Site icon Sanchika

మరుగునపడ్డ మాణిక్యాలు – 24: లిటిల్ మిస్ సన్‌షైన్

[dropcap]మ[/dropcap]నిషికి ఎన్నో ఆశలుంటాయి. కొందరు ఆశల్ని సాకారం చేసుకుంటారు. కొందరు విఫలం అవుతారు. కొందరు అన్నీ ఉన్నా ప్రేమ లేక పరితపిస్తూ ఉంటారు. కొందరు ప్రేమ ఉన్నా డబ్బు లేదని బాధపడుతుంటారు. వీళ్ళందరి కన్నా భిన్నమైన వాళ్ళు ‘విజయం సాధించటం ఎలా’ అని పాఠాలు చెప్పేవారు. వారు ఇతరుల ఆశల్ని సాకారం చేస్తామని చెబుతారు. వారు తమ పాఠాల్ని తామే పాటించి తమ ఆశల్ని సాకారం చేసుకోవచ్చు కదా. అలా చేసుకోలేకపోతే వారు ఇతరులకి పాఠాలు చెప్పటానికి అర్హులేనా? ఈ రకరకాల మనుషుల కథే ‘లిటిల్ మిస్ సన్‌షైన్’ (2006). డిస్నీ+ హాట్ స్టార్‌లో లభ్యం. పెద్దలకు మాత్రమే.

షెరిల్ చిన్న ఉద్యోగం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. ఆమె భర్త రిచర్డ్ ‘విజయం సాధించటం ఎలా’ అని శిక్షణ ఇస్తూ ఉంటాడు కానీ పెద్దగా రాబడి ఉండదు. అతను తన గెలుపు సూత్రాలను ఒక పుస్తకంగా అచ్చు వేయించటానికి ఒక ఏజెంట్ ద్వారా ప్రయత్నిస్తూ ఉంటాడు. రిచర్డ్ పుస్తకం అచ్చయితే తమ అర్థిక ఇబ్బందులన్నీ తీరిపోతాయని షెరిల్ ఆశ. షెరిల్, రిచర్డ్ లకు ఇద్దరు పిల్లలు. డ్వేన్ పదిహేను-పదహారేళ్ళ వాడు. ఆలివ్ ఏడేళ్ళది. డ్వేన్‌కి జెట్ విమానాలు నడపాలని కోరిక. తత్వవేత్తల పుస్తకాలు చదువుతూ ఉంటాడు. టీనేజ్‌లో ఉండే అసహనం ఉంటుంది. ఇంట్లో ఉన్న పరిస్థితులు చూసి నిరాశగా ఉంటాడు. ఎవరితోనూ మాట్లాడనని శపథం చేస్తాడు. అలాగే ఉంటాడు కూడా. ఆలివ్‌కి అందాల పోటీలంటే ఆసక్తి. అందాల పోటీలలో నెగ్గిన యువతల వీడియోలు చూస్తూ వారిని అనుకరిస్తూ ఉంటుంది. చిన్న పిల్లల అందాల పోటీలలో పాల్గొంటూ ఉంటుంది. రిచర్డ్ తండ్రి ఎడ్విన్ వారితో ఉంటాడు. నోరు మంచిది కాదు. బూతులు మాట్లాడుతూ ఉంటాడు. దొంగచాటుగా డ్రగ్స్ తీసుకుంటాడు. అయితే ఆలివ్ అంటే అమితమైన ప్రేమ. ఆమెకి డ్యాన్స్ ఎలా చేయాలో నేర్పిస్తూ ఉంటాడు.

