[dropcap]ఈ[/dropcap] మధ్య కాలంలో వచ్చిన ఉత్కంఠభరితమైన పోలీసు గాలింపు చిత్రం మళయాళంలో వచ్చిన ‘నాయాట్టు’ (2021). ‘నాయాట్టు’ అంటే వేట. విశేషమేమిటంటే ఈ చిత్రంలో ఉన్నది పోలీసులు చేసే గాలింపు మాత్రమే కాదు, పోలీసుల కోసం చేసే గాలింపు కూడా! పోలీసులే అనుకోని పరిస్థితుల్లో పారిపోతే వారి కోసం సాగే అన్వేషణ. ఇందులో రాజకీయ కోణం కూడా ఉంటుంది. రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం వ్యవస్థలని ఎలా వాడుకుంటారో ఈ చిత్రంలో చూపించారు. ఈ క్రమంలో కొందరి జీవితాలు ఎలా అస్తవ్యస్తమౌతాయో చూస్తే బాధ కలుగుతుంది. అయితే ఎవరూ పూర్తిగా నిర్దోషులు కాదు. అదే ఈ చిత్రంలోని గొప్పతనం. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం. అయితే తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్‌తో చూడాల్సిందే. ఈ వ్యాసంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు.
కేరళలో ఒక నియోజకవర్గంలో ఉపఎన్నిక ప్రచారం జరుగుతూ ఉంటుంది. అక్కడ ప్రవీణ్ ఒక కానిస్టేబుల్. కొత్తగా అక్కడ చేరాడు. అసిస్టంట్ ఎస్సై మణియన్ ప్రవీణ్‌కి పై అధికారి. అతని పై అధికారి సీఐ. అదే స్టేషన్లో మహిళా కానిస్టేబుల్ సునీత. ప్రవీణ్‌కి ముప్ఫై ఏళ్ళ పైనే వయసున్నా ఇంకా పెళ్ళి చేసుకోలేదు. తల్లి అనారోగ్యంతో ఉంటుంది. మణియన్‌కి ఒక టీనేజి కూతురు ఉంటుంది. ఆమె ఒక సాంస్కృతికోత్సవంలో నాట్యం, ఏకపాత్రాభినయం పోటీల్లో పాల్గొనటానికి అభ్యాసం చేస్తూ ఉంటుంది. కూతురు తప్పకుండా బహుమతి గెలుస్తుందని మణియన్ నమ్మకంతో ఉంటాడు. సునీతకి పెళ్ళి కాలేదు. ఆమె తన తల్లితో నివసిస్తూ ఉంటుంది. ఆమె బంధువుల కుర్రాడైన బిజూ ఆమెని వేధిస్తూ ఉంటాడు. పెద్దవాళ్ళు చెప్పినా వినడు. దాంతో ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తుంది. సీఐ అతన్ని స్టేషన్‌కి పిలిపిస్తాడు.
బిజూ సునీతని వేధిస్తున్నాడని మణియన్‌కి తెలుసు. ప్రవీణ్‌కి కూడా తెలుస్తుంది. స్టేషన్ బయట బిజూ నిర్లక్ష్యంగా ప్రవర్తించటంతో అక్కడే ఉన్న మణియన్ అతన్ని దూషిస్తాడు. బిజూతో వచ్చినవారు అతన్ని శాంతింపజేస్తారు. బిజూ స్టేషన్ లోపలికి వెళ్ళేసరికి ప్రవీణ్ సీఐతో మాట్లాడుతూ ఉంటాడు. తన తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్ళాలని మూడు రోజుల సెలవు కావాలని అంటాడు. సీఎం కూడా నియోజకవర్గంలో ఉండటంతో అసలే టెన్షన్లో ఉన్న సీఐ కుదరదంటాడు. ప్రవీణ్ మళ్ళీ మళ్ళీ అడగటంతో బూతుమాటతో తిడతాడు. తలుపు దగ్గరే ఉన్న బిజూ ఇదంతా చూస్తున్నాడని ప్రవీణ్ గమనిస్తాడు. విసురుగా బయటకు వస్తుంటే బిజూకి తగిలి అతని ఫోన్ కిందపడుతుంది. బిజూ ఫోన్ తీసి ఇవ్వమని ప్రవీణ్ చెయ్యి పట్టుకుంటాడు. ప్రవీణ్ కోపంతో అతన్ని కొడతాడు. బిజూ తిరగబడతాడు. మణియన్ కూడా బిజూని కొట్టి లాకప్‌లో పడేస్తాడు. ఇంతకీ బిజూ ఒక దళితుడు. అతనితో వచ్చినవారు గొడవచేస్తుంటే మణియన్ తుపాకీతో బెదిరిస్తాడు. ఇదంతా జయన్ అనే అతను వీడియో తీస్తాడు. ఎన్నికల్లో దళితుల ఓట్లు ముఖ్యమని ఎస్పీ బిజూని వదిలెయ్యమంటాడు. సీఐ అతన్ని వదిలేస్తాడు.
