Site icon Sanchika

మరుగునపడ్డ మాణిక్యాలు – 42: యాజ్ గుడ్ యాజ్ ఇట్ గెట్స్

[dropcap]సి[/dropcap]నిమాల్లో రొమాంటిక్ కామెడీ అనే జానర్ ఉంది. నాయికానాయకులు ఒకరినొకరు ఇష్టపడతారు. కానీ ఏవో అవాంతరాలు వస్తాయి. తొందరపడి ఏవో నిర్ణయాలు తీసుకుంటారు. ఇబ్బందుల్లో పడతారు. ఇందులో నుంచి హాస్యం పుడుతుంది. ఇలాంటి సినిమాలు హాలీవుడ్‌లో చాలానే వస్తూనే ఉంటాయి. అయితే ఈ జానర్‌లో కాస్త విభిన్నంగా ఉండే చిత్రం ‘యాజ్ గుడ్ యాజ్ ఇట్ గెట్స్’ (1997). ఒక వయసు మళ్ళిన రచయిత, ఒక బిడ్డకు తల్లైన స్త్రీ, ఒక స్వలింగప్రియుడు – వీరి మధ్య జరిగిన కథ ఇది. ‘యాజ్ గుడ్ యాజ్ ఇట్ గెట్స్’ అంటే ‘ఇంతకు మించి ఏముంది’ అనే అర్థం చెప్పుకోవచ్చు. సోనీ లివ్‌లో లభ్యం. పెద్దలకు మాత్రమే. సోనీ లివ్ నాణ్యత అంత బాగాలేదనే చెప్పాలి. సబ్ టైటిల్స్ కలగాపులగంగా ఉన్నాయి.

ఈ చిత్రం గురించి చెప్పుకునే ముందు అమెరికా సంస్కృతి గురించి కొంచెం చెప్పుకోవాలి. 60వ దశకంలో అక్కడి సమాజంలో చాలా మార్పులు జరిగాయి. లైంగిక స్వేచ్ఛ పెరిగింది. దీనికి ఒక కారణం గర్భనిరోధక మాత్రలు అందుబాటులోకి రావటం. పరస్పరం ఇష్టమైతే ఇతరులెవరూ శృంగారానికి అడ్డుచెప్పటానికి అర్హులు కాదనే భావం పెరిగింది. 70వ దశకంలో అబార్షన్ చట్టబద్ధం అయింది. దాంతో అవాంఛిత గర్భం గురించి భయపడే పరిస్థితులు కూడా పోయాయి. క్రమంగా యువతీయువకులు పెళ్ళి కాకపోయినా లైంగికసంబంధం కలిగి ఉండటం సాధారణమైపోయింది. కొన్నాళ్ళు డేటింగ్ చేశాక ఇష్టమైతే పెళ్ళి చేసుకుంటారు. డేటింగ్ చేయకుండా ఒంటరిగా ఉంటే వింతగా చూసే ధోరణి ప్రారంభమయింది. తలిదండ్రులు కూడా డేటింగ్ చేయమని ప్రోత్సహిస్తారు. పెళ్ళి కాకుండా పిల్లలు కలిగినా వారికి అన్ని హక్కులూ ఉంటాయి. మేమే తలిదండ్రులమని చెబితే చాలు. అలా పిల్లలు కలిగాక విడిపోయిన జంటలు కూడా ఉన్నాయి. పిల్లలున్నా ఆ విడిపోయిన స్త్రీలు డేటింగ్ చేస్తారు. లైంగిక వాంఛలు పురుషులకు ఉన్నట్టు స్త్రీలకు కూడా ఉంటాయి కదా తప్పేమిటి అని అక్కడి ఆలోచన. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం చూడాలి. ఈ విషయాలు మంచా చెడా అనే మీమాంస ఈ వ్యాసం ఉద్దేశం కాదు. మరో విషయం ఏమిటంటే లైంగిక స్వేచ్ఛ ఎంత ఉన్నా ఒకే సమయంలో పలువురితో సంబంధం ఉండటం తప్పు అనే నియమం మాత్రం ఉంటుంది.

