మరుగునపడ్డ మాణిక్యాలు – 4: ద గిల్టీ

0
2

[dropcap]2[/dropcap]018లో వచ్చిన ‘ద గిల్టీ’ అనే డానిష్ చిత్రం గత సంవత్సరం చూశాను. Mind-blowing! అంటే దిమ్మతిరిగింది. చిత్రమంతా ఒక బిల్డింగ్‌లో కథానాయకుడు పలువురితో ఫోన్లో మాట్లాడుతుంటాడు. ఇతర వ్యక్తులుంటారు కానీ చిత్రంలో 90 శాతం కథానాయకుడే తెర మీద కనిపిస్తుంటాడు. అయితే ఫోన్లో అతను మాట్లాడుతున్న వ్యక్తులు కథను నడిపిస్తారు. అదీ ఎంతో ఉత్కంఠభరితంగా. చివరికొచ్చేసరికి అద్భుతరసం, బీభత్సరసం, కరుణరసం కలగలిసి గుండె బరువెక్కుతుంది. రచయిత ఎవరా అనిపించింది వెంటనే. గుస్తావ్ మోలర్, ఎమిల్ అల్బెర్ట్సన్ స్క్రీన్ ప్లే వ్రాశారు. గుస్తావ్ తనే దర్శకత్వం వహించాడు. 2018లో ఎన్నో అద్భుతమైన విదేశీ చిత్రాలు విడుదలయ్యాయి. ‘రోమా’ (స్పానిష్), ‘కాపెర్నామ్’ (అరబిక్), ‘షాప్ లిఫ్టర్స్’ (జపనీస్) వాటిలో ఉన్నాయి. వీటి మధ్యలో విడుదలైన ‘ద గిల్టీ’కి సరైన గుర్తింపు దొరకలేదు. పైగా ముందు చెప్పినవన్నీ సెంటిమెంట్ చిత్రాలు కావటం వలన ఈ చిత్రం మరుగున పడిపోయింది.

‘ద గిల్టీ’ డేనిష్ పోస్టర్

ఈ చిత్రాన్ని ఆంగ్లంలో పునర్నిర్మించారు. 2021లో అదే పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయింది. కొన్ని మార్పులు చేశారు. మాతృక అంత ప్రభావవంతంగా లేకపోయినా బావుంది. హిందీ శబ్దానువాదం కూడా అందుబాటులో ఉంది. ఓపికగా చూస్తే ఒక సినిమాగానే కాక మనిషి మనస్తత్వం మీద విశ్లేషణగా కూడా ఆకట్టుకుంటుంది.

జో అనే ఒక పోలీసు ఆఫీసర్ అర్ధరాత్రి వేళ ఎమెర్జెన్సీ కేంద్రంలో ఫోన్లు అందుకునే పని చేస్తుంటాడు. అతను ఇంతకు ముందు సాధారణ పోలీసు ఉద్యోగం చేసేవాడు. అతని మీద ఏదో కేసు నడుస్తోందని, ఆ కేసు తేలేవరకు అతనికి ఇలా ఫోన్లు అందుకునే బాధ్యత అప్పగించారని మనకి తెలుస్తుంది. మన దేశంలో ఏదైనా ప్రమాదంలో ఉంటే 100కి ఫోన్ చేస్తాం. వాళ్ళు వివరాలు కనుక్కుని సహాయం పంపిస్తారు. అలాంటిదే జో పని చేసే కేంద్రం. అతను అసహనం కల వ్యక్తి అని మనకి అతని ప్రవర్తన బట్టి అర్థమౌతుంది. అతని సెల్ ఫోన్‌పై వాల్‌పేపర్ మీద అతని కూతురు ఫొటో ఉండటం కనిపిస్తుంది.

