మరుగునపడ్డ మాణిక్యాలు – 29: ది ఎడ్జ్ ఆఫ్ సెవెంటీన్

0
2

[dropcap]‘ది[/dropcap] ఎడ్జ్ ఆఫ్ సెవెంటీన్’ (2015) చిత్రం.. అందరిలో ఇమడలేని ఒక అమ్మాయి కథ. ఇది అమెరికాలో జరిగే కథ కాబట్టి అక్కడి సంస్కృతే సినిమాలో కూడా కనిపిస్తుంది. టీనేజిలోనే లైంగిక కార్యకలాపాలు, నడివయసులో కూడా తోడు కోసం పలువురితో డేటింగ్ వంటివి అక్కడ మామూలే. ఇవన్నీ సగటు భారతీయుడికి ఇబ్బందిగా ఉండవచ్చు. అయితే కథలోని ప్రధానాంశం ఆలోచన రేకెత్తిస్తుంది. ఆ అంశమేమిటో చెప్పేస్తే చిత్రం ముగింపు ముందే చెప్పేసినట్టవుతుంది. కాబట్టి ఇప్పుడే చెప్పను. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం.

చిత్రం మొదట్లో నేడీన్ అనే పదిహేడేళ్ళ అమ్మాయి తన స్కూల్ (అమెరికాలో పద్దెనిమిదేళ్ళు వచ్చేవరకు చదివే చదువు స్కూల్ చదువు కిందే లెక్క) కి లంచ్ టైమ్‌లో కార్లో వచ్చి తన తరగతి గదికి హడావిడిగా వెళుతుంది. అక్కడ అధ్యాపకుడు బ్రూనర్ ఒక్కడే లంచ్ (భోజనం అనే పదం నప్పదు) చేస్తూ ఉంటాడు. నేడీన్ అతని ముందు కూర్చుని “నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. కాలో చెయ్యో విరిగి మంచం మీద పడకుండా ప్రాణం పోయేలా ఏదో ఒకటి చేస్తాను. పెద్దవారికి ఎవరికైనా చెప్పాలని మీకు చెబుతున్నాను” అంటుంది. బ్రూనర్ చలించడు. “నేను కూడా అదే ఆలోచనలో ఉన్నాను. సూసైడ్ నోట్ రాస్తున్నాను. దాని సారాంశమేమిటంటే ‘నాకు లభించే ప్రశాంతమైన ముప్పై రెండు నిమిషాల సమయంలో కూడా ఎప్పుడూ విచిత్రమైన బట్టలు వేసుకునే ఒక అమ్మాయి నాకు ప్రశాంతత లేకుండా చేస్తోంది. కాబట్టి నేను చచ్చిపోయి అనంతమైన శూన్యంలోని వెళ్ళిపోతున్నాను. అక్కడ సేదతీరుతాను’ అని” అంటాడు. నేడీన్ అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వటం లేదని అతని ఉద్దేశం. “నేను నిజంగా ఆత్మహత్య చేసుకుంటే మీ ఉద్యోగం ఊడిపోవటం ఖాయం” అంటుందామె. “అదే నా కోరిక. జరుగుతుందో లేదో” అంటాడతను.

అతనికి ఆ ఉద్యోగం మీద విరక్తి కలిగిందా? ఆమె బాధ అర్థం చేసుకునే సౌజన్యం లేదా? ఇంతకీ ఆమె బాధ ఏమిటి? ఆమెకి చిన్నప్పటి నుంచి స్కూల్ అంటే ద్వేషం. ఆమె అన్న డారియన్ మాత్రం తోటి పిల్లలతో ఆనందంగా కలిసిపోతాడు. తల్లి ఆమెని బలవంతంగా స్కూల్‌కి పంపించాలని చూస్తుంది. తండ్రి ఆమెని బుజ్జగించి స్కూల్‌కి పంపిస్తాడు. తోటిపిల్లలు ఆమెని ఏడిపిస్తూ ఉంటారు. ఒకరోజు క్రిస్టా అనే అమ్మాయి పరిచయమవుతుంది. ఇద్దరూ స్నేహితులవుతారు. నేడీన్ తండ్రి ఆమెని అల్లారుముద్దుగా చూసుకుంటూ ఉంటాడు. ఆమె పదమూడేళ్ళ వయసులో ఉండగా తండ్రి హఠాత్తుగా మరణిస్తాడు. ఆమె కుంగిపోతుంది. అతికష్టం మీద రోజులు వెళ్ళదీస్తూ ఉంటుంది. క్రిస్టా ఆమెకి తోడుగా ఉంటుంది. అదొక్కటే ఆమెకి ఊరట. డారియన్ ఆనందంగా స్కూల్ జీవితం గడుపుతూ ఉంటాడు. అన్న అంటే నేడీన్‌కి అక్కసు. ఇది క్రిస్టాకి తెలుసు. నేడీన్‌కి స్టైల్ గా ఉండే నిక్ అంటే ఆకర్షణ. అయితే బెరుకు. ఎర్విన్ అనే అబ్బాయి తరగతిలో ఆమెతో మాట్లాడతాడు కానీ నేడీన్ అంటీముట్టనట్టు ఉంటుంది. అధ్యాపకుడు బ్రూనర్‌తో అప్పుడప్పుడూ మాట్లాడుతుంటుంది. అతను టీచర్ ఉద్యోగంలో విసిగిపోయి ఉన్నాడని ఆమె అభిప్రాయం. అతను ఆమెకి నవ్వుతూనే చురకలంటిస్తూ ఉంటాడు.

