మరుగునపడ్డ మాణిక్యాలు – 38: ద ఇమిటేషన్ గేమ్

0
2

[dropcap]యు[/dropcap]ద్ధంలో గెలవాలంటే ఎన్నో వ్యూహాలు వెయ్యాలి. యుద్ధభూమిలో మాత్రమే కాదు, బయట కూడా.  గూఢచారులను పెట్టాలి. శత్రువుల సమాచారం రాబట్టాలి. ఆధునిక కాలంలో సమాచార వ్యవస్థ అభివృధ్ధి చెందటంతో సమాచారం రాబట్టటం కష్టం. పైగా ఇప్పటి యుధ్ధాలలో పోరాటం యుద్ధభూమిలో జరగట్లేదు, దేశంలోని పౌరుల మీద దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మేధావుల సాయం లేనిదే యుద్ధం గెలవటం కష్టం. రెండో ప్రపంచయుద్ధంలో ఆలన్ ట్యూరింగ్ అనే గణితజ్ఞుడి సాయంతో ఎలా శత్రువులని దెబ్బతీశారో చూపించిన చిత్రం ‘ద ఇమిటేషన్ గేమ్’ (2014). ఆలన్ ట్యూరింగ్ ఆధునిక కంప్యూటర్లకి ఆద్యుడు. అయితే అతని వ్యక్తిగత జీవితం కారణంగా అతన్ని ఒక నేరస్థుడిగా చూసింది బ్రిటిష్ ప్రభుత్వం. 2013లో అతనికి క్షమాభిక్ష ఇచ్చారు. అయితే అప్పటికే అతను మరణించాడు. ఇప్పటి చట్టాల ప్రకారం అతనిది నేరమే కాదు. అదే విషాదం. ఈ చిత్రం ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం. ఆలన్ జీవితంలో జరిగిన సంఘటనలను యథాతథంగా చూపించటం ఈ చిత్రం ఉద్దేశం కాదు. Historical accuracy కోసం చూడకూడదు.

‘ద ఇమిటేషన్ గేమ్’ అంటే అనుకరణ పందెం అనుకోవచ్చు. ఆలన్ ట్యూరింగ్ సమర్పించిన ఒక పత్రంలో కృత్రిమ మేధ గురించి అప్పట్లోనే చెప్పాడు. అందులో ఒక యంత్రానికి మేధస్సు ఉందా లేదా అనేది ఒక అనుకరణ పందెం ఆధారంగా తెలుసుకోవచ్చని అన్నాడు. మనుషుల్ని అనుకరించే సామర్థ్యం ఉంటే ఒక యంత్రానికి కృత్రిమ మేధ ఉన్నట్టే అని సూత్రీకరించాడు. అయితే మనుషులందరూ ఒకేలా ఆలోచించరు. మరి అలాంటపుడు యంత్రాలు మనుషుల్లా ఆలోచిస్తాయా అనేదానికి సమాధానం ఏమిటి? ఈ ప్రశ్న ఈ చిత్రంలో చివరికి ఒక కొత్త అర్థం సంతరించుకుంటుంది.

ఆలన్ జీవితంలోని మూడు సమయాల్లో జరిగిన సంఘటనలు చిత్రంలోని ప్రధాన కథ. 1928లో ఆలన్ ఒక బ్రిటన్ లోని ఒక బోర్డింగ్ స్కూల్లో చదువుతూ ఉంటాడు. అప్పుడు అతనికి 16 ఏళ్ళు. తన ప్రపంచంలో తానుంటాడు. అతన్ని ఇతర విద్యార్థులు ఏడిపిస్తూ ఉంటారు. అతనికి క్రిస్టఫర్ అనే మరో విద్యార్థితో స్నేహం ఏర్పడుతుంది. క్రిస్టఫర్ ఒకసారి ఒక పుస్తకం చదువుతూ ఉంటాడు. అది రహస్య భాషలకు సంబంధించిన పుస్తకం. ఏదైనా సందేశాన్ని రహస్యంగా పంపాలంటే సంకేతాలను వాడవచ్చు. సందేశం అందుకునేవారికి ఆ సంకేతాలు (కోడ్ భాష) తెలిస్తే గానీ ఆ సందేశాన్ని చదవలేరు. మధ్యలో ఆ సందేశం వేరేవారి చేతిలో పడినా వారికి అర్థం కాదు. ఆలన్‌కి రహస్య భాషల మీద ఆసక్తి కలుగుతుంది. ఆలన్, క్రిస్టఫర్ రహస్య భాషలో ఒకరికొకరు సందేశాలు వ్రాసుకుంటారు. క్రిస్టఫర్ ఒక్కడే ఆలన్‌కి స్నేహితుడు. తర్వాత ఆలన్ గణితశాస్త్రం అభ్యసిస్తాడు. క్రిస్టఫర్‌తో స్నేహం కొనసాగిందా? ఇది తర్వాత తెలుస్తుంది.

