మరుగునపడ్డ మాణిక్యాలు – 15: ఎ సెపరేషన్

0
2

[dropcap]ఇ[/dropcap]రాన్ లాంటి దేశాల్లో మతవిశ్వాసాలు చాలా దృఢంగా ఉంటాయి. హిజాబ్ (తలను కప్పే బట్ట) ధరించలేదని ఇటీవలే ఒక యువతిని కొందరు మతరక్షకులు నిర్బంధించారు. తర్వాత ఆమె మరణించింది. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది పాశ్చాత్య దేశాలకు తరలిపోతున్నారు. పాశ్చాత్యదేశాలలో అయితే జీవతం బావుంటుంది అనే భావన పెరుగుతోంది. ఇది కుటుంబాలపై ప్రభావం చూపుతోంది. తలిదండ్రులని వదిలి వెళ్ళటం ఒక పక్కయితే భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది? పిల్లలు ఏమౌతారు? ఈ ప్రశ్నతోనే ‘ఎ సెపరేషన్’ (2011) మొదలౌతుంది. కానీ తర్వాత ఈ చిత్రం సత్యం అంటే ఏమిటి, పాపం అంటే ఏమిటి వంటి పెద్ద ప్రశ్నలను స్పృశిస్తుంది. ఈ చిత్రానికి ఉత్తమ అంతర్జాతీయ చిత్రం ఆస్కార్ అవార్డ్‌తో పాటు ఎన్నో అవార్డులు వచ్చాయి. అప్పట్లో బాగా ప్రాచుర్యం పొందింది. సినీప్రియులు చాలా మంది ఈ చిత్రం చూసే ఉంటారు. ఒక దశాబ్దం దాటిపోయింది కాబట్టి ఇప్పటి సినీప్రియులకి ఈ చిత్రాన్ని పరిచయం చేయటమే ఈ వ్యాసం ఉద్దేశం. ఈ చిత్రం ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం. పదమూడేళ్ళు దాటిన పిల్లలు కూడా చూడవచ్చు.

పేరులో ఉన్న Separation అనే పదానికి వియోగం అనే అర్థం చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ వేరుపాటు అనే చెప్పుకోవాలి. నాదెర్, సిమిన్ అనే దంపతులు విడాకుల కోసం కోర్టులో జడ్జి ముందు ఉండగా చిత్రం మొదలవుతుంది. కోర్టు అంటే ఏదో అనుకునేరు.. జడ్జి బల్లకి అటువైపు కూర్చుంటే వీరిద్దరూ ఇటువైపు ఆయన ఎదుట కూర్చుంటారు. లాయర్లు ఉండరు. వారికి ఒక పదకొండేళ్ళ కూతురు ఉందని మాటల్లో తెలుస్తుంది. ఆమె తామందరం ఇరాన్ వదిలి వెళ్ళిపోదామంటుంది. వీసాలు కూడా వచ్చాయి. అయితే అతని తండి అల్జీమర్స్ (మనుషుల్ని గుర్తు పట్టలేని వ్యాధి) బారిన పడ్డాడు. తండ్రిని చూసుకోవాలి కనక తాను ఇరాన్ వదిలి రానంటాడు అతను. జడ్జి ఎదుటే వారు వాదులాడుకుంటారు. “మీ నాన్నకి నువ్వు ఆయన కొడుకువని కూడా గుర్తులేదు” అంటుంది. “కానీ ఆయన నా తండ్రి అని నాకు తెలుసు కదా” అంటాడతను. ఆమె కూతురి భవిష్యత్తు గురించి ఆలోచించమంటుంది. జడ్జి “ఇక్కడుంటే భవిష్యత్తు ఉండదా? తలిదండ్రులతో కలిసి ఉండటమే మంచిది కదా” అంటాడు. “అందుకే ఆయన్ని కూడా రమ్మంటున్నాను. ఆయన రాడు. నేను వెళితే అభ్యంతరం లేదు. విడాకులిప్పించి నా కూతుర్ని నాతో పంపించండి” అని జడ్జితో అంటుంది సిమిన్. నాదెర్ కూతుర్ని పంపటానికి ఒప్పుకోడు. కూతురు ఎవరితో ఉండాలో ఇద్దరూ ఒప్పుకోకపోతే విడాకులివ్వటం కుదరదంటాడు జడ్జి. ఆమెకి మతపరమైన కట్టుబాట్లు ఇష్టం లేదు. అందుకే వెళ్ళిపోదామంటుంది. ఆమె బుర్ఖా వేసుకోదు కానీ హిజాబ్ మాత్రం వేసుకోవాలి. లేకపోతే చట్టం ఒప్పుకోదు. మగవాళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళయినా చేసుకోవచ్చు. ఆడది మాత్రం కట్టులో ఉండాలి. ఆమె భర్త మంచివాడే కానీ ఆమె తన కూతురి గురించి ఆలోచిస్తూంది. అతను తన తండ్రి గురించి ఆలోచిస్తున్నాడు. ఎవర్ని ఏమనగలం?

