Site icon Sanchika

మరుగునపడ్డ మాణిక్యాలు – 28: పగ్లైట్

[dropcap]చి[/dropcap]న్నవయసులో ఎవరైనా మరణిస్తే ఏ కుటుంబానికైనా పెద్ద పిడుగుపాటులా ఉంటుంది. అయితే ఒక యువకుడు మరణించినా అతని భార్య దుఃఖించకపోతే? యువతీయువకుల్లో వైరాగ్యం ఉన్నవారు తక్కువ ఉంటారు కాబట్టి దానికి వేరే కారణాలుంటాయి. అలాంటి ఒక యువతి కథే ‘పగ్లైట్’ (2021). మొదటిసారి ఈ చిత్రం పేరు విన్నపుడు నాకు అర్థం కాలేదు. ‘పాగల్’, ‘పగ్లా’ అంటే మతితప్పిన మనిషికి వాడే హిందీ పదాలు. ఆ పదాలనే కొంచెం మార్చి పగ్లైట్ అని ఉత్తరభారతంలో వాడతారట. తెలుగులో ‘అదుర్స్’ లాంటి వింతపదాలు పుట్టినట్టే అదీ పుట్టింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం.

సంధ్య, ఆస్తిక్ లకి పెద్దలు పెళ్ళి చేసిన ఆర్నెల్లకే ఆస్తిక్ మరణిస్తాడు. అతను మంచి ఉద్యోగంలో ఉండేవాడు. సంప్రదాయ కుటుంబం. లఖనవూలో ఉంటారు. కథాగమనంలో మనకి తెలిసేదేమిటంటే అతను ఉద్యోగంలో చేరిన తర్వాత తండ్రిని పదవీ విరమణ చేయించాడు. వారికి తాతల నాటి ఇల్లు ఉంది. అయితే అది కోర్టు గొడవల్లో ఉంది. ఆస్తిక్ అప్పు చేసి కొత్త ఇల్లు కొంటాడు. తండ్రి శివేంద్ర తన పీఎఫ్ డబ్బు ఆ కొత్త ఇంటి కోసం ఇస్తాడు. సంధ్య ఆంగ్లంలో ఎమ్.ఏ. చేసింది. ఆస్తిక్‌కి ఒక తమ్ముడు ఉంటాడు. ఆస్తిక్ చనిపోయాక అతనే తలకొరివి పెడతాడు. అతనికి ఆచారాలు అంత నచ్చవు. పైగా అన్న మీద అసూయ కూడా ఉంది. “నేను చస్తే అన్న నాకోసం ఇవన్నీ చేసేవాడా?” అంటాడు స్నేహితుడి దగ్గర. ఆస్తిక్ తల్లి ఉష శోకిస్తూ ఉంటుంది. ఆస్తిక్ నానమ్మ మంచంలో ఉంటుంది. బంధువులు వస్తారు. ఆస్తిక్‌కి వరసకి పెదనాన్న పెద్దరికం వహిస్తాడు. శివేంద్ర చెల్లెలు, తమ్ముడు కుటుంబాలతో వస్తారు. ఉష చెల్లెలు తన కొడుకుతో వస్తుంది. సంధ్య మాత్రం నిర్లిప్తంగా ఉంటుంది. తన గదిలోనే ఉంటుంది.

సంధ్య తలిదండ్రులు వస్తారు. తల్లి కావలించుకుని ఏడుస్తుంటే “ఎంతసేపు ఏడుస్తావు” అంటుంది సంధ్య. ఆస్తిక్ తల్లి వారికోసం టీ పంపిస్తానని అంటే సంధ్య “నా కోసం పెప్సీ తెప్పిస్తారా?” అంటుంది. అత్తగారు ఆశ్చర్యపోయి చూస్తుంది. తల్లి “ఈ సమయంలో పెప్సీయా” అంటుంది. “సరే వద్దులెండి” అంటుంది సంధ్య. మగవాళ్ళు భోజనాలు చేసే సమయంలో సంధ్య షాక్‌లో ఉందని అందరూ అనుకుంటారు. ఆస్తిక్ పెదనాన్న “సంధ్యని మీ వెంట తీసుకెళతారా” అని సంధ్య తండ్రిని అడుగుతాడు. పక్కనే ఉన్న సంధ్య తల్లి “సంధ్య ఇక్కడే ఉంటుంది” అంటుంది. తర్వాత భర్త “సంధ్యని తీసుకెళదామా” అంటే “ఇంకా పెళ్ళి కావలసిన అమ్మాయిలు ఇద్దరు ఉన్నారు. మీకేం తెలియదు” అంటుంది. సంధ్య దగ్గరకు వెళ్ళి దిష్టి తీస్తుంది.

