మరుగునపడ్డ మాణిక్యాలు – 18: లూపర్

0
2

[dropcap]సై[/dropcap]న్స్ ఫిక్షన్ చిత్రాలలో టైమ్ ట్రావెల్ ఒక విచిత్రమైన ప్రక్రియ. గతంలోకి, భవిష్యత్తులోకి ప్రయాణించగలగటం అనే అంశం అనేక ప్రశ్నలకు తావిస్తుంది. భవిష్యత్తు మాట ఎలా ఉన్నా గతంలోకి వెళ్ళి కేవలం అక్కడ జరుగుతున్నది చూసే శక్తి మాత్రమే ఉంటే పర్వాలేదు. జరుగుతున్న దాంట్లో ఒక పాత్రగా మారితే ఆ పరిణామాలు గతాన్ని మార్చేస్తాయి. ఈ మధ్య ‘ఒకే ఒక జీవితం’లో టైమ్ ట్రావెల్ చూపించారని తెలిసింది. నేను ఆ చిత్రం చూడలేదు. ‘ఆదిత్య 369’లో నాయికానాయకులు కృష్ణదేవరాయల కాలంలోకి వెళ్ళి అక్కడ కొన్ని సంఘటనలకు కారణమౌతారు. అవి చరిత్రను పెద్దగా మార్చవు కాబట్టి పర్వాలేదు. ఒకవేళ చరిత్రను మారిస్తే వర్తమానం పై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ‘బ్యాక్ టు ద ఫ్యూచర్’ చిత్రంలో ఒక యువకుడు తన తలిదండ్రుల గతంలోకి వెళతాడు. తల్లి కాలేజీలో ఉంటుంది. ఆమె ఈ యువకుడి మీద మోజు పడుతుంది. ఒకవేళ ఆమె ఆ యువకుడి తండ్రిని పెళ్ళి చేసుకోకపోతే ఆ యువకుడే పుట్టడు. అందుకని అతను వారిద్దరూ కలిసే లాగ పథకాలు వేస్తాడు. ఇది ఆలోచిస్తే కొంచెం గజిబిజిగా ఉంటుంది. అతని తలిదండ్రులు కలుసుకోక ఆ యువకుడు పుట్టకపోతే గతం లోకి ప్రయాణించేది ఎవరు? ‘లూపర్’ (2012)లో ఇంకాస్త ముందుకెళ్ళి గతంలోకి వెళ్ళి తనను తాను కలుసుకుంటే ఏం జరుగుతుంది అనేది చూపించారు. “దీని గురించి ఎక్కువ ఆలోచిస్తే బుర్ర పాడవుతుంది” అని కొన్ని పాత్రల చేత అనిపించారు. ఎక్కువ ఆలోచించక ఆస్వాదిస్తే.. ఎంత ప్రగతి సాధించినా మనిషికి మానవత్వమే అసలైన ఐశ్వర్యం అనే సందేశంతో ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం. పెద్దలకు మాత్రమే. తెలుగు శబ్దానువాదం కూడా అందుబాటులో ఉంది. శబ్దానువాదం బావుంది.

కథ 2044లో ప్రారంభమవుతుంది. టైమ్ ట్రావెల్ అప్పటికి కనిపెట్టలేదు కానీ భవిష్యత్తులో కనిపెట్టారు. దాన్ని నిషేధించారు కూడా. అయితే మాఫియా వాళ్ళు చట్టవిరుద్ధంగా దాన్ని వాడుకుంటూ ఉంటారు. తాము చంపాలనుకున్న వారిని గతంలోకి పంపిస్తారు. అక్కడ కిరాయి హంతకులు వారిని చంపేస్తారు. ఈ కిరాయి హంతకులని అజమాయిషీ చేయటానికి మాఫియా మనిషి ఒకడు గతంలోకి ప్రయాణించి వచ్చాడు. అతని పేరు ఏబ్. ఇదిలా ఉంటే మనుషులలో కొందరికి టెలీకైనెటిక్ శక్తులుంటాయి. అంటే తమ ఆలోచనలతోనే వస్తువులని కదపగలరు. ఈ మనుషులని టీకేలు (టెలీకైనెటిక్‌కి సంక్షిప్త రూపం) అంటారు.