అతనికి ఎమిలీ అనే ఆమె నుంచి ఫోన్ వస్తుంది. తన పక్కనున్న వ్యక్తికి తాను పోలీసులకి ఫోన్ చేస్తున్నట్టు తెలియకుండా తన కూతురితో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంది. ఆమె నుంచి ఒడుపుగా విషయం రాబడతాడు జో. ఒకతను తెల్లని వ్యాన్‌లో ఆమెను బలవంతంగా తీసుకువెళుతున్నాడని తెలుస్తుంది. సెల్ టవర్ ఆధారంగా వారు ఏ దారిలో వెళుతున్నారో తెలుస్తుంది. అయితే వ్యాన్ నంబర్ తెలిసే లోపే ఆ వ్యక్తికి అనుమానం వచ్చి ఫోన్ కట్ చేస్తాడు. తనకు తెలిసిన సమాచారం గస్తీ పోలీసులని అందిస్తాడు జో. తర్వాత కంప్యూటర్లో ఎమిలీ ఇంటి ఫోన్ నంబర్ తెలుసుకుని అక్కడికి ఫోన్ చేస్తాడు. ఒక ఆరేళ్ళ అమ్మాయి ఫోన్ ఎత్తుతుంది. అమ్మ కావాలంటుంది. నాన్న పేరు హెన్రీ అని, వేరుగా ఉంటాడని, అతని ఫోన్ నంబర్ తెలుసునని నంబర్ చెబుతుంది. చిన్న వయసులోనే ఫోన్ నంబర్లు గుర్తుపెట్టుకునేలా పిల్లలకి చెప్పటం ఈరోజుల్లో మామూలే. అమ్మ, నాన్న గొడవపడి బయటకి వెళ్ళారని, తన పసి తమ్ముడు కత్తి చూసి భయపడ్డాడని అంటుంది. ఇంట్లో ఇంకో పసి బాలుడు ఉన్నట్టు జోకి అర్థమౌతుంది. పాపని తమ్ముడి దగ్గర కూర్చోమంటాడు. నాన్న తమ్ముడి దగ్గరకు వెళ్ళొద్దన్నాడు అంటుంది. పర్వాలేదు, వెళ్ళమంటాడు జో. భయం వేస్తే తనకు ఫోన్ చేయమంటాడు. తర్వాత ఫోన్ నంబర్ ఆధారంగా హెన్రీ వ్యాన్ నంబర్ తెలుసుకుని గస్తీ పోలీసులకి ఇస్తాడు. కంప్యూటర్లో హెన్రీ సమాచారమంతా ఉంటుంది. ఇంతకు ముందు అరెస్టయ్యాడని తెలుస్తుంది.

హెన్రీ ఎమిలీతో ఎందుకు గొడవపడ్డాడు? ఎమిలీని ఎక్కడికి తీసుకువెళుతున్నాడు? పిల్లలని ఇంట్లో వదిలేసి వెళుతున్నాడంటే ఎంత కఠినాత్ముడయి ఉంటాడు? అసలే నేర చరిత్ర కలవాడు. అతని వద్ద కత్తి ఉండే అవకాశం ఉంది. ఎమిలీని ఏం చేస్తాడు? ఆమెకి ఏమైనా అయితే పిల్లల పరిస్థితి ఏమిటి? ఇవే మన ఆలోచనలు. జో కూడా ఇలాగే ఆలోచిస్తాడు. అయితే తన కేసు విషయంలో కూడా అతను ఆందోళనగా ఉంటాడు. అతని కేసుకు సంబంధించి కోర్టులో మర్నాడు అతను హాజరు కావలసి ఉంది. తాను దోషి కాదని నిరూపిస్తే అతను మళ్ళీ సాధారణ పోలీసుగా పని చేయవచ్చు. ఇలా ఏమీ చేయలేక, ఫోన్లో వారినీ వీరినీ సహాయం అడిగి ప్రమాదంలో ఉన్నవారి దగ్గరికి పంపించడం కాక తానే సహాయం అందించటానికి వెళ్ళవచ్చు.

