[dropcap]ఒ[/dropcap]క్కోసారి మనుషులకు ఇతరుల గురించిన పట్టింపే ఉండదు అనిపిస్తుంది. తమ పని అయిపోతే చాలు అనుకునేవారు పెరిగిపోతున్నారు. ఇదేదో ఆస్తుల గురించి, పదవుల గురించి చెప్పటం లేదు. చిన్న చిన్న విషయాలలో కూడా ఈ ధోరణి కనిపిస్తుంది. ఉదాహరణకి ఎక్కడైనా వరుసలో నిలబడి మన వంతు కోసం ఎదురుచూస్తుంటే ఎవరో ఒకరు వరుస మధ్యలో దూరిపోతారు. ఇది చిన్న విషయమేగా అనవచ్చు, కానీ చిన్న విషయమైతే ఆ మనిషి కాస్త వేచి ఉండొచ్చు కదా? కనీస మర్యాద పాటించకపోతే ఎలా? ఇలాంటివి పట్టించుకుంటే బుర్ర పాడవటం తప్ప ఫలితం ఉండదని కొందరు అనవచ్చు. లేకపోతే గుంపులో గోవిందా అని అందరూ అలాగే ప్రవర్తించవచ్చు. ప్రస్తుతం పరిస్థితి అలాగే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనిషి మీద మనిషికి పట్టింపు లేదని మథనపడే ఒక స్త్రీ కథ ‘ఐ డోన్ట్ ఫీల్ ఎట్ హోమ్ ఇన్ దిస్ వరల్డ్ ఎనీమోర్’ (2017). అంటే నేనీ లోకంలో ఇమడలేకపోతున్నాను అని అర్థం. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం.
రూత్ అమెరికాలో ఒక హాస్పిటల్లో సహాయకురాలు. ఆమె ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది. ఆమెకి అమర్యాదపూర్వకమైన మనుషుల ప్రవర్తన చూసి చిరాకుగా ఉంటుంది. అమెరికాలో ఒకప్పుడు అందరూ మర్యాదపూర్వకంగా ఉండేవారు. ప్రధాన రహదారి కాకుండా చిన్న వీధుల్లో ఎవరైనా రోడ్డు దాటుతుంటే కారులో ఉన్నవారు వారు దాటే దాకా అగేవారు. రహదారి మీద కారు లేన్ మారాలంటే ఇండికేటర్ ఇస్తే చాలు, పక్క లేన్లో కారు దారి ఇచ్చేది. దుకాణాల్లో క్యాషియర్ దగ్గరకి ఇద్దరు ఒకేసారి వస్తే “మీరు ముందు వెళ్ళండి” (లఖనవూ ప్రాంతాల్లో ఒకప్పుడు ‘పెహలే ఆప్’ అనే పధ్ధతి ఉండేదట) అని మర్యాద చూపించేవారు. అవన్నీ ఇప్పుడు మారిపోయాయి. నేను ముందంటే నేను ముందు అనే సంస్కృతి పెరుగుతోంది. దీనికి ఎన్నో కారణాలు. ప్రభుత్వాలు ప్రజలకు సరైన అవకాశాలు కల్పించలేకపోవటం, పోటీ పెరగటం, నగరాల్లో జనాభా పెరగటం, మానవసంబంధాలు దెబ్బతినటం – ఇలా ఎన్నో కారణాలు. కనీస మర్యాద లేకపోవటం రూత్‌ని అసహనానికి గురి చేస్తుంది.
