[dropcap]కొ[/dropcap]న్ని చిత్రాలు పైకి ఒకలా ఉంటాయి, కానీ తరచి చూస్తే వాటిలో ఎన్నో పొరలు ఉంటాయి. ఆ పొరలు ఒకదాని తర్వాత ఒకటి ఒలిచి చూస్తే ఎన్నో అంశాలు (themes) బయటపడతాయి. వింత ఏమిటంటే మనుషులు కూడా ఒక్కోసారి తమ మనసు పొరల్లోని భావాలను పూర్తిగా తెలుసుకోలేరు. అసలు మనసు కోరేది ఒకటైతే, పైకి చెప్పేది ఒకటి. దానికి తప్పుడు తర్కం జోడించటం. ఇలా చేసి చేసి గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవటం. ఇలాంటి కథలతో సినిమాలు తీస్తే పైకి మాత్రం అసంబద్ధంగా అనిపిస్తాయి. తరచి చూస్తే అసలు విషయం బోధపడుతుంది. ఈ కథల నుంచి నేర్చుకోవలసింది ఇలాంటి తప్పులు చేయకుండా ఉండటమే. అలాంటి చిత్రమే ‘క్లోయి’ (2010). ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం. లైంగిక సంబంధాలలోని క్లిష్టతను ఇందులో చూపించారు. పెద్దలకు మాత్రమే.
కేథరిన్ ఒక నడివయసు గైనకాలజిస్ట్. ఆమె భర్త డేవిడ్ ఒక ప్రొఫెసర్. వారి కొడుకు మైకెల్. పెద్ద ఇల్లు. కేథరిన్ తన పేషంట్లకు శృంగారమంటే సంతానానికి ఒక ప్రక్రియ మాత్రమే అని చెబుతూ ఉంటుంది. భావప్రాప్తి అంత ముఖ్యం కాదని అంటూ ఉంటుంది. తను వయసులో ఉన్నప్పుడు శృంగారాన్ని ఆస్వాదించి ఇప్పుడు ఇలా అనటం సమంజసమేనా? వయసు పెరిగిన కొద్దీ తన భర్త తనకు దూరమవుతున్నాడని అసంతృప్తితో ఉంటుంది. ఆ అసంతృప్తితో ఇతరులను తప్పుదోవ పట్టించటం ఎంతవరకు సబబు? వయసు పెరిగే కొద్దీ ప్రాధాన్యాలు మార్చుకోవాలి. అంతే కానీ ఎప్పటికీ జీవితం ఒకేలా ఉండాలంటే ఎలా? ఇదే పాశ్చాత్య దేశాలలో ఉండే ఆలోచనావిధానం. నెమ్మదిగా అది మన దేశంలోనూ ప్రబలుతోంది.
ఒకరోజు మైకెల్ తన గర్ల్ ఫ్రెండ్‌ని ఇంటికి తీసుకువస్తాడు. ఆమె రాత్రంతా అతని గదిలోనే ఉంటుంది. మర్నాడు కేథరిన్ అలా తరచు వాళ్ళు కలిసి రాత్రి గడపటం తనకు ఇష్టం లేదంటుంది. జాగ్రత్తలు తీసుకుంటున్నారా అని అడుగుతుంది. మైకెల్ గర్ల్ ఫ్రెండ్ కండోమ్స్ వాడుతున్నామని చెబుతుంది. పాశ్చాత్య దేశాలలో ఇలాంటి పోకడలు మామూలే. కేథరిన్‌కి ఈ సంఘటన పెరుగుతున్న తన వయసుని, దూరమవుతున్న తన భర్తని గుర్తుచేస్తుంది.