ప్రస్తుతం అతను ఎమిలీకి సాయం చేయటంపై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తాడు. పోలీసు స్టేషన్‌కి ఫోన్ చేసి ఎమిలీ ఇంటి అడ్రసు, హెన్రీ ఇంటి అడ్రసు ఇచ్చి ఇద్దరి ఇళ్ళకీ వెళ్ళి చూడమంటాడు. ఆ పోలీసు ఎమిలీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి అక్కడికి వెళతాం గానీ హెన్రీ ఇంటికి వెళ్ళం అంటాడు. హెన్రీ ఇంటి తలుపు బద్దలుకొట్టి లోపలికి వెళితే అక్కడ ఏమైనా సమాచారం దొరకవచ్చు, దాని ద్వారా హెన్రీ ఎక్కడికి వెళుతున్నాడో తెలుసుకోవచ్చు అని అంటాడు జో. అది చట్టవిరుద్ధమని అంటాడు ఆ పోలీసు. జోకి అసహనం పెరుగుతుంది.

ఎమిలీకి, ఆమె పిల్లలకి సాయం చేయగలిగితే తను గతంలో చేసిన తప్పులు మాసిపోతాయనే తాపత్రయం కనిపిస్తుంది జోలో. అతని కూతురు అతని భార్యతో వేరుగా ఉంటోందని తెలుస్తుంది. అతనేదో పెద్ద తప్పే చేశాడని, దాని ఫలితంగా భార్యకు, కూతురికి దూరంగా ఉంటున్నాడని సూచనప్రాయంగా తెలుస్తుంది. మర్నాడు కోర్టులో అతను నిర్దోషి అని తేలితే అతని ఉద్యోగమే కాకుండా, అతని కుటుంబం కూడా అతనికి దక్కుతుంది. తన సహచరుడు రిక్‌కి ఫోన్ చేస్తాడు జో. హెన్రీ ఇంటికి రిక్‌ని పంపించాలని అతని ఉద్దేశం. రిక్ మర్నాడు కోర్టులో జో తరఫున సాక్షి. అతను ఆందోళనగా ఉంటాడు. “నేను నోరు జారితే ఏమౌతుందో అని భయంగా ఉంది” అంటాడు. అంటే దొంగసాక్ష్యం చెప్పబోతున్నాడన్న మాట. జో అతన్ని సముదాయిస్తాడు. హెన్రీ ఇంటికి వెళ్ళమని చెబుతాడు.

చూసేదంతా నిజం కాదని మనకొక నానుడి ఉంది. ఈ సినిమాలో సంఘటనలను చూసే అవకాశం కూడా లేదు. కేవలం వినటమే. మరి అందులో ఎంత నిజం ఉంటుంది? జో కేసు ఏమిటి? అతను నిజంగా దోషియేనా? ఎమిలీకి చివరికి సాయం చేస్తాడా? ఆమెని కాపాడగలుగుతాడా? ఇదే మిగతా కథ. అయితే చివరికి జో దృష్టికోణం, మన దృష్టికోణం కూడా తప్పని తెలుస్తుంది. ఆశ్చర్యం కలిగించే పరిణామాలు జరుగుతాయి. గుండెని మెలిపెట్టే సంఘటనలు జరుగుతాయి.

డానిష్ చిత్రంలో అంతా ముక్కుసూటిగా ఉంటుంది. యూరోపియన్ చిత్రాలలో ఉండే లక్షణం అదే. ఎంతటి ఘోరమైన విషయాన్నైనా ఉన్నదున్నట్టు చెబుతారు. అమెరికన్ చిత్రాలలో కాస్త మెత్తదనం కనిపిస్తుంది. చివరికి అంతా బావుంది అని చెబితే ప్రేక్షకులు మరింత ఆదరిస్తారనే భావం కనిపిస్తుంది. గమనిస్తే ‘రోమా’, ‘కాపెర్నామ్’, ‘షాప్ లిఫ్టర్స్’ యూరప్ బయట నిర్మితమైనవే. వాటిలో కూడా అంతా బావుందనే ఆశావహ దృక్పథమే కనిపిస్తుంది. అందుకే అమెరికా అందించే ఆస్కార్ అవార్డులలో వాటికే ప్రాధాన్యం దక్కింది. ‘ద గిల్టీ’ డానిష్ చిత్రంలో ఒక హత్య జరిగిందని తెలుస్తుంది. అది నిజంగా జుగుప్స కలిగిస్తుంది. అయితే ఆంగ్ల చిత్రంలో చివరికి ఆ హత్య జరగలేదని, ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని చెబుతారు. ఇలా చేయటం వల్ల కొందరు ప్రేక్షకులు ఊపిరి పీల్చుకోవచ్చు కానీ అప్పటివరకు జరిగిన కథకి అన్యాయం జరుగుతుంది. చివరి దాకా ఆ విషయం తెలియకపోవటమేమిటి అనే సందేహం కలుగుతుంది. డానిష్ చిత్రంలో కథానాయకుడు చేసిన నేరం గురించి వివరాలు కొన్ని ముందే చెబుతారు. ఆంగ్ల చిత్రంలో చివరి దాకా అసలు నేరమేమిటో కూడా తెలియదు. అలా ఎందుకు చేయవలసి వచ్చిందో దర్శకుడికే తెలియాలి.

