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు.

ఒకరాత్రి మార్తాకి పురిటి నొప్పులు మొదలవుతాయి. షాన్ తాము కుదుర్చుకున్న మంత్రసానికి ఫోన్ చేస్తాడు (మంత్రసాని అంటే మంత్రాలూ అవీ ఉండవు. కాన్పు చేస్తుందంతే. ఆంగ్లంలో మిడ్‌వైఫ్ అంటారు). ఆమె వేరే కాన్పుకి వెళ్ళింది. ఏవా అనే మరో మంత్రసానిని పంపిస్తుంది. మార్తాకి ఈ పరిణామం నచ్చదు కానీ వేరే దారి లేదు. ఏవా అనుభవం ఉన్న మంత్రసాని. కంగారు పడకుండా మార్తాని కాన్పుకి సంసిద్ధం చేస్తుంది. షాన్ సాయం చేస్తుంటాడు. బిడ్డ గుండె చప్పుడు బావుంటుంది. మార్తాకి త్రేన్పులు వస్తాయి, వికారంగా ఉంటుంది. నొప్పులు ఎక్కువవుతుంటాయి. ఏవా మార్తాని బాత్‌టబ్‌లో నీటిలో పడుకోబెట్టమని షాన్‌కి చెబుతుంది. తర్వాత ఆమెని మంచం మీద పడుకోబెడతారు. ఈ సమయంలో బిడ్డ గుండె చప్పుడు బలహీనపడుతుంది. మార్తాని పక్కకి తిరిగి పడుకోమంటుంది ఏవా. ఆ పొజిషన్‌లో కాన్పు జరపటానికి ప్రయత్నిస్తుంది. అయినా బిడ్డ గుండె చప్పుడు బలపడదు. ఏవా షాన్‌తో “కాసేపు చూద్దాం. ఇలాగే ఉంటే హాస్పిటల్‌కి వెళ్ళాలి” అంటుంది. షాన్ మార్తాతో “హస్పిటల్‌కి వెళదాం” అంటాడు. ఆమె “పాప బయటికి వచ్చేస్తోంది. నేను ఇక్కడే కంటాను” అంటుంది. కాసేపటికి ఏవా ఆంబులన్స్‌ని పిలవమంటుంది. షాన్ ఫోన్ చేస్తాడు. ఇంతలో కాన్పు అవుతుంది. పాప మొదట ఏడవకపోయినా కొన్ని క్షణాల తర్వాత ఏడుస్తుంది. మార్తా బిడ్డని పొత్తిళ్ళలోకి తీసుకుంటుంది. మార్తా, షాన్ సంబరంగా ఉంటారు. ఇంతలో పాప ఊపిరి తీసుకోలేక ఇబ్బందిపడుతుంది. దురదృష్టవశాత్తూ ఆంబులెన్స్ వచ్చేసరికి పాప మరణిస్తుంది. ఈ సన్నివేశం అంతా సింగిల్ టేక్ లో తీశారు. మార్తాగా నటించిన వానెసా కర్బీ అభినయం చూస్తుంటే ఊపిరి బిగపట్టి ఉండిపోతాం. ఈ సన్నివేశం కొందరికి చాలా ఇబ్బందికరంగా ఉండవచ్చు.