షెరిల్ అన్న ఫ్రాంక్ ఒక ప్రొఫెసర్. స్వలింగప్రియుడు. తన విద్యార్థిని ఒకతన్ని ప్రేమిస్తాడు. అయితే అతను వేరే ప్రొఫెసర్‌ని ప్రేమిస్తాడు. ఫ్రాంక్ అక్కసుతో ఆ ప్రొఫెసర్‌ని దుర్భాషలాడటంతో ఫ్రాంక్ ఉద్యోగం పోతుంది. తర్వాత ఆ ప్రొఫెసర్‌కి పెద్ద పురస్కారం వస్తుంది. దీంతో ఫ్రాంక్ కుంగిపోయి ఆత్మహత్యకి ప్రయత్నిస్తాడు. అతను ఒంటరిగా ఉంటే ప్రమాదమని డాక్టర్ చెప్పటంతో అతన్ని తన ఇంటికి తీసుకువస్తుంది షెరిల్. రిచర్డ్‌కి ఫ్రాంక్ జీవితపోరాటం చేయలేక అత్మహత్యకి ప్రయత్నించాడని చిన్నచూపు. ఆ మాటే అంటాడు. ఫ్రాంక్ ఆ మాటకి నొచ్చుకుంటాడు. రిచర్డ్ మీద కోపం వస్తుంది కానీ ఏమీ అనలేని పరిస్థితి. ఎడ్విన్‌కి స్వలింగప్రియులంటే చిన్నచూపు. డ్వేన్‌కి తన తండ్రి అసమర్థుడని చిన్నచూపు. రిచర్డ్‌కి డ్వేన్ తన మాట వినడని కోపం ఉంటుంది కానీ పైకి అతన్ని సమర్థిస్తున్నట్టు మాట్లాడతాడు. వీళ్ళందరి మధ్య సమన్వయకర్త లాగా ఉంటుంది షెరిల్. ఎవరూ ఎవరితో గొడవపడకుండా చూస్తూ ఉంటుంది.

ఆలివ్ పాల్గొన్న ఒక స్థానిక అందాలపోటీలో విజేత అర్హురాలు కాదని తేలడంతో ఆలివ్‌కి ‘లిటిల్ మిస్ సన్‌షైన్’ అనే పైస్థాయి పోటీలో పాల్గొనే అవకాశం వస్తుంది. రెండు రోజుల్లో 800 వందల మైళ్ళ దూరం ఉన్న నగరానికి చేరుకోవాలి. విమానంలో వెళ్ళే స్తోమత లేదు. ఒక పాత వ్యాన్ ఉంటుంది. అందులో వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. డ్యాన్స్ నేర్పించినది తానే కాబట్టి తానూ వస్తానంటాడు ఎడ్విన్. ఫ్రాంక్‌ని, డ్వేన్‌ని కూడా తీసుకుని ఉదయమే బయలుదేరతారు. దారిలో అల్పాహారం కోసం ఆగుతారు. అక్కడ అందరూ తమకి కావల్సినవి ఆర్డర్ చేస్తారు. ఆలివ్ వోఫెల్స్ విత్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తుంది. రిచర్డ్ “ఐస్ క్రీమ్ తింటే లావైపోతారు” అంటాడు. షెరిల్ అతన్ని వారిస్తుంది. “నువ్వు లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా అది నీ ఇష్టం. ఎలా ఉన్నా పర్వాలేదు” అంటుంది. రిచర్డ్ మనస్తత్వం ఇక్కడ స్పష్టమవుతుంది. అన్నిటికీ నిబంధనలు పెట్టుకుని జీవిస్తాడు. నిబంధనలు అవరసమే కానీ మరీ కఠినంగా ఉండకూడదు. తర్వాత ఒక అందాల పోటీ విజేత అయిన యువతితో ఆలివ్ మాట్లాడినపుడు “మీకు ఐస్ క్రీమ్ ఇష్టమా?” అని అడుగుతుంది. “నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం” అంటుందామె. పరిమితిలో ఉంటే ఏదైనా ఆస్వాదించవచ్చు.