కోపంతో సిమిన్ భర్తని విడిచి పుట్టింటికి వెళుతుంది. కూతురు తెర్మె మాత్రం తండ్రి దగ్గరే ఉంటుంది. వారిది రెండో అంతస్తులోని అపార్ట్‌మెంట్. సిమిన్ వెళ్ళేటపుడు మామగారు “సిమిన్, సిమిన్” అంటూ ఆమె చేయి పట్టుకుని వదలడు. ఆమె ఆయన్ని ఎంత బాగా చూసుకునేదో అర్థమవుతుంది. తెర్మె అన్నీ గమనిస్తూ ఉంటుంది. తాను తండ్రి దగ్గర ఉంటే తల్లి దేశం విడిచి వెళ్ళదని ఆమెకి తెలుసు. నాదెర్ తన తండ్రిని చూసుకోవటానికి రాజియే అనే ఆవిడని పెట్టుకుంటాడు. ఆమె తన నాలుగేళ్ళ కూతురు సోమయేని తీసుకుని పనికి వస్తుంది. రాజియే పొద్దున్నే రాలేనని అంటే అరగంట ఆలస్యంగా వచ్చినా పర్వాలేదంటాడు నాదెర్. అతను వెళ్ళిపోయాక ఆమె వస్తుంది. అతను తిరిగి వచ్చేసరికి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉంటుంది. రాజియేని ఆమె వదినతో మాట్లాడి సిమిన్ కుదిర్చింది. రాజియే భర్త హొజ్జత్ అప్పులపాలయి జైలుకి వెళ్ళి వస్తూ ఉంటాడు. రాజియేకి ఉద్యోగం అవసరం. అయితే హొజ్జత్‌కి చెబితే అతను ఒప్పుకోడని అతనికి తెలియకుండా పనికి వస్తుంది. పైగా సిమిన్ వెళ్ళిపోవటంతో నాదెర్ ఇంట్లో స్త్రీలు ఎవరూ లేరు. హొజ్జత్‌కి తెలిస్తే అసలే ఒప్పుకోడు. రాజియేకి మతపరమైన విశ్వాసాలు ఎక్కువ. పరాయి మగవాళ్ళని తాకకూడదని ఒక నియమం. నాదెర్ తండ్రి బట్టల్లోనే మూత్రం పోసుకుంటే ఏం చెయ్యాలో పాలుపోక తన మతగురువుకి ఫోన్ చేసి “ఆయన బట్టలు మారిస్తే పాపం కాదు కదా?” అని అడుగుతుంది. ముసలాయన కాబట్టి పరవాలేదంటాడాయన. రాజియే గర్భవతి అని తర్వాత మనకి తెలుస్తుంది. మొదటి రోజు నాదెర్, తెర్మె ఇంటికి వచ్చేసరికి తెర్మెకి ట్యూషన్ చెప్పే టీచర్ వచ్చి ఉంటుంది. రాజియే గర్భవతి అని తెలిసి ఆమె తనకి తెలిసిన గైనకాలజిస్టు ఫోన్ నంబర్ ఇస్తుంది.