జో భవిష్యత్తు నుంచి వచ్చేవారిని చంపే ఒక కిరాయి హంతకుడు. డ్రగ్స్‌కి అలవాటు పడ్డాడు. ఫలానా సమయానికి భవిష్యత్తు నుంచి వచ్చే మనిషిని ఒకరిని చంపాలి అని ఆదేశం వస్తే ఆ సమయానికి తుపాకీతో తయారుగా ఉంటాడు. ఆ మనిషి ఆ సమయానికి కట్లలో ప్రత్యక్షం అవుతాడు. వెంటనే జో అతన్ని చంపేసి అతనికి ఒంటికి కట్టి ఉన్న వెండి బిస్కెట్లని తీసుకుని అతన్ని దహనం చేసేస్తాడు. ఇలాంటి హంతకుల్ని లూపర్లు అంటారు. ఒక్కోసారి ఎవరైనా హంతకుడు భవిష్యత్తులో సమస్యగా మారితే మాఫియా వాళ్ళు అతణ్ణి గతంలోకి పంపించి అతని చేతే చంపిస్తారు! అంటే చిన్న వయసులో ఉన్న హంతకుడు పెద్ద వయసులో ఉన్న తనను స్వయంగా చంపేస్తాడు. దీన్ని లూప్ (వృత్తం) మూయటం అంటారు. ఇలా చేసినవారికి బంగారు బిస్కెట్లు దక్కుతాయి. ఇక ఎవర్నీ చంపనక్కరలేదు. బతికి ఉన్నన్నాళ్ళు విలాసంగా బతకవచ్చు.

ఒకరోజు జో కి భవిష్యత్తులో ఒక కర్కోటకుడైన నాయకుడు మాఫియాని తన చెప్పుచేతుల్లోకి తీసుకున్నాడని, అన్ని లూపులు మూసివేయమని ఆదేశించాడని తెలుస్తుంది. అతని స్నేహితుడొకడు తనను తాను చంపుకోలేక జో ఇంటికి వస్తే జో అతన్ని దాచిపెడతాడు. ఏబ్ జో ని బంధించి నిజం చెప్పమని, లేకపోతే అతని దగ్గరున్న వెండిలో సగం వాపసు ఇచ్చేయమని బెదిరిస్తాడు. జో తన స్నేహితుణ్ణి ఎక్కడ దాచిందీ చెప్పేస్తాడు. ఏబ్ మనుషులు అతణ్ణి చంపేస్తారు. జో పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. తన లూప్ మూసేసుకుంటే ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా ఉండొచ్చని అనుకుంటాడు.

ఆరోజు రానే వస్తుంది. 2074 నుంచి వచ్చి పెద్ద జో చిన్న జో ముందు ప్రత్యక్షమవుతాడు. అయితే కట్లు ఉండవు. చిన్న జో అతన్ని చంపేలోగా అతను చిన్న జో మీద దాడి చేసి పారిపోతాడు. ఎందుకు? అతన్ని గతంలోకి పంపించటానికి మాఫియా వాళ్ళు వచ్చినపుడు అతను చైనాలో తన భార్యతో ఆనందంగా జీవితం గడుపుతుంటాడు. ఆమె ప్రేమలో డ్రగ్స్ వదిలేశాడు. ఆమె గర్భవతి అవుతుంది. అతనికి జీవితం మీద కొత్త ఆశ పుట్టింది. అందుకని మాఫియా వాళ్ళని ప్రతిఘటిస్తాడు. ఈ ప్రతిఘటనలో అతని భార్యకి తూటా తగిలి మరణిస్తుంది. అతను ప్రతీకారవాంఛతో రగిలిపోతాడు. అతను కావాలనే భవిష్యత్తు నుంచి గతంలోకి వస్తాడు (అందుకే కట్లు లేవు). చిన్న జో మీద ఎలా దాడి చేయాలో ఆలోచించుకుని వస్తాడు. అతని పథకమేమిటంటే మాఫియా అధినాయకుణ్ణి గతంలోకి వెళ్ళి చంపేస్తే అప్పుడు లూపులు మూసేయమని ఆదేశాలు ఇవ్వలేడు కాబట్టి తన భార్య బతికే ఉంటుందని!