సంధ్య స్నేహితురాలు నాజియా వస్తుంది. ఆమెతో “నాకు ఏడుపు రావటం లేదు. ఆకలి మాత్రం బాగా వేస్తోంది. అందరూ నన్ను వింతగా చూస్తున్నారు. నాకు పారిపోవాలనుంది” అంటుంది సంధ్య. నాజియా ముస్లిం కావటంతో ఆమెకి భోజనం బయటే. ఆమె ఇంటికి వచ్చినపుడు అందరూ వింతగా చూస్తుంటే ఆస్తిక్ తండ్రి మాత్రం “నువ్వు లోపలికి వెళ్ళు. నీ సామాను పంపిస్తాను” అంటాడు, అందరు చుట్టాలకు మర్యాద చేసినట్టే. కానీ ఇతరులు ఆమెని దూరం పెడతారు. ఆమె సంధ్యని అంటిపెట్టుకుని ఉంటుంది. మరణసమయంలో చేయవలసిన వ్యవహారాల కోసం ఆస్తిక్ పత్రాలు చూస్తుంటే సంధ్యకి ఒక యువతి ఫొటో దొరుకుతుంది. దాని వెనక “నా ప్రాణసఖునికి” అని వ్రాసి ఉంటుంది. సంధ్య మనసులో కల్లోలం పుడుతుంది. డాక్టర్ దగ్గరకి వెళ్ళాలనే సాకుతో బయటకి వెళ్ళి నాజియాకి ఆ ఫొటో చూపిస్తుంది. “ఆమెని నేను కలుసుకోవాలి” అంటుంది. “దానివల్ల ఒరిగేదేముంది” అంటుంది నాజియా. ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆస్తిక్ అస్థికలని గంగానదిలో నిమజ్జనం చేసి వచ్చిన ఆస్తిక్ తమ్ముడు “గంగానదిలో అస్థికలు నిమజ్జనం చేయటం వల్ల ఆస్తిక్ పాపాలన్నీ పటాపంచలయిపోయాయని బ్రాహ్మణుడు చెప్పాడు” అని చెబుతూ ఉంటాడు. సంధ్యకి కోపం తారస్థాయికి చేరుకుంటుంది. అయితే ఆ కోపమంతా నాజియా దగ్గరే వెళ్ళగక్కుతుంది.

మర్నాడు ఆస్తిక్ ఆఫీసు వాళ్ళు పరామర్శకు వస్తారు. అందులో ఒకామె సంధ్య చూసిన ఫొటోలో ఉన్నామె! ఆమె పేరు ఆకాంక్ష. సంధ్య అమెని తన గదికి తీసుకెళ్ళి మాట్లాడుతుంది. ఆస్తిక్, ఆకాంక్ష కాలేజీలో ఉండగా ప్రేమించుకున్నారు. ఒకే కంపెనీలో ఉద్యోగాలు వచ్చాయి. అయితే వారి పెళ్ళికి అమె తలిదండ్రులు ఒప్పుకోలేదు. “తలిదండ్రులు ఒప్పుకోలేదని ప్రేమించిన వ్యక్తిని వదులుకున్నావా” అంటుంది సంధ్య. “తలిదండ్రుల కోసం నువ్వు ప్రేమ లేని పెళ్ళి చేసుకోలేదా” అంటుంది ఆకాంక్ష. “నీ ఫొటో దాచుకున్నాడంటే అతను నిన్ను మర్చిపోలేదు. నీవల్లే అతను నన్ను దూరం పెట్టాడు” అంటుంది సంధ్య. “అతను నీకెన్నడూ ద్రోహం చేయలేదు” అంటుంది ఆకాంక్ష.