ఒకరోజు రాజియే పనిలో ఉండగా నాదెర్ తండ్రి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. రోడ్డు దాటి దినపత్రికలు అమ్మే కొట్టు దగ్గరికి వెళతాడు. రాజియే కంగారుగా వెళుతుంది. వాహనాలు ఎక్కువ ఉండటంతో ఆయన తిరిగి రోడ్డు దాటలేకపోతాడు. రాజియే వెళ్ళి ఆయన్ని తీసుకువస్తుంది. మర్నాడు నాదెర్, తెర్మె త్వరగా ఇంటికి వస్తారు. రాజియే ఇంట్లో ఉండదు. నాదెర్ తండ్రి మంచం మీద నుంచి కింద పడి ఉంటాడు. అతని చేయి ఒక బట్టతో మంచం రాడ్డుకి కట్టి ఉంటుంది. నాదెర్ తండ్రి చనిపోయాడేమోనని భయపడతాడు. బతికే ఉన్నాడని నిర్ధరించుకుని సరిగా పడుకోబెడతాడు. అనుమానంతో సొరుగులో ఉన్న డబ్బు చూసుకుంటాడు. తక్కువ ఉంటుంది. కాసేపటిని రాజియే వస్తుంది. నాదెర్ ఆమెని తిట్టి వెళ్ళిపొమ్మంటాడు. అమె తాను ముఖ్యమైన పని మీద వెళ్ళానని, ముసలాయన లేచి అటూ ఇటూ తిరిగితే గాయపడతాడని మంచానికి కట్టానని, తాను డబ్బు తీయలేదని అంటుంది (నిజానికి ఈ డబ్బు సిమిన్ తన సామాన్లు తీసుకెళ్ళిన కూలీలకి ఇచ్చింది). నాదెర్ కోపంతో ఆమెని తలుపు బయటికి నెట్టి తలుపు వేస్తాడు. అమె మెట్ల మీద పడిపోతుంది. పై అపార్ట్‌మెంట్ వారు చూసి ఆమెకి సాయం చేస్తారు. ఆమె లేచి కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతుంది. తర్వాత రాజియే వదిన సిమిన్‌కి ఫోన్ చేసి కేకలేస్తుంది. రాజియే హాస్పిటల్లో ఉందని, ఆమెకి ఏమైనా అయితే నాదెర్ దే పాపమని అంటుంది. సిమిన్, నాదెర్ కలిసి హాస్పిటల్‌కి వెళతారు. రాజియే గర్భం పోయిందని తెలుస్తుంది. అక్కడే ఉన్న హొజ్జత్ నాదెర్ మీద దాడి చేస్తాడు. “భర్తకి తెలియకుండా ఆడవాళ్ళు లేని ఇంట్లో నా భార్యని ఎందుకు పనిలో పెట్టుకున్నావు?” అని అడుగుతాడు. అతని అక్క, సిమిన్ అడ్డుపడతారు. అతను మధ్యలో తనని తాను కొట్టుకుంటాడు. బిడ్డని పోగుట్టుకున్న బాధ కన్నా అతనికి నాదెర్ తన అనుమతి లేకుండా తన భార్యని పనిలో పెట్టుకున్నాడన్న కోపం ఎక్కువగా ఉంటుంది. కేసు కోర్టుకి చేరుతుంది.