బిడ్డ మరణంతో మార్తా, షాన్ కుంగిపోతారు. కానీ మార్తా పైకి కనిపించదు. కొన్నిరోజుల తర్వాత ఆమె తన ఆఫీసుకి వెళుతుంది. ఆఫీసులో అందరూ వింతగా చూస్తారు. ఒకసారి ఆమె ఒక మాల్‌లో ఉండగా చనుబాలు కారతాయి. ఒక చిన్న అమ్మాయి ఆమెని వింతగా చూస్తుంది. నిజానికి ఆ అమ్మాయిని ముందు చూడటం వల్లే మార్తాకి చనుబాలు వచ్చాయనిపిస్తుంది. మాతృత్వభావనలు అంత శక్తిమంతమయినవి. మార్తా అక్కడి నుంచి కంగారుగా వచ్చేస్తుంది. ఆమెకి తర్వాత చనుమొనలు సలుపుతూ ఉంటాయి. ఫ్రీజర్‌లో పెట్టిన పచ్చిబఠానీ ప్యాకెట్లు స్తనాల మీద పెట్టుకుని ఆ సలుపు తగ్గించుకుంటుంది. ప్రకృతికి తెలియదుగా ఆమె బిడ్డ మరణించిందని! ఆమె బిడ్డకి పాలివ్వాలని మాత్రమే ప్రకృతికి తెలుసు. సలుపుల ద్వారా గుర్తుచేస్తుంటుంది. ఇదే మార్తాకి శాపమవుతుంది. విషాదం మరచిపోదామన్నా మరువనివ్వదు. దీనికి తోడు ఆమె తల్లి తన కూతురికి జరిగిన ఘోరం గురించి తన స్నేహితురాళ్ళకి ప్రచారం చేసేసింది. ఆ స్నేహితురాళ్ళలో ఒకామె మార్తాని సూపర్ మార్కెట్‌లో చూసి “మీ అమ్మ అంతా చెప్పింది. ఆ దుష్టురాలు జైల్లో పడి మగ్గుతుంది” అంటుంది ఏవా మీద అక్కసు చూపిస్తూ. మార్తా తల్లి మార్తా హాస్పిటల్లో ప్రసవం చేయించుకోవాలని కోరుకుంది. ప్రేక్షకుల్లో కూడా కొందరు ఇలాగే అనుకోవచ్చు. కానీ ఏ తల్లీ కావాలని బిడ్డని ప్రమాదంలోకి నెట్టదుగా. మార్తా బిడ్డ మంచి కోసమే ఇంట్లో ప్రసవించాలని అనుకుంది. విధి వక్రించింది. ఏవా కాకుండా ముందు అనుకున్న మంత్రసాని వచ్చి ఉంటే పరిణామాలు వేరుగా ఉండేవా? ఎవరు చెప్పగలరు? హాస్పిటల్లో అయితే రకరకాల సదుపాయాలు ఉంటాయి, నిజమే. కానీ అక్కడ ఏ అవాంఛనీయ సంఘటనా జరగదని గ్యారెంటీ ఉందా? మార్తా, షాన్ బిడ్డ మృతదేహాన్ని పరీక్షించిన డాక్టరుని కలవటానికి వెళతారు. వెళ్ళేదారిలో షాన్ “డాక్టర్ ఏం చెబుతాడో అని గాభరాగా ఉందా?” అంటాడు. ఆమె “అంటే ఏంటి? సెక్స్‌కి ముందు వైన్ తాగాం, అదా? లేక నేను సూషి (పచ్చి చేపల రోల్స్) తిన్నాను, అదా?” అంటుంది. తాను తాగినవి, తిన్నవి ఏమన్నా బిడ్డ మరణానికి కారణమా అని ఆమె మథనపడుతోందన్నమాట. అంతలోనే ఆమె షాన్‌ని “లేక నీ డ్రగ్స్ వ్యసనమా?” అంటుంది. అతనికి కొన్నేళ్ళ క్రితం డ్రగ్స్ అలవాటు ఉండేది. ఇప్పుడు లేదు. అతను “మానేశానుగా. ఆరేళ్ళ ఐదునెలల మూడురోజులయింది” అంటాడు. డ్రగ్ యాడిక్ట్‌లు ఇలా రోజులు లెక్కపెట్టుకోవటం మామూలే. మార్తా డ్రగ్స్ వల్ల అతని వీర్యంలో తేడా ఉందేమో అని కూడా ఆలోచిస్తోంది. ఐదారేళ్ళ తర్వాత ఆ ప్రభావం ఉంటుందా? శోకంలో అంత ఆలోచించే తెలివి ఉండదు. ఈ మాటలంటున్నప్పుడు మార్తాలో భావోద్వేగం ఉండదు. స్తబ్ధుగా ఉంటుంది. ఇలా ఉంటే శోకం ఇంకా గూడు కట్టుకుంటుంది.

