Site icon Sanchika

మరుగునపడ్డ మాణిక్యాలు – 22: పాసింగ్

[dropcap]1[/dropcap]920వ దశాబ్దంలో ఒకరోజు. న్యూయార్క్ నగరం. ఆమె ఒక బొమ్మల దుకాణంలో కారు బొమ్మలు కొంటుంది. తల మీద ఆడవాళ్ళ టోపీ – పల్చని వస్త్రంతో చేసినది. టోపీ అంచు తన కళ్ళకు కాస్త అడ్డంగా ఉండేటట్టు పెట్టుకుని ఆ అంచులోనుంచి కాస్త బెదురుగా పరిసరాలను గమనిస్తూంది ఆమె. తన కొడుకు అడిగిన రంగులు వేసే పుస్తకం అక్కడ కూడా దొరకట్లేదని తెలిసి నిరాశగా బయటికి వస్తుంది. భరించలేని ఎండ. నిస్సత్తువ ఆవరిస్తుంది. ఎక్కడికన్నా వెళ్ళి కాస్త టీ తాగితే బావుండునని టాక్సీ ఎక్కి ఒక హోటల్‌కి వెళుతుంది. లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టు ఆగి లోపలికి వెళుతుంది. రెస్టారంట్‌లో జనం పలుచగా ఉంటారు. ఆమె కూర్చుని వారిని గమనిస్తుంది. ఎవరి ప్రపంచంలో వారున్నారు. ఆమె ముఖానికి మేకప్ అద్దుకుంటుంది. ఇంతలో ఒక జంట వస్తుంది. అతను ఆమెని కూర్చోబెట్టి వెంటనే వచ్చేస్తానని చెప్పి వెళతాడు. ఆమె ఈమె వంక తదేకంగా చూస్తుంది. ఈమెలో బెదురు పెరుగుతుంది. ఆమె లేచి ఈమె వద్దకు వస్తుంది. ఈమె గభాలున లేస్తుంది. “మీరు నాకు తెలుసు. నన్ను గుర్తుపట్టలేదా రీనీ?” అంటుందామె. ఒక్క క్షణం తేరిపార చూసి “నువ్వు క్లేర్‌వి కదూ” అంటుందీమె. ఈమె పేరు ఐరీన్. చిన్నప్పటి ముద్దుపేరు రీనీ. క్లేర్ “షికాగోలో ఉంటున్నాము. మా ఆయన ఇక్కడికి పని మీద వచ్చాడు. ఇక్కడికి వస్తే పుట్టింటికి వచ్చినట్టుంది. నువ్వు కనపడితే బావుండునని అనుకున్నాను” అంటుంది. ఇంకా కుశలప్రశ్నలు వేస్తుంది. ఐరీన్ “నేను ఇప్పటికీ హార్లెమ్ లోనే ఉంటున్నాను. ఈ వైపుకి ఎక్కువగా రాను” అంటుంది. “న్యూయార్క్‌కి తిరిగి వచ్చేయాలని నా కోరిక” అంటుంది క్లేర్. ఐరీన్ బుర్రని ఒక ప్రశ్న తొలుస్తూ ఉంటుంది. గొంతు తగ్గించి అటూ ఇటూ చూసి “మీ ఆయనకి తెలుసా?” అంటుంది. ‘తెలియదు’ అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది క్లేర్.

