Site icon Sanchika

మరుగునపడ్డ మాణిక్యాలు – 13: స్పెన్సర్

[dropcap]బ్రి[/dropcap]టన్ యువరాణి డయానా తన వైవాహిక జీవితం గురించి, తన బులీమియా వ్యాధి గురించి ఇంటర్వ్యూలలో నిజాయితీగా మాట్లాడటం అప్పట్లో సంచలనం సృష్టించింది. 1992లో ఆమె తన భర్త యువరాజు చార్ల్స్ (ఇటీవల బ్రిటన్ రాజు అయ్యారు) నుంచి వేరుపడింది. అయితే విడాకులు తీసుకోవటానికి మరో నాలుగేళ్ళు పట్టింది. తమ వైవాహిక జీవితంలో ఇద్దరు కాదు, ముగ్గురు ఉండేవారని డయానా అంది. ఆ మూడో వ్యక్తి నేటి బ్రిటన్ రాణి కమిల్లా. డయానా కంటే ముందే కమిల్లాతో ప్రేమలో పడ్డాడు చార్ల్స్. అయితే కమిల్లాకి అప్పటికే విడాకులయ్యాయి. కాబట్టి ఆమె.. రాజవారసుల్లో మొదటివాడైన చార్ల్స్‌తో వివాహానికి తగదని రాజకుటుంబం భావించింది. చార్ల్స్ నౌకాదళంలో చేరి ఆమెని మరచిపోవటానికి ప్రయత్నించాడు. ఆమె వేరే పెళ్ళి చేసుకుంది (ఇందులో కూడా కుట్ర ఉందని అంటారు.) చార్ల్స్ డయానాని పెళ్ళి చేసుకున్నాడు. అయినా కమిల్లా, చార్ల్స్ కలుసుకుంటూనే ఉన్నారు. పత్రికలు వారిని వదిలిపెట్టలేదు. డయానా వారిద్దరి మధ్య నలిగిపోయింది. పైగా రాజకుటుంబంలోని కట్టుబాట్లు ఆమె తట్టుకోలేకపోయింది. బులీమియా వ్యాధి బారిన పడింది. పదార్థాలు ఎక్కువగా తినటం, తర్వాత బలవంతంగా వాంతి చేసుకోవటమే బులీమియా వ్యాధి. తమకు ఎక్కువ విలువ లేదని భావించేవారు ఈ వ్యాధి బారిన పడతారు. బాగా తినటానికి తమకి అర్హత లేదని వారి భావన!

ఈ నేపథ్యంతో వచ్చిన చిత్రం ‘స్పెన్సర్’ (2021). స్పెన్సర్ అనేది డయానా చిన్నప్పటి ఇంటిపేరు. ఆమె రాజకుటుంబంలో ఇమడలేక పోయిందని, తన చిన్ననాటి జీవితాన్ని తిరిగిపొందాలని ఆశించిందని సూచిస్తూ పెట్టిన పేరు ఇది. ఈ చిత్రం ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. హిందీ శబ్దానువాదం, తెలుగు సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. అయితే తెలుగు సబ్ టైటిల్స్ అంత బాగాలేవనే చెప్పాలి.  కథ 1991లో జరుగుతుంది. అప్పటికి డయానా, చార్ల్స్‌ల పెళ్ళి జరిగి పదేళ్ళు. వారి పిల్లలు విలియమ్, హ్యారీ. క్రిస్మస్ పండుగ జరుపుకోవటానికి లండన్ నుంచి నార్ఫోక్ లోని రాజమహలుకి రాజకుటుంబంలోని వారు ఒక్కరొక్కరుగా చేరుకుంటూ ఉంటారు. డయానా అప్పటికే తన భర్తకి కమిల్లాతో ఉన్న సంబంధంతో విసిగిపోయి ఉంటుంది. ఆమె ఒంటరిగా కారు నడుపుకుంటూ రాజమహలుకి వస్తూ ఉంటుంది. దారి తప్పిపోయానని ఒక రెస్టారెంట్‌కి వెళ్ళి అందరూ చూస్తుండగా “నేను ఎక్కడ ఉన్నాను?” అని అడుగుతుంది. నార్ఫోక్ ఆమె పెరిగిన చోటు. ఆ చోటు ఆమెకి తెలియదా? రాజమహలు దూరాన కనిపిస్తూనే ఉంటుంది. తెలిసే రాజమహలుకి వెళ్ళటం ఇష్టం లేక ఇలా ప్రవర్తించిందా? రెస్టారెంట్‌కి వెళ్ళటంలో ఆంతర్యం ఏమిటి? “నేనూ మీలాంటి దాన్నే” అని చెప్పటమా? ఆమె మానసిక స్థితి ఎంత నాజూకుగా ఉందో దీని ద్వారా తెలుస్తుంది. రచయితలు కొంచెం స్వేచ్ఛ తీసుకోవటం మామూలే. కానీ ఆమె ఎంతగా కుంగిపోయిందో ఈ సన్నివేశం ద్వారా ప్రభావవంతంగా చెప్పారు.