డాక్టరు “గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ ఆరోగ్యంగానే ఉంది. ప్రసవం అయ్యాక బిడ్డకి ఆక్సిజన్ తక్కువ అయింది. ఇలాంటి కేసుల్లో 60-70 శాతం వాటిల్లో ఏం జరిగిందనేది కచ్చితంగా చెప్పలేం” అంటాడు. షాన్‌కి కోపం వస్తుంది. ఏదో ఒక కారణం చెప్పకపోతే ఎలా అంటాడు. అతనికి కారణం కావాలి. ఎవరినో ఒకరిని దోషిని చేయాలి. మార్తా మాత్రం నిర్లిప్తంగా ఉండిపోతుంది. డాక్టరు “ఏవా మీద క్రిమినల్ కేసు మొదలయింది. అందులో వైద్యనిపుణులు విచారణ చేస్తారు” అంటాడు. షాన్ కోపంగా అక్కడి నుంచి వచ్చేస్తాడు. మార్తా డాక్టరుని “అవయవదానం చేయవచ్చా?” అని అడుగుతుంది. “దానికి అవకాశం లేదు. కావాలంటే పరిశోధనల కోసం మృతదేహాన్ని యూనివర్సిటీకి ఇవ్వచ్చు” అంటాడు డాక్టరు. తర్వాత మార్తా బిడ్డ మృతదేహాన్ని యూనివర్సిటీకి ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది. కుటుంబంలో అందరికీ చెబుతుంది. వారి అభిప్రాయం కోసం కాదు, కేవలం సమాచారంలాగా చెబుతుంది.

మార్తా నిర్ణయం ఒక రకంగా అభినందనీయమే. అయితే ఆమె నిర్ణయం వెనుక వేరే కారణాలు ఉన్నాయి. షాన్‌కి తన నిర్ణయం అర్థం కాదనే ఆధిక్యభావం ఒక కారణం. తాను విద్యావంతురాలే కావచ్చు, కానీ షాన్ బిడ్డకి తండ్రి కదా? అతను వద్దని ప్రాధేయపడి ఒట్టు పెట్టమంటే ఒట్టు పెడుతుంది కానీ తాను అనుకున్న పని చేసేస్తుంది. ఇలాంటి పరిస్థితిలో అందరూ ఇలా ప్రవర్తిస్తారా అంటే కాకపోవచ్చు. ఇలా చేసేవాళ్ళు ఉండరా అంటే ఉండరనీ చెప్పలేం. షాన మార్తాకి భర్త కాదు, వారిది సహజీవనం మాత్రమే. కాబట్టి అతనికి చట్టపరంగా పూర్తి హక్కులు ఉండకపోవచ్చు. అది అలుసుగా తీసుకుని మార్తా ఏకపక్షంగా వెళ్ళిపోతుంటుంది. ‘నీకు అడిగే హక్కు లేదు’ అన్నట్టు. దుఃఖాన్ని తట్టుకోవటానికి ఇదో తీవ్రమైన పద్ధతి. అసలు మార్తా షాన్‌ని ఎందుకు పెళ్ళి చేసుకోలేదు? అతను తనకి తగినవాడు కాదనే భావన ఉందేమో! షాన్ చాలా సందర్భాలలో కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఆక్రోశిస్తాడు. విషాదమేమిటంటే మార్తా అతని బాధని అర్థం చేసుకోదు. షాన్ బలహీనపడి సిగరెట్లు కాల్చటం మొదలుపెడతాడు. మందు కూడా తాగుతాడు. పాత యాడిక్ట్‌కి ఇవన్నీ మళ్ళీ అలవాటైతే డ్రగ్స్ వైపు వెళ్ళటానికి ఎంతో సమయం పట్టదు.

