Site icon Sanchika

మరుగునపడ్డ మాణిక్యాలు – 20: ద మ్యూల్

[dropcap]ని[/dropcap]జజీవితంలో జరిగే సంఘటనలు ఒక్కోసారి ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. ‘Truth is stranger than fiction’ అని మనం తరచు అనుకుంటూ ఉంటాం. అమెరికాలో లియో షార్ప్ అనే వృద్ధుడు పదేళ్ళ పాటు డ్రగ్స్ ఒకచోటి నుంచి మరొక చోటికి చేరవేసే పని చేశాడు. పదేళ్ళ తర్వాత కానీ పట్టుబడలేదు. ఆయన రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన సైనికుడు. అలాంటి వ్యక్తి ఇలాంటి పని చేశాడంటే ఎవరూ నమ్మరు. పైగా వృద్ధుడు. అందుకే అతని మీద అధికారులకి అనుమానం రాలేదు. పట్టుబడే నాటికి ఆయన వయసు 87 ఏళ్ళు. ఈ సంఘటన ఆధారంగా ఒకప్పుడు కౌబాయ్ (వెస్టెర్న్ జానర్) చిత్రాలతో ప్రసిద్ధుడైన క్లింట్ ఈస్ట్ వుడ్ తీసిన చిత్రం ‘ద మ్యూల్’ (2018). తానే ఆ వృద్ధుడి పాత్ర ధరించాడు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం.

కళాకారులకి ప్రేరణ నిజజీవితంలో నుంచి వస్తుంది. కథని గుండెకి హత్తుకునేలా మలచటంలో నిజమైన ప్రతిభ బయటపడుతుంది. ఇది జీవితకథ (బయోపిక్) కాదు. ఒక సంఘటన ఆధారంగా అల్లిన కథ. తెలుగులో ‘మయూరి’ చిత్రం ఇలాంటిదే. ఒక నర్తకి ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నా కృత్రిమమైన కాలు పెట్టుకుని నాట్యప్రదర్శనలు ఇస్తోందన్న వార్త దినపత్రికలో చూసి ఒక కథ తయారు చేసి ఆ చిత్రం తీశారు. ఆ చిత్రంలో సుధా చంద్రన్ తన పాత్ర తానే పోషించుకున్నా కథ మాత్రం ఆమె జీవితకథ కాదు. అదే తరహాలో నిక్ షెంక్ వ్రాసిన స్క్రీన్ ప్లే ఆధారంగా ‘ద మ్యూల్’ తెరకెక్కింది. డ్రగ్స్ దొంగ రవాణా చేసే వారిని మ్యూల్స్ అంటారు. మ్యూల్ అంటే కంచరగాడిద. బరువులు మోయటం దాని పని. డ్రగ్స్‌ని రవాణా చేయటం తప్ప వేరే ఏ విధంగానూ ప్రమేయం లేనివారిని మ్యూల్స్ అని వ్యవహరిస్తారు.

క్లింట్ ఈస్ట్ వుడ్ 1950వ దశకంలో నటుడిగా ప్రయాణం మొదలు పెట్టి తర్వాత దర్శకుడిగా ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు తీశాడు. ‘ద గుడ్, ద బ్యాడ అండ్ ద అగ్లీ’ ఆయనకి నటుడిగా అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టింది. దర్శకుడిగా ‘ద అన్ ఫర్గివెన్’ చిత్రానికి ఆస్కార్ల పంట పండింది. ‘ద బ్రిడ్జెస్ ఆఫ్ మ్యాడిసన్ కౌంటీ’ తో ఆయన సున్నితమైన కథల దర్శకుడిగా కూడా సత్తా చాటాడు. ‘మిస్టిక్ రివర్’, ‘మిలియన్ డాలర్ బేబీ’ చిత్రాలతో ఆయన చిత్రాలు ఆస్కార్ స్థాయికి తగ్గవనే పేరు వచ్చింది. 90 ఏళ్ళ వయసులో ఆయన దర్శకత్వం వహించి, నటించిన ‘క్రై మాచో’ చిత్రం 2021లో విడుదలైంది. ఆయన చిత్రసీమకి అందించిన సేవలకి ఎన్నో జీవితసాఫల్య పురస్కారాలని అందుకున్నాడు.