బిజూ సునీతని వేధించటం తప్పే. విచారణ చేసి అతనికి సరైన రీతిలో శిక్ష వేయాలి కానీ కొట్టటం తప్పు. ఎక్కడో ఇంకా వారు కింద జాతివారు అనే దుర్భావన ఉంది ప్రవీణ్, మణియన్ లాంటి వాళ్ళలో. విచిత్రమేమిటంటే మణియన్ కూడా దళితుడే! ఇదో వింత రకమైన వివక్ష. ‘నేను దళితుణ్ణైనా బాగుపడ్డాను. మీరెందుకు బాగుపడరు?’ అనే విపరీతమైన ధోరణితో చూపించే వివక్ష. పైగా మేం పోలీసులం అనే దర్పం కూడా ఉంటుంది. ఈ జాతివివక్ష, అధికారమదం వేళ్ళూనుకుపోయాయి. అది పోవాలంటే ఇంకా ఎంతకాలం పడుతుందో! ఆరోజు రాత్రి పోలీసులందరూ ఒక నాయకుడి ఇంటికి పెళ్ళి విందుకి వెళతారు. మణియన్, ప్రవీణ్ మద్యం తాగుతారు. తిరిగి వచ్చేటపుడు మణియన్ సొంత జీపుని అతని మేనల్లుడు నడుపుతూ ఉంటాడు. మద్యం తాగి బండి నడపకూడదని మణియన్ ఆ ఏర్పాటు చేస్తాడు. ప్రవీణ్, సునీత కూడా జీపులో ఉంటారు. ఒక మలుపు దగ్గర ఒక మోటార్ సైకిల్‌ని జీపు ఢీకొంటుంది. ఆ మోటార్ సైకిల్ నడిపే వాడు స్టేషన్లో వీడియో తీసిన జయన్! అతను స్పృహ కోల్పోతాడు. మణియన్ అతన్ని వదిలి పోదామంటాడు కానీ ప్రవీణ్ ఆసుపత్రికి తీసుకువెళదామంటాడు. ఇంతలో కొందరు యువకులు అటుగా వెళుతూ మణియన్‌ని గుర్తుపట్టి ఆదరాబాదరాగా వెళ్ళిపోతారు. జీపు నడిపిన మణియన్ మేనల్లుడు పారిపోతాడు. గత్యంతరం లేక ప్రవీణ్ జీపు నడుపుతాడు. జయన్‌ని ఆసుపత్రికి తీసుకువెళతారు. అతను చనిపోయాడని డాక్టర్ చెబుతాడు. అక్కడే ఉన్న బిజూ బృందం ముగ్గురినీ వెంబడిస్తారు. ముగ్గురూ వెనక మార్గంలో తప్పించుకుని ఆటోలో పోలీస్ స్టేషన్‌కి వెళతారు. అప్పటికే విషయం పాకిపోతుంది. పోలీసుల చేతుల్లో దళితుడు మరణించాడని తెలిస్తే ఎన్నికల్లో ఓట్లు పడవని, ముగ్గురు పోలీసులనీ అరెస్టు చేయమని సీఎం నుంచి ఆదేశాలు వస్తాయి. అయితే మణియన్‌కి సీఎం పార్టీలోని ఒకతను ఫోన్ చేసి “నిన్ను అరెస్టు చేయబోతున్నారు. పారిపో!” అని చెబుతాడు. ముగ్గురూ పోలీసు జీపులో అక్కడి నుంచి పారిపోతారు.