ఇంకో కారణం మార్తా తల్లి ఎలిజబెత్. బిడ్డ మరణించాక ఎలిజబెత్ షాన్‌తో “క్రిమినల్ కేసుతో పాటు సివిల్ కేసు కూడా వేద్దాం” అంటుంది. అంటే పరిహారం కోసమన్నమాట. షాన్ కూడా సుముఖంగానే ఉంటాడు. వారిద్దరూ ఇలా కలిసిపోవటం మార్తాకి నచ్చదు. మార్తా మొండిగా బిడ్డ మృతదేహాన్ని యూనివర్సిటీకి ఇచ్చేసే ప్రమాదముందని షాన్ ఎలిజబెత్‌కి చెబుతాడు. ఆమె యూనివర్సిటీకి వచ్చి మార్తాని ఆపి “నేను నిన్ను ఆపను. కానీ పరిశోధన అయిన తర్వాత బిడ్డని ఖననం చేద్దాం” అంటుంది. “అంతా నీ ఇష్టమేనా?” అంటుంది మార్తా. ఎలిజబెత్ కోపంగా “నీ బిడ్డని పశువులా మిగతా కళేబరాలతో కలిపి పూడ్చటం నీకిష్టమా?” అంటుంది. ఎందుకలా అంది? ఎలిజబెత్ రెండో ప్రపంచయుద్ధ సమయంలో పుట్టింది. అప్పుడు ఆమె తల్లి ఆమెని కాపాడటానికి ఎన్నో తంటాలు పడింది. యూదులకి అదో చేదు అనుభవం. అప్పట్లో యూదులని ఊచకోత కోసి సామూహికంగా పూడ్చిన సంఘటనలు చాలా జరిగాయి. ఆ సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఎలిజబెత్ ఆ మాట అంది. ఇది మార్తాకి చిర్రెత్తిస్తుంది. దానికీ, దీనికీ పోలికా? అని ఆమె ఇంకా మొండికెత్తుతుంది.

మూడు నెలలు గడిచిపోతాయి. షాన్ ఒక రాత్రి మార్తాతో “నన్ను పట్టించుకోవెందుకు?” అంటాడు. “నా కన్నుగప్పి మా అమ్మతో కుమ్మక్కయినది నువ్వు” అంటుందామె. అతను వెనక్కి తగ్గుతాడు. ఆమె పక్కన కూర్చుంటాడు. ఆమె కూడా శాంతిస్తుంది. అతనికి ఆమె మీద వాంఛ కలుగుతుంది. ఆమెని ఒడిసిపట్టుకుంటాడు. ఆమె పెద్దగా అభ్యంతరం చెప్పదు, కానీ ఆమె మనసు ఇంకా కోలుకోలేదు. ప్రతిఘటించదు, కానీ పూర్తిగా సహకరించదు. మనసు బాగా లేకపోతే ఏం చేస్తుంది? అతను కాస్త మొరటుగా ఆమెని ముద్దుపెట్టుకుంటాడు. ఆమె ప్యాంటు చింపేయబోతాడు. ఆమె “ఉండు. నేనే ప్యాంటు విప్పుతాను” అంటుంది. అతను విసుగుచెంది “ఏం వద్దులే” అని వెళ్ళిపోతాడు.

ఎవరిదీ తప్పని అనలేం. మనసు విప్పి మాట్లాడుకుంటే లాభం ఉంటుంది. కానీ మాట్లాడుకుంటే ఆ గాయం మళ్ళీ రేగుతుందని భయం. ఈ లోపల వేరే కోపాలు తలెత్తుతాయి. అతను తన తల్లితో కలిసిపోయాడని ఆమె అక్కసు. ఆమె సొంతంగా నిర్ణయాలు తీసుకుంటోందని అతని బాధ. ‘నేను కన్నాను కదా’ అని ఆమె అంటుంది. ‘నాకూ బాధ ఉంటుంది కదా’ అని అతను అంటాడు. ‘నా బాధ పట్టించుకోవేం?’ అనే బదులు ‘నీ బాధ నాతో పంచుకో’ అంటే ఎంత బావుంటుంది? అప్పటికీ అతను “ఏం అలోచిస్తున్నావు?” అని అడుగుతూనే ఉంటాడు. ఆమె “ఏమీ లేదు” అనే అంటుంది. చివరికి అతను ఏవా మీద కేసు వాదిస్తున్న లాయరుతో అక్రమసంబంధం పెట్టుకుంటాడు! ఆ లాయరు మార్తాకి కజినే. ఆమెని కలవటానికి వెళ్ళి షాన్ ఆమెతో సంబంధం పెట్టుకుంటాడు. ఈ పరిణామం చూసి ప్రేక్షకులకి మనసు ఉసూరుమంటుంది. అక్రమసంబంధం తప్పని అనటం తేలికే. కానీ బిడ్డని కోల్పోయి, భార్య ఆదరించనివాడి మనఃస్థితి ఎలా ఉంటుందో ఊహించటం కష్టం. ఇలాంటి పరిస్థితిలో ఉన్నవాడితో సంబంధం పెట్టుకున్న ఆ లాయరు నైతికత మరింత ప్రశ్నార్థకం.