నాదెర్ చాలా నిజాయితీ గల వ్యక్తి. కూతురు ఫార్సీ భాష అభ్యాసం చేస్తుంటే అతను ఆమెకి సాయం చేసేటపుడు ఆమె టీచర్ అరబిక్ పదాలను ఫార్సీ పదాలుగా చెబుతోందని తెలుస్తుంది. “నువ్వు పరీక్షలో ఫార్సీ పదమే వ్రాయి” అంటాడు. “అలా చేస్తే టీచర్ మార్కులు తగ్గిస్తుంది” అంటుందామె. “తగ్గించినా సరే” అంటాడతను. సరైన పని చేయటం ముఖ్యం కానీ గుర్తింపు ముఖ్యం కాదని అతని సిద్ధాంతం. కోర్టులో జడ్జి ఎదుట “రాజియే పట్ల దురుసుగా ప్రవర్తించిన మాట నిజమే. ఆమె గర్భవతి అని నాకు తెలియదు. తెలిస్తే ఆమె పట్ల అలా ప్రవర్తించేవాడిని కాదు” అంటాడు. గర్భస్థ శిశువుకు నాలుగున్నర నెలలు ఉండటం వలన ఆ శిశువుని పూర్తి స్థాయి వ్యక్తిగా పరిగణించి నాదెర్ మీద హత్యానేరం అభియోగం మోపుతాడు జడ్జి. “గర్భవతి అని తెలియకుండా ఎలా ఉంటుంది?” అని హొజ్జత్ అంటాడు. “నేను ఆమెని చూసినప్పుడల్లా బుర్ఖా వేసుకుని ఉండేది. ఎలా తెలుస్తుంది?” అంటాడు నాదెర్. అతను ఇంట్లో ఉండగా తెర్మె టీచరుతో తన గర్భం సంగతి మాట్లాడానని, అతను విన్నాడని రాజియే అంటుంది. తాను వినలేదని నాదెర్ అంటాడు. హొజ్జత్ అతన్ని దుర్భాషలాడతాడు. తనకు తెలియకుండా పనికి వెళ్ళినందుకు రాజియేని కూడా తిడతాడు. జడ్జి టీచర్‌ని సాక్ష్యం చెప్పటానికి తీసుకురావాలని అంటాడు. “నాదెర్ నన్ను దొంగ అన్నాడు. నా బిడ్డ పోయినా అంత బాధ పడలేదు” అంటుంది రాజియే. నాదెర్ జరిగినదంతా చెబుతాడు. తన తండ్రి గాయపడ్డాడని అంటాడు. ఆమె ఇల్లు వదిలి వెళ్ళటం తప్పు అంటాడు. అయితే అతని మీద హత్యానేరం అభియోగం ఉండటంతో జడ్జి బెయిల్ లేకుండా విడుదల చేయనంటాడు. ఆ రాత్రి నాదెర్ జైల్లోనే ఉంటాడు. తెర్మె తల్లితో “నువ్వు వెళ్ళకపోయి ఉంటే నాన్న ఈరోజు జైల్లో ఉండేవాడు కాదు” అంటుంది.

మర్నాడు సిమిన్ తన తలిదండ్రుల ఇల్లు తాకట్టు పెట్టి బెయిల్ మీద నాదెర్‌ని విడిపిస్తుంది. టీచర్ సాక్ష్యం చెప్పటానికి వస్తుంది. రాజియే గర్భం గురించి మాట్లాడేటపుడు నాదెర్ వంటింట్లో ఉన్నాడని, అతను విన్నాడో లేదో తనకి తెలియదని చెబుతుంది. నాదెర్ తాను వినలేదని, ప్రమాణం చేయమంటే చేస్తానని అంటాడు. నాదెర్ తండ్రిని ఇంట్లో కట్టేసి బయటకి వెళ్ళినందుకు రాజియే మీద నిర్లక్ష్యం కేసు పెడతాడు జడ్జి. హొజ్జత్ మండిపడతాడు. అతన్ని అరెస్టు చేయమంటాడు జడ్జి. అతను తలను తలుపుకేసి కొట్టుకుంటాడు. అతను కుంగిపోయి ఉన్నాడని, మందులు వాడుతున్నాడని, అతన్ని వదిలిపెట్టమని రాజియే ప్రాధేయపడుతుంది. నాదెర్ కూడా అతన్ని వదిలి పెట్టమంటాడు.

తెర్మె తండ్రిని “నిజంగా నీకు రాజియే గర్భవతి అని తెలియదా?” అని అడుగుతుంది. “లేదు” అంటాడతను. “హాస్పిటల్‌లో ఆమె గర్భం పోయిందని చెప్పినపుడు నువ్వు ఆమె గర్భవతా అని అడగలేదని అమ్మ చెప్పింది. తెలియకపోతే ఎవరైనా అడుగుతారుగా అంది” అంటుంది. “మీ అమ్మ నీకు నా మీద చెడు అభిప్రాయం కలిగించాలని చూస్తోంది” అంటాడతను. నాదెర్‌కి నిజంగా నిజం తెలియదా? లేక అబద్ధం చెబుతున్నాడా? చిత్రం ఈ ప్రశ్న మీద దృష్టి పెడుతుంది. అయితే చివరికి అనుకోని మలుపు తిరుగుతుంది. రచయిత, దర్శకుడు అస్గర్ ఫర్హది అద్భుతమైన స్క్రీన్ ప్లే వ్రాసి ఒక కళాఖండాన్నే మలచాడని చెప్పవచ్చు. నాదెర్ మంచి స్వభావానికి హొజ్జత్ స్వభావం వ్యతిరేకంగా కనిపిస్తుంది. అయితే నిశితంగా గమనిస్తే అతను ఎంత కోపం వచ్చినా తనను తాను కొట్టుకుంటాడేమే గానీ భార్య మీద మాత్రం చేయిచేసుకోడు. బయటే కాదు, ఇంటిలో అయినా. అతనిలో కూడా మంచి ఉంది. అందరూ పూర్తిగా చెడ్డవారు ఉండరు. అతన్ని అన్యాయంగా ఉద్యోగం నుంచి తీసివేయటంతో అతను అప్పులపాలయ్యాడు. అతనిలో వ్యవస్థ మీద కసి ఉంది. నాదెర్ ఆ వ్యవస్థకి ప్రతినిధిగా కనిపించాడు. అతనికి శిక్షపడాలని గట్టిగా కోరుకున్నాడు. దేవుడి మీద నమ్మకం ఉన్నవారు నియమాలు ఉల్లంఘించరని, అలా ఉల్లంఘించేవారు శిక్షార్హులని అతని అభిప్రాయం.