సంధ్యకి ఆస్తిక్ నుంచి ప్రేమ దక్కలేదు. అతను శారీరకంగా అమెతో కలిశాడా అనేది అస్పష్టం. ఆ విషయం పక్కనపెడితే అతను ఆమెతో సరిగా మాటలాడేవాడు కూడా కాదు. అందుకే ఆమె మనసు మొద్దుబారిపోయింది. అతను మరణించినా ఆమె దుఃఖపడలేదు. ఈ పరిస్థితుల్లో ఆమె ఏం చేస్తుంది? అక్కడ ఉండగలదా? పుట్టింటికి పోదామనుకున్నా తల్లి ఆమెని ఆదరించే పరిస్థితి లేదు. అయినా సంధ్య ఇవన్నీ ఆలోచించదు. ఆకాంక్షని ఆస్తిక్ గురించి అడుగుతుంది. వారిద్దరూ ఎలా ఉండేవారు, ఏం చేసేవారు అని తెలుసుకోవాలని ఆమె ఆరాటం. ఎందుకు అని ఆకాంక్ష అడిగితే ఏవో కొన్ని జ్ఞాపకాల కోసం అంటుంది. మనుషుల మనస్తత్వాలు విచిత్రంగా ఉంటాయి.

డాక్టర్ దగ్గరకని చెప్పి సంధ్య నాజియాతో కలిసి బయటకి వెళ్ళి ఆకాంక్షని కలుస్తూ ఉంటుంది. ఒక సందర్భంలో “ఆస్తిక్ నీతో ప్రేమగా మాట్లాడేవాడా” అని అడుగుతుంది సంధ్య. “కలిసినపుడు ఏం మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడేవాడు. కానీ వాట్సప్, ఈమెయిల్స్ లో ప్రేమ సందేశాలు పెట్టేవాడు” అంటుంది ఆకాంక్ష. ఆమె తన కారులో సంధ్యని తనతో తీసుకువెళ్ళి ఆస్తిక్‌తో కలిసి తిరిగిన ప్రదేశాలు చూపిస్తుంది. ఆమె ఆత్మవిశ్వాసం, హుందాతనం చూసి సంధ్య అబ్బురపడుతుంది. ఉద్యోగం చేసుకుంటూ తన కాళ్ళమీద తాను నిలబడింది. ఒకరోజు ఆమె సంధ్యని తన ఇంటికి తీసుకువెళుతుంది. అధునికమైన ఇల్లు. వంటింట్లో ఆస్తిక్‌కి ఇష్టమైన టీ పొడి డబ్బా ఉంటుంది. అది చూసి సంధ్యకి అనుమానం వస్తుంది. “అతని అవసరాలన్నీ నువ్వు తేర్చేదానివన్నమాట. అందుకే నన్ను దూరం పెట్టాడు” అంటుంది. “అతనెప్పుడూ తప్పుడు పని చేయలేదు. అంత చవకబారుగా మాట్లాడకు” అంటూ ఏడుస్తుంది ఆకాంక్ష. సంధ్య విసవిసా వెళ్ళిపోతుంది.

సంధ్యకి వేరే పెళ్ళి చేయవచ్చు కదా అని అత్తింటి బంధువులు అనుకుంటూ ఉండగా సంధ్య వింటుంది. ఆమెకి బాధ కలుగుతుంది. ఇదిలా ఉండగా బ్యాంక్ ఉద్యోగం చేసే ఆస్తిక్ మేనమామ పూనుకోవటంతో ఆస్తిక్ బీమా పాలసీ తీసుకున్న కంపెనీ ఏజెంట్ ఇంటికి వస్తాడు. పాలసీ ప్రకారం బీమా డబ్బు యాభై లక్షలు సంధ్యకే వస్తుందని అంటాడు ఏజెంటు. సంధ్య సంతకాలు తీసుకుంటాడు. బంధువులంతా ఆశ్చర్యపోతారు. సంధ్య తల్లి మాత్రం సంబరపడుతుంది. తర్వాత “ఇదేం కుటుంబం? నాజియాని దూరం పెడుతున్నారు. నువ్వు బీమా డబ్బుల కోసం సంతకాలు పెడుతుంటే అందరి ముఖాలు మాడిపోయాయి. నువ్విక్కడ మనలేవు. చదువుకున్న దానివి. ఎలాగోలా బతకొచ్చు. మనింటికి వచ్చెయ్” అంటుంది! డబ్బు వచ్చేసరికి ఆమె బుధ్ధి మారిపోయింది. డబ్బు చేజారిపోతుండటంతో ఆస్తిక్ పెదనాన్న, చిన్నాన్న అసహనానికి లోనవుతారు. శివేంద్ర మాత్రం డబ్బు గురించి ఎక్కువ విచారించడు. అయినా వాళ్ళు పట్టు పడతారు. “కొడుకు పోయాడు. ఉద్యోగం లేదు. ఇల్లు కోర్టు గొడవల్లో ఉంది. పీఎఫ్ డబ్బు కొత్త ఇంటికి వాయిదాగా కట్టేశావు. ఇప్పుడు మిగతా వాయిదాలు ఎలా కడతావు” అని అడుగుతారు శివేంద్రని. “ఇండియాలో తిమ్మిని బమ్మిని చేయవచ్చు. బీమా డబ్బులు నీకు వచ్చేలా చూస్తాం” అంటారు. ఇక మనుషుల స్వార్థాల ఆట మొదలవుతుంది.