‘ద మ్యూల్’ కథలోకి వెళితే ఎర్ల్ కొరియా యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికుడు. తర్వాత పూల రైతుగా స్థిరపడతాడు. డే లిలీ అనే మిశ్రమ వంగడం పండించి ఎంతో పేరు సంపాదిస్తాడు. ఎప్పుడూ పుష్ప ప్రదర్శనలకు వెళుతూ ఉంటాడు. ఇంటిపట్టున ఉండడు. అతని భార్య మేరీ విసిగిపోయి అతనికి విడాకులు ఇస్తుంది. అతని కూతురు పెళ్ళికి కూడా అతను రాడు. అమెరికాలో కూడా కన్యాదానం సంప్రదాయం ఉంది. తండ్రి కూతురితో పాటు చర్చి ద్వారం నుంచి పీఠం దాకా వచ్చి అక్కడ నిలబడ్డ వరుడికి కూతురిని అప్పగిస్తాడు. ఇంత ముఖ్యమైన సంప్రదాయాన్ని ఎర్ల్ విస్మరిస్తాడు. దాంతో అతని కూతురు అతనితో తెగతెంపులు చేసుకుంటుంది. పెళ్ళి సమయానికే ఆమెకి ఒక కూతురు ఉంటుంది. ఆ అమ్మాయికి తాతయ్య అంటే ప్రేమ. భార్య, కూతురు అతన్ని దూరం పెట్టినా మనవరాలు అతను మంచివాడని నమ్ముతుంది. మనవరాలికి పెళ్ళీడు వస్తుంది. అప్పటికి ఇంటెర్నెట్ ప్రాబల్యంతో ఎర్ల్ పూల వ్యాపారం దివాలా తీస్తుంది. మనవరాలి పెళ్ళి ఖర్చు కొంత భరిస్తానని అంటాడు కానీ చేతిలో డబ్బు ఉండదు. మనవరాలు పర్వాలేదంటుంది కానీ మేరీ అతన్ని తిట్టిపోస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా అతనికి తన సొంత కారులో డ్రగ్స్ రవాణా చేసే పని దొరుకుతుంది. దానికి ముఖ్యకారణం అతను ఎప్పుడూ ట్రాఫిక్ నిబంధనలను తప్పకపోవటమే. అమెరికాలో చిన్న తప్పులకి కూడా ఫైన్లు వేస్తారు. ఎర్ల్ ఎప్పుడూ ఫైన్ కట్టే పరిస్థితి తెచ్చుకోలేదు. పైగా వృద్ధుడు. సైన్యంలో పని చేసినవాడు. మాజీ సైనికులకి ఎక్కడైనా గౌరవం ఉంటుంది. అలాంటి వ్యక్తి డ్రగ్స్ రవాణా చేస్తే సురక్షితంగా ఉంటుందని అతనికి పని అప్పగిస్తారు మాఫియా వాళ్ళు.