డేవిడ్‌కి అతని విద్యార్థినితో అక్రమ సంబంధం ఉందని కేథరిన్‌కి అనుమానం వస్తుంది. దీంతో ఆమెకి అభద్రత ఇంకా పెరుగుతుంది. డేవిడ్‌తో పాటు రెస్టారెంట్‌కి వెళ్ళినపుడు అతను అక్కడి సేవికతో తీయగా మాట్లాడటం (ఫ్లర్ట్ చేయటం) కేథరిన్‌కి అసహనం కలిగిస్తుంది. డేవిడ్‌కి ఇలాంటి సంబంధాలు ఇంకా ఉన్నాయేమోనని అనుమానం వస్తుంది. తన అనుమానాన్ని ధృవపరుచుకోవటానికి క్లోయి అనే ఒక వేశ్యకి డబ్బిచ్చి అతనితో పరిచయం పెంచుకోమని పంపిస్తుంది. క్లోయి మామూలుగా ఒక పెద్ద హోటల్లో విటులకి ఎర వేస్తూ ఉంటుంది. అందమైనది. చూడగానే వేశ్య అని అనిపించదు.
తానొక విద్యార్థినిని అని చెప్పి డేవిడ్‌తో పరిచయం పెంచుకోమని క్లోయికి చెబుతుంది కేథరిన్. మర్నాడు తాను డేవిడ్‌ని కలిశానని చెబుతుంది క్లోయి. కొన్నాళ్ళ తర్వాత తామొక పార్క్‌కి వెళ్ళామని చెబుతుంది. అక్కడ డేవిడ్ తనని ముద్దు పెట్టుకున్నాడని చెబుతుంది. కేథరిన్ బాధ పడుతుంది. మరి కొన్నాళ్ళకు ఒక హోటల్లో తనని కలవమని క్లోయి కేథరిన్‌కి సందేశం పంపుతుంది. ఆ గది లోనే తాను, డేవిడ్ శారీరకంగా కలిశామని వివరాలు చెబుతుంది. కేథరిన్‌కి ఆసక్తీ ఉంటుంది, కోపమూ వస్తుంది. అమెని చూసి క్లోయి “నీకు వాంఛ కలుగుతోందా?” అని అడుగుతుంది. కేథరిన్ ఏమీ మాట్లాడదు. గదిలో నుంచి బయటకు వచ్చాక తాను, డేవిడ్ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారమని అంటుంది. “నీకు అలాంటి అనుబంధం ఎవరితోనైనా ఏర్పడిందా?” అని క్లోయిని అడుగుతుంది. అవునంటుంది క్లోయి. మళ్ళీ “డేవిడ్ ఇదే తన మొదటి వివాహేతర సంబంధం అన్నాడు” అంటుంది. “అది తీయని అబద్ధం” అంటుంది కేథరిన్. నిస్పృహతో “నాకేం చేయాలో తెలియట్లేదు” అంటుంది. క్లోయి అమెని పెదవుల మీద ముద్దుపెట్టుకుంటుంది. కేథరిన్ ఆమెని విడిపించుకుని వెళ్ళిపోతుంది.
ఈ సంఘటన జరిగే ముందు అదే రోజు కేథెరిన్ క్లినిక్‌లో క్లోయి మైకెల్‌ని కలుస్తుంది. అప్పటికే అతని గర్ల్ ఫ్రెండ్ అతణ్ణి వదిలేసింది. తన కాలేజీలో ఇవ్వబోయే పియానో ప్రదర్శన కోసం కోటు కేథరిన్ తెస్తానని చెప్పటంతో మైకెల్ అక్కడికి వస్తాడు. క్లోయిని కేథరిన్ లైంగిక వ్యాధుల పరీక్షలు చేయించుకోమనటంతో క్లోయి ఆ రిపోర్టులు తెస్తుంది. మైకెల్‌ని చూసి “నీ కళ్ళు మీ అమ్మ కళ్ళలా ఉన్నాయి. ఆ చూపు తెలుస్తోంది. నీ పెదవులు కూడా ఆమె పెదవుల్లా ఉన్నాయి” అంటుంది. మైకెల్ పియనో ప్రదర్శన అయ్యాక డేవిడ్ ఏమీ జరగనట్టు కేథరిన్‌తో మాట్లాడతాడు. “మైకెల్ నీ ప్రతిరూపమే” అంటాడు. అతను అలా మామూలుగా ప్రవర్తించటంతో ఆమె ఇంకా కుంగిపోతుంది.
