Site icon Sanchika

మరుగునపడ్డ మాణిక్యాలు – 36: ట్రాఫిక్

[dropcap]‘ట్రా[/dropcap]ఫిక్’ అంటే రోడ్డు మీద వాహనాల రద్దీ గుర్తొస్తుంది. అయితే మాదకద్రవ్యాల అక్రమరవాణాని డ్రగ్స్ ట్రాఫికింగ్ అంటారు. మనుషుల అక్రమరవాణాని హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు. 2000లో వచ్చిన ‘ట్ర్రాఫిక్’ చిత్రం డ్రగ్స్ ట్రాఫికింగ్‌కి సంబంధించినది. ఆగండి! డ్రగ్స్ అనగానే ‘బాబోయ్! చూడలేము’ అనకండి. ఈ చిత్రం తప్పక చూడాల్సిన చిత్రం. భారతదేశంలో డ్రగ్స్ సమస్య చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇరవై సంవత్సరాల క్రితం అమెరికాలో ఈ సమస్య తీవ్రంగా ఉండేది. ఈ చిత్రంలో ఈ సమస్యని అన్ని కోణాల నుంచి చర్చించారు. ఈ చిత్రం నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ చిత్రానికి గాను స్టీవెన్ సోడర్బర్గ్‌కి ఉత్తమ దర్శకుడి ఆస్కార్ వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం.

అమెరికాకి దక్షిణాన ఉన్న దేశం మెక్సికో. మెక్సికో నుంచి డ్రగ్స్ అమెరికాలోకి అక్రమంగా రావాణా అవుతుంటాయి. హువారెజ్, తిహువానా అనే నగరాల్లో పని చేసే ముఠాలు ఈ రవాణా చేస్తుంటాయి. ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూ ఉంటాయి. హావియెర్, మనోలో తిహువానాలో పోలీసులు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మెక్సికోలో మాట్లాడే స్పానిష్ భాషలో J అక్షరాన్ని అన్ని పదాల్లోనూ, G అక్షరాన్ని కొన్ని పదాల్లో ‘హ’ శబ్దంతో పలుకుతారు. హావియెర్ పేరు మొదట్లో J అక్షరం ఉంటుంది కానీ హావియెర్ అనే పలుకుతారు. హావియెర్‌కి తిహువానా నుంచి జరిగే డ్రగ్స్ రవాణాకి సంబంధించి సమాచారం లభిస్తుంది. మనోలోతో కలిసి మాటువేసి నేరగాళ్ళని పట్టుకుంటాడు. అయితే జనరల్ సాలజార్ అనే అధికారి వారిని ఆపి నేరగాళ్ళని నిర్బంధించి తీసుకుపోతాడు. తర్వాత సాలజార్ హావియెర్‌ని పిలిపిస్తాడు. “నీ చొరవ నచ్చింది. తిహువానా ముఠాని రూపుమాపటంలో నీ సహాయం కావాలి” అంటాడు. తిహువానా ముఠా కోసం పని చేసే ఫ్రాంకీ ఫ్లవర్స్ అనే కిరాయి హంతకుడిని పట్టుకోమని ఆదేశిస్తాడు. ఫ్రాంకీ గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. అతను దయాదాక్షిణ్యాలు లేని హంతకుడని మనోలో హావియెర్‌ని హెచ్చరిస్తాడు. అయినా ఇద్దరూ కలిసి అతన్ని పట్టుకోవటానికి అమెరికాలోని శాన్ డియెగోకి వెళతారు. అతను స్వలింగప్రియుడు కావటంతో హావియెర్ ఎరవేసి అతన్ని హనీట్రాప్ చేస్తాడు. బంధించి మెక్సికోకి తీసుకువస్తాడు. మెక్సికోలో జరిగే సన్నివేశాలన్నీ లేత ఎరుపు రంగు ఛాయల్లో చిత్రీకరించారు. మెక్సికోలో వాతావరణం వేడిగా ఉంటుంది. దానికి అనుగుణంగా చూపించారు. పైగా ఆ ఛాయలు చూడగానే ఇది మెక్సికోలో జరిగే సన్నివేశం అని తెలిసిపోతుంది.