నాదెర్‌గా పేమన్ మొవాదీ, సిమిన్‌గా లేలా హతామీ, రాజియేగా సారె బయత్, హొజ్జత్ గా షహాబ్ హొసేనీ ముఖ్యపాత్రలు పోషించారు. మనం కోర్టులో ఉండి వీరందరినీ చూస్తున్నట్టే ఉంటుంది. ఇంత సహజంగా ఎలా తీశారు అని ఆశ్చర్యం కలుగుతుంది. ఛాయాగ్రాహకుడు మహమూద్ కలారీ, ఎడిటర్ హయేదే సఫియారీలను అభినందించకుండా ఉండలేం.  తెర్మెగా నటించిన సరీనా ఫర్హది నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తలిదండ్రుల వేరుపాటుకి బాధపడుతున్న ఆమె తమ కుటుంబానికి కొత్త సమస్య రావటంతో నలిగిపోతూ ఉంటుంది. అమ్మ చెప్పేది నిజమే అనిపిస్తుంది. నాన్న మీద నమ్మకమూ ఉంటుంది. రెంటికీ పొంతన కుదరదు. పెద్దలు ఎందుకు ధర్మాన్ని విడిచి ప్రవర్తిస్తారు అని మథనపడుతుంది. ఒక సందర్భంలో ఆమె కంటతడి పెట్టుకుంటే మన గుండె పిండేసినట్టుంటుంది.

నాదెర్, సిమిన్ ఇద్దరూ ఇస్లామ్ మతాన్ని పూర్తిగా అనుసరించరు. ఇద్దరూ కలిసే దేశం విడిచిపోదామని అనుకున్నారు. అయితే నాదెర్ తండ్రి ఆరోగ్యం క్షీణించటంతో నాదెర్ వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాడు. రాజియేతో వివాదం వచ్చింది. ఆమె కుటుంబం ఇస్లామ్ మతాన్ని పూర్తిగా అవలంబించింది. పైగా ఆమె గర్భంతో ఉంది. ఆమెకే సానుభూతి ఉంటుంది. కానీ మనకి నాదెర్ మీద కూడా సానుభూతి ఉంటుంది. హొజ్జత్‌కి నాదెర్ తన భార్యని మెట్ల మీదకి తోశాడని మాత్రమే తెలుసు. రాజియే తాను దొంగతనం చేయలేదని, ఐనా తనకు పెద్ద అన్యాయం జరిగిందని అనుకుంటుంది. నాదెర్ తండ్రి పరిస్థితి ఆమెకి తెలియదు. సిమిన్‌కి తన భర్తకి రాజియే గర్భవతి అని తెలుసని నమ్మకం. తన తండ్రిని కట్టి పడేయటం తప్పని నాదెర్ వాదన. రాజియే దొంగతనం చేసిందని అతని అనుమానం. ఎవరికీ పూర్తి నిజం తెలియదు. ఎవరి తరఫున ఆలోచించినా వారి ఆలోచన తప్పు కాదు అనిపిస్తుంది. ఇలాంటి సమయాల్లో చట్టం ఏం చేయగలదు? జడ్జి చాలా న్యాయంగా వ్యవహరిస్తాడు. కానీ ఆయన ముస్లిం చట్టం ప్రకారమే న్యాయం చెప్పగలడు. మరి భావోద్వేగాల సంగతి ఏమిటి? నాదెర్‌కి శిక్ష వేస్తే అతను తెలియక చేసిన తప్పుకి శిక్ష వేసినట్టవుతుంది. పైగా తండ్రిని ఆ స్థితిలో చూసిన కొడుకు ఆ పని చేయడా అనిపిస్తుంది. రాజియే వైపు నుంచి ఆలోచిస్తే.. నాదెర్ రోజూ తండ్రిని ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్ళేవాడు. కాసేపటికి రాజియే వచ్చేది. మరి తాను తాళం వేసి వెళితే తప్పేమిటి? ఆమె దురదృష్టం కొద్దీ ఆరోజే ముసలాయన కిందపడ్డాడు. సిమిన్ వెళ్ళినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించటం మొదలుపెట్టింది. అంతకు ముందు బట్టల్లో మూత్రం పోసుకునేవాడు కాదు. మరి ఒకరకంగా సిమిన్ తప్పు కూడా ఉంది. రాజియే ఇస్లామ్ మతాన్ని అంతగా నమ్మితే భర్త అనుమతి లేకుండా పనికి ఎందుకు వచ్చింది? పేదరికం! ఆకలి ఉంటే మతం కూడా వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. ఈ విషయాలన్నీ చట్టం పరిగణన లోకి తీసుకుంటుందా? తీసుకోగలదా?