క్యారల్ న్యూయార్క్ నగరంలో ఉంటుంది. ఆమెకి ఒక కొడుకు. పేరు స్పెన్సర్. ఆ పిల్లవాడి తండ్రి ఎవరు, ఏమిటి అనేది ఈ చిత్రానికి అప్రస్తుతం. పరిస్థితులు బాగాలేక క్యారల్ తన తల్లి ఇంట్లో నివసిస్తూ ఉంటుంది. స్పెన్సర్‌కి ఆస్తమా. తరచు జ్వరం వస్తూ ఉంటుంది. అతనికి ప్రత్యేకంగా ఒక గది ఉంటుంది. క్యారల్ తల్లికి ఒక గది. క్యారల్ హాల్లో సోఫా మీద పడుకుంటుంది. క్యారల్ ఒక రెస్టారెంట్లో సేవికగా పని చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడూ డేటింగ్ చేస్తూ ఉంటుంది. ఇంటి హాల్లోనే శృంగారం కూడా. అయితే పిల్లవాడి బాగోగులు చూసుకుంటూ ఉండటంతో శృంగారానికి ఎక్కువ అవకాశం ఉండదు. ఆమెతో వచ్చిన మగవాళ్ళు విసిగిపోయి వెళ్ళిపోవటం మామూలే. స్పెన్సర్‌కి సరైన వైద్యం చేయించలేక క్యారల్ సతమతమవుతూ ఉంటుంది. ఆమెకున్న ఆరోగ్యబీమా పరిమితి తక్కువ కావటంతో హాస్పిటల్ వాళ్ళు స్పెన్సర్‌కి అరకొర వైద్యమే చేస్తారు. ఇది క్యారల్‌కి తెలుసు. అయినా ఏమీ చేయలేని పరిస్థితి.

మెల్విన్ ఒక ప్రఖ్యాత రచయిత. యాభై ఏళ్ళ పైనే ఉంటాయి. ఒంటరివాడు. అతనికి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనే మానసిక వ్యాధి. తలుపు లోపల వేసే తాళం (చేత్తో తిప్పే తాళం) ఐదు సార్లు తిప్పుతాడు. అలా చేయకపోతే అతనికి కుదురు ఉండదు. ఏదో కీడు జరుగుతుందని భయం. ఫుట్‌పాత్ మీద టైల్స్ కలిసే చోట, పగుళ్ళు ఉన్న చోట కాలు పెట్టకుండా దాటుకుంటూ నడుస్తాడు. చేతులు శుభ్రం చేసుకోవాలంటే ఒక కొత్త సబ్బు కావాలి. ఒకసారి వాడిన సబ్బు మళ్ళీ వాడడు. క్రిముల భయం. తనకి కావలసినది తాను అనుకున్నట్టు జరిగిపోవాలి. ఇతరుల మనోభావాలను పట్టించుకోడు. ఒక్క ఉదాహరణ. అతను క్యారల్ పనిచేసే రెస్టారెంట్లో రోజూ అల్పాహారం చేస్తాడు. ఎప్పుడూ ఒకే టేబుల్ దగ్గర కూర్చుంటాడు. ఒకరోజు ఆ టేబుల్ దగ్గర ఒక జంట కూర్చుని ఉంటుంది. వాళ్ళని “ఇంకా ఎంత తింటారు?” అంటాడు. వాళ్ళు ఏమనాలో తెలియక లేచి వెళ్ళిపోతారు. ఇలా ఉంటుంది అతని ధోరణి. అతని పుస్తకాలు బాగా అమ్ముడవుతాయి కాబట్టి అతనికి డబ్బుకి కొదవ లేదు. డబ్బుంటే ఎన్ని వింత పనులు చేసినా చెల్లుతుంది. అయితే రెస్టారెంట్ యజమాని అతని మీద కోపంగా ఉంటాడు. క్యారల్ ఓపిగ్గా మెల్విన్ కి అన్నీ తెచ్చిపెడుతూ ఉంటుంది. ఆమె కొడుక్కి జబ్బుగా ఉందని ఆమె తన తోటి వారితో చెబుతుంటే వింటాడు. అతను రోజూ కొవ్వు, చక్కెర ఎక్కువున్న పదార్థాలు తింటూ ఉంటాడు. “ఇలాంటి ఆహారం తింటే మరణాన్ని ఆహ్వానించినట్టే” అంటుందామె. “అందరం పోయేవాళ్ళమే. నేను విన్నది నిజమైతే మీ అబ్బాయి కూడా పోతాడు” అంటాడు. ఆమెకి చిర్రెత్తుకొస్తుంది. “మా అబ్బాయి గురించి ఇంకెప్పుడూ మాట్లాడద్దు” అని హెచ్చరిస్తుంది. అయినా ఆమె అంటే అతనికి ఇష్టం. అతనితో వేగగలిగేది ఆ రెస్టారెంట్లో ఆమె మాత్రమే. ఒకరోజు ఆమెని స్పెన్సర్ ఆరోగ్యం గురించి అడుగుతాడు. ఆమె హాస్పిటల్ వాళ్ళు ఎంత నిర్దయులో చెబుతుంది.

