మరుగునపడ్డ మాణిక్యాలు – 30: నాక్టర్నల్ యానిమల్స్

0
1

[dropcap]జీ[/dropcap]వితంలో పశ్చాత్తాపపడే సందర్భాలు దాదాపు అందరికీ ఉంటాయి. కానీ చేసిన తప్పు పెద్దదైతే ఆ బాధ ఎప్పటికీ వెన్నాడుతూనే ఉంటుంది. ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలో తెలియక కొందరు మథనపడుతూ ఉంటారు. మనం గాయపరచిన వారు తామే మన వైపు చేయి చాస్తే? తప్పకుండా వారి చేయి అందుకోవాలి. కానీ వారు మన మీద ఇంకా కోపంగా ఉన్నారని అనిపిస్తే? మన ప్రస్తుత పరిస్థితి అంత గొప్పగా లేక వారి ముందు అవమానానికి గురవ్వాల్సి వస్తే? మన అవమానం ప్రధానమా, వారికి జరిగిన అన్యాయం ప్రధానమా? ఇలాంటి అంశాలతో వచ్చిన చిత్రం ‘నాక్టర్నల్ యానిమల్స్’ (2016). ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం. పెద్దలకు మాత్రమే. పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో చూపించవద్దు. నిజానికి మొదట్లో పేర్లు పడే సన్నివేశం పెద్దవారిని కూడా ఇబ్బందికి గురిచేస్తుంది.

సూసన్ ఒక ఆర్ట్ గ్యాలరీ యజమాని. కళ వింత పోకడలు పోతుంటే దాని ద్వారా లాభపడే మనిషి. భేషజాలు ప్రదర్శిస్తూ ఇదే కళ అని చెప్పుకునే రకం. అయితే ఆమె లోలోపల అసంతృప్తితో ఉంటుంది. దానికి కారణం ఆమె గతంలో చేసిన తప్పులతో పాటు ఆమె ప్రస్తుత జీవితం కూడా. ఆదాయం తగ్గిపోయింది. భర్త వ్యాపారం కూడా సరిగా నడవటం లేదు. వారి కూతురు ఎక్కడో ఉండి చదువుకుంటోంది. సూసన్‌కి రాత్రిళ్ళు నిద్రపట్టదు. భర్తకి తనంటే ప్రేమ ఉందా లేదా అని అనుమానం. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకి తన మాజీ భర్త ఎడ్వర్డ్ నుంచి ఒక పార్శిల్ అందుతుంది. అతను వ్రాసిన నవల ప్రతి అది. త్వరలో అచ్చవుతుందనీ, ఆమే ఆ నవలకి ప్రేరణ అని, ఆమెని కలవాలనుకుంటున్నానని ఒక ఉత్తరం జతచేస్తాడు. పంతొమ్మిదేళ్ళ తర్వాత అతని నుంచి అందిన తొలి కబురు ఇది. అతనికి తాను ఘోరమైన అన్యాయం చేశానని ఆమె తన సహోద్యోగినితో అంటుంది. తాను రాత్రి సరిగా నిద్రపోకుండా ఉండటంతో తనను అతడు ‘నాక్టర్నల్ యానిమల్’ (నిశాచర ప్రాణి) అనేవాడని అంటుంది.

సూసన్ నవల చదవటం మొదలుపెడుతుంది. ఆ కథ మనకి తెరపై చూపిస్తాడు దర్శకుడు. నవలలో టోనీ అనే అతను తన భార్య లారా, ఎదిగిన కూతురు ఇండియాతో కలిసి ఒక రాత్రి వేళ కారులో ప్రయాణిస్తుంటాడు. వారాంతంలో సరదాగా గడపటానికి వారంతా వెళుతుంటారు. రహదారి నిర్మానుష్యంగా ఉంటుంది. సెల్ ఫోన్ నెట్వర్క్ పనిచేయదు. ముగ్గురు ఆకతాయి కుర్రాళ్ళు కారులో వెళుతూ కావాలనే వారికి అడ్డుపడుతూ ఉంటారు. ఆ గందరగోళంలో టోనీ కారు ఆ కారుని గుద్దుకుంటుంది. ఈ గొడవ పెరిగి పెరిగి ఆ ఆకతాయిల్లో ఇద్దరు లారాని, ఇండియాని అపహరించి తీసుకుపోతారు. ఇంకొకడు టోనీని వారి దగ్గరకి తీసుకువెళతానని నిర్జన ప్రదేశంలో వదిలేస్తాడు. తర్వాత ఆ ఆకతాయిల్లో ముఖ్యుడైన రే టోనీ కోసం అక్కడికి కారులో వస్తాడు. టోనీని పిలుస్తాడు. అయితే టోనీ భయంతో దాక్కుంటాడు. తెల్లారేసరికి పోలీసు స్టేషన్‌కి చేరుకుని రిపోర్ట్ ఇస్తాడు. బాబీ అనే పోలీసు ఆఫీసరు అన్వేషణ చేస్తాడు. లారా, ఇండియా శవాలు దొరుకుతాయి. వారిపై అత్యాచారం చేసి చంపేశారని శవపరీక్షలో తెలుస్తుంది. టోనీ హతాశుడవుతాడు.

