మరుగునపడ్డ మాణిక్యాలు – 103: బాయ్‌హుడ్

0
2

[సంచిక పాఠకుల కోసం ‘బాయ్‌హుడ్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

చిన్నపిల్లలు పెరిగి పెద్దవారయ్యి కథని నడిపించే సినిమాలు చాలానే చూశాం. కానీ ఎదగటమే కథగా వచ్చిన ఒక చిత్రం ‘బాయ్‌హుడ్’ (2014). ఇందులో అబ్బురపరిచే విషయమేమిటంటే బాలనటులు పెరిగి పెద్దవారవుతూ, అవుతూ తెర మీద కనపడతారు. నటులని మార్చలేదు. అంటే వారు పెరుగుతూ ఉండగా షూటింగ్ చేశారు. పన్నెండేళ్ళ పాటు ప్రతి వేసవిలోనూ షూటింగ్ చేశారు! ఇలాంటి ప్రక్రియ చేయటం ప్రపంచ సినీచరిత్రలో ఇదే మొదటిసారి. దీనికి ఎంత పక్కా ప్రణాళిక ఉండాలో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఈ చిత్రంలో ఒక అబ్బాయి బాల్యదశ నుంచి కౌమారదశ వరకు అతని జీవితంలో జరిగిన పరిణామాలు కథాంశం (‘బాయ్‌హుడ్’ అంటే ఒక అబ్బాయి బాల్యం అని అర్థం). ఈ వయసులో పెద్ద పరిణామాలు ఏముంటాయి అనిపించవచ్చు. తలిదండ్రుల జీవితాలు, సమాజ పరిస్థితులు మారతాయి కదా. ఆ నేపథ్యంలో అశలు, ఆశయాలు, భయాలు, నిరాశలు చూపిస్తూ జీవితమంటే ఇంతే అని చెప్పటం ఈ చిత్రం గొప్పదనం. పిల్లల దృక్కోణం నుంచి చూపిస్తే అది సమాజం మీద వ్యాఖ్యానం అవుతుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్‌లో లభ్యం.

కథ 2002 నుంచి 2013 వరకు జరుగుతుంది. మేసన్ అనే అబ్బాయి ఆరేళ్ళ వయసు నుంచి పద్దెనిమిదేళ్ళ వయసు వరకు ఎదుగుతాడు. అంటే ఒకటో తరగతి నుంచి కాలేజీలో చేరే దాకా అన్నమాట. ఈ సమయంలో అమెరికా జార్జ్ బుష్ నాయకత్వం నుంచి బరాక్ ఒబామా నాయకత్వానికి మారింది. బరాక్ ఒబామా అమెరికాకి తొలి శ్వేతేతర (Person of colour) అధ్యక్షుడు. ఈ సినిమా విషయంలో ఇది కాకతాళీయంగా జరిగినా పన్నెండేళ్ళలో అక్కడి సమాజంలో వచ్చిన మార్పుని సూచిస్తుంది. స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి. సోషల్ మీడియా పెరిగింది. ఇది బాలలపై చూపిన ప్రభావం అందరికీ తెలిసిందే. మేసన్‌కి ఒక అక్క. అతని తలిదండ్రులకి విడాకులయిపోయాయి. పిల్లలిద్దరూ తల్లి ఒలివియా దగ్గర ఉంటారు. ఒలివియాకి ఒక ప్రియుడు. అతనికి పిల్లల గురించి తెలుసు. ఆమె అతనితో బయటకి వెళ్ళాలంటే పిల్లలకి బేబీసిట్టర్‌ని (డబ్బు తీసుకుని పిల్లలను రెండు,మూడు గంటలు పాటు చూసుకునే వ్యక్తి) పెట్టి వెళుతుంది. అలాగని పిల్లలని నిర్లక్ష్యం చేయదు. పిల్లలతో సమయం గడపటం ముఖ్యమని తెలుసు. ఓ రాత్రి ఈ విషయం మీద ఆమెకీ, ఆమె ప్రియుడికీ గొడవ జరుగుతుంది. “నాతో బయటకి రావటం ఇష్టం లేదని చెప్పరాదా?” అంటాడతను. “నా పిల్లలతో ఇంట్లో ఉండటం నాకిష్టం. నీకింకా బాధ్యత తెలియదు” అంటుందామె. “నీ తప్పులకి నాదా బాధ్యత?” అంటాడతను. “నా పిల్లలని తప్పులని అనవద్దు! ఇదే నా జీవితం. నాకూ సరదాగా గడపాలని ఉంటుంది. కానీ అదెలా ఉంటుందో నాకు తెలియదు. నేను కూతురి అవతారం నుంచి నేరుగా తల్లి అవతారంలోకి వచ్చిపడ్డాను” (మధ్యలో భార్య అవతారం మరచిపోయింది) అంటుందామె. మేసన్ ఈ గొడవకి నిద్రలేచి వారి మాటలు వింటాడు. ఆమె చివరి మాటలు ఆ చిన్నిబుర్రకి అర్థమవుతాయా? ‘అమ్మ సరదాలకి మేం అడ్డు’ అనుకుంటే ఎంత ప్రమాదం! అందరు పిల్లలూ అలా అనుకోకపోవచ్చు. కానీ మేసన్ కొంచెం సున్నితంగా ఉంటాడు. అతని అక్క ఆదమరచి పడుకుని ఉంటే అతనికి మాత్రం ఈ గొడవకి మెలకువ వచ్చేసింది! పిల్లల స్వభావాలని ఇలాంటి చిన్న చిన్న విషయాల ద్వారా రచయిత, దర్శకుడు రిచర్డ్ లింక్‌లేటర్ హృద్యంగా చూపించాడు.