సైమన్ ఒక చిత్రకారుడు. స్వలింగప్రియుడు. మెల్విన్ ఉండే అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌లో అతనుండే అంతస్తులోనే ఉంటాడు. సైమన్‌కి ఒక పెంపుడు కుక్క ఉంటుంది. దాని పేరు వెర్డెల్. ఒకరోజు వెర్డెల్ కారిడార్లో తిరుగుతూ ఉంటుంది. అది చూసిన మెల్విన్ మూత్రం పోస్తుందేమోనని దాన్ని లిఫ్ట్ లో కిందకి పంపటానికి ప్రయత్నిస్తాడు. అది మొండికేస్తుంది. అక్కడే మూత్రం పోస్తుంది. మెల్విన్ కోపంతో దాన్ని చెత్తవేసే సొరంగంలో పడేస్తాడు. ప్రతి అంతస్తులో చెత్త వేసే సొరంగం ఉంటుంది. అక్కడ చెత్త సంచులు వేస్తే అవి కిందకు జారి వెళ్ళి చెత్త సేకరించే చోట పడతాయి. సైమన్ తన కుక్కని మెల్విన్ చెత్తలో పడేశాడని తెలిసి అతన్ని నిలదీయటానికి వెళతాడు. “నేను ఇంట్లోనే రచనలు చేస్తాను. నాకు అంతరాయం కలిగించొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ నా తలుపు కొట్టవద్దు” అని అరుస్తాడు మెల్విన్. సైమన్ ఏం చేయలేక తన అపార్ట్‌మెంట్లోకి వెళ్ళిపోతాడు.

ఒకరోజు సైమన్ ఇంట్లో దొంగతనం చేయటానికి వచ్చినవారు అతని మీద దాడి చేస్తారు. అతను తీవ్రంగా గాయపడతాడు. అతని స్నేహితుడు వెర్డెల్‌ని మెల్విన్ ఇంట్లో వదులుతాడు. మెల్విన్ ప్రతిఘటించినా ఆ స్నేహితుడు బెదిరించి వెళతాడు. సైమన్ హాస్పటల్లో కోలుకుంటూ ఉంటాడు. ఖర్చులు ఎక్కువ అవటంతో సైమన్ దగ్గరున్న డబ్బులన్నీ అయిపోతాయి. మెల్విన్‌కి వెర్డెల్‌తో అనుబంధం ఏర్పడుతుంది. వెర్డెల్ కూడా మెల్విన్‌కి మచ్చిక అవుతుంది. ఇదిలా ఉండగా ఒకరోజు క్యారల్ రెస్టారెంట్‌కి రాకపోవటంతో మెల్విన్ ఆమెని వెతుక్కుంటూ టాక్సీలో ఆమె ఇంటికి వెళతాడు. ఆమె అతన్ని చూసి అవాక్కవుతుంది. “నువ్వు అల్పాహారం పెట్టకపోవటం వల్ల నేను ఈ రోజు ఏమీ తినలేదు” అంటాడతను. “ఇదేం విడ్డూరం! నీకు తిండి తేవటానికి, నీ తింగర వాగుడు వినటానికి నేను ఉండాలా? నువ్వు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నావు” అంటుంది క్యారల్. “నేను మర్యాదగానే మాట్లాడుతున్నాను. నువ్వే నన్ను దూషిస్తున్నావు” అంటాడతను. అతని సంగతి తెలుసు కాబట్టి ఆమె కాస్త వెనక్కి తగ్గుతుంది. స్పెన్సర్‌కి ఒంట్లో బాగాలేదని, అందుకే రెస్టారెంట్‌కి రాలేదని అంటుంది. మర్నాడు ఆమె ఇంటికి ఒక పెద్ద డాక్టరు వస్తాడు. స్పెన్సర్‌కి కావలసిన పరీక్షలన్నీ చేయిస్తాడు. క్యారల్ బిల్లు సంగతి ఏమిటంటే మెల్విన్ బిల్లు కడతానన్నాడని చెబుతాడు డాక్టరు.