ఈ చిత్రానికి హంగేరియన్ దర్శకుడు కోర్నెల్ ముంద్రూట్సో దర్శకత్వం వహించాడు. గతంలో అతని భార్య కాతా వెబెర్‌కి గర్భస్రావం జరిగింది. అప్పుడు వారిద్దరూ కూడా ఆ విషాదం గురించి ఎక్కువగా మాట్లాడుకోలేదు. కాతా తన నోట్‌బుక్‌లో రాసుకున్న ఒక సన్నివేశం కోర్నెల్ కంటపడింది. ఆ సన్నివేశంలో ఒక స్త్రీ తన తల్లితో బిడ్డ మరణం గురించి చర్చిస్తుంది. ఆ సన్నివేశం ఆధారంగా ఒక నాటకం రాయమని కోర్నెల్ కాతాని ప్రోత్సహించాడు. ఆ నాటకమే చిత్రంగా రూపాంతరం చెందింది. కాతాయే స్క్రీన్‌ప్లే రాసింది. మార్తాగా వానెసా కర్బీ నటించింది. ఎలిజబెత్ రాణి జీవితం ఆధారంగా తీసిన ‘ద క్రౌన్’ అనే సీరియల్లో వానెసా బ్రిటన్ యువరాణి మార్గరెట్ పాత్ర పోషించి ప్రఖ్యాతి సంపాదించింది. ఈ చిత్రంలో నటనకి ఆమెకి ఆస్కార్ నామినేషన్ వచ్చింది. షాన్‌గా షయా లబీఫ్, ఎలిజబెత్‌గా ఎలెన్ బర్స్‌టిన్ నటించారు. ఇద్దరూ మంచి మార్కులు వేయించుకున్నారు. హారర్ క్లాసిక్ ‘ద ఎగ్సర్సిస్ట్’ ద్వారా ఎలెన్ సినీప్రియులకి సుపరిచితురాలే. ఆమె వయసు ఎక్కువైనా ఈ పాత్రకి ఆమెలాంటి అనుభవజ్ఞురాలైన నటి అవసరమే అని చిత్రంలో తర్వాత వచ్చే ఒక సన్నివేశం నిరూపిస్తుంది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

ఒకరోజు షాన్ కారులో ఒక చెవి రింగు దొరుకుతుంది. అది చూసి మార్తాకి అతని అక్రమసంబంధం గురించి తెలుస్తుంది. అయితే ఎవరితో సంబంధం పెట్టుకున్నాడనేది తెలియదు. ఆమెకి ఆ విషయం అనవసరం అన్నట్టుంటుంది. మరో పక్క లాయరు షాన్‌తో “ఏవాకి జైలు ఖాయం. సివిల్ కేసు కూడా వేస్తే ఇంకో లాయరుని సిఫార్సు చేస్తాను. లక్షల్లో పరిహారం వస్తుంది” అంటుంది. అయితే షాన్‌ని కూడా నిర్లిప్తత ఆవహిస్తుంది. అతను మళ్ళీ డ్రగ్స్ తీసుకోవటం మొదలుపెడతాడు. షాన్ పనికి వెళ్ళటం లేదని మార్తాకి తెలుస్తుంది. ఒకరోజు ఆ సంగతి అడుగుతుంది. ఆ వంకన అతని అక్రమసంబంధం గుట్టు లాగాలని ఆమె ప్రయత్నం. “నాకు అబద్ధం చెప్పకు” అంటుంది. “నువ్వు నాకు అబద్ధం చెప్పలేదా?” అని అతను ఆమెని అసభ్యపదంతో తిడతాడు. బిడ్డని ఎవరికీ ఇవ్వనని ఒట్టేసినా ఇచ్చేసిందని అతని కోపం. ఆమె ఏం మాట్లాడకుండా ఉండిపోతుంది. అలా వారి వైవాహికనజీవితం బీటలువారిపోతుంది.