ఈ కథ జరుగుతుండగానే మరో మూడు కథలు అమెరికాలో జరుగుతూ ఉంటాయి. బాబ్ వేక్ ఫీల్డ్ ఓహయో రాష్టంలో న్యాయమూర్తి. అతన్ని జాతీయ డ్రగ్స్ నియంత్రణ విభాగానికి అధ్యక్షుడిగా నియమిస్తారు. అతను రాజధాని వాషింగ్టన్ వెళ్ళి కొత్త బాధ్యతలను స్వీకరించే పనిలో ఉంటాడు. తనకంటే ముందు ఆ పదవిలో ఉన్న జనరల్‌ని కలుస్తాడు. అతను “ఎంత చేసినా ఈ డ్రగ్స్ మహమ్మారిని అరికట్టలేకపోయాను” అంటాడు. అయినా బాబ్ ఆశావహంగా మాట్లాడతాడు. జనరల్ ఒక కథ చెబుతాడు. “రష్యా ప్రధానిగా పని చేసిన క్రుశ్చెవ్ దిగిపోవాల్సి వచ్చినపుడు తన తర్వాత వచ్చిన ప్రధానికి రెండు ఉత్తరాలు ఇచ్చాడు. ‘ఏదైనా క్లిష్టమైన సమస్య వచ్చినపుడు మొదటి ఉత్తరం తెరువు. అది నిన్ను కాపాడుతుంది. మళ్ళీ ఏదైనా పెద్ద సమస్య వస్తే రెండో ఉత్తరం తెరువు’ అని చెప్పాడు. కొత్త ప్రధానికి అనతికాలంలోని పెద్ద సమస్య వచ్చింది. మొదటి ఉత్తరం తెరిచి చూశాడు. అందులో ‘అంతా నా మీద తోసెయ్’ అని ఉంది. అతను అలాగే చేశాడు. బతికిపోయాడు. మళ్ళీ సమస్య వస్తే రెండో ఉత్తరం తెరిచాడు. అందులో ‘కూర్చుని రెండు ఉత్తరాలు రాయి’ అని ఉంది” అంటాడు. ఇద్దరూ నవ్వుకుంటారు. కొన్ని పదవులు కత్తి మీద సాములాంటివి. ఏం చేసినా ఫలితం ఉండదు. దానికి కారణం ఎవరు? పదవిలో ఉన్నవారేనా? పదవిలో ఉంటే మొత్తం బాధ్యత అంతా ఆ మనిషిదేనా? ఎవరు ఏ పదవిలో ఉన్నా కింది ఉద్యోగులు సక్రమంగా పనిచేయాలి. అయితే కొన్ని పదవుల్లో మొత్తం సమాజాన్నే మార్చాల్సిన అవసరం ఉంటుంది. అది తెలియటానికి బాబ్‌కి కాస్త సమయం పడుతుంది. బాబ్ ఉన్న సన్నివేశాలు నీలం రంగు ఛాయల్లో ఉంటాయి. అమెరికాలోని ఉత్తరప్రాంతంలో వాతావరణం చల్లగా ఉంటుంది. దాని సంకేతమే ఇది.