1951లో (అంటే రెండో ప్రపంచయుద్ధం ముగిసిన తర్వాత) ఆలన్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తుంటాడు. ఒంటరిగా ఉంటాడు. అతని ఇంట్లో దొంగతనం జరిగిందని పక్కింటివారు ఫిర్యాదు ఇవ్వటంతో పోలీసులు వస్తారు. అయితే అతను దొంగతనం జరగలేదంటాడు. ఇల్లంతా చిందరవందరగా ఉంటుంది. అయినా ఆలన్ ఏమీ చెప్పడు. పోలీసు అధికారి రాబర్ట్‌కి అనుమానం వస్తుంది. అతను ఏదో దాస్తున్నాడని అతని అభిప్రాయం. అందుకని ఇంకా పరిశోధన చేస్తాడు. అతని పరిశోధనలో ఆలన్ మిలిటరీలో పని చేశాడని తెలుస్తుంది. అయితే మిలిటరీలో అతను ఏం చేశాడనేది రహస్యమని తెలుస్తుంది. ఆ సమాచారం క్లాసిఫైడ్ అని మిలిటరీ వాళ్ళు చెబుతారు. అంటే ఆ సమాచారం ఎవరికీ ఇవ్వకూడదని ప్రభుత్వం ఆదేశించింది. 1951లో బ్రిటన్, అమెరికాలకు రష్యా శత్రుదేశం. రష్యా రెండో ప్రపంచయుద్ధంలో బ్రిటన్, అమెరికాలతో కలిసి జర్మనీపై పోరాడింది. కానీ యుద్ధం ముగిసిన తర్వాత పరిస్థితి మారిపోయింది. రష్యా, అమెరికాలు అధిపత్యం కోసం పోరు ప్రారంభించాయి. బ్రిటన్ అమెరికాకి తోడుగా నిలిచింది. కొందరు బ్రిటిష్ వారు రష్యాకి గూఢచారులుగా పనిచేశారు. ఆలన్ కూడా రష్యా గూఢచారి అని రాబర్ట్‌కి అనుమానం వస్తుంది. ఇంకా పరిశోధన చేస్తాడు.

నిజానికి ఆలన్ బ్రిటన్ ప్రభుత్వపు రహస్య ఆపరేషన్‌లో పని చేశాడు. 1939లో యుద్ధం ప్రారంభమయ్యాక జర్మనీ ఎనిగ్మా అనే ఒక యంత్రాన్ని ఉపయోగించి సందేశాలు తమ సైన్యానికి పంపించేది. అది అధునాతనమైన యంత్రం. సంకేత భాషని ఉపయోగించి సందేశాలు పంపిస్తుంది. అయితే ఆ సంకేత భాష రోజూ మారిపోతుంది. బ్రిటన్ సైన్యం జర్మనీ తమ సైన్యానికి పంపించే సందేశాలను చౌర్యం చేస్తుంది. చౌర్యం చెయ్యటం తేలికే కానీ ఆ సందేశాలు అర్థమవ్వాలంటే ఒక రోజు లోపలే ఆ సంకేత భాష ఏమిటని తెలుసుకోవాలి. ఎనిగ్మా యంత్రం రూపకల్పన ఎలాంటిదంటే అనేక కోట్ల కోట్ల కోట్ల సంకేత భాషలను అది పుట్టించగలదు. అందులో ఒక భాష ఒకరోజు వాడతారు. అది తెలుసుకోవాలంటే తగిన యంత్రం బ్రిటన్ దగ్గర లేదు. బ్రిటన్ సైన్యం విశ్వవిద్యాలయాలలో ఉన్న సంకేత భాషా నిపుణులని (క్రిప్టోగ్రాఫర్లు) ఒక రహస్య ప్రాంతానికి పిలిపించి ఆ రహస్య సందేశాలను విప్పే బాధ్యత అప్పగిస్తుంది. ఆలన్ కూడా అక్కడ చేరతాడు.

