Site icon Sanchika

మరుగునపడ్డ మాణిక్యాలు – 25: ద టూ పోప్స్

[dropcap]ఆ[/dropcap]స్తికులలో చాలామంది ఒక వయసు వచ్చాక ఆత్మవిచారంలో పడతారు. దేవుడు నిర్దేశించినట్టే జీవిస్తున్నామా అని ఆలోచిస్తారు. మరి మతగురువుల సంగతి ఏమిటి? వారికి దేవుడి సాక్షాత్కారం కలిగింది అని ప్రజలు నమ్ముతారు. అయితే వారు ఆత్మవిచారం చేసుకుని వారికి దేవుడితో ఉన్న అనుబంధం బీటలు వారిందని అనిపిస్తే వారేం చేస్తారు? అలా ఆత్మవిచారం చేసుకోవటమే గొప్ప విషయం. అహంకారం పక్కన పెట్టి నిజంగా నేను ఈ పదవికి అర్హుడినా అని ఆలోచించటం ఎంతో అభినందనీయం. క్రైస్తవ మతగురువు పోప్ బెనెడిక్ట్ XVI ఆర్జెంటినాకి చెందిన ఆర్చిబిషప్ బెర్గోలియోని తన వద్దకు పిలిపించుకుని తన అంతరంగాన్ని ఆవిష్కరించటం, ఆ తర్వాత బెర్గోలియో పోప్ ఫ్రాన్సిస్‌గా పదవి చేపట్టటం ‘ద టూ పోప్స్’ (2019) కథాంశం. నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం.

పోప్‌గా పదవి చేపట్టినవారు స్వర్గస్థులయ్యే వరకు ఆ పదవిలో ఉంటారు. అయితే ఈ ఆనవాయితీని పక్కన పెట్టటం గతంలో జరిగింది. కానీ అది చాలా అరుదు. పోప్ బెనెడిక్ట్ XVI 2013లో పదవి నుంచి తప్పుకున్నారు. వివిధ దేశాలకు చెందిన కార్డినల్స్, బిషప్స్ తర్వాతి పోప్‌గా ఆర్చిబిషప్ బెర్గోలియోని ఎన్నుకున్నారు. అయితే 2012లో బెర్గోలియో ఆర్చిబిషప్ పదవికి రాజీనామా చేద్దామని అనుకున్నారు. దీనికి కారణం ఆయనకి ఛాందసంగా మారిపోయిన పద్ధతులు నచ్చకపోవటమే. మారుతున్న కాలంతో పాటు మతగురువులు కూడా మారాలని ఆయన ఉద్దేశం. పాపం పెరిగిపోతుంటే పాపులను అక్కున చేర్చుకోవాలి తప్ప వారిని వెలి వేయకూడదని ఆయన అభిమతం. పోప్ బెనెడిక్ట్ XVI ఆయన్ని రాజీనామా చేయకుండా ఒప్పించారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలే చిత్రంలోని ప్రధాన భాగం.

పోప్ బెనెడిక్ట్ XVI పూర్వాశ్రమ నామం జోసెఫ్ రాట్జింగర్. జెర్మనీకి చెందినవారు. పోప్ జాన్ పాల్ II 2005లో స్వర్గస్థులయ్యాక ఆయన పోప్‌గా ఎన్నుకోబడ్డారు. ఆయనకి పోటీగా నిలిచినవారు ఆర్చిబిషప్ బెర్గోలియో. పోటీ అంటే అభ్యర్థిత్వాన్ని ప్రకటించి చేసే పోటీ కాదు. కార్డినల్స్, బిషప్స్ తమకిష్టమైనవారికి ఓట్లు వేస్తారు. రాట్జింగర్‌కి, బెర్గోలియోకి అందరికన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్లో ఎవరికీ ఆధిక్యత రాలేదు. అయితే బెర్గోలియోకి పోప్ పదవి మీద కాంక్ష లేదు. రెండో రౌండ్లో రాట్జింగర్ గెలిచారు. రాట్జింగర్‌కి బెర్గోలియో పద్ధతులు ఇష్టం లేదు. బెర్గోలియో విడాకులు తీసుకున్నవారిని కూడా ముఖ్యసభ్యులుగా చర్చిలోకి అనుమతిస్తారు. స్వలింగప్రియులని అనుమతిస్తారు. ఫాదర్లు బ్రహ్మచర్యం పాటించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తారు. ఇవన్నీ రాట్జింగర్‌కి నచ్చవు.