డబ్బు కట్టకట్టలుగా వచ్చిపడుతుంది. మనవరాలి పెళ్ళికి పూలు, మద్యం ఖర్చు తానే పెట్టుకుంటాడు. పెళ్ళిలో మేరీతో ప్రేమగా మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు కానీ ఆమె అతన్ని మీద ద్వేషం చూపిస్తుంది. “నీకీ పువ్వులంటే ఎందుకంత ఇష్టమో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు” అంటుంది. “ఈ డే లిలీ పువ్వులు ఒక్కరోజు మాత్రమే ఉంటాయి. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి” అంటాడు. “మరి కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం లేదా?” అని మేరీ ప్రశ్నిస్తుంది. అతను జవాబు చెప్పలేడు. తన ఒంటరితనాన్ని మర్చిపోవటానికి, డబ్బు సంపాదించటానికి డ్రగ్స్ రవాణా తరచు చేస్తుంటాడు. అమెరికా దక్షిణ సరిహద్దు నుంచి ఉత్తరం వరకు డ్రగ్స్ చేరవేస్తూ ఉంటాడు. ఒకపక్కన డ్రగ్స్ నియంత్రణ అధికారులు రవాణాని ఆపటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మాఫియాలో ఒక సభ్యుడిని పట్టుకుని సమాచారం రాబడుతూ ఉంటారు. అయితే ఎర్ల్‌కి ఉన్న మారుపేరు తప్ప ఆ సభ్యుడికి ఇంకేమీ తెలియదు. ఆ మారుపేరు ‘తాతా’ (ఇది ఎలా వచ్చిందో కానీ బలే కుదిరింది.) ఎర్ల్ మీద ఎవరికీ అనుమానం రాదు. అతను జాతీయ రహదారుల మీద కాకుండా చిన్న రహదారుల మీద ప్రయాణించటం ఒక కారణం. ఎప్పుడూ వేగం పరిమితి దాటకపోవటం ఇంకో కారణం.

నెమ్మదిగా అతనికి భారీ మొత్తంలో డ్రగ్స్ అప్పగించటం మొదలుపెడతారు మాఫియా వాళ్ళు. జాగ్రత్త కోసం మెక్సికోలో ఉండే మాఫియా నాయకుడు ఎర్ల్‌కి ఒక పర్యవేక్షకుడిని నియమిస్తాడు. అతని పేరు హూలియో. అతను ఎర్ల్ కారు వెనకాలే ఇంకో కారులో తన సహచరుడితో ప్రయాణిస్తూ ఎర్ల్ కదలికల్ని గమనిస్తూ ఉంటాడు. అంటే ఎర్ల్ పారిపోకుండా చూడటం, ఒకవేళ ఎర్ల్ పట్టుబడితే అతన్ని వదిలేసి వెళ్ళిపోయే విధంగా ప్రణాళిక ఉంటుంది. ఎర్ల్ హూలియో మాట వినకుండా తనకు ఇష్టం వచ్చిన రహదారుల్లో వెళుతూ, ఇష్టం వచ్చినపుడు ఆగుతూ ఉంటాడు. హూలియోకి ఇది నచ్చదు. అయినా మాఫియా నాయకుడు “అతను ఒక్కోసారి ఒక్కో మార్గంలో వెళితే మనకే మంచిది. అతను ఏ మార్గంలో వెళతాడో ఎవరూ ఊహించలేరు” అంటాడు. ఒకసారి దారిలో ఎర్ల్, హూలియో, అతని సహచరుడు ఒక రెస్టారెంట్ దగ్గర ఆగుతారు. అందరూ హూలియోని, అతని సహచరుణ్ణి వింతగా చూస్తూ ఉంటారు. అది శ్వేతజాతీయులు మాత్రమే ఉండే ప్రాంతం. వీళ్ళు మెక్సికో వాళ్ళు. గోధుమ రంగులో ఉంటారు. అందుకే వీరిని ఇతరులు వింతగా చూస్తుంటారు. ఎర్ల్ “ఇక్కడ పోర్క్ శాండ్ విచ్ బావుంటుంది” అని అందరికీ శాండ్ విచ్లు తెస్తాడు. “జీవితాన్ని ఆస్వాదించాలి. నాలాగా అన్ని రుచులూ చూడాలి” అంటాడు. హూలియో “నువ్వు జీవితాన్ని అతిగా ఆస్వాదించావేమో. అతిగా ఆనందం అనుభవించావేమో. అందుకే ఇప్పుడు మాఫియా వాళ్ళ కోసం పనిచేయాల్సివచ్చిందేమో. ఆలోచించుకో” అంటాడు. ఈ మాట ఎర్ల్‌కి గుచ్చుకున్నట్టు ఉంటుంది కానీ నవ్వేసి తేలగొట్టేస్తాడు. హూలియో అతని స్వభావాన్ని సరిగా అంచనా వేశాడు. స్నేహితులతో తిరుగుతూ, ప్రదర్శనలకి వెళుతూ బాధ్యత లేకుండా జీవితాన్ని గడిపాడు ఎర్ల్. కళ్ళు తెరిచి చూసేసరికి కుటుంబం దూరమైంది. వ్యాపారం దివాలా తీసింది. దిక్కుతోచని పరిస్థితి. మాఫియా వాళ్ళ కోసం పనిచేస్తూ కాలం గడుపుతున్నాడు. డబ్బు ఉంటే కనీసం తన మనవరాలైనా తనకి ఆసరాగా ఉంటుందని అనుకున్నాడు. డబ్బుతోనే ఆమె ప్రేమను కొనవచ్చనుకున్నాడు.