ఎలిజబెత్ కూడా లాయరుతో సంప్రదింపులు జరుపుతూ ఉంటుంది. ఒకరోజు ఆమె తన కూతుళ్ళని, అల్లుళ్ళని భోజనానికి పిలుస్తుంది. లాయరుని కూడా రమ్మంటుంది. అప్పటివరకు మార్తా లాయరుని కలవలేదు. ఎలిజబెత్ కేసు గురించి చెప్పి మార్తాని సాక్ష్యం చెప్పమంటుంది. లేకపోతే నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటారని అంటుంది. మార్తాకి కోపం వస్తుంది. “నేను సాక్ష్యం చెప్పను. నువ్వనుకున్నట్టు నేనుండాలా? ఇదంతా నువ్వు నా కోసం చేయట్లేదు. నీ కోసం చేస్తున్నావు. నీ జీవితానికి అనుకూలంగా నన్ను మలచుకోవాలని చూస్తున్నావు” అంటుంది. “నేననుకున్నట్టు నువ్వు చేసి ఉంటే నీ బిడ్డ నీ పొత్తిళ్ళలో ఉండేది” అంటుంది ఎలిజబెత్. హాస్పిటల్‌కి వెళ్ళకపోవటం వల్లే ఇలా జరిగిందని ఆమె ఉద్దేశం. కొందరు తల్లులు ఇలాగే ఉంటారు. ‘నేను చెప్పినట్టు వినలేదు కాబట్టే ఇలా జరిగింది’ అంటారు. ‘పోనీలే. జరిగిందేదో జరిగిపోయింది. బాధపడకు’ అంటే అది మంచి పద్ధతి. పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడితే ఏం ప్రయోజనం? తనని విమర్శిస్తుంది కనుకనే మార్తాకి తల్లి అంటే కోపం. మార్తా “నీకు నేను తలవంపులు తెచ్చానని నీ భావన” అంటుంది. పిల్లలు ఏదైనా సాధించలేకపోతే ‘నీ వల్ల నాకు తలవంపులు’ అన్నట్టు తలిదండ్రులు మాట్లాడితే పిల్లలకి ఎంత బాధ? ఇక్కడ తలిదండ్రుల అహంకారమే పనిచేస్తుంది. పిల్లల జీవితం గొప్పగా ఉండాలని కోరుకోవటం పిల్లల కోసం కాదు, తాము గొప్పలు చెప్పుకోవటానికి. లేకపోతే తమ పరువు పోయినట్టు భావిస్తారు కొందరు తలిదండ్రులు. ఈ ధోరణి మారాలి. ‘నువ్వు ఎలా ఉన్నా నీకు నేనున్నాను’ అనే భావన కలిగించలేకపోతే తలిదండ్రులు విఫలమయినట్టే.

ఎలిజబెత్ ఉక్రోషంతో “నీకు పోరాడే గుణం నేర్పించలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను. నేను పుట్టినపుడు నా తండ్రిని నాజీలు పట్టుకుపోయారు. మా అమ్మ నన్ను ఒక చెక్క గుడిసెలో కని పెంచింది. కిందున్న చెక్కల కింద నన్ను దాచి తిండి కోసం వెళ్ళేది. నాకు తల్లిపాలు కావాలి కాబట్టి. కానీ ఎక్కువ పాలు పడితే నాలో సత్తువ పెరిగి గట్టిగా ఏడుస్తానని, ఆ ఏడుపు విని నాజీలు పట్టుకుంటారని భయపడి ఆమె తక్కువ తిండి తినేది. దాంతో నాకు పాలు సరిపోయేవి కాదు. యుద్ధం ముగిశాక డాక్టరు దగ్గరకి వెళితే అతను నా మీద ఆశ వదులుకోమని చెప్పాడు. అమ్మ ప్రాధేయపడితే ఆ డాక్టర్ నన్ను తన చేతులతో తలకిందులుగా వేలాడదీసి ‘ఈ పాప తల ఎత్తితే అప్పుడు చూద్దాం’ అన్నాడు. నేనేం చేశానో తెలుసా? తల ఎత్తాను. నిన్ను కూడా తల ఎత్తుకుని ఆ స్త్రీ ముందు నిలబడి నీ మనసులోని వేదనని వినిపించమని మాత్రమే నేను అడుగుతున్నాను. లేకపోతే ఈ బాధ నిన్ను బతకనివ్వదు” అంటుంది. ఇక్కడ ఎలిజబెత్‌లో బాధితుల మనస్తత్వం (Victim mindset) కనపడుతుంది. జీవితంలో ఎదురైన అనుభవాల వల్ల కొందరు ప్రపంచమంతా తమకు వ్యతిరేకంగా ఉందనే భావనలో ఉంటారు. అందరితో పోరాడతాను అంటారు. కొన్నిసార్లు విధివశాత్తూ అన్యాయం జరుగుతుంది. దానికి కూడా ఎవరినో ఒకరిని బాధ్యులని చేయాలంటే ఎలా? మార్తాకి ఈ పద్ధతి నచ్చదు. ఏం మాట్లాడకుండా వచ్చేస్తుంది.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