అల్పాహారం తర్వాత బయల్దేరబోతుంటే వ్యాన్ మొరాయిస్తుంది. రిపేర్‌కి కొన్ని రోజులు పడుతుందని మెకానిక్ చెబుతాడు. అతనే ఓ చిట్కా చెబుతాడు. వ్యాన్‌ని తోసి కాస్త వేగం పుంజుకోగానే మూడో గేరు వేస్తే వెళ్ళిపోవచ్చని అంటాడు. రిచర్డ్ నడుపుతూ ఉంటే అందరూ తోస్తారు. ఒకరి తర్వాత ఒకరు పరుగెత్తి వ్యాన్ ఎక్కుతారు. “నేను ప్రొఫెసర్‌ని అయ్యుండి వ్యాన్లు తోసే పరిస్థితి వచ్చింది” అంటాడు ఫ్రాంక్. జీవితంలో అనుకోని అవాంతరాలు వస్తూ ఉంటాయి. దాటుకుని పోతూ ఉండాలి. రిచర్డ్ తన ఏజెంటుకి ఫోన్ చేస్తే తన పుస్తకం అచ్చు వేయటానికి ప్రచురణకర్త ఒప్పుకోలేదని తెలుస్తుంది. ఇది తెలిసి షెరిల్ రిచర్డ్ మీద కోపంగా ఉంటుంది. ఆశలన్నీ ఆ పుస్తకం మీదే పెట్టుకున్నారు మరి. అందరికీ మంచిమాటలు చెప్పే షెరిల్ కూడా ఆర్థిక రక్షణ లేని పరిస్థితి వచ్చే సరికి నిస్పృహకి లోనవుతుంది. అదే సమయంలో ఫ్రాంక్‌కి తను ప్రేమించిన అబ్బాయి ఒక పెట్రోల్ బంక్ దగ్గర కనపడతాడు. అతను ప్రేమించిన ప్రొఫెసర్‌తో సరదాగా గడపటానికి వెళుతున్నాడని తెలుస్తుంది. ఫ్రాంక్ ఇంకా కుంగిపోతాడు.

రిచర్డ్ పుస్తకం అచ్చు కావట్లేదని తెలిసి ఎడ్విన్ “బాధపడకు. నీ ప్రయత్నం నువ్వు చేశావు. చాలామంది అది కూడా చేయరు. ఎవరో ఎందుకు? నేనే ఏ ఆకాంక్షా లేకుండా జీవితం గడిపేశాను. నిన్ను చూసి గర్వపడుతున్నాను” అంటాడు. తండ్రి అలా మాట్లాడే సరికి రిచర్డ్ సాంత్వన పొందుతాడు. తలిదండ్రులకీ, భార్యకీ ఉన్న తేడా అదే. తలిదండ్రులు పరాజయంలో కూడా ధైర్యం చెబుతారు. భార్య భర్త విజయం సాధించాలని కోరుకుంటుంది. అదే భార్య తన పిల్లలను మాత్రం న్యూనతాభావం కలగకుండా కాపాడుకుంటుంది. భర్త పరాజయాలని పట్టించుకోని భార్య దొరికితే అది అదృష్టమే. ఆ రోజు రాత్రి అందరూ ఒక మోటెల్లో వేరు వేరు గదుల్లో బస చేస్తారు. షెరిల్ రిచర్డ్‌తో దెబ్బలాడుతుంది.