మేసన్ అక్క సమంతా గడుసుపిల్ల. వాడిని ఏడిపించి వాడే ఏడిపించాడంటుంది. మేసన్ సున్నితంగా ఉన్నా ఆటల్లో చలాకీగా ఉంటాడు. అతని స్నేహితుడొకడు ఒక పత్రికలో యువతులు అర్థనగ్నంగా ఉన్న ఫొటోలు చూస్తుంటే మేసన్ కూడా ఆసక్తిగా చూస్తాడు. ఇలాంటివి అందరు అబ్బాయిల జీవితాల్లో జరుగుతాయి. అప్పట్లో స్మార్ట్‌ఫోన్లు లేవు కాబట్టి ఇంకా పరిస్థితి దిగజారలేదు. మేసన్‌కి ఇతర విషయాల్లో కూడా ఆసక్తి ఉంది. తూనీగలు ఎక్కడి నుంచి వస్తాయి అని ఆలోచిస్తాడు. పక్షి చచ్చిపడి ఉంటే దాన్ని పూడ్చిపెడతాడు. బాణాల కోసం ములుకులు సేకరిస్తుంటాడు. అయితే చదువులో కొంచెం నిర్లక్ష్యంగా ఉంటాడు. హోంవర్కు చేసినా టీచర్‌కి చూపించడు. టీచరు అడగలేదు కదా అంటాడు. సమంతా మాత్రం చదువులోనూ, ఆటల్లోనూ చురుగ్గా ఉంటుంది.

మేసన్ తండ్రి మేసన్ సీనియర్ అలాస్కా వెళ్ళాడు. అతనికి సంగీతమంటే ఇష్టం. అలాస్కాలో ఓ పడవలో పని చేసుకుంటూ పాటలు కడుతూ ఉంటాడు. అది తీవ్రమైన చలి ప్రదేశం. హిమాలయాలు ఎక్కాలని కొందరు ఆశపడ్డట్టే అలాస్కాలో ఉండాలని కొందరు ఆశపడతారు. అదో ప్రమాదకరమైన సరదా. ఒలివియా హూస్టన్ నగరానికి వెళ్ళి యూనివర్సిటీలో చదువుకుందామని ఆశపడుతుంది. అలా అయితే పిల్లలకి మంచి చదువు, ఇల్లు సమకూర్చే ఉద్యోగం దొరుకుతుందని ఆమె ఆలోచన. తలిదండ్రులిద్దరికీ ఎంత తేడా! సమంతా హూస్టన్ వెళ్ళటానికి ఒప్పుకోదు. కొత్త ఊరికి వెళ్ళటానికి పిల్లలు తొందరగా ఒప్పుకోరు కదా. చివరికి ఒలివియా హూస్టన్‌కి మకాం మారుస్తుంది. చిన్న ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటుంది. ఒలివియా తల్లి ఆ నగరంలోనే ఉంటుంది. పిల్లలని చూసుకోవటంలో సాయం చేస్తుంది.