డానిష్ చిత్రంలో ముఖ్యపాత్రలో యాకొబ్ సెడెర్గ్రెన్ నటించాడు. ఆంగ్ల చిత్రం జేక్ జిల్లెన్హాల్ నటించాడు. భావోద్వేగాలను జేక్ కొంచెం అతిగా చూపించాడని అనిపిస్తుంది. అది దర్శకత్వ లోపమని చెప్పవచ్చు. అమెరికన్ చిత్రాలలో ఒక్కోసారి నిర్మాతల, పంపిణీదారుల జోక్యం ఎక్కువగా ఉంటుంది. “ఇలా అయితే ప్రేక్షకులకు విషయం బాగా అర్థమౌతుంది” అని ఒత్తిడి చేస్తే దర్శకులు ఒక్కోసారి తల ఒగ్గుతారు. ఆంగ్ల చిత్ర దర్శకుడు అంట్వాన్ ఫుక్వా అదే పని చేశాడని అనిపిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఒకే బిల్డింగ్‌లో చిత్రం మొత్తం నడవటం, ఫోన్లోనే కథ సాగినా ఎక్కడా విసుగు రాకపోవటం నిజంగా అద్భుతమైన విషయాలు. ఫోన్లో వినపడే గొంతులకు కూడా పేరొందిన నటులనే ఎంచుకున్నారు. యానిమేషన్ చిత్రాలలో పెద్ద నటులే గాత్రదానం చేస్తారు. ఈ మధ్య గాత్రదానం చేసే నటులకు ప్రత్యేక అవార్డులు ఇవ్వాలనే వాదన వినిపిస్తోంది. ఇలాంటి సినిమాలు చూస్తే ఆ వాదనకు బలం చేకూరినట్లు అనిపిస్తుంది.

ఇంతకీ జో చేసిన నేరమేమిటి? అతను ఒక 19 ఏళ్ళ యువకుడిని కాల్చి చంపాడు. ఆ యువకుడు తన మీద దాడి చేయటానికి ప్రయత్నిస్తే ఆత్మరక్షణ కోసం చంపానని అంటాడు. అతనికి అతని సహచరుడు రిక్ సాక్ష్యం. కానీ అది అబద్ధం. ఆ యువకుడు ఏదో తప్పు చేశాడని అతని మీద కోపంతో కావాలనే అతన్ని చంపుతాడు జో. సినిమా చివరిలో ఎమిలీ విషయంలో తన తప్పు తెలుసుకున్నాక అతను ఆత్మపరిశీలన చేసుకుంటాడు. ఆ యువకుడు తప్పు చేశాడని అనుకున్నాడు. నిజంగా ఆ యువకుడు తప్పు చేశాడా అనే అనుమానం వస్తుంది. ఒకవేళ తప్పు చేసినా శిక్షించే హక్కు జో కి లేదు. ఇలాంటి విషయాల్లో చూసినదంతా నమ్మకూడదు. విన్నది అసలు నమ్మకూడదు. న్యాయస్థానాలు న్యాయవిచారణ చేసి ఏం జరిగిందో తేలుస్తాయి. తప్పు చేసినా దానికి తగిన కారణం ఉంటే శిక్ష తగ్గుతుంది. జో ఏకంగా మరణశిక్ష వేశాడు. ఆ అపరాధభావంతో భార్య దూరమైంది. ఇప్పుడు ఉద్యోగం కాపాడుకోవటానికి రిక్ చేత దొంగసాక్ష్యం చెప్పించటానికి సిద్ధమయ్యాడు. తాను నేరం చేశానని ఒప్పుకుంటాడా లేక ఉద్యోగం కోసం, తన కూతురికి దూరం కాకుండా ఉండటం కోసం అబద్ధమే చెబుతాడా? ధర్మానికి, ఇష్టానికి జరిగే సంఘర్షణే ఇది. అతనికి కనువిప్పు కలిగించటానికి విధి చేసిన ప్రయత్నం ఎమిలీ ఉదంతం. విధిని తప్పించుకోవాలని ప్రయత్నిస్తే ఫలితం మొదట బావున్నా ఆత్మక్షోభ తప్పదు. విధికి లొంగి ఉంటే కష్టాలు వచ్చినా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ‘ద గిల్టీ’ అంటే ‘అపరాధి’. జో ఉదంతంలో జో అపరాధి. ఎమిలీ ఉదంతంలో ఎవరు అపరాధి? అదే సినిమాకి హైలైట్.

