మరుగునపడ్డ మాణిక్యాలు – 31: స్టీవ్ జాబ్స్

0
2

[dropcap]స్టీ[/dropcap]వ్ జాబ్స్ యాపిల్ సంస్థని స్థాపించి ఎన్నో కొత్త ఎలెక్ట్రానిక్ ఉపకరణాలని ప్రపంచానికి అందించాడు. ముఖ్యంగా ఐఫోన్ రాకతో ప్రపంచమే మారిపోయింది. ఐఫోన్‌ని చూసి మిగతా కంపెనీలు స్మార్ట్ ఫోన్లు తయారు చేయటం మొదలుపెట్టాయి. ఇప్పుడు దాదాపు అందరి దగ్గరా స్మార్ట్ ఫోన్ ఉంది. అంతటి దార్శనికుడైన స్టీవ్ జాబ్స్ వ్యక్తిగతంగా ఎలాంటివాడు? అతను కర్కశుడైన వ్యాపారవేత్త అని చాలామంది అంటారు. అతనితో సన్నిహితంగా మెలిగినవారి అభిప్రాయాలతో వ్రాసిన పుస్తకం ‘స్టీవ్ జాబ్స్’. స్టీవ్ కోరిక పైనే వాల్టర్ ఐజాక్సన్ ఈ పుస్తకం వ్రాశాడు. అభిప్రాయాలు చెప్పినవారంతా నిజాయితీగా చెప్పాలని స్టీవ్ కోరాడు. పుస్తకం విడుదలయే ముందు తాను ఆమోదించాలనే షరతు కూడా పెట్టలేదు. 2011లో క్యాన్సర్‌తో మరణించాడు. జీవితం చివరి దశలో తాను గతంలో చేసిన తప్పులని క్షాళన చేసుకోవాలనే కోరికే ఈ పుస్తకం వెనుక ఉద్దేశమేమో అనిపిస్తుంది. అయితే పుస్తకం అతను మరణించిన తర్వాతే విడుదలయింది. ఈ పుస్తకంలోని విషయాలు, తాను సేకరించిన అభిప్రాయాలతో కలిపి ఆరన్ సార్కిన్ ‘స్టీవ్ జాబ్స్’ (2015) చిత్రానికి స్క్రీన్ ప్లే వ్రాశాడు. ఆరన్ సార్కిన్ అంతకు ముందు ఫేస్‌బుక్ అధిపతి మార్క్ జకర్బర్గ్ జీవితంపై వ్రాసిన స్క్రీన్ ప్లే ‘ద సోషల్ నెట్వర్క్’ (2010)కి ఆస్కార్ వచ్చింది. ‘స్టీవ్ జాబ్స్’ చిత్రానికి డానీ బోయెల్ దర్శకత్వం వహించాడు. అతనికి అంతకు ముందు ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ (2008) చిత్రానికి ఉత్తమ దర్శకుడి ఆస్కార్ వచ్చింది.

‘స్టీవ్ జాబ్స్’ చిత్రం వినూత్నంగా ఉంటుంది. స్టీవ్ జాబ్స్ జీవితంలో మూడు ముఖ్యమైన ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగిన నేపథ్యంలో కథ జరుగుతుంది. 1984లో మ్యాకింటాష్ కంప్యూటర్, 1988లో నెక్స్ట్ కంప్యూటర్, 1998లో ఐమ్యాక్ కంప్యూటర్ విడుదల జరిగాయి. ఈ విడుదల కార్యక్రమాలు జరిగే కొన్ని నిమిషాల ముందు స్టీవ్ ఎవరెవరితో మాట్లాడాడో చూపించి అతని జీవితాన్ని ఆవిష్కరించారు. అన్ని సంభాషణలు అప్పుడే జరిగి ఉండకపోవచ్చు. కానీ అన్నీ అతని జీవితంలో జరిగిన ఘట్టాలే. ఈ చిత్రం ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం.

1984లో మ్యాకింటాష్ కంప్యూటర్ విడుదలకు ముందు వేదిక మీద సన్నాహాలు జరుగుతూ ఉంటాయి. యాండీ ముఖ్య ఇంజనీర్. విడుదల సమయంలో కంప్యూటర్ చేత ‘హలో’ అనిపించాలని స్టీవ్ ఆలోచన. అయితే అది జరిగే సూచనలు లేవు. ఆ కంప్యూటర్‌కి ఆ సామర్థ్యం లేదు. అయినా స్టీవ్ పట్టుబడతాడు. కంప్యూటర్ చేత హలో అనిపించకపోతే అందరి ముందూ యాండీని దోషిగా నిలబెడతానని స్టీవ్ బెదిరిస్తాడు. జొయానా యాపిల్ కంపెనీలో మార్కెటింగ్ అధ్యక్షురాలు. స్టీవ్‌కి ఆంతరంగికురాలు. ఆమె స్టీవ్‌ని మంకు పట్టు వీడమంటుంది. స్టీవ్ వినడు. వినడని ఆమెకి తెలుసు. అయినా ఆశ.

1983లో టైమ్ ప్రత్రిక ‘పెర్సన్ ఆఫ్ ద ఇయర్’ గా పెర్సనల్ కంప్యూటర్ (పీసీ) ని ప్రకటించింది. ఇంటిలోకి కంప్యూటర్ అప్పుడే ప్రవేశించింది. బిల్ గేట్స్ రూపొందించిన కంప్యూటర్ అది. ఆ సంచికలో స్టీవ్ ప్రస్తావన కూడా వస్తుంది. స్టీవ్ బిల్ గేట్స్‌కి పోటీ. స్టీవ్ తన ప్రియురాలైన క్రిశాన్‌ని గర్భవతిని చేసి వదిలేశాడని, కోర్ట్ పితృత్వ పరీక్షలు చేయించి అతనే ఆ బిడ్డకు తండ్రి అయ్యే అవకాశం 94.1% ఉందని చెప్పిందని ఆ సంచికలో పేర్కొంటారు. స్టీవ్ ఏవో లెక్కలు వేసి 28% అమెరికన్ పురుషుల్లో ఎవరైనా ఆ బిడ్డకి తండ్రి కావచ్చని ఆ సంచికలో అంటాడు. కోర్టు ఆదేశించిన 385 డాలర్లు క్రిశాన్‌కి నెలనెలా స్టీవ్ భరణంగా ఇస్తూ ఉంటాడు. ఆనాటి టైమ్ సంచికలో పీసీని పెర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా ప్రకటించారు కాబట్టి స్టీవ్ రూపొందించిన మాకింటాష్ ఇంకా బావుంటుందని చెప్పటానికి ఆ సంచిక ప్రతులని ఈ విడుదల సందర్భంగా వచ్చినవారికి పంచిపెడితే బావుంటదని భావించి ఒక నిర్వాహకుడు ఆ ప్రతులని తెప్పిస్తాడు. అయితే ఇందులో కుట్ర ఉందని స్టీవ్ జొయానా దగ్గర కోపం ప్రదర్శిస్తాడు. ఆ సంచికలో తన గురించి వ్రాసిన విషయాలు తెలిసి కూడా ఇలా చేశారంటే అది కుట్రే అని అతని అభిప్రాయం. జొయానా ఆ ప్రతులని పంచటం లేదని అతనికి సర్దిచెబుతుంది.

ఓ పక్కన ఆవిష్కరణకి సమయం దగ్గరపడుతూ ఉంటుంది. అప్పుడే క్రిశాన్ ఐదేళ్ళ కూతురు లీసాని తీసుకుని అక్కడికి వస్తుంది. స్టీవ్‌తో మాట్లాడాలని అంటోందని జొయానా అంటుంది. స్టీవ్ కుదరదంటాడు. ఇప్పుడు మాట్లాడకపోతే ఆమె కార్యక్రమానికి వచ్చిన పాత్రికేయులతో అతను ఎంత నిర్దయుడో చెబుతుందని జొయానా హెచ్చరిస్తుంది. స్టీవ్ గత్యంతరం లేక ఆమెతో మాట్లాడతాడు. నలభై నాలుగు కోట్ల డాలర్ల సంపద ఉండి కూడా అతను కేవలం కోర్టు ఆదేశించిన చిన్న మొత్తం మాత్రమే ఇవ్వటం ఏమిటని ఆమె అడుగుతుంది. తాను అమెరికాలోని 28% మంది పురుషులతో పడుకున్నానని అర్థం వచ్చేటట్టు ఎందుకు మాట్లాడావని నిలదీస్తుంది. తాము అరకొర వసతులతో జీవిస్తున్నామని బాధపడుతుంది. అతను మొండిగా తాను లీసా తండ్రిని కాదని అంటాడు.

లీసా స్టీవ్‌ని ‘డాడ్’ అని పిలుస్తుంది. మ్యాకింటాష్ కంప్యూటర్‌కి లీసా అని తన పేరే పెట్టాడని అంటుంది. కాదంటాడు స్టీవ్. అది కేవలం కాకతాళీయమని, లీసాకి వేరే అర్థం ఉందని అంటాడు. లీసా చిన్నబుచ్చుకుంటుంది. తర్వాత ఒక మ్యాకింటాష్ కంప్యూటర్ మీద ఆడుకోమని లీసాకి చెప్పి అక్కడే ఉన్న క్రిశాన్‌తో మాట్లాడతాడు. తాము స్కూళ్ళకు వేల సంఖ్యలో కంప్యూటర్లు విరాళంగా ఇస్తున్నామని అంటాడు. ఆమె “నేనడిగిన దానికి, నువ్వు చెప్పేదానికి సంబంధం ఏమిట”ని అడుగుతుంది. అతని దృష్టిలో అతను సమాజానికి సేవ చేస్తున్నాడు. ఆమె అనవసరంగా తనని ఇబ్బందిపెడుతోందని అతని అభిప్రాయం. కొందరి ఆలోచనలు అలాగే ఉంటాయి. వాస్తవాలను సరిగా చూడలేని బలహీనత. వారిద్దరూ మాట్లాడుకుంటుంటే లీసా కంప్యూటర్ మీద ఒక చిత్రం గీస్తుంది. ఇది ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అని అంటుంది. అది చూసి స్టీవ్ అబ్బురపడతాడు. ఐదేళ్ళ లీసా అంత త్వరగా కంప్యూటర్ మీద చిత్రం గీయటంతో అతనికి ఆశ్చర్యం కలుగుతుంది. క్రిశాన్‌కి డబ్బు ఇస్తానని, ఇల్లు కొనిపెడతానని అంటాడు. ఇది అతని అహంకారం. లీసాలో తనని తాను చూసుకున్నాడు. లీసా తన కూతురని ఎప్పుడో రుజువైంది. అతనికీ తెలుసు. అయితే తన ప్రతిష్ఠనీ, తన కంపెనీ ప్రతిష్ఠనీ కాపాడుకోవాటానికి ప్రపంచానికి అబద్ధం చెప్పాడు. ‘నేను ఘనకార్యాలెన్నో చేస్తుంటే మధ్యలో ఈ గొడవలేమిటి?’ అనుకున్నాడు. కానీ లీసాలో తనని తాను చూసుకుని అతని అహం సంతృప్తి చెందింది. అందుకే ఆమెకి కావలసినవి సమకూర్చటానికి ఒప్పుకున్నాడు. క్రిశాన్ వెళ్ళిన తర్వాత జొయానా అతన్ని చీవాట్లేస్తుంది. “ఒక పాప నువ్వే తన తండ్రివని అనుకుంటుంటే నీ మొండితనం ఏమిటి?” అంటుంది. “నేను ప్రపంచాన్నే మార్చేయబోతున్నాను. నన్ను వదిలెయ్” అంటాడతను.

స్టీవ్‌తో కలిసి కంపెనీ మొదలు పెట్టిన స్టీవ్ వాజ్నియాక్ అతన్ని కలవటానికి వస్తాడు. ఇద్దరి పేర్లూ స్టీవే కావటంతో స్టీవ్ వాజ్నియాక్‌ని వాజ్ అని సంబోధిస్తారు. వాజ్ ఇంతకు ముందు యాపిల్ 2 కంప్యూటర్‌ని తయారు చేసిన బృందం కృషిని గుర్తిస్తున్నట్టు ప్రకటించమంటాడు. యాపిల్ 2 కంప్యూటర్ బాగా అమ్ముడుపోతోంది. అయితే స్టీవ్ వాజ్ అడిగినదానికి ఒప్పుకోడు. ఆకాశం వైపు దూసుకుపోతున్నపుడు మధ్యలో నేలచూపులు ఎందుకు అంటాడు. నిజానికి కంపెనీ మొదలుపెట్టినపుడు స్టీవ్ తమ కంప్యూటర్ వేరే కంప్యూటర్లతో అనుసంధానం కాకుండా ఉండాలని అంటాడు. అన్నీ తానే చేసేలా తమ కంప్యూటర్ ఉండాలని అంటాడు. “నువ్వు ఎవరితో కలవవు కాబట్టి కంప్యూటర్లు కూడా ఎవరితో కలవకూడదంటే ఎలా?” అంటాడు వాజ్. వాజ్ తన మాట నెగ్గించుకున్నాడని స్టీవ్‌కి అక్కసు. అందుకే యాపిల్ 2 బృందాన్ని గుర్తించనని అంటాడు.

కార్యక్రమానికి సమయం దగ్గర పడుతుంది. యాండీ తాను కంప్యూటర్ చేత హలో అనిపించలేనని అంటాడు. అనాల్సిందేనని స్టీవ్ అంటాడు. అది హలో అనకపోతే వచ్చిన నష్టమేమిటి అని జొయానా అంటే స్టీవ్ జవాబు చెబుతాడు. కంప్యూటర్ అంటే అదో భూతమన్నట్టు హాలీవుడ్ సినిమాలు చూపించాయి. స్టీవ్ రూపొందించిన కంప్యూటర్ చూడటానికి నవ్వుతున్నట్లు ఉంటుంది. దాని చేత హలో అనిపిస్తే ప్రజలు దాన్ని ఇష్టపడతారని స్టీవ్ ఆలోచన. ఇప్పుడంటే మనకు స్మార్ట్ ఫోన్ల వల్ల అంతా అలవాటయిపోయింది కానీ దాదాపు నలభై ఏళ్ళ క్రితం కంప్యూటర్ మాట్లాడటమంటే వింతే. యాండీ ఎక్కువ మెమరీ ఉన్న కంప్యూటర్ చేత హలో అనిపిస్తానని అంటాడు. కానీ అది ఇంకా పూర్తిగా తయారు కాలేదు. ప్రస్తుతం విడుదల చేసే కంప్యూటర్ అది కాదు. జొయానా ఒప్పుకోదు. అది మోసమంటుంది. స్టీవ్ బతిమిలాడి ఆమెని ఒప్పిస్తాడు. ఆ విధంగా తను అనుకున్నది సాధిస్తాడు స్టీవ్. ఎలాగైనా తను అనుకున్నది సాధించాలనే అతని నైజం ఇక్కడ బయటపడుతుంది.

వేదిక మీదికి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళటానికి సీఈఓ జాన్ స్కలీ, స్టీవ్ వేదిక వెనకకు చేరుకుంటారు. పెప్సీ కంపెనీని నడిపే జాన్‌ని యాపిల్ కంపెనీ నడపమని స్టీవే తీసుకువచ్చాడు. అతని అనుభవం పని చేస్తుందని. స్టీవ్ బాబ్ డిలన్ పాడిన పాటనొకదాన్ని వేదిక మీద కోట్ చేస్తానని అంటాడు. అందులో “మీ బిడ్డలు మీ మాట వినరు. పాత బాట మారుతోంది. కాలం మారుతోంది” అనే మాటలు ఎంచుకుంటాడు. అది విని జాన్ “దత్తతకు వెళ్ళినవాళ్ళు తాము ఒకరింటి సభ్యుడిగా ఆహ్వానించబడ్డామని అనుకోకుండా ఒక ఇంటి నుంచి వెలివేయబడ్డామని ఎందుకు అనుకుంటారు?” అని అడుగుతాడు. స్టీవ్ పసిగుడ్డుగా ఉన్నప్పుడే దత్తతకు వెళ్ళాడు. “మన జీవితం వేరొకరు నియంత్రిస్తున్నారంటే అది భరించలేని విషయం” అంటాడు. దత్తతకి వెళితే తన జీవితం వేరొకరు నిర్ణయించినట్లని అతని ఉద్దేశం. ఎవరి కడుపున పుట్టాలో అతను నిర్ణయించుకున్నాడా? అసలు కారణం వేరే ఉంది. అది చిత్రంలో తర్వాత తెలుస్తుంది.

నా మాటకు ఎవరూ అడ్డుచెప్పకూడదు. నేను గొప్ప పనులు చేస్తున్నాను కాబట్టి ఎవరూ నాకు అవాంతరాలు కలిగించకూడదు. నా ప్రతిష్ఠ దిగజార్చకూడదు. నా వల్ల వారి జీవితం పాడైనా సరే. ఇది స్టీవ్ మనస్తత్వం. చిన్నప్పుడు తన జీవితం వేరొకరు మలిచారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు తన జీవితాన్ని శాసిస్తారంటే భరించలేని నైజం. మంచి మనిషిగా ఉండటమా, లేక విజయం కోసమే ఆరాటపడటమా అనేది ప్రతి మనిషి ఆలోచించుకోవాలి. మంచి మనిషిగా ఉంటే అందరూ ప్రేమగా గుర్తుచేసుకుంటారు. విజయం కోసం ఏమైనా చేస్తాను అంటే జీవితంలో చివరకు నా అన్నవారే ఉండకపోవచ్చు. అయితే స్టీవ్ తర్వాత మారాడు. ఈ చిత్రం 1998లోనే ముగుస్తుంది. ఆ తర్వాత ఐపాడ్, ఐఫోన్, ఐప్యాడ్ లాంటి ఎన్నో విప్లవాత్మకమైన పరికరాలను స్టీవ్ ప్రపంచానికి అందించాడు. క్యాన్సర్ బారినపడ్డాడు. అన్నీ అతని చేతుల్లోనే ఉండవు కదా. క్యాన్సర్ వ్యాధే అతనిలో మార్పుని తెచ్చిందేమో. నిజజీవితంలో వాజ్ ఈ చిత్రం చూసి నిజజీవితంలో స్టీవ్ ఎలా ప్రవర్తించేవాడో దానికి చాలా దగ్గరగా ఈ చిత్రం ఉందని అన్నాడు. అయితే తాను యాపిల్ 2 బృందం గురించి వేదిక మీద చెప్పమని అడగలేదని, కానీ ఆ బృందమంటే అతనికి అయిష్టత ఉన్నమాట నిజమేనని అన్నాడు. రెండు గంటల సినిమాలో కొన్ని విషయాలు చెప్పాలంటే నాటకీయత జోడించక తప్పదు.

స్టీవ్‌గా మికెల్ ఫాస్బెండర్, జొయానాగా కేట్ విన్స్లెట్ నటించారు. ఇద్దరికీ ఆస్కార్ నామినేషన్లు వచ్చాయి. చిత్రంలోని మూడు భాగాలను మూడు రకాలుగా చిత్రీకరించటం విశేషం. మొదటి భాగం పాత సినిమాలా ఉంటుంది. రెండో భాగం కొంచెం స్పష్టంగా ఉంటుంది. మూడో భాగం డిజిటల్ కెమెరాతో తీయటంతో చాలా స్పష్టంగా ఉంటుంది. సంభాషణలు చాలా పదునుగా ఉంటాయి. రచయిత ఆరన్ సార్కిన్ పదునైన సంభాషణలకు పెట్టింది పేరు. ఒక సందర్భంలో యాండీని స్టీవ్ “నీకు మూడు వారాల సమయం ఉన్నా చేయలేకపోయావు. ప్రపంచం ఒక వారంలోనే సృష్టించబడింది” అంటాడు. క్రైస్తవ మతవిశ్వాసాల ప్రకారం దేవుడు సృష్టి ఒక వారంలోనే చేశాడు. యాండీ “నిజమే. కాస్త సమయం దొరికినపుడు నువ్వు ఒక వారంలోనే సృష్టి ఎలా చేశావో చెబితే వింటాను” అంటాడు. అంటే స్టీవ్ తనని తాను దేవుడిగా భావించుకుంటాడని వ్యంగ్యం.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు.

1986లో మ్యాకింటాష్ అమ్మకాలు సరిగా లేకపోవటంతో యాపిల్ 2 కి ప్రాధాన్యత ఇవ్వాలని కంపెనీ భావిస్తుంది. స్టీవ్ వ్యతిరేకిస్తాడు. కంపెనీ అతనికి ఉద్వాసన పలుకుతుంది. దీనికి జాన్‌యే కారణమని ప్రపంచమంతా అనుకుంటుంది. ఓ పక్క వాజ్ ఒక ప్రత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టీవ్ ఇతరులను కించపరిచే స్వభావం కలవాడని అంటాడు. స్టీవ్ నెక్స్ట్ అనే కొత్త కంపెనీ పెట్టి కొత్త కంప్యూటర్‌ని తయారు చేస్తాడు. అయితే అది చాలా ఖరీదైనది. కాకపోతే భావి తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినది. దాని కోసం యాపిల్ కంపెనీ తన కంపెనీని కొనుగోలు చేస్తుందని, తనని మళ్ళీ ఆహ్వానిస్తుందని స్టీవ్‌కి తెలుసు. జొయానా అతని వెన్నంటే ఉంటుంది కానీ ఆమెకి కూడా ఈ పథకం తెలియదు. స్టీవ్ అనుకున్నట్టే జరుగుతుంది. మరో పక్క క్రిశాన్ లీసాని సరిగా చూసుకోవట్లేదని తెలుస్తుంది. “నీతోనే ఉంటాను” అని లీసా స్టీవ్‌తో అంటుంది. కానీ స్టీవ్ పట్టించుకోడు. క్రిశాన్‌ని చంపించేస్తానని మాత్రం బెదిరిస్తాడు. ఈ విషయాలన్నీ 1988లో జరిగే రెండవ భాగంలో ఉంటాయి.

1998లో ఐమ్యాక్ విడుదల కార్యక్రమం పెడతారు. అప్పటికే యాపిల్ కంపెనీ జాన్‌ని తొలగించి స్టీవ్‌ని సీఈఓగా పెట్టింది. లీసా పంతొమ్మిదేళ్ళ అమ్మాయి. క్రిశాన్ ఇల్లు అమ్మేస్తుంది. దానికి లీసా అడ్డు చెప్పలేదని స్టీవ్‌కి కోపం. ఆ ఇల్లు తాను కొనిచ్చాడని అతని వాదన. లీసా హార్వర్డ్‌లో చదువుతూ ఉంటుంది. ఆమెకి సెమెస్టర్ ఫీజు కట్టనని స్టీవ్ అంటాడు. యాండీ క్రిశాన్‌కి స్నేహితుడు. అతను లీసా ఫీజు కడతాడు. ఇరవై ఐదు వేల డాలర్లు. స్టీవ్ ఫీజు ఎందుకు కట్టావని అడిగితే “మీ గురించి నాకు తెలుసు. చివరకి మీ గొడవలు సద్దుమణుగుతాయి. ఈ లోపల ఫీజు కట్టకపోతే సెమెస్టర్ పోతుంది. అందుకే కట్టాను” అంటాడు యాండీ. లీసా థెరపీకి (కౌన్సెలింగ్) వెళుతోందని స్టీవ్ అంటాడు. మానసిక సమస్యలు ఉన్న వాళ్ళు థెరపీకి వెళతారు. యాండీయే లీసాని థెరపీకి పంపించమని క్రిశాన్‌కి చెప్పాడు. లీసాకి తండ్రి స్థానంలో ఎవరూ లేకపోవటంతో థెరపీ అవసరమని యాండీయే చెప్పాడని స్టీవ్ నింద వేస్తాడు. యాండీ ఒప్పుకుంటాడు. స్టీవ్‌కి ఆ విషయం ఎలా తెలిసింది? క్రిశాన్ అక్కసుతో అతనికి చెప్పి ఉంటుంది. యాండీ “లీసాకి తల్లి ప్రేమా దక్కలేదు, తండ్రి ప్రేమా దక్కలేదు. అయినా ఆ అమ్మాయి మంచి అమ్మాయిగా మారింది. ఇదొక అద్భుతం” అంటాడు. స్టీవ్ ఆలోచనలో పడతాడు. యాండీ డబ్బు అతనికి తిరిగి ఇచ్చేస్తానని అంటాడు. యాండీ వెళుతూ వెళుతూ “అందరూ నీ పట్ల అయిష్టంగా ఉండాలని ఎందుకు అనుకుంటావు?” అంటాడు. “ఎవరూ అయిష్టంగా ఉండాలని అనుకోను. ఎవరు అయిష్టంగా ఉన్నా పట్టించుకోను అంతే” అంటాడు స్టీవ్. “నువ్వు ఎలాగూ పట్టించుకోవు కాబట్టి చెబుతున్నాను. నువ్వంటే నాకు అయిష్టం” అంటాడు యాండీ. “నువ్వంటే నాకెప్పుడూ ఇష్టమే” అంటాడు స్టీవ్.

అవతలి వారిని బెదిరిస్తేనే మాట వింటారు అనుకునే స్వభావం స్టీవ్‌ది. యాండీని గతంలో బెదిరించాడు. లీసాని ఫీజు కట్టనని బెదిరించాడు. ఎవరేం అనుకుంటే నాకేం అనుకున్నాడు. ప్రేమతో సాధించాలనే ఆలోచనే అతనికి రాదు. అందుకే అందరూ అతనికి దూరమవుతారు. దీనికి ఒక కారణం చిన్నప్పుడు జరిగిన సంఘటనలు. ఆ సంఘటనల గురించి అతను తనను కలవటానికి వచ్చిన జాన్‌కి చెబుతాడు. స్టీవ్ ఒక అమెరికన్ స్త్రీకి, ఒక అరబిక్ పురుషుడికి పుట్టాడు. ఆమె తలిదండ్రులు వారి పెళ్ళికి ఒప్పుకోకపోవటంతో ఆమె బిడ్డని దత్తత ఇచ్చింది. దత్తత తీసుకునేవారు బాగా చదువుకున్నవారై ఉండాలని ఆమె షరతు. ఒక దంపతులు దత్తత తీసుకుంటారు. కానీ కొన్నాళ్ళకి బిడ్డని తిరిగి ఇచ్చేస్తారు. తర్వాత వేరొక దంపతులు దత్తత తీసుకుంటారు. వారు చదువుకున్నవారు కాకపోవటంతో బిడ్డ తల్లి అభ్యంతరం చెబుతుంది. దాంతో కేసు కోర్టుకెళుతుంది. బిడ్డ పెంపుడు తల్లి దగ్గరే ఉంటాడు. అయితే ఆమె అతన్ని కోల్పోతాననే భయంతో అతనితో అనుబంధం పెంచుకోకుండా దూరంగా ఉంచుతుంది. చివరికి దత్తత తీసుకున్నవారు బిడ్డని బాగా చదివిస్తామని చెప్పటంతో దత్తత ఖారారవుతుంది. పెద్దయ్యక ఈ విషయాలు తెలిసి స్టీవ్ బాధపడతాడు. “నేనేం చేశానని నన్ను మొదటి దంపతులు తిరిగి ఇచ్చేశారు? నన్ను పెంపుడు తల్లి ఎలా దూరం పెట్టగలిగింది?” అనేవి అతని మనసుని తొలిచేసే ప్రశ్నలు. అందుకే అతనికి మనుషుల మీద నమ్మకం పోయింది. కానీ మానవత్వం వదులుకుంటే లౌకికంగా లాభపడొచ్చేమో, అలౌకిక ఆనందం కావాలంటే మానవత్వం ఉండాలి. స్టీవ్ తనకు జన్మనిచ్చిన తండ్రిని వెతికి పట్టుకుంటాడు. అయితే అతనికి తాను అతని బిడ్డనని చెప్పడు. “నా డబ్బు కోసం అతను నా మీద దావా వేసినా వేస్తాడు” అంటాడు! మనుషుల మీద అంత అపనమ్మకం. ఇంతకీ జాన్ ఎందుకు వచ్చాడు? అతను స్టీవ్ లాగా అక్కసు పెట్టుకునే మనిషి కాదు. స్టీవ్‌ని అభినందించాలని వచ్చాడు.

స్టీవ్ లీసాతో కూడా మాట్లాడతాడు. క్రిశాన్‌కి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, అందుకే ఇల్లు అమ్మేసిందని లీసా అంటుంది. అవన్నీ కల్లబొల్లి కబుర్లని, ఆమె డబ్బు దుబారా చేస్తోందని స్టీవ్ అనటంతో లీసాకి కోపం వస్తుంది. పాత టైమ్ పత్రికలో వచ్చిన వ్యాసం చదివానని అంటుంది. “అమ్మ ఏవో భయాలు, శంకలు పెట్టుకుని తప్పులు చేస్తుందేమో, కానీ నువ్వు తప్పుడు మాటలు అనటానికి కారణం ఏమిటో ఆలోచించుకో” అని విసవిసా వెళ్ళిపోతుంది. స్టీవ్ మెత్తబడతాడు. ఆమె వెనకాల వెళ్ళి తాను ఆమె పేరునే మ్యాకింటాష్ కంప్యూటర్‌కి పెట్టానని అంటాడు. మరెందుకు కాదన్నావు అంటే నాకు తెలియదు అంటాడు. “నువ్వు నా తండ్రివి కాదని ఎందుకన్నావు?” అంటే “నాలో మానసికమైన లోపం ఉంది” అంటాడు. ఆ మాటతో లీసా అతన్ని క్షమిస్తుంది.

తాను కూడా కంప్యూటర్ లాంటి యంత్రాన్నని, లోపాలుంటే యంత్రం సరిగా పనిచేయనట్టే తానూ సరిగా ప్రవర్తించనని స్టీవ్ భావన. కానీ మనిషికి విచక్షణ ఉంటుంది. తనను తాను మార్చుకునే అవకాశం అన్ని జీవరాశులలో మనిషికి మాత్రమే ఉంది. కాకపోతే లౌకికమైన లక్ష్యాలతో మనిషి పరుగులు పెడుతూ స్వధర్మాన్ని మరచిపోతాడు. అలా మరచిపోకుండా పాఠాలు నేర్పేవే స్టీవ్ లాంటి వారి జీవితాలు. ఎంత సాధించినా అంతరాత్మకి సమాధానం చెప్పుకోలేకపోతే వృథా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here