ఇదంతా జరిగేసరికి రెండేళ్ళు గడుస్తాయి. అలాస్కా నుంచి వచ్చాక మేసన్ సీనియర్ పిల్లలని చూడటానికి వస్తాడు. కానుకలు తెస్తాడు. పిల్లలని బయటకి తీసుకెళ్ళి ఆటలాడిస్తాడు. పిల్లలు సంబరపడతారు. పిల్లల కోసం కష్టపడేది తల్లి, పిల్లలకి సరదాలు చూపించి ఆకట్టుకునేది తండ్రి! సరదాలు ఉండాలి, కానీ పిల్లలకి క్రమశిక్షణ కూడా అవసరం. ఎప్పుడో ఒకసారి వచ్చి పిల్లలని తన వైపు తిప్పుకునేవాడిపై ఆ తల్లికి కోపం ఉండటం సహజమే. కానీ ఇది పిల్లలకి అర్థం కాదు కదా! సమంతా తండ్రితో “నాకు ఆరేళ్ళున్నప్పుడు నువ్వు అమ్మ మీద అరవటం గుర్తుంది” అంటుంది. “మీ తమ్ముడి మీద నువ్వు అరుస్తావు కదా. అంటే వాడి మీద ప్రేమ లేదనా? అలాగే పెద్దవాళ్ళు కూడా ఒక్కోసారి కోపం చూపిస్తారు” అంటాడు మేసన్ సీనియర్. కానీ ఇంతలోనే “మీ అమ్మ అదో రకం” అంటాడు. పిల్లల దగ్గర ఇలా తల్లిని తక్కువ చేసి మాట్లాడటం తప్పు. వారి తగాదాలు వారు చూసుకోవాలి కానీ పిల్లల్ని అందులోకి లాగకూడదు. తండ్రి దగ్గర సిగరెట్ కంపు వస్తోందని సమంతా మేసన్‌కి సైగ చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత మేసన్ సీనియర్ ఒలివియాకి కొంత డబ్బు ఇస్తాడు. పిల్లల మీద ప్రేమ ఉంది, బాధ్యత ఉంది. అంతవరకు నయం.