ఒక వారాంతం నేడీన్ తల్లి ఒకతనితో కలిసి సరదాగా గడపటానికి వెళుతుంది. ఇల్లు ఖాళీగా ఉండటంతో ఇష్టానుసారం గడపవచ్చని నేడీన్, క్రిస్టా అనుకుంటారు. రాత్రి వేళ నేడీన్ మద్యం తాగి వాంతి చేసుకుని పడుకుంటుంది. క్రిస్టా మేడపై నుంచి కిందకి వస్తే అక్కడ డారియన్ పెంపుడు కుక్క విసర్జించిన మూత్రాన్ని తుడుస్తూ ఉంటాడు. ఇద్దరూ మాటల్లో పడతారు. పొద్దున్న నవ్వులు వినపడి నేడీన్ డారియన్ గది తలుపు తీస్తే అతను క్రిస్టాతో మంచంలో ఉంటాడు. తర్వాత క్రిస్టా “ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియలేదు” అంటుంది. “నువ్వు నా ప్రాణస్నేహితురాలివి. నీ తప్పేం లేదు” అని నేడీన్ అన్న దగ్గరికి వెళ్ళి “నువ్వంటే నాకు అసహ్యం” అంటుంది. అతను పెద్దగా పట్టించుకోడు. అతను, క్రిస్టా ఒకరికొకరు నచ్చటంతో డేటింగ్ మొదలుపెడతారు.

టీనేజిలో ఉండే అసహనం నేడీన్‌లో కనపడుతుంది. దానికి తోడు ఆమెకి ఆత్మవిశ్వాసం తక్కువ. మద్యం తాగిన తర్వాత వాంతి చేసుకుంటూ ఆమె క్రిస్టాతో “నేను పనికిమాలిన దాన్ని. నేనంటే నీకెందుకు ఇష్టం? మొన్నొకసారి నా గొంతు రికార్డింగ్‌లో విన్నాను. ఎంత దారుణంగా ఉందో! జీవితమంతా నాతో నేనే ఎలా ఉండాలో” అంటుంది. చాలామంది టీనేజి పిల్లలు ఏదో ఒక న్యూనతాభావంతో ఉంటారు (తమ గొంతు తామే విని అసహ్యించుకోవటం అనేది బహుశా చాలామందికి అనుభవమే). జీవితం అగమ్యగోచరంగా అనిపిస్తుంది. వారికి సరైన దిశానిర్దేశం చేసే వారు ఉండాలి. నేడీన్ తల్లి తన సంతోషం తాను వెతుక్కుంటోంది. డారియన్ ఇంకా చిన్నవాడే. నేడీన్ ఎప్పుడూ అతనితో గొడవపడుతూ ఉంటుంది. అతను కూడా మాటకు మాట అంటాడు. పైగా అతనికి బోలెడు స్నేహితులు. అది చూసి నేడీన్ అసూయపడుతూ ఉంటుంది. క్రిస్టా ఒక్కతే నేడీన్‌కి తోడుగా ఉంటుంది. ఇప్పుడు క్రిస్టా డారియన్‌తో ప్రేమాయణం మొదలుపెట్టింది. ఆ ద్రోహం నేడీన్ భరించలేకపోతుంది.