రాజమహలులోని షెఫ్ (వంటశాల పెద్ద) పేరు డారెన్. అతను దారిలో డయానాకి తారసపడతాడు. ‘డయానా’ అని పిలిచి అంతలోనే ‘యువర్ హైనెస్’ (రాజకుటుంబీకులకు మర్యాదపూర్వక పలకరింపు) అంటాడు. డయానా అని పిలిచాడంటే అతను ఆమెకి బాగా పరిచయమన్నమాట. మధ్యతరగతి కుటుంబంనుంచి వచ్చిన డయానా రాజకుటుంబం భేషజాలు అలవాటు చేసుకోలేదు. అందరితో కలిసిపోతుంది. ఇంతలోనే డయానా పరిసరాలు గమనించి అది తాను చిన్నప్పుడు ఆడుకున్న ప్రదేశమని గుర్తిస్తుంది. అక్కడ ఎత్తుగా ఉన్న మైదానంలో ఉన్న దిష్టిబొమ్మను కూడా గుర్తుపడుతుంది. ఆ మైదానం అవతలే ఆమె పెరిగిన ఇల్లు. దిష్టిబొమ్మకు తొడిగిన కోటు తన తండ్రిదే అని వెళ్ళి తెచ్చుకుంటుంది.

ఇదిలా ఉండగా చార్ల్స్‌కి వరసకి అక్క అయిన ఆమె రాజమహల్‌కి చేరుకుంటుంది. మేజర్ గ్రెగరీ అనే అతను రాజమహల్ వ్యవహారాలన్నీ చూస్తుంటాడు. వచ్చినామె బరువు తూచే యంత్రం మీద కూర్చుంటుంది. గ్రెగరీ బరువు చూస్తాడు. “ఆమె వచ్చిందా?” – “ఇంకా లేదు.” – “అతను వచ్చాడుగా.” – “అయినా ఆమె ఇంకా రాలేదే.” ఇదీ వారి సంభాషణ. డయానాని బయటి వ్యక్తిగానే ఆమె పరిగణిస్తుంది. ఆమె రాజకుటుంబానికి తగదు అనే భావన ఒక వైపు, ఆమె మీద ఈర్ష్య ఒకవైపు. ఆమె కాబోయే రాణి. పత్రికలెప్పుడూ ఆమె గురించి వ్రాస్తూ ఉంటాయి మరి! ఇంతకీ బరువు చూసే తతంగం ఏమిటి? క్రిస్మస్‌కి వచ్చినపుడు బరువు చూస్తారు. వెళ్ళేటపుడు మళ్ళీ బరువు చూస్తారు. బరువు 3 పౌన్లు (దాదాపు 1.4 కిలోలు) పెరిగితే వచ్చినవాళ్ళు బాగా ఆనందంగా క్రిస్మస్ జరుపుకున్నట్టు! ఇది గతంలో ఒక రాజు ప్రవేశపెట్టిన ఆచారం. డయానా బరువు తూగనంటుంది. గ్రెగరీ కొత్తవాడు. ఇంతకు ముందు వ్యవహారాలు చూసే అతనితో బరవు తూగనని డయానా ఒప్పందం. గ్రెగరీ కటువుగా ఉంటాడు. అయినా డయానా అతని మాట వినదు. డయానా బులీమియా వ్యాధి కారణంగా తూకం నుంచి తప్పించుకుంటుంది. ఆమెని ఎవరూ బలవంతపెట్టరు. కానీ ఆమె ఆచారాలు పాటించదని చెప్పటానికి ఇదో సందు. ప్రపంచమంతా క్రిస్మస్ కానుకలు క్రిస్మస్ రోజు తెరిచి చూస్తే రాజకుటుంబం వారు మాత్రం ముందురోజు తెరుస్తారు. ఎందుకంటే క్రిస్మస్ దేవుడు రాజకుటుంబానికి కానుకలు ఇచ్చాకే మిగతా వారికి ఇస్తాడని వారి నమ్మకమట!