ఒకరోజు ఆమె ఇంట్లో దొంగతనం జరుగుతుంది. ల్యాప్‌టాప్, ఆమె నానమ్మ ఇచ్చిన వెండి సామాను, కొన్ని మందులు దొంగిలిస్తారు. రూత్ కుంగుబాటు తగ్గడానికి మందులు వాడుతూ ఉంటుంది. పోలీసులు వస్తారు. ల్యాప్‌టాప్ జాడ తెలిపే యాప్ ఉందా అని అడుగుతారు. ఉంది కానీ ల్యాప్‌టాప్ ఆఫ్ చేసి ఉండటం వలన జాడ తెలియట్లేదంటుంది ఆమె. “దొంగలు వెనక తలుపు నుంచి వచ్చారు. పగలగొట్టిన సూచనలేమీ కనపడటం లేదు. మీరు తలుపు తాళం వేశారా?” అని అడుగుతాడు ఒక పోలీసు. “గుర్తు లేదు” అంటుంది రూత్. పోలీసు ఆమెని వింతగా చూస్తాడు. పోలీసులు వెళ్ళిపోతుంటే ఆమె “ఇప్పుడేం చెయ్యాలి?” అంటుంది. “ఏమైనా సమాచారముంటే మీకు చెబుతాం. ఈ లోపల మీరు ఇంటి తాళాలు జాగ్రత్తగా వేసుకోవటం మీద దృష్టి పెట్టండి” అంటాడు ఆ పోలీసు. వారి పని ఒత్తిడి వారికుంటుంది. దాడులు, హత్యలు చూడాలా లేక ఇలాంటి దొంగతనాలు చూడాలా? రూత్‌కి అసహనం పెరుగుతుంది. మనుషులెలా అనుమతి లేకుండా ఇంకొకరి ఇంటిలోకి వస్తారనేది ఆమె ప్రశ్న. దొంగతనాలు ప్రపంచంలో కొత్తేమీ కాదు. కానీ ఆమె మనఃస్థితి బావుండక ఇంకా కుంగిపోతుంది. ఆ రాత్రి తన స్నేహితురాలి ఇంటిలో గడుపుతుంది. స్నేహితురాలితో “ఈరోజు ఒక పేషెంట్ నా కళ్ళెదుటే చనిపోయింది. మంచిమనిషా అంటే కాదు. బూడిదైపోతుంది. మా నానమ్మ ఎందరికో సేవ చేసింది. ఆమె కూడా బూడిదైపోయింది. నేను కూడా బూడిదైపోతాను. ఈ జీవితానికి అర్థం ఏమిటి? మనుషులెందుకు ఒకరినొకరు పట్టించుకోరు? నాకు, నాకు అని ఎప్పుడూ పోగుచేసుకోవటమే. అందరూ వెధవలే. ఈ వెధవల మధ్య నాకు ఒక్కోసారి ఊపిరి ఆడదు” అంటుంది. ఆమె తన ఉనికిని తాను ప్రశ్నించుకుంటోంది. ఇలాంటి పరిస్థితి చాలామందికి వస్తుంది. స్నేహితురాలు సముదాయిస్తుంది.
పరిస్థితుల్ని చూసి కుంగిపోకుండా ఉండాలంటే అంటీముట్టనట్టు ఉండాలి. మనం ధర్మంగా ఉన్నామనే నమ్మకం ఉంటే మిగతాది పట్టించుకునే అవసరం లేదు. అందరూ భగవంతుని రూపాలే. వారికి తెలియక స్వార్థంతో ప్రవర్తిస్తే తెలిసినవారు కుంగిపోవలసిన అవసరం లేదు. వారికి తెలియనందుకు జాలిపడాలి. కళ్ళ ముందు తప్పు జరిగితే అడగవచ్చు, కానీ అందరూ మారాలని కోరుకోవటం అత్యాశే. ఎక్కడిదక్కడ వదిలేయాలి. మనకి అన్యాయం జరిగితే న్యాయవ్యవస్థ సాయం తీసుకోవచ్చు. కానీ అన్నీ మనకు అనుకూలంగా జరగవు. కొన్ని ‘మన ప్రాప్తం ఇంతే’ అనుకుని వదిలేయాలి. పైగా రూత్ వెనక తలుపు తాళం వేశానో లేదో గుర్తు లేదని అంది. ఈరోజుల్లో మన జాగ్రత్తలో మనముండాలి. అవసరమైతే ఒక జాబితా వ్రాసుకుని అన్ని తాళాలు వేశామా, ఆఫ్ చేయాల్సినవన్నీ అఫ్ చేశామా అని చూసుకోవాలి. నా జాగ్రత్తలు నేను మర్చిపోయినా అవతలి వారు తప్పు చేయకూడదంటే కుదరదు కదా. రూత్ పోలీసుల సాయం లేకపోయినా నేనే నా వస్తువులు తెచ్చుకుంటాను అని బయలుదేరుతుంది. అయితే అక్కడితో ఆగదు. మరి ఏం చేయాలని ఆమె ఉద్దేశం? అది తర్వాత తెలుస్తుంది.
