Site icon Sanchika

మరుగునపడ్డ మాణిక్యాలు – 21: మమ్మో

[dropcap]దే[/dropcap]శవిభజన గురించి వింటుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఎంతమంది జీవితాలు తలకిందులయ్యాయో, ఎంత హింస జరిగిందో ఊహకే అందదు. ఇండియా నుంచి పాకిస్తాన్‌కి వెళ్ళినవారు తమ బంధువులని చూడలేని పరిస్థితి. ఆ తరంలో చాలా మంది తిరిగి ఇండియాకి వచ్చి ఉండాలని ప్రయత్నించారు. కానీ ఇరుదేశాల వైరంతో వారికది సాధ్యం కాలేదు. అలాంటి ఒక స్త్రీ కథే ‘మమ్మో’ (1994). దర్శకుడు శ్యామ్ బెనెగల్. ఆయన చిత్రాలలో మరుగునపడ్డ చిత్రమిది. మూబీలో లభ్యం.

1974 ప్రాంతాలలో రియాజ్ తన అమ్మమ్మ ఫయ్యాజీతో బొంబాయి (ఇప్పటి ముంబయి)లో ఉంటాడు. తొమ్మిదో తరగతి చదువుతూ ఉంటాడు. ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం. ఫయ్యాజీ భర్త ఒక స్టూడియోలో మేనేజర్‌గా పనిచేసేవాడు. వారి కూతురికి సినిమాలంటే మోజు. కొన్ని సినిమాలలో నటించింది. కానీ తలిదండ్రులకు ఆమె నటించటం ఇష్టం లేదు. ఆమెకి పెళ్ళి చేస్తారు. రియాజ్‌కి జన్మనిచ్చిన తర్వాత ఆమె కారు ప్రమాదంలో మరణిస్తుంది. రియాజ్ తండ్రి బిడ్డని వదిలి వెళ్ళిపోతాడు. భర్త చనిపోయాక ఫయ్యాజీ తానే రియాజ్‌ని పెంచుతుంది. పెద్ద స్కూల్లో చదివిస్తూ ఉంటుంది. ఒక చిన్న ఫ్లాట్లో వారు జీవిస్తూ ఉంటారు. రియాజ్‌కి అతని తండ్రి చనిపోయాడని చెబుతుంది ఫయ్యాజీ.

ఒకరోజు ఫయ్యాజీ చెల్లెలు మమ్మో పాకిస్తాన్ నుంచి వస్తుంది. మూడు నెలల వీసా. మమ్మో దేశవిభజన సమయంలో భర్తతో పాకిస్తాన్ వెళ్ళిపోయింది. సంతానం లేదు. భర్త చనిపోయాక మరుదులు, తోటికోడళ్ళు ఆమెని నానాకష్టాలూ పెడతారు. ఇండియాలో ఉండిపోవాలని ఆమె ఆశ. ఇలాంటి వాళ్ళు ఎంతమందో. పాకిస్తాన్ నుంచి వచ్చినవారు వచ్చినట్టు నమోదు చేసుకోవాలి. అక్కడి అధికారితో మమ్మో “మా అక్క ఆరోగ్యం బాగా లేదు. నేను ఆమెకి సహాయంగా ఉండాలి” అంటుంది. “అందరూ ఈ కాకమ్మ కథలే చెబుతారు” అంటాడు ఆ అధికారి. మమ్మో గడుసుది. ఆ అధికారికి ఎంతమంది పిల్లలో కనుక్కుంటుంది. “మీరు పిల్లాపాపలతో సుఖంగా ఉండాలి” అని దీవిస్తుంది.

రియాజ్‌కి రచయిత కావాలని ఆశ. సినిమాలంటే ఇష్టం. చదువులో కూడా ముందుంటాడు. మమ్మో తన చిన్ని ప్రపంచంలోకి రావటం అతనికి నచ్చదు. “ఎన్నాళ్ళుంటుంది? నా చదువుకి అడ్డం” అంటాడు అమ్మమ్మతో. “ఆమెకి ఎవరున్నారు? నువ్వు స్వార్థం పక్కన పెట్టి ఆలోచించు” అంటుందామె. బొంబాయిలో మురికిని చూసి మమ్మో “లాహోర్‌లో రోడ్లు ఎంత బావుంటాయో! ఇంపోర్టెడ్ కార్లు రయ్యిరయ్యిమని తిరుగుతూ ఉంటాయి” అంటుంది. “అక్కడంత బావుంటే ఇక్కడికెందుకు వచ్చావు?” అంటాడు రియాజ్. “పుట్టిన గడ్డ పుట్టిన గడ్డే కదా” అంటుందామె.