వారి ప్రేమాయణం ముదరటంతో నేడీన్ “డారియన్ కావాలా, నేను కావాలా తేల్చుకో” అంటుంది క్రిస్టాతో. ఇద్దరూ కావాలంటుంది క్రిస్టా. అలా కుదరదని స్నేహాన్ని తెంచేస్తుంది నేడీన్. ఇంటికొచ్చాక డారియన్ దగ్గరకి వెళ్ళి “నాన్న పోయినపుడు నువ్వు ఏడ్చి ఏడ్చి నీ దిండు తడిసిపోతే నా దిండు పట్టుకొచ్చి ఇచ్చాను. నువ్వు నన్నలా ఎందుకు ప్రేమించలేవు? నీకు వేరే మనిషిని ప్రేమించటం తెలిస్తే కదా” అంటుంది. “పెద్ద ఆరిందాలా మాట్లాడుతున్నావు” అంటాడు డారియన్. ఇద్దరూ గొడవపడుతుంటే తల్లి వచ్చి ఆపుతుంది. నేడీన్ బయటకి వెళ్ళిపోతుంది. “ఇంత గొడవ పడుతూ క్రిస్టాతో డేటింగ్ అవసరమా” అంటుంది వారి తల్లి డారియన్‌తో. “అదేం ప్రశ్న? నేడీన్‌కి నచ్చచెప్పొచ్చుగా” అంటాడు డారియన్. “అది నా మాట వినదు. అయినా నువ్వు సరైన మార్గమే ఎంచుకుంటావులే” అంటుందామె. మర్నాడు కూతుర్ని సముదాయించటానికి ప్రయత్నిస్తుంది. “నేను కుంగిపోయి ఉన్నపుడు ఏం చేస్తానో చెబుతాను. అందరూ నాలాగే బతుకు ఈడుస్తున్నారని, కానీ పైకి అంతా బాగున్నట్టు నటిస్తున్నారని అనుకుంటాను” అంటుంది. స్కూల్‌కి వెళితే ఎవరూ తోడు లేక లంచ్ సమయంలో బ్రూనర్ దగ్గరకు వస్తుంది. “నాతోటి వాళ్ళందరూ ఫోన్లతో కాలం వెళ్ళబుచ్చే సన్నాసులు. పనికిమాలినవాళ్ళు. నేను పాత తరం మనిషిని. పాత సినిమాలు, పాత పాటలు నాకిష్టం. నాకూ, ఈ తరం వారికీ పొసగదు” అంటుంది. “వాళ్ళకి నువ్వంటే ఇష్టం లేదేమో” అంటాడతను. నేడీన్‌కి చిర్రెత్తుకొస్తుంది. పెళ్ళీ పెటాకులూ లేక తక్కువ జీతానికి పని చేసుకుంటున్న సగటు మనిషివని అంటుంది. అతను కాస్త తగ్గి ఆమెని సముదాయిస్తాడు.

నేడీన్ క్రిస్టాతో స్నేహం తెంచుకోవటానికి కారణం ఏమిటి? ఆమె తన తోటివారితో ఇమడలేదు. క్రిస్టా డారియన్‌తో కలిసి అతని స్నేహితుల బృందంలో చేరిపోవటం ఆమెకి రుచించదు. పైగా నేడీన్ పెద్ద అందగత్తె కాదు. అందమైనవారికి, చలాకీగా ఉండేవారికి అందరూ ఆకర్షితులవుతారు. కొందరు స్వభావసిద్ధంగా గుంపులో ఇమడలేక వేరుగా ఉండిపోతారు. తనతోనే ఎప్పుడూ ఉండే క్రిస్టా కాస్తా దూరమవటంతో నేడీన్ మరింత కుంగిపోయింది. ఆమెని పూర్తిగా దూరం చేసుకుంటే తనకే నష్టమని ఆలోచించలేదు. కారణం డారియన్. అతనికి తనంటే అసలు ప్రేమ లేదని నేడీన్ అభిప్రాయం. క్రిస్టాని తనకి దూరం చేయటమే దానికి నిదర్శమని ఆమె అనుకుంటుంది. కావాలనే చేశాడని, తనని మరింత ఒంటరిని చేశాడని ఆమె కోపం. ఇక ఆమె తల్లిది మరో కథ. ఆమె ఒకతన్ని నమ్మి అతనితో వెళుతుంది. అతను పెళ్ళయినవాడని తర్వాత తెలుస్తుంది. ఆమె కూడా కుంగిపోతుంది. కూతురికి అండగా ఉండాల్సిన తల్లి తానే తప్పటడుగులు వేస్తుంది. ఒక తోడు ఉంటేనే సంతోషమనుకునే సంస్కృతి. పిల్లల బాధ్యత ఒంటరిగా చూసుకోలేనితనం. కొడుకు మీద మాత్రం నమ్మకం. బ్రూనర్ ఎందుకు నేడీన్‌ని రెచ్చగొడుతూ ఉంటాడు? అతను కూడా ఉద్యోగంలో అసంతృప్తిగా ఉన్నాడని నేడీన్ ఒక నిశ్చయానికి వస్తుంది. ఆ అసంతృప్తి తన మీద చూపిస్తున్నాడనుకుంటుంది.