భర్త మీద అనుమానముంటే ఎవరైనా అతని దగ్గరకి వేశ్యని పంపిస్తారా? ఇందులో ఉన్న ఆంతర్యమేమిటి? కేథరిన్ నేరుగా డేవిడ్‌ని ఎందుకు అడగదు? డేవిడ్ ఇంత జరిగినా మామూలుగా ఎలా ఉండగలుగుతున్నాడు? క్లోయి కేథరిన్‌ని ఎందుకు ముద్దు పెట్టుకుంది? ఆమె మీద జాలిపడిందా? ఎవరైనా ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే అతని కొడుకుకి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తారు. మరి క్లోయి మైకెల్‌తో ఎందుకు మాట్లాడింది?
కొన్ని ప్రశ్నలకి నాకు స్ఫురించిన సమాధానలు ఇవీ. కేథరిన్ క్లినిక్ లోపలి నుంచి నిలువెత్తు గాజు కిటికీల ద్వారా క్లోయి మామూలుగా పనిచేసే హోటల్ కనిపిస్తూ ఉంటుంది. కేథెరిన్ అప్పుడప్పుడూ ఆమెని చూస్తూ ఉండేది. ఆమె ప్రతిసారి ఒక కొత్త విటుడితో బయటకి రావటం ఆమె చూసింది. తన దాంపత్య జీవితం మీద అసంతృప్తితో ఉన్న ఆమెలో ఇది అలజడి రేపింది. ఆమె క్లోయి జీవితం కోరుకుంటోందా లేక క్లోయినే కోరుకుంటోందా? అది ఆమెకే తెలియకపోవచ్చు. క్లోయితో మాట్లాడాలని ఆమె అనేకసార్లు అనుకుని ఉండవచ్చు. కానీ ఎలా? ఒకసారి రెస్టారెంట్లో బాత్రూములో క్లోయి కనపడుతుంది. కేథరిన్ అమెని చూసి ఇంచుకైనా ఆశ్చర్యపడదు. అంటే క్లోయి బాత్రూముకి వెళ్ళిందని చూసి కేథరిన్ వెళ్ళింది. క్లోయి ఒక స్టాల్లో ఉండగా పక్క స్టాల్లో కేథరిన్ ఉంటుంది. క్లోయి ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. “మీరు బానే ఉన్నారా?” అని కేథరిన్ అడుగుతుంది. “బానే ఉన్నాను. మగవాళ్ళందరూ వెధవలు” అంటుంది క్లోయి. నిర్లిప్తంగా అవునంటుంది కేథెరిన్. బయటకి వచ్చాక క్లోయి ఆమెకి తన హెయిర్ క్లిప్ కానుకగా ఇవ్వాలని ప్రయత్నిస్తుంది. కేథరిన్ హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. క్లోయికి కేథరిన్‌లా అనునయంగా మాట్లాడేవారు అంతవరకు తారసపడలేదు. పైగా మగవాళ్ళు వెధవలు అంటే అవును అంది. దాంతో ఆమె మీద ఒకరకమైన వాత్సల్యం కలిగింది. కేథరిన్ ఆమెతో మాట్లాడటానికే వెళ్ళింది కానీ ఏం మాట్లాడుతుంది? ఆమె హెయిర్ క్లిప్ ఇవ్వబోయే సరికి కంగారుపడింది. తన భర్తని పరీక్షించాలనే నెపంతో ఆమెని తర్వాత కలిసింది. అలా కలిసినపుడు ముందు క్లోయియే కేథరిన్ దగ్గరకు వస్తుంది. అప్పుడు కూడా కేథరిన్ ఆశ్చర్యపడదు. అనుకున్నదే జరిగినట్టు ఇద్దరూ ఉంటారు. కేథరిన్ క్లోయితో ఆమె చేసే లైంగిక కార్యకలాపాల గురించి మాట్లాడాలని అనుకుంది. అందుకు తన భర్తని పావులా వాడుకుంది. పైకి మాత్రం తన భర్త అక్రమ సంబంధం గురించి బాధపడింది. లోపల ఆ లైంగిక చర్యల గురించిన మాటలు ఆమెని ఉద్రేకపరిచాయి. ఆమె క్లోయి మోజులో పడింది. క్లోయికి ఆమె మీద ఆకర్షణ కలిగింది.