ఇంత అయోమయమైన అంశాన్ని నేను ఎంతవరకు స్పష్టంగా చెప్పగలిగానో తెలియదు కానీ దర్శకుడు రయన్ జాన్సన్ అద్భుతంగా తెరకెక్కించాడు. చిన్న జో కొత్తగా ఏమైనా చేస్తే దాని తాలూకు జ్ఞాపకాలు పెద్ద జోలో వెంటనే నిక్షిప్తమైపోతాయి. చిన్న జోకి ఏమైనా కొత్త గాయమైతే దాని తాలూకు మచ్చలు పెద్ద జో శరీరం మీద ప్రత్యక్షమౌతాయి. పెద్ద జో పారిపోయిన తర్వాత చిన్న జో తన చేతి మీద కత్తితో ఒక సందేశం వ్రాస్తాడు. అది పెద్ద జో చేతి మీద మచ్చలా కనపడుతుంది. ఆ సందేశం సంకేత భాషలో ఎక్కడ కలుసుకోవాలో తెలుపుతుంది. ఇద్దరూ కలుసుకుంటారు. పెద్ద జో తన భార్య సంగతి చెబుతాడు. ఆమె ఫొటో చూపించబోతాడు. కానీ ఆగుతాడు. చిన్న జో “నీ జీవితం చివరికొచ్చింది. నా జీవితం ఇంకా ఉంది. నువ్వు చచ్చిపోతే అంతా పరిష్కారమవుతుంది” అంటాడు. మళ్ళీ “నీ భార్య కోసం ఇదంతా చేస్తున్నావా? అయితే ఆ ఫొటో చూపించు. ఆమెని గుర్తు పెట్టుకుని ఆమె నాకు కనపడగానే ఆమె నుంచి దూరంగా పారిపోతాను. వేరొకరిని పెళ్ళి చేసుకుంటాను. అప్పుడు నీకు ఆమె జ్ఞాపకం కూడా ఉండదుగా” అంటాడు. ఆలోచించి చూస్తే ఇది మంచి పరిష్కారమే! కానీ మనిషి తన మధుర జ్ఞాపకాలను వదులుకోవటానికి అంత తేలికగా సిద్ధపడడు. “ఎవరి కోసమో నా జ్ఞాపకాలని ఎందుకు చెరిపేసుకోవాలి?” అంటాడు పెద్ద జో. తన స్వార్థాన్ని వదులుకుంటే తన భార్య బతుకుతుందని తెలిసి కూడా అతను ఒప్పుకోడు. ఇక్కడ అతని మమకారం కన్నా స్వార్థమే ఎక్కువ పని చేసింది. ‘నా జీవితాన్ని పాడు చేయటానికి వాడికెంత ధైర్యం?’ అని అనుకున్నాడే కానీ వేరే జీవితం కోరుకోలేదు. దీనికి కారణం ఆమె తనకి పరిచయం కాకపోతే తానేమైపోతానో అనే ఆందోళన. డ్రగ్స్ ప్రభావంతో జీవితం నరకమౌతుందని భయం. స్వార్థానికి అహంకారం ముసుగు వేశాడు.