ఈ క్రింద చిత్రం మిగతా కథ ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు చూసిన తర్వాతే క్రింది విశ్లేషణ చదవగలరని గట్టిగా కోరుతున్నాను. చూసి కథ తెలుసుకుంటే సినిమా అనే మాధ్యమం చేసే ఇంద్రజాలం పూర్తిగా అనుభూతికి వస్తుంది. హిందీలో చిత్రం అందుబాటులో ఉంది కాబట్టి హిందీ చిత్రాలు చూసే వాళ్ళు చూడవచ్చు. సబ్ టైటిల్స్ ఎలాగూ ఉంటాయి.

పోలీసులు ఎమిలీ ఇంటికి వెళ్ళి తలుపు కొడితే ఆమె కూతురు భయపడి జోకి ఫోన్ చేస్తుంది. తలుపు తెరవమంటాడు జో. పోలీసులు ఆ పాప బట్టలకు రక్తం అంటుకుని ఉండటం గమనిస్తారు. తన రక్తం కాదంటుంది. వెంటనే ఆమె తమ్ముడిని చూడటానికి వెళతారు. ఆ పసివాడు రక్తపు మడుగులో ఉంటాడు. పోలీసు ఆ దారుణం చూసి జుగుప్సతో కేకలు వేస్తాడు. ఇదంతా ఫోన్లో వింటాడు జో. హెన్రీ పసివాడిని చంపేశాడని నిర్ధారణకొస్తాడు. హెన్రీకి ఫోన్ చేసి “నీ కూతురు నువ్వు ఆమె తమ్ముణ్ణి ఏం చేశావో చూసింది. నువ్వు మళ్ళీ జైలుకి వెళ్ళటం ఖాయం” అంటాడు. హెన్రీ ఏడుస్తూ ఫోన్ పెట్టేస్తాడు.