ఎలిజబెత్, మార్తా వాదులాడుకుంటుంటే షాన్ దూరంగా ఉంటాడు. ఎలిజబెత్ ఇది గమనిస్తుంది. మామూలుగా భర్త భార్య తరఫున ఉంటాడుగా. ఇక్కడ అలా జరగలేదు. వారిద్దరి బంధం ఇక కోలుకోదని ఆమెకి అర్థమవుతుంది. అతనితో మాట్లాడితే అతను కూడా ఆశ వదులుకున్నాడని తెలుస్తుంది. ఇద్దరూ కలిసి ఉంటే ఒకరికొకరు భారంగా మారతారని ఆమెకి తెలుసు. ఆమె అతన్ని మార్తాని వదిలి వెళ్ళమని కోరుతుంది. అతనికి ఒక చెక్కు కూడా ఇస్తుంది. అతను మారుమాటాడకుండా ఆ చెక్కు తీసుకుంటాడు. కొన్నాళ్లకి ఊరు వదిలి వెళ్ళిపోతాడు. అతను మార్తాని క్షమించలేడు. బిడ్డని ఖననం చేయనివ్వలేదని అతని బాధ. ఆమె కూడా అతన్ని క్షమించలేదు. అక్రమసంబంధం పెట్టుకున్నాడు. తన పక్కన నిలబడకుండా తన తల్లిని సమర్థించాడు. చివరికి ఆ తల్లే షాన్‌ని వెళ్ళిపొమ్మని కోరింది. ఎంతైనా రక్తసంబంధం రక్తసంబంధమే.

పతాక సన్నివేశాలలో కోర్టు కేసులో సాక్ష్యం చెప్పటం వగైరా ఉంటాయి. ఇవి సాంకేతికంగా, కథాపరంగా కూడా అసంబద్ధంగా ఉన్నట్టు నాకనిపించింది. సాధారణంగా ఇలాంటి క్రిమినల్ కేసుల్లో బాధితుల తరఫున ప్రభుత్వ లాయరు (పబ్లిక్ ప్రాసిక్యూటర్) వాదిస్తారు. ఇక్కడ సొంతంగా లాయరుని పెట్టుకున్నట్టు చూపించారు. పైగా వైద్యపరమైన మరణాలకి అంత తేలికగా కేసులు వేయరు, వైద్యసహాయం అందించేవారు చాలా అజాగ్రత్తగా వ్యవహరించారని తేలితే తప్ప. అమెరికాలో మంత్రసానులకి కూడా లైసెన్సులు ఉంటాయి. అర్హత ఉంటే తప్ప లైసెన్సు ఇవ్వరు. ఈ చిత్రంలో ఇలాంటివేవీ పట్టించుకోలేదు. ఇదే కాకుండా మార్తా చివరికి సాక్ష్యం చెప్పటానికి కోర్టుకి వస్తుంది. అంతవరకు ఒప్పుకోకపోయినా ఎందుకు వచ్చిందనేది అర్థం కాదు. కోర్టు కేసు విషయం పక్కన పెడితే, ఈ చిత్రంలో.. విషాదం ఎదురైతే భార్యాభర్తలు, కుటుంబసభ్యుల మధ్య ఘర్షణ ఎలా ఉంటుందనేది ప్రభావవంతంగా చూపించారు.