అన్వేషణ చేయటానికి బాబీ, టోనీ కలిసి వెళ్ళినపుడు బాబీ టోనీని “రే వెనక్కి వచ్చి పిలిచినపుడు మీరెందుకు వెళ్ళలేదు?” అని అడుగుతాడు. “నాకే తెలియదు” అంటాడు టోనీ. నిజానికి టోనీ వాళ్ళు తనని ఏం చేస్తారో అని భయపడ్డాడు. ఈ అధైర్యమే జీవితమంతా వెంటాడుతుంది. ‘నా ప్రాణమే నాకు ముఖ్యం’ అనుకుంటే ప్రాణం దక్కినా మనశ్శాంతి ఉండదు. దేశం కోసం ప్రాణాలు అర్పించేవారు ఉండగా కనీసం తన కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం ఆకతాయిలను ఎదిరించలేకపోయాడు టోనీ. ‘నేను ధైర్యంగా వెళ్ళి ఉంటే వారు బతికేవారేమో’ అనే భావన జీవితాంతం ఉంటుంది. జరిగేది అన్యాయమని తెలిసినపుడు ప్రాణాన్ని లెక్కచేయకుండా ఎదిరించటమే ధీరత్వం. ఆ ధైర్యం లేకపోవటంతో టోనీ మనశ్శాంతి కోల్పోయాడు. నిద్రకు కూడా దూరమయ్యాడు.

తర్వాత బాబీకి ఒక ఇంట్లో టోనీ భార్య, కూతురి వేలిగుర్తులు లభిస్తాయి. వేరే వేలి గుర్తులు కూడా ఉంటాయి. దొరికిన వేలిగుర్తుల ఆధారంగా బాబీ ఒకతన్ని నేరస్థుడిగా అనుమానిస్తాడు. వేలిగుర్తుల ఆధారంగా ఎవరినైనా పట్టుకోవాలంటే వారికి నేరచరిత్ర ఉండాలి. నేరచరిత్ర ఉన్నవారి వేలిగుర్తులు పోలీసుల దగ్గర ఉంటాయి. వాటితో పోల్చి చూస్తారు. బాబీ అనుమానించిన అతనికి నేరచరిత్ర ఉంది. అతని వేలి గుర్తులు ఆ ఇంట్లో దొరికాయి. అయితే టోనీ అతని ఫొటోని గుర్తుపట్టలేక పోతాడు. వేలి గుర్తులు ఉన్నంత మాత్రాన అతను నేరం చేశాడని చెప్పలేరు. వేరే ఆధారాలు ఉండాలి. తర్వాత ఆ అనుమానితుడు కనపడకుండా పోతాడు. కేసు మూలన పడుతుంది. ఒక సంవత్సరం తర్వాత బాబీ టోనీని పిలిపిస్తాడు. వేరే నేరంలో దొరికిన ఒక నేరస్థుడిని చూసి అతన్ని గుర్తుపట్టగలడేమో చూడమంటాడు. అతను టోనీని ఆ రాత్రి నిర్జన ప్రదేశంలోకి తీసుకువెళ్ళిన వాడే. తర్వాత రే ని పట్టుకుంటారు. మూడో వాడు చనిపోయాడు. అయితే ఇద్దరూ తాము ఏ నేరమూ చేయలేదంటారు. టోనీ ఎవరో తమకు తెలియదంటారు.