ఇంకో కథ శాన్ డియెగోలో జరుగుతుంది. ఇక్కడ సన్నివేశాలు మామూలుగా మనం సినిమాల్లో చూసినట్టే ఉంటాయి. ఇది అమెరికా దక్షిణ ప్రాంతం. ఇక్కడ మాంటెల్, రే అనే వారు డ్రగ్స్ నియంత్రణ అధికారులు. మారువేషాల్లో తిరుగుతూ డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిని పట్టుకుంటూ ఉంటారు. ఒక అజ్ఞాతవ్యక్తి ఇచ్చిన సమాచారంతో స్టోరేజ్ వ్యాపారం చేసే ఎడ్వార్డో కార్యకలాపాలని గమనించటానికి కస్టమర్లలా వెళతారు. అక్కడ డ్రగ్స్ రవాణా జరుగుతోందని తెలుస్తుంది. ఎడ్వార్డో పారిపోతాడు. వీళ్ళు అతన్ని వెంబడించి పట్టుకుంటారు. అతని మీద విచారణ పెట్టబోమని హామీ ఇచ్చి అతనికి డ్రగ్స్ సరఫరా చేసేది ఎవరని తెలుసుకుంటారు. ఆ సరఫరా చేసే వ్యక్తి శాన్ డియెగోలోనే నివసించే కార్లోస్ అయాలా. అతన్ని అరెస్టు చేస్తారు. అతని భార్య హెలెనాకి భర్త స్మగ్లింగ్ వ్యాపారం గురించి తెలియదు. వారికో కొడుకు. హెలెనా మళ్ళీ గర్భవతి. కార్లోస్ భాగస్వామి హెలెనాకి అసలు విషయం చెబుతాడు. డ్రగ్స్ నియంత్రణ విభాగ అధ్యక్షుడు బాబ్ ఈ కేసులో ఒక మంచి లాయర్ని పెడతాడు. దాంతో కార్లోస్‌కి బెయిల్ నిరాకరించబడుతుంది. హెలెనా మీద మాంటెల్, రే నిఘా పెడతారు. ఆమె ఒకరోజు కొడుకుని తీసుకుని బీచ్‌కి వెళ్ళినపుడు ఒక వ్యక్తి ఆమెని బెదిరిస్తాడు. మూడు మిలియన్ (30 లక్షల) డాలర్లు బాకీ ఉందని, అది తీర్చాలని. కార్లోస్ భాగస్వామి తన దగ్గర అంత డబ్బు లేదంటాడు. “నేను, నా పిల్లలు ఏం చేయాలి?” అంటుందామె. అతను ఆమె మీద మనసుపడ్డాడు. అయితే మంచి సమయం కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అతను కార్లోస్‌కి సాయం చేస్తాడా?

ఇంకో కథ క్యారలైన్‌ది. ఆమె జూనియర్ కాలేజీలో చదువుతుంటుంది. బాగా చదువుతుంది. కానీ డ్రగ్స్‌కి అలవాటు పడుతుంది. ఆమె ప్రియుడు ఆమెకి రకరకాల డ్రగ్స్ రుచి చూపిస్తూ ఉంటాడు. ఇంతకీ క్యారలైన్ బాబ్ కూతురు! తన కూతురే డ్రగ్స్ వాడుతుంటే అతను దేశంలో డ్రగ్స్ నియంత్రించాలని బయల్దేరాడు. ఒకరోజు క్యారలైన్ స్నేహితుడు ఎక్కువ మోతాదు (ఓవర్ డోస్) లో డ్రగ్స్ తీసుకోవటం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఆమె తన ప్రియుడితో కలిసి వెళ్ళి ఆ స్నేహితుణ్ణి ఆసుపత్రి బయట వదిలేసి పారిపోవటానికి ప్రయత్నిస్తుంది. కానీ పోలీసులు పట్టుకుంటారు. దాంతో విషయం బాబ్‌కి తెలుస్తుంది. అతని భార్యకి ముందే తెలుసు. అయినా ఆమె దాచింది. తల్లులు ప్రేమ కారణంగా చూసీ చూడనట్టు వదిలేస్తే పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అదృష్టం బావుండి ఓవర్ డోస్ చేసుకున్న అబ్బాయి బతుకుతాడు. బాగా చదువుకునే అమ్మాయి డ్రగ్స్‌కి ఎలా అలవాటు పడింది? కేవలం చదువుకోవటమే కాదు, ఇతర కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంది. వాలీబాల్ ఆడుతుంది. అయితే ఎవరూ డ్రగ్స్ కబంధహస్తాల్లో పడకుండా ఉండలేని రోజులు వచ్చేశాయి. ఆమె చాలా తెలివైనది. కానీ మనుషులందరూ ఒక చట్రంలో ఇమిడిపోవటానికి ప్రయత్నిస్తున్నారని, అందరూ పైకి నటిస్తూ ఉంటారని ఆమె అభిప్రాయం. అంత లోతైన భావాలు చిన్న వయసులోనే కలిగిన అమ్మాయి ఆమె. జీవితం ఇంతేనా అనే నైరాశ్యం. ఇంకా ఏదో కావాలని డ్రగ్స్ వలలో పడింది. మన దేశంలో స్కూళ్ళలో కూడా డ్రగ్స్ ప్రవేశించాయి. అయితే ఇక్కడ ఒత్తిడి ఎక్కువ ఉండటం వలన కొందరు డ్రగ్స్ బారినపడతారు. కారణం ఏదైతేనేం? డ్రగ్స్ దొరుకుతూ ఉంటే ఎవరైనా అలవాటు పడతారు. తనిఖీలు చేయవచ్చు. యంత్రాలతో స్కానింగ్ చేయవచ్చు. కానీ ఖర్చు అవుతుంది. సిబ్బంది అవినీతిపరులైతే తనిఖీల వల్ల లాభం ఉండదు. అసలు సమస్య ఏమిటంటే డ్రగ్స్ మీద మన దేశంలో అవగాహన లేదు. ముందు అది పెంచాలి. కష్టమే. కానీ తప్పదు. పిల్లలకి, తలిదండ్రులకి అవగాహన కల్పించాలి. డ్రగ్స్ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో నిజమైన వీడియోల ద్వారా చూపించాలి. తలిదండ్రులు కూడా పిల్లలను కనిపెడుతూ ఉండాలి. నేను బిజీ అంటే కుదరదు.