ఎమిలీకి ఫోన్ చేసి ఆమెని సీటు బెల్టు పెట్టుని పార్కింగ్ బ్రేక్ గట్టిగా లాగమంటాడు. అలా చేస్తే వ్యాన్ ఆగిపోతుంది. హెన్రీ సీటు బెల్టు పెట్టుకోలేదని ఆమె చెప్పింది కాబట్టి హెన్రీకి గాయాలవుతాయి. ఆ విధంగా అతను పట్టుబడతాడు అని అతని పథకం. అయితే అలా జరగకపోగా ఎమిలీ చేసిన పనికి హెన్రీ ఆమెని వ్యాన్ వెనకాల పడేస్తాడు. ఆమె మళ్ళీ జోకి ఫోన్ చేస్తుంది. వ్యాన్లో ఇటుకలున్నాయని చెబుతుంది. వ్యాన్ ఆపి హెన్రీ ఆమె కోసం వచ్చినపుడు ఒక ఇటుకతో అతన్ని కొట్టి పారిపొమ్మంటాడు జో. ఆమె భయపడుతూ ఉంటుంది. “నా బాబు ఏడవటం ఆపేశాడు కదా. హెన్రీ ఎందుకు ఇలా చేస్తున్నాడు” అంటుంది. జోకి అర్థం కాక ఏమిటి అని అడుగుతాడు. “నా బాబుకి పొట్టలో పాములున్నాయి. బాధతో ఏడిచాడు. నేను పాముల్ని తీసేశాను” అంటుంది. జోకి మతిపోతుంది. ఆమె మానసిక రోగంతో బాధపడుతోందని, తన బిడ్డని తానే చంపేసిందని అర్థమవుతుంది. ఇంతలో వ్యాన్ ఆగటంతో ఎమిలీ ఫోన్ కట్ చేస్తుంది. రిక్ ఫోన్ చేసి హెన్రీ ఇంట్లో ఒక ఉత్తరం దొరికిందని, ఎమిలీ ఒక మానసిక చికిత్సా కేంద్రంలో పేషంట్‌గా ఉండేదని చెబుతాడు. జో మ్యాప్‌లో చూస్తే వ్యాన్ వెళ్లేది ఆ చికిత్సా కేంద్రానికే అని అర్థమౌతుంది.

హెన్రీ తన బిడ్డని ఎమిలీ చంపేసిందని తెలిసి వెంటనే ఆమెని తీసుకుని చికిత్సా కేంద్రానికి బయల్దేరాడు. కూతుర్ని పిల్లవాడి దగ్గరకు వెళ్ళొద్దని ఎందుకు చెప్పాడంటే ఆమె భయపడుతుందని. పోలీసులకి ఎందుకు సమాచారం ఇవ్వలేదు అంటే వారి మీద నమ్మకం లేదని అంటాడు. చనిపోయిన కొడుకుని వదిలి అప్పటికప్పుడు ఎమిలీని తీసుకుని వెళ్ళటం కొంచెం అసహజంగా అనిపిస్తుంది. అయితే కొడుకు చనిపోయాడని తెలిస్తే ఆమె ఇంకా కుంగిపోవచ్చు కనక ఆ పని చేశాడని అనుకోవచ్చు. డబ్బులు లేక ఆమె వైద్యం ఆపేయటంతో ఇంత పని జరిగిందని బాధపడతాడు. తరచి చూస్తే ఎవరూ అపరాధి కాదు. ఎమిలీకి మానసిక చికిత్స అందించటమే ఇక్కడ పరిష్కారం. అదే హెన్రీ ప్రయత్నం. బిడ్డ చనిపోయాడని నిర్ధారణ చేసుకున్నాకే అతడు బయల్దేరాడని అనుకోవాలి. అలాంటపుడు ఆంగ్ల చిత్రం చివర్లో బిడ్డ బతికే ఉన్నాడని చెప్పటం తర్కానికి అందదు. అదే ఆంగ్ల చిత్రంలోని పెద్ద లోపం. పసివాడు చచ్చిపోయాడంటే ప్రేక్షకులు జీర్ణించుకోలేరని నిర్ణయించేసుకుని కథకే అన్యాయం చేశారు.

జో తొందరపాటులో హెన్రీయే అపరాధి అనుకున్నాడు. హెన్రీకి ఫోన్ చేస్తే ఎమిలీ పారిపోయిందని తెలుస్తుంది. “నాకు నిజమెందుకు చెప్పలేదు” అని అడుగుతాడు జో. పోలీసుల మీద, డాక్టర్ల మీద, లాయర్ల మీద నమ్మకం పోయిందని అంటాడు హెన్రీ. డాక్టర్లు డబ్బు కోసమే పని చేస్తారనే భావం ధ్వనిస్తుంది. హెన్రీ నుంచి ఎమిలీ విడాకులు తీసుకున్నపుడు అతని మీద ఉన్న కేసుల కారణంగా అతని కూతురిని చూడటానికి కూడా అతనికి పూర్తి హక్కు లేకుండా పోయింది. ఈ విషయంలో లాయర్లు అతనికి సాయం చేయలేకపోయారు. హెన్రీ మీద ఉన్న కేసుల కారణంగా అతనే పసివాడిని చంపాడని అంచనాకి వచ్చాడు జో. ఒకసారి అరెస్టయితే ఇక నేరస్థుడని ముద్ర పడిపోతుంది, తర్వాత నిర్దోషి అని తేలినా సరే!