ఐరీన్ ఎందుకు బెదురుతూ ఉంది? క్లేర్ తన భర్త దగ్గర ఏం దాచింది? చిత్రం మొదట్లోనే ఏదో రహస్యం ఉంది అనే ఉత్కంఠ మనకి కలుగుతుంది. ఇంతకీ రహస్యం ఏమిటంటే ఐరీన్, క్లేర్ మిశ్రమ జాతికి చెందినవారు. అంటే వారి పూర్వీకుల్లో ఎక్కడో జాత్యంతర వివాహాలు జరిగాయి. అంటే నల్లజాతి వారికి, తెల్లజాతి వారికి మధ్య జరిగిన వివాహాలు. ఐరీన్, క్లేర్ శరీరాలు లేత గోధుమ రంగులో ఉంటాయి. ప్రభుత్వం వారిని శ్వేతేతరులు గానే పరిగణిస్తుంది. ఆ రోజుల్లో ప్రభుత్వమే జాతివివక్ష చూపించేది. శ్వేతేతరులు కొన్ని ప్రదేశాలలోకి రాకూడదని నిబంధనలు ఉండేవి. ఐరీన్ తన కొడుకు అడిగిన పుస్తకం ఎక్కడా దొరకక ఆ ప్రదేశానికి వచ్చింది. ఎవరైనా తన జాతిని గుర్తుపడతారేమోనని బెదురుతూ ఉంది. క్లేర్ తలిదండ్రులు చనిపోయాక ఆమెని తెల్లజాతి బంధువులు పెంచారు. తాను తెల్లజాతికి చెందినదాన్నని చెప్పి ఒక తెల్లజాతి వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. అతను డబ్బున్నవాడు. ఆమె మిశ్రమ జాతికి చెందినదని అతనికి తెలియదు. ‘పాసింగ్’ అంటే ‘చెలామణి అవటం’ అని ఒక అర్థం. క్లేర్ తెల్లజాతి స్త్రీగా చెలామణి అయిపోతూ జీవిస్తూంది. ఐరీన్ నల్లజాతి వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. అవసరమైనపుడు తెల్లజాతి స్త్రీగా నటించి తిరిగి తన జీవితంలోకి వెళ్ళిపోతుంది.

1929లో వచ్చిన ‘పాసింగ్’ నవల ఆధారంగా రెబెకా హాల్ తెరకెక్కించిన ఈ చిత్రం 2021లో విడుదలైంది. నవల వ్రాసిన నెల్లా లార్సెన్ కూడా మిశ్రమ జాతికి చెందినదే. అప్పట్లో తెల్లజాతివారికి ఉండే సౌలభ్యాల కోసం మిశ్రమ జాతికి చెందినవారు తెల్లజాతివారిలా చెలామణి అవటం తరచు జరుగుతుండేది. జాతి అంటే కేవలం శరీరం రంగు మాత్రమే కాదు కదా. సంస్కృతి, సంప్రదాయాలు కూడా జాతిలో భాగమే. నల్లజాతి సంప్రదాయాలతో పెరిగిన వారు తెల్లజాతి వారిగా బతికినా తమ మూలాలని మర్చిపోలేక నలిగిపోయేవారు. పైగా క్షణ క్షణం భయపడుతూ బతకాలి. ఆ సంఘర్షణే ఈ చిత్రం ఇతివృత్తం. ఈ చిత్రం బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటుంది. ఇతివృత్తానికి తగిన ఎంపిక. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం. హిందీ శబ్దానువాదం కూడా అందుబాటులో ఉంది.

క్లేర్ ఐరీన్‌ని తమ హోటల్ గదికి తీసుకెళుతుంది. తనకో కూతురు ఉందని, ఆ పిల్ల తన గర్భంలో ఉండగా తాను ఎంతో భయపడ్డానని అంటుంది. ఎందుకు? ఆ పిల్ల ఒంటి రంగు నల్లగా ఉంటుందేమోనని. అయితే ఆ పిల్ల లేత గోధుమ రంగులోనే పుడుతుంది. ఐరీన్ కూడా తనలా నటిస్తూ తెల్లజాతి వ్యక్తిని పెళ్ళి చేసుకుందని క్లేర్ అనుకుంటుంది. కాదంటుంది ఐరీన్. “నువ్వు ఎప్పుడూ తెల్లజాతి స్త్రీలా చెలామణి అవ్వాలని అనుకోలేదా?” లేదంటుంది ఐరీన్. “నేను చెల్లించిన మూల్యానికి నాకు పూర్తిగా నేను కోరుకున్నదే దక్కింది” అంటుంది క్లేర్. ఇంతలో క్లేర్ భర్త జాన్ వస్తాడు. ఐరీన్‌ని తెల్లజాతి స్త్రీ అనే అనుకుంటాడు. మాటల్లో అతనికి నల్లజాతి వారంటే అసహ్యమని తెలుస్తుంది. ‘నిగర్స్’ అనే అభ్యంతరకర పదం వాడతాడు. నీగ్రో అనే పదానికి ఇంకో రూపమే నిగర్. కొన్ని పదాలు అవమానకరంగా వాడటం వల్ల కొన్నాళ్ళకి తిట్టులాగ అనిపిస్తాయి. ఇదీ అంతే. “క్లేర్‌కి నల్లజాతివారంటే నాకన్నా ఎక్కువ అసహ్యం” అంటాడతను. క్లేర్ ఐరీన్ వంక తానేదో ఘనకార్యం చేసినట్టు చూస్తుంది. ఐరీన్‌కి కంపరం పుడుతుంది. ఇంటికి తిరిగి వస్తుంది. భర్తని కౌగిలించుకుని ఊరట పొందుతుంది.