అయితే క్యారలైన్ విషయంలో ఆమెకి కాలేజీలో డ్రగ్స్ అందలేదు. అమెరికాలో తనిఖీలు చిత్తశుద్ధితో చేస్తారు. ఆమెకి డ్రగ్స్ దొరికేది నల్లజాతి వారుండే ప్రాంతాల్లో. ఆమె ప్రియుడు అక్కడ కొంటాడు. వింతేమిటంటే అతను డ్రగ్స్‌కి బానిస కాలేదు. క్యారలైన్ మితిమీరి డ్రగ్స్ వాడుతుంది. ఒక సందర్భంలో బాబ్ “నా కూతుర్ని ఇలాంటి చోటికి తీసుకొచ్చావా?” అని ఆమె ప్రియుణ్ణి ఈసడించుకుంటాడు. ఆ అబ్బాయి కూడా తెలివైన వాడే. “ఇలాంటి చోటు, అలాంటి చోటు అని చిన్నచూపు చూస్తున్నారే! ఇక్కడికి వచ్చి కనపడిన నల్లజాతి మనిషినల్లా ‘డ్రగ్స్ ఉన్నాయా?’ అని అడుగుతూ ఉంటే అప్పటి వరకూ అమ్మని వాడు కూడా సాయంత్రానికి వ్యాపారం మొదలుపెడతాడు. మీరుండే ప్రాంతంలో కూడా అందరూ దారేపోయేవాళ్ళని ‘డ్రగ్స్ ఉన్నాయా?’ అని అడగటం మొదలు పెడితే అక్కడా వ్యాపారం మొదలవుతుంది. ఇది లాభసాటి వ్యాపారం కాబట్టి” అంటాడు. నల్లజాతివారు అణగారిన వర్గాలు కాబట్టి డబ్బు కోసం కొందరు డ్రగ్స్ అమ్ముతారు. వారిని అరెస్టు చేసినపుడు ప్రచారం చేస్తే ఇక నల్లజాతి వారందరూ డ్రగ్స్ అమ్ముతానే అభిప్రాయం కలుగుతుంది. కొనేవారుంటే అమ్మేవారూ పెరుగుతారు. ఇదో విషవలయం. డిమాండు తగ్గించటమే అసలైన పరిష్కారం. అది ఇంటి నుంచే ప్రారంభమవ్వాలి. డీఎడిక్షన్ సెంటర్లు కూడా ఉంటాయి. కానీ పరిస్థితి అంతదాకా వెళ్ళకుండా ఉంటేనే మంచిది. ఒకసారి అలవాటు పడితే శరీరం డ్రగ్స్ లేకపోతే తట్టుకోలేదు. తేరుకోవటానికి కొంతకాలం పడుతుంది. శరీరానికి చెడు చేసే పదార్థాలు వెంటనే ప్రభావం చూపిస్తాయి. హితం చేసే పదార్థాలు పని చేయాలంటే కొంత సమయం పడుతుంది. ఇది సృష్టి నైజం. వినాశం వైపే సృష్టి పయనిస్తూ ఉంటుంది. అయితే ఎప్పటికైనా నశించాల్సిందే అని ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించటం వివేకం కాదు. దేనికీ బానిస కాకుండా స్వేచ్ఛగా ఉండగలగాలి. బానిస బతుకూ ఒక బతుకేనా? ప్రవచనకర్త గరికిపాటి చెప్పినట్టు స్వేచ్ఛ అంటే మనసు చెప్పినట్టు వినటం కాదు. స్వేచ్ఛ అంటే మనం చెప్పినట్టు మనసు వినేలా ఉండగలగటం.