మానసిక వ్యాధి ఉన్నవారు అయితే కుంగిపోతారు లేదా కఠినంగా ఉంటారు. మెల్విన్ రెండో రకం. సర్దుకుపోయే మనస్తత్వం ఉండదు. ఆ అసహనంతో నోటి దురుసు కూడా ప్రదర్శిస్తాడు. క్యారల్ రెస్టారెంట్లో లేకపోతే మెల్విన్‌కి నచ్చదు. ఆమె రావాలంటే ఆమె కొడుకు ఆరోగ్యం బాగుపడాలి. అందుకని డాక్టరు ఖర్చులు మెల్విన్ భరిస్తాడు. ఇది ఎంత వింత విషయమో అనిపిస్తుంది. మానసిక వ్యాధి ఉన్నవాళ్ల ప్రవర్తన అంచనా వేయటం కష్టం. అయితే క్యారల్ అతన్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది. అతను తనతో శృంగారం కోరుకుంటున్నాడని అనుకుంటుంది. అతని ఉపకారం అమోదించాలా వద్దా అని తర్జనభర్జన పడుతుంది. ఆ రాత్రి నిద్ర పట్టక విషయం తేల్చుకోవాలని బస్సులో అతని ఇంటికి వెళుతుంది. అతను తలుపు తీస్తాడు. ఆమె తలుపు దగ్గరే నిలబడి “నువ్వెందుకు ఇదంతా చేశావో నాకు తెలియదు. కానీ నేను నీతో ఎప్పటికీ పడుకోను” అంటుంది. అతను చిన్నబుచ్చుకుంటాడు. ఆమె వెళ్ళిపోతుంటే “రేపు రెస్టారెంట్‌కి వస్తావు కదా” అంటాడు. ఆమె తలూపి వెళ్ళిపోతుంది.

సైమన్ ఇంటికి తిరిగివస్తాడు. ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కర్ర సాయంతో నడుస్తూ ఉంటాడు. అతని దగ్గర డబ్బు లేకపోవటంతో దిక్కుతోచని పరిస్థితి. వెర్డెల్ కూడా అతని కంటే మెల్విన్‌నే ఎక్కువ ఇష్టపడుతుంది. దాంతో అతను మరింత కుంగిపోతాడు. అతని స్నేహితుడు అతన్ని అతని తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకోమని అంటాడు. అతనికీ, అతని తలిదండ్రులకీ మధ్య మాటలు లేవు. అయినా తప్పని పరిస్థితి. ఆ స్నేహితుడు మెల్విన్‌ని రెస్టారెంట్లో కలిసి ఒక కోరిక కోరతాడు. సైమన్‌ని తన కార్లో అతని తల్లిదండ్రుల ఊరికి తీసుకెళ్ళమంటాడు. క్యారల్ అక్కడే ఉంటుంది. మొదట మెల్విన్ ఒప్పుకోడు. క్యారల్ “నాకెవరైనా ఉచితంగా కారిస్తే ఈ సిటీ నుంచి బయటపడి హాయిగా తిరిగివస్తాను” అంటుంది. “అయితే నువ్వూ మాతో రా” అంటాడు మెల్విన్. “నువ్వు సాయం చేశావు కాబట్టి నువ్వు రమ్మంటే కాదనకుండా రావాలా?” అంటుందామె. “అంతేగా మరి” అంటాడతను. క్యారల్ స్పెన్సర్‌ని విడిచి వెళ్ళటానికి వెనుకాడుతుంటే ఆమె తల్లి ఒప్పించి పంపిస్తుంది. స్పెన్సర్‌కి మంచి వైద్యం అందుతుండటంతో అతను చలాకీగా ఉంటాడు. వెర్డెల్‌ని ఒక సంరక్షణ కేంద్రంలో పెట్టి మర్నాడు మెల్విన్, క్యారల్, సైమన్ కార్లో సైమన్ ఊరికి బయల్దేరుతారు. ఇక్కడి నుంచి కథ అనేక మలుపులు తిరుగుతుంది.