2012లో బెర్గోలియో ఛాందసవాదం నచ్చక రాజీనామా చేయటానికి అనుమతి కోరుతారు. ఆయన వ్రాసిన ఉత్తరాలకి పోప్ నుండి సమాధానం రాదు. ఇక లాభం లేదని వాటికన్ సిటీకి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. ఇంతలో పోప్ నుంచి పిలుపు వస్తుంది. ఇది దైవనిర్ణయంగా భావించి ఆయన ప్రయాణమై వెళతారు. అదే సమయానికి పోప్ అధికారనివాసంలో అవినీతి జరిగిందనే ఆరోపణలు వస్తాయి. అరెస్టులు జరుగుతాయి. బెర్గోలియో ఎయిర్‌పోర్ట్‌లో దిగే సమయానికి టీవీలో ఈ వార్తలు సంచలనం రేపుతూ ఉంటాయి. ఆయన్ని తీసుకువెళ్ళటానికి వచ్చిన డ్రైవరు అయన్ని కారు వద్దకి తీసుకువెళతాడు. అతను ఆయన సామాను తీసుకోబోతే ఆయన వారిస్తారు. పోప్ వేసవి విడిదిలో ఉన్నారని డ్రైవరు అక్కడికి కారు పోనిస్తాడు. బెర్గోలియో “వేసవి విడిదా? అందుకే నా ఉత్తరాలు ఆయనకు అందలేదేమో” అని కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తారు. దీని వెనక వేసవి విడిది లాంటి విలాసాలు పోప్‌కి అవసరమా అనే భావం గోచరిస్తుంది. బెర్గోలియో నిరాడంబరంగా బతికే మనిషి. తనకు ఇచ్చిన అధికారనివాసంలో ఉండకుండా వేరుగా ఉంటారు. పోప్ ఇదే విషయం అడిగితే “అంత పెద్ద ఇల్లు నాకెందుకు?” అంటారు. “అయితే మేమందరం ఆడంబరంగా ఉంటున్నామని, మీలా సామాన్యంగా ఉండటం లేదని మీ అభిప్రాయమా?” అని పోప్ అంటారు. “ఎంత సామాన్యంగా జీవించినా ఇంకా సామన్యంగా ఉండే ఆస్కారం ఉంటుంది కదా” అంటారు బెర్గోలియో.

పదవికి రాజీనామా చేసి ఒక సాధారణ ప్రబోధకుడిగా ఉంటానని అంటారు బెర్గోలియో. “నా మీద విమర్శలు చేసేవారిలో మీరు ముందుంటారు కదా” అంటారు పోప్ బెర్గోలియోతో. “మీ మీద పనిగట్టుకుని విమర్శలు చేయలేదు” అంటారు బెర్గోలియో. “ఒకప్పుడు మీరు మార్క్స్ పుస్తకాలని లైబ్రరీ నుంచి తొలగించారు” అంటారు పోప్. “అవును. ఇంకా స్వలింగ వివాహాలు సైతాను పని అని కూడా అన్నాను. కానీ ఇప్పుడు మారాను” అంటారు బెర్గోలియో. “మారారా? రాజీ పడ్డారా? దేవుడు మారడుగా?” అంటారు పోప్. “దేవుడు పాపం పెరిగిన కొద్దీ పాపుల వైపు ప్రయాణిస్తాడు. అంటే దేవుడు కూడా మారినట్టేగా” అంటారు బెర్గోలియో. బాలుర మీద లైంగిక చర్యలకు పాల్పడిన ఫాదర్ల ప్రస్తావన వస్తుంది. “వారి కన్ఫెషన్ తీసుకుని వారిని వేరే చోటికి బదిలీ చేశారు. వారు తప్పుడు పనులు మానలేదు” అంటారు బెర్గోలియో. “కన్ఫెషన్ చేస్తే వారిలో మార్పు వస్తుందని భావించాం” అంటారు పోప్. “విషయం బయటపడితే కొన్ని లక్షల మంది అనుయాయుల్ని కోల్పోతాం కాబట్టి కొందరు పిల్లలకు అన్యాయం జరిగినా పర్వాలేదు అని ఒక బిషప్ నాతో అన్నారు. అరోపణ ఎదుర్కొంటున్న ఫాదర్‌పై వెంటనే న్యాయవిచారణ చేయించమని నేను ఆయనకు సలహా ఇచ్చాను. కన్ఫెషన్ పేరుతో కొన్ని చిలకపలుకులు పలకగానే అంతా మాసిపోతుందా?” అంటారు బెర్గోలియో. “పవిత్రమైన కన్ఫెషన్ అంటే చిలకపలుకులా?” అంటారు పోప్. “కన్ఫెషన్ పాపి మనసుని ప్రక్షాళన చేస్తుందనేది నిజమే. బాధితులకి ఏం ఒరుగుతుంది? పాపం అనేది ఒక మచ్చ కాదు, ఒక గాయం. ఆ గాయానికి వైద్యం చేసి దాన్ని మాన్పాలి. పాపాన్ని క్షమిస్తే సరిపోదు” అంటారు బెర్గోలియో. “తప్పంతా నాదే అంటున్నారు కదా. మీ రాజీనామా ఒక తిరుగుబాటులా ఉంది. మీతో నేనసలు ఏకీభవించను. మీకసలు మతం మీద విశ్వాసం ఉందా అని నాకు అనుమానం వస్తోంది” అంటారు పోప్. బెర్గోలియో అవాక్కవుతారు.