ఆలన్‌కి పనే ప్రపంచం. చుట్టూ ఉన్నవారితో సామరస్యంగా మెలగాలనే ఆలోచనే అతనికి ఉండదు. ఎవరైనా ఏమైనా అంటే దాని వెనక ఉన్న అర్థం గురించి ఆలోచించడు. యథాతథంగా (లిటరల్‌గా) తీసుకుంటాడు. తోటివారు “మేము భోజనం చేయటానికి వెళ్తున్నాం” అంటే తనని కూడా రమ్మంటున్నారని అతనికి అర్థం కాదు. “భోజనానికి వస్తావా?” అంటేనే అతనికి అర్థమవుతుంది. దీన్ని ఆటిజమ్ అంటారు. అయితే అప్పట్లో ఈ ప్రవర్తనకి ఒక పేరు లేదు. అందరూ అతన్ని వింతగా చూస్తారు. ఎనిగ్మాని ఛేదించాలంటే తాము కూడా ఒక యంత్రాన్ని తయారు చేయాలని ఆలన్ ప్రతిపాదిస్తాడు. లక్ష పౌండ్లు ఇస్తే ఒక యంత్రాన్ని తయారు చేస్తానంటాడు. అతని పై అధికారి ఒప్పుకోడు. దాంతో ఆలన్ ప్రధానమంత్రి చర్చిల్‌కి ఉత్తరం రాస్తాడు. అతని యంత్రానికి ప్రధానమంత్రి అనుమతి వస్తుంది. అతన్ని నిపుణుల బృందానికి నాయకుడిగా నియమిస్తారు. అతను బృందంలో సరైన నైపుణ్యం లేని ఇద్దరిని తీసేసి మరో ఇద్దరిని తీసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెడతాడు. పరీక్షలు పెట్టి ఇద్దరిని ఎంపిక చేస్తాడు. అందులో ఒకరు జోన్ క్లార్క్ అనే యువతి. అప్పట్లో యువతులు టెలిఫోన్ ఆపరేటర్లు గానే పని చేసేవారు. ఇతర పురుషులతో కలిసి నిపుణుల బృందంలో పనిచేయటానికి జోన్ తలిదండ్రులు ఒప్పుకోరు. టెలిఫోన్ ఆపరేటర్‌గా ఉద్యోగం ఇప్పించి ఆమెని రప్పిస్తాడు ఆలన్.

రెండేళ్ళు గడిచిపోతాయి. ఆలన్ యంత్రాన్ని తయారు చేస్తాడు. జోన్ సహయంతో యంత్రంలో మార్పులు చేస్తూ ఉంటాడు. ఇద్దరూ సన్నిహితులౌతారు. అయితే వారి సంభాషణలన్నీ యంత్రం గురించే. ఆలన్ తయారు చేసిన యంత్రం మనుషుల కంటే వేగంగా పనిచేస్తుంది కానీ ఒకరోజులో సంకేతభాషని కనుక్కునే సామర్థ్యం దానికి ఉండదు. దీంతో ఆలన్ పై అధికారి ఆ యంత్రాన్ని తీసుకుపోవటానికి సైనికులతో పాటు వస్తాడు. ఆలన్‌ని తొలగిస్తానంటాడు. మొదట్లో యంత్రం మీద నమ్మకం లేని ఇతర నిపుణులు ఇప్పుడు ఆ యంత్రమే సరైన మార్గమని నమ్మి ఆలన్‌ని తొలగిస్తే తామూ వెళ్ళిపోతామంటారు. అధికారి ఒక నెల గడువు ఇస్తాడు. మరో పక్క జోన్ తన తలిదండ్రులు తనని పెళ్ళి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారని అంటుంది. నిపుణుల్లో ఒకరిని పెళ్ళి చేసుకోవచ్చు కదా అంటాడు ఆలన్. జోన్ ఎవరిని చేసుకోవాలి అని నిపుణుల్లో ఒక్కొక్కరి పేరు చెబుతూ ఉంటుంది. ఆలన్‌ని పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన ఆమెకి రాదు. ఆలన్ తననే పెళ్ళి చేసుకోమంటాడు. పని తప్ప వేరే ప్రపంచం తెలియని ఆలన్ అలా అనటంతో ఆశ్చర్యపోతుంది కానీ ఒప్పుకుంటుంది. త్వరలో పెళ్ళి చేసుకోవాలని అనుకుంటారు. ఇక్కడ ఆలన్ వ్యక్తిగత జీవితం గురించి ఒక విషయం బయటపెడతాడు దర్శకుడు. ఆలన్ ఒక సహచరుడికి తప్ప ఈ విషయం ఎవరికీ చెప్పడు. ఇదే ఆలన్ తర్వాత చేసే నేరం కాని నేరానికి కారణం. ఆలన్ ట్యూరింగ్ గురించి తెలిసినవారికి ఈ విషయం తెలిసే ఉంటుంది. తెలియనివారు చిత్రం చూసి తెలుసుకుంటే ప్రతిభకి, వ్యక్తిగత జీవితానికి ముడి ఉండాలా వద్దా అనే అంశం ఆలోచింపజేస్తుంది.