మాఫియా అధినాయకుడు కర్కోటకుడని, చిన్నప్పుడు అతని తల్లిని ఎవరో చంపటం చూశాడని, అదే అతన్ని ఉన్మాదిగా చేసిందని అంటాడు పెద్ద జో. అధినాయకుడికి సంబంధించి ఒక కోడ్ తన దగ్గర ఉందని, అతను ఆ ఊళ్ళోనే ఉన్నాడని, అతను ఎక్కడున్నాడో ఒక మ్యాప్‌లో గుర్తులు పెట్టుకున్నానని, అతన్ని చంపేస్తానని అంటాడు. ఇంతకీ ఆ అధినాయకుడికి అప్పటికి ఐదేళ్ళు. చిన్న జో పెద్ద జో తో పెనుగులాడతాడు. ఇంతలో ఏబ్ మనుషులు అక్కడికి వచ్చి దాడి చేస్తారు. ఈ గందరగోళంలో చిన్న జో పెద్ద జో దగ్గర ఉన్న మ్యాప్ లో కొంత భాగాన్ని చింపి తీసుకుంటాడు (అందరూ సెల్ ఫోన్ లో మ్యాపులు చూసుకుంటున్న ఈ కాలంలో కాగితం మ్యాపులేంటి? పెద్ద జో దగ్గర ఒకవేళ సెల్ ఫోన్ ఉన్నా అది గతంలో పనిచేయకపోవచ్చు.) ఏబ్ మనుషులతో కలిసి పెద్ద జో ని వెంటాడతాడు. పెద్ద జో పారిపోతాడు. ఏబ్ మనుషులు చిన్న జో మీద దాడి చేస్తారు. అతను పెద్ద జో ని మొదట్లోనే చంపేసి ఉంటే ఈ గొడవ జరిగేది కాదు కదా! చిన్న జో తప్పించుకుని మ్యాప్ ముక్క ఆధారంగా ఒక ఇంటికి చేరుకుంటాడు. ఆ ఇల్లు ఒక చెరుకు పొలం పక్కన ఉంటుంది. అధినాయకుణ్ని వెతుక్కుంటూ పెద్ద జో అక్కడికి వస్తాడని, అతన్ని చంపేయవచ్చని చిన్న జో పథకం.

ఆ ఇంట్లో ఉన్నది ఒక తల్లి, ఐదేళ్ళ కొడుకు. ఆమె పేరు సారా, కొడుకు పేరు సిడ్. డ్రగ్స్ లేక విలవిల్లాడుతున్న చిన్న జోని సారా కాపాడుతుంది. అతను ఆమెకి మ్యాప్ మీద ఉన్న అధినాయకుడి కోడ్ చూపిస్తాడు. సిడ్ పుట్టినరోజు, అతను పుట్టిన హాస్పిటల్ నంబరు కలిపినదే ఆ కోడ్. ఆరోజు ఆ హాస్పిటల్లో ఇంకా వేరే పిల్లలు పుట్టి ఉండవచ్చు. వారిలో ఎవరో ఒకరు అధినాయకుడు అవుతారు కాబట్టి అందరినీ పెద్ద జో చంపేస్తాడని చిన్న జోకి అర్థమవుతుంది. అక్కడే వేచి ఉంటాడు. సారా ఒక టీకే అని తెలుస్తుంది. సిడ్ సారాని “అమ్మా” అని పిలవడు, పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు. చిన్న జో తో మాట్లాడినపుడు “సారా మా అమ్మ కాదు” అంటాడు. ఇంతకీ సారా ఎవరు? ఆమె టీకే అవటం కథలో ఏ విధంగా పనిచేస్తుంది? చిన్న జో ఏం చేస్తాడు? పెద్ద జో చివరికి ఏమవుతాడు? ఇది మిగతా కథ.

రయన్ జాన్సన్ స్క్రీన్ ప్లే వ్రాసి, దర్శకత్వం వహించాడు. గజిబిజిగా అనిపించే కథని ఎంతో ప్రతిభావంతంగా చెప్పాడు. పెద్ద జోగా బ్రూస్ విలిస్, చిన్న జోగా జోసెఫ్ గోర్డన్-లెవిట్, సారాగా ఎమిలీ బ్లంట్ నటించారు. బ్రూస్ విలిస్ ‘డై హార్డ్’ సీరిస్ తో పేరు సంపాదించాడు. జోసెఫ్ గోర్డన్-లెవిట్ క్రిస్టఫర్ నోలన్ తీసిన ‘ఇంసెప్షన్’ లో ఒక ముఖ్య పాత్ర పోషించాడు. ఎమిలీ బ్లంట్ అప్పటికి పేరు గడించకపోయినా తర్వాత ‘ద క్వయెట్ ప్లేస్’ తో స్టార్ అయింది.