రెస్టారెంట్ నుంచి వెళ్ళేటపుడు ఒక పోలీసు హూలియోని, అతని సహచరుణ్ణి ఆపుతాడు. మీకిక్కడ ఏం పని అని అడుగుతాడు. అందరూ శ్వేతజాతీయులే ఉండేచోట వేరేవాళ్ళు కనిపిస్తే వారికి అనుమానం. ఎర్ల్ అడ్డువెళ్ళి “వాళ్ళు నా సహాయకులు. పని బాగా చేస్తారని పెట్టుకున్నాను” అని చెప్పి పోలీసుని పంపిస్తాడు. మెక్సికో నుంచి అమెరికాకి వలస వెళ్ళేవాళ్ళలో చాలామంది శ్వేతజాతీయుల ఇళ్ళలో, తోటల్లో పనులు చేసుకుంటారు. ఆ సాకు చెప్పి ఎర్ల్ వాళ్ళని తప్పిస్తాడు. కానీ ఇక్కడ ఎర్లే మెక్సికన్ల దగ్గర పని చేస్తున్నాడు. ఎర్ల్‌కి జాత్యహంకారం ఉంది. కానీ డబ్బు ఎలాంటివారినైనా శాసిస్తుంది.

డబ్బు వస్తోంది కదా అని ఎలాంటి పనైనా చేస్తే పర్యవసానాలు చెడుగానే ఉంటాయి. ఎర్ల్ లాంటివారు సంపాదన ఉంటే చాలు, కుటుంబంతో సమయం గడపాల్సిన పని లేదు అనుకుంటారు. కానీ కుటుంబంతో సమయం గడపకపోతే రేపు అవసరం వస్తే ఎవరు అండగా ఉంటారు? ఈరోజుల్లో రేయింబవళ్ళు కష్టపడి భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తున్నారు. పిల్లలతో “మీ కోసమే ఇదంతా” అంటారు. పిల్లలతో సమయం గడపరు. వారాంతంలో షికారుకి తీసుకు వెళితే చాలు అనుకుంటారు. అది కూడా చేయనివారు ఎంతమందో! పిల్లలు ప్రేమ అందక పెడదారులు పడుతున్నారు. చేయి దాటిపోతున్నారు. ఆ తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు. కుటుంబసంబంధాలు బావుంటేనే జీవితం బావుంటుందని తెలుసుకోవాలి. ఎర్ల్ కాస్త ఆలస్యంగా ఈ విషయం తెలుసుకుంటాడు.