ఆలన్ యంత్రం చివరికి లక్ష్యాన్ని సాధిస్తుంది. ఎలా అనేది ఈ వ్యాసంలో క్రింద ప్రస్తావించబడింది. యంత్రం సహాయంతో జర్మనీ వాళ్ళ సందేశాలు మొదటిసారి విప్పి చూస్తే ఒక ప్రయాణీకుల నౌక మీద దాడి చేసి అందులోని పౌరుల్ని చంపటానికి జర్మనీ పథకం రచించిందని తెలుస్తుంది. ఈ విషయాన్ని సైన్యానికి తెలియజేసి తమ నౌకని దారి మళ్ళించి, జర్మనీ జలాంతర్గాముల మీద దాడి జరిగేలా చూడాలని ఇతర నిపుణులు అంటారు. అయితే ఆలన్ నిరాకరిస్తాడు. అలా చేస్తే జర్మనీకి అనుమానం వస్తుందని అంటాడు. తాము ఎనిగ్మాని ఛేదించామని తెలిసిపోతుందంటాడు. అప్పుడు జర్మనీ ఎనిగ్మా యంత్రాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కథ మళ్ళీ మొదటికొస్తుంది. మరి ఆ నౌక లోని పౌరుల సంగతి ఏమిటి? వ్యూహాత్మకంగా వ్యవహరించకపోతే దేశానికి, ప్రపంచానికి పెద్ద నష్టం జరుగుతుంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. దానికి మూల్యం కొన్ని ప్రాణాలు. ఒక పెద్ద ప్రయోజనం సాధించాలంటే కొంత నష్టాన్ని భరించాలి. ఇది అమానుషంగా అనిపించవచ్చు కానీ ప్రత్యామ్నాయం లేని పరిస్థితి. ఇంతలో ఆ నిపుణుల్లో ఒకడైన పీటర్‌కి తన అన్నయ్య ఆ నౌకలో ఉన్నాడని గుర్తొస్తుంది. “మా అన్నయ్యని కాపాడు” అంటాడు. ఆలన్ నిరాకరిస్తాడు. ఆలన్ లాంటి వాళ్ళు రాతిగుండె కలవారని బయటివారికి అనిపిస్తుంది. కానీ దేశప్రయోజనాల కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు. క్రిమినల్ కేసుల్లో వంద మంది అపరాధులు తప్పించుకున్నా పరవాలేదు కానీ ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడకూడదని అంటారు. అవి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన కేసులు. ఇది దేశానికి సంబంధించినది. దేశం కోసం త్యాగం చేయటానికి అందరూ సిద్ధంగా ఉండాలి. ఇటీవల సైనిక రహస్యాలను చెప్పాలంటూ ప్రతిపక్షాలు భారత ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నాయి. ఇది గర్హనీయం. సైనిక రహస్యాలు బయట పెడితే దేశరక్షణ సంగతి ఏమిటి?