మొదట్లో అందరూ సంధ్యను వదిలించుకోవాలనే చూశారు. తల్లితో సహా. పుట్టింటికి పంపించే అవకాశం లేదని తెలిసి అత్తింటి బంధువులు మళ్ళీ పెళ్ళి చేయాలనే ఆలోచన చేస్తారు. మతవివక్ష పాటించేవారు రెండో వివాహానికి మాత్రం సై అంటారు. పైగా మాది విశాల దృక్పథం అంటారు. వింతేమిటంటే “నీ అభిప్రాయం ఏమిటి” అని ఎవరూ సంధ్యని అడగలేదు. ఆమె ఇవేవీ పట్టించుకోకుండా ఆస్తిక్ తనకు ఎందుకు దగ్గర కాలేదనే విషయం మీదే దృష్టి పెట్టింది. ఆకాంక్షలా తాను కూడా ఉద్యోగం చేసి ఉండి ఉంటే ఆస్తిక్ ఆమెకి విలువ ఇచ్చేవాడా అనేది ఆమెకి అంతుచిక్కని ప్రశ్న. బీమా డబ్బులు వస్తున్నాయనే సరికి తల్లికి ఆశ పుట్టింది. అత్తింటివారు ఆ డబ్బులు ఎలాగైనా దక్కించుకోవాలని చూశారు. మామగారు మాత్రం ధర్మంగా నిలబడ్డారు. అత్తగారు ఏం చేస్తుంది?

ఉమేష్ బిష్త్ స్క్రీన్ ప్లే వ్రాసి, దర్శకతం వహించాడు. స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది. ఆస్తిక్ పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది కానీ ఆస్తిక్ పాత్ర చిత్రంలో ఉండదు. నాజియా పాత్ర ద్వారా సంధ్య మనసులోని మాటలు మనకి తెలుస్తాయి. చిత్రంలోని ఉపకథల్లో స్క్రీన్ ప్లే గొప్పతనం తెలుస్తుంది. ఆస్తిక్ నానమ్మది ఒక ఉపకథ. ఆమెకి భోజనం, కసరత్తు అన్నీ మంచంలోనే జరుగుతాయి. ఆమె ఏమీ మాట్లాడదు. “ఉషా ఉషా” అని కోడల్ని మాత్రం పిలుస్తూ ఉంటుంది. కోడలు సేవలు చేస్తూ ఆమె ప్రేమని చూరగొంది. కూతురు వచ్చినా ఆమెని చూసి “ఉషా” అంటుంది. సంధ్య కూడా ఆమెకి సేవలు చేస్తూ ఉంటుంది. సంధ్య ఆకాంక్ష ఫొటో అందరి కంటే ముందు ఆమెకే చూపిస్తుంది. తన మనసులో మాటలు చెప్పుకుంటూ ఉంటుంది. ముసలావిడ ఏం మాట్లాడకపోయినా అన్నీ గమనిస్తూ ఉంటుంది. చివరికి ఆమె “సంధ్యా” అని పిలవటం గుండెల్ని మెలిపెడుతుంది. ఇంకో ఉపకథలో శివేంద్ర తమ్ముడికి అన్నగారితో మనస్పర్థలు ఉన్నాయని తెలుస్తుంది. “కొడుకు పోయినట్టు సమాచారం కూడా ఇవ్వలేదు. నన్ను పరాయివాడిగా చూస్తారు” అని దెప్పిపొడుస్తాడు. అతని కొడుక్కి రెస్టారెంట్ పెట్టాలని కోరిక. లోన్ కోసం మేనమామని అడగాలని అనుకుంటూ ఉంటాడు. ఓ పక్క ఆడవారి చిన్న చిన్న తగాదాలు. సంధ్య తల్లి బీమా డబ్బు గురించి ఆత్రపడటం చూసి మిగతా ఆడవాళ్ళు మాట్లాడుకునే సన్నివేశం మనుషుల నైజాలని బైటపెడుతుంది. ఇంకో పక్క టీనేజ్‌లో ఉన్న పిల్లల చిలిపి చేష్టలు. వీటన్నిటినీ కథలో అంతర్భాగంగా చేసుకుంటూ స్క్రీన్ ప్లే నడుస్తుంది. అయితే ఆస్తిక్ తమ్ముడు ఒక సందర్భంలో సంధ్యని ప్రేమించానని చెప్పటం ఎబ్బెట్టుగా అనిపించింది. అందరికీ ఏదో ఒక స్వార్థం ఉంటుందని చెప్పటమే ఉద్దేశమేమో.