‘టర్మినేటర్’ చిత్రాలలో గతం నుంచి మనుషులు రావటం, భవిష్యత్తులో నాయకుడు కాబోయే అతని తల్లిని చంపటానికి ప్రయత్నించటం చూశాం. అందులో రోబోట్లు ఉంటాయి. ఇందులో రోబోట్లు కాదు, అందరూ మనుషులే. ఎంత ప్రగతి సాధించినా వారి జీవితాలు మాత్రం అస్తవ్యస్తంగానే ఉంటాయి. ప్రగతి అంతా డబ్బు కూడబెట్టడానికే అయితే మనశ్శాంతి ఎక్కడుంటుంది? ఆటమ్ బాంబులు, స్మార్ట్ ఫోనులు ఇప్పటికే కనిపెట్టారు. ఈ విశ్వంలో అంతులేని శక్తి, సమాచారాన్ని మోసుకెళ్ళే తరంగాలు ఉన్నాయని నిరూపణ అయింది. శక్తిని విధ్వంసానికి, తరంగాలని ఒకరి జీవితం లోకి మరొకరు తొంగి చూడటానికి వాడుకుంటే లాభమేమిటి? సోషల్ మీడియా వల్ల మానసిక రుగ్మతలు పెరుగుతాయని తెలిసినా దాన్ని ఇంకా ఇంకా ప్రచారంలోకి తీసుకువచ్చి చిన్నపిల్లలని బానిసలుగా చేయాలని ఎంతమంది ప్రయత్నించటం లేదు? రేపు టెలీపోర్టేషన్ (ఒకచోటి నుంచి ఇంకో చోటికి వాహనం లేకుండా ప్రయాణించటం) వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. మన పురాణాల్లో ఇలాంటివి విన్నాం. దివ్యదృష్టి అంటే కొట్టి పారేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల కెమెరాలను హ్యాక్ చేయటం ద్వారా అది సాధ్యం కావట్లేదా? అప్పట్లో మంత్రశక్తితో సాధించారు, ఇప్పుడు యంత్రాలతో సాధిస్తున్నారు (పన్ ఇంటెండెడ్). అలాగే టెలీపోర్టేషన్ సాధ్యం అవుతుంది. వ్యాసుడు సత్యవతి తలచుకోగానే ఆమె ముందు ప్రత్యక్షమైనట్టే. కానీ టైమ్ ట్రావెల్ సాధ్యం కాదని నా అభిప్ర్రాయం. గతాన్ని మార్చటం ఎవరి తరం కాదు. దీనికి మన పురాణాల్లో ఎక్కడా ఆధారాలు లేవు. ఉంటే నాకు తెలియదు. కానీ ఇలాంటి సినిమాలు వేసే ప్రశ్న ఏమిటంటే గతం లోకి వెళ్ళి వేరే వాళ్ళ తప్పులు మొగ్గలోనే తుంచేయాలని అనుకోవటం మంచిదా? మన తప్పులు సరి చేసుకోవటం మంచిదా? పెద్ద జో ఎన్నో హత్యలు చేసి జీవితంలో ఒక దశకి చేరుకున్నాడు. తన భార్య హత్యకి గురైతే అతనికి బాధ తెలిసింది. చేసిన కర్మకి ఫలితం అని సరిపెట్టుకుంటే సరిపోయేది. కానీ ప్రతీకారం చేస్తానని బయలుదేరాడు. దాని బదులు నా జీవితాన్ని మార్చుకుంటాను అనుకుంటే ఎలా ఉండేది?

చిత్రంలోని మిగతా కథ ముగింపుతో సహా ఈ క్రింద ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు.