ఈ చిత్రంలో మెల్విన్ పలికే కొన్ని సంభాషణలు సినిమా చరిత్రలోనే గొప్ప డైలాగుల జాబితాలో నిలిచిపోయాయి. సైమన్ హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చాక తన పనిమనిషిని మాన్పించినపుడు ఆమె మెల్విన్ దగ్గరకు వెళ్ళి వెర్డెల్‌ని రోజూ బయటకు తీసుకువెళ్ళమని అడుగుతుంది. అతను వెర్డెల్ మీద ప్రేమ పెంచుకున్నాడు కాబట్టి సరే అంటాడు. ఆమె “సైమన్ ఇంట్లో కర్టెన్లు కూడా తెరుస్తూ ఉండండి. దేవుడి అందమైన ప్రపంచం కనిపించేలా” అంటాడు. మెల్విన్ అసహనంతో “ఈ ఉన్మాదం ఇంకెక్కడన్నా అమ్ముకో. నా దగ్గర ఉన్మాదం కావలసినంత ఉంది” అంటాడు. ఎవరైనా సేల్స్ మ్యాన్ ఏదైనా అమ్మటానికి వస్తే మా దగ్గర ఆ సరుకు కావలిసినంత ఉంది అన్నట్టు. క్యారల్ మెల్విన్ ఇంటికి రాత్రివేళ వచ్చి “నేనెప్పటికీ నీతో పడుకోను” అంటే “బ్రహ్మచర్యదీక్ష తీసుకునేవారిని ఉదయం తొమ్మిదిగంటల తర్వాతే అనుమతిస్తాం” అంటాడు మెల్విన్. చర్చిల్లో బ్రహ్మచర్యదీక్ష ఇస్తారుగా. దానికీ ఓ సమయం ఉంటుంది. అదీ అతని పరిహాసం. తనను అవమానించినా నవ్వులాటగా మాట్లాడతాడు, మనసు గాయపడినా. ఒక అభిమాని మెల్విన్‌ని “మీరు స్త్రీ పాత్రలను అంత గొప్పగా ఎలా రాస్తారు?” అని అడుగుతుంది. “స్త్రీ పాత్ర రాయాలంటే నేను ఒక పురుషుణ్ని ఊహించుకుంటాను. అతనిలో ఇంగితాన్ని, జవాబుదారీతనాన్ని తీసేస్తాను” అంటాడు. అంటే స్త్రీలకు ఇంగితం, జవాబుదారీతనం ఉండదని అనటం. అతను స్త్రీద్వేషి అని అర్థమైపోతూ ఉంటుంది. అలాంటి మనిషికి క్యారల్ ఓపిక, నిబ్బరం నచ్చుతాయి. స్త్రీలు ఇలా కూడా ఉంటారు అని అతనికి తెలుస్తుంది. అతని మానసిక స్థితినే కాక అతని హృదయాంతరాళాలలోని భావాలని కూడా మాటలలో అద్భుతంగా చెప్పాడు రచయిత జేమ్స్ ఎల్. బ్రుక్స్. కొన్ని మాటలు చిత్రంలోని కీలక దృశ్యాలలో వస్తాయి.