ఈ చిత్రం నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయింది. సంధ్యగా సాన్యా మల్హోత్రా నటించింది. ‘దంగల్’లో చిన్న కూతురుగా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. మంచి పాత్రలు చేస్తూ సాగిపోతోంది. శివేంద్రగా సీనియర్ నటుడు ఆశుతోష్ రాణా నటించాడు. ఒకప్పుడు విలన్‌గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డుల్లో ఉత్తమ సహాయనటుడిగా అవార్డు అందుకున్నాడు. ఉషగా షీబా చడ్డా, ఆకాంక్షగా సయానీ గుప్తా, సంధ్య తల్లి పాత్రలో నతాషా రస్తోగీ, ఆస్తిక్ పెదనాన్న పాత్రలో సీనియర్ నటుడు రఘువీర్ యాదవ్ సహజంగా నటించారు. పాటల్లో సంధ్య అంతరంగం ఆవిష్కృతమౌతుంది. భర్త చనిపోయిన తర్వాత అతన్ని తెలుసుకునే ప్రయత్నం చేయటం అనే అంశం పాటల్లో చక్కగా పొందుపరిచారు గీత రచయిత నీలేష్ మిశ్రా. పాటల్ని ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్ స్వరపరిచారు.

ఈ క్రింద చిత్రకథ మరికొంత ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద ముగింపు ప్రస్తావించలేదు.

ఆస్తిక్ తన పేరు మీద బీమా చేయటం, ఆస్తిక్ ఎప్పుడూ తప్పు చేయలేదని ఆకాంక్ష చెప్పటంతో సంధ్య ఆలోచనలో పడుతుంది. అతను తను ప్రేమించిన అమ్మాయిని రోజూ ఆఫీసులో చూస్తూ ఎంతో క్షోభ అనుభవించాడు. కొన్నాళ్ళకి అన్నీ సర్దుకునేవేమో. ఇంతలోనే విధి వక్రించింది. సాన్యా అతన్ని క్షమిస్తుంది. అతను పోయిన పదవరోజున అతనికి పిండప్రదానం చేస్తారు. అతని కోసం ఇంటి ముందు కట్టిన ముంతకి నేల మీదకి జారవిడుస్తారు. ఇది చూసి సాన్యా కన్నీరు పెట్టుకుంటుంది. అప్పటి దాకా రాని కన్నీరు అప్పుడు వస్తుంది.

తమ్ముడు పట్టుబట్టటంతో శివేంద్ర అతనితో కలిసి బీమా ఏజెంట్ తో మాటలాడటానికి వెళతాడు. అతని తమ్ముడు లంచం ఇవ్వజూపి డబ్బు వచ్చేలా చేయమని అడుగుతాడు. బీమా ఏజెంట్ “మీ కోడల్ని మోసం చేయటానికి లంచం ఇస్తారా” అని శివేంద్రని అడుగుతాడు. శివేంద్రకి తల తీసేసినట్టవుతుంది. ఇంటికి వచ్చి ఉషకి చెప్పుకుని బాధపడతాడు. ఆమె ఓదారుస్తుంది. శివేంద్ర తమ్ముడి కొడుకు సంధ్యని పెళ్ళి చేసుకుంటానన్నాడని, తాను సంధ్యతో మాట్లాడానని చెబుతుంది. “నాకు చెప్పకుండా సంధ్యతో మాట్లాడావా? ఈ పెళ్ళికి బదులు నీకెంత డబ్బు ఇస్తానన్నారు వాళ్ళు?” అని ఈసడించుకుంటాడు.