చిన్నవయసులో అవివేకంతో తప్పులు చేసినా తర్వాత ఉన్నతవిద్యని అభ్యసించి జీవితాన్ని సుగమం చేసుకోవాలనుకోవటం ఒలివియా గొప్పతనం. ఉద్యోగం చేసుకుంటూ చదువుకోవటం ఇంకా గొప్ప. అప్పుడప్పుడూ పత్రికల్లో పలానా వయసు వచ్చినా పరీక్ష రాశారని చదువుతుంటాం. చూసి అభినందిస్తాం కానీ వయసు మీద పడిన తర్వాత ఏదైనా డిగ్రీ లేదా కోర్సు చేయాలంటే సిగ్గుపడతాం. ఎవరో ఏదో అనుకుంటారని వెనకడుగు వేస్తే మనకే నష్టం. అయితే ఒలివియా కూడా తప్పటడుగులు చేస్తుంది. తన ప్రొఫెసర్‌తో ప్రేమాయణం సాగిస్తుంది. పెళ్ళి చేసుకుంటుంది. జీవితంలో తప్పులు అందరూ చేస్తారు. తర్వాత కుంగిపోకుండా ‘మళ్ళీ ఇలాంటి తప్పు చేయను’ అనుకుని సాగిపోవటమే సరైన పద్ధతి. అయితే అమెరికా లాంటి దేశాల్లో సంతృప్తిపడటం అనేది అరుదు. ఈ బంధం విడిపోతే ఇంకో బంధం పెట్టుకుంటాం అంటారు. అది బెడిసికొడితే? ఇలా ఎన్నాళ్ళు? ఇక చాలు అనే జ్ఞానోదయం అయ్యేసరికి పుణ్యకాలం కాస్తా దాటిపోతుంది. ఒలివియా పెళ్ళి చేసుకున్న ప్రొఫెసర్‌కి కూడా విడాకులు అయిపోయాయి. ఇద్దరు పిల్లలు. అతని వద్దే ఉంటారు. అందరూ కలిసి ఒక ఇంట్లో ఉంటారు. పిల్లలందరూ కలిసిపోతారు. అయితే ఆ ప్రొఫెసర్‌కి కోపం కాస్త ఎక్కువ. పైగా తాగుడు అలవాటుంది. కూల్‌డ్రింక్‌లో మందు కలుపుకుని దొంగచాటుగా తాగుతాడు. పిల్లలు మాత్రం పద్దతిగా ఉండాలంటాడు. ఏమాటకామాటే చెప్పుకోవాలి – తన పిల్లల మీద కూడా కఠినంగా ఉంటాడు. ఒలివియా అతన్ని సమర్థిస్తుంది, కానీ అతను మరీ కఠినంగా ఉన్నాడని అంటుంది. ఆమెకి అతని తాగుడు గురించి మొదట్లో తెలియదు. మేసన్ జుట్టు పొడుగ్గా పెంచుకుంటే ప్రొఫెసర్ బలవంతంగా బాగా పొట్టిగా క్షవరం చేయించేస్తాడు. మేసన్ తల్లితో “అతను మంచివాడు కాదు. అతన్నెందుకు పెళ్ళి చేసుకున్నావు?” అంటాడు. “ఎవరూ పెర్‌ఫెక్ట్‌గా ఉండరు. మనకిప్పుడు ఓ కుటుంబం ఏర్పడింది కదా?” అంటుందామె. “మనకి ముందే ఒక కుటుంబం ఉండేది” అంటాడు మేసన్. ఉన్న కుటుంబాన్ని కాపాడుకుంటే ఈ కుటుంబం అవసరమేమిటి అని అతని ప్రశ్న. చివరికి ఇలాంటి పిల్లలు ‘మా అమ్మా నాన్న లాగే నా స్వార్థమే నేను చూసుకోవాలన్నమాట’ అనుకుంటూ పెరుగుతారు. పిల్లల కోసమైనా తలిదండ్రులు రాజీకి ప్రయత్నించాలి. మేసన్ సీనియర్ అలాస్కా వెళ్ళి పడవ మీద పని చేశాడు. అలాంటి పనేదో ఇక్కడే చేసుకుంటే బావుండేది కదా? ఒలివియా కూడా ఓపిగ్గా అతనితో మాట్లాడితే బావుండేది. ‘సంగీతం అన్నం పెడుతుందా?’ అనే కంటే ‘ఏదైనా పని చేసుకుంటూ ప్రయత్నించు’ అంటే కొన్నాళ్ళకి పరిస్థితి మారేదేమో? ఈరోజుల్లో ఇంత ఓపిక ఎవరికీ ఉండట్లేదు. అహంకారాలు పెరిగిపోయాయి. విడాకులే మొదటి పరిష్కారం అంటున్నారు. ఏ దారీ లేకపోతేనే విడాకులు. లేకపోతే చేతులు కాలాక పట్టుకుంటారు ఆకులు!

పిల్లలు కాస్త పెద్దవాళ్ళవుతారు. మేసన్ సీనియర్ అప్పుడప్పుడూ వచ్చి పిల్లలని తీసుకెళతాడు. ఇంటి వాతావరణం వల్ల పిల్లలు ముభావంగా ఉంటారు. మేసన్ అసలే సున్నితమైనవాడు, ఇంకా మౌనంగా ఉంటాడు. తండ్రి అడిగిన ప్రశ్నలకు పిల్లలు సరిగ్గా సమాధానాలు చెప్పరు. మేసన్ సీనియర్ “మీతో మాట్లాడాలని వస్తే ఇలా ఉంటే ఎలా?” అంటాడు. మేసన్ “ఎప్పుడూ మేమే మాట్లాడాలా? నీ సంగతి ఏమిటి? ఏం పని చేస్తున్నావు? గర్ల్‌ఫ్రెండ్ ఉందా?” అని అడుగుతాడు. పిల్లలు ఎప్పుడూ పిల్లలుగా ఉండరు. పెద్ద అవుతున్న కొద్దీ వారిని స్నేహితుల్లా చూడాలి. మేసన్ సీనియర్ “అర్థమయింది. కబుర్లలో అన్ని విషయాలూ తెలుస్తాయి కానీ పరీక్షలా ఉండకూడదనే కదా? సరే” అంటాడు. ముగ్గురూ సరదాగా గడుపుతారు. మేసన్ తండ్రిని “ఉద్యోగమేదైనా చేస్తున్నావా? అమ్మ అడిగింది” అంటాడు. మేసన్ సీనియర్‌కి చిరాకు వస్తుంది. “యాక్చువరీ పరీక్ష రాశాను. మీ అమ్మ చదువు ఎలా ఉంది?” అంటాడు. “ఫస్ట్ క్లాస్” అంటుంది సమంతా. ఉక్రోషంగా నవ్వుతాడతను. అతను ఒక చిన్న ఇంట్లో తన స్నేహితుడితో కలిసి ఉంటాడు. అతనికి ఈ పిల్లలు తెలుసు. అతను కూడా మ్యూజీషియనే. అతనితో కలిసి ఇతను సంగీతంలో ప్రయోగాలు చేస్తుంటాడు. ఒక్కొక్కరికి ఒక్కో ఆసక్తి ఉంటుంది. విషాదమేమిటంటే ఈ ప్రపంచంలో కోరుకున్న అవకాశాలు తేలిగ్గా రావు. అయితే మేసన్ సీనియర్‌లో కూడా ఎదుగుదల కనిపిస్తుంది. వేరే కెరియర్ వైపు అడుగులు వేస్తున్నాడు.