సూసన్ నవల చదువుతూ మధ్య మధ్య లో వేదనకు గురవుతూ ఉంటుంది. ఆమె టోనీ పాత్రలో ఎడ్వర్డ్‌ని ఊహించుకుంటుంది. లారా పాత్రలో తనలాగే ఉండే స్త్రీని ఊహించుకుంటుంది. ఇండియా కూడా తల్లిని పోలి ఉంటుంది. లారా చనిపోవటంతో సూసన్‌కి షాక్ తగిలినట్లు అవుతుంది. ఎడ్వర్డ్ తన మీద కోపంతో లారా పాత్రని సృష్టించి ఆ పాత్రకి అంత దారుణమైన ముగింపు ఇచ్చాడని ఆమె భావన. ఇంతకీ ఎడ్వర్డ్‌కి ఆమె మీద ఎందుకు కోపం? వారిద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఎడ్వర్డ్ రచనకు సంబంధించిన విద్య అభ్యసించేవాడు. ఆమె ఆర్ట్ హిస్టరీ అభ్యసించింది. అతన్ని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. ఆమె తల్లి ఆ పెళ్ళి చేసుకోవద్దని చెబుతుంది. ఎడ్వర్డ్ బలహీనుడని అంటుంది. అతను ఆమెకి ఏ సౌకర్యాలు ఇవ్వలేడని, కొన్నాళ్ళకి ఆమెకి అతని పట్ల నిరాశ కలుగుతుందని అంటుంది. సూసన్ ఎడ్వర్డ్‌కి మనోబలం ఉందని అంటుంది. ఆమె తల్లి అతను చాలా సున్నితహృదయుడని, చివరకి సూసన్ తన స్వార్థంతో అతని హృదయాన్ని గాయపరుస్తుందని అంటుంది. చివరికి అదే జరిగింది. ఎడ్వర్డ్ రచయితగా నిలదొక్కుకోలేకపోవటంతో సూసన్ అతన్ని వదిలేసింది. వర్తమానంలో ఇవన్నీ తలచుకుంటూ సూసన్ బాధపడుతూ ఉంటుంది. అయితే ఎడ్వర్డ్ రచనాశైలి ఆమెని ఆకట్టుకుంటుంది. అతన్ని కలవటానికి నిశ్చయించుకుంటుంది. దీనికి మరో కారణం ఆమె భర్తకి అక్రమసంబంధం ఉందని తెలియటం.

మనిషి డబ్బు సంపాదించకపోతే అతనికి విలువ లేనట్టేనా? ఎడ్వర్డ్ రచనలు మొదట్లో సూసన్‌కి నచ్చేవి కావు. నచ్చి ఉంటే డబ్బు రాకపోయినా అతన్ని అంటిపెట్టుకుని ఉండేదా? ఈ ప్రశ్నకి సమాధానం ఆమెకి కూడా తెలియదేమో. ఆమె ఇచ్చే సూచనలకి ఎడ్వర్డ్ అసహనం ప్రదర్శించేవాడు. ఆమె సూచనలు అతని అభిరుచికి భిన్నం. అతనికి సరైన ప్రతిభ లేదని ఆమె ఉద్దేశం కావచ్చు. ప్రతిభ లేకపోతే ప్రేమ తగ్గిపోతుందా? అతను నిస్పృహకి లోనై ఉండి ఉండొచ్చు. తన మీద తానే జాలిపడుతూ ఉండి ఉండొచ్చు. అలాంటి వారితో జీవితం కష్టమే. అయితే అతనికి అండగా ఉండి జీవితం గడపవచ్చు. రచనకి సంబంధించిన ఉద్యోగమేదో అతను చేసుకోవచ్చు. ఆమె కూడా ఉద్యోగం చేయవచ్చు. కానీ ఆమె తల్లి చెప్పినట్టు ఆమె నైజం అది కాదు. అతను సమర్థుడు కాడని అతన్ని వదిలేసింది. ఇప్పుడు అతని నవల అచ్చు కాబోతోంది. ఆమెకి నచ్చింది. అతని మీద మళ్ళీ ప్రేమ పుట్టింది. ఆమె భర్తకి అక్రమ సంబంధం ఉంది. అందుకని అతని దగ్గరకి వెళ్ళిపోవాలని ఆమె ఆశ. ఇది నైతికమేనా? పెద్దగా డబ్బు లేకపోయినా ఎలాగోలా జీవించవచ్చు. ఆమెకి సౌకర్యాలు కావాలి. అలా షరతులతో కూడిన ప్రేమ ఎన్నాళ్ళు ఉంటుంది? మళ్ళీ అనుకోనిదేదైనా జరిగితే ఆమె ఏం చేస్తుంది? ‘దీనో వా రాజ్యహీనో వా’ అని సీత రామాయణంలో అంటుంది. ఒకసారి పెళ్ళైతే అతను దీనుడైనా జీవితాంతం అతనే భర్త. ఆమే భార్య. కానీ ఆ సంప్రదాయం ఇప్పుడు భారతీయ సమాజంలో కూడా లేదు. అందుకే జీవితాలు అల్లకల్లోలం అవుతున్నాయి. మళ్ళీ ఆ సంప్రదాయం రావాలి. భర్త గానీ, భార్య గానీ చెడ్డవారైతే అది వేరే విషయం. డబ్బు లేదని, సమర్థత లేదని విడిపోవటం అనుచితం.