ప్రమాదం జరిగినపుడు జీపు తాను గానీ, ప్రవీణ్ గానీ నడపలేదని మణియన్ సీఐకి చెప్పినా రాజకీయ కారణాలతో వారిని అరెస్టు చేయటానికి రంగం సిద్ధమవుతుంది. అరెస్టు చేసినంత మాత్రాన ఏం మునిగిపోదుగా అనిపించవచ్చు. తర్వాత తాము నేరం చేయలేదని రుజువు చేసుకోవచ్చుగా అనొచ్చు. అయితే జయన్‌ని ఆసుపత్రికి తీసుకు వెళ్ళినపుడు ప్రవీణ్ జీపు నడిపాడు. మద్యం తాగి ఉన్నాడు. అతని వేలిగుర్తులే స్టీరింగ వీల్ మీద ఉన్నాయి. అంతకు ముందు జీపు నడిపిన మణియన్ మేనల్లుడు పారిపోయాడు. అతను నేనసలు అక్కడ లేను అంటే ఉన్నాడని నిరూపించటానికి ఏ ఆధారాలూ లేవు. పైగా అతను సౌదీ వెళ్ళిపోవటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఫోన్ ఆఫ్ చేసి ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. అతన్ని నిందితుడిగా పేర్కొంటే పోలీసుల్ని తప్పించటానికి అతన్ని బలిపశువుని చేశారని అంటారు. ఇదంతా ఒక ఎత్తు. మణియన్, ప్రవీణ్ బిజూని కొట్టారని, జయన్ వీడియో తీశాడని అందరికీ తెలుసు. జయన్ మీద అక్కసుతో తాగిన మైకంలో కావాలనే అతణ్ణి గుద్ది చంపారని కూడా నింద వేయవచ్చు. ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న మణియన్ ఇదంతా ఊహిస్తాడు. ఊరు విడిచి పారిపోదామంటాడు. సునీత ఇంటికి వెళ్ళిపోతానంటుంది కానీ అప్పటికే ఆమె ఇంటి దగ్గర కొందరు కాపు కాస్తుండటంతో గత్యంతరం లేక ఆమె కూడా వీరితోనే వెళుతుంది. ముగ్గురూ ఊరు విడిచి పారిపోతారు.
బ్లేమ్ గేమ్ ప్రారంభమవుతుంది. మణియన్ సునీతని “నీ వల్లే ఇదంతా జరిగింది” అంటాడు. అలాగే ప్రవీణ్‌ని “వాణ్ని వదిలి పోదామంటే నువ్వు వినలేదు” అంటాడు. ఇరవై ఏళ్ళ అనుభవంలో అతను ఎన్నో చూసి ఉంటాడు. అందుకే తప్పించుకుపోదామనుకున్నాడు. అయితే ఆ ముగ్గురిలో అతనిదే పెద్ద తప్పు. బిజూతో ప్రవీణ్ గొడవపడుతుంటే ఆపటం మానేసి తను కూడా బిజూని కొట్టాడు. అంత అనుభవం ఉండి అలా చేయవచ్చా? ముందే చెప్పినట్టు జాతివివక్ష, అధికారమదం విచక్షణ కోల్పోయేలా చేస్తాయి. మణియన్ బిజూ విషయంతో సంయమనంతో వ్యవహరించి ఉంటే అతనికి భయపడే పరిస్థితి వచ్చేది కాదు. అతను ఆవేశంలో చేసిన పొరపాటు అతని మెడకు బిగుసుకుంది. ‘తన కోపమె తన శత్రువు’ అని అందుకే అన్నారు.