ఈ క్రింద ముగింపుతో సహా మిగతా చిత్రకథ ప్రస్తావించబడింది. అయితే చిత్రం చూడాలనుకునేవారు చూశాకే చదవగలరని గట్టిగా కోరుతున్నాను. అందరినీ సందిగ్ధంలో పడవేసే విషయాలు ఈ చిత్రంలో జరుగుతాయి.

తెర్మె టీచర్ సాక్ష్యం చెప్పిన తర్వాత రాజియే కూతురితో మాట్లాడుతుంది. హొజ్జత్ రాజియేని కొట్టాడేమో అని అనుమానం వస్తుంది. దాంతో నాదెర్ రాజియేకి గర్భవిచ్ఛిత్తి తన వల్ల జరగలేదని జడ్జితో అంటాడు. పరిశోధన చేసేవారు ఏం జరిగిందో తెలుసుకోవటానికి నాదెర్ ఉండే చోటికి వస్తారు. పై అపార్ట్‌మెంట్ వారిని కూడా విచారిస్తారు. వారు నాదెర్ కి అనుకూలంగా మాట్లాడతారు. తర్వాత హొజ్జత్ కోపంతో తెర్మె టీచర్‌ని బెదిరిస్తాడు. ఇదిలా ఉండగా రాజియే ఆరోజు డాక్టర్ దగ్గరకి వెళ్ళిందని నాదెర్‌కి తెలుస్తుంది. అతనికి అనుమానం వచ్చి టీచర్ రాజియేకి ఇచ్చిన గైనకాలజిస్టు నంబరు కోసం టీచర్‌కి ఫోన్ చేస్తాడు. ఆమె ఫోన్ ఎత్తకపోతే ఒక శబ్ద సందేశం (వాయిస్ మెసేజ్) పెడతాడు. ఇది తెర్మె వింటుంది. “ఆరోజు నీకు ఏమీ వినపడలేదని చెప్పావు కదా. మరి టీచర్ రాజియేకి గైనకాలజిస్టు నంబరు ఇచ్చిందని నీకెలా తెలుసు?” అంటుంది. నాదెర్ ఇక దారిలేక ఆరోజు వారి మాటలన్నీ తనకు వినపడ్డాయని ఒప్పుకుంటాడు. “మరి ఆమె గర్భవతి అని తెలిసి కూడా ఎందుకు ఆమెని నెట్టావు?” అంటే “కోపంలో ఆ విషయం మరిచిపోయాను. మరిచిపోయానంటే కోర్టువారు ఒప్పుకోరు. అందుకని అబద్ధం చెప్పాను. నాకు తెలుసని చెబితే నన్ను జైల్లో పెట్టేవారు. అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావో అని భయపడ్డాను. నువ్వు చెప్పమంటే కోర్టులో నిజం చెబుతాను” అంటాడు. తెర్మె మాట్లాడదు.

కోపంలో రాజియే గర్భవతి అనే సంగతి నాదెర్ మర్చిపోయాడంటే నమ్మగలమా? ఏమో, తన తండ్రి పరిస్థితిని చూసి అతనికి అమితమైన కోపం వచ్చిందేమో! కోర్టు ఖచ్చితంగా ఈ వాదనని అంగీకరించదు. అందుకని తనకు తెలియనే తెలియదని అబద్ధం చెప్పాడు. అతను జైలుకెళితే అతని భార్య కూతుర్ని తీసుకుని విదేశాలకు వెళ్ళిపోతుంది. తన కూతురి కోసం అతను అబద్ధం చెప్పాడు. అంత నిజాయితీ కల మనిషి అబద్ధం ఎలా చెప్పాడు? మమకారం వల్ల. ప్రమాణం చేయటానికి కూడా సిద్ధపడ్డాడు. అతనికి మతం మీద పెద్ద నమ్మకం లేదు కాబట్టి. కూతురితో భార్య తనను అనవసరంగా అనుమానిస్తోందని అన్నాడు. మొదటే నిజం చెప్పి ఉంటే గౌరవం దక్కేది. తెర్మె తండ్రి దూరమవుతాడనే భయంతో అతను నిజం చెబుతానన్నా మట్లాడదు. అంత చిన్న వయసులో ఆమె మీద ఆ భారం పెట్టడం అన్యాయం.

తర్వాత టీచర్ తన సాక్ష్యం మారుస్తుంది. నాదెర్‌కి తమ మాటలన్నీ వినపడ్డాయని జడ్జికి చెబుతుంది. అయితే నాదెర్ జడ్జితో గైనకాలజిస్టు ఫోన్ నంబర్ సంగతి తెర్మె తనకి చెప్పిందంటాడు. జడ్జి తెర్మెని పిలిచి అడుగుతాడు. తానే తన తండ్రికి చెప్పానంటుంది. అబద్ధం చెప్పినందుకు తర్వాత ఏడుస్తుంది. కేసు ఇలా సాగుతుండటంతో సిమిన్ రాజీ కోసం ప్రయత్నిస్తుంది. కోటిన్నర రియాల్స్‌కి హొజ్జత్‌తో ఒప్పందం కుదురుతుంది. అయితే రాజియే సిమిన్‌కి ఒక విస్తుపోయే విషయం చెబుతుంది. సంఘటన జరిగిన ముందురోజు నాదెర్ తండ్రి బయటికి వెళ్ళినపుడు ఆయనను తీసుకువస్తుంటే ఒక కారు తనను గుద్దిందని, ఆ రాత్రి తనకి కడుపు నొప్పి వచ్చిందని, మర్నాడు అందుకే డాక్టరు దగ్గరకి వెళ్ళానని చెబుతుంది. అప్పుడే తన గర్భం పోయిందేమో అంటుంది. నాదెర్‌ది తప్పని పూర్తిగా తెలియకుండా డబ్బు తీసుకోవటం పాపమని, అందుకే డబ్బు ఇవ్వవద్దని అంటుంది. ఆ పాపం తన బిడ్డకి చుట్టుకుంటుందని ఆమె భయం. సిమిన్ నాదెర్‌కి ఏమీ చెప్పదు. అందరూ కలిసి డబ్బు ఇవ్వటానికి హొజ్జత్ ఇంటికి వెళతారు. అయితే నాదెర్ డబ్బు ఇచ్చే ముందు రాజియేని ఖురాన్ మీద ప్రమాణం తన వల్లే గర్భవిచ్ఛిత్తి జరిగిందని చెప్పమంటాడు. అతనికి అంతకు ముందే అనుమానం ఉంది కదా. హొజ్జత్ ఖురాన్ తెమ్మని రాజియేని లోపలికి పంపిస్తాడు. ఆమె ఎంతకీ రాకపోయే సరికి లోపలికి వెళతాడు. ఆమె తన అంతర్మథనాన్ని అతనికి చెబుతుంది. అతను “ప్రమాణం చెయ్యి. ఆ పాపమేదో నేనే మోస్తాను” అంటాడు. ఆమె ఒప్పుకోదు. అతను కోపంగా బయటకి వెళ్ళిపోతాడు. రాజియే సిమిన్ ని “డబ్బు తేవద్దని చెప్పాను కదా” అని దూషిస్తుంది. డబ్బు ఇవ్వకుండానే నాదెర్, సిమిన్, తెర్మె తిరిగి వస్తారు. తర్వాత సిమిన్ విడాకుల కోసం మళ్ళీ కోర్టుకి వెళుతుంది. నాదెర్ కూడా ఒప్పుకుంటాడు. తెర్మె ఎవరి దగ్గర ఉండాలన్న నిర్ణయాన్ని ఆమెకే వదిలేస్తారు. ఆమె తాను ఎవరి దగ్గర ఉండాలో నిర్ణయించుకున్నానని జడ్జితో అంటుంది. అయితే ఆమె నిర్ణయం కోసం బయట నాదెర్, సిమిన్ ఎదురుచూస్తుండగానే చిత్రం ముగుస్తుంది.