మరి బడుగువర్గాల సంగతి ఏమిటి? చిన్న వయసులోనే వారు చాలా తేలికగా ముఠాల్లో చేరిపోతారు. అక్కడి నుంచి ఆ జీవితానికి అలవాటు పడిపోతారు. అలాంటివారి కోసం కూడా ఒక పరిష్కారం ఈ చిత్రంలో సూచించారు. సాయంత్రం వేళల్లో వారికి ఆడుకోవటానికి మైదానాలు, ఆటవస్తువులు ఇస్తే వారు ఆటల్లో సమయం గడుపుతారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటారు. పైగా దేహదార్ఢ్యం కూడా పెరుగుతుంది. ఆట మైదానాలే లేకుండా చేస్తున్న ఈ రోజుల్లో ఇది సాధ్యమేనా? సాధ్యం చేయాలి. రాజకీయ నాయకులు చిత్తశుద్ధితో పనిచేస్తే ఇది సాధ్యమే. అయితే ముఠాలు నడిపేవాళ్ళని వదిలేయాలా? వాళ్ళని పట్టుకోవాలి. శిక్షలు వేయాలి. కానీ అదొక్కటే సరిపోదు అనేదే ఈ చిత్రంలోని ముఖ్యమైన సందేశం.

బాబ్‌గా మైకెల్ డగ్లస్ నటించాడు. హావియెర్‌గా నటించిన బెనీసియోకి ఉత్తమ సహాయనటుడిగా ఆస్కార్ వచ్చింది. హెలెనాగా క్యాథరిన్ జెటా జోన్స్, మాంటెల్‌గా డాన్ చీడిల్ నటించారు. అందరూ ఆరితేరిన నటులే. స్క్రీన్ ప్లే స్టీఫెన్ గేగన్ అందించాడు. ఆస్కార్ అందుకున్నాడు. ఎడిటింగ్‌కి కూడా ఆస్కార్ వచ్చింది. మూడు ముఖ్యమైన కథలు కలిపి అన్ని కోణాలలో డ్రగ్స్ సమస్యని చూపించారు. అన్ని కథలూ సమాంతరంగా నడుస్తూ ఉంటాయి. స్క్రీన్ ప్లే వ్రాయటం ఒక ఎత్తైతే ఎడిటింగ్ చేయటం ఒక ఎత్తు. స్క్రీన్ ప్లే లో ఆసక్తి కలిగించే  సన్నివేశాలు కోకొల్లలు. మచ్చుకి ఒకటి. కార్లోస్‌ని అరెస్ట్ చేసిన తర్వాత మాంటెల్, రే ఒకరోజు కార్లోస్ ఇంటి బయట కాస్త దూరంలో వ్యాన్లో కూర్చుని నిఘా చేస్తూ ఉంటారు. ఇంట్లో మాట్లాడుకునే మాటలు వినడానికి చిన్న మైకులు అప్పటికే ఇంటిలో పెట్టి ఉంటారు. వ్యాన్ పైన కెమెరా కూడా ఉంటుంది. హెలెనా బాకీ తీర్చటానికి తన బ్యాంకు అడ్వాన్స్‌గా డబ్బు ఇస్తుందేమోనని ఫోన్లో బ్యాంకు వాళ్ళతో మాట్లాడుతుంటుంది. నిమ్మరసం తయారు చేసి రెండు గ్లాసుల్లో నింపుతుంది. బ్యాంకు వాళ్ళు డబ్బు ఎక్కువ ఇవ్వరని తెలిసి నిరాశ పడుతుంది. ఫోన్ పెట్టేశాక బయటకి వస్తుంది. రే వ్యాన్ లోపలున్న టీవీలో హెలెనాని చూసి అలర్ట్ అవుతాడు. అయితే ఆమె నిమ్మరసం గ్లాసులు పట్టుకుని వ్యాన్ దగ్గరకే వస్తుంది. మాంటెల్ గత్యంతరం లేక వ్యాన్ వెనక తలుపు తీస్తాడు. ఆమె “మీ కోసం నిమ్మరసం తెచ్చాను. నాకు ఎవరైనా దాడి చేస్తారని భయంగా ఉంది. కాస్త ఓ కన్నేసి ఉంచండి” అంటుంది. ఆమె మీద అనుమానంతో ఉన్న వారిద్దరూ నిశ్చేష్టులై ఉండిపోతారు. ఆమె ఎంత చురుకైనదో తెలుస్తుంది. కథలన్నీ చివరి దాకా ఉత్కంఠగా నడుస్తాయి. చివరికి అంతా బాగుందని చూపించి ఉంటే అది అవాస్తవికంగా ఉండేది. అలాగని నైరాశ్యంతో చిత్రం ముగియదు. అదే ఈ చిత్రాన్ని ఒక మాణిక్యంగా నిలిపింది.