ఇక్కడో విషయం చెప్పుకోవాలి. లోపల ఎలా ఉన్నా బయట అంతా బావున్నట్టు ఉండాలని రాజకుటుంబం వారు అంటూ ఉంటారు. ఒకరకంగా ఇదీ సబబే. కానీ భర్తకు వేరే స్త్రీతో సంబంధం ఉంటే డయానా అంతా బావున్నట్టు ఎలా ఉంటుంది? ఆమె మీద సానుభూతి చూపించే వారు రాజకుటుంబంలో ఎవరూ లేరు. అందరూ ఆమెకి సలహాలిచ్చేవారే. చార్ల్స్‌కి కూడా పెద్దవాళ్ళు హితవు చెప్పే ఉంటారు. అతను “కమిల్లాను పెళ్ళి చేసుకుంటానంటే మీరు ఎందుకు ఒప్పుకోలేదు?” అని అడిగితే వారి దగ్గర సమాధానమేది? మారుతున్న సమాజంతో పాటు రాజకుటుంబం కూడా ఎందుకు మారలేదు? డయానా మరణించిన తర్వాత అతను కమిల్లాని పెళ్ళి చేసుకుంటే ఎవరూ కిమ్మనలేదు. రాచపద్ధతుల పేరు చెప్పి కట్టడి చేయటం, తర్వాత పద్ధతులు మార్చుకోవటం – ఇదే వరస. మధ్యలో కొన్ని జీవితాలు బలి.

డయానా రాజమహల్ చేరుకునేటప్పటికే ఆమె పిల్లలు చేరుకుంటారు. తల్లిని చూసి సంబరపడతారు. ఆమెకి వారంటే ప్రాణం. పడకగది చల్లగా ఉందని హ్యారీ అంటాడు. గ్రెగరీ దుప్పట్లు పంపిస్తానంటాడు. “హీటింగ్ మాత్రం పెంచరు” అని డయానా ఒక విసురు వేస్తుంది. క్రిస్మస్ చలిచలిగా జరుపుకోవటం రాజకుటుంబం పద్ధతి. విలియమ్ తల్లిని “ఎందుకు విచారంగా ఉన్నావు?” అని అడుగుతాడు. “పండుగ అయ్యాక మాట్లాడుకుందాం” అంటుంది. డయానా తన కోసం కేటాయించిన గదికి వెళుతుంది. అక్కడ మ్యాగీ అనే సహాయకురాలు ఉంటుంది. డయానాకి దుస్తులు తొడగటం ఆమె పని. ఆమె కూడా డయానాకి స్నేహితురాలే. డయానా తన వ్యక్తిగత విషయాలు ఆమెతో చెప్పుకుంటుంది. తన ముత్యాల దండని చూపించి “ఆమెకి కూడా ఇలాంటిదే ఇచ్చాడు” అంటుంది. “తెలిసి చేసిన పని కాదులే” అంటుంది మ్యాగీ. గ్రెగరీ “క్రిస్మస్‌కి ఆల్ సెట్” (అంతా కుదిరిపోయింది) అన్నాడని, దాని అర్థం పండుగ అంతా అప్పుడే జరిగిపోయింది అన్నట్టు ఉందని అంటుంది. ఆమె ఏ పూట ఏ దుస్తులు వేసుకోవాలో ముందే ఎంపిక చేసి ఉంటాయి. ఆమెకి స్వతంత్రం లేదు. అన్నీ పథకం ప్రకారం జరగాలి. ఇష్టాయిష్టాలకు తావు లేదు. తర్వాత ఆమె భోజనానికి వెళుతుంది. అందరూ అప్పటికే అక్కడ ఉంటారు. రాణికి కర్ట్సీ (ఒక పాదం రెండో పాదానికి వెనక పెట్టి మోకాళ్ళు కొంచెం మడిచి తల వంచి చేసే అభివాదం) చేసి తన స్థానంలో కూర్చుంటుంది. అవతలి వైపు చార్ల్స్ ఉంటాడు. భోజనం ప్రారంభమౌతుంది. అందరూ చూసే చూపులకి ఆమెకి ముత్యాలదండ మెడకి బిగుసుకున్నట్టు ఉంటుంది. ఆమె ఆలస్యంగా రాజమహలుకి చేరుకోవటం వారికి నచ్చలేదు. ఆమె వారి చూపులు భరించలేక ముత్యాలదండ తెంచేసుకుంటుంది. ముత్యాలు సూప్ లో పడతాయి. ఆమె వాటిని చెంచాతో తీసుకుని ఒక్కొక్కటీ తింటుంది. కష్టం మీద మింగుతుంది. అయితే ఇదంతా ఆమె ఊహ మాత్రమే. తాను పడే మానసిక చిత్రహింసతో ఆమె అలా ఊహించుకుంటుంది. భోజనం అయ్యాక బాత్రూముకి వెళ్ళి వాంతి చేసుకుంటుంది.