భర్త ప్రవర్తనకి విసిగిపోయిన కేథరిన్ క్లోయి దగ్గరకు వెళుతుంది. ఇద్దరూ శృంగారంలో పాల్గొంటారు. ఇప్పుడు ఎవరిది అక్రమసంబంధం? కేథరిన్ తన భర్త తిరుగుబోతు అనే నెపంతో చేసిన పని ఏమిటి? ఆమెకి మొదటినుంచే క్లోయి మీద కోరిక లేదా? “నువ్వు చేశావు కాబట్టి నేను చేస్తే తప్పేంటి” అని సమర్థించుకుంటుందా? క్లోయి వేశ్య కాబట్టి పర్వాలేదు అనుకుంది. కానీ క్లోయి నిజంగానే ఆమెతో ప్రేమలో పడింది. వేశ్య ప్రేమకి విలువ ఉండదుగా! మగవారి చేతిలో మళ్ళీ మళ్ళీ దగా పడిన క్లోయి ఒక ఆడదాని తోడు కోరుకుంది. అది కేథరిన్‌కి మింగుడుపడదు. క్లోయి మళ్ళీ హెయిర్ క్లిప్ ఇస్తుంది. అది తన అమ్మమ్మదని చెబుతుంది. కేథరిన్ ఈసారి తీసుకుంటుంది, కానీ ఇక కలవద్దు అన్నట్టు మాట్లాడుతుంది. అయితే క్లోయిలో కొంచెం ఉన్మాదం ఉంది. మైకెల్‌తో పరిచయం పెంచుకుంటే కేథరిన్‌ని బ్లాక్‌మెయిల్ చేయొచ్చని ఆమె ఆలోచన. ఇది చివరికి ఎటు దారి తీస్తుంది?
ఈ చిత్రానికి ఆటమ్ ఇగోయన్ దర్శకత్వం వహించాడు. ‘నతాలీ’ (2003) అనే ఫ్రెంచ్ చిత్రం ఆధారంగా రూపొందించాడు. విస్మరణ, ఒంటరితనం అనే అంశాలు అతని చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ చిత్రంలో పాత్రల ప్రవర్తనని బట్టి మనం అర్థం చేసుకోకపోతే కథ పూర్తిగా అర్థం కాదు. అసంబద్ధంగా ఉంటుంది. మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయో, తమను తాము ఎలా మోసం చేసుకుంటారో ఇందులో కనిపించీ కనిపించనట్టు చూపించారు. మైకెల్ డానా సంగీతం చిత్రంలోని ఉద్విగ్నతని ప్రతిబింబిస్తుంది. సంగీతం మీద ప్రత్యేక దృష్టి పెడితే పాత్రల భావోద్వేగాలు అర్థమవుతాయి. ఈ చిత్రం ‘ఫేటల్ అట్రాక్షన్’ (1987) తరహాలో ఉంటుంది. అందులో ఒక స్త్రీ తనని వాడుకుని వదిలేసిన మగాణ్ణి వెంటాడి అతని జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుంది.