ఎర్ల్‌గా క్లింట్ ఈస్ట్ వుడ్ నటన అకట్టుకుంటుంది. ‘ఈ మాఫియా వాళ్ళ కన్నా జాతిలోనూ, జీవనశైలిలోనూ నేను అధికుడిని’ అనే భావన ఉంటుంది. అయినా వాళ్ళు చెప్పిన పని చేయాలి. వాళ్ళు వేళాకోళం చేస్తుంటే పడాలి. ఇలాంటి సందర్భాలలో నవ్వుతూ అన్నీ భరిస్తూ, తనకు నచ్చినట్టు చేసే మొండితనం ప్రదర్శిస్తూ క్లింట్ నటించాడు. 88 ఏళ్ళ వయసులో నటిస్తూ దర్శకత్వం వహించటమంటే మాటలు కాదు. ఆయనని అభినందించకుండా ఉండలేం. మేరీగా సీనియర్ నటి డయాన్ వియెస్ట్ నటించింది. డ్రగ్స్ నియంత్రణ విభాగంలో కోలిన్ బేట్స్ అనే పోలీసు అధికారిగా బ్రాడ్లీ కూపర్ నటించాడు. అగ్రశ్రేణి నటుడైన బ్రాడ్లీ కూపర్ ఈ చిత్రంలో సహాయనటుడిగా నటించటం ఒక విశేషం. క్లింట్‌కి సినీ పరిశ్రమలో ఉన్న గౌరవానికి ఇది సంకేతం.

ఈ క్రింద చిత్ర కథ ఇంకొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

మాఫియా ఇన్‌ఫార్మర్ ద్వారా తాతా డ్రగ్స్ రవాణా చేస్తూ ఒక రాత్రి ఒక మోటెల్లో (రహదారి పక్కన చవక హోటల్) ఉండబోతున్నాడని పోలీసు అధికారి కోలిన్‌కి తెలుస్తుంది. అయితే వాళ్ళు తాతా అంటే ఎవరో బలిష్టమైనవాడనే అభిప్ర్రాయంతో ఉంటారు. మోటెల్లో ఒకతన్ని పట్టుకుంటారు. సోదా చేస్తారు. అతను తాతా కాదని తెలిసి నిరాశపడతారు. ఎర్ల్ ఇదంతా గమనిస్తాడు. మర్నాడు పొద్దున్న అల్పాహారం కోసం ఎర్ల్ రెస్టారెంట్‌కి వెళితే అక్కడ కోలిన్ ఉంటాడు. ఎర్ల్ తెలివైనవాడు. కోలిన్‌ని తానే పలకరిస్తాడు. అలా చేస్తే తన మీద అనుమానం రాదని అతనికి బాగా తెలుసు. “రాత్రి మీరు ఒకతన్ని పట్టుకోవటం చూశాను. మీరు ధైర్యవంతులు” అంటాడు. కోలిన్ మర్యాదపూర్వకంగా మాట్లాడతాడు. ఇంతలో తన సెల్ ఫోన్ లో తేదీ చూసుకుని “అయ్యయ్యో” అనుకుంటాడు. ఎర్ల్ “నేను అలా ఎన్ని సార్లు అయ్యయ్యో అనుకున్నానో లెక్కే లేదు. ఎవరిదైనా పుట్టినరోజు మర్చిపోయారా?” అని అడుగుతాడు. “ఈ రోజు మా పెళ్ళిరోజు” అంటాడు కోలిన్. ఎర్ల్ “అలా ముఖ్యమైన రోజులు మర్చిపోవటంలో నన్ను మించినవారు లేరు. ఒక సలహా ఇస్తాను. అలాంటి విషయాలు ఆడవారికి చాలా ప్రధానం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. కుటుంబమే ప్రధానం. ఉద్యోగానిదెప్పుడూ రెండో స్థానమే అయి ఉండాలి. నేను చేసిన తప్పుల వల్ల నా కూతురు నాతో మాట్లాడటమే మానేసింది” అంటాడు. అలాంటి విషయాలు ఆడవారికి ప్రధానం కాబట్టి గుర్తు పెట్టుకోవాలి అన్నాడు కానీ నీకు కూడా అవి ప్రధానమవ్వాలి అనలేదు. కుటుంబమే ప్రధానం అనే మాట తన మీద అనుమానం రాకుండా ఉండటానికి అన్నాడా లేక నిజంగానే అన్నాడా అని మనకు సందేహం వస్తుంది. అలాంటి సందర్భంలో అతను మనస్ఫూర్తిగా ఆ మాటలన్నాడని అనుకోలేం. తనను వేటాడుతున్న పోలీసు ముందు పెద్దరికం చూపిస్తూ మాట్లాడాడనే అనుకోవాలి. తన ప్రయోజనం కోసం అలా మాట్లాడటం సిగ్గుమాలిన విషయమే. అయితే చివరికొచ్చే సరికి అతని గొంతు గద్గదమౌతుంది. ఒక్కోసారి మనం పైకి అన్నమాటలు నిజమని అనేదాకా మనకు తెలియదు. ఈ సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఎర్ల్ కోలిన్ దగ్గర నోరుజారతాడా అని ఊపిరి బిగబట్టి చూస్తూ ఉంటాం. కానీ అలా జరగదు.