ఆ రోజు రాత్రి ఆమె తన చిన్నప్పటి ఇంటిని చూడాలని వెళుతుంది ఎవరికీ తెలియకుండా. ఆ ఇల్లు పాడుబడిపోయింది. ఆమె కంచె దాటి వెళుతుంటే పోలీసులు ఆపుతారు. ఆమె ఎవరికీ చెప్పొద్దని వెనుదిరిగి వస్తుంది. ఆ ఇల్లు పాడుబడిపోవటానికి కారణమేమిటి? రాజకుటుంబం పంతం కాదా? ఆమె గతజీవితం ఆనవాళ్ళు లేకుండా చేయాలని కాదా? పూర్తిగా ఆనవాళ్ళు చెరిపేశారా అంటే అదీ లేదు. అదొక హెచ్చరిక లాగా వదిలేశారు. డయానా గదిలో యాన్ బొలిన్ గురించి ఒక పుస్తకం ఉంటుంది. యాన్ ఒకప్పటి రాణి. ఆమె భర్త హెన్రీ అనే రాజు. అతనికి వేరే స్త్రీతో సంబంధం ఉంటుంది. ఆమె కోసం యాన్ మీద అక్రమసంబంధం మోపి ఆమెకి శిరచ్ఛేదం విధిస్తాడు హెన్రీ. చార్ల్స్, కమిల్లాల మధ్య తన పరిస్థితి కూడా అంతే కదా అనుకుంటుంది డయానా. అయితే ఆ పుస్తకం అక్కడ పెట్టిందెవరు? అంతకన్నా పెద్ద ప్రశ్న – పెట్టించిందెవరు??

మర్నాడు క్రిస్మస్. డయానాకి దుస్తులు తొడగటానికి వేరే సేవకురాలు వస్తుంది. మ్యాగీని పంపించేశారని చెబుతుంది. తన స్నేహితురాలిని పంపించేశారని తెలిసి డయానా ఖంగు తింటుంది. నా బట్టలు నేనే వేసుకుంటాను పొమ్మంటుంది. అల్పాహారం చేసేటపుడు చార్ల్స్ “ఈ ఆహారం ఎందరో కష్టపడి తయారు చేశారు. నువ్వు దీని గౌరవం నిలబెట్టాలంటే వాంతి చేసుకోకుండా ఉండు” అంటాడు. బులీమియా ఒక మానసిక వ్యాధి అనే అవగాహన అప్పటికి లేదేమో! ఆమె కావాలని అలా చేస్తోందని అతని భావన. తర్వాత అందరూ కలిసి చర్చికి వెళతారు. డయానా ఆ పూట వేసుకోవాల్సిన దుస్తులు కాకుండా వేరే దుస్తులు వేసుకుంటుంది. ప్రార్థన అయిన తర్వాత డయానాకి కమిల్లా కనపడుతుంది. నిజానికి ఆమె అక్కడ లేదు. డయానా ఊహించుకుంది. ఆమె నెమ్మదిగా వాస్తవ ప్రపంచం మీద పట్టు కోల్పోతోందనటానికి ఇదో ఉదాహరణ. చర్చి బయట పాత్రికేయులు ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉంటారు. అక్కడ తన పిల్లలతో బలవంతంగా నవ్వుతూ ఫొటోలు దిగుతుంది. తిరిగి వచ్చాక ఆమెకి తన గదిలో రాణి యాన్ కనిపిస్తుంది. అది కలా? లేక భ్రమా? లేక ఆత్మ కనపడిందా?