కేథరిన్‌గా జూలియాన్ మూర్, డేవిడ్‌గా లియమ్ నీసన్ నటించారు. ఇద్దరూ ఆరితేరిన నటులే. జూలియాన్ మూర్ ఎన్నో చిత్రాలలో నిరాశని అద్భుతంగా అభినయించింది. ఈ చిత్రం విడుదలయ్యేటప్పటికే ‘బూగీ నైట్స్’, ‘ది ఎండ్ ఆఫ్ ది అఫైర్’, ‘ఫార్ ఫ్రమ్ హెవెన్’, ‘ది అవర్స్’ చిత్రాలలో నటనకి ఆస్కార్ నామినేషన్లు అందుకుంది. ఆ తర్వాత 2014లో వచ్చిన ‘స్టిల్ ఆలిస్’ చిత్రానికి ఉత్తమ నటిగా ఆస్కార్ గెలుచుకుంది. లియమ్ నీసన్ ‘షిండ్లర్స్ లిస్ట్’ లో షిండ్లర్ పాత్ర పోషించాడు. తర్వాత ‘టేకన్’ సీరీస్ చిత్రాలలో ప్రజాదరణ పొందాడు. క్లోయిగా అమాండా సైఫ్రెడ్ నటించింది. అందం, అమాయకత్వం, తపన, ఉన్మాదం ఉన్న పాత్రలో ఆకట్టుకుంటుంది. ‘మామా మియా!’ చిత్రంతో ప్రజాదరణ పొందిన ఆమెను ‘క్లోయి’లో పాత్ర మరో కోణంలో చూపించింది. తర్వాత ‘ఫస్ట్ రిఫార్మ్డ్’ చిత్రంలో చక్కని పాత్ర పోషించింది. ‘మ్యాంక్’ చిత్రానికి ఉత్తమ సహాయనటి విభాగంలో ఆస్కార్ నామినేషన్ వచ్చింది. ఈ సంవత్సరం ‘ద డ్రాపౌట్’ సీరీస్ లో నటనకు ఉత్తమ నటిగా ఎమ్మీ అవార్డ్ అందుకుంది. అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి నటిగా గుర్తింపు పొందింది.
చిత్రంలో తర్వాతి కొంత కథ ఈ క్రింద ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునే వారు ఇక్కడ చదవటం ఆపేయవచ్చు. చూశాక క్రింది విశ్లేషణ చదవవచ్చు. అవకాశం ఉన్నవారు చిత్రం చూడమని గట్టిగా కోరుతున్నాను. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.
కేథరిన్ క్లోయిని కలిసి ఆలస్యంగా ఇంటికి రావటంతో డేవిడ్ ఆమెని ప్రశ్నిస్తాడు. “ఎవరిని కలిసి వస్తున్నావు? ప్రేమలో పడ్డావా” అని అడుగుతాడు. ఆమె “నువ్వు బయటపడకుండా నీ విద్యార్థినులతో సంబంధం పెట్టుకుంటావుగా” అంటుంది. “నాకే అక్రమ సంబంధం లేదు” అంటాడతను. మైకెల్ వారి గొడవ వినటంతో వారు గొడవపడటం ఆపేస్తారు. మైకెల్‌కి వారి మీద విసుగు వస్తుంది. క్లోయి కేథరిన్‌ని కలుస్తుంది. కేథరిన్ డబ్బిచ్చి ఆమెని శాశ్వతంగా వదిలించుకోవాలని చూస్తుంది. “నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు. మరి ఎందుకు నాకు డబ్బివ్వాలని ప్రయత్నిస్తున్నావు?” అని క్లోయి కన్నీరు పెట్టుకుంటుంది. కేథరిన్ ఆమెని పంపించేస్తుంది. క్లోయి మైకెల్‌తో పరిచయం మరింత పెంచుకుంటుంది. కేథరిన్‌కి ఈ విషయం తెలుస్తుంది. డేవిడ్ మళ్ళీ తనని కలిశాడని క్లోయి ఫోన్ చేసి చెబుతుంది. ఇక లాభం లేదని క్లోయిని ఒక కేఫ్‌కి రమ్మంటుంది కేథరిన్. డేవిడ్‌ని కూడా రమ్మంటుంది. ముందు డేవిడ్ వస్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా క్లోయి వస్తుంది. డేవిడ్‌ని చూసి వెనుదిరిగి వెళ్ళిపోతుంది. క్లోయిని చూసిన డేవిడ్ “ఎవరా అమ్మాయి?” అని అడుగుతాడు. కేథరిన్ నిర్ఘాంతపోతుంది.