రెండు కథలున్నాయి కాబట్టి ఈ చిత్రంలో రెండు ముగింపులు ఉంటాయి. టోనీ కథ, సూసన్ కథ ప్రతీకారం తోనే ముగుస్తాయి. ఇది ప్రతీకారం కథ అని సూచించే విధంగా ‘REVENGE’ (ప్రతీకారం) అనే పెయింటింగ్ ఒకటి చిత్రంలో కనిపిస్తుంది. అది సూసన్ కొన్న పెయింటింగే. అయినా ఆమె “ఇదెప్పుడు కొన్నారు?” అంటుంది. ఎడ్వర్డ్ తనపై ప్రతీకార వాంఛతో ఉన్నాడని ఆమె అనుకోవటంతో ఇప్పుడు ఆమె దృష్టిని ఆ పెయింటింగ్ ఆకర్షించింది. మనిషి మనఃస్థితి ఎలా ఉంటే పరిసరాలు కూడా అలాగే ఉంటాయి అని చెప్పటానికి నాటకీయంగా ఇలా చూపించారు.

సూసన్‌గా ఏమీ ఆడమ్స్, ఎడ్వర్డ్‌గా, టోనీగా జేక్ జిలెన్హాల్ నటించారు. ఎడ్వర్డ్‌ని మనం గతం లోనే చూస్తాం. అంటే యుక్త వయసులో ఉన్నపుడు. అప్పుడు నునుపైన బుగ్గలతో ఉంటాడు. నవలలో టోనీ మొదట్లో గడ్డంతో ఉంటాడు. అంటే తన సున్నితత్వాన్ని దాచుకుంటాడు. ఒక ఏడాది తర్వాత టోనీ బుగ్గలు నొక్కుకుపోయి ఉంటాయి. నిద్రలేమితో, డక్కాముక్కీలు తిన్నట్టు ఉంటాడు. చాలా శ్రద్ధతో ఈ పాత్రలను మలిచారు. బాబీగా మైకెల్ షానన్ నటించాడు. ఎంతోమంది నేరస్థులు తప్పించుకోవటం చూసిన పోలీసు పాత్ర అది. ఒక రకమైన నిర్వేదం, కసి ఉంటాయి. నేరస్థుల్ని ఎలాగైనా శిక్షించాలని పట్టుదలగా ఉంటాడు. మైకెల్‌కి ఈ పాత్రకి ఆస్కార్ నామినేషన్ వచ్చింది. రే గా నటించిన ఆరన్ టేలర్ జాన్సన్‌కి ఉత్తమ సహాయనటుడిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కింది. టొనీని గుర్తుపట్టనట్టు నటిస్తూనే అతని బాధని చూసి రాక్షసానందం పొందే పాత్ర అది. ఆస్టిన్ రైట్ వ్రాసిన ‘టోనీ అండ్ సూసన్’ నవల ఆధారంగా టామ్ ఫోర్డ్ స్క్రీన్ ప్లే వ్రాసి దర్శకత్వం వహించాడు. ఆబెల్ కొర్జెనియోస్కీ సంగీతం కథకి తగ్గట్టు ఉత్కంఠ కలిగిస్తూ సాగుతుంది. చిత్రంలో పేర్లు పడే సన్నివేశంలో స్థూలకాయులైన స్త్రీలు నగ్నంగా నాట్యం చేయటం ఇబ్బందికరంగా ఉంటుంది. కళ అనే పేరు చెప్పి ఇలాంటి ప్రదర్శనలు ఇవ్వటం వింతగా అనిపిస్తుంది కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి. శరీరాకృతి చూసి పరిహాసం చేయటాన్ని (బాడీ షేమింగ్) నిరసిస్తూ ఇలాంటి ప్రదర్శనలు జరుగుతాయి. కానీ అసభ్యంగా ఉంటాయనేది కాదనలేం.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద టోనీ కథ ముగింపు ప్రస్తావించబడింది. సూసన్ కథ ముగింపు ప్రస్తావించేముందు మరో హెచ్చరిక ఉంటుంది.