రాజమహలుకి కాస్త దూరంలో ఉన్న పాత్రికేయులు ఫొటోలు తీస్తున్నారని తెలుస్తుంది. ఆ కెమెరాలు శక్తిమంతమైనవి. దూరం నుంచి కూడా మంచి ఫొటోలు తీస్తాయి. డయానా గది కిటికీ తెరలు తీసి ఉండటంతో ఆమె బట్టలు మార్చుకుంటున్నపుడు ఫొటోలు తీసి ఉంటారని అనుమానం వస్తుంది గ్రెగరీకి. ఇదిలా ఉండగా రాజకుటుంబం ఆచారం ప్రకారం విలియమ్ పక్షులని తుపాకీతో కాల్చటానికి శిక్షణ పొందుతూ ఉంటాడు. “విలియమ్‌కి పక్షులని కాల్చటం ఇష్టం లేదు” అంటుంది చార్ల్స్‌తో డయానా. అతను ఆ మాట పట్టించుకోకుండా ఆమె ఆలస్యంగా రాజమహలుకి చేరుకున్న సంగతి, కిటికీ తెరలు తెరిచి ఉంచిన సంగతి సంగతి ప్రస్తావిస్తాడు. “ఇక్కడ పాత్రికేయులు నిన్ను గమనిస్తూ ఉంటారని తెలియదా?” అంటాడు. “పాత్రికేయులందరూ నా వెంటే పడతారు. నిన్ను పట్టించుకోరు” అంటుంది. “నేను కిటికీ తెరలు మూసి ఉంచుతాను మరి” అంటాడతను ‘అంతా నీ తప్పే’ అన్నట్టు. కుంగిపోయినవారు బయటికి వస్తే అందరూ తమనే గమనిస్తున్నారని అనుకుంటారు. ఇక పాత్రికేయుల నిఘాలో ఉన్న డయానా గురించి చెప్పాలా? బట్టలు మార్చుకునేటపుడు కిటికీ తెరలు మూయటం అందరూ చేసే పనే. ఆమె ఉన్న మానసిక స్థితిలో తనకి తెలియకుండానే ధిక్కరణ చూపిస్తూ ఉంటుంది. ‘నీవు నాకు చేసిన ద్రోహం ముందు ఇదెంత?’ అన్న వాదన కనిపిస్తుంది. కుటుంబంలో వారికి ఆ ధిక్కరణ కంటకంగా మారుతుంది.

ఆమె మళ్ళీ విలియమ్ చేత పక్షులని కాల్పించొద్దని చార్ల్స్‌ని ప్రాధేయపడుతుంది. అతను “మనం రెండు జీవితాలు జీవించాలి. ఒకటి బహిరంగంగా, ఒకటి వ్యక్తిగతంగా. ఒక్కోసారి నీ శరీరం చేత బలవంతంగా నువ్వు ద్వేషించే పనులు చేయించాల్సి ఉంటుంది” అంటాడు చార్ల్స్. “ద్వేషించే పనులా?” అని ప్రశ్నిస్తుంది. అతను ఆమెతో ఉండటాన్ని ద్వేషిస్తున్నాడా? యాన్ ని హెన్రీ వదిలించుకున్నట్టే తనను ఏదో విధంగా వదిలించుకుంటాడా? తాను ఓడిపోతున్నాననే భావన ఆమెలో పెరిగిపోతూ ఉంటుంది. ఏ విషయం మాట్లాడినా తనకి నీతులు చెప్పటమే అందరూ చేసే పని. నిస్పృహతో “మ్యాగీని తిరిగి రప్పించండి” అంటుంది. కిటికీ తెరలు తీసి ఉండటం మ్యాగీ తప్పే అని, అంతే కాకుండా ఆమె “డయానా అస్థిరంగా ఉంది” అని ఇతర సేవకులతో చెప్పిందని చార్ల్స్ అంటాడు. డయానాకి భూమి బద్దలైనట్టు అనిపిస్తుంది.