క్లోయి డేవిడ్‌ని కలవనే లేదు (అతను మామూలుగా ఉండగలగటానికి ఇదే కారణం). ఆమె దృష్టి మొదటి నుంచీ కేథరిన్ మీదే ఉంది. కేథరిన్‌ని కలుసుకుంటూ ఉండటానికి కట్టుకథలు చెప్పింది. కేథరిన్‌కి కూడా క్లోయిని కలుసుకోవాలనే తపన. అయితే క్లోయి వంచన చేస్తే కేథరిన్ ఆత్మవంచన చేసుకుంది. క్లోయి మీద ఆకర్షణ ఉన్నా లేనట్టు నటించింది. తన భర్త తనని పట్టించుకోవట్లేదని అంది కానీ అసలు తానే అతన్ని దూరం చేసుకుంది. వయసు పెరిగినకొద్దీ శృంగారం కన్నా అనురాగం ముఖ్యమని తెలుసుకోలేక శృంగారం కోసం క్లోయిని ఆశ్రయించింది. శృంగారమంటే చేష్టలే కాదు, మాటలు చాలని అనుకుంది కానీ తన భర్త గురించి క్లోయి చెప్పిన అబద్ధాలు నమ్మి ఉక్రోషంతో ఆమె క్లోయికి దగ్గరయింది. కళ్ళు తెరిచి చూస్తే అంతా తలకిందులయింది. ఇప్పుడు తానే అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్తకు అక్రమ సంబంధమే లేదు. పైగా క్లోయి ఆమెతో ప్రేమలో పడింది. మనసుని అదుపులో ఉంచుకోకపోతే ఇలాగే ఉంటుంది. డేవిడ్‌తో మనసు విప్పి మాట్లాడి ఉంటే ఇదంతా జరిగేది కాదు. వయసు పెరుగుతుంటే శరీరంలో మార్పులు వస్తాయి. అలాగే మనసులో కూడా రావాలి. కొత్త కొత్త రుచులు కావాలని కోరుకోవటం అనర్థాలకు దారి తీస్తుంది.
ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. ముగింపు తెలుసుకోవద్దనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.
కేథరిన్ డేవిడ్‌తో జరిగినదంతా చెబుతుంది. తన అందం కోల్పోయానని, అందుకే అతన్ని ఆకట్టుకోలేకపోతున్నానని అంటుంది. “నువ్వు నా దగ్గరకే రావటం మానేశావు” అని అతను అంటాడు. ఇద్దరి మధ్య ఉన్న అనుమానాలు తొలగిపోతాయి. ఇంతలో క్లోయి కేథరిన్ ఇంటికి వెళ్ళి మైకెల్‌ని కలుస్తుంది. అతన్ని రెండో అంతస్థులో ఉన్న కేథరిన్, డేవిడ్‌ల గదిలోకి తీసుకెళ్ళి అతనితో శారీరకంగా కలుస్తుంది. “నువ్వు మీ అమ్మలానే ఉన్నావు” అంటుంది. ఇది ఎంత వైపరీత్యమో చెప్పనక్కరలేదు. అయితే ఆమె ఉన్మాదంలో ఏం చేస్తోందో ఆమెకే తెలియని పరిస్థితి. కేథరిన్ ఇంటికి వచ్చి వారిని చూస్తుంది. మైకెల్‌ని బయటకి పంపిస్తుంది. అయితే అప్పటికే క్లోయి “నాకు డబ్బులిస్తే వెళ్ళిపోతాననుకున్నావా” అని అంటుంది. మైకెల్ వేరే వైపు ఉన్న