రే ని పట్టుకున్నప్పుడు టోనీ అతన్ని ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పమంటాడు. తన భార్య, కూతురు ఏం జరుగుతోందో అర్థమయే స్థితిలో ఉన్నారా, వారు వేదనపడ్డారా, వారిని ఎలా చంపారు అని అడుగుతాడు. ఇవన్నీ తెలుసుకుని అతను ఏం చేస్తాడు? ఏం జరిగిందో తెలియక అతను క్షోభ అనుభవిస్తున్నాడు. తెలిస్తే మరింత బాధపడతాడు. అయినా తెలియకపోవటం కంటే తెలియటమే నయమని అతని భావన. మన దగ్గరి వాళ్ళు చనిపోయినపుడు దగ్గర లేకపోతే చాలా బాధపడతాం. ఇక్కడ పరిస్థితి దారుణమైనది. టోనీ క్షోభ వర్ణనాతీతం. దానికి అతని పిరికితనం కూడా ఒక కారణం. రే జవాబు చెప్పడు. బాగా అయిందిలే అన్నట్టు ఒక చిన్న నవ్వు అతని పెదవుల మీదకి వస్తుంది. కోపంతో టోనీ అతన్ని గట్టి చెంపదెబ్బ కొడతాడు. ఆ దెబ్బ ఎంత గట్టిదంటే ఆ ధాటికి రే కిందపడతాడు. పిరికివాడైన టోనీ క్షోభ అంతా కసిగా మారి ఆ బలమైన దెబ్బ రూపంలో బయటికొచ్చింది.

రే వేలిగుర్తులు నేరం జరిగిన చోట దొరకలేదు. తాను ఆ సమయంలో వేరే చోట ఉన్నానని సాక్ష్యం (ఆలిబై)  పుట్టిస్తాడు. రే వేలిగుర్తులు ఎందుకు దొరకలేదు? దీనికి బాబీ ఇచ్చే సమాధానం ఏమిటంటే అతని చేతులు టోనీ భార్యని పట్టుకుని ఉన్నాయి కాబట్టి వేలిగుర్తులు వస్తువుల మీద దొరకలేదు. ఇలాంటి విషయాలు వింటుంటే టోనీకి ఎలా ఉంటుందో ఊహించటం కూడా కష్టం. సరైన సాక్ష్యాలు లేకపోవటం వల్ల రే ని పై అధికారులు వదిలేస్తారు. బాబీని ఉద్యోగం నుంచి తప్పించి ఇంకొకరికి ఆ ఉద్యోగం ఇవ్వాలని కుట్ర జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈ కేసు నీరుగారేలా పై అధికారులు పావులు కదుపుతూ ఉంటారు. స్వార్థప్రయోజనాల కోసం అన్యాయాన్ని బయటపడనీయకుండా చేస్తారు.

బాబీకి పట్టుదల పెరుగుతుంది. అతనికి క్యాన్సర్ కూడా ఉంది. తాను ఎంతోకాలం బతకనని తెలుసు. దాంతో తెగింపు వస్తుంది. టోనీని “మీకు న్యాయం జరగాలనే కోరిక ఎంత బలంగా ఉంది?” అని అడుగుతాడు. “కోరిక ఉంటే మాత్రం మీరేం చేయగలరు?” అంటాడు టోనీ. “మీరు ఏం అడిగితే అది చేస్తాను” అంటాడు బాబీ. అధికారులకి తెలియకుండా రేని, అతని సహచరుణ్ని ఒక చోటికి తీసుకువస్తాడు. టోనీ చేతికి గన్ ఇచ్చి కాల్చమంటాడు. టోనీ తటపటాయిస్తాడు. నేరస్థులు ఇద్దరూ పారిపోతారు. బాబీ అప్రమత్తుడై రే సహచరుణ్ణి కాల్చి చంపేస్తాడు. తర్వాత రే అత్యాచారం జరిగిన ఇంట్లో దాక్కుని ఉండగా టోనీ పట్టుకుంటాడు. రే టోనీని చులకన చేసి మాట్లాడతాడు. బలహీనుడంటాడు. తానే అత్యాచారం చేశానని గొప్ప చెప్పుకుంటాడు. టోనీ మీద ఇనప రాడ్డుతో దాడి చేస్తాడు. టోనీకి ముఖం మీద దెబ్బ తగులుతుంది. అయితే దెబ్బ తగిలే ముందే రే ని గన్‌తో కాలుస్తాడు. దెబ్బ ప్రభావంతో స్పృహతప్పి పడిపోతాడు. తెలివి వచ్చే సరికి అతని కంటిచూపు పోతుంది. రే చనిపోయి ఉంటాడు. టోనీ ఇంటి బయటకి తడబడుతూ వచ్చి కాస్త దూరం నడిచి కింద పడి మరణిస్తాడు.