ముగ్గురూ తమ ఫోనుల్లోని సిమ్ములు పారేస్తారు. పోలీసు జీపు వదిలేస్తారు. ప్రవీణ్ ఎవరిదో ఫోన్ తీసుకుని తన స్నేహితుడికి ఫోన్ చేస్తాడు. అతడు సరుకులు రావాణా చేసే టెంపో నడుపుతూ ఉంటాడు. ఖాళీ టెంపోతో వచ్చి వీళ్ళని ఎక్కించుకుంటాడు. ముగ్గురూ టెంపో వెనక పడుకుంటారు. అప్పటికే గాలింపు మొదలవుతుంది. దారిలో పోలీసులు ఆపుతారు. ఒక పోలీసు టెంపో వెనకాల వీళ్ళని చూస్తాడు. అయినా వదిలేస్తాడు. తనవాళ్ళుగా భావించే పోలీసువాళ్ళని ఇరికించటం అతనికి ఇష్టం లేదు. టెంపో వేరే ఊరికి చేరుతుంది. అప్పటికే వారు ప్రవీణ్ స్నేహితుడి టెంపోలో వెళుతున్నారని గాలింపు చేస్తున్న బృందానికి తెలిసిపోతుంది. ఎలా తెలిసిందనేది ఒకసారి చూద్దాం. ముందుగా పోలీసు జీపు కోసం వెతుకుతారు. ఒక అడవి ప్రాంతంలో జీపు దొరుకుతుంది. అక్కడున్న సెల్ టవర్ రికార్డ్స్‌ని పరీక్షిస్తారు. ప్రవీణ్ తన స్నేహితుడికి ఫోన్ చేశాడని తెలుస్తుంది. ఆ ఫోన్ నంబర్ ఆధారంగా అతని టెంపో వివరాలను కనుక్కుంటారు. అయితే మణియన్‌కి ఇలా జరుగుతుందని తెలుసు. అందుకే టెంపో ఆపించి ముగ్గురూ దిగిపోతారు. నేరం చేసినవాళ్ళని సాంకేతికత సహాయంతో ఎలా పట్టుకుంటారో దీని వల్ల తెలుస్తుంది. ఎంత తెలివైనవారైనా దొరికిపోతారు. పోలీసువాళ్ళు కాబట్టి వీళ్ళు ముగ్గురూ కాస్త జాగ్రత్తగా ఉంటారు. అయినా ఒక పొరపాటు చేస్తారు. మణియన్‌కి తెలియకుండా ప్రవీణ్ ఒక టీ బండి వాడి ఫోన్ తీసుకుని సునీతకిస్తాడు. ఆమె తన పక్కింటికి ఫోన్ చేస్తుంది. ఇంటికి ఫోన్ చేయకుండా పక్కింటికి ఫోన్ చేయటం తెలివైన పనే కానీ సునీత తల్లి అమాయకురాలు. పక్కింటామె వెనక ఉన్న కిటికీ దగ్గరకి వచ్చి సునీత తల్లికి సునీత బాగానే ఉందని చెబుతుంది. ఇలాంటి పరిణామం జరుగుతుందని పోలీసులు ముందు గదిలో వేచి ఉన్నారనే సంగతి ఆమెకి తెలియదు! సునీత తల్లిని బుజ్జగించి ఆ సమాచారం రాబట్టారని వేరే చెప్పక్కరలేదు. మణియన్ కొన్నేళ్ళ క్రితం మున్నార్ ప్రాంతంలో పని చేశాడని, ప్రస్తుతం ముగ్గురూ అక్కడికే వెళుతున్నారని గాలింపుని పర్యవేక్షిస్తున్న ఎస్పీ అనురాధకి అర్థమౌతుంది. ఆమె తన బృందాన్ని తీసుకుని బయలుదేరుతుంది. తెల్లవారేసరికి అక్కడికి చేరుకుంటుంది. రెండురోజుల్లో ఎన్నికలు. అసలైన రాజకీయనాటకం అప్పుడే మొదలౌతుంది.