మర్నాడు తన ఇంటి పెరట్లో తడి మట్టిలో ఆమెకి ఒక పాదముద్ర కనిపిస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసి ఆ పాదముద్ర అచ్చు తీస్తుంది. ఆ అచ్చుని పరీక్షిస్తే బూటు అడుగు ముద్ర ఉంటుంది కానీ చివర మాత్రం కొంతమేర నున్నగా ఉంటుంది. ఇంటి చుట్టుపక్కల వారు దొంగని చూశారా అని వారిని అడుగుతుంది. చూడలేదంటారు వాళ్ళు. వారిలో నిర్లిప్తతే ఎక్కువ ఉంటుంది. టోనీ అనే అతను మాత్రం ఆమె చెప్పింది విని ఇది దారుణమని మండిపడతాడు. అతను జపనీస్ పోరాటవిద్యలు తెలిసినవాడు. కానీ ధైర్యం తక్కువ. తడబడుతూ ఉంటాడు. అతను సానుభూతి చూపించటంతో రూత్‌కి అతని మీద మంచి అభిప్రాయం కలుగుతుంది. ఆ రోజు రాత్రి ఆమె ల్యాప్‌టాప్ జాడ చూపించే యాప్ తెరిచేసరికి ల్యాప్‌టాప్ ఎక్కడుందో తెలుస్తుంది. కేసు చూసే పోలీసుకి ఫోన్ చేస్తే అతను దొరకడు. అందుకని హెల్ప్ లైన్‌కి ఫోన్ చేస్తుంది. కానీ వాళ్ళు వెంటనే ఎవర్నీ పంపలేమంటారు. దాంతో ఆమె టోనీ దగ్గరకు వెళ్ళి తోడు రమ్మంటుంది. ఇద్దరూ కలిసి ల్యాప్‌టాప్ ఉన్న చోటికి వెళతారు. టోనీ తన నాన్ చక్స్, జపనీస్ చక్రం తెస్తాడు.
అక్కడికి వెళ్ళాక వారికి తెలిసేదేమిటంటే అక్కడున్నవాళ్ళు ఆ ల్యాప్‌టాప్‌ని ఒక పాత వస్తువుల దుకాణంలో కొన్నారు. అంటే దొంగిలించినవారు దుకాణంలో అమ్మేశారు. టోనీ దగ్గరున్న ఆయుధాలకి భయపడి వారు ల్యాప్‌టాప్ అప్పగిస్తారు. వారి దగ్గర దుకాణం అడ్రసు తీసుకుని రూత్, టోనీ వచ్చేస్తారు. మర్నాడు ఆ దుకాణానికి వెళతారు. అదో పెద్ద దుకాణం. లోపల తన వెండి సామాను పెట్టె కనిపిస్తుంది రూత్‌కి. టోనీని వెళ్ళి కారు సిద్ధంగా ఉంచమంటుంది. పెట్టె తీసుకుని బయటకి వస్తుంటే ఒకతను దుకాణదారుకి కొన్ని వస్తువులు అమ్మటం కనిపిస్తుంది. అతని బూటు చివర టేపు చుట్టి ఉంటుంది. తన దగ్గర ఉన్న అచ్చు కొంతమేర నున్నగా ఉండటం ఆ టేపు వల్లనే అని రూత్‌కి అర్థమవుతుంది. అతనే దొంగ అని అతన్ని వెంబడిస్తుంది. ఆమె పెట్టె పట్టుకుని వెళుతుండటంతో దుకాణదారు డబ్బు కోసం ఆమెని వెంబడిస్తాడు. అది దొంగ సామానని అమె అంటుంది. అతను వదలడు. ఆమె అతనితో పెనుగులాడుతుంది. అతని ముఖానికి పెట్టె తగిలి రక్తం వస్తుంది. అతను ఆమె చేతి వేలు ఒకటి విరిచేస్తాడు. ఎలాగో తప్పించుకుని కారులో బయటపడతారు. అయితే దొంగ తప్పించుకుంటాడు.