2000లో దర్శకుడు స్టీవెన్ సోడర్బర్గ్ చిత్రాలు రెండు విడుదలయ్యాయి. ఒకటి ‘ట్రాఫిక్’ అయితే రెండోది ‘ఎరిన్ బ్రాకొవిచ్’. రెండు చిత్రాలకూ ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం ఆస్కార్ నామినేషన్లు వచ్చాయి! ఇది చాలా అరుదు. స్టీవెన్ సోడర్బర్గ్ ఓట్లు చీలిపోకుండా అతనికి ‘ట్రాఫిక్’ చిత్రానికే ఓట్లు వేయాలని సభ్యులు నిర్ణయించుకోవటంతో అతనికి ఉత్తమ దర్శకత్వం ఆస్కార్ వచ్చింది. ఉత్తమ చిత్రంగా ‘గ్లాడియేటర్’ నిలిచింది.

ఈ క్రింద బాబ్, క్యారలైన్‌ల కథ ఏమౌతుందో, ఎలా ముగుస్తుందో ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. మిగతా కథలు ప్రస్తావించలేదు.

క్యారలైన్ డ్రగ్స్ వాడుతోందని తెలియటంతో ఆమెని ఇంటిలో కట్టడి చేస్తారు ఆమె తలిదండ్రులు. కాలేజీ, కాలేజీకి సంబంధించిన కార్యక్రమాలు ముగించుకుని, తిన్నగా ఇంటికి రావాలి. స్నేహితులతో షికార్లు కుదరవు. బాబ్ ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేస్తూ ఉంటాడు. క్యారలైన్ తల్లి మీద కోపం ప్రదర్శిస్తూ ఉంటుంది. దాంతో ఆమె తల్లి విసిగిపోతుంది. భర్త తిరిగివచ్చాక “నీకూ బాధ్యత ఉంది. తనతో మాట్లాడు” అంటుంది. మొదట్లో భర్త దగ్గర విషయం దాచి ఇప్పుడు ఇలా అంటుంది. అతను ఆమెని నిందించడు. అది అతని ఔన్నత్యం. అతనికి కూతురు ఇంట్లోనే డ్రగ్స్ తీసుకుంటోందని తెలుస్తుంది. ఆమెని నిలదీస్తే డ్రగ్స్ మత్తులో బూతుమాటలు మాట్లాడుతుంది. అమెని డీఎడిక్షన్ సెంటర్‌కి పంపిస్తారు. అక్కడ వివిధ కార్యక్రమాల ద్వారా డ్రగ్స్‌కి, తాగుడుకి బానిసలైనవారి దృష్టి మరల్చి వారికి చికిత్స చేస్తారు. తమలాంటివారు ఇంకా ఉన్నారని, తాము ఒంటరివారు కారనే నిజాన్ని వారికి తెలియజేస్తారు. తమ భావాలను బయటికి చెప్పుకునేలా ప్రోత్సహిస్తారు. కౌన్సెలింగ్ ఇస్తారు. మద్యానికి బానిస అయిన ఒకతను “ఇదొక వ్యాధి. అయితే ఈ వ్యాధి ఇది వ్యాధి అని చెబుతూ ఉంటుంది” అంటాడు. ఇది అక్షరాలా నిజం. ఇది వ్యాధి అని గుర్తించటం మొదటి పని. క్యారలైన్ తన భావాలను చెప్పే క్రమంలో “నా వయసు వారికి మద్యం కన్నా డ్రగ్స్ తేలికగా దొరుకుతాయి” అంటుంది. “నాకు కోపంగా ఉంది. కానీ ఈ కోపం దేని మీదో తెలియట్లేదు” అంటుంది.