ఈ చిత్రంలో కథ ఇతర సినిమాల్లోలా ఉండదు. సంఘటనల సమాహారంలా ఉంటుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపజేస్తాయి. మన జీవితంలో కూడా ఇలాగే జరిగింది కదా అని అనిపించేలా చేస్తాయి. ‘అప్పుడు అలా చేయకుండా ఉండాల్సింది’ అనిపించినా ఆశ్చర్యం లేదు. నిజానికి ఇలాంటి సినిమా తీయటం చాలా కష్టం. ఏళ్ళ తరబడి షూటింగ్. అందరూ ఎంతో నిబద్ధతతో పనిచేయాలి. ఎక్కడా కుదుపులు వచ్చినట్టు అనిపించకూడదు. ఫ్లో బావుండాలి. అందరూ తమ పాత్రల స్వభావాలను గుర్తుపెట్టుకోవాలి. దర్శకుడి బాధ్యత వేయి రెట్లు పెరుగుతుంది. రిచర్డ్ లింక్‌లేటర్ చాలా అద్భుతంగా తీశాడు. ఒక జీవితాన్నే తెర మీద చూస్తున్నట్టు ఉంటుంది. కొందరికి బోరుకొట్టవచ్చు. కానీ ఇందులోని శ్రమని గుర్తిస్తే ఆశ్చర్యం కలగకమానదు. అసలు ఇలాంటి సినిమా తీయటం మళ్ళీ సాధ్యమా అనిపిస్తుంది. ప్రతిభ గల బాలనటుల్ని ఎంచుకోవటం, వారిచేత ఏళ్ళ తరబడి నటింపజేయటం మామూలు విషయం కాదు. అయితే పెద్దల పాత్రల్లో నటించినవారు ఏళ్ళు గడిచిన కొద్దీ వయసు మీదపడటం వల్ల సహజంగా కనిపిస్తారు. మేసన్ తలిదండ్రులుగా నటించిన పెట్రీషియా ఆర్కెట్, ఈథన్ హాక్ పన్నెండేళ్ళ పాటు ఈ చిత్రానికి సమయం కేటాయించటం కూడా అభినందనీయం. పెట్రీషియా అర్కెట్‌కి ఉత్తమ సహాయనటిగా ఆస్కార్ వచ్చింది. మేసన్‌గా ఎల్లర్ కొల్ట్రేన్, సమంతాగా లోరలై లింక్‌లేటర్ నటించారు. చిన్నతనంలో చిలిపితనం, పెద్దయ్యే కొద్దీ సొంత అభిప్రాయాలు ఏర్పరచుకోవటం, అందులో కూడా వైవిధ్యంగా ఉండటం – ఇవన్నీ అభినయిస్తుంటే చూసి ముచ్చటేస్తుంది.