సారా 22 ఏళ్ళ వయసులో సిడ్‌కి జన్మనిచ్చింది. తన ఆనందానికి సిడ్ అడ్డు అని భావించి తన అక్క దగ్గర అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. అక్క మరణించటంతో తిరిగి వచ్చింది. సిడ్‌కి కోపం వచ్చినపుడు సారా విపరీతంగా భయపడుతుంది. ఒక ఇనప పెట్టెలో దాక్కుంటుంది. తర్వాత తెలిసేదేమిటంటే సారా టీకే అవటం వల్ల సిడ్కి ఆ శక్తులు వచ్చాయి. అయితే అతనిలో ఆ శక్తులు ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. అతనికి భయం, కోపం వస్తే ఆ శక్తులు వెలువడి విధ్వంసం జరుగుతుంది. చిన్న జోని వెతుక్కుంటూ వచ్చిన ఏబ్ మనిషి సారాని నిర్బంధిస్తాడు. మెట్ల పైనుంచి అది చూసి కంగారుగా వచ్చిన సిడ్ కాలుజారి కిందపడతాడు. భయంతో అరుస్తాడు. అతని నుంచి శక్తి వెలువడి దాని ప్రభావంతో ఆ మనిషి గాలిలోకి లేచి రక్తనాళాలు పేలిపోయి చనిపోతాడు. అప్పటికే ప్రమాదం గుర్తించిన సారా జోని బయటికి లాక్కువెళ్ళటంతో వారు బతికిపోతారు. సారా అక్క కూడా ఇలాగే సిడ్ భయం కారణంగా ప్రమాదవశాత్తూ చనిపోయింది. సిడ్‌కి ఇప్పుడు తన భావోద్వేగాలను నియంత్రించుకునే వయసు వచ్చింది. అయితే ఎవరో ఒకరు అతనికి మార్గదర్శకత్వం చేయాలి. ఆ పని తాను చేస్తున్నానని సారా అంటుంది. తన ప్రేమలో సిడ్ మంచి మనిషిగా మారతాడని నమ్మకంగా ఉంటుంది. చిన్న జో సిడ్ విపరీత ధోరణిని చూసి అతన్ని చంపేయాలనుకుంటాడు కానీ తన శక్తి తనకే తెలియని అతని అమాయకమైన మొహం చూసి ఆగిపోతాడు.

సిడ్‌కి ఉన్న అతీంద్రియ శక్తి చిన్న జో చూడటం వల్ల పెద్ద జో కి అది ఒక జ్ఞాపకంగా స్ఫురిస్తుంది. భవిష్యత్తులో అధినాయకుడు అయ్యేది సిడ్డే అని అతనికి అర్థమౌతుంది. చిన్న జో ప్రమాదం పొంచి ఉందని గ్రహించి సారాని, సిడ్‌ని పారిపొమ్మంటాడు. సిడ్ కోసం పెద్ద జో వస్తాడు. ఏబ్ మనుషులు కూడా వస్తారు. చిన్న జో వారితో తలపడుతూ ఉండగా పెద్ద జో సిడ్‌ని చంపటానికి వెళతాడు. పొలంలో సిడ్, సారా పరిగెడుతూ ఉంటారు. పెద్ద జో పేల్చిన బుల్లెట్ సిడ్ చెంపకు రాసుకుని వెళ్ళిపోతుంది. దీనితో అతనికి కోపం వస్తుంది. అతని లోని అతీంద్రియ శక్తి పని చేయటం ప్రారంభిస్తుంది. పెద్ద జో, సారా గాలిలోకి లేస్తారు. పెద్ద జో తుపాకీ కిందపడిపోతుంది. ఇంతలో సారా సిడ్ దృష్టిని తనవైపు మరల్చి అతన్ని సముదాయిస్తుంది. ఆమె అనునయంగా మాటలాడటంతో సిడ్ శాంతిస్తాడు. సారా, పెద్ద జో భూమి మీద పడతారు. పెద్ద జో మళ్ళీ సిడ్‌ని వెంబడిస్తాడు. సారా అడ్డు వెళుతుంది. ఆమె చనిపోతే సిడ్ ప్రేమరాహిత్యంతో పెరిగి పెద్ద విధ్వంసకారుడు అవుతాడు, అధినాయకుడు అవుతాడు. దూరం నుంచి ఇది చూసిన చిన్న జో జరగబోయే ఘోరాన్ని ఆపటానికి తనని తాను తుపాకీతో కాల్చుకుని మరణిస్తాడు. చిన్న జో చనిపోయాడంటే పెద్ద జోకి ఉనికే లేదు. కాబట్టి అతను అంతర్ధానమౌతాడు. ఆ విధంగా సారా చావుని ఆపి గతాన్ని తిరగరాశాడు చిన్న జో. సారా సిడ్‌ని తీసుకుని ఇంటికి వెళుతుంది.