స్టైల్‌గా, కాస్త పొగరుగా ఉండే నిక్‌తో పరిచయం పెంచుకుంటుంది నేడీన్. అతనితో ఉంటే తాను ధైర్యంగా ఉండొచ్చని ఆమె భావన. ఆ భావన తనలో ఉందని తనకే తెలియని అమాయకత్వం. ఎర్విన్ ఆమెతో పరిచయం పెంచుకోవాలని చూస్తాడు కానీ అతను తనకంటే అర్భకంగా ఉన్నాడని అతన్ని పట్టించుకోదు. ఎవరూ తనకు తోడుగా లేనపుడు మాత్రం అతనితో సమయం గడుపుతుంది. ఒకరకంగా అతన్ని వాడుకుంటుంది. తాను కోరినది దొరకక, ఉన్న స్నేహితురాలిని దూరం చేసుకుని, తన వెంటపడే వాడిని పట్టించుకోక ఎప్పుడూ అసహనంగా ఉంటుంది నేడీన్. చివరికి జరిగే పరిణామాలు ఆమెకి మనిషిగా ఎదిగే అవకాశాన్ని ఇస్తాయి. అవేమిటనేది చూస్తేనే బావుంటుంది.

మామూలుగా టీనేజి కథల్లో అమ్మాయి లేదా అబ్బాయి తమకెదురైన సవాళ్ళని దాటుకుని విజయం సాధిస్తారని చూపిస్తారు. ఈ కథ అందుకు భిన్నంగా ఉంటుంది. ప్రతి పాత్ర చివరికి మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. నేడీన్‌గా హేలీ స్టైన్ ఫెల్డ్ నటించింది. ‘ట్రూ గ్రిట్’ (2010) అనే వెస్టర్న్ చిత్రంలో నటించి పద్నాలుగేళ్ళ వయసులోనే ఉత్తమ సహాయనటి విభాగంలో ఆస్కార్ నామినేషన్ అందుకుంది. ఈ చిత్రంలో ఆమె నటన కట్టిపడేస్తుంది. మిగతా నటులందరూ సహాయపాత్రల్లోనే నటించినా స్క్రీన్ ప్లే లో ఉన్న కొత్తదనంతో అందరికీ ప్రాధాన్యం లభించింది. ముఖ్యంగా బ్రూనర్ పాత్ర వేసిన వుడీ హారెల్సన్ గుర్తుండిపోతాడు. టీవీలోనూ, సినిమాల్లోనూ జీవితంలో ఉండే ఎత్తుపల్లాల్లోని హాస్యాన్ని చూపించి ఖ్యాతి గడించిన జేమ్స్ బ్రూక్స్ ఈ చిత్రానికి ఒక నిర్మాత. స్క్రీన్ ప్లే, దర్శకత్వం కెల్లీ ఫ్రెమన్ క్రెగ్. ఆమెకి ఇదే తొలి చిత్రం. ‘ఎడ్జ్’ అంటే అంచు. ఈ పదం కాస్త ‘ఏజ్’ లా కూడా వినిపిస్తుంది. ‘ఏజ్’ అంటే వయసు. పదిహేడేళ్ళ ప్రాయం ఒక అంచు లాంటిది. జాగ్రత్తగా దాటాలి.

ఈ క్రింద చిత్రకథ మరికొంత ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించేముందు ఇంకో హెచ్చరిక ఉంటుంది.