ఈ క్రింద చిత్రంలోని మరికొన్ని సంఘటనలు ప్రస్తావించబడ్డాయి. సంతోష సమయాలతో పాటు కఠిన పరిస్థితులు ఎలా ఉంటాయో ఈ సంఘటనలు చూపిస్తాయి. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

ప్రొఫెసర్ తన జుట్టు కట్ చేయించేస్తే బాధపడిన మేసన్‌కి క్లాసులో ఒక అమ్మాయి “నీ జుట్టు ఇలాగే బావుంది” అని నోట్ రాసి పంపిస్తుంది. ఇక్కడ రచయిత ఇచ్చిన సందేశం అంతా మన మంచికే అని. ఇది చాలా శక్తిమంతమైన సూక్తి. ఏం జరిగినా అంతా మన మంచికే అనుకుంటే ఆశావహ దృక్పథం ఏర్పడుతుంది. ఇదిలా ఉంటే మేసన్ ఇంట్లో పరిస్థితి నానాటికీ దిగజారుతూ ఉంటుంది. ప్రొఫెసర్ తాగుడు ఎక్కువవుతుంది. కోపంతో గ్లాసులు పగలగొడుతూ ఉంటాడు. పిల్లలతో కార్లో వెళుతుంటే రోడ్ రేజ్‌తో ప్రమాదం చేయబోతాడు. అతని వల్ల తనకూ, పిల్లలకూ ప్రమాదం ఉందని ఒలివియాకి అర్థమవుతుంది. తన స్నేహితురాలితో మాట్లాడి తన పిల్లల్ని తీసుకుని ఆమె ఇంటికి వెళుతుంది. ప్రొఫెసర్ అడ్డుపడబోతాడు కానీ ఒలివియా పిల్లల్ని కాపాడుకునే ఆడపులిలా ఉంటుంది. తల్లి స్నేహితురాలి ఇంటికి వెళ్ళాక సమంతా ప్రొఫెసర్ పిల్లల గురించి తల్లిని అడుగుతుంది. ఆమెకి ప్రపంచం అర్థం చేసుకునే వయసు వచ్చింది. మేసన్ మాత్రం తల్లి స్నేహితురాలి కొడుకుతో వీడియో గేమ్‌లు ఆడుకుంటూ ఉంటాడు. సమంతా “వాళ్ళిద్దరినీ మనతో ఎందుకు తీసుకురాలేదు?” అని తల్లిని అడుగుతుంది. “నేను చట్టపరంగా వారి గార్డియన్‌ని కాదు కదా. వాళ్ళ అమ్మకి ఫోన్ చేశాను. చైల్డ్ ప్రొటెక్టివ్ సర్వీసెస్ వారికి ఫోన్ చేశాను” అంటుంది ఒలివియా. అమెరికా లాంటి దేశాల్లో పిల్లల సంరక్షణకి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. సమంతా ప్రొఫెసర్ పిల్లల గురించి ఆలోచించటం ఆమె మంచితనానికి నిదర్శనం. అంతా చట్టపరంగా జరగాలంటే ఈ లోపల ఏమైనా దారుణం జరిగితే ఎలా అనేది యువతరంలో ఉండే ప్రశ్న. ఇలాంటి చట్టపరమైన లొసుగులు ఉంటూనే ఉంటాయి. దానికి విరుగుడు మనుషుల్లో నైతికత పెంచటమే. భౌతికత నుంచి ఆధ్యాత్మికత వైపు వెళితేనే అది సాధ్యం.

2008లో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. మేసన్ సీనియర్ ఒబామాకి ప్రచారం చేస్తుంటాడు. అతనికి సహాయంగా మేసన్, సమంతా ఒబామాకి మద్దతుగా ఇళ్ళ యజమానుల అనుమతి తీసుకుని వారి వాకిళ్ళలో ప్లకార్డులు పెడుతూ ఉంటారు. మేసన్ ఒక యజమాని అనుమతి అడిగితే “నేను బరాక్ హుసేన్ ఒబామాకి మద్దతిచ్చేవాడిలా కనిపిస్తున్నానా? పో. ఇక్కడుంటే షూట్ చేస్తాను” అంటాడు. కొందరు అమెరికన్లలో ద్వేషం, హింసాపూరిత స్వభావం ఎలా ఉందో ఈ సన్నివేశం చూపిస్తుంది. అందుకే అక్కడ తుపాకీ సంస్కృతి పెరిగిపోయింది.

డిగ్రీ పూర్తిచేసిన తర్వాత ఒలివియా ఒక చిన్న టౌన్లో కమ్యూనిటీ కాలేజీలో లెక్చరర్‌గా చేరుతుంది. (ఇలాంటి విషయాలని చాలా చాకచక్యంగా సంభాషణల ద్వారా చెప్పాడు రచయిత. కథ నడుస్తూనే ఉంటుంది. పిల్లలు నెమ్మదిగా ఎదుగుతూనే ఉంటారు. ఊళ్ళు మారుతూ ఉంటారు. ఏదో ఒక పాత్ర అన్న మాట ద్వారా ‘ఓహో. వీళ్ళు వేరే ఊరు వచ్చారన్నమాట. ఆమె లెక్చరర్ అయిందన్నమాట’ అని మనకు అనిపిస్తుంది.) సమంతా తల్లి మాట వినదు. మేసన్‌కి ఫొటోగ్రఫీ అంటే అభిరుచి. అతనికి స్నేహితులుంటారు కానీ అతను తొందరగా ఎవరి ప్రభావంలో పడడు. ఒలివియా మాత్రం జిమ్ అనే తన విద్యార్థి ప్రేమలో పడుతుంది! అతను మరీ చిన్నవాడేం కాదు. ఇరాక్ యుద్ధంలో సైన్యంలో పోరాడి వచ్చినవాడు. కొన్నాళ్ళకి అతనికి జైలులో ఉద్యోగం వస్తుంది. ఒలివియా పిల్లలతో పాటు అతని ఇంటిలో నివసించటం మొదలుపెడుతుంది. చేసిన తప్పులే మళ్ళీ చేస్తుంది. అతను మేసన్ చేసే పిల్లచేష్టలని పరిహాసం చేస్తాడు. ‘నీ వయసులో నేను సంపాదించటం మొదలెట్టాను’ అంటాడు. తాము చేసిన పిల్లచేష్టలు పెద్దలకి గుర్తుండవు. మరో పక్క మేసన్ సీనియర్ మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడు. అతనికి ఓ కొడుకు పుడతాడు. అతని భార్య మేసన్, సమంతాలతో సఖ్యంగా ఉంటుంది. దూరంగా ఉంటుంది కాబట్టి సఖ్యంగా ఉంటుంది. ఒకే ఇంట్లో ఉంటే ఎలా ఉండేదో? మేసన్ సీనియర్ తన పాత కారుని అమ్మేశానని అంటే మేసన్ “ఆ కారు నాకిస్తానని ఒకసారి నా స్నేహితుడితో అన్నావు” అంటాడు. ఇలాంటివి అన్ని కుటుంబాలలో జరుగుతాయి. పిల్లలు ఏవో ఆశలు పెట్టుకుంటారు. పెద్దలు ఆశల కన్నా అవసరాలు చూస్తారు. మేసన్ సీనియర్‌లో తాత్విక చింతన కూడా పెరుగుతుంది. జీవితం ఎవరిని ఏ దారిలో తీసుకువెళుతుందో చెప్పలేం.

మేసన్ ఫొటోగ్రఫీ పిచ్చిలో పడి చదువుని నిర్లక్ష్యం చేస్తుంటాడు. అతని టీచర్ అతనికి చదువుని నిర్లక్ష్యం చేయొద్దని చెబుతాడు. ఫొటోగ్రఫీని ఒక కళలా అభ్యాసం చేస్తానని మేసన్ అంటాడు. ఆ టీచర్ అర్థం చేసుకుంటాడు కానీ వాస్తవ ప్రపంచం గురించి కూడా ఆలోచించమంటాడు. మేసన్‌కి షీనా అనే అమ్మాయి గర్ల్‌ఫ్రెండ్ అవుతుంది. ఆమె అతని మనసుని అర్థం చేసుకుంటుంది. అతనికి ఏవో ఆశలు ఉన్నాయి కానీ నలుగురూ ఏమనుకుంటారో అనే బెరుకు ఉంది. “అందరూ నన్ను గాడిలో పెట్టాలని చూస్తున్నారు. అలా చేస్తున్నారని కూడా వారికి తెలియదు” అంటాడు. ప్రతి సమాజంలో ఇలా చేస్తేనే మనిషి జీవితం బావుంటుంది అనే చట్రం ఉంటుంది. కళాకారులవ్వాలని అనుకునే వారికి మద్దతు ఉండదు. పైగా ‘నీ మంచి కోసమే చెబుతున్నాను’ అంటారు.