మెల్విన్‌గా జాక్ నికల్సన్ నటించాడు. ఈ చిత్రానికి అతను ఉత్తమ నటుడిగా ఆస్కార్ గెలుచుకున్నాడు. మనసులో మంచితనం ఉన్న పాత్ర. పైకి మాత్రం కఠినంగా ఉంటాడు. అతని గతం కొంచెం మనకి తర్వాత తెలుస్తుంది. ఎవరైనా చేరువైతే వాళ్ళు దూరమైనపుడు భరించలేనని ముందే అందర్నీ దూరం పెట్టే ప్రవృత్తి అతనిది. కానీ మనసు మాట వినదు కదా. మనిషికి మనసే తీరని శిక్ష అని ఆత్ర్రేయ ఊరికే అనలేదు. క్యారల్‌గా నటించిన హెలెన్ హంట్ ఉత్తమ నటిగా ఆస్కార్ గెలుచుకుంది. ఆత్మగౌరవంతో జీవించాలని క్యారల్ ప్రయత్నం. ఒక తోడు ఉండాలని కోరిక. పరిస్థితులు అనుకూలించవు. అయినా జీవనపోరాటం చేస్తూ ఉంటుంది. ఇతర జంటలను చూసి అసూయపడుతుంది. అంతలోనే అలా అసూయపడినందుకు తనను తానే ద్వేషించుకుంటుంది. ఒక సన్నివేశంలో తల్లికి తన బాధ చెప్పుకుని విలపిస్తుంది. కానీ తన అభిమానం, మంచితనం వదులుకోదు. ఈ చిత్రానికి జేమ్స్ ఎల్. బ్రుక్స్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం అందించాడు. ‘టెర్మ్స్ ఆఫ్ ఎండియర్మెంట్’, ‘బ్రాడ్ కాస్ట్ న్యూస్’ చిత్రాలు తెరకెక్కించిన అతను పలు అవార్డులు అందుకున్నాడు. సంక్లిష్టమైన మానవసంబంధాలను హాస్యం జోడించి చూపటం అతని ప్రత్యేకత.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించేముందు మరో హెచ్చరిక ఉంటుంది.

ప్రయాణంలో సైమన్ తన బాల్యం గురించి క్యారల్‌కి చెబుతాడు. అతను స్వలింగప్రియుడని తెలిసి అతని తండ్రి అతన్ని కాలేజీకి పంపించి ఇంకెప్పుడూ తిరిగి రావద్దని అన్నాడని చెబుతాడు. ఆమె అతని పట్ల సానుభూతి చూపిస్తుంది. మెల్విన్ అది చూసి ఉడుక్కుంటాడు. అందరి జీవితాల్లో ఇలాంటి విషాదగాథలు ఉంటాయని అంటాడు. గమ్యం చేరాక హోటల్లో దిగుతారు. క్యారల్ ఇంటికి ఫోన్ చేస్తుంది. స్పెన్సర్ తాను ఫుట్‌బాల్ ఆడానని, గోల్ కొట్టానని అంటాడు. క్యారల్ మహదానందపడుతుంది. అందరం బయటకి వెళ్ళి పార్టీ చేసుకుందామంటుంది. సైమన్ తాను రాలేనంటాడు. క్యారల్, మెల్విన్ కలిసి ఒక మంచి రెస్టారెంట్‌కి వెళతారు. అక్కడ మగవాళ్ళు సూటు, టై తప్పనిసరిగా వేసుకోవాలి. కావాలంటే వాళ్ళే ఇస్తారు కానీ మెల్విన్‌కి అసలే క్రిముల భయం. క్యారల్‌ని అక్కడే ఉండమని చెప్పి అతని వెళ్ళి సూటు, టై కొనుక్కుని వస్తాడు. ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాక “నన్నేమో సూటు, టై వేసుకోమన్నారు. నువ్వు ఇంట్లో వేసుకునే బట్టలు వేసుకున్నా ఏమీ అనలేదు” అంటాడు. ఆ మాటతో ఆమె మనసు చివుక్కుమంటుంది. లేచి వెళ్ళిపోవాలనుకుంటుంది. అతను వెళ్ళొద్దని వేడుకుంటాడు. ఆమె “నన్ను ఏమైనా పొగడ్త చేస్తే ఆగుతాను” అంటుంది. అతను సరే అంటాడు. ఆమె కాస్త బెదురుగా “నువ్వు ఏదో పిచ్చి ప్రేలాపన చేస్తావని భయంగా ఉంది” అంటుంది. అతను “అలా నిరాశపడకు. అది నీ నైజం కాదు” అని ఒక అసమానమైన పొగడ్త చేస్తాడు. పొగడ్త అంటే మనసు లోతుల్లో నుంచి రావాలి కానీ పైపై మాటగా ఉండకూడదు. అతను ఆమెను ఆరాధిస్తున్నాడు కాబట్టి ఒక గొప్ప పొగడ్త చేస్తాడు. “నాకు డాక్టరు కొన్ని మాత్రలు ఇచ్చాడు. అవి వేసుకుంటే కొంచెం ఆందోళన తగ్గుతుందని చెప్పాడు. నాకు మాత్రలు వేసుకోవటం ఇష్టం ఉండదు. కానీ నువ్వు ఆ రాత్రి మా ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత ఆ మాత్రలు వేసుకోవటం మొదలుపెట్టాను” అంటాడు. ఆమెకి ఏమీ అర్థం కాదు. అతను “నాలో మెరుగుపడాలనే ఆశ పుట్టించినది నువ్వు” అంటాడు! ఆమె నోటమాట రాక ఉండిపోతుంది. తేరుకుని “నా జీవితంలోనే అతిగొప్ప పొగడ్త ఇది” అంటుంది. ఆమె తనకు చేరువ కాను అని అనటంతో అతను తాను మెరుగుపడితే ఆమె మనసు మారుతుందని అనుకున్నాడు. నిజంగానే అతని మనసు లోతుల్లో నుంచి వచ్చిన మాట ఇది. సినిమా చరిత్రలోనే ఉత్తమ ప్రణయ సన్నివేశాలలో ఒకటిగా ఈ సన్నివేశం నిలిచిపోయింది.