నేడీన్ ఒకరోజు మొండిగా ప్రవర్తిస్తుండటంతో ఆమె తల్లి ఆమెని తన ఆఫీసుకి తీసుకెళుతుంది. నేడీన్ ప్రవర్తన భరించలేక “మీ నాన్న నిన్నిలా చూసి ఉంటే ఎంతో నిరాశపడేవారు” అంటుంది. ఆ మాటతో నేడీన్ మనసు గాయపడి ఉన్మాదం లోకి దిగుతుంది. తల్లి కారు తీసుకుని వెళ్ళిపోతుంది. నిక్‌కి ఫేస్‌బుక్‌లో “నువ్వొక్కడివే నన్ను అర్థం చేసుకున్నావు. మనది జన్మజన్మల బంధం. నీతో సెక్స్ చేయటానికి నేను సిద్ధం” అని మెసేజ్ పెడుతుంది. మెసేజ్ పంపేముందు ఆగిపోతుంది. పంపకూడదని అనుకుంటుంది కానీ ప్రమాదవశాతూ ‘సెండ్’ నొక్కేస్తుంది. తన మీద తనకే అసహ్యం వేసి బ్రూనర్ దగ్గరకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటానని అంటుంది. అతను మొదట వ్యంగ్యంగా మాట్లాడతాడు. కానీ తర్వాత నిక్‌కి పంపిన మెసేజ్ చూపించగా ఆమె మనఃస్థితి బాగాలేదని తెలుసుకుంటాడు. ఆమె కంగారుపడుతూ ఉంటుంది. అతను ఆమెని సముదాయించి “అంతా అదే సర్దుకుంటుంది. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఏమైనా అవసరమైతే నాకు ఫోన్ చెయ్యి” అని చెప్పి పంపిస్తాడు.

నిక్ నేడీన్‌కి “నీ మెసేజ్ చూశాను. సాయంత్రం కలుద్దాం” అని మెసేజ్ పంపిస్తాడు. నేడీన్ అతను తన గురించి అందరికీ చెప్పి తన పరువుతీస్తాడని అనుకుంది. కానీ అతను తీయగా సమాధానం ఇచ్చేసరికి ఆమె సంబరపడుతుంది. చక్కగా తయారై అతని దగ్గరకి వెళుతుంది. ఆమె తల్లి ఇంటికి వచ్చి ఆమె ఇంటిలో లేకపోవటంతో డారియన్‌కి ఫోన్ చేస్తుంది. అతను క్రిస్టాతో సహా వస్తాడు. అతని తల్లి నేడీన్‌ని శిక్షించాలని ఆమె వస్తువులన్నీ విరాళంగా ఇచ్చేస్తానని అంటుంది. డారియన్ ఆమెని ఆపుతాడు. “ఈ ఇంట్లో పెద్దదాన్ని నేను. మీరిద్దరూ పిల్లలు. నా మాటే చెల్లాలి” అంటుంది. “మరి ప్రతిసారి నాకెందుకు ఫోన్ చేస్తావు?” అంటాడు డారియన్. ఒక్కసారిగా అతని తల్లికి తాను అతని మీద ఆధారపడి అతని బాధ్యత పెంచుతోందని అర్థమవుతుంది. ఆ వయసులో అతను తల్లికి ఆసరా అయ్యాడు. ఆమె కుంగిపోకుండా చూసుకుంటున్నాడు. చిన్న వయసులో అది ఎంత కష్టమో చెప్పనక్కరలేదు. ఆ బరువు మోస్తూ అతను తనకి క్రిస్టా ద్వారా అందిన ప్రేమలో సాంత్వన పొందుతున్నాడు. అది ఎవరికీ అర్థం కాలేదు. డారియన్ తాను నేడీన్‌ని ఇంటికి తీసుకొస్తానని బయలుదేరుతాడు.

నేడీన్ నిక్‌ని కలుసుకుంటుంది. అతను ఆమెతో సెక్స్ చేయటానికి ప్రయత్నిస్తాడు. అయితే ఆమె అతన్ని వారిస్తుంది. మాట్లాడుకుందామంటుంది. లేకపోతే సినిమాకైనా వెళదామంటుంది. ఆమె అతని నుంచి ప్రేమని కోరుకుంది. అతని తోడు కోరుకుంది. అయితే అతను కేవలం సెక్స్ కోరుకున్నాడు. ఆమె కోరుకున్నదీ అదే కదా అని అతని వాదన. అయితే ఆమె తమది జన్మజన్మల బంధం అని అన్న మాట మర్చిపోయాడు. ఆమె సెక్స్‌కి ఒప్పుకోకపోవటంతో ఆమెని వదిలేసి వెళ్ళిపోతాడు. బలవంతం చేయడు. అంతవరకు నయం. ఆమె ఏం చేయాలో తోచని పరిస్థితిలో బ్రూనర్‌కి ఫోన్ చేస్తుంది.