మరోపక్క జిమ్ తాగుడుకి అలవాటు పడతాడు. జైలులో పని చేసేవారిలో కుంగుబాటు సహజమే. కానీ జిమ్ సైన్యంలో పనిచేసి ఇప్పుడు ఖైదీలకి కాపలా కాస్తున్నాడు. ఇంకా కుంగిపోయి ఉంటాడు. మేసన్ మీద పెత్తనం చేస్తాడు. కొన్నాళ్ళకి ఒలివియా అతన్ని కూడా వదిలేస్తుంది. ఒక మంచి ఇల్లు కొనుక్కుంటుంది. సమంతా వేరే ఊళ్ళో కాలేజీలో చేరుతుంది. తల్లీ కొడుకు మాత్రమే ఇంట్లో ఉంటారు. ఒకరోజు ఒలివియా పద్దులు చూస్తూ “ఈ ఇల్లు పెద్దదయిపోయింది. కొన్నాళ్ళకి నువ్వూ వెళ్ళిపోతావు. ఇల్లు అమ్మేస్తాను. అప్పు ఉంది. పన్నులు, పై ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి” అంటుంది. “అసలు ఇంత పెద్ద ఇల్లెందుకు కొన్నావు?” అంటాడు మేసన్. “నాకు తెలివితక్కువ పనులు చేసి, పేదరికం అంచున ఉండటం సరదా కదా” అంటుందామె వ్యంగ్యంగా. మళ్ళీ తనే ఇంట్లో వస్తువులు చూస్తూ “సగం జీవితం ఈ చెత్తంతా పోగేసుకోవటంలోనే సరిపోయింది. మిగతా సగం ఇదంతా వదిలించుకోవటంలో వెళ్ళిపోతుంది” అంటుంది. భేషజాలకి పోయి తాహతుకి మించిన జీవితం గడిపితే ఇలాగే బాధపడాలి. పిండి కొద్దీ రొట్టె అన్నారు. ఉన్నంతలో బతకాలి కానీ స్టేటస్ కోసం అప్పులు చేసి వస్తువులు పోగేసుకోకూడదు.

ఇలా అందరి జీవితాలలో ఎదురయ్యే అనుభవాలతో ఈ చిత్రం తీశారు. సోషల్ మీడియాపై కూడా మేసన్‌కి ఒక అభిప్రాయం ఉంటుంది. మనుషుల్ని రోబోట్ల లాగ మార్చేస్తుందని అంటాడు. ఇక్కడ నేను ఎక్కడో చదివిన విషయం గుర్తొచ్చింది. సోషల్ మీడియా గురించి కాదు కానీ సీసీ కెమెరాల గురించి. సీసీ కెమెరాలంటే అందరికీ కాస్త భయమే. ఇప్పుడు అందరి ఇళ్ళల్లో కెమెరాలున్నాయి. ల్యాప్‌టాప్ లో కెమెరా, సెల్‌ఫోన్లో కెమెరా. మనకి తెలియకుండా సెల్‌ఫోన్ ద్వారా మనల్ని చూడటం అంత కష్టమైన పనేం కాదు. ఈ కెమెరాల్ని మనం కోరి కోరి ఇంట్లో పెట్టుకున్నాం. ఎవరైనా మన మీద నిఘా పెట్టవచ్చు! గోప్యత, గోప్యత అంటాం కానీ ఒకప్పుడున్న గోప్యత ఇప్పుడు లేదు. అయినా ఎంతో అభివృద్ధి చెందామని మురిసిపోతుంటాం. అదే టెక్నాలజీ చేసే మాయ!

చిత్రంలో చివరకి ఏం జరుగుతుందనేది అంత ముఖ్యం కాదు. అసలు ఈ చిత్రం ఉద్దేశం అది కాదు. సామాజిక పరిస్థితులు మీద వ్యాఖ్యానం మాత్రమే ఉంటుంది. దానికి మేసన్ కథ ఒక సాధనం మాత్రమే. పాప్ సంగీతం కూడా ఎలా మారిందో చూపిస్తారు. 2002లో పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్ ఎంతో పాపులర్. సమంతా చిన్నప్పుడు ‘ఊప్స్ ఐ డిడ్ ఇట్ ఎగెయిన్’ అనే పాట పాడుతూ డ్యాన్స్ చేస్తుంది. తర్వాత బ్రిట్నీ స్పియర్స్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఈ మధ్యే బ్రిట్నీ స్పియర్స్ తనను తానే పెళ్ళి చేసుకుందనే వార్త వచ్చింది. మనిషి ఏం చేసినా చివరికి తనలో తానే శాంతిని పొందాలి. అలా చేసే క్రమంలో తోడొకరుండిన అది భాగ్యమే. లేకపోయినా జీవితాన్ని ఆస్వాదించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here