క్యారల్ అతని ప్రేమను గ్రహిస్తుంది. అతని చెంతకు చేరి “నువ్వు నన్ను ఈ ఊరికి ఎందుకు తీసుకొచ్చావో చెప్పు. నువ్వేమడిగినా కాదనను” అంటుంది. శృంగారానికి సిద్ధమే అని ఆమె మాటల్లోని అంతరార్థం. మెల్విన్ ఈ పరిణామంతో ఉక్కిరిబిక్కిరి అవుతాడు. “నిన్ను ఈ ఊరికి ఎందుకు తీసుకువచ్చానంటే.. చాలా కారణాలు ఉన్నాయి.. ఒకటేమో.. నువ్వు సైమన్‌తో పడుకుంటే..” అంటాడు! ఆమె సైమన్‌తో శృంగారం నెరిపితే అతను కుంగుబాటు నుంచి బయటపడతాడని మెల్విన్ ఉద్దేశం. ఆమె ఖంగు తింటుంది. “నా గురించి ఏమనుకుంటున్నావు?” అని లేచి వెళ్ళిపోతుంది. ఆమె అతన్ని మొదటిసారి చూసినపుడు అతను స్ఫురద్రూపి అని అనుకుంది. అయితే అతని మాటలు, ప్రవర్తన చూసి ఆమె అతన్ని దూరం పెట్టింది. ఇప్పుడు అతను తనను ఆరాధిస్తున్నాడని తెలిసి ఆమె అతని లోపాలను విస్మరించటానికి సిద్ధపడింది. అయితే మానసిక వ్యాధి ఉన్నవారు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. ఏ ఆలోచనలు దాచుకోవాలో, ఏ ఆలోచనలు బయటపెట్టాలో నిర్ణయించుకోలేరు. లైంగిక స్వేచ్ఛ ఉంది కాబట్టి క్యారల్ సైమన్‌తో పడుకుంటే తప్పేంటి అని అతని ఆలోచన. అలాంటి వారు వేశ్యలవుతారు. ఎవరైనా ఇష్టపడిన వారితో కలిసి ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా స్త్రీలు. మెల్విన్ ఆ మాట మర్చిపోయాడు. ఇందులో ఇంకో కోణం కూడా ఉంది. సైమన్ స్వలింగప్రియుడు. అప్పట్లో అలాంటివారు సంఘంలో వివక్షకు గురయేవారు. అతన్ని స్త్రీల పట్ల ఆకర్షితుణ్ని చేస్తే అతని జీవితం సుగమం అవుతుందని మెల్విన్ ఉద్దేశం. క్యారల్‌కి తాను ఉపకారం చేశాడు కాబట్టి ఆమె కాదనదు అని మెల్విన్ అనుకున్నాడు. ఆమెకి కూడా ఇష్టాయిష్టాలు ఉంటాయనే ఆలోచన అతనికి రాలేదు.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