షెరిల్‌కి, రిచర్డ్‌కి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది. అయితే డబ్బు లేదు. అదే వారికి పెద్ద సమస్య. ఫ్రాంక్ ఒక ప్రొఫెసర్. మంచి జీవితం. అయితే ప్రేమ దక్కలేదు. అది అతని సమస్య. ఎడ్విన్ జీవిత చరమాంకంలో ఉన్నాడు. తన కొడుకు బాధ చూడలేడు. ఏమీ చేయలేడు. తన జీవితం వ్యర్థమైందనే బాధతో డ్రగ్స్ తీసుకుంటాడు. డ్వేన్‌కి జీవితమంతా ముందుంది. తన తలిదండ్రుల సమస్యలు చూసి నిరాశ పడతాడు. ఎప్పుడెప్పుడు బయటపడదామా అని చూస్తుంటాడు. వీరందరి మధ్యా జీవితమంటే ఒక రంగుల కల అనుకునే ఆలివ్. ఆశలు అడియాసలు అయినవారు కొందరు. ఆశలు తీరినా ప్రేమ పొందలేనివారు కొందరు. ఆశలు అడియాసలు అయ్యే అవకాశం ఉందని తెలిసినా ‘నా జీవితం అలా కాదులే’ అనుకునేవారు కొందరు. వీరందరి ప్రయాణం చివరకి ఏమయ్యిందనేది మిగతా కథ. ఆలివ్ పోటీలో గెలిచి అందరికీ ఆశలు మళ్ళీ చిగురించేలా చేస్తుందా? అది మాత్రం జరగదని ఇప్పుడే చెప్పేస్తున్నాను. జీవితానికి లక్ష్యాలు పెట్టుకుని అవి సాధిస్తేనే సార్థకత అనుకునే కంటే జీవితాన్ని ఆస్వాదించటమే ముఖ్యం అనే సందేశంతో చిత్రం ముగుస్తుంది. చేసే పనిని ఆస్వాదించాలి. పరాజయాలకి కుంగిపోకూడదు. పడిలేచేవాడే ధీరుడు. అయితే ముగింపు మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది.

అసలు చిన్నపిల్లలకి అందాల పోటీలు పెట్టటం ఏమిటి? చిన్నప్పటి నుంచే వారిలో పోటీ తత్వం పెంచటం ఏమిటి? ‘వారి కంటే ముందుండాలి, వీరి మీద గెలవాలి’ అనే ధోరణి ఎప్పటికీ మంచిది కాదు. ఒక సందర్భంలో డ్వేన్ ఫ్రాంక్‌తో మాట్లాడుతూ “జీవితమంతా ఒక అందాల పోటీలాగ అయిపోయింది. స్కూల్లో పోటీ. కాలేజీలో పోటీ. ఉద్యోగంలో పోటీ. ఇదంతా పట్టించుకోకుండా నాకిష్టమైన పని చేసుకుంటాను. అంతే” అంటాడు. ఇదెంతో ఆరోగ్యకరమైన ధోరణి. ఆలివ్ తన తాతయ్యని “నేను అందంగా ఉన్నానా?” అని అడుగుతుంది. “నువ్వు అందరికన్నా అందమైన అమ్మాయివి” అంటాడు ఎడ్విన్. “నాకు ఓడిపోవాలని లేదు. డాడీకి ఓడిపోయేవాళ్ళంటే అసహ్యం” అంటూ ఏడుస్తుంది ఆలివ్. అంత చిన్న పాప మీద ఆ తండ్రి ఎలాంటి దుష్ప్రభావం చూపించాడో తలచుకుంటే మనసు కుతకుతలాడుతుంది. గెలుపే ముఖ్యం అని అనే రిచర్డ్ తాను ఏమీ సాధించలేకపోయాడు. ‘విజయం సాధించటం ఎలా’ అనే బదులు ‘నచ్చిన పని చేసుకుంటూ బతుకుతాను’ అనుకుంటే విజయం దానంతట అదే వస్తుంది. సమస్య ఏమిటంటే అందరికీ అన్నీ త్వరత్వరగా అయిపోవాలి. అందుకు అడ్డదారులు వెతుకుతూ ఉంటారు. అలా కాకుండా ‘నాకు అనుకూలమైన వేగంతో నేను వెళతాను’ అనుకుంటే ఎవరితోనూ పోటీ ఉండదు.