వ్యూహాత్మకంగా వ్యవహరించి బ్రిటన్, దాని మిత్రపక్షాలు యుద్ధంలో విజయం సాధిస్తాయి. దానికి కూడా ఆలన్ సహకరిస్తాడు. తక్కువ దాడులు చేసి ఎక్కువ ప్రయోజనం పొందేలా గణితశాస్త్రం ఉపయోగించి నమూనాలు తయారు చేస్తాడు. దీని వల్ల ప్రాణనష్టం తగ్గుతుంది. రెండేళ్ళు త్వరగానే యుద్ధం ముగియటానికి ఆలన్ యంత్రం సహకరించిందని సైన్యాధికారులు అంటారు. అయితే అలాంటి యంత్రం తమ దగ్గర ఉందని ఎవరికీ తెలియకూడదని మిలిటరీ అన్ని పత్రాలను దహనం చేయిస్తుంది. అలన్, అతని బృందం అజ్ఞాతవీరులుగా మిగిలిపోతారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. అజ్ఞాతవీరులెంత మంది ఉన్నా యుద్ధం చేసే సైనికులు చేసే త్యాగం నిరుపమానమైనది. వారు లేకపోతే ఏ దేశానికీ రక్షణ ఉండదు. వారికి మనందరం కృతజ్ఞులమై ఉండాలి. వారి క్షేమం కోసం మనం చేయగలిగినది చేయాలి. ప్రార్థన చేసేవారు వారి కోసం ప్ర్రార్థన చేయవచ్చు. ధనసహాయం చేసేవారు జాతీయ రక్షణ నిధికి విరాళం ఇవ్వవచ్చు.

ఆండ్రూ హాడ్జెస్ వ్రాసిన ఆలన్ ట్యూరింగ్ జీవితకథ ఆధారంగా గ్రాహమ్ మూర్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించాడు. మార్టెన్ టిల్డమ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ నటుడు (ఆలన్‌గా నటించిన బెనెడిక్ట్ కంబర్ బ్యాచ్‌కి), ఉత్తమ సహాయనటి (జోన్ గా నటించిన కైరా నైట్లీకి), ఉత్తమ సంగీతం, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ కళాదర్శకత్వం ఆస్కార్ నామినేషన్లు వచ్చాయి. ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు దక్కింది. ఆలన్ రూపొందించిన యంత్రం చూస్తే అప్పట్లో కంప్యూటర్లు ఎలా ఉండేవో తెలుస్తుంది. ఈ విషయంలో కళాదర్శకురాలు మారియా జుర్కోవిచ్‌ని అభినందించకుండా ఉండలేం.

ఈ క్రింద ఆలన్ రూపొందించిన యంత్రం తనకు ఉద్దేశించిన లక్ష్యాన్ని ఎలా సాధించిందో ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత క్రింది విశ్లేషణ చదవవచ్చు.

ఒకరోజు బార్లో ఆలన్, జోన్, ఇతర నిపుణులు కాలక్షేపం చేస్తుండగా హెలెన్ అనే ఆపరేటర్ తను రోజూ ఒక జర్మన్ వ్యక్తి సందేశాలు చౌర్యం చేస్తూ ఉంటానని, అతనితో మౌనంగానే అనుకోని సాన్నిహిత్యం ఏర్పడిందని అంటుంది. అయితే అతనికి ఒక ప్రియురాలు ఉందని తెలిసి తనకు నిరాశ కలిగిందని అంటుంది. అందరూ నవ్వుతారు. ఆలన్‌కి ఇది వింతగా అనిపిస్తుంది. “అతనికి ప్రియురాలు ఉందని నీకెలా తెలుసు?” అంటాడు. “అతని సందేశాలు ఎప్పుడూ ‘cilly’ అనే అక్షరాలతో మొదలవుతాయి. అందుకని తమాషాగా అతనికి ప్రియురాలు ఉందని అన్నాను” అంటుందామె. అసలు విషయమేమిటంటే జర్మన్లు అందరూ తమ సందేశాలలో మొదటి ఐదు అక్షరాలు ఏ అర్థం లేకుండా ఉండేలా ఎంపిక చేయాలని వారికి ఆదేశం ఉంటుంది. ఎవరైనా సందేశాన్ని విప్పి చూసినా మొదట్లో గజిబిజిగా ఉన్న అక్షరాలు చూసి అర్థం కాక వదిలేస్తారని వారి ఉపాయం. ఈ వ్యక్తి మాత్రం రోజూ ‘cilly’ అనే అక్షరాలనే ఎంచుకుంటాడు. “ప్రేమ ఒక్కోసారి పిచ్చి పనులు చేయిస్తుంది” అంటాడు ఆలన్ సహోద్యోగుల్లో ఒకడు. ఆలన్‌కి ఒక ఆలోచన తళుక్కున మెరుస్తుంది. “ఈ ప్రేమ మాత్రం జర్మన్లు యుద్ధంలో ఓడిపోయేలా చేసింది” అని తన యంత్రం దగ్గరకి పరిగెడతాడు.