ఒకరోజు క్లాసు ఎగ్గొట్టి హిచ్‌కాక్ ‘సైకో’ సినిమాకి వెళతాడు రియాజ్ తన స్నేహితుడు రోహన్‌తో. పెద్దల చిత్రం కావటంతో మీసాలు గీసుకుని వెళతారు. టికెట్లు తనిఖీ చేసే అతను వీళ్ళని ఆపి వెనక్కి పంపిస్తాడు. రియాజ్ ఇంటికి వచ్చి మమ్మో బుర్ఖాలని తీసుకెళతాడు. అవి వేసుకుని స్నేహితులిద్దరూ హాల్లోకి వెళ్ళి సినిమా చూస్తారు. తిరిగి వచ్చి స్కూల్లో నాటకం రెహార్సల్స్ జరిగాయని అబద్ధం చెబుతాడు రియాజ్. “మీ అమ్మకి కూడా నటన అంటే ఎంతో ఇష్టం. కానీ ఆ పనికిమాలిన వాడితో పెళ్ళి చేసేశారు” అంటుంది మమ్మో. ఫయ్యాజీ “పరువుగల కుటుంబాల ఆడపిల్లలు సినిమాల్లో నటించకూడదు” అంటుంది. “పిల్లల ఆకాంక్షలను కాలరాసి వారిని శాసించటం పాపం” అంటుంది మమ్మో. ఆ రాత్రి రియాజ్ దొంగచాటుగా సిగరెట్ కాలుస్తుంటే మమ్మో పట్టుకుంటుంది. స్కూల్లో నాటకం కథ చెప్పమంటుంది. ‘సైకో’ కథనే నాటకం కథగా చెబుతాడు రియాజ్. ‘సైకో’ కథ తెలిసినవారికి అదెంత భయంకరమైన కథో తెలుసు. ఆ కథ విని మమ్మో “ఓరి దేవుడో! ఇంత దారుణమైన కథతో మీ స్కూల్లో నాటకాలు వేస్తున్నారా? నేను రేపే వచ్చి మీ ప్రిన్సిపల్‌తో మాట్లాడతాను” అంటుంది. రియాజ్ నిజం చెప్పేస్తాడు. “అమ్మమ్మకి చెప్పకు” అంటాడు. సరే అంటుంది మమ్మో. తర్వాత తాను దొంగచాటుగా భర్త సిగరెట్లు తాగేదాన్నని చెబుతుంది. రియాజ్ లాగే ఆమెకి కవిత్వమంటే ఇష్టం. ఒక మనిషి పైకి ఒకలా కనిపించినా తరచి చూస్తే ఎన్నో కోణాలు కనిపిస్తాయి. ఆశ్చర్యం కలిగిస్తాయి.

ఫయ్యాజీకి, మమ్మోకి ఇంకో చెల్లెలు ఉంటుంది. ఆమె పేరు అన్వరీ. ఆమె భర్త వ్యాపారం చేసి బాగా సంపాదించాడు. ఆమె, ఆమె భర్త బొంబాయి వస్తారు. ఒక హోటల్లో బస చేస్తారు. వారిని కలవటానికి అందరూ వెళతారు. అన్వరీ తమ తాతల మహలుని అమ్మేయగా ఆ డబ్బుతో ఆమె భర్త వ్యాపారం చేశాడు. పైకి మాత్రం ఆ డబ్బు అప్పులు తీర్చటానికే సరిపోలేదని చెబుతారు. తమ భాగం తమకి రావాలని మమ్మో పట్టుదలగా ఉంటుంది. ఈ విషయమే వారి ముందు ఎత్తుతుంది. “నా భాగం ఇవ్వకపోయినా పర్వాలేదు. ఫయ్యాజీ భాగం ఆమెకి ఇవ్వండి. పిల్లవాడిని పెంచటానికి నానా తిప్పలూ పడుతోంది” అంటుంది. “ఏఁ? వాడి బాబు డబ్బులివ్వడా?” అంటాడు అన్వరీ భర్త. “మా నాన్న చనిపోయాడు” అంటాడు రియాజ్. బతికే ఉన్నాడంటాడు అతను. దీంతో రియాజ్ అమ్మమ్మ తనని మోసం చేసిందని ఆమెతో మాట్లాడటం మానేస్తాడు. మమ్మో ఇద్దరి మధ్య రాయబారం చేస్తూ ఉంటుంది.