డాక్టరు దగ్గరకి వెళ్ళి తన చేతివేలుకి కట్టు కట్టించుకుంటుంది రూత్. ఇంటికి వెళుతూ “ఈ ప్రపంచం ఇలా అయిపోయిందేమిటి? నేనొక మనిషిని పెట్టెతో కొట్టాను” అంటుంది. తన వల్ల ఒక మనిషి గాయపడటం ఆమెకి మింగుడుపడదు. తాను కూడా ఇతరుల్లాగే తన స్వార్థం చూసుకున్నానని ఆమె బాధపడుతుంది. అందరూ జీవితం కోసం పోరాటం చేస్తున్నారని ఆమెని అనిపిస్తుంది. టోనీ మాత్రం ఆనందంగా ఉంటాడు. “నాకు స్నేహితులు లేరు. నేను తింగరగా ఉంటానని అందరూ అంటారు. ఈరోజు మాత్రం నాకు ఉత్తేజంగా ఉంది. దానికి కారణం నువ్వే” అంటాడు. ఇంటికి వెళ్ళాక రూత్ దొంగని పట్టుకోలేకపోయానని బాధపడుతూ ఉంటుంది. టోనీ ఆ దొంగకి సంబంధించిన వ్యాన్ నంబర్ తాను నోట్ చేసుకున్నానని అంటాడు. దాని సాయంతో హ్యాకింగ్ చేసి అతని ఇంటి అడ్రసు కనుక్కుంటారు.
తన దగ్గర ఉన్న అచ్చు, దొంగ అడ్రసు తీసుకుని రూత్ కేసు చూస్తున్న పోలీసు దగ్గరకి వెళుతుంది. జరిగిందంతా చెబుతుంది. అతను “మీరు ఆ వ్యాన్ యజమానే దొంగ అని కచ్చితంగా చెబుతున్నారు. మీ ల్యాప్‌టాప్ ఎవరి దగ్గర దొరికిందో వాళ్ళే దొంగలని మీరు అనుకున్నారు కదా. కానీ అది అబద్ధమని తేలింది కదా. ఇలా మీ సొంతంగా పరిశోధన చెస్తే మీకు ప్రమాదమని మీకు తెలియదా?” అంటాడు. అతను అన్నదాంట్లో కూడా నిజముంది. అయితే అతనొక తప్పుడు మాట కూడా అంటాడు. “మీ మందులు మళ్ళీ కొనుక్కున్నారా?” అని. అంటే మందులు వేసుకోకపోవటం వల్ల ఆమె మతి తప్పినట్టు ప్రవర్తిస్తోందని అర్థం వస్తుంది. ఆమె చిన్నబుచ్చుకుని “నాకు సాయం చేయటం మీ పని కాదా?” దానికి అతను ఇంకా రెచ్చిపోయి “మీరు తలుపులు తెరిచిపెడితే ఎవరో వచ్చి దొంగతనం చేశారని ఇప్పుడు మేము అన్ని పనులూ మానుకుని మీకోసం రావాలా? మీ వెండి సామాను కన్నా పెద్ద సమస్యలు ప్రపంచంలో చాలా ఉన్నాయి” అంటాడు. ఇక్కడ అనుకోని పరిణామం జరుగుతుంది. ఆ పోలీసుకి తన సమస్య గుర్తు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటూ “నా భార్య విడాకులు అడుగుతోంది” అంటాడు. ఎవరి సమస్యలు వారికుంటాయి. ఆమె సానుభూతి చూపిస్తుంది కానీ అతను తోసిపారేస్తాడు. చివరికి “మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే నేనే మీ మీద చర్య తీసుకుంటాను” అంటాడు. ఈ సన్నివేశం మరపురానిదిగా నిలిచిపోతుంది. ఆ పోలీసు అన్నట్టు రూత్ తన సమస్య గురించే ఆలోచిస్తోంది. ఆమె స్నేహితురాలు కూడా అమెతో “చాలామంది కన్నా నీ జీవితం బావుందని గుర్తుపెట్టుకో” అంటుంది. మనకి కష్టాలు వచ్చినపుడు మనకంటే కష్టాలలో ఉన్నవారి గురించి ఆలోచించాలి. వారికంటే నేను బాగానే ఉన్నాను కదా అని సాంత్వన పొందాలి. అయినా రూత్‌కి వచ్చింది పెద్ద కష్టమేమీ కాదు. ప్రపంచం మారిపోవాలి అని ఆమె కోరుకోవటం వల్లే ఆమెకి ఈ వేదన. మహామహులే ప్రపంచాన్ని మార్చలేకపోయారు. మనమెంత? మన దృక్పథాన్ని మార్చుకోవాలి కానీ ప్రపంచం మారదు!