డబ్బున్న భర్త కోసం అబద్ధం చెప్పింది క్లేర్. మామూలు అబద్ధం కాదు, ఆమె గురించి నిజం తెలిస్తే ఆమె భర్త ఆమె ముఖం కూడా చూడడు. అతనిది జాత్యహంకారమే, కానీ అది అతని స్వంత విషయం. క్లేర్ అబద్ధం చెప్పటం ఎప్పటికైనా తప్పే. ఆమె సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ మరోసారి గర్భం ధరించటానికి కూడా భయపడుతూ ఉంటుంది. అలాంటి మూల్యం చెల్లించి బతికే బతుకూ ఒక బతుకేనా? పైగా భర్త జాత్యహంకారాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. క్లేర్ విలాసవంతమైన జీవితం చూసి ఐరీన్‌కి ఆమె మీద కొంత అసూయ కలుగుతుంది. క్లేర్ భర్తని కలిశాక ఆ అసూయ ద్వేషంగా మారుతుంది. ఐరీన్ జీవితం బాగానే ఉంటుంది. ఆమె భర్త డాక్టరు. ఇద్దరు కొడుకులు. చక్కని ఇల్లు. “ఇంకాస్త డబ్బుంటే బావుండేది” అంటుందామె క్లేర్‌తో. ఈ ‘ఇంకాస్త ఇంకాస్త’ అనుకోవటంలోనే మనిషికి సంతృప్తి లేకుండా పోతుంది.

కొన్నాళ్ళకి క్లేర్ కుటుంబం న్యూయార్క్‌కి నివాసం వస్తుంది. ఆమె ఐరీన్‌కి ఉత్తరం వ్రాస్తుంది. ఐరీన్ ఆ ఉత్తరం తెరవదు. ఆమెకి క్లేర్ భర్త నల్లజాతి వారిని ఉద్దేశించి నిగర్స్ అనే పదం వాడటంతో కోపంగా ఉంటుంది. “అతను నిన్ను అనలేదుగా” అంటాడు ఆమె భర్త బ్రయన్. “నా గురించి తెలిసుంటే నన్నూ తప్పకుండా అనేవాడు. క్లేర్‌తో మళ్ళీ పరిచయం పెంచుకుంటే ఆ ముచ్చటా తీరుతుంది” అంటుందామె. బ్రయన్ ఐరీన్ అనుమతితో ఉత్తరం తెరిచి చదువుతాడు. “ఈ పాలిపోయిన (తెలుపు ఇప్పుడు పాలిపోయినట్టుంది) జీవితంలో నేను ఒకప్పుడు సంతోషంగా వదిలించుకుని వచ్చిన వర్ణరంజితమైన దృశ్యాలను ఊహించుకుంటూ కాలం గడుపుతున్నాను. నువ్వు ఎంచుకున్న మార్గం సహేతుకమైనదని, అమితానందదాయకమైనదని నాకనిపిస్తోంది” అని క్లేర్ వ్రాస్తుంది. ఐరీన్‌కి చిర్రెత్తుకొస్తుంది. బ్రయన్ “ఇది చాలా నాటకీయంగా ఉంది” అని నవ్వుతాడు. ఇంకా చదువుతాడు. “నిన్ను కలిసుండకపోతే నాలో ఈ వెర్రి కాంక్ష కలిగేది కాదు” అని వ్రాసి ఉంటుంది. బ్రయన్ “ఇది మరీ బావుంది. వెర్రి కాంక్షట. నీ దోషమట. అసలు జవాబు ఇవ్వకు” అంటాడు. మళ్ళీ “వీళ్ళందరూ తిరిగి వచ్చేవారే” అంటాడు. “అంత కష్టపడి అటువైపు వెళ్ళి మళ్ళీ తిరిగి రావటమెందుకో?” అంటుందామె. “అదే తెలిస్తే జాతి అనేదానికి అర్థం తెలిసినట్టే” అంటాడతను. ఇది ఎంతో గొప్ప మాట. ఎందుకు మనుషులు తమ మూలాలకి వెళ్ళాలనుకుంటారు? అది జన్యుపరమైన ఇచ్ఛా? పెరిగిన వాతావరణం ప్రభావమా? పంచభక్ష్యపరమాన్నాలు తింటున్నా అమ్మ చేతి ఆవకాయ కోసం ఎందుకు అర్రులు చాస్తారు? విలాసాలలో మునిగి తేలుతున్నా సొంతూరిని, సొంతవారిని ఎందుకు తలచుకుంటూ ఉంటారు? అదంతే. దానికి హేతుబద్ధమైన కారణం ఉండదు. “తెల్లవారిగా చెలామణి అవుతూ తృప్తిగా ఉండొచ్చుగా” అంటుందామె. “తృప్తి ఎవరికి ఉంది?” అంటాడతను. కాస్త ఆలోచించి “నాకు తృప్తి ఉంది” అంటుందామె. కొన్నాళ్ళకి క్లేర్ మళ్ళీ ఐరీన్ జీవితంలోకి ప్రవేశిస్తుంది.