బాబ్ ఉద్యోగరీత్యా మెక్సికోకి వెళతాడు. జనరల్ సాలజార్ తిహువానా ముఠాని అరికట్టటానికి చేసిన కృషిని ప్రశంసిస్తాడు. అయితే డ్రగ్స్ బారినపడిన అభాగ్యుల సంగతి ఏమిటి అని అడుగుతాడు. వారిని ఎలా కాపాడుకోవాలి అని అడుగుతాడు. తన కూతురి పరస్థితి చూసి అతను కుంగిపోయి ఉన్నాడు. జనరల్ సాలజార్ “వాళ్ళ గురించి ఆలోచించనక్కరలేదు. వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఓవర్ డోస్ చేసుకుంటారు” అంటాడు! అంటే వాళ్ళకి చావే గతి అని అతని ఉద్దేశం. ఆ మాట విని బాబ్ గుండె పిండేసినట్టవుతుంది.

కొన్నాళ్ళకి క్యారలైన్ డీఎడిక్షన్ సెంటర్ నుంచి పారిపోతుంది. డ్రగ్స్ కోసం తన శరీరాన్ని అమ్ముకుంటుంది. బాబ్ ఆమెని వెతుక్కుంటూ బయలుదేరుతాడు. ఆమె ప్రియుడి సహాయం తీసుకుంటాడు. ఆమె ఒక హోటల్లో ఉండగా కనుగొంటాడు. ఆమె మత్తులోనే అతన్ని చూసి “హాయ్ డాడీ” అంటుంది. అతను ఆమె పరిస్థితి చూసి కన్నీళ్ళు పెట్టుకుంటాడు. తర్వాత అతను ఒక పాత్రికేయుల సమావేశంలో డ్రగ్స్ పై యుద్ధం అనే అంశం మీద మాట్లాడుతూ ఉంటాడు. మధ్యలో ఆపి “ఈ యుద్ధంలో మన కుటుంబాలే మనకు శత్రువులు కావచ్చు. కుటుంబంతో ఎలా పోరాడాలో నాకు తెలియదు” అని అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఉద్యోగం వదిలేసి తన కూతురికి అండగా ఉండటానికి నిశ్చయించుకుంటాడు.

డీఎడిక్షన్ సెంటర్లకి అప్పగించి బాధ్యత తీరిపోయిందని తలిదండ్రులు అనుకుంటే కుదరదనే సందేశం ఉంది ఇక్కడ. డ్రగ్స్ బారిన పడినవారికి కుటుంబాలే మొదటి ఆలంబన అవ్వాలి. ముందు నుంచే జాగ్రత్తగా ఉంటే ఇంకా మంచిది. పిల్లలకి స్వేచ్ఛ ఇస్తున్నాం అని వదిలేస్తే ఏమైనా జరగవచ్చు. మనుధర్మం ప్రకారం 8 నుంచి 16 ఏళ్ళ వరకు పిల్లలు తప్పు చేస్తే అందులో తలిదండ్రులకి సగం బాధ్యత ఉంటుంది. ప్రస్తుత కాలంలో కాలేజీకి వెళ్ళేవరకు ఉంటుంది. ఆ సమయంలోనే వాళ్ళకి విలువలు నేర్పాలి. మాకు సమయం లేదు అంటే కుదరదు. తలిదండ్రులు ఆదర్శంగా నిలవాలి. వాళ్ళే విలువలు లేకుండా ప్రవర్తిస్తే పిల్లలు ఇంకా చెడిపోతారు. ఈరోజుల్లో మద్యం తాగటం ఒక ఫ్యాషన్ అయిపోయింది. పిల్లల ఎదురుగానే తాగుతున్నారు. అది చూసిన పిల్లలు ఇంకొంచెం ముందుకు వెళ్ళి డ్రగ్స్ తీసుకుంటే తప్పేమిటి అంటున్నారు. ఎవరి పిల్లలని వారు కనిపెట్టుకుని ఉండకపోతే బయటివారు ఎవరూ సాయం చేయరు. అదే బాబ్ గ్రహించిన విషయం. సమాజం మారాలంటే పెద్దగా ఏమీ చేయక్కరలేదు. ఎవరి కుటుంబం వారు జాగ్రత్తగా చూసుకుంటే సమాజం దానంతట అదే మారుతుంది.

Exit mobile version