మణియన్ కూతురు మర్నాడు పోటీలో పాల్గొనబోతోంది. అతను ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తాను ఆ పోటీకి వెళ్ళటం అసంభవమని తెలిసి ఒక సందర్భంలో బాధపడుతూ ఉంటాడు. తాను పోలీసు ఉద్యోగంలో పడి తన కూతురుతో ఎక్కువ సమయం గడపలేకపోయానని అంటాడు. ఏదో పాట వినపడితే “మా నాన్న నేను గాయకుణ్ణి అవాలని కోరుకున్నాడు” అంటాడు. ఇలాంటి సందర్భాల్లో ఎప్పటివో తలచుకుని బాధపడటం మామూలే. జీవితం ఇలా కాకుండా ఇంకోలా ఉంటే బావుండేదనే వెర్రి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రవీణ్ టెంపో దిగుతూ తన స్నేహితుడికి తన తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్ళమని చెబుతాడు. ఎవరి సమస్యలు వారికుంటాయి. రాజకీయ కారణాల వల్ల వీరి జీవితాలు తలకిందులు అయిపోయాయి. ఎన్నికలు అయ్యేదాకా దొరకకుండా ఉంటే తర్వాత హైకోర్టులో తమ దగ్గరున్న సాక్ష్యాలతో కేసుని తప్పని రుజువు చేసి సీబీఐ విచారణ జరిగేలా చూడాలని మణియన్ పథకం. ఎన్నికలు జరిగేలోగానే వీళ్ళని పట్టుకోకపోతే దళితులు ఎన్నికలను బహిష్కరిస్తామంటారు. ఆ ఓట్లు లేకపోతే సీఎం పార్టీ గెలవదు. అందుకని ఎలాగైనా ఎన్నికలు జరిగే లోపలే వారిని పట్టుకోవాలని ఆయన పట్టుదల. పైగా వారిని పట్టుకుంటే దళితుల ఓట్లు ఎక్కువ శాతం సీఎం పార్టీకే వస్తాయి.
మణియన్‌గా జోజు జార్జ్ నటించాడు. విస్తృతమైన పరిధి ఉన్న పాత్ర ఇది. ఎన్నో రసాలని అభినయించే అవకాశం ఈ పాత్రలో అతనికి వచ్చింది. సంపూర్ణ న్యాయం చేశాడు. 2021కి గాను కేరళ రాష్ట్ర అవార్డులలో ఇద్దరు ఉత్తమ నటులలో జోజు ఒకడుగా నిలిచాడు. ప్రవీణ్‌గా కుంచకో బోబన్, సునీతగా నిమిషా సజయన్ నటించారు. పారిపోయే పరిస్థితి వస్తే ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో నిమిషా తన నటనలో ప్రభావవంతంగా చూపించింది. ఇతర పాత్రధారులు కూడా అకట్టుకుంటారు. ఎస్పీ అనురాధ పాత్రలో యామా గిల్గమేష్ నటించింది. విపరీతమైన ఒత్తిడిలో ఎంతో ఓపికగా ఉండే పాత్ర అది. ఒక సందర్భంలో ఆమె సహనం కోల్పోతుందేమో అనిపిస్తుంది. కానీ తమాయించుకుంటుంది. చివరికి రాజకీయ చదరంగంలో తాను కూడా ఒక పావుగా మారుతుందని తెలిసి ఒక్కసారిగా ఆక్రోశం వస్తుంది. అక్కడ ఆమె అభినయం అద్భుతం. సీఎం పాత్రలో జాఫర్ ఇడుక్కి నటించాడు. అతను కూడా సహనం కోల్పోతాడని అనిపిస్తుంది. కానీ అలా జరగదు. ఎందుకంటే రాజకీయనాయకులకు బలిపశువుల కొరతేముంటుంది? అందునా సీఎం. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా?