మమ్మో పాత్రని అద్భుతంగా మలిచారు రచయితలు. గడుసుతనం, మంచితనం, దైవభక్తి కలిసి ఉంటాయి. పిల్లల ఆకాంక్షలను గౌరవించాలనే ఉదాత్తత ఉంటుంది. రియాజ్ రచయిత అవుతానంటే సమర్థిస్తుంది. భర్త బతికినంత కాలం ఆనందంగా జీవించింది. ఆ తర్వాత గడ్డుకాలం వచ్చింది. “ముసలితనమంటే భయం లేదు కానీ ఒంటరితనమంటే భయం” అంటుంది. ఆమె స్వభావానికి చుట్టూ మనుషులుండాలి. అందుకే అక్క దగ్గరకి వచ్చింది. అయితే ఎక్కడికి వెళ్ళినా పెత్తనం చేసే నైజం. “నా మనవడిని నీ వైపుకి తిప్పుకుంటున్నావు” అని అక్క ఆడిపోసుకుంటుంది. ఇలాంటి చిన్న చిన్న తగాదాలు మధ్యతరగతి కుటుంబాల్లో సహజమే. వాటిని ఎంతో హృద్యంగా చూపించారు. మమ్మోగా ఫరీదా జలాల్ అద్భుతంగా నటించింది. చిన్నతనంలో చలాకీ పాత్రలకి పేరుమోసిన ఆమెకి ఈ పాత్ర కొట్టిన పిండి. ఫయ్యాజీగా సురేఖా సిక్రీ నటించింది. ఉత్తమ సహాయనటిగా జాతీయ అవార్డు గెలుచుకుంది. రియాజ్‌గా అమిత్ ఫాల్కే చక్కగా నటించాడు.

గుల్జార్ వ్రాసిన పాట ‘యే ఫాస్లే తేరీ గలియోఁ కే హమ్ సే తయ్ న హువే’ పాట గుండెని తాకుతుంది. తమ ఊరికి, తమ వారికి దూరమైన వారి వేదన ఇందులో కనిపిస్తుంది. ప్రముఖ గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ పాడారు.

యే ఫాస్లే తేరీ గలియోఁ కే హమ్ సే తయ్ న హువే
హజార్ బార్ రుకే హమ్ హజార్ బార్ చలే

న జానే కౌన్ సీ మట్టీ వతన్ కీ మట్టీ థీ
నజర్ మే ధూల్ జిగర్ మే లియే గుబార్ చలే

యే కైసీ సర్హదేఁ ఉల్ఝీ హుయీ హైఁ పైరోఁ మే
హమ్ అప్నే ఘర్ కీ తరఫ్ ఉఠ్ కే బార్ బార్ చలే

అనువాదం:

ఎంతెంత దూరమో నీ వీధుల్లో ప్రయాణం
ఆగి ఆగి నడవటం, నడవలేక ఆగటం

ఏ మట్టి నా జన్మభూమి మట్టో తెలియలేదు
కన్నుల్లో దుమ్ము గుండెల్లో ధూళి ఉండగా

ఏ ఎల్లలో కాళ్ళకి అడ్డుపడుతున్నాయి
పడి లేచి నా ఇంటికే ఆగని పయనం చేస్తున్నా

జన్మభూమి నుంచి దూరమైన వారు జ్ఞాపకాల వీధుల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఉద్వేగానికి లోనై ఆగిపోతారు. మళ్ళీ ఆ స్మృతుల్లో తమని తాము మరచిపోతుంటారు. గమ్యం మాత్రం దూరానే ఉండిపోతుంది.

‘నీ జన్మభూమి ఇక ఇదే’ అని మస్తిష్కం అంటుంది కానీ హృదయం మాత్రం ఒప్పుకోదు. కళ్ళలో ఎవరో దుమ్ము కొట్టారు. మభ్యపెట్టారు. భయపెట్టారు. గుండెల్లో చిచ్చుపెట్టారు. ఆ దుమ్ము, ధూళి అలా పేరుకుపోయి కొన్నాళ్ళకి రాజీ పడిపోతారు. కానీ అది నిజం కాదని అంతరంగం అంటూ ఉంటుంది. ఆ సంఘర్షణలో నలిగిపోతుంటారు.

సరిహద్దులు గీసి మనుషుల్ని ఆపాలని ఎంత ప్రయత్నం చేసినా మనసులు ఆగవు. ఎలాగోలా జన్మభూమిని ఒక్కసారైనా మళ్ళీ చూడాలనే తపన ఆగదు. ఎన్ని ఎదురుదెబ్బలైనా తిని తనవారిని చేరుకోవటానికి మనసు తహతహలాడుతుంది. పాస్‌పోర్ట్‌లు, వీసాలని ఎన్నో నిబంధనలు అడ్డు పడుతుంటాయి. ఎవరో ఒకరు తోడు ఉన్నవారు సరే, తోడు లేనివారు ఏం కావాలి? అసలు ఎవరూ లేకపోతే ఒకటే చింత, అయినవారు ఉన్నా వారి దగ్గరకు వెళ్ళలేకపోతే అది రంపపు కోతే!