తండ్రి పోయిన బాధని నేడీన్, భర్త లేని లోటుని ఆమె తల్లి మర్చిపోలేకపోయారు. డారియన్ తల్లికి ఆసరాగా నిలిచాడు. ఆమె నిరాశకి గురైనపుడల్లా అతను ఆమెను ఓదార్చేవాడు. నేడీన్ మాత్రం అతన్ని శత్రువు లానే చూసింది. అతనికి తనంటే ప్రేమ లేదని భావించింది. క్రిస్టా అతన్ని నిజంగానే ప్రేమించింది. అతన్ని వదులుకోవటం ఆమెకి ఇష్టం లేదు. నేడీన్ మంకుపట్టుకి ఆమె లొంగలేదు. ఆమె డారియన్, నేడీన్ ఇద్దరూ కావాలని కోరుకుంది. నేడీన్ తన పంతమే నెగ్గాలనుకుంది. తన ఏకైక స్నేహితురాలు క్రిస్టాని దూరం చేసుకుంది. కొంతమంది టీనేజర్లు నేడీన్ లాగే ఉంటారు. వాస్తవాలని చూడలేరు. బయటివారు కాస్త తీయగా మాట్లాడేసరికి వారిదే ప్రేమ అనుకుంటారు. ఇంట్లో ఉన్నవారికి వారి లోపాలు తెలుసు. బయటివారికి తెలియవు కదా. నేడీన్ అదృష్టం బావుండి నిక్ ఆమెని బలవంతం చేయకుండా వదిలేశాడు.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

బ్రూనర్ నేడీన్‌ని తన ఇంటికి తీసుకువెళతాడు. అతనికి నిజానికి భార్య, ఒక చిన్న బాబు ఉంటారు. నేడీన్ అతనికి పెళ్ళి కాలేదని ఊహించుకుంది అంతే. అతని భార్య నేడీన్‌తో “నీ కథ అంతా నాకు తెలియదు. కానీ నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా అది త్వరలోనే తీరిపోతుందని మాత్రం గుర్తు పెట్టుకో” అంటుంది. బ్రూనర్ నేడీన్ తల్లికి ఫోన్ చేస్తాడు. ఆమె డారియన్‌ని పంపిస్తుంది. అతను క్రిస్టాతో కలిసి వస్తాడు. నేడీన్ బయటకి వచ్చి “అందరి ముందూ నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు నటించక్కరలేదు. నేను నీతో రాను” అని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. డారియన్ మనోభావాలు దెబ్బ తింటాయి. క్రిస్టా “ఆమె మాటలు పట్టించుకోకు” అంటుంది. డారియన్ ఇక సహించలేక లోపలికి వెళ్ళి “నా జీవితం చాలా గొప్పగా ఉందనుకుంటున్నావు కదా. నిజమే. అమ్మ నిస్పృహ చెందినప్పుడల్లా ఆమె పక్కన ఉండటం, దూరంగా ఉన్న కాలేజీకి వెళితే ఇక్కడ ఏం కొంప మునుగుతుందో అని దగ్గర్లో కాలేజీలు వెతుక్కోవటం, నా జీవితంలో రవంత సంతోషం నింపే అమ్మాయి ప్రేమ నీకు నచ్చకపోవటం – ఇదే నా జీవితం. అవును, చాలా గొప్ప జీవితం” అంటాడు. నేడీన్ అవాక్కయి ఉండిపోతుంది. డారియన్ వెళ్ళిపోతాడు.