ఈ కథలో అన్ని పాత్రలూ సూసన్‌కి అన్వయమౌతాయి. టోనీ భార్య పాత్రతో సూసన్‌కి ఉన్న పోలిక స్పష్టం. ఎడ్వర్డ్‌కి సూసన్ దూరం కావటానికి సూసనే కారణం కాబట్టి టోనీ భార్యని చంపినవారు కూడా సూసన్‌కి ప్రతీకలే. సూసన్ బలహీనపడి తాను ప్రేమించిన ఎడ్వర్డ్‌ని వదిలేసింది కాబట్టి భార్యని, కూతుర్ని కాపాడుకోలేని బలహీనుడైన టోనీ పాత్రలో సూసన్ ఛాయలుంటాయి. బాబీ టోనీని ప్రోత్సహించి పగ తీర్చుకునేలా చేశాడు. సూసన్ ప్రేరణతోనే ఎడ్వర్డ్ నవల వ్రాశాడు. తన ప్రతిభని అనుమానించిన సూసన్‌కి ఆ విధంగా జవాబు చెప్పాడు. కాబట్టి బాబీకి సూసన్‌కి కూడా పోలిక ఉంది. చివరికి ఎడ్వర్డ్ చెప్పేదేమిటంటే టోనీ తన వారి ఆత్మశాంతి కోసం పోరాడినట్టే సూసన్ కూడా తమ బంధాన్ని నిలబెట్టుకోవటానికి దృఢంగా నిలబడవలసిందని. ప్రాణం పోయినా తన వారి కోసం పోరాడాలని. మరి టోనీ కూతురి సంగతి ఏమిటి? ఆ పాత్ర నవలలో ఎందుకుంది? ఆ ప్రశ్నకి సమాధానం సూసన్ కథలో తెలుస్తుంది.

ఈ క్రింద సూసన్ కథ ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునే వారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

ఎడ్వర్డ్‌తో ఉన్నప్పుడే సూసన్‌కి హటన్ పరిచయమవుతాడు. అతనే వర్తమానంలో ఆమె భర్త. సూసన్ ఎడ్వర్డ్ బిడ్డకి తల్లి కాబోతున్నట్టు తెలుస్తుంది. సూసన్ ఎడ్వర్డ్ నుంచి విడిపోవాలని నిశ్చయించుకుంటుంది. తొందరపడి గర్భస్రావం చేయించుకుంటుంది. ఎడ్వర్డ్‌కి తీరని అన్యాయం చేశానని సూసన్ బాధపడుతుంది. హటన్ ఆమెని సముదాయిస్తాడు. ఎడ్వర్డ్‌కి గర్భస్రావం సంగతి తెలిసిపోతుంది. ఇద్దరూ విడిపోతారు. గర్భంలోనే చనిపోయిన బిడ్డకి ప్రతీకగా నవలలో టోనీ కూతురి పాత్రని సృష్టించాడు ఎడ్వర్డ్.

నవల చదవుతుండగానే సూసన్ ఎడ్వర్డ్‌ని కలవటానికి ఒప్పుకుంటుంది. అతనికి ఒక ఈమెయిల్ పంపుతుంది. కలుసుకునే రోజున సూసన్ అలంకరించుకుని తయారవుతుంది. అయితే బయలుదేరే ముందు లిప్‌స్టిక్ చెరిపేస్తుంది. తన వివాహపు ఉంగరం కూడా తీసేస్తుంది. ఎడ్వర్డ్ దగ్గరకి వెళ్ళిపోవాలని ఆమె ఉద్దేశం. తన సౌకర్యాలన్నీ వదిలేసుకోవటానికి సిధ్ధపడుతుంది. రెస్టారెంట్‌కి వెళ్ళి ఎడ్వర్డ్ కోసం ఎదురుచూస్తుంటుంది. అయితే అతను ఎంతకీ రాడు. సూసన్‌కి అతను ఇక రాడని అర్థమౌతుంది. ఈ విధంగా అతను తన మీద పగ తీర్చుకున్నాడని అవగతమౌతుంది.