అప్పటిదాకా ఆలన్ యంత్రం ఒకరోజులో సంకేతభాషని కనుక్కోలేకపోయినా కొన్నిరోజుల తర్వాత కనుక్కుంటుంది. ‘cilly’ అనే సంకేత పదం కొన్ని సందేశాలలో రోజూ ఉన్నట్టే ఇతర సందేశాల్లో కొన్ని ఎక్కువ పదాలు రోజూ ఉండొచ్చు. అలాంటి సందేశాలు తీసుకుని అందులో కొన్ని పదాలకి అర్థం రోజూ ఒకటే ఉంటుందని యంత్రానికి తెలియజేస్తే సంకేతభాషకి వేగంగా తెలుసుకోవచ్చు. రోజూ ఉదయం ఆరు గంటలకి వాతావరణానికి సంబంధించిన సందేశం వస్తుందని ఆలన్‌కి తడుతుంది. అందులో ‘వాతావరణం’, ‘జై హిట్లర్’ అనే అర్థాలు వచ్చే సంకేత పదాలు రోజూ ఉంటాయి. ఈ పదాలు యంత్రం లోకి ఎక్కించి ఆరోజు ఆరు గంటలకి వచ్చిన రహస్య సందేశాన్ని ఆ ప్రాతిపదిక మీద విప్పమని యంత్రానికి సూచన ఇస్తారు. దాంతో వేగంగా ఆరోజు సంకేతభాషని యంత్రం కనుక్కుంటుంది. అనుకోకుండా జరిగిన ఒక సంఘటన ఆలన్‌లో ఒక ఆలోచనని స్ఫురింపజేసింది. లక్ష్యాన్ని ఛేదించటానికి సహాయపడింది. ఇక్కడ హిట్లర్ మీద దురభిమానం కూడా అతనికి వ్యతిరేకంగా పనిచేసింది. నియంతల పతనం వారి అహంలోనే ఉంటుంది.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

జోన్‌ని పెళ్ళి చేసుకుంటానని చెప్పిన తర్వాత ఆలన్‌లో అంతర్మథనం మొదలౌతుంది. జాన్ అనే సహోద్యోగుడితో “నాకు జోన్‌తో శృంగారం ఇష్టం లేకపోతే ఏం చేయాలి?” అంటాడు. “నువ్వు హోమోసెక్సువల్ (స్వలింగప్రియుడు) కనుక అలా అడుగుతున్నావు కదా?” అంటాడు జాన్. అవునంటాడు ఆలన్. “నాకు ముందే అనుమానం వచ్చింది. అయితే స్వలింగసంపర్కం చట్టరీత్యా నేరం. ఎవరికీ చెప్పకు. జోన్‌ని కూడా చెప్పకు” అంటాడతను. ఆలన్ బోర్డింగ్ స్కూల్లో ఉన్నప్పుడు క్రిస్టఫర్‌ని మౌనంగా ప్రేమించాడు. క్రిస్టఫర్ సెలవులకి ఇంటికి వెళతాడు. అతను తిరిగి వస్తే అతనికి తన ప్రేమ సంగతి చెప్పాలని అలన్ అనుకుంటాడు. క్రిస్టఫర్ తిరిగిరాడు. ప్రిన్సిపాల్ ఆలన్‌ని పిలిచి “నువ్వు, క్రిస్టఫర్ మంచి స్నేహితులు కదా? మీ ఉపాధ్యాయుడు చెప్పాడు” అంటాడు. అదేం కాదు అంటాడు ఆలన్. స్వలింగప్రియుల జీవితాల్లో విషాదం ఇదే. ఉన్న విషయాన్ని దాచటానికి మరింత ఆత్మవంచన చేసుకుంటారు. సమాజం వారి పట్ల చూపే వివక్ష అలాంటిది. “క్రిస్టఫర్‌కి గతంలోనే క్షయ సోకింది. అది ముదిరి అతను మరణించాడు” అంటాడు ప్రిన్సిపాల్. ఆలన్ అవాక్కయి ఉండిపోతాడు. పైగా క్రిస్టఫర్ తన వ్యాధి విషయం ఆలన్‌కి చెప్పలేదు. అంత స్నేహం ఉన్నా అతను చెప్పకపోవటం ఆలన్‌కి శరాఘాతంలా తగులుతుంది. అంటే క్రిస్టఫర్ అతన్ని ప్రేమించటం మాట అటుంచి అతన్ని ఒక మంచి స్నేహితుడిగా కూడా భావించలేదు. అతని మీద జాలిపడ్డాడంతే.