ఒకపక్క జాత్యహంకార దాడుల గురించి వార్తలు పేపర్లో వస్తూ ఉంటాయి. బ్రయన్ తన కొడుకులకి వాటి గురించి చెబుతాడు. ఈ విషయాలు ఇప్పుడే తెలియాలి అంటాడు. “ఈ దేశం మనల్ని బతకనివ్వదు” అంటాడు. నిజంగానే ఆరోజుల్లో అమెరికాలో జాతివివక్ష దారుణంగా ఉండేది. అమెరికా వదిలి వేరే దేశం వెళ్ళిపోదామని భార్యాభర్తలు అనుకుంటారు. అంత తేలిక కాదు కదా! ఐరీన్‌కి పిల్లలకి జాతి వివక్ష గురించి చెప్పటం ఇష్టం ఉండదు. జాతివివక్ష ఇంత ఎక్కువగా ఉంటే తెల్లవారిగా చెలామణి అయ్యే అవకాశం ఉన్నవారు అలా చేయటంలో తప్పు లేదు కదా అనిపిస్తుంది. చిత్రంలో ఇంకో ఉపకథ ఉంటుంది. తెల్లజాతికి చెందిన ఒక రచయిత నల్లజాతి వారి గురించి పుస్తకాలు వ్రాస్తూ ఉంటాడు. వాటి కోసం నల్లజాతి వారిని గమనించటానికి హార్లెమ్‌కి వస్తూ ఉంటాడు. హార్లెమ్ నల్లజాతి వారు ఎక్కువగా ఉండే ప్రదేశం. అతను మొదటిసారి క్లేర్‌ని చూసినపుడు ఆమె తెల్లజాతి స్త్రీ అనుకుంటాడు. క్లేర్‌కి అతని పుస్తకాలు అంతగా నచ్చవు. అందుకని ఆమె అతన్ని పట్టించుకోదు. ఆమె మిశ్రమ జాతికి చెందినదని తెలిసి అతను ఐరీన్‌తో “నాకు తెలియనే లేదు. నీకు అలాంటి వాళ్ళని చూడగానే తెలిసిపోతుందా?” అంటాడు. ఆమెకి చిరాకేస్తుంది. “ఇదేదో నేషనల్ జాగ్రఫిక్ పత్రికకి వ్రాసే వ్యాసంలా పరిగణిస్తున్నట్టున్నావు” అంటుంది. బయట నుంచి చూసేవారికి ఇదంతా వింతగా ఉంటుంది. కానీ ఇందులోని భావోద్వేగాలు అనుభవించేవారికే తెలుస్తాయి.