ఎర్ల్ అక్కడ నుంచి బయలుదేరి డ్రగ్స్‌ని గమ్యానికి చేర్చటానికి వెళుతుంటే అతని మనవరాలి నుంచి ఫోన్ వస్తుంది. “అమ్మమ్మ చావుబతుకుల్లో ఉంది. వెంటనే రా” అంటుంది. రాలేనంటాడు ఎర్ల్. అతని మనవరాలు ఈసడించుకుంటుంది. “అమ్మ, అమ్మమ్మ ఎంత చెప్పినా నేను నీ వకాల్తా తీసుకున్నాను. నా అంత మూర్ఖురాలు ఉండదు. నాదే తప్పు” అని ఫోన్ పెట్టేస్తుంది. మనవరాలు అంత మాటనే సరికి ఎర్ల్‌కి కనువిప్పు కలుగుతుంది. డబ్బుతో ఎవరి ప్రేమనీ కొనలేమని అర్థమౌతుంది. మనిషి ప్రేమ చూపించటం ముఖ్యం కానీ ప్రేమ చూపించలేనపుడు ఎంత డబ్బు ఉన్నా వ్యర్థమే. కోలిన్ లాంటి పోలీసు అంత ఒత్తిడిలో కూడా తన భార్య గురించి ఆలోచించటం కూడా ఎర్ల్ మర్చిపోలేదు. పైకి అతను కోలిన్‌కి సలహా ఇచ్చినట్లు కనిపించినా కోలిన్ వల్ల అతనికి కుటుంబం విలువ తెలిసింది. వెంటనే మేరీ దగ్గరకు వెళతాడు. అతను డ్రగ్స్ రవాణా మధ్యలో ఆపేసి వెళ్ళటంతో మాఫియా వాళ్ళు అతని కోసం గాలిస్తూ ఉంటారు.

మేరీ మంచాన పడి ఉంటుంది. అతన్ని చూసి ఆశ్చర్యపడుతుంది. అతను “నా తప్పులు క్షమించు” అంటాడు. “నువ్వు ఎప్పుడెప్పుడు ఇంటి నుంచి బయటపడదామా అని చూస్తూ ఉండేవాడివి. మేం నువ్వు మాతో సమయం గడపాలని కోరుకున్నాం కానీ నువ్వు బాగా సంపాదించాలని ఎప్పుడూ కోరుకోలేదు. నువ్వు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది” అంటుంది ఆమె. అతని కూతురు చాటుగా ఆ మాటలు వింటుంది. తర్వాత ఎర్ల్ కూతురితో “నేను తండ్రిగా నా బాధ్యతలు పట్టించుకోలేదు. ఇప్పుడంతా చేయి దాటిపోయింది” అంటాడు. ఆమె “లేదు. కాస్త ఆలస్యం అయింది అంతే” అంటుంది. అతన్ని క్షమిస్తుంది. తన కన్యాదానం కూడా చేయని తండ్రిని ఒక్కమాటలో క్షమించింది. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు అని అందుకే అంటారు. మనస్ఫూర్తిగా పలికిన ఒక్క మాట చాలు.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. ముగింపు తెలుకోవద్దని అనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