రియాజ్ మమ్మో మీద ఒక కథ రాస్తాడు. ఉన్నదున్నట్టు రాస్తాడు. తన అక్క దగ్గరికి వచ్చి కొత్త జీవితం ప్ర్రారంభించిందని రాస్తాడు. అతని స్నేహితుడు రోహన్‌కి వినిపిస్తాడు. “దీనిలో అసలు విషయం ఏమిటో నాకర్థం కాలేదు” అంటాడు రోహన్. “అందరూ తమ మూలాలకే చేరుకుంటారు అనేదే ఇందులో సారాంశం” అంటాడు రియాజ్. “ఏడ్చినట్టుంది” అంటాడు రోహన్. చిన్న వయసులో రియాజ్‌కి ఉన్న పరిణతి రోహన్‌కి లేదు. కొందరికి చిన్న వయసులోనే జీవితం అర్థమవుతుంది. కొందరు అనుభవం ద్వారా నేర్చుకుంటారు.

రియాజ్ ఎక్వేరియంలో చేపలను పెంచుతూ ఉంటాడు. మొదట్లో మమ్మో “ఈ చేపల్ని ఇలా బంధించి ఉంచటం ఎందుకు? సముద్రంలో వదిలేయొచ్చు కదా” అంటుంది. “అక్కడ పెద్ద చేపలు వాటిని తినేస్తాయి. ఇక్కడైతే హాయిగా ఉండొచ్చు” అంటాడు రియాజ్. “ఖైదులో జీవితం కూడా ఒక జీవితమేనా” అంటుంది మమ్మో. తర్వాత తనకు ఈ దేశంలోనే కాదు, తన అక్క ఇంట్లో కూడా తనకి చోటు లేదని అనిపించినపుడు “ఈ చేపలు ఈ చిన్న తొట్టెలో ఎంత హాయిగా ఉన్నాయి. వీటిని ఎవరూ ఇక్కడ నుంచి తీసేయలేరు” అంటుంది. జీవితం మన దృక్పథం మీద ఆధారపడి ఉంటుందని చెప్పటానికే ఈ సన్నివేశం. ముందు స్వతంత్రం కావాలి అనిపిస్తుంది. ఒక్కోసారి ఇంత కూడు, ఇంత గూడు ఉంటే చాలు అనిపిస్తుంది.

మమ్మో లాంటి వారికి ప్రభుత్వాలు అడ్డుపడుతుంటాయి. దేశభద్రత ముఖ్యం కాబట్టి దాన్ని తప్పుబట్టలేం. ఇవి చరిత్ర మిగిల్చిన గాయాలు. అయితే వారి నిస్సహాయతను సొమ్ము చేసుకునేవారు కూడా ఉంటారు. డబ్బులిస్తే జీవితకాల వీసా ఇస్తామని ఆశపెడతారు. వేరే దారిలేక వారిని నమ్మితే పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియదు. ప్రభుత్వాలు ఎలా ఉన్నా ఈ మోసగాళ్ళని చూసి మనసు వికలం అవుతుంది. మమ్మో అక్క దగ్గర ఉండిపోవాలనే కోరిక నెరవేరిందా? రియాజ్ తన తండ్రిని కలుసుకున్నాడా? ఈ ప్రశ్నలకి సమాధానాలు కావాలంటే చిత్రం చూడవలసిందే.