ఈ చిత్రానికి మేకన్ బ్లెయిర్ స్క్రీన్ ప్లే వ్రాసి దర్శకత్వం వహించాడు. హాస్యం పాళ్ళు ఎక్కువగా ఉంటాయి. హింస కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. రూత్ పాత్రలో మెలనీ లిన్స్కీ నటించింది. జీవితం పట్ల నిర్వేదాన్ని చక్కగా పలికించింది. టోనీ పాత్రలో ఎలైజా వుడ్ నటించాడు. ‘ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్’ లో ముఖ్యపాత్ర పోషించింది ఇతడే. ఈ పాత్రలో అతను పైకి గంభీరంగా కనిపించినా లోపల భయం ఉంటుంది. అయినా ఏదో చేయాలనే తపన ఉంటుంది. పోలీసు పాత్రలో గ్యారీ యాంథనీ విలియమ్స్ ఆకట్టుకుంటాడు. చివరికి చిత్రం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఈ చిత్రానికి సన్ డ్యాన్స్ చిత్రోత్సవంలో జ్యూరీ అవార్డు వచ్చింది. చిన్న చిత్రాలను ప్రోత్సహించే చిత్రోత్సవం సన్ డ్యాన్స్.
ఈ క్రింద చిత్రకథ మరికొంత ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించేముందు ఇంకో హెచ్చరిక ఉంటుంది.
పోలీసులు తన మాట వినకపోవటంతో రూత్‌కి కసి పెరుగుతుంది. నకిలీ పోలీసు బ్యాడ్జ్ పెట్టుకుని ఆమె, టోనీ కలిసి దొంగ అడ్రసుకు వెళతారు. అదో పెద్ద ఇల్లు. అక్కడ మెరెడిత్ అని ఒకామె ఉంటుంది. వీరు పోలీసులమని చెప్పి లోపలికి వెళతారు. ఆమె కాఫీ చేసి ఇస్తుంది. మాటల్లో వారి వ్యాన్ తన భర్త పేరు మీదున్నా అతని కొడుకు నడుపుతాడని తెలుస్తుంది. ఆమె అతనికి సవతి తల్లి. అతను డ్రగ్స్‌కి అలవాటు పడి జైలుకి వెళ్ళొచ్చాడని, జైల్లో చెడు సావాసాలు ఏర్పడ్డాయని అంటుంది. తన భర్త ఇటీవలే అతని ఏటీఎం కార్డులు క్యాన్సిల్ చేశాడని అంటుంది. ఇంతలో ఆమె భర్త క్రిస్ వస్తాడు. అతనికో బాడీ గార్డు. వీళ్ళని చూడగానే తుపాకీ ఎక్కుపెడతాడు. క్రిస్ ఒక మాఫియా మనిషి. ఏం కావాలని అడుగుతాడు. అతని కొడుకు తన ఇంట్లో దొంగతనం చేశాడని అంటుంది రూత్. “ఎంత డబ్బు కావాలో చెప్పు” అంటాడతను. “నాకు డబ్బు వద్దు. మనుషులు ఇలాంటి వెధవ పనులు చేయకూడదని చెప్పటానికి వచ్చాను” అంటుంది రూత్. అతను ఆమెని అపహాస్యం చేస్తాడు. “నువ్వు అవకాశం ఇవ్వకుండా ఎవరూ నీ జోలికి రారు” అంటాడు. రూత్, టోనీ చేసేదేం లేక బయటకి వస్తారు.
రూత్ అవమానభారంతో కుతకుతలాడుతూ ఉంటుంది. ఇంటి మైదానంలో కర్రలతో చేసిన జంతువుల బొమ్మలు ఉంటే వాటి మీద దాడి చేస్తుంది. ఒక బొమ్మని పెరికి కారులో తీసుకుని పోతుంది. టోనీ ఆమె లోని ఈ మార్పుని చూసి ఖిన్నుడవుతాడు. ఈ పరిణామాలన్నీ బయట వ్యాన్లో ఉన్న క్రిస్ కొడుకు చూస్తాడు. అతనితో పాటు ఒక అమ్మాయి, ఒక నడివయసు వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తి పేరు మార్షల్. వాళ్ళకి నాయకుడు. క్రిస్ ఇంట్లో రహస్యంగా దాచిపెట్టిన సొమ్ము దొంగిలించాలని వారి పథకం. ఆయుధాలు కూడా ఉంటాయి. రూత్‌ని అంతకు ముందు రోజు దుకాణం దగ్గర మార్షల్ చూశాడు. అతనికి అనుమానం వస్తుంది. ఆమెని వెంబడిస్తారు.
ఇంతకు ముందు తన పట్ల ఇతరులు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని అనుకున్న రూత్ పోలీసులు తనకు సాయం చేయకపోవటంతో కసితో అన్ని మర్యాదలూ మర్చిపోతుంది. ఇతరుల పట్ల అమర్యాదగా ప్రవర్తించటం మొదలుపెడుతుంది. సూపర్ మార్కెట్లో నకిలీ పోలీసు బ్యాడ్జ్ ఉన్న కార్న్ ఫ్లేక్స్ డబ్బా కొని ఆమె కేషియర్ దగ్గరకి వచ్చేటపుడు ఒకతన్ని దాటుకుని వస్తుంది. తనకి అమర్యాదగా అనిపించిన పని తానే చేస్తుంది. మరి తను చేస్తే అది తప్పు కాదా? వాళ్ళు చేసినపుడు నేను చేస్తే తప్పేమిటి అని అంటుందేమో. మరి ఆమెకీ వాళ్ళకీ తేడా ఏమిటి? క్రిస్ ఇంట్లో అవమానం ఎదురైనపుడు అమె ఇంగితం కోల్పోతుంది. “అతను దొంగ కాదు కదా. అతని కర్రల బొమ్మని నువ్వెందుకు తెచ్చావు?” అంటాడు టోనీ. అతను అన్నదే సబబుగా ఉంటుంది. అతనిలో ఇంగితజ్ఞానం ఉంది. రూత్ “అతనెలా మాట్లాడావో చూశావు కదా” అంటుంది. “అది పక్కన పెట్టు. నీది కాని వస్తువు నువ్వెందుకు తెచ్చావు? ఇలా చేస్తావని తెలిస్తే నీ వెంట వచ్చేవాడినే కాదు” అంటాడు టోనీ. తన స్నేహితురాలు కదా అని అతను రూత్‌ని సమర్థించడు. తప్పుని ఎత్తి చూపుతాడు. క్రిస్ తన కొడుకు తప్పుని కప్పిపుచ్చటానికి ప్రయత్నించాడు. అయితే అతనిలోనూ బాధ ఉంది. కొడుకు చెడిపోయాడని. కొడుకుని శిక్షించాడు కూడా. కానీ అతను మాఫియా వాడు. ఇతరులను బాధపెడతాడు కానీ కొడుకు మీద మమకారం ఉంటుంది. ఈ మమకారంతోనే అక్రమాలు చేస్తుంటారు చాలామంది. చివరికి కర్మఫలం అనుభవించక తప్పదు.
మెరెడిత్ రూత్‌ని, టోనీని లోపలికి ఎందుకు రానిచ్చింది? వాళ్ళ వాలకాలు, కారు చూసి ఆమెకి వాళ్ళు పోలీసులు కాదని తెలియదా? ఆమెకి తెలుసు. ఆమె భర్త ఆమెని పట్టించుకోడు. ఎప్పుడు వెళతాడో, ఎప్పుడు వస్తాడో తెలియదు. లంకంత ఇంట్లో ఒక్కతే ఉంటుంది. మద్యం మత్తులో ఉంటుంది. కాలక్షేపం కోసం వారిని లోపలికి పిలుస్తుంది. ఇదే మాట తన భర్తతో అంటుంది. ఈ చిన్న పాత్రని కూడా చక్కగా మలచిన రచయితని మెచ్చుకోవాల్సిందే. ఆమె వేదన నుంచి హాస్యం పుట్టించారు. ఆమె రూత్‌కి, టోనీకి కాఫీ ఇస్తుంది. ముందు వాళ్ళు వద్దంటారు. “నేను చేసేది ఏమీ లేదు. కాఫీ మెషీన్ తయారు చేస్తుంది” అంటుందామె. యాంత్రీకరణ మీద చురక ఇది. ఇంతకు ముందు ఇంట్లో ఉండేవారికి చేతి నిండా పని ఉండేది. ఇప్పుడు యంత్రాలే పని చేస్తున్నాయి. సంపాదనలో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో చూసి ఓ పక్క నవ్వు వస్తుంది, మరోపక్క నిట్టూర్పు వస్తుంది. తర్వాత రూత్‌ని మళ్ళీ కలిసినపుడు మెరెడిత్ “నా కర్రల బొమ్మని దొంగిలించావు” అంటుంది. ఆమే ఆ బొమ్మలు ఏర్పాటు చేసుకుంది. ఇలా వస్తువులు పోగు చేసుకుని ఆనందించటమే నేటి సంస్కృతి.
ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.
రూత్ ఇంటికి చేరుకుంటుంది. క్రిస్ కొడుకు ఆమెకి తెలియకుండా ఇంటిలోకి ప్రవేశిస్తాడు. హఠాత్తుగా అతన్ని చూసి ఆమె అక్కడ ఉన్న అతని పాదముద్ర అచ్చుతో అతన్ని కొడుతుంది. అది అతని గొంతు మీద తగులుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన అచ్చు కావటంతో దెబ్బ గట్టిగా తగులుతుంది. అతని శ్వాసనాళం దెబ్బతింటుంది. ఊపిరాడక అతను తడబడుతూ బయటికి వచ్చి రోడ్డు మీదకి వెళతాడు. అటుగా వెళుతున్న బస్సు అతన్ని ఢీకొంటుంది. అతను చనిపోతాడు. బయటకి వచ్చిన రూత్ అది చూసి అవాక్కయి ఉండిపోతుంది. కారులో ఉన్న మార్షల్, అతనితో ఉన్న అమ్మాయి రూత్ మీద దాడి చేసి ఆమెని అపహరిస్తారు.
తమ పథకం ప్రకారం క్రిస్ ఇంట్లో దొంగతనం చేయటానికి వెళతారు. రూత్‌ని ముందు తలుపు కొట్టమంటారు. మెరెడిత్ తలుపు తీస్తుంది. తర్వాత జరిగిన దాడిలో క్రిస్ చేయి ఛిద్రమవుతుంది. అతని బాడీగార్డ్ మరణిస్తాడు. మార్షల్ క్రిస్‌ని ఫైర్ ప్లేస్‌లో ఉన్న రహస్య లాకర్ తెరవమంటాడు. అయితే అందులో ఒక గన్ను, కొన్ని పత్రాలు తప్ప ఏమీ ఉండవు. క్రిస్ డబ్బుని వేరేచోటికి బదిలీ చేశాడు. “నా కొడుకెక్కడ?” అని అడుగుతాడు క్రిస్. “నీకు కొడుకు లేడు” అంటాడు మార్షల్. క్రిస్ హతాశుడవుతాడు. కోపంతో అందర్నీ చంపేద్దామని మార్షల్, అతనితో ఉన్న అమ్మాయి అనుకుంటారు. మెరెడిత్‌ని చంపబోతుంటే రూత్ అడ్డు వెళుతుంది. “ఆమెని చంపాలంటే ముందు నన్ను చంపాలి” అంటుంది. ఇంతలో టోనీ వస్తాడు. తన జపనీస్ చక్రంతో ఆ అమ్మాయి ముఖాన్ని గాయపరుస్తాడు. తర్వాత గందరగోళంలో ఆ అమ్మాయి, క్రిస్ మరణిస్తారు. టోనీ తీవ్రంగా గాయపడతాడు. మెరెడిత్ తప్పించుకుని పారిపోతుంది. రూత్ టోనీని తీసుకుని ఇంటి వెనక ఉన్న చెరువుని పడవలో దాటి అవతల ఉన్న అడవిలోకి వెళుతుంది. మార్షల్ వెంబడిస్తాడు. అక్కడ పాము కరవటంతో మరణిస్తాడు. రూత్ టోనీని తీసుకుని పడవలో వెనక్కి వస్తుంది. టోనీ అపస్మారక స్థితిలో ఉంటాడు.
క్రిస్ ఇంట్లో జరిగిన హత్యాకాండ గురించి పోలీసులు మెరెడిత్‌ని విచారిస్తారు. ఆమెకి రూత్ ఫొటో చూపిస్తారు. అయితే ఆమె రూత్‌ని ఎప్పుడూ చూడలేదని అంటుంది. తనని రక్షించిందని ఆ విధంగా కృతజ్ఞత చూపిస్తుంది. పోలీసులు రూత్‌కి ఆ హత్యాకాండతో ఏ సంబంధం లేదని తేలుస్తారు. రూత్ కేసు చూసే పోలీసు… కేసు మూసేస్తూ రూత్ తో “మా ఆవిడ, నేను రాజీకొచ్చాం” అంటాడు. రూత్ చిరునవ్వు నవ్వుతుంది. టోనీ కోలుకుంటాడు. చివరికి రూత్ ఆశావహ దృక్పథంతో తన జీవితం మళ్ళీ మొదలుపెడుతుంది.
రూత్ సాధించిందేమిటి? ఆమె వల్ల క్రిస్ కొడుకు చనిపోయాడు. అయితే ఆమె వల్లే మెరెడిత్ బతికి బయటపడింది. ఏ పరిణామాలు ఎలా జరగాలో మన చేతిలో లేదు. రూత్ లేకపోయినా క్రిస్ చనిపోయేవాడేమో! ఆమె లేకపోయినా మెరెడిత్ బతికేదేమో! మనం నిమిత్తమాత్రులమే. రూత్ కొంచెం సహనంగా ఉండి ఉంటే ఆమెకి ఆ హత్యాకాండ చూసే అగత్యం వచ్చేది కాదు. ప్రపంచంలో అందరూ చెడ్డవారు ఉండరు. టోనీ లాంటి మంచివాళ్ళు కూడా ఉంటారు. మెరెడిత్ లాంటి అమాయకులూ ఉంటారు. పోలీసాయన భార్యతో రాజీ పడటం ఒక ఆశావహ పరిణామం. ప్రపంచాన్ని మార్చాలని చూడటం కన్నా వీలైనంతవరకు మనం మంచితనంతో ఉంటే చాలు. అలా ఉంటే పశ్చాత్తాపపడే అవసరం రాకుండా ఉంటుంది.