క్యారల్ హోటల్‌కి వెళ్ళాక సైమన్ గదిలోకి వెళుతుంది. తన గదిలో ఉంటే మెల్విన్ వచ్చి ఇబ్బందిపెడతాడని, సైమన్ గదిలో ఉంటే అతన్ని తప్పించుకోవచ్చని ఆమె ఆలోచన. సైమన్ ఆమె శరీరాకృతిని చూసి ఆమెని చిత్రించటం మొదలు పెడతాడు. కుంగుబాటులో ఉన్న అతను ఇన్నాళ్ళూ ఏమీ చిత్రించలేక పోయాడు. ఇప్పుడు క్యారల్ అతనిలోని చిత్రకారునికి ప్రేరణ అయింది. ఆమె అతనికి సహకరిస్తుంది. మర్నాడు కొత్త ఉత్తేజంతో ఉన్న సైమన్ తన తలిదండ్రులను డబ్బు అడగనని, తన మీద తనకు విశ్వాసం తిరిగి వచ్చిందని అంటాడు. అందరూ తిరుగుప్రయాణమౌతారు. న్యూయార్క్ చేరుకున్నాక క్యారల్ మెల్విన్‌ని పక్కకి పిలిచి “నువ్వు నాకెంతో సాయం చేసి ఉండవచ్చు. కానీ నీతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నువ్వు నా మీద నాకే అయిష్టం కలిగేలా మాట్లాడతావు. ఇక నాకు దూరంగా ఉండు” అని వెళ్ళిపోతుంది. మెల్విన్ హతాశుడవుతాడు.

సైమన్ అపార్ట్‌మెంట్ వేరేవాళ్ళకి అద్దెకిచ్చేస్తారు యజమానులు. మెల్విన్ సైమన్‌ని తన ఇంట్లో ఉండమంటాడు. ఆరోజు రాత్రి క్యారల్ మెల్విన్ ఇంటికి ఫోన్ చేస్తుంది (అప్పట్లో సెల్ ఫోన్లు లేవు). సైమన్ ఫోన్ తీస్తాడు. మెల్విన్ తనని ఇంట్లో ఉండమన్నాడని చెబుతాడు. ఆమె మెల్విన్‌తో మాట్లాడుతుంది. “నేను నీతో జాగ్రత్తతో వ్యవహరిస్తున్నానో లేక కఠినంగా వ్యవహరిస్తున్నానో నాకే తెలియటం లేదు. నువ్వు సైమన్‌కి నీ ఇంట్లో చోటు ఇవ్వటం చాలా గొప్ప విషయం. నేను నిన్ను అన్నమాటలకి నా మీద నాకే అసహ్యం వేస్తోంది. నీతో వ్యవహారం కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే రీతిలో ఉంటుంది. నీలో పరిపక్వత లేదు. నేను ఆ విషయం విస్మరించలేను. ఏమైనా నన్ను మీతో పాటు తీసుకువెళ్ళినందుకు థ్యాంక్స్” అని ఫోన్ పెట్టేస్తుంది.

మెల్విన్ సైమన్‌కి తన గోడు చెప్పుకుంటాడు. “ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా పాత జీవితం తిరిగి వస్తే బావుండు. ఆమె నన్ను నా జీవితం నుంచి వెలి వేసింది” అంటాడు. సైమన్ అతన్ని వెంటనే వెళ్ళి ఆమెతో మాట్లాడమంటాడు. మెల్విన్ వెళతాడు. వెళ్ళే ముందు తాను తలుపుకి లోపల తాళం వేయలేదని గమనిస్తాడు. ఆమె తలపుల్లో అతను తన భయాలను మర్చిపోవటం మొదలుపెట్టాడు. ప్రేమకున్న శక్తి అది. క్యారల్ అతని మీద అలుక బూని ఉంటుంది. అతను ఆమెని బయటకి తీసుకువెళతాడు. “నువ్వు నా దృష్టిలో ఈ ప్రపంచం లోనే గొప్ప స్త్రీవి. స్పెన్సర్‌ని ఎంత బాగా చూసుకుంటున్నావు. నీ మనసులో ఉన్నదే పైకి చెబుతావు. ఎప్పుడూ మంచిగా ఉండాలనