మరుగునపడ్డ మాణిక్యాలు – 14: ఎ ఫెంటాస్టిక్ వుమన్

0
3

[dropcap]తె[/dropcap]లుగులో ట్రాన్స్‌జెండర్ అనే పదానికి సరైన పదం లేదు. వీళ్ళు నపుంసకులు కాదు. పురుష శరీరం ఉన్నా స్త్రీగా భావించునేవారు, స్త్రీ శరీరం ఉన్నా పురుషుడిగా భావించుకునేవారు ట్రాన్స్‌జెండర్లు. వీళ్ళు లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని తమ భావనలకు తగినట్టు కొంతవరకు శరీరాన్ని మార్చుకునే అవకాశం ఉంది. ఈ భావనలు వారికి కలగటం వైపరీత్యం అనే భావన సమాజంలో ఉంది. దేవుడు ఒక శరీరం ఇచ్చి, వేరే భావనలు ఇస్తాడా అని వారు అంటారు. వారి కర్మఫలంగా వారికి ఆ భావనలు దేవుడే ఇచ్చాడేమో! వారు తక్కువ సంఖ్యలో ఉన్నంతమాత్రాన వారిని వివక్షకు గురి చేయటం ఎంతవరకు సబబు? ఇలాంటి ఒక ట్రాన్స్‌జెండర్ కథే ‘ఎ ఫెంటాస్టిక్ వుమన్’ (2017) అనే స్పానిష్ చిత్రం. చిలీలో నిర్మించిన ఈ చిత్రానికి ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఆస్కార్ అవార్డ్ వచ్చింది. అయినా పెద్ద ప్రాచుర్యం రాలేదు. ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం. పెద్దలకు మాత్రమే. డానియెలా వేగా అనే ట్రాన్స్‌జెండర్ యువతి ముఖ్యపాత్ర పోషించింది. ఆమె నటన ఎంతో సహజంగా ఉంటుంది.

మన దేశంలో ట్రాన్స్‌జెండర్స్‌కి ప్రభుత్వ గుర్తింపు ఉంది. కానీ వారిని సమాజం మాత్రం దూరంగానే పెట్టింది. చాలా దేశాలలో ఇదే పరిస్థితి. కొందరు సూటిపోటి మాటలంటే కొందరు “మీ దారిన మీరుండండి, మా దారిన మేముంటాం” అంటారు. ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు అనుకోకుండా తమ జీవితాల్లోకి ప్రవేశిస్తే వారేం చేస్తారు? అదే ఈ చిత్రంలో చూపించారు. మరీనా ఒక ట్రాన్స్‌గెండర్ యువతి. ముప్ఫై ఏళ్ళుంటాయి. పురుషుడిగా పుట్టినా స్త్రీగానే గుర్తింపు కోరుకుంటుంది. ఆమె ఒక రెస్టారెంట్లో వెయిట్రెస్ (సేవిక) గానూ, ఒక నైట్ క్లబ్ లో గాయనిగానూ పనిచేస్తుంటుంది. ఆమె ప్రియుడు ఓర్లాందో నడివయసు వ్యక్తి. ఒక వస్త్ర ఉత్పత్తి సంస్థ యజమాని. ఒక నడివయసు వ్యక్తి ఒక యువతితో కలిసి తిరిగితేనే ఆ యువతిని అనుమాన దృష్టితో చూస్తుంది సమాజం. అతని డబ్బు కోసం ఆమె అతన్ని వలలో వేసుకుందని అనుకోవటం చూస్తూ ఉంటాం. ఇక ఆ స్థానంలో ఒక ట్రాన్స్‌జెండర్ యువతి ఉంటే వేరే చెప్పాలా? అయితే వారు నిజంగా ఒకరినొకరు ఇష్టపడ్డారని ఎందుకు అనుకోకూడదు? ఒకవేళ వారిలో పొరపొచ్చాలొస్తే అందరిలాగే వారికీ వచ్చాయని ఎందుకు భావించకూడదు. ట్రాన్స్‌జెండర్ వ్యక్తి లేని జంటల్లో వయసు తేడా లేకపోయినా పొరపొచ్చాలు రావట్లేదా?

ఓర్లాందోకి మరీనా ఎలా పరిచయమయింది? సినిమాలో చూపించకపోయినా నా అభిప్రాయం ప్రకారం అతను రెస్టారెంట్లో ఆమెని కలిశాడు. ఆ రెస్టారెంట్‌కి దగ్గరలోనే ఒక సౌనా(sauna)కి అతను వెళుతుంటాడు. సౌనా అంటే మసాజులు, ఆవిరిస్నానాలు అందించే చోటు. రెస్టారెంట్లో ఆమెని చూసి, ఆమె స్వభావం నచ్చి మాట కలిపి ఉంటాడు. ఆమె పాటలు కూడా పాడుతుందని తెలిసి మరింత ఇష్టపడి ఉంటాడు. అతని మృదుస్వభావం నచ్చి ఆమె కూడా అతన్ని ఇష్టపడి ఉంటుంది. అయితే అతనికి ఇంతకు ముందే రెండు పెళ్ళిళ్ళు అయ్యాయి. అతని మొదటి భార్య గురించి సినిమాలో చెప్పలేదు (బహుశా చనిపోయి ఉండవచ్చు) కానీ రెండో భార్యతో విడాకులయ్యాయి. అతనికి ఇద్దరు సంతానం. కొడుకుకి ముప్ఫై ఏళ్ళుంటాయి. కూతురికి ఏడేళ్ళు. ఒక అన్నగారు కూడా ఉంటాడు. మరీనాకి ఒక అక్క, బావ. మరీనా, ఓర్లాందో కలిసి ఉన్నపుడు వీళ్ళిందరూ వారి వారి అభిప్రాయాలని తమవరకే ఉంచుకున్నారు. ఒకరోజు అకస్మాత్తుగా ఓర్లాందో మరణిస్తాడు. అప్పుడు వారందరి జీవితాలు మరీనా జీవితంతో ఢీకొంటాయి.

ఓర్లాందో అపార్ట్‌మెంట్లో మరీనా కూడా నివసిస్తూ ఉంటుంది. ఒకరోజు రాత్రి ఓర్లాందో అస్వస్థతకి గురవుతాడు. తనకి ఏమవుతుందో తెలియని స్థితిలో ఉంటాడు. తూలిపడిపోతూ ఉంటాడు. మరీనా అతన్ని హాస్పిటల్‌కి తీసుకువెళాలని బయటకి తీసుకువచ్చి లిఫ్ట్ దగ్గర నిలబెట్టి తాళాల కోసం లోపలికి వెళుతుంది. ఇంతలో అతను ఒళ్ళుతెలియని స్థితిలో మెట్ల వైపుకి వెళ్ళి తూలిపోయి మెట్ల మీద నుంచి పడిపోతాడు. ఒంటికి చిన్నచిన్న గాయాలౌతాయి. ఆమె అతన్ని హాస్పిటల్‌కి తీసుకువెళుతుంది. మెదడులో రక్తనాళం ఉబ్బటంతో అతను మరణిస్తాడు. ఆమె దిగ్భ్రాంతికి లోనవుతుంది. మెట్ల మీద నుంచి పడిపోయిన గాయాలు ఉండటంతో డాక్టర్ మరీనాని అనుమానంగా చూస్తాడు. ఓర్లాందో సెల్ ఫోన్ నుంచి అతని అన్న గాబోకి ఫోన్ చేస్తుంది. అతనికి ఈమె గురించి తెలుసు కానీ ఎప్పుడూ కలవలేదు. ఆమె తనకు ఏం పాలుపోవట్లేదని అంటుంది. అతను తాను చూసుకుంటానని చెబుతాడు. మరీనా గాబరాగా హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతూ ఉండగా పోలీసులు ఆపి వెనక్కి తీసుకువస్తారు. డాక్టరు ఫోన్ చేయటం వల్ల పోలీసులు ఆమెని పట్టుకుని తీసుకువచ్చారు. ఆమె హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవటం తప్పే. గాబో వచ్చేవరకు ఉండవలసింది. కానీ ఆ పరిస్థితుల్లో ఆ వయసువారు ఎవరున్నా కంగారు సహజం. మరి మరీనా ఎంతో వివక్షను, ఏవగింపును చవిచూసింది. అందరి అనుమానపు చూపులని తప్పించుకోవటానికి వెళ్ళిపోయింది.

గాబో వస్తాడు. అతను సహృదయుడు. పోలీసులకి సర్దిచెప్పి మరీనాని పంపిస్తాడు. అయితే మరీనా పోలీసులకి భయపడదు. దీటుగా జావాబిస్తుంది. చట్టపరంగా ఆమెకి హక్కులున్నాయి. అయితే ఆమె గుర్తింపు పత్రాల మీద ఆమె పూర్వనామమే ఉంటుంది. కొత్త పేరుతో గుర్తింపు పత్రం కోసం దరఖాస్తు చేసుకుంది. ఇంకా రాలేదు. కాబట్టి ఆమెని పోలీసు అధికారి ‘అతను’ అనే సంబోధిస్తాడు. తాను కోరుకున్న గుర్తింపు లభించకపోవటం ఎంత బాధగా ఉంటుందో ఆ స్థానంలో ఉంటే తెలుస్తుంది. గాబో మరీనా పట్ల సహృదయంగా ఉన్నా ఆమె సంగతి బయటకి తెలియకపోవటమే మంచిదని పోలీసు అధికారికి నచ్చచెబుతాడు. ఇక్కడ డానియెలా నటన మరీనా పట్ల సానుభూతిని కలిగిస్తుంది. తనని కాపాడినందుకు ఒకపక్క మనసు కుదుటపడినట్టున్నా తనకి ఓర్లాందోతో ఉన్న అనుబంధాన్ని తక్కువ చేయటంతో ఆమెలో బాధ కూడా ఉంటుంది. గాబో వంక, పోలీసు అధికారి వంక మార్చి మార్చి చూస్తూ డానియెలా పలికించిన హావభావాలు సూటిగా మనసుని తాకుతాయి.

ఇది ఆరంభం మాత్రమే. మరీనా ఇంకా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటుంది. మర్నాడు ఆమె రెస్టారెంట్లో పని చేసుకుంటుంటే ఓర్లాందో మాజీ భార్య సోనియా నుంచి ఫోన్ వస్తుంది. ఓర్లాందో కారు తెచ్చి ఇవ్వమని అడుగుతుంది. సరే అంటుంది మరీనా. పెళ్ళి అనే బంధం లేకపోతే ఈ పరిస్థితుల్లో మాజీ భార్యకున్న హక్కు కూడా ఉండదు. అపార్ట్‌మెంట్ కూడా ఖాళీ చెయ్యాలని సోనియా అంటుంది. ఇంతలో ఒక ప్రత్యేక పోలీసు అధికారిణి వస్తుంది. ఆమె లైంగిక నేరాలను పరిశోధిస్తుంది. “పద్నాలుగేళ్ళుగా లైంగిక నేరాలు పరిశోధిస్తున్నాను. నాకు ఇందులో డిగ్రీ కూడా ఉంది. అన్ని రకాల నేరాలు చూశాను. నీ లాంటి వ్యక్తులు.. సారీ.. ఆడవారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారో నాకు తెలుసు.” అంటుంది. అంత అనుభవం ఉన్నా మరీనాని ఆడదానిగా గుర్తించటం ఇంకా అలవాటు కాలేదు. అయితే ఆమె ఇంతకు ముందు పోలీసు అధికారిలా మరీనాని అనుమానించటం లేదు. మరీనా తనను తాను కాపాడుకోవటానికి ఓర్లాందోతో పెనుగులాడిందని అందుకే అతను గాయపడ్డాడని, ఆమె కూడా గాయపడి ఉంటుందని ఆమె అభిప్రాయం. ట్రాన్స్‌జెండర్ల మీద ఎలాంటి లైంగిక నేరాలు జరుగుతాయో మనం ఊహించుకోవచ్చు. ఇక్కడ ‘సూపర్ డీలక్స్’ (నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం) చిత్రంలో విజయ్ సేతుపతి చేసిన పాత్ర గుర్తు చేసుకోవచ్చు. అయితే మరీనాది వింత పరిస్థితి. తనను అనుమానించిన పోలీసూ ఆమెని నమ్మలేదు. తన మీద దాడి జరిగిందని అనుకున్న ఈ పోలీసూ ఆమెని నమ్మటం లేదు. ఓర్లాందోని మరీనా కొట్టిందని ఆ పోలీసు అనుకున్నాడు. ఓర్లాందో మరీనాని బలవంతం చేయబోతే పెనుగులాట జరిగిందని ఈ పోలీసు అనుకుంటోంది. “మేమిద్దరం ఇష్టపడి పెట్టుకున్న సంబంధం” అంటే ఎవరూ నమ్మరు. కానీ మరీనా ఆత్మాభిమానం కలది. ఓర్లాందో మెట్ల మీద నుంచి పడిపోయాడని డాక్టర్‌కి చెప్పింది కాబట్టి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకుంటుంది. డాక్టరుకి అంతా చెప్పానని అంటుంది.

మరీనాకు అవమానాలు ఒకవైపు, ప్రేమించిన వ్యక్తి దూరమైన బాధ ఒకవైపు. రెస్టారెంట్లో పని పూర్తి చేసుకుని ఇంటికి వెళుతుంది. ఆమెకి కారులో కింద పడి ఉన్న ఒక తాళం చెవి దొరుకుతుంది. దాని మీద 181 అనే సంఖ్య ఉంటుంది. అది ఏమిటో ఆమెకి తెలియదు. మర్నాడు ఆమె నిద్ర లేచే సమయానికి ఓర్లాందో కొడుకు అపార్ట్‌మెంట్లోకి వచ్చి ఉంటాడు. ఎవరూ లేరనుకున్నానని అంటాడు. ఓర్లాందోకి గాయాలు ఎలా అయ్యాయని అడుగుతాడు. మెట్ల మీద నుంచి పడిపోయాడని చెబుతుంది మరీనా. మాటల్లో అతను చదువుకున్నవాడని అర్థమౌతుంది. అయినా అతను మరీనాని భావోద్వేగాలు లేని పెంపుడు జంతువుతో పోలుస్తాడు. “నీకు లింగమార్పిడి ఆపరేషన్ అయిందా?” అని అడుగుతాడు. “ఆ ప్రశ్న అడగటం పద్ధతి కాదు” అంటుంది ఆమె. “నువ్వేమిటో నాకర్థం కావట్లేదు” అంటాడతను. “నేనూ నీలాంటి మనిషినే” అంటుందామె. మనిషిని మనిషిగా గౌరవించటానికి కూడా పరిమితులు నిర్ణయించుకున్న సమాజం మనది. అపార్ట్‌మెంట్ ఖాళీ చేయమని, ఏమీ దొంగిలించవద్దని బెదిరించి వెళతాడు. ట్రాన్స్‌జెండర్లంటే నీతిమాలిన వారని ముందే నిర్ణయించేసుకోవటం ఎంత దారుణం? కోర్టులు ఎంత చెప్పినా స్వలింగ సంపర్కం అంటే అదో వైపరీత్యమనే చాలామంది భావిస్తారు. ఎయిడ్స్ వ్యాధి స్వలింగ సంపర్కం వల్ల వచ్చిందనేది అపోహ. ఎక్కడో పుట్టిన కరోనా తుంపరల వల్ల వ్యాపించినట్టే ఎక్కడో పుట్టిన హెచ్ ఐ వీ అనే వైరస్ సంభోగం వల్ల వ్యాపించింది. అంతే!

మరీనా సోనియాని కలిసి కారు అప్పగిస్తుంది. సోనియా ఏమీ అనుకోవద్దు అంటూనే ఓర్లాందోతో నీ సంబంధం ఒక వైపరీత్యం అంటుంది. ఆమెని కిమెరా(గ్రీకు పురాణాల్లో ఒక రాక్షసి) తో పోలుస్తుంది. మళ్ళీ సారీ అంటుంది. మరీనా ఈ అవమానాన్నీ దిగమింగుకుని అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇంతలో సోనియా ఓర్లాందో సంస్మరణార్థం ఒక ప్రార్థన ఏర్పాటు చేశామని అంటుంది. “నేనూ వస్తాను. ఎక్కడో చెప్పండి. ఎవరి కంటా పడకుండా ఉంటాను. ఆయనకి వీడ్కోలు చెప్పనివ్వండి” అంటుంది మరీనా. “నువ్వు రావద్దు. నా కూతురు చిన్నది. నిన్ను చూసి భయపడుతుంది. నువ్వు ఇంకేమీ చేయనక్కరలేదు. నీ శ్రమకి కావాలంటే డబ్బు ఇస్తాను” అంటుంది. “నాకు మీ డబ్బు అవసరం లేదు. నేను అయన్ని ప్రేమించాను” అంటుంది మరీనా. “మా మానాన మమ్మల్ని వదిలెయ్” అంటుంది సోనియా. కూతురికి ట్రాన్స్‌జెండర్లని చూసి భయపడమని చెప్పిందెవరు? ఇది సోనియా ఆలోచించుకోవాలి. మరీనాతో మామూలుగా ఉండేవారు కూడా ఉంటారు. కారుని అప్పగించేముందు మరీనా కార్ వాష్‌కి వెళుతుంది (కారుని అప్పగించేముందు కడిగించాలని ఎంతమంది ఆలోచిస్తారు?) అక్కడ ఒక చిన్న కేఫ్ ఉంటుంది. డబ్బు కట్టటానికి మరీనా వరుసలో నిలబడుతుంది. ఆలోచనలతో సతమతమవుతూ కణతలు నొక్కుకుంటూ ఉంటుంది. కాషియర్ ఆమెని పిలిస్తే కార్ వాష్‌కి డబ్బు కడతానంటుంది. “మీకు ఒక కాఫీ అవసరమని అనిపిస్తోంది” అంటుంది కాషియర్. రెండు రోజులుగా ఎవరూ మరీనాతో అంత ఆప్యాయంగా మాట్లాడలేదు. తమ జీవితంలోకి రానంతవరకు ట్రాన్స్‌జెండర్లతో బాగా మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. తమ జీవితాల్లోకి వస్తే? తన దాకా వస్తే కానీ తెలియదు. నాకైనా, ఎవరికైనా!

ఇలా అవమానాల మీద అవమానాలు ఎదుర్కొంటున్న మరీనా ప్రయాణం ఎలా సాగిందనేది మిగతా కథ. వీటన్నిటినీ పక్కన పెడితే ఆమెకి దొరికిన తాళం చెవి సంగతి ఏమిటి? ఇక్కడే రచయితల ప్రతిభ బయటపడుతుంది. ఇక్కడ కథలో ఒక ప్రముఖమైన అంశం చెప్పబోతున్నాను. ముఖ్యకథతో సంబంధం లేకపోయినా మనుషుల మనస్తత్వాలను ఆవిష్కరించే అంశమిది. ఈ అంశం తెలుసుకోకూడదనుకునేవారు క్రింద చుక్కలు వచ్చేవరకు వదిలి ఆ క్రింద చదవగలరు. మరీనా ఆ తాళం చెవి సంగతి ఎవరికీ చెప్పదు. ఆ చెవికి సంబంధించిన తాళం ఎక్కడుందో కనిపెడితే తనకు డబ్బు దొరకవచ్చనే ఆశ ఆమెలో ఏ మూలో ఉంది. అందుకే అవమానాలన్నీ మర్చిపోయి ముందుకు సాగుదామని అనుకుంటుంది. అనుకోకుండా ఆ తాళం చెవి ఓర్లాందో వెళ్ళే సౌనాలోని లాకర్ దని తెలుస్తుంది. అక్కడ బట్టలు, పర్సు లాంటివి పెట్టుకోవటానికి లాకర్లు ఉంటాయి. ఆమె సౌనాకి వెళ్ళి ఆవిరి స్నానానికి డబ్బు కట్టి స్త్రీల భాగంలోకి వెళుతుంది. లోపలికి వెళ్ళాక మగవారు కట్టుకున్నట్టు మొలకి మాత్రమే టవల్ కట్టుకుని పురుషుల భాగంలోకి వెళుతుంది. అప్పటివరకు విరబోసుకున్న పొడుగు జుట్టు రబ్బరు బ్యాండ్ తో కట్టేస్తుంది. అక్కడ ఉన్న మగవారిని దాటుకుంటూ లాకర్ల దగ్గరకి వెళుతుంది. లాకరు తెరిచి చూస్తే అందులో ఏమీ ఉండదు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేమిటంటే ఓర్లాందో చనిపోవటంతో అతని ఆస్తుల మీద ఆమెకి అధికారం లేకుండా పోయింది. కనీసం లాకర్లో ఏమైనా దొరుకుతుందని ఆశపడింది. ఇది స్వార్థమా? ఆ పరిస్థితిలో ఉంటే గానీ ఎవరూ ఈ ప్రశ్నకి జవాబు చెప్పలేరు. ఓర్లాందో అపార్ట్‌మెంట్‌కి మారే ముందు మరీనా ఎక్కడ ఉండేది? తన అక్క, బావల దగ్గర ఉండేదని నాకనిపించింది (ఈ పాత్రలు కూడా చిత్రంలో తర్వాత వస్తాయి.) ఇప్పుడు మళ్ళీ అక్క, బావల దగ్గరకి వెళ్ళాల్సిన పరిస్థితి. వారికీ ఇబ్బందే. ఇలాంటి స్థితిలో ఏదైనా విలువైనది తన చేతికొస్తుందేమో అనుకోవటం తప్పు కాదేమో! అయితే అన్నీ అనుకున్నట్టు జరగవు కదా. మరీనాకి నిరాశే మిగులుతుంది. దానితో ఆమెలో పట్టుదల పెరుగుతుంది. కానీ ఆమె లాకర్ దగ్గరకి వెళ్ళేటపుడు మగవాడిలా వెళుతుంది. తనని అందరూ స్త్రీగానే పరిగణించాలని కోరుకునే ఆమె ఇలా చేయటం ఆత్మవంచన కాదా? మనుషుల మనస్తత్వాలు ఇలాగే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఎవరికీ తెలియనంతవరకు ఆత్మవంచన చేసుకుంటారు. రచయితలు ఈ విషయాన్ని ఎంతో ప్రభావవంతంగా చెప్పారు.

***

సెబాస్టియన్ లెలియో, గొంజాలో మాజా స్క్రీన్ ప్లే అందించారు. సెబాస్టియన్ దర్శకత్వం వహించాడు. స్క్రీన్ ప్లే కి బెర్లిన్ చిత్రోత్సవంలో ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చింది. మరీనా పాత్ర ధరించిన డానియెలా వేగా నటన గుండెల్ని పిండేస్తుంది. తన ప్రియుడి మరణంతో శోకం గుండెల్లో అగ్నిపర్వతంలా ఉన్నా ఎదుటివారు అవమానిస్తే నిబ్బరంగా ఉండాల్సిన పరిస్థితి. వారి ముందు ఏడిస్తే ఆస్తి కోసం ఏడుస్తున్నావు అని వారు అంటారు. సానుభూతి చూపించేవారు ఒక్కరైనా ఉంటే మరీనా తనివితీరా ఏడ్చేది. అలాంటి వారెవరూ ఉండరు.. ఆమె అక్కతో సహా. అన్నిటికీ తట్టుకుని నిలిచే ప్రయత్నంలో ఆమె ఒక అసమాన వనిత (ఎ ఫెంటాస్టిక్ వుమన్) అని మనకి అనిపిస్తుంది. సినిమాల్లో ఒక్కోసారి పాత్ర నేపథ్యం ఒకటైతే పాత్రధారుడి నేపథ్యం వేరే ఉంటుంది. ఉదాహరణకి ‘ద సోషల్ నెట్వర్క్’ చిత్రంలో దివ్యనరేంద్ర అనే భారతీయుడి పాత్ర ఉంది. అయితే దానికి భారతీయ మూలాలు లేని మ్యాక్స్ మింగెల్లా అనే నటుడిని తీసుకున్నారు. దీనిపై విమర్శలు వచ్చాయి. ‘డాలస్ బయర్స్ క్లబ్’ చిత్రంలో ఒక ట్రాన్స్‌జెండర్ స్త్రీ పాత్రలో ట్రాన్స్‌జెండర్ కాని జారెడ్ లెటో అనే నటుడిని తీసుకున్నారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. ‘ద ఫెంటాస్టిక్ వుమన్’ చిత్రంలో సరైన నేపథ్యం, సామర్థ్యం ఉన్న డానియెలా వేగాని తీసుకుని నిర్మాతలు పాత్రకి న్యాయం చేశారు. ఆస్కార్ అవార్డులలో అవార్డులు ఇవ్వటానికి నటులు, దర్శకులు వేదికపైకి వస్తారు. 2018లో ఆస్కార్ వేదిక పై అవార్డు ఇచ్చిన తొలి ట్రాన్స్‌జెండర్ స్త్రీగా డానియెలా వేగా రికార్డు సృష్టించింది. ఆమె ఉత్తమ గీతానికి అవార్డు ఇచ్చింది. ఈ చిత్రంలో అక్కడక్కడా అద్భుతరసంతో కూడిన ఊహాదృశ్యాలు ఉంటాయి. ఈ దృశ్యాలలో మరీనా పట్టుదల ప్రస్ఫుటమౌతుంది. సంగీతం కూడా అద్భుతంగా కుదిరింది.

ఈ క్రింద ముఖ్యకథతో సంబంధం లేని ఒక సన్నివేశం ప్రస్తావించబడింది. తెలుసుకోవద్దని అనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

సోనియాని కలిసిన తర్వాత మరీనా తన సంగీతం మాస్టారు ఇంటికి వెళుతుంది. ఆయన ఆమెకి ఇటాలియన్ ఓపెరా తరహాలో పాడటం నేర్పించే మాస్టారు. ఆమెని చూడగానే “నీ మొహం పీక్కుపోయినట్టు ఉంది” అంటాడు. మళ్ళీ “సాధన చేయటానికి వచ్చావా లేక లోకం నుంచి తప్పించుకోవటానికి వచ్చావా?” అని అడుగుతాడు. “రెండూను” అంటుంది మరీనా. “నువ్వు తరచు సాధన చేయటానికి రాకపోయినా పర్వాలేదు. నీకు కొంచెం సాంత్వన కావాలన్నపుడు వచ్చినా పర్వాలేదు. కానీ నేను నీ సంగీత గురువుని అని గుర్తుపెట్టుకో” అంటాడాయన. ఇంతకు ముందు ఇలాంటి సంభాషణలెన్నో జరిగినట్టు ఆమె “అవును. గుర్తుంది. మీరు నా సైకాలజిస్టూ కాదు, నా తండ్రీ కాదు. మరి నేను ఇక్కడికి ఎందుకొచ్చానో” అంటుందామె.

ఆయన: పాడటానికి వచ్చావని ఆశిస్తున్నాను.

ఆమె: చిటికెడు ప్రేమ కోసం వచ్చి ఉంటే?

ఆయన: ప్రేమ వెతికితే దొరకదు.

ఆమె: సెయింట్ ఫ్రాన్సిస్ సూక్తులు వల్లించకండి.

ఆయన: సెయింట్ ఫ్రాన్సిస్ దేవుణ్ణి ప్రేమ ఇవ్వమని అడగలేదు. ఆయన దేవుణ్ణి “నీ ప్ర్రేమ చూపించటానికి నన్నొక సాధనంగా వాడుకో” అని అడిగాడు.

సెయింట్ ఫ్రాన్సిస్ సంగీతాన్ని ప్రార్థనకు సాధనంగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన మతగురువు. మరీనాకి తన వ్యక్తిగత విషయాలు తన మాస్టారుతో పంచుకోవటం అలవాటని ఈ సన్నివేశంలో తెలుస్తుంది. అతన్ని తండ్రిలా భావిస్తుంది. దుఃఖసమయంలో అతని దగ్గర సేదతీరుదామని వెళుతుంది. అయితే ఆయన నీ సంగీతమే నీకు ఆలంబన అని చెబుతాడు. ‘నాకు అది కావాలి, ఇది కావాలి అని అడగటం మానేసి నేను ఏమి ఇవ్వగలను’ అని ఆలోచించమంటాడు. సంగీతంలోనే సాంత్వన పొందమంటాడు. ఒక కళ మన చేతిలో ఉన్నపుడు దాన్ని ప్రపంచానికి పంచటమే మన బాధ్యత. అందులోనే ఆనందం ఉంది. మన దుఃఖంలో నుంచి కూడా కళాకృతులు పుడతాయి. రామాయణం శోకం నుంచి పుట్టలేదా? కళాసేవలో ఉన్నవారిని దేవుడు కరుణిస్తాడు. ఈ సందేశం అందుకుని మరీనా సాధన చేస్తుంది. ఆమె కళే ఆమెకి ఆలంబన అవుతుంది. కళాకారులకి ప్రపంచం దాసోహం కాదా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here