తండ్రి మీద మమకారంతో తెర్మె కూడా అబద్ధం చెప్పింది. తండ్రి అబద్ధం చెప్పమని అడగలేదు. తానే చెప్పింది. తండ్రి నిజం చెప్పకపోగా తనకు అబద్ధం చెప్పే పరిస్థితి కల్పించాడు. దీనికి ఆమె ఎంతో దుఃఖిస్తుంది. పెద్దవాళ్ళ ప్రపంచంలోకి ఒక చిన్నపిల్ల అమాంతం నెట్టివేయబడింది. తాను నేర్చుకున్న విలువలు వేరని, పెద్దలు పాటించే విలువలు వేరని ఆమెని తెలిసింది. రాజియే మాత్రం చివరికి నిజం చెప్పింది. పేదరికంలో ఉన్నా ధర్మం తప్పలేదు. ఆమె భర్త కూడా ఆమె మీద క్రోధం ప్రదర్శించడు. తన ఖర్మ అని తననే నిందించుకుంటాడు. ఇంతకీ రాజియే గర్భం ఎలా పోయింది? అది ఎప్పటికీ తెలియకపోవచ్చు. ఒకవేళ కారు గుద్దినపుడే పోయిందనుకుంటే నాదెర్ తండ్రిని కాపాడటానికి వెళ్ళినపుడే కదా పోయింది, డబ్బు తీసుకుంటే తప్పేముంది అని రాజియే ఆలోచించలేదు. తన తప్పు వల్లే ముసలాయన బయటికి వెళ్ళాడని భావించింది. దేవుడి మీద పూర్తి నమ్మకం ఉంటే ధర్మాన్ని పాటించాలి. సాకులు చెప్పకూడదు. నాదెర్‌కి దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టి అతను ధర్మం విడిచాడు. అతని వాదన ఏమిటంటే గర్భం ముందే పోయి ఉంటే నా తప్పు లేదు కదా అని. కానీ అతను నెట్టటం వల్లే గర్భం పోయి ఉంటే? తెలిసినా తెలియకపోయినా అది పాపమే. శిక్షకి సిద్ధపడాల్సిందే.

ఈ మొత్తం వివాదంతో సిమిన్, నాదెర్‌ల మధ్య దూరం ఇంకా పెరిగింది. అతను కోర్టులో అబద్ధం చెప్పాడని రుజువైంది. అతను ఇక ఆమెని ధర్మం పేరుతో ఆపే స్థితిలో లేడు. “విడాకులిస్తాను. తెర్మె ఎవరితో ఉండాలో ఆమె ఇష్టం” అనేశాడు. చివరికి తెర్మె ఎవరి దగ్గర ఉండాలని నిర్ణయించుకుంది? నా అభిప్రాయం ప్రకారం తండ్రి వద్దే ఉండాలని నిర్ణయించుకుంది. అతను ధర్మం తప్పాడని ఆమెకి తెలుసు. దారి తప్పిన వారిని కూడా ప్రేమించటమే మంచివారి లక్షణం. తల్లి కుటుంబాన్ని వదిలేయాలని నిర్ణయించుకుంది. ఆమెకి తోడుగా వెళితే స్వార్థమౌతుంది. తండ్రి తప్పు చేసినా అతనిలో పశ్చాత్తాపం కలిగే అవకాశం ఉంది. అతనికి తోడుగా ఎవరూ లేకుంటే అతను కుంగిపోయే అవకాశం ఉంది. అందుకని తెర్మె తండ్రి దగ్గరే ఉంటుందని నాకనిపించింది. సత్యం, పాపం అనే విషయాల మీద ఇంత మంచి చిత్రం న భూతో న భవిష్యతి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here