బ్రూనర్ నేడీన్‌ని ఇంటి దగ్గర దిగబెడతాడు. నేడీన్ తల్లి సోఫాలో నిద్రపోతూ ఉంటుంది. నేడీన్ డారియన్‌తో మాట్లాడుతుంది. “నన్ను క్షమించు. నా సమస్యలే నిజమైన సమస్యలని ఇన్నాళ్ళూ అనుకున్నాను. చాలారోజుల నుంచి నన్ను నేను గమనిస్తున్నాను. నేనంటే నాకే అసహ్యంగా ఉంది. ఇలా ఎన్నాళ్ళో” అని కన్నీరు పెట్టుకుంటుంది. డారియన్ ఆమెని కౌగిలించుకుంటాడు. ఆ కౌగిలింతలో నేనున్నాను అనే భావం ఉంటుంది. ఆ భరోసా చాలు జీవితాన్ని ఎదురీదటానికి. మర్నాడు నేడీన్ ఎర్విన్‌ని కలవటానికి వెళుతుంది. వెళ్ళేముందు డారియన్, క్రిస్టాలని పలకరించి వెళుతుంది. క్రిస్టా ఆనందంతో తబ్బిబ్బు అవుతుంది. తర్వాత నేడీన్ తల్లి నేడీన్‌కి ఫోన్ చేస్తుంది. అయితే నేడీన్ ఒక థియేటర్‌లో ఉండటం వలన ఫోన్ ఎత్తదు. “నేను బాగానే ఉన్నాను” అని సందేశం పంపుతుంది. ఆమె తల్లి ఏం చేయాలా అని ఆలోచించి చివరికి సంబాళించుకుని “ఓకే” అని సమాధానం పెడుతుంది.

టీనేజర్లే కాదు, చాలా మంది తమ సమస్యలే నిజమైన సమస్యలు అనుకుంటారు. ఏ సమస్య వచ్చినా నాకే ఎందుకు ఇలా జరగాలి అనుకుంటారు. చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే తల్లి కానీ భార్య కానీ అనుకోకుండా ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే ‘నాకెవరు వండిపెడతారు’ అని అడిగేవారుంటారు. ఎప్పుడూ తమ గురించే ఆలోచిస్తారు తప్ప అవతలి వారి అవసరాలు, ఇబ్బందులు గుర్తించరు. పెద్దవారే ఇలా ఉంటే టీనేజర్ల సంగతి చెప్పక్కరలేదు. నేడీన్‌కి తానెంత స్వార్థంతో ప్రవర్తించిందో తెలిసివచ్చింది. తనని తాను అసహ్యించుకోవటం కాదు, తనని తాను అర్థం చేసుకోవాలని అవగతమయింది. నేడీన్ తల్లికి ఆమె ఫోన్ ఎత్తకపోవటంతో కోపం వస్తుంది. అయినా తమాయించుకుంటుంది. ఒక దశ వచ్చాక పిల్లలని అదుపు చేయటం కన్నా వారి స్నేహితులుగా మారిపోవటమే మంచిది. వారికి నమ్మకం కలిగిస్తే వారు మనసు విప్పి మాట్లాడతారు. బ్రూనర్ నేడీన్ మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నాడు. అలాంటివారు అవతలి వారి దృష్టి ఆకర్షించటానికి నాటకీయంగా మాట్లాడతారని అతనికి తెలుసు. అందుకే ఆమె మీద సానుభూతి చూపించకుండా ఆమె ఆలోచించుకునేలా మాట్లాడతాడు. ప్రపంచం మారదని, ఆమే మారాలని చెబుతాడు. అయితే ఆమె అతని మాటల్ని అపార్థం చేసుకుంది. ఒక్కోసారి సమయం వస్తే గానీ కనువిప్పు కలగదు.

ఇంతకీ ఎర్విన్‌ని కలుసుకోవటానికి వెళ్ళిన నేడీన్ థియేటర్లో ఎందుకు ఉంది? ఎర్విన్ పాత్ర కూడా చక్కగా మలచబడింది. అందులోని విశేషాలు నేను చెప్పను. అయితే ఒక మాట. థియేటర్, ఆడిటోరియం లాంటి ప్రదేశాల్లో ఫోన్లో మాట్లాడటం మంచి పద్ధతి కాదు. మరీ అత్యవసరమైతే బైటికి వెళ్ళి మాట్లాడాలి. సెల్ ఫోన్లు లేని రోజుల్లో ప్రపంచం నడవలేదా? మరి ఇప్పుడు ఏం మునిగిపోతుందని? ఇదంతా మన స్వార్థమే. పెద్ద పెద్ద జీతాలతో ఉద్యోగాలు చేస్తే ఇలాంటి ఒత్తిళ్ళే ఉంటాయి. కొన్ని పరిమితులు పెట్టుకుంటే ఒత్తిళ్ళు ఎదుర్కోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here