ఆరోజు రాత్రి భోజనాల తర్వాత ఇద్దరూ ఒక గదిలో తారసపడతారు. బెర్గోలియో తన రాజీనామాని ఆమోదించమని కోరితే పోప్ “ఇప్పుడా ప్రస్తావన వద్దు. కాసేపు ప్రశాంతంగా కూర్చుందాం” అంటారు. కాసేపు మౌనంగా ఉన్నాక పోప్ “దేవుడి అభీష్టం వినటం ఒక్కోసారి కష్టం. నేను ఇంకా శ్రద్ధగా వినాలేమో. ఏమంటారు?” అంటారు. పోప్ గొంతులోని ఆవేదన విని బెర్గోలియో నిరుత్తరులవుతారు. ఆయన ఎంతో మథనపడుతున్నారని అనిపిస్తుంది. పోప్ మళ్ళీ “నాకు దివ్యమైన వినికిడి యంత్రం అవసరమేమో. నాకు మొదటిసారి దేవుడి అభీష్టం విన్నపుడు శాంతి కలిగింది. ఎంత శాంతి కలిగిందో” అంటారు. ఆయన గొంతు గద్గదమవుతుంది. “మీకు ఆ అనుభవం కలిగిందా?” అని పోప్ బెర్గోలియోని అడుగుతారు. “దేవుడి పిలుపు అందింది. అది ఒప్పుకుంటాను. కానీ శాంతి మాట నాకు తెలియదు” అంటారు బెర్గోలియో.

బెర్గోలియో చిన్నతనంలోనే మతప్రబోధకుడు కావాలని అనుకున్నారు. అయితే దేవుడి పిలుపు అందలేదు. దాంతో ఆయన ఉద్యోగం చూసుకుని ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకోవటానికి నిశ్చయించుకుంటారు. ఒకరోజు ఆ అమ్మాయిని కలవటానికి వెళుతూ ఉంటే దారిలో ఒక చర్చి కనిపిస్తుంది. లోపలికి వెళతారు. అక్కడున్న ఫాదర్ ఆయన్ని కన్ఫెషన్‌కి ఆహ్వానిస్తారు. “నేను ఇటుగా వెళుతూ లోపలికి వచ్చానంతే” అంటారు బెర్గోలియో. “నాకు ఈ ఉదయం దేవుడు ఒక కన్ఫెషన్ వినమని ఆదేశం ఇచ్చాడు. ఇంతవరకు ఎవరూ రాలేదు. నువ్వు వచ్చావు” అంటారు ఫాదర్. “నేను దేవుడి పిలుపు కోసం ఎదురుచూశాను” అంటారు బెర్గోలియో. “ఆ పిలుపు ఇప్పుడు వచ్చిందని అనిపిస్తోంది” అంటారు ఫాదర్. దానితో బెర్గోలియో అన్నీ వదులుకుని మతప్రబోధకుడిగా మారతారు. ఈ సంఘటన పోప్‌కి చెప్పి “ఆ రోజు చర్చిలోకి వెళ్ళకపోయినా దేవుడి పిలుపు వేరే విధంగా అందేది. నా జీవితపరమార్థం ఇదే” అంటారు. “మీ నమ్మకం గట్టిది” అంటారు పోప్. “ఇప్పుడు దేవుడు నన్ను రాజీనామా చేయమంటున్నాడని కూడా గట్టిగా నమ్ముతున్నాను” అంటారు బెర్గోలియో. పోప్ “ఆ మాట ఇప్పుడు వద్దు” అంటారు.