నిజంగా మ్యాగీ ఆ మాటలు అన్నదా? విలియమ్ పక్షుల వేట చేశాడా? డయానా మాటకి అసలు విలువ లేదా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. డయానాగా క్రిస్టెన్ స్టువర్ట్ నటించింది. నిస్సహాయతను అద్భుతంగా అభినయించింది. అడుగడుగునా కట్టుబాట్లను తట్టుకోలేక పడే వేదన ఆమె నటనలో కనపడుతుంది. ఆమెకి ఉత్తమ నటి విభాగంలో ఆస్కార్ నామినేషన్ వచ్చింది. క్రిస్టెన్ చిన్నప్పటి నుంచే నటించటం మొదలుపెట్టింది. ‘ట్వైలైట్’ అనే సినిమా సీరీస్‌తో యువప్రేక్షకుల ఆదరణ పొందింది. తర్వాత్తర్వాత నటనకు ఆస్కారమున్న పాత్రలు ఎంచుకుని తన ప్రస్థానం సాగించింది. ఆమె డయానా లాగ అంతుచిక్కని స్వభావం కలది కాబట్టే ఆమెని డయానా పాత్రకి ఎంచుకున్నానని దర్శకుడు పాబ్లో లరెయిన్ అన్నాడు. పాత్రలకి సరైన నటులని ఎంచుకోవటం ఎంత ముఖ్యమో దీన్ని బట్టి అర్థమవుతుంది.

2013లో ‘డయానా’ అనే చిత్రం వచ్చింది. అందులో డయానాకి విడాకులైన తర్వాత ఆమె జీవితం గురించి చూపించారు. అందులో ప్రముఖ నటి నయోమీ వాట్స్ డయానాగా నటించింది. 2019, 2020లో ‘ద క్రౌన్’ అనే వెబ్ సీరీస్‌లో డయానా పెళ్ళి, వైవాహిక జీవితం చూపించారు. అందులో ఎమ్మా కోరిన్ డయానాగా నటించింది. వీరందరి కంటే క్రిస్టెన్ డయానా హావభావాలని బాగా పలికించిందని ఆమెతో పరిచయం ఉన్నవారు అన్నారు. ‘స్పెన్సర్’ చిత్రానికి స్టీవెన్ నైట్ స్కీన్ ప్లే అందించాడు. డయానాతో పరిచయం ఉన్నవారిని ఇంటర్వ్యూ చేసి రచించాడు. చివరికి వచ్చే సన్నివేశాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఒక పరిణామమైతే డయానాకి కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఫొటోగ్రఫీ పాత చిత్రాలను గుర్తు చేస్తుంది. డయానా మీద క్లోజప్ షాట్స్ ఎక్కువగా ఉంటాయి.

దర్శకుడు పాబ్లో లరెయిన్ చిలీలో పుట్టాడు. అతను దర్శకత్వం వహించిన ‘నో’ అనే స్పానిష్ (చిలీలో మాట్లాడే భాష) చిత్రానికి ఉత్తం విదేశీ చిత్రం విభాగంలో అస్కార్ నామినేషన్ వచ్చింది. తర్వాత అతనికి హాలీవుడ్‌లో అవకాశం వచ్చింది. అమెరికా అధ్యక్షుడు జాన్ కెనెడీ హత్య నేపథ్యంతో కెనెడీ భార్య జాకీ గురించి ‘జాకీ’ అనే సినిమా తీశాడు. అందులో జాకీగా నటించిన నాటలీ పొర్ట్మన్ కి కూడా ఆస్కార్ నామినేషన్ వచ్చింది. భారతీయ దర్శకుడు శేఖర్ కపూర్ ఎలిజబెత్ రాణి (ఇటీవల మరణించినా రాణి కాదు‌) మీద హాలీవుడ్ లో రెండు సినిమాలు తీశాడు. వాటికి కూడా చక్కని గుర్తింపు వచ్చింది. ఎలిజబెత్ రాణిగా నటించిన కేట్ బ్లాంచెట్ కి రెండు సార్లూ ఆస్కార్ నామినేషన్లు వచ్చాయి. అయితే ఆ చిత్రాలకీ ఈ పాబ్లో చిత్రాలకీ ఉన్న తేడా ఏమిటంటే చరిత్ర చూపించటం కన్నా చరిత్రలో ఉన్న వ్యక్తుల అంతరంగాలను ఆవిష్కరించటం. ఈ చిత్రంలో ఒక మంచి సందేశం కూడా ఉంటుంది. ఎలాంటి దుష్కర పరిస్థితుల్లో ఉన్నా మన జీవితంలో ఎంతో కొంత సంతోషం ఉంటుంది. అది మనం గుర్తించలేకపోయినా మన స్నేహితులు మనకు గుర్తు చేస్తారు. మంచి స్నేహితులు అందుకే అవసరం. ధైర్యంగా ఉండాలి. మన ప్రాధాన్యతలేమిటో గుర్తు చేసుకుంటే దారి దొరుకుతుంది. డయానా చార్ల్స్ తో వేరుపడింది. అదొక్కటే ఆమెకి మిగిలిన దారి. వేరుపడిన తర్వాత కొన్నాళ్ళయినా స్వేచ్ఛగా (వీలైనంత) బతకగలిగింది. అయితే టాబ్లాయిడ్ పత్రికలు మాత్రం ఆమెని వదల్లేదు. ఆమె అకాలమరణానికి కారణమయ్యారు.