క్లేర్ తన ఉత్తరానికి ఐరీన్ నుంచి జవాబు రాకపోవటంతో ఒకరోజు ఐరీన్ ఇంటికి వస్తుంది. ఐరీన్ అప్పటికి నల్లజాతివారి కోసం ఒక పార్టీకి సన్నాహాలు చేస్తూ ఉంటుంది. “నువ్విక్కడికి వచ్చావని తెలిస్తే నీ భర్తతో ఎంత ప్రమాదమో నీకు తెలుసు కదా” అంటుంది క్లేర్‌తో. క్లేర్ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఐరీన్ జాలిపడుతుంది. క్లేర్ ఐరీన్‌తో “నువ్వు స్వేచ్ఛాజీవివి. నిశ్చింతగా ఉన్నావు” అంటుంది. “ఎవరూ పూర్తి స్వేచ్ఛగా, నిశ్చింతగా ఉండరు” అంటుంది క్లేర్. ఇది అక్షరసత్యం. ఎవరికైనా కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఉండాలి. కానీ క్లేర్ తనకు తానే బందిఖానా విధించుకుంది. అది ఆమె స్వయంకృతాపరాధం. పార్టీ గురించి విని “నాకు నల్లజాతివారితో మాట్లాడాలని, వారి నవ్వులు వినాలని కోరిక. జాన్ కోసం నా మనసు చంపుకుంటున్నాను. జాన్‌నే చంపేస్తే గొడవ వదిలిపోతుంది” అంటుంది క్లేర్. ఐరీన్ ఆ మాటని తేలిగ్గా కొట్టిపారేస్తుంది. క్లేర్ పార్టీకి తానూ వస్తానంటుంది. మొదట వద్దన్నా తర్వాత ఒప్పుకుంటుంది ఐరీన్. భర్తకి చెబితే “ఆ తిక్క మనిషిని ఎందుకు ఆహ్వానించావు?” అంటాడు. అయితే అతనితో సహా పార్టీలో అందర్నీ క్లేర్ సమ్మోహనపరుస్తుంది.

ఐరీన్‌కి కూడా క్లేర్ పట్ల శృంగారభావాలు కలుగుతాయి. ఆమెలో ఒకరకమైన సంఘర్షణ మొదలౌతుంది. క్లేర్ తెల్లజాతి స్త్రీగా జీవించటం, నల్లజాతి వారితో కలసిమెలసిపోవటం, తన భర్తని ఆకర్షించటం, తనని కూడా మోహింపచేయటంతో ఐరీన్‌కి క్లేర్ మీద అక్కసు, తన మీద తనకే రోత పుడతాయి. క్లేర్ అన్ని విధాలుగా మంచి జీవితం గడుపుతోందని ఆమెకనిపిస్తుంది. తానేదో కోల్పోతున్నాననే భావన కలుగుతుంది. ఒకరోజు క్లేర్ “నేను చెడ్డదానిని. నాకు కావలసినదాని కోసం ఎంతకైనా తెగిస్తాను” అంటుంది. అలా ఎవరైనా అంటే వారి మీద సానుభూతి కలగటం సహజం. అలా ఒప్పుకోగలగటం కూడా గొప్పే. ఐరీన్‌కి క్లేర్ కూడా ఎంతో క్షోభని అనుభవిస్తోందని అర్థమౌతుంది. ఆమె మీద జాలి కలుగుతుంది. ఇద్దరూ మంచి మనుషులే. క్లేర్ లాంటివాళ్ళు తమ తప్పులని పైకి చెప్పుకుంటారు. ఐరీన్ లాంటివాళ్ళు తప్పు చేయాలంటే జంకుతారు. పరిస్థితులు ప్రతికూలంగా మారిపోతే తప్పు చేయకుండా ఉండగలగటం అందరికీ సాధ్యమేనా?