తన జీవితాన్ని అతలాకుతలం చేసిన సూసన్‌కి అతను తాను బాగా వ్రాయగలనని నిరూపించాడు. అయితే మనసు విరిగిన కారణంగానే అతను తన అనుభవాలనే ప్రతీకాత్మకంగా ఒక నవలగా వ్రాశాడు. మళ్ళీ అలాంటి రచన చేయగలడా? సూసన్ అతనికి మేలు చేసిందా లేక అతని ప్రతిభారాహిత్యాన్ని అతనికి మరింత స్పష్టంగా చూపించిందా? ఆమెకి అతని ప్రతిభతో ఇప్పుడు అక్కర లేకపోవచ్చు. అతని సున్నితమైన హృదయాన్ని గ్రహించి అమె అతని దగ్గరకి వెళ్ళాలని అనుకుని ఉండవచ్చు. కానీ అతను ఆమెని క్షమించే స్థితిలో లేడు. నిజానికి అతని సున్నితత్వాన్ని చూసే ఆమె మొదట్లో అతణ్ణి ప్రేమించింది. చానాళ్ళ తర్వాత వారు కలుసుకున్నప్పుడు ఆమె తన సోదరుడు స్వలింగప్రియుడని, ఎడ్వర్డ్‌ని ప్రేమించాడని చెబుతుంది. ఎడ్వర్డ్‌కి ఆమె సోదరుడు కూడా స్నేహితుడే. అయితే అతనికి ఈ ప్రేమ విషయం తెలియదు. అయినా ఎడ్వర్డ్ “అయ్యో! ఇన్నాళ్ళూ అతన్ని కనీసం పలకరించలేదు. ఏమనుకుంటాడో!” అంటాడు. అవతలి వారి భావాలు తనకి నచ్చకపోయినా వారిని గౌరవించే అతని సంస్కారం చూసి ఆమె అతన్ని ప్రేమిస్తుంది. కానీ తర్వాత అతను డబ్బు సంపాదించటం లేదని అతన్ని వదిలేస్తుంది. మనసే ముఖ్యమని ఇప్పుడు తెలుసుకుంది.

ఎడ్వర్డ్‌కి సూసన్ ప్రస్తుత పరిస్థితి తెలుసా? తెలుసనే అనుకోవాలి. అతను తన నవల ప్రతిని పోస్ట్‌లో పంపలేదు. స్వయంగా వచ్చి ఇంటి బయట ఉన్న లెటర్ బాక్స్‌లో వేశాడు. అంటే ఆమెని గమనిస్తూనే ఉన్నాడు. ఆమె తన ఆర్ట్ గ్యాలరీలో ముభావంగా ఉండటం కూడా చూసే ఉంటాడు. కథ మొదట్లో జరిగిన ప్రదర్శనకి ఆమె భర్త రాలేదని కూడా గమనించి ఉంటాడు. ఆమె సంతోషంగా లేదని అతనికి అర్థమయింది. తన ప్రతీకారానికి అదే అదును అనుకున్నాడు. అయితే అతను కేవలం రెస్టారెంట్‌కి రాకుండా ఉండిపోయాడా లేక ఆత్మహత్య చేసుకున్నాడా? నవలలో టోనీ మరణించాడు కాబట్టి ఎడ్వర్డ్ కూడా మరణించాడా? అది మన ఊహకే వదిలేశారు రచయిత, దర్శకుడు. ఇలాంటి ముగింపు సాహసమే. ఎదురుపడి నిందించి అక్కసు తీర్చుకోవటం మానవ నైజం. ఎడ్వర్డ్ మౌనంగా తన పగ తీర్చుకున్నాడు. అదే ఈ చిత్రానికి తలమానికమైన సన్నివేశం. అలాంటి సన్నివేశం చాలా అరుదు. చిత్రం ముగిసిన తర్వాత ఆలోచిస్తూ ఉండిపోయేలా చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here