ఈ క్రింద చిత్రకథ మరి కొంత ప్రస్తావించబడింది. ముగింపు ప్రస్తావించలేదు. చిత్రకథ ఇంకొంచెం కూడా తెలుసుకోకూడదనుకునే వారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

డయానా షెఫ్ డారెన్‌ని కలవటానికి వంటశాలకి వెళుతుంది. ఆమెకి అక్కడ మిగిలిన స్నేహితుడు అతనొక్కడే. విలియమ్ కాల్చే పక్షులని ఏం చేస్తారు అని అడుగుతుంది. ఆ పక్షులు నెమలి జాతికి చెందినవి. వాటిని ఫెసెంట్స్ అంటారు. అందంగా ఉంటాయి. డారెన్ “కొంత మాంసం సేవకులు పట్టుకెళతారు, కొంత కుక్కలు తింటాయి, కొంత పారేస్తాం” అంటాడు. “పారేస్తారా?” అని నిట్టూరుస్తుంది. “ఆ పక్షుల ప్రయోజనం వేట మాత్రమే. లేకపోతే కార్ల కింద పడి చనిపోవటం. అందంగా ఉంటాయి కానీ తెలివిలేనివి” అంటాడతను. ఆమెకి మనసు కలుక్కుమంటుంది. ఆమెని కూడా ఒక పత్రికలో ‘అందంగా ఉంటుంది కానీ తెలివిలేనిది’ అన్నారు. “నాకు యాన్ ఆత్మ కనపడింది” అంటుంది. “అలాంటి మాటలు మాట్లాడితే సేవకులెవరో వింటారు. పుకార్లు పుట్టిస్తారు” అంటాడు డారెన్. “మ్యాగీ నేను అస్థిరంగా ఉన్నానని అన్నదా?” అని అడుగుతుంది. అతను మ్యాగీ ఎవరని అడుగుతాడు. “ఆమె నా స్నేహితురాలని అనుకున్నాను” అంటుందామె. “నేను నా పని నేను చేసుకుంటాను. మాటలు వినను” అంటాడతను. మళ్ళీ “ఇక్కడి సేవకులు భోజనం చేసేటపుడు రాజకుటుంబం ఎంత విచిత్రమైనదో, వారి జీవితాల్లో ఎలాంటి బాగోతాలు జరుగుతూ ఉంటాయో అని నవ్వుకుంటూ ఉంటారు. కానీ మీ గురించి మాట్లాడేటపుడు నవ్వుకోరు. ప్రేమగా మాట్లాడతారు. మీ గురించి ఆందోళన పడుతుంటారు. పదేళ్ళ క్రితం మీరు ఎలా ఉన్నారో అలా ఉండాలని కోరుకుంటారు” అంటాడు. ఆమె సామాన్య ప్రజల గుండెల్లో ఎలాంటి స్థానం సంపాదించుకుందో అర్థమవుతుంది. ఆమె ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేది. ‘పీపుల్స్ పిన్సెస్’ (ప్రజల యువరాణి) అని పేరు తెచ్చుకుంది.

ఆలోచించి చూస్తే తప్పు రాచపద్ధతులదే తప్ప వ్యక్తులది కాదు. ప్రపంచమంతా పాటించే పద్ధతులు మేమెందుకు పాటించకూడదని కొందరు రాజకుటుంబసభ్యులు తరతరాలుగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. రాజకుటుంబం వ్యవహారాల మీద ఆసక్తి ఉన్నవారు ‘ద క్రౌన్’ అనే వెబ్ సీరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు. గమనించాల్సిన విషయం ఏమిటంటే రాజకుటుంబం ఈ సినిమాల మీద, సీరీస్‌ల మీద అసలు స్పందించదు. మీరేమనుకున్నా మాకు అనవసరం అన్నట్టు ఉంటుంది.

Exit mobile version