రాజీనామా చేయొద్దని చెప్పటానికి బెర్గోలియోని పోప్ తన వద్దకు రప్పించుకోవటం ఎందుకు? కాలాంతరంలో పోప్‌కి బెర్గోలియోపై మంచి అభిప్రాయం కలిగింది. ఆయన పద్ధతులు మంచివని అనిపించింది. అయినా అహంకారాన్ని జయించటం కష్టం. అందుకే తమ సమావేశం మొదట్లో పోప్ ఆయనపై అసహనం చూపించారు. తర్వాత మెత్తబడ్డారు. ఆయన ఆత్మవిచారం చేసుకుంటే దేవుడు తన ప్రార్థనలకి స్పందించటం లేదని అనిపించింది. అందుకే ఆయన రాజీనామాకి సిద్ధపడతారు. మరొకరైతే పోప్ ఆవేదనని అర్థం చేసుకునేవారో కాదో! బెర్గోలియో ఆయన ఆవేదనని అర్థం చేసుకుంటారు. అలా అర్థం చేసుకుంటారని తెలిసే పోప్ ఆయన్ని రప్పించారు. తర్వాత ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు (మనకే కాదు, వారికి కూడా) తెలుస్తాయి. వారిద్దరూ ఎంత వినమ్రత కలిగినవారో అర్థమౌతుంది. వినమ్రత లేకపోతే పోప్ పదవి చేపట్టే భాగ్యం వారికి దక్కేది కాదు.

పోప్ బెనెడిక్ట్ XVI గా ఆంథొనీ హాప్కిన్స్, బెర్గోలియోగా జొనాథన్ ప్రైస్ నటించారు. తన ఆవేదనని దాచుకోవటానికి ప్రయత్నిస్తున్న పోప్ పాత్రలో హాప్కిన్స్ నటన గుండెని బరువెక్కిస్తుంది. వినయంగా ఉంటూనే తన అభిప్రాయాలని నిస్సంకోచంగా వ్యక్తపరిచే బెర్గోలియో పాత్రలో ప్రైస్ నటన అద్భుతమనే చెప్పాలి. హాప్కిన్స్‌కి ఉత్తమ సహాయనటుడిగా, ప్రైస్ కి ఉత్తమ నటుడిగా ఆస్కార్ నామినేషన్లు వచ్చాయి. తర్వాతి సంవత్సరం (2020) వచ్చిన ‘ద ఫాదర్’ చిత్రానికి ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకుని 83 ఏళ్ళ హాప్కిన్స్ రికార్డ్ సృష్టించారు. ఆంథొనీ మెకార్టెన్ వ్రాసిన ‘ద పోప్’ అనే నాటకం ఆధారంగా ఆయనే ‘ద టూ పోప్స్’ చిత్రానికి స్క్రీన్ ప్లే వ్రాశారు. ఆస్కార్ నామినేషన్ అందుకున్నారు. హాస్యపు చమక్కులతో స్క్రీన్ ప్లే సాగుతుంది. లాటిన్ భాషలో మాట్లాడితే 20 శాతం మందికి మాత్రమే అర్థమవుతుందని పోప్ ఏమైనా కష్టమైన విషయం చెప్పాలంటే లాటిన్ లో చెబుతానని అంటారు. ఒక సందర్భంలో “మీరు అహంభావంతో మాట్లాడుతున్నారు” అని పోప్ అంటే బెర్గోలియో “ఆర్జెంటినా వాళ్ళు ఆత్మహత్య ఎలా చేసుకుంటారో తెలుసా? తమ అహంభావం పైకి ఎక్కి దూకుతారు” అంటారు. జెర్మనీ, ఆర్జెంటినా మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్‌లో జెర్మనీ ఆటగాడికి గాయమైతే పోప్ బెర్గోలియో వంక “ఇదేం అన్యాయం” అన్నట్టు చూస్తారు. బెర్గోలియో “ఇదంతా మామూలే” అంటారు. తర్వాత ఆర్జెంటినా ఆటగాడికి దెబ్బ తగిలినపుడు బెర్గోలియో నిరసన చూపిస్తే పోప్ “ఇదంతా మామూలే” అంటారు. నవ్వుకోవటం మన వంతు. ఫెర్నాండో మైరెలెస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బ్రెజిల్‌కి చెందిన ఆయన గతంలో ‘సిటీ ఆఫ్ గాడ్’ (2002) అనే చిత్రం ద్వారా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రంలో కళా దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సిస్టీన్ చాపెల్‌ని ఉన్నదున్నట్టు సెట్టు వేశారు. పర్యాటకులు ఉండగా ఆ చాపెల్ లోకి పోప్ నడిచి వచ్చినపుడు పర్యాటకుల ఆనందానికి అవధులుండవు. పోప్ ఎన్నిక ప్రక్రియ ఎలా జరుగుతుందో, ఎన్నికైన పోప్ ప్రసంగం కోసం ఆయన అధికారనివాస ప్రాంగణం ఎలా కిక్కిరిసిపోతుందో ఈ చిత్రంలో అబ్బురపరిచేలా చూపించారు. తిరుగుబాటుకి ప్రతీకగా భావించే ఇటాలియన్ జానపద గీతం ‘బెల్లా చావ్’ ని నేపథ్యగీతంగా వినిపించటం ఒక కొసమెరుపు. ఏ వ్యవస్థ అయినా ఎప్పుడో ఒకప్పుడు తిరుగుబాటు ఎదుర్కొంటుంది.