మేరీ మరణిస్తుంది. ఆమె అంత్యక్రియలు అయ్యేవరకు ఎర్ల్ అక్కడే ఉంటాడు. తర్వాత డ్రగ్స్ రవాణాకి మళ్ళీ వెళతాడు. కోలిన్‌కి సమాచారం అంది అతన్ని వెంబడించి పట్టుకుంటాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అతన్ని అరెస్టు చేసిన తర్వాత అతనితో మాట్లాడతాడు. “నేను ఎన్నో తప్పులు చేశాను. కానీ నా కుటుంబం నన్ను క్షమించింది” అంటాడు ఎర్ల్. కోలిన్ “మీరు ఇంత నేరం చేసినా మీరు ఇచ్చిన సలహా నాకెప్పుడూ గుర్తు ఉంటుంది” అంటాడు. ఈ సన్నివేశం హృద్యంగా ఉంటుంది. ఒకరు నేరస్థుడు, ఒకరు పోలీసు. ఇద్దరూ మనసు విప్పు మాట్లాడుకుంటారు. మనుషుల్లో మానవత్వం ఉంటే ఎవరితోనైనా మర్యాదగా మాట్లాడవచ్చు. కోలిన్ సంస్కారవంతుడు కాబట్టి అతను ఎర్ల్ లోని నిజాయితీని అర్థం చేసుకున్నాడు.

కోర్టులో ఎర్ల్ తరఫు లాయరు అతన్ని బలవంతంగా డ్రగ్స్ రవాణా లోకి దించారని వాదించబోతుంది. ఎర్ల్ ఆమెకి అడ్డుపడి “నా నేరాలన్నీ ఒప్పుకుంటున్నాను” అంటాడు. అతని చేత ఎవరూ బలవంతంగా నేరం చేయించలేదు. తెలిసే చేశాడు. అలాంటపుడు నిజం ఒప్పుకోకపోతే అతనికి మనశ్శాంతి ఉండదు. మనిషికి మనసే పెద్ద సాక్షి. పైగా తాను జీవితంలో ఎన్నో తప్పులు చేశాడు. వాటికి కూడా శిక్ష అనుభవించాలని అతని భావన. ఎర్ల్‌కి శిక్ష పడుతుంది. అతని కుటుంబం అతనికి అండగా నిలుస్తుంది. విచారమేమిటంటే అతను కుటుంబం విలువ తెలుసుకునే సరికి కుటుంబంతో సమయం గడపలేని పరిస్థితి. అందుకే జీవితంలో ప్రాధాన్యాలేమిటో తెలుసుకోవాలి. ఒక వ్యాపకం ఉండాలి కానీ అదే సర్వస్వం కాకూడదు. కుటుంబాన్ని విస్మరించకూడదు. ఎర్ల్ తనకి ఇష్టమైన పని చేస్తూ అందులోనే ఆనందం వెతుక్కున్నాడు. అలా కాక కొందరు తప్పని పరిస్థితుల్లో పనిలో తలమునకలవుతారు. అలాంటివారు కూడా ఆలోచించుకోవాలి. ముఖ్యంగా పిల్లల గురించి ఆలోచించాలి. పిల్లలకి సమయం కేటాయించకపోతే రేపు వాళ్ళూ మనల్ని పట్టించుకోరు. అందరూ ఎర్ల్ కూతురిలా క్షమించకపోవచ్చు.

Exit mobile version