సాక్ష్యం చెప్పటానికి వచ్చిన మార్తా కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత కోర్టు విరామం ఇస్తుంది. ఆ సమయంలో మార్తా తన ప్రసవ సమయంలో షాన్ తీసిన ఫొటోల నెగిటివ్‌లు తయారు చేసిన షాపుకి వెళుతుంది (ఈ రోజుల్లో కూడా ఫిల్మ్ పెట్టి ఫోటోలు తీస్తున్నారా అనేది మరో ప్రశ్న.) కారులో దొరికిన ఫిల్మ్‌ని మార్తా చెల్లెలు షాపులో ఇచ్చింది. మార్తా ఆ నెగిటివ్‌లు ప్రింట్ చేయమని షాపతన్ని అడుగుతుంది. అతను ప్రింట్ చేసి ఇస్తాడు. వాటిలో ఆమె బిడ్డని ఎత్తుకుని బిడ్డ ముఖాన్ని చూస్తున్న ఫొటో ఉంటుంది. అది చూసి మార్తాకి దుఃఖంలోనూ ఆనందం కలుగుతుంది. ఆమె కోర్టుకి తిరిగివచ్చి జడ్జి అనుమతితో అందరి ఎదుట మాట్లాడుతుంది. ఏవాని ఉద్దేశించి “ఈమె నా బిడ్డకి కావాలని హాని చేయలేదు. ఈమె ప్రసవం సరిగా జరగాలని ప్రయత్నించింది. ఈమె తప్పు లేదు” అంటుంది. తర్వాత తల్లి వంక చూస్తూ “జరిగినదానికి ఏదో కారణం ఉండి ఉంటుంది కానీ ఆ కారణమేమిటో ఈ కోర్టుగదిలో తేలదు. నేను ఇక్కడ నిలబడి నాకు పరిహారం కావాలని, డబ్బు కావాలని అడిగితే దాని అర్థం ఏదో పరిహారం ఇస్తే సరిపోతుందని నేను అంగీకరించినట్టు. కానీ నిజానికి ఏ పరిహారమూ సరిపోదు. నా బిడ్డ తిరిగిరాదు. నా వేదనని ఇంకొకరికి ఇస్తే ఏం లాభం? నా బిడ్డ కూడా దాన్ని హర్షించదు. నా బిడ్డ ఈ లోకంలోకి కొన్ని నిమిషాల అతిథిగా వచ్చింది అందుకు కాదు” అంటుంది. కన్నీళ్ళతోనే చిరునవ్వు నవ్వి తల్లి వంక చూస్తుంది. ఆమె తల్లి కూడా అర్థం చేసుకున్నట్టు చిరునవ్వు నవ్వుతుంది.

చివర్లో మార్తా తన బిడ్డ చితాభస్మాన్ని నదిలో కలుపుతుంది. కొన్నేళ్ళకి మార్తా చెట్టెక్కి ఆడుకుంటున్న తన కూతుర్ని అన్నం తినటానికి రమ్మంటున్న దృశ్యాలతో చిత్రం ముగుస్తుంది. కాలచక్రం ఎవరి కోసమూ ఆగదు. దుఃఖాలు వస్తూ ఉంటాయి. కొన్ని దుఃఖాలు చాలా వేదన కలిగిస్తాయి. ఈ దుఃఖాన్ని దాటగలనా అనిపిస్తుంది. కాలమే అన్ని గాయాలనూ మాన్పుతుంది. దుఃఖం వెనక సుఖం, సుఖం వెనక దుఃఖం రావటమే జీవితం. కొన్నాళ్ళకి మళ్ళీ మంచిరోజులు వస్తాయి. ఈ లోపల మన చుట్టూ ఉన్నవారిని బాధపెట్టకుండా ఉండాలి. మార్తా షాన్‌తో మాట్లాడి తన నిర్ణయాలకి అతన్ని ఒప్పిస్తే బావుండేది. ఏవాని దోషిని చేయొద్దని చెబితే షాన్ అర్థం చేసుకునేవాడేమో. షాన్ కూడా కాస్త ఓపిగ్గా ఉంటే పరిస్థితి మెరుగయ్యేది. ఎంతయినా మార్తాది కడుపుకోత కదా! ఇలాంటివన్నీ ఇతరులకి పాఠాలయితే ఈ చిత్రం ప్రయోజనం నెరవేరినట్టే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here