తలుపు నుంచి మళ్ళీ గదిలోకి వస్తాడు. అప్పటికి క్లోయి “నాకు నువ్వు కావాలి” అని కేథరిన్‌ని ముద్దుపెట్టుకుంటుంది. కేథెరిన్ మైకెల్‌ని చూసి క్లోయిని పక్కకు తోస్తుంది. క్లోయి నిలువెత్తు గాజు కిటికీని తగులుకోవటంతో అద్దం పగులుతుంది. ఆమె పడిపోబోతుంది. అయితే కిటికీ చెక్కని పట్టుకుని పడిపోకుండా ఆగుతుంది. కానీ కేథరిన్ తనకి దక్కదని అర్థమై చెక్కని వదిలేస్తుంది. కిందపడి మరణిస్తుంది. కొన్నాళ్ళకి కేథరిన్ ఇంట్లో పార్టీ జరుగుతూ ఉంటుంది. డేవిడ్, మైకెల్ ఉంటారు. కుటుంబమంతా కలిసిపోయింది. కేథరిన్ తలలో క్లోయి ఇచ్చిన హెయిర్ క్లిప్ ఉంటుంది.
ఎవరిది తప్పు? ఎవరు ఏం సాధించారు? క్లోయి ప్రేమ కోసం పరితపించింది. ఆమె కేథరిన్‌ని వాడుకుందని అనిపించినా నిజానికి కేథరినే క్లోయిని వాడుకుంది. చివరికి క్లోయి కేథరిన్ తనకి దక్కదని తెలిసి ప్రాణాలనే అర్పించింది. కేథరిన్ తనని ప్రేమించిందని క్లోయి నమ్మింది. అయితే కేథరిన్ కేవలం సాన్నిహిత్యం కోరుకుంది. అసలైన సాన్నిహిత్యం ఏమిటో ఆమెకి భర్తతో మాట్లాడాక తెలిసింది. ఒకరి మనసు ఒకరు తెలుసుకోవటమని, శృంగారం మాత్రమే కాదని తెలుసుకుంది. క్లోయి తన జీవితంలో ప్రేమించిన ఒకే ఒక మనిషి కేథరిన్. ఆమెతోనే ఏకైక అనుబంధం ఏర్పడింది. అందుకే క్లోయి గుర్తుగా కేథరిన్ ఆమె క్లిప్పుని ధరించింది. అంతకంటే ఏం చేయగలదు? జీవితాంతం అపరాధభావం మాత్రం వెంటాడుతుంది. జీవితాలు బావుండాలంటే భార్యాభర్తల మధ్యకి మూడో వ్యక్తిని రానివ్వకూడదు. భార్యాభర్తలని చట్టం రక్షణ ఉంటుంది. చివరికి భార్యాభర్తల జీవితాలు బావున్నా ఆ మూడో వ్యక్తి జీవితం ఏమవుతుందో చెప్పలేం.
గాజు కిటికీ నుంచి క్లోయిని మొదట చూసింది కేథరిన్. తెలిసీ తెలియక అటు వైపు వెళ్ళి ఆమెతో పరిచయం పెంచుకుంది. కాస్త ఆనందం అందుకుని మళ్ళీ తన అద్దాల మేడ లోకి వచ్చేద్దామని అనుకుంది. అయితే క్లోయి అద్దాల మేడ లోకి ప్రవేశించింది. క్లోయిని వెలివేసే సంఘర్షణలో అద్దం పగిలితే కానీ ఆమె వెళ్ళని పరిస్థితి వచ్చింది. అద్దం పగిలి ఆమె తన పాత జీవితంలోకి వెళ్ళకుండా తన జీవితాన్ని అంతం చేసుకుంది. అద్దాల మేడలో ఆమె గుర్తు ఒకటి మిగిలిపోయింది. ఈ అద్దాల సింబలిజం నిట్టూర్పు తెప్పిస్తుంది.