జోన్‌ని పెళ్ళి చేసుకుందామని ఆలన్ అనుకోవటం వెనక అతని స్వార్థం ఉండవచ్చు. కానీ ఆమె మేధ అతన్ని ఆకర్షించింది. ఇద్దరూ మేధ విషయంలో సమఉజ్జీలు. ఆమెకి మామూలు ఆడదాని జీవితం ఇష్టం లేదు. ఉద్యోగం చేయాలని ఆమె కోరిక. ఆరోజుల్లో ఆడవారికి పెళ్ళే పరమావధి. ఆమె ఆలన్‌ని పెళ్ళి చేసుకుంటే సమాజం కోరుకున్నట్టు ఆమెకో భర్తా ఉంటాడు, ఆమె కావాల్సిన ఉద్యోగమూ చేసుకోవచ్చు. అయితే జోన్ ఇబ్బందుల్లో పడుతుంది. ఆమె ఆపరేటర్‌గా పని చేస్తోంది. ఆలన్ రహస్యంగా ఆమె సహాయంతో తన యంత్రాన్ని అభివృద్ధి చేస్తాడు. ఇది పై అధికారులకి తెలియదు. ఆమె వద్ద రహస్యపత్రాలు ఉన్నాయని ఒక ఇంటెలిజెన్స్ అధికారికి తెలుస్తుంది. ఆమె గూఢచారిగా మారి దేశద్రోహం చేస్తోందని అంటాడు. ఆలన్ అసలు విషయం చెబుతాడు. అయితే ఆ అధికారి దేశప్రయోజనాల కోసం గూఢఛర్యం చేయమని అంటాడు. లేకపోతే జోన్ మీద చర్యలు తప్పవని అంటాడు. దాంతో ఆలన్ జోన్‌ని ఉద్యోగం వదిలి వెళ్ళిపొమ్మంటాడు. ఆమె ఎందుకని అడుగుతుంది. తాను స్వలింగప్రియుణ్ణని అంటాడతను. “నాకు అనుమానం వచ్చింది. అయినా అది నాకు పెద్ద విషయం కాదు. మన ప్రేమ అందరి ప్రేమ లాంటిది కాదు. మనకు సాహచర్యమే చాలు. మన మేధస్సుల కలయిక చాలు” అంటుంది. ఆమెకి అతని మీద అనుమానం ఉంది కాబట్టే అతను అక్కడి నిపుణుల్లో ఒకర్ని పెళ్ళి చేసుకోవచ్చుగా అంటే ఆమెకి అతన్ని పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన రాలేదు. అయితే అతనే పెళ్ళి ప్రస్తావన తెచ్చాడు. ఆమెకి లైంగిక సుఖం కన్నా, సంతానం కన్నా తన స్వతంత్రమే ముఖ్యం. అందుకే ఒప్పుకుంది. కానీ ఇప్పుడు అతను కాదంటున్నాడు. చివరికి ఆలన్ “నాకు నీ మీద ప్రేమ లేదు” అంటాడు. ఆమె అతన్ని చెంపదెబ్బ కొడుతుంది. “నేనెక్కడికీ వెళ్ళను. నా జీవితానికి నీ ఆమోదం, నా తలిదండ్రుల ఆమోదం అవసరం లేదు. నేనిక్కడే ఉండి ఉద్యోగం చేస్తాను” అంటుంది. అతను నిజానికి ఆమెను కాపాడదామనుకున్నాడు. కానీ ఆమె మరోలా అర్థం చేసుకుంది.