శివేంద్ర కొడుక్కి తన రెస్టారెంట్ కోసం డబ్బు కావాలి. సంధ్యని పెళ్ళి చేసుకుంటే బీమా డబ్బు అతని చేతికొస్తుంది. కొంత శివేంద్రకి ఇచ్చి మిగతాది వాడుకోవచ్చు. మనుషుల స్వార్థాలు ఇలా ఉంటాయి. ఉష ఈ స్వార్థంలో కొట్టుకుపోయింది. శివేంద్ర మాత్రం ఇవన్నీ చూసి మనసు వికలమై ఉండిపోతాడు. సంధ్య ఒప్పుకుంటే అతను చేసేదేమీ ఉండదు. అప్పుడు సంధ్య జీవితం బాగుపడిందని సంతోషించాలా? లేక ఆమె తన కొడుకుని అంత త్వరగా మరచిపోయిందని బాధపడాలా? ఉత్తరభారతంలో పదమూడో రోజు (తేరహ్వీ) శ్రాద్ధకర్మలు చేస్తారు. ఆరోజు రాకముందే ఇంత తతంగం జరుగుతుంటే శివేంద్ర చేష్టలుడిగి ఉండిపోతాడు. తన భార్య కూడా డబ్బు కోసం కోడలికి వేరే పెళ్ళి చేయటానికి సిద్ధపడటం అతనికి మింగుడుపడదు. సంధ్య వరుడితో మాట్లాడుతుంది. అతను ఆమెని ప్రేమించానంటాడు. ప్రేమ లేక పరితపించిన సంధ్య ఆ మాటలకి ఆలోచనలో పడుతుంది. తల్లి “వాడు బీమా డబ్బు కోసం నిన్ను పెళ్ళి చేసుకుంటానంటున్నాడు” అంటుంది. “నాలో ఏం లోపముంది? నేను అతనికి నచ్చానని ఎందుకు అనుకోవు?” అంటుంది సంధ్య. ఆమె తల్లిది కూడా స్వార్థమే. బయటపడదు.

స్త్రీకి భారతీయ సమాజంలో ఇప్పటికీ పూర్తి స్వతంత్రం లేదని ఈ చిత్రం ద్వారా చెప్పారు. పెద్ద నగరాల్లో ఎగువ మధ్యతరగతి మాట ఎలా ఉన్నా చిన్న నగరాల్లో ఇంకా స్త్రీకి సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు లేదు. చిన్నప్పటి నుంచి తలిదండ్రులు పెళ్ళే పరమావధి అని చెబుతారు. ప్రేమించే భర్త దొరికితే పరవాలేదు. లేకపోతే ఏమిటి పరిస్థితి? సంధ్య విషయంలో అందరూ నిర్ణయాలు చేస్తూ ఉంటారు. ఆమెని మాత్రం అడగరు. ప్రేమ లేకుండా పెళ్ళి చేసుకుంటే భోజనం తర్వాత తినాల్సిన మిఠాయి ముందే తినేసినట్టని ఒకసారి సంధ్య అంటుంది. ఆమెకి ప్రేమ ఒక్కటే జీవితాశయమా? ఆస్తిక్, ఆకాంక్షల ప్రేమ చూసి ఆమె అదే కోరుకుంటోందా? ఈ ప్రశ్నకు సమాధానం చివరికి తెలుస్తుంది.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