చిత్రంలోని మరి కొన్ని సన్నివేశాల గురించి ఈ క్రింద ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రంలోని అతి ముఖ్యమైన సన్నివేశం కూడా ప్రస్తావించబడింది.

అవినీతి సంక్షోభం ముదరటంతో పోప్ వాటికన్ సిటీకి తిరిగి వస్తారు. కూడా బెర్గోలియో కూడా వస్తారు. సిస్టీన్ చాపెల్‌లో ఇద్దరూ కలుస్తారు. తాను రాజీనామా చేస్తానని పోప్ అంటారు. బెర్గోలియో ఆశ్చర్యపోతారు. “కొన్నాళ్ళ క్రితమే రాజీనామా చేద్దామని అనుకున్నాను. కానీ తర్వాతి పోప్‌గా బెర్గోలియోని ఎన్నుకుంటే ఎలా అనే ఆలోచన వచ్చి ఆగిపోయాను. మీరు మీ పదవికి రాజీనామా చేశారని తెలిసి సంబరపడ్డాను కూడా. కానీ ఇప్పుడు నేను మారాను. ఒక బెర్గోలియో అవసరం ఇప్పుడు ఉందని అనిపిస్తోంది” అంటారు పోప్. బెర్గోలియో తాను పోప్ పదవికి తగనని అంటారు. తన గతంలో జరిగిన విషయాలు ప్రస్తావిస్తారు.

1976లో ఆర్జెంటినాలో జరిగిన మలిన యుద్ధం (డర్టీ వార్) లో తిరుగుబాటుదారులు ప్రభుత్వాన్ని కూలదోస్తారు. కమ్యూనిస్టు వ్యతిరేక కూటమిగా ఏర్పడతారు. బెర్గోలియో అప్పటికి ఉన్నత స్థాయి మతప్రబోధకుడిగా ఉంటారు. మతప్రబోధకులందరూ ఆయన చెప్పినట్టు వినాలి. ఆయన తిరుగుబాటుదారులకి అనుకూలంగా మారుతారు. మతప్రబోధకులు జనాల్ని పోగేసి వారిని కమ్యూనిస్టులుగా మారుస్తున్నారని తిరుగుబాటుదారుల అభిప్రాయం. బెర్గోలియో కొన్ని మతసంబంధ కార్యక్రమాలు ఆపటానికి ప్రయత్నిస్తారు. అయితే కొందరు ఆయన మాట వినరు. వారికి అండగా ఉండటం మానేసి బెర్గోలియో వారితో తెగతెంపులు చేసుకుంటారు. తిరుగుబాటుదారులు కొందరు మతప్రబోధకులని నిర్బంధిస్తారు. బెర్గోలియో అపరాధబావంతో కుమిలిపోతారు. తర్వాత తిరిగి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడినపుడు బెర్గోలియోని పదవి నుంచి తొలగిస్తారు. ఆయన మారుమూల ప్రాంతంలో మతప్రబోధకుడిగా ఉండి అంచెలంచెలుగా ఎదుగుతారు. దుర్మార్గులైన తిరుగుబాటుదారులకు మద్దతుగా ఉండటం తన తప్పని, తాను పోప్ పదవికి తగనని బెర్గోలియో భావన.