1951లో ఆలన్ ఇంట్లో జరిగిన దొంగతనం నిజానికి ఆప్పటి అతని ప్రియుడు చేసినదే. అయితే దొంగతనం జరిగిందని పోలీసులకి చెబితే తాను స్వలింగప్రియుణ్ణని తెలిసిపోతుందని ఆలన్ మౌనంగా ఉంటాడు. అయితే పోలీసులు కూపీ లాగటంతో విషయం బయటపడుతుంది. ఆలన్ తన కథంతా చెబుతాడు. దేశానికి సేవ చేసిన అతను స్వలింగప్రియుడు అయినంత మాత్రాన అతని విలువ తగ్గిపోతుందా? ఒక యంత్రం మనిషి కంటే వేరుగా అలోచిస్తుంది. ఆ కారణంతో అది అసలు ఆలోచించటం లేదని అనవచ్చా? ఆలన్ ఇతరుల కంటే భిన్నమైన లైంగిక వాంఛలు కలవాడు. అందుకని అతను సంఘంలో ఉండటానికి అనర్హుడైపోతాడా? పైగా అతనొక మేధావి. గత 70 ఏళ్ళలో స్వలింగప్రియత్వం మీద ఎన్నో పరిశోధనలు జరిగాయి. అది వ్యక్తులు కావాలని చేసే విపరీత చర్య కాదని, అది సహజంగా కొంతమందిలో పుట్టే గుణమని శాస్త్రజ్ఞులు తేల్చారు. ఇది ప్రకృతికి విరుద్ధం అని కొందరు అనవచ్చు. ప్రకృతికి విరుద్ధమైనది దేవుడు ఎందుకు సృష్టిస్తాడు? జనాభాని తగ్గించటానికి ఇది ప్రకృతి ఎంచుకున్న ఒక పద్ధతి అని కొందరంటారు. ఏది ఏమైనా ఇప్పుడు భారతదేశంతో సహా చాలా దేశాలు స్వలింగసంపర్కం నేరం కాదని చట్టం చేశాయి. ఆలన్ లాంటివాళ్ళు అప్పట్లో చాలామంది నేరస్థులుగా నిలబడాల్సిన పరిస్థితి. అప్పటి చట్టం ప్రకారం ఆలన్ మీద అసభ్య ప్రవర్తన కేసు పెడతారు పోలీసులు. జడ్జి ఆలన్‌ని దోషిగా తేల్చి అతనికి రెండు ప్రత్యామ్నాయాలు ఇస్తాడు. జైలు శిక్ష అనుభవిస్తావా లేక హార్మోన్ థెరపీ తీసుకుంటావా అంటాడు. హార్మోన్ థెరపీ అంటే లైంగిక వాంఛలు తగ్గించే మందులు ఇస్తారు. ఆలన్‌కి తన వృత్తే ప్రధానం. అందుకని హార్మోన్ థెరపీకి ఒప్పుకుంటాడు. తన ఇంట్లోనే కంప్యూటర్ సామర్థ్యాన్ని పెంచే పరిశోధనలు చేస్తూ ఉంటాడు. అయితే మందుల ప్రభావంతో అతని మానసిక సామర్థ్యం తగ్గిపోతుంది. శరీరంలో సత్తువ కూడా తగ్గిపోతుంది. చివరికి అతను ఆత్మహత్య చేసుకుంటాడు.

దేశానికి, ప్రపంచానికి ఎంతో సేవ చేసిన ఆలన్ చివరికి ప్రాణత్యాగం చేసుకోవటానికి కారణం ఎవరు? తమ కంటే భిన్నమైనవారిని చూసి భయపడే మేధావులు. విషాదమేమిటంటే కొన్ని విషయాలు కొందరికి ఎంతకీ అర్థం కావు. అత్యధికమైన పురుషుల్లో స్త్రీల పట్ల ఆకర్షణ ఉంటుంది. అలాగే స్త్రీలకి పురుషుల పట్ల. వారికి భిన్నంగా ఎవరైనా ఉంటే వారికి ఆ ఆకర్షణ అర్థం కాదు. ఎందుకంటే వారికి ఆ ఆకర్షణ లేదు కాబట్టి. అయితే విశాల దృక్పథంతో ఆలోచించేవారు అర్థం చేసుకుంటారు. అందరూ తమ లాగే ఉండాలనే నియమం లేదని అర్థం చేసుకుంటారు. ఎవరో కొందరు స్వలింగప్రియులు చేసే నేరాలను చాలామంది భూతద్దంలో చూస్తారు. స్వలింగప్రియులు కానివారు నేరాలు చేయటం లేదా? మరణించే సమయానికి అలన్ ట్యూరింగ్ వయసు 41 ఏళ్ళు. అతని వ్యక్తిగత జీవితాన్ని పట్టించుకోకుండా అతని పని అతన్ని చేసుకోనిస్తే అతనింకా ఎన్ని అద్భుతాలు చేసేవాడో! 2013లో అతనికి బ్రిటన్ రాణి క్షమాభిక్ష ప్రసాదించింది. మానవజాతి చరిత్ర అంతా చేసిన తప్పులు దిద్దుకోవటమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here