పదమూడో రోజు శ్రాద్ధకర్మ జరుగుతూ ఉంటుంది. సంధ్య నాజియాని తన దగ్గర కూర్చోబెట్టుకుంటుంది. హోమంలో హవిస్సు వేసేటపుడు అందరూ వేస్తుంటే నాజియాని కూడా వేయమంటుంది. అందరూ వింతగా చూస్తే “మనది విశాల దృక్పథం కదా” అంటుంది. గతంలో వారన్న మాటకి అది ఆమె జవాబు. ఇంతలో శివేంద్ర తమ్ముడి కుటుంబం హడావిడిగా బయలుదేరుతుంది. ఏమిటని ఉష అడిగితే సంధ్య గర్భవతని చెప్పిందని అంటారు. అందరూ ఆశ్చర్యపోతారు. సంధ్య ఆస్తిక్ నానమ్మ దగ్గరకి వెళ్ళి తన మనసులో మాట చెబుతుంది. ఆమె చేతిలో ఒక ఉత్తరం పెట్టి నాజియాతో కలిసి ఇంటిలోనుంచి వెళ్ళిపోతుంది. ఆ ఉత్తరం ద్వారా తెలిసిందేమిటంటే సంధ్య గర్భవతినని అబద్ధం చెప్పింది, వరుడి మనసు తెలుసుకుందామని. అతను వెనకడుగు వేస్తాడు. అతను నిజంగా ప్రేమిస్తే వెనకడుగు వేయడు కదా అంటుంది. యాభై లక్షల చెక్కు మామగారి పేరన రాస్తుంది. కాన్పూర్‌లో ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళుతున్నానని అంటుంది. ఆస్తిక్ లేని లోటు లేకుండా మామగారిని తాను చూసుకుంటాను అంటుంది. సంధ్య వెళుతూ వెళుతూ ఆకాంక్షని కలిసి క్షమాపణ చెబుతుంది.

బీమా డబ్బుల మీద చట్టపరంగా సంధ్యకే హక్కు ఉన్నా నైతికంగా ఆమెకి హక్కు లేదని ఆమెకి తెలుసు. ఆస్తిక్ బాధ్యతగా ఆమె పేరన బీమా చేసినా నిజానికి అతను ఆమెని భార్యగా స్వీకరించలేకపోయాడు. అందుకని ఆమెకి ఆ డబ్బు మీద హక్కులేదనిపించింది. మామగారు ఎంత ధర్మాత్ముడో తెలుసు. ఆయనకి ఆ డబ్బు అవసరం ఉంది. అందుకని ఆ డబ్బు ఆయనకి ఇచ్చేసింది. సంధ్య చేసిన పనికి ఉష కంటతడి పెట్టుకుంటుంది. ఆకాంక్షకి క్షమాపణ చెప్పటం సంధ్య ఔన్నత్యం. తన కాళ్ళ మీద తాను నిలబడగలనని ఆకాంక్షని చూశాకే అనిపించింది.

అంత డబ్బు ఎవరన్నా అలా వదులుకుంటారా అని అనిపించవచ్చు. కళ యొక్క ఉద్దేశం మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయో యథాతథంగా చూపటం కాదు. అలా అయితే టీవీ వార్తలు, వార్తాపత్రికలు చాలు. సినిమాలు, సీరియళ్ళు, కథలు, నవలలు ఎందుకు? ధర్మమేమిటో తెలపటమే ఆ కళారూపాల లక్ష్యం కావాలి. అందరూ చేసేది ధర్మం కాదు. శాస్త్రాలు చెప్పిందే ధర్మం. వేదవ్యాసుడు మహాభారతం ముగిస్తూ “మేం చేసినట్టు చేయకండి. మేం చెప్పినట్టు చేయండి” అన్నాడు. ధర్మాచరణ చాలా కష్టం. కానీ మనశ్శాంతి కావాలంటే ధర్మాచరణ కంటే మార్గం లేదు. ధర్మాన్ని బోధించే కథలు, సినిమాలు ఇంకా రావాలి. కేవలం వినోదమే వాటి లక్ష్యం కాకూడదు. స్వామి వివేకానంద సామాజిక పరివర్తన అనే ఇంజనుకి వేదాంతమే ఇంధనం అన్నాడు. సంధ్య ‘వాళ్ళకు ఈ డబ్బు అవసరం. నాకు ప్రస్తుతం అవసరం లేదు’ అనుకుంది. అంతే కానీ వచ్చిన డబ్బు ఎందుకు వదులుకోవాలి అనుకోలేదు. వేదాంతం వంటపట్టించుకుంటే ధర్మాచరణ సులభం. ఆమె చేసింది దానమేమీ కాదు. పరోపకారం కోసం ఉన్నదంతా ధారపోసినవారున్నారు. అలాంటివారి గురించి వార్తాపత్రికల్లో చదివి అబ్బురపడుతుంటాం. వారితో పోలిస్తే సంధ్య చేసింది పెద్ద త్యాగమేమీ కాదు.

Exit mobile version