తర్వాత ఎమిలీకి ఫోన్ చేస్తాడు జో. ఆమె అప్పటికి తన బట్టల మీద ఉన్న రక్తపు మరకలను చూసి అయోమయంలో ఉంటుంది. తన బిడ్డ ఎలా ఉన్నాడని అడుగుతుంది. జో ఏం చెప్పలేకపోతాడు. అపరాధభావంతో ఆమె ఒక బ్రిడ్జ్ మీద నుంచి దూకి చనిపోవాలని ప్రయత్నిస్తుంది. జో చేసిన పొరపాటు కారణంగా ఆమె తప్పించుకుని ఆ బ్రిడ్జ్ మీదకి వచ్చింది. లేకపోతే చికిత్సా కేంద్రంలో ఉండేది. జో తెలిసి తప్పు చేయలేదు. కానీ ఇప్పుడు ఆమె ఆత్మహత్యకు సిద్ధపడింది. ఆమె చనిపోతే జో తనను తాను క్షమించుకోగలడా? ఎమిలీని బ్రిడ్జ్ దిగమని కోరుతూ జో “ఇప్పటికే ఒకరిని అన్యాయంగా చంపాను. నిన్ను కూడా చంపలేను” అని ఏడుస్తాడు. గమనించండి – ‘నీ చావుకి కారణం కాలేను’ అనలేదు, ‘నిన్ను కూడా చంపలేను’ అన్నాడు. అతను చేసిన నేరం చివరికి ఒప్పుకున్నాడు. ఎమిలీ చనిపోతే అది తన అపరాధమే అవుతుందని భావిస్తున్నాడు. చివరికి ఎమిలీని పోలీసులు రక్షిస్తారు. జో మర్నాడు కోర్టులో తన అపరాధాన్ని ఒప్పుకుంటాడు.

కోర్టులో అపరాధాన్ని ఒప్పుకోకపోతే జీవితమంతా క్షోభ పడతానని అతనికి అర్థమైంది. ఎమిలీ విషయంలో పొరపాటు చేసినట్టే తాను చంపిన యువకుడి విషయంలో కూడా పొరపాటుపడి ఉండవచ్చు కదా అనే స్ఫురణ కలుగుతుంది. ఆ స్ఫురణ కలిగాక కూడా శిక్ష తప్పించుకుంటే ఆత్మవంచన చేసుకున్నట్టే. అందుకని అతను శిక్షకి సిద్ధపడతాడు.

మానసిక వ్యాధుల గురించి పాశ్చాత్య దేశాలలో ఉన్నంత అవగాహన మన దేశంలో లేదనే చెప్పాలి. ఏ మానసిక వ్యాధినైనా పిచ్చి అంటారు మనవాళ్ళు. సానుభూతితో వ్యవహరించి చికిత్స చేయిస్తే కొన్ని వ్యాధులు నయమౌతాయి. ‘కృష్ణవేణి’ చిత్రంలో ఇలాంటి వ్యాధినే చూపించారు. వ్యాధి తగ్గినా భర్త, సమాజం దూరం చేయటంతో అందులో నాయిక చివరికి గుండెపగిలి మరణిస్తుంది. అన్ని వ్యాధుల లాగే మానసిక వ్యాధుల చికిత్సకు డబ్బు ఖర్చవుతుంది. ఆర్థికంగా బలంగా లేనివారు ఏం చేయాలి? ప్రభుత్వం సహకరిస్తే వారికి కూడా చికిత్స అందుతుంది. ముందు కుటుంబాలు ఆసరాగా ఉండాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here