మార్టిన్ ప్రక్కట్ దర్శకత్వం అబ్బురపరుస్తుంది. కథకుడు, స్క్రీన్ ప్లే రచయిత షాహి కబీర్‌కు కేరళ రాష్ట్ర ఉత్తమ కథారచయిత అవార్డ్ వచ్చింది. కథ పకడ్బందీగా ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా అద్భుతంగా ఉంటుంది. కొన్ని చమక్కులు ఇక్కడ ఉదహరిస్తాను. మొదట్లో ప్రవీణ్ తన ఇంటి పెరట్లో ఆడవాళ్ళ బట్టలు ఆరవేస్తూ ఉంటాడు. తర్వాత మనకి అతనికి పెళ్ళి కాలేదని, తల్లి అనారోగ్యంతో ఉందని తెలుస్తుంది. అతను తల్లికి ఎంత సేవ చేస్తున్నాడో చెప్పకనే చెప్పారు. ప్రవీణ్ సెలవు అడిగితే తిట్టిన సీఐ ఆ రాత్రి పెళ్ళి విందులో అతన్ని మర్నాడు సెలవు తీసుకుని రాత్రి డ్యూటీకి రమ్మంటాడు. ఒత్తిడిలో ఒక్కోసారి కొందరు దురుసుగా మాట్లాడతారు. మనసు మాత్రం మంచిదే ఉంటుంది. పారిపోయిన తర్వాత ముగ్గురు పోలీసులూ ఒక టీ కొట్టు లోకి వెళతారు. అప్పటికే టీవీలో వారి వార్త వస్తూ ఉంటుంది. చలి ప్రదేశం కావటంతో వీళ్ళు మంకీ క్యాప్‌లు పెట్టుకుని ఉంటారు కాబట్టి తొందరగా ఎవరూ గుర్తుపట్టరు. అయినా ఎంతమంది అంత నిశితంగా చూస్తారు? అయితే వీరి జాగ్రత్తలో వీరు ఉంటారు. ప్రవీణ్ ఒక్కడే వేరుగా కూర్చుంటాడు. తాను తాగిన టీకి డబ్బులు ఇచ్చి బయటకు వెళతాడు. తర్వాత మణియన్ తనకి, సునీతకి డబ్బులు కడతాడు. ముగ్గురూ కలిసి తిరిగితే తొందరగా అనుమానం వస్తుందని వారికి తెలుసు. ఒక సందర్భంలో ప్రవీణ్ తమకు ఆశ్రయం ఇచ్చినతనితో మాట్లాడుతూ ఉంటాడు. కొండ వాలు మీద వ్యవసాయం చేసే ప్రాంతమది. కొందరు పొలం దగ్గర గొడవ పడుతూ ఉంటారు. ఏమిటా గొడవ అని ప్రవీణ్ అడుగుతాడు. నీళ్ళ తగాదా అంటాడు ఆ వ్యక్తి. “పోలీసులకి చెప్పారా?” అంటాడు ప్రవీణ్. “పోలీసులు, కోర్టులు ఎందుకు? మేమే ఏదో ఒప్పందం చేసుకుంటాం” అంటాడతను. ప్రవీణ్ ఆలోచనలో పడతాడు. కొన్ని విషయాలు పోలీసుల దాకా వెళ్ళకపోతేనే మంచిది. సునీత కూడా పోలీసులకి చెప్పకుండా ఉంటే సరిపోయేదని అతను ఆలోచిస్తున్నాడేమో అనిపిస్తుంది. ఒక జలపాతం దగ్గర సునీత కూర్చుని ఉన్నప్పుడు ఒక జలగ ఆమె కాలిని పట్టుకుని రక్తం పీలుస్తుంది. అయినా ఆమెకి ఆ బాధ తెలియదు. మనసులో ఎన్నో భయాలు ఉన్నపుడు ఈ చిన్న గాయాలు ఏం చేస్తాయి? పోలీసు కుక్కల్ని తెప్పించి వెతికించాలని ఎస్పీ ప్రయత్నిస్తుంది. పారిపోయిన వారి బట్టలు తెప్పించి కుక్కలకు వాసన చూపిస్తారు. అయితే ఆ ప్రాంతంలో జాతర జరుగుతూ ఉంటుంది. పసుపు విరివిగా చల్లటంతో కుక్కలు పారిపోయిన వారి వాసన పసిగట్టలేకపోతాయి. ఒక పక్క ఒత్తిడి. మరో పక్క ఇలాంటి అడ్డంకులు. ఇవన్నీ చూస్తే స్క్రీన్ ప్లే రచయిత ఎంత పరిశోధన్ చేసి వ్రాశాడో అనిపిస్తుంది. ఎడిటింగ్‌కి కేరళ రాష్ట్ర ఉత్తమ ఎడిటింగ్ అవార్డు వచ్చింది. ప్రేక్షకులని ఎక్కడా అయోమయం కలగకుండా ఎడిటింగ్ చేశారు. కేరళ అందాలు కూడా ఈ చిత్రంలో కనువిందు చేస్తాయి.
ఒక మంచి కథ, ఉత్కంఠ కలిగించే కథనం, మన దేశం లోని సమకాలీన పరిస్థితుల మీద సునిశితమైన వ్యాఖ్యానం చూడాలనుకునేవారు తప్పక ఈ చిత్రం చూడాలి.