స్క్రీన్ ప్లే వ్రాసిన మికెల్ ఆర్న్ట్ కి ఉత్తమ స్క్రీన్ ప్లే ఆస్కార్ వచ్చింది. ఒకపక్క నవ్వు తెప్పిస్తూనే కన్నీళ్ళు కూడా తెప్పించే విధంగా కథ నడిపించాడు. భార్యాభర్తలైన వ్యాలెరీ ఫ్యారిస్, జొనాథన్ డేటన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. షెరిల్‌గా టోని కొలెట్, రిచర్డ్‌గా గ్రెగ్ కినియర్, ఫ్రాంక్‌గా స్టీవ్ కరెల్, ఎడ్విన్‌గా ఆలన్ ఆర్కిన్, డ్వేన్‌గా పాల్ డానో, ఆలివ్‌గా ఆబిగెయిల్ బ్రెస్లిన్ నటించారు. పదేళ్ళ వయసులో ఆబిగెయిల్‌కి ఉత్తమ సహాయనటిగా ఆస్కార్ నామినేషన్ వచ్చింది. అయితే అవార్డు రాలేదు. ఆలన్ ఆర్కిన్‌కి ఉత్తమ సహాయనటుడిగా ఆస్కార్ అవార్డు వచ్చింది. పైకి చిర్రుబుర్రులాడే ముసలాయనగా కనిపించినా మంచి మనసున్న తండ్రిగా, తాతగా అతని నటన గుర్తుండిపోతుంది. స్టీవ్ కరెల్ ‘ద ఆఫిస్’ అనే టీవీ సీరీస్‌తో ఎంతో పేరు సంపాదించాడు. టొని కొలెట్ 2018లో వచ్చిన ‘హెరెడిటరీ’ అనీ హారర్ చిత్రంలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. కథ ఇంకాస్త కూడా తెలుసుకోవద్దనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూశాక క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించేముందు ఇంకో హెచ్చరిక ఉంటుంది.

మోటెల్లో ఉండగానే డ్రగ్స్ ఎక్కువ తీసుకోవటంతో నిద్రలో ఎడ్విన్ మరణిస్తాడు. హాస్పటల్‌కి తీసుకెళితే వారు మరణాన్ని ధృవీకరిస్తారు. శవాన్ని తమతో తీసుకెళదామంటే రాష్ట్ర సరిహద్దు దాటటానికి అనుమతి పత్రం తీసుకోవాలి. శవాన్ని వదిలి అందాల పోటీకి వెళదామంటే హాస్పటల్ ఒప్పుకోదు. హాస్పటల్ ప్రతినిధి రిచర్డ్ మీద అసహనం చూపిస్తుంది. “ఇక్కడ చనిపోయింది మీ నాన్న ఒక్కరే కాదు. ఇంకా ఉన్నారు” అని చిరాకుపడుతుంది. అందాల పోటీకి వెళ్ళటం మానేద్దామనే షెరిల్ అంటుంది. అయితే రిచర్డ్ మరో ఓటమిని అంగీకరించే స్థితిలో ఉండడు. పంతంగా ఉంటాడు. ఇంత దూరం వచ్చాక ఆలివ్ పోటీకి వెళ్ళకపోతే ఎడ్విన్ ఆత్మ క్షోభిస్తుందని అంటాడు. “నువ్వు ఇక్కడ ఉండు. మేము వెళతాం” అంటుంది షెరిల్. “శవాన్ని తీసుకుని వెళదాం. అక్కడికి చేరుకోగానే అంత్యక్రియలకి ఏర్పాట్లు చేస్తాను” అంటాడు రిచర్డ్. శవాన్ని కిటికీ లోనుంచి బయటకి తరలించి తీసుకెళతారు. రిచర్డ్ మొండితనానికి ఇది పరాకాష్ట. రిచర్డ్ లాంటి వాళ్ళి దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంటే ఇంకా మొండిగా మారతారు. శవాన్ని వ్యాన్ వెనక దుప్పటి కప్పి పడుకోబెడతారు. దారిలో ఒక పోలీసు వారిని ఆపుతాడు. శవం ఆ పోలీసు కంటపడకుండా ఎలా తప్పించుకున్నారనేది హాస్యాస్పదంగా ఉంటుంది.

హాస్పటల్లో కంటి పరీక్షలకి సంబంధించిన కొన్ని పత్రాలని ఆలివ్ తీసుకుంటుంది. ఇంట్లోనే కంటి పరీక్ష చేసుకునేలా ఆ పత్రాలు ఏర్పాటు చేశారు. ఆ పత్రాలని డ్వేన్‌కి చూపించి పరీక్ష చేస్తుంది ఆలివ్. అతను రంగులని గుర్తించలేకపోతాడు. అంటే అతనికి దృష్టిలోపం ఉంది. ఫ్రాంక్ విషయం తెలిసి విషణ్ణవదనుడౌతాడు. డ్వేన్ ఏమిటని రెట్టిస్తే “దృష్టిలోపం ఉంటే జెట్ విమానాలు నడపటానికి అర్హత ఉండదు” అని చెబుతాడు ఫ్రాంక్. దీంతో డ్వేన్ అమితమైన నిరాశకు లోనై వ్యాన్ ఆపమని గొడవ చేస్తాడు. రోడ్డు పక్కన చతికిలబడి ఏడుస్తూ ఉంటాడు. తల్లి సముదాయించబోతే “ఈ కుటుంబం చెత్త కుటుంబం. ఒక్కరూ సరైన వారు లేరు. నన్ను వదిలిపొండి” అంటాడు. రిచర్డ్ ఆలివ్‌ని వెళ్ళి అన్నతో మాట్లాడమంటాడు. ఆలివ్ అన్న దగ్గరికి వెళ్ళి అతని భుజం మీద చేయి వేసి మాట్లాడకుండా ఉండిపోతుంది. ఒక్కోసారి మనిషి జాలితో పలికిన అనునయ వాక్యాల కంటే బాధని పంచుకునే సానుభూతినే కోరుకుంటాడు. సానుభూతి అంటే ‘నీ బాధ నాకు అర్థమైంది. నీకు నేనున్నాను’ అనే భావాన్ని వ్యక్తీకరించటం. ‘అంతా మంచే జరుగుతుంది’ లాంటి మాటలు అన్ని సందర్భాలలో పనికిరావు. జాలి (sympathy) వేరు, సానుభూతి (empathy) వేరు. ఆలివ్ చూపించింది సానుభూతి. డ్వేన్ దానికి కరిగిపోతాడు. తలిదండ్రుల దగ్గరికి వచ్చి “నేను ఆక్రోశంలో ఏదో అనేశాను. పట్టించుకోవద్దు” అంటాడు. తత్వవేత్తల పుస్తకాలు చదవటంతో అతనిలో పరిణతి కనిపిస్తుంది. “నాకు గాలిలో ఎగరాలని కోరిక. జెట్ విమానాలను నడపటానికి నాకు అర్హత లేకపోతే వేరే దారి ఏదో ఉంటుంది. ఎలాగైనా గాలిలో ఎగురుతాను” అని తర్వాత అంటాడు. ఈ ఆశావహ దృక్పథమే మనిషికి ఊపిరి.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. ముగింపు తెలుకోవద్దనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