చిన్న జో సమాజశ్రేయస్సు గురించి ఆలోచించాడు. సిడ్‌కి ప్రేమ దక్కకపోతే అతను భవిష్యత్తులో అల్లకల్లోలం సృష్టిస్తాడు. అతనికి ప్రేమ దక్కాలంటే సారా బతకాలి. తానే లేకుండా పోతే పెద్ద జో ఆమెని చంపే ప్రసక్తే ఉండదు. అందుకని ప్రాణత్యాగం చేశాడు. దీనితో పెద్ద జో భార్య కూడా అకాలమరణం పాలు కాకుండా ఉంటుంది. భవిష్యత్తు మారుతుంది. సిడ్ ప్రేమ, లాలిత్యం అందుకుని పెరుగుతాడు. అతనిలో కోపం, ద్వేషం తగ్గుతాయి. అతను మాఫియా అధినాయకుడు కాకుండా ఉంటాడు. దీంతో ప్రపంచమంతా బాగుపడిందా? లేదు. కానీ ‘నేను త్యాగం చేసినంత మాత్రాన ప్రపంచం మారదు’ అని అందరూ అనుకుంటే ప్రపంచం మరింత దుర్భరంగా మారుతుంది. ఎవరికి చేతనైన త్యాగం వారు చేయాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే పలుచటి ప్లాస్టిక్ సంచులు నిషేధించినా ఇంకా ఎందుకు వాడకంలో ఉన్నాయి? మనం దుకాణాలకి వెళ్ళేటపుడు సంచులు పట్టుకెళ్ళకపోవటం వల్లే కదా! ‘నేను ఒక్కడిని సంచి తీసుకెళ్ళినంత మాత్రాన ప్లాస్టిక్ వినియోగం తగ్గిపోతుందా?’ అనుకోవటం కంటే ‘నా బాధ్యత నేను చేస్తాను’ అని కొందరైనా అనుకుంటే కొంతైనా పరిస్థితి మారుతుంది.

చిన్న జో చేసిన పనికి ‘ఆత్మహత్య పాపం కాదా?’ అని కొందరు అనవచ్చు. చిన్న జో తన జీవితాన్ని తప్పించుకోవటానికి ఆత్మహత్య చేసుకోలేదు. ఇతరుల జీవితాలను కాపాడటానికి ఆత్మహత్య చేసుకున్నాడు. దధీచి వజ్రాయుధం అందించటానికి ప్రాణత్యాగం చేశాడు. సమాజశ్రేయస్సు కోసం ఎంత త్యాగమైనా చేయవచ్చు. పిరికితనంతో, స్వార్థంతో మంచి పనులు మానటం కన్నా లోకం కోసం త్యాగాలు చేయటం మిన్న. నైజీరియా తీవ్రవాద సంస్థ బోకో హరామ్ సభ్యులు స్కూలు అమ్మాయిలను అపహరించినపుడు “వాళ్ళని వదిలేసి నన్ను తీసుకువెళ్ళండ”ని ఒక యువగాయని వారిని పత్రికాముఖంగా కోరింది. ఆమె చేయబోయినది పాపమని ఎవరైనా అనగలరా? మానవత్వం అంటే పరోపకారం. ఈరోజుల్లో పరోపకారం చేయకపోయినా అపకారం చేయకుండా ఉంటే అదే పదివేలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here