ఐరీన్‌గా టెసా థాంప్సన్, క్లేర్‌గా రూత్ నెగా నటించారు. రూత్ నెగా కళ్ళతోనే ఎన్నో భావాలు పలికిస్తుంది. ఆమెకు ఉత్తమ సహాయనటిగా ఆస్కార్ నామినేషన్ రాకపోవటం అన్యాయం అని అనిపిస్తుంది. రెబెకా హాల్ స్క్రీన్ ప్లే వ్రాసి దర్శకత్వం వహించింది. నటిగా మంచి పేరు సంపాదించిన ఆమెకి దర్శకురాలిగా ఇదే తొలి చిత్రం. దర్శకత్వంలో ఎంతో నైపుణ్యం కనిపిస్తుంది. కళా దర్శకత్వం గురించి, దుస్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ కాలంలో ఎలాంటి వస్తువులు వాడేవారో అవే ఐరీన్ ఇంట్లో కనిపిస్తాయి. అలాగే దుస్తులు కూడా. ముఖ్యంగా ఆడవాళ్ళ టొపీలు. మగవాళ్ళ టోపీలు ఒకేలా ఉంటాయి. ఆడవాళ్లవి రకరకాల హంగులతో ఉంటాయి. అప్పట్లో టోపీలు పెట్టుకోకుండా బయటకి వెళ్ళేవారు కాదు.

ఈ క్రింద చిత్ర కథ ఇంకొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత క్రింది విశ్లేషణ చదవవచ్చు. క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించేముందు మరో హెచ్చరిక ఉంటుంది.

క్లేర్ కూతురు స్విట్జర్లండ్‌లో ఒక బోర్డింగ్ స్కూల్లో చదువుతూ ఉంటుంది. ఆమెను చూడటానికి క్లేర్ వెళుతుంది. ఒకరోజు బ్రయన్ మళ్ళీ జాత్యహంకార దాడుల గురించి తన కొడుక్కి చెబుతాడు. అది తెలిసి ఐరీన్ అతణ్ణి నిలదీస్తుంది. “ఈ దేశం వదిలి వెళ్ళిపోతేనే గానీ మనశ్శాంతి ఉండదు” అంటాడు బ్రయన్. “క్లేర్ ఉన్నప్పుడు నీకు అంతా బానే ఉంటుంది. ఆమె కనబడకపోయే సరికి నీలో నిస్పృహ వస్తుంది” అంటుంది ఐరీన్. బ్రయన్ “మధ్యలో క్లేర్ ప్రస్తావన ఎందుకొచ్చింది” అని విసుగు చూపిస్తాడు. అయినా అతనికి క్లేర్ ఐరీన్ కన్నా నాగరికమైనదనే భావం ఉంటుంది. అది గమనించే ఐరీన్ అసహనంగా ఉంటుంది.

పైన ప్రస్తావించిన తెల్లజాతి రచయిత కోసం ఒక టీ పార్టీ ఏర్పాటు చేస్తారు బ్రయన్, ఐరీన్. ఆ రచయితకి క్లేర్ అంటే పడదు కాబట్టి క్లేర్‌ని ఆహ్వానించదు ఐరీన్. అయితే బ్రయన్ ఆమెని ఆహ్వానిస్తాడు. దీంతో ఐరీన్ ఇంకా కుంగిపోతుంది. ఒకరోజు వీధిలో ఐరీన్‌కి జాన్ ఎదురుపడతాడు. ఆమెతో పాటు ఆమె స్నేహితురాలు ఉంటుంది. ఆమె నల్లజాతి స్త్రీ. ఆమెని చూసిన జాన్‌కి ఐరీన్ మిశ్రమజాతి స్త్రీ అని అర్థమౌతుంది. ఐరీన్ తన భార్యకి తెలుసంటే తన భార్య కూడా మిశ్రమజాతి స్త్రీయే అని జాన్‌కి అవగతమౌతుంది. ఐరీన్ గబగబా ఇంటికి వచ్చి క్లేర్‌కి ఫోన్ చేస్తుంది, జాన్‌కి రహస్యం తెలిసిపోయిందని చెప్పాలని. అయితే క్లేర్ ఇంటిలో లేకపోవటంతో చెప్పలేకపోతుంది. ఆ తర్వాత క్లేర్‌తో కలిసి ఒక పార్టీకి వెళుతుంది కానీ ఆ విషయం చెప్పదు. అంటే క్లేర్ మీద ఉన్న ద్వేషంతో ఆమె చెప్పకూడదని నిర్ణయించుకుంది. “నీ భర్తకి విషయం తెలిస్తే ఏం చేస్తావో ఎప్పుడైనా ఆలోచించావా?” అని అడుగుతుంది. “హార్లెమ్‌కి వచ్చి ఉండిపోతాను” అంటుంది క్లేర్.