అంతా పోటీ జరిగే చోటికి చేరుకుంటారు. రిచర్డ్ తండ్రి శవాన్ని అంత్యక్రియలు చేసేవారికి అప్పగిస్తాడు. షెరిల్ ఆలివ్‌ని పోటీకి తయారు చేస్తూ ఉంటుంది. పోటీలో పాల్గొనే పిల్లలు అసభ్యమైన దుస్తులు, వింత మేకప్పులు వేసుకుని ఉంటారు. ఇదంతా చూసి రిచర్డ్, డ్వేన్, ఫ్రాంక్ లకి వెగటు పుడుతుంది. ఆలివ్ స్టేజి మీద డ్యాన్స్ చేసే సమయం వస్తుంది. ఆలివ్‌ని స్టేజి మీదకి వెళ్ళనివ్వద్దని వారు షెరిల్‌ని ప్రాథేయపడతారు. షెరిల్‌కి కూతుర్ని నిరాశపరచటం ఇష్టం ఉండదు. ఆలివ్ తోటి వారిని చూసి తాను వారిలా సన్నగా లేనని నిరాశ పడుతుంది. కానీ డ్యాన్స్ చేస్తాననే అంటుంది. అయితే స్టేజి మీద ఆలివ్ కొంచెం అసభ్యమైన డ్యాన్స్ చేస్తుంది. ఎడ్విన్ ఆమెకి నేర్పించిన డ్యాన్స్ అదే. డ్యాన్స్ అంటే అతనికి తెలిసినది అదే. ఆ డ్యాన్స్ చూసి కుటుంబమంతా అవాక్కవుతుంది.

నిర్వాహకురాలు ఆ డ్యాన్స్ ఆపించాలని ప్రయత్నిస్తుంది. అయితే రిచర్డ్ స్టేజి మీదకి వెళ్ళి ఆలివ్‌కి ఎవరూ అడ్డుపడకుండా చూస్తాడు. “మీ అమ్మాయిని స్టేజి మీద నుంచి దించండి” అని నిర్వాహకురాలు అరుస్తుంది. రిచర్డ్ మొండిగా తనకొచ్చిన డ్యాన్స్ చేయటం మొదలుపెడతాడు. అతన్ని చూసి కుటుంబం లోని వారందరూ స్టేజి ఎక్కి డ్యాన్స్ చేస్తారు. అంతా రసాభాస అవుతుంది. నిర్వాహకులు ఆలివ్ ఆ రాష్ట్రంలో ఇంకే అందాల పోటీలో పాల్గొనకుండా నిషేధం విధిస్తారు. అసలే అందాల పోటీలంటే వెగటు పుట్టిన వారందరూ “మాకేం అభ్యంతరం లేదు” అని అక్కడి నుండి బయలుదేరతారు.

ఆలివ్‌కి అందాల పోటీలంటే మోజు. దాని వెనక ఎంత వైపరీత్యం ఉందో ఆమెకి తెలియదు. అలాంటి పోటీలలో గెలవకపోవటమే మంచిది. అలాగే జీవితంలో కొన్ని పోటీలు అనారోగ్యకరంగా ఉంటాయి. వాటిలో చేరకపోవటమే మంచిది. ఆలివ్‌కి ఇది అర్థం చేసుకునే వయసు లేదు. మిగతా అందరికీ ఈ విషయం అర్థమవుతుంది. ఆలివ్‌తో “మీ తాతయ్య నిన్ను చూసి గర్వపడేవాడు. బాగా డ్యాన్స్ చేశావు” అంటారు. “ప్రయత్నించటమే విజయం” అని తాతయ్య చెప్పిన మాట ఆమెకి బాగా గుర్తుంది. ఇప్పుడు తండ్రి కూడా తాను గెలవనందుకు నిరాశపడకపోగా బాగా చేశావు అన్నాడు. దీంతో ఆ పాప సంబరపడుతుంది. అయితే ఈ అందాల పోటీలు తన లాంటి వారికి కాదని ఆమెకి తెలిసింది. మన సామర్థ్యాలని బట్టి మనం జీవించాలి కానీ ‘పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు’ ఉండకూడదు. కుటుంబమంతా కలసికట్టుగా ఉంటే సమస్యలని ఎదుర్కోవచ్చు. ఆనందంగా ఉండటం ముఖ్యం కానీ అందరికంటే ముందు ఉండటం ముఖ్యం కాదు.

Exit mobile version