బెర్గోలియో చెప్పిన విషయాన్ని కన్ఫెషన్‌గా భావించి పోప్ ఆయనకి క్షమాపణ ప్రసాదిస్తారు. మనం మానవమాత్రులమే కనుక తప్పులు సహజమే అంటారు. తాను కూడా కన్ఫెషన్ చేస్తానని అంటారు. ఫాదర్ మాసియెల్ అనే ఫాదర్ చేసిన లైంగిక అకృత్యాలు తనకు తెలిసినా తానే చర్యా తీసుకోలేదని అంటారు. బెర్గోలియోకి కోపమొస్తుంది. అయినా “ఇదే మీ రాజీనామాకి కారణమైతే మీరు పదవిలో ఉండి ఈ గాయాన్ని సమర్థంగా మాన్పగలరు” అంటారు బెర్గోలియో. “దేవుడు నా మొర వినటం లేదు. నాకు క్షమాపణ కావాలి. గత రెండు రోజులుగా మీ రూపంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ‘నా ప్రియ సేవకుడా, నువ్విక విరమించు’ అంటున్నాడు” అంటారు పోప్. బెర్గోలియో ఆయనకు క్షమాపణ ఇస్తారు.

విధినిర్వహణలో కొన్నిసార్లు తప్పులని భరించాల్సిన పరిస్థితి వస్తుంది. పోప్ ఫాదర్ మాసియెల్ తప్పులు బయటపెడితే ప్రజలు మతంపై విశ్వాసం కోల్పోతారని అనుకున్నారు. కానీ ఫాదర్ మాసియెల్‌ని శిక్షిస్తే వేరే ఫాదర్లు తప్పు చేయకుండా ఉంటారని, ఆ విధంగా ఎందరో బాలలను కాపాడినవాడినవుతానని ఆయన అనుకోలేదు. స్వార్థాన్ని పక్కన పెట్టి ఆలోచిస్తే మార్గం దొరుకుతుంది. ఎంత పెద్ద ప్రయోజనమైనా అది స్వార్థపూరితమైనది, అమాయకులకు బాధ కలిగించేది అయితే అది ధర్మవిరుద్ధమే. ఇది బెర్గోలియో నమ్మిన సిద్ధాంతం. అందుకే బెర్గోలియో దగ్గర కన్ఫెషన్ చేశారు పోప్. బెర్గోలియో అవసరం మతానికి చాలా ఉందని ఆయనకు రూఢి అయింది. అహంకారాన్ని పక్కన పెట్టి తన తప్పు ఒప్పుకున్నారు. దేవుడు హర్షిస్తాడని ఆయనకి తెలుసు.

మనం కూడా నష్టం వస్తుందని తప్పులు చేయటం, సహించటం మానేయాలి. ఒక్కోసారి బతుకు మీద తీపితో మౌనంగా ఉంటాం. ఏమైనా సరే అధర్మం చేయను అని అనుకుంటే మనశ్శాంతి దొరుకుతుంది. ‘సత్యం’ రామలింగరాజు వంటివారు లాభం కోసం తప్పులు చేస్తూ పోయారు. చివరికి పతనం తప్పలేదు. మన సామర్థ్యం ఏమిటో తెలుసుకుని ఆ పరిధిలో జీవించటమే ఉత్తమం. పదవికి న్యాయం చేయలేకపోతే ఎంత పెద్ద పదవి అయినా  తప్పుకోవటం మంచిది. లేనిపోని భేషజాలకు పోతే పరువు పోతుంది. ఎందరికో అన్యాయం జరుగుతుంది. ఇదే ఈ చిత్రం ఇచ్చే సందేశం.

Exit mobile version