ఐరీన్ తన స్వార్థంతో క్లేర్ ని హెచ్చరించకుండా ఉండిపోతుంది. తన భర్తని వలలో వేసుకుంది అని భావించి అక్కసు ప్రదర్శించింది. జాన్ ఎంత ప్రమాదకరమైన మనిషో ఐరీన్‌కి తెలుసు. అయినా ఆమెకి తన జీవితమే ముఖ్యం. ఏమన్నా జరిగితే “క్లేర్ చేసినదానికి అనుభవించింది” అని తేలికగా అనేయవచ్చు. మనిషి స్వార్థంలో ఒక్కోసారి విజ్ఞత కోల్పోతాడు. దాని పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించే వివేకం ఉండదు. “నా చేతికి మట్టి అంటనంత వరకు ఏం జరిగినా పర్వాలేదు” అనుకుంటాడు. ఐరీన్‌కి ఎక్కడో ఒక మూల క్లేర్ శిక్షించబడాలి అనే కోరిక ఉంది.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. ముగింపు తెలుసుకోవద్దనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

క్లేర్, ఐరీన్, బ్రయన్ పార్టీలో ఉండగా జాన్ వస్తాడు. క్లేర్ ని చూసి “నువ్వు మోసగత్తెవి” అని అరుస్తూ ఆమె మీదకి వస్తాడు. బ్రయన్ అతన్ని ఆపటానికి ప్రయత్నించినా లాభం ఉండదు. క్లేర్‌ని కొట్టబోతుంటే ఐరీన్ ఆమెకి దెబ్బ తగలకుండా వెనక్కి తోస్తుంది. వెనకే ఒక చిన్న బాల్కనీ ఉంటుంది. క్లేర్ ఆ బాల్కనీ మీద నుంచి కింద పడి మరణిస్తుంది. పోలీసులు వస్తారు. బ్రయన్ “జాన్ క్లేర్‌ని తోశాడు” అని చెబుతాడు. ఐరీన్‌ని అడిగితే “ఆమె ప్రమాదవశాత్తూ తూలి కింద పడింది” అని చెబుతుంది. జాన్ షాక్‌లో కూర్చుని ఉండిపోతాడు.

అసలేం జరిగిందనేది ప్రేక్షకుడికి కూడా సరిగా చూపించలేదు దర్శకురాలు. ఎందుకంటే ఏం జరిగిందనేది ముఖ్యం కాదు. ఐరీన్ క్లేర్‌ని హెచ్చరించకపోవటం వల్లే ఈ పరిణామాలు జరిగాయి. ఐరీన్‌కి ఈ సంగతి తెలుసు. తనని తాను క్షమించుకోగలదా? తన కుటుంబం ముఖ్యమా లేక ఒక మనిషి ప్రాణం ముఖ్యమా అంటే మనిషి ప్రాణమే ముఖ్యం అని అనుకోగలిగితేనే అది మానవత్వం. ఆ పాటి మానవత్వం ఉన్నవాళ్ళు తక్కువ అని చెప్పటమే ఈ కథ ఉద్దేశం. క్లేర్ అబద్ధం చెప్పటానికి సమాజం ఒక కారణం కాదా? అందరికీ రక్షణ ఉంటే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? క్లేర్ రాజీపడిపోయి ఉంటే కథ వేరేలా ఉండేది. కానీ మనిషి ఎందులో అయినా రాజీ పడతాడేమో కానీ తన మూలాల విషయంలో రాజీ పడలేడు. ఆ పరిస్థితి ఎవరికీ రాకూడదు. అలాంటి పరిస్థితులు ఉంటే ఎంత అభివృద్ధి సాధించి మాత్రం ఏం లాభం? ఇప్పటికీ అమెరికాలో జాతివివక్ష ఉంది. అది పోవాలంటే ఇంకో వందేళ్ళు పట్టవచ్చు.

Exit mobile version