ఉపకథగా శాంతాబాయ్ అనే పనిమనిషి కథ వస్తుంది. ఆమె ఫయ్యాజీ ఇంటిలో పాచిపని చేస్తుంది. ఒకరోజు ఆలస్యంగా వస్తుంది. ఫయ్యాజీ అప్పటికే తిట్టుకుంటూ ఉంటుంది. మమ్మో శాంతాబాయ్ ముఖం మీద కమిలిపోయిన గాయాలు గమనిస్తుంది. “నీ మొగుడు కొట్టాడు కదా! వాణ్ణి వదిలేయవచ్చు కదా” అంటుంది. “వదిలేసి ఎక్కడికి వెళతాను?” అంటుందామె. తర్వాత ఫయ్యాజీ మమ్మోతో “పనివాళ్ళ విషయాల్లో తలదూర్చకు” అంటుంది. మమ్మో పెత్తనాలు చేస్తుందని అనుకుంటాం కానీ అందరినీ కలుపుకునిపోయే స్వభావం. పనిమనిషి గురించి వ్యాకులపడుతుంది. ఇలా ఉండటం మంచిదా లేక ఫయ్యాజీ లాగ మనకెందుకులే అనుకోవటం మంచిదా? కొందరు తమ కుటుంబం బాగుంటే చాలు అనుకుంటారు. కొందరు అందరూ నావారే అనుకుంటారు. తర్వాత మమ్మో శాంతాబాయ్ భర్తని కలిసే సన్నివేశం హాస్యం పండిస్తుంది. మమ్మో ఒకసారి టాక్సీలో వెళుతూ డ్రైవర్‌తో మాట కలుపుతుంది. అతను యూపీకి చెందినవాడని, పెళ్ళాం పిల్లల్ని ఊరిలో వదిలి బొంబాయి వచ్చాడని తెలుస్తుంది. వరదల్లో పంట మునిగిపోయిందని అంటాడు. ఇప్పటికీ రైతు పరిస్థితులు మారకపోవటం నిట్టూర్పు తెప్పిస్తుంది.

ఖాలిద్ మొహమ్మద్ అనే ప్రఖ్యాత పాత్రికేయుడు వ్రాసిన కథ ఈ చిత్రానికి ఆధారం. తన కథే వ్రాసుకున్నట్టు అనిపిస్తుంది. అయితే ఖాలిద్ తల్లి జుబేదా నటి అని, ఆమె అతని పసితనం లోనే మరణించిందనే విషయం మాత్రం నిజం. ఆ కథతో తర్వాత ‘జుబేదా’ అనే వచ్చింది. దానికి కూడా శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించాడు. ఆయన ఎన్నో కళాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ‘అంకుర్’, ‘భూమికా’, ‘మండీ’, ‘సూరజ్ కా సాత్వాఁ ఘోడా’ వాటిలో ప్రధానమైనవి. ‘త్రికాల్’ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. ‘మమ్మో’ చిత్రానికి ఉత్తమ హిందీ భాషా చిత్రంగా జాతీయ అవార్డు వచ్చింది.

ఈ క్రింద ముఖ్యకథతో సంబంధం లేని ఒక సన్నివేశం ప్రస్తావించబడింది. దేశవిభజన సమయంలో ఎలాంటి హృదయవిదారక సంఘటనలు జరిగాయో తెలిపే సన్నివేశమిది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

రియాజ్ “నేను జీవితం గురించి కథలు వ్రాస్తాను” అంటే “మంటో లాగ అన్నమాట” అంటుంది మమ్మో. మంటో కూడా ఏది చూసినా అదే వ్రాసేవాడు అంటుంది. అయితే జీవితంలో కొన్ని అనుభవాలు అసలు ఎదురుకాకుండా ఉంటేనే మంచిది, అంత భయంకరంగా ఉంటాయి అంటుంది. బతికుండగానే నరకం చూశానని అంటుంది. విభజన సమయంలో మమ్మో భర్తతో కలిసి పాకిస్తాన్‌కి నడిచి వెళుతూ ఉంటుంది. ఐదువందల మంది దాకా వారితో ప్రయాణిస్తూ ఉంటారు. ఒకామె ఇద్దరు పసిపిల్లలను తీసుకుని వెళుతూ ఉంటుంది. ఒక బిడ్డ మరణిస్తాడు. అంత్యక్రియలకి ఆస్కారం లేని పరిస్థితి. దారిలో ఒక నది వద్దకు చేరుకోగానే కొందరు ఆమెకి చనిపోయిన బిడ్డని నదిలో జారవిడవమని సలహా ఇస్తారు. ఆమె దుఃఖంలో ఏం చేస్తోందో తెలియని పరిస్థితిలో ఉంటుంది. చనిపోయిన బిడ్డకి బదులు బతికున్న బిడ్డని నదిలో పారవేస్తుంది! “ఆమె వెర్రిచూపులు నాకింకా గుర్తున్నాయి” అంటుంది మమ్మో. పాకిస్తాన్ లాంటి దేశాలు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి. కొందరి స్వార్థప్రయోజనాల కోసం దేశవిభజన జరిగింది. ఇప్పుడు యుద్ధం, ఉగ్రవాదంతో ఎన్ని జీవితాలు నాశనమౌతాయో గ్రహించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కయ్యానికి కాలుదువ్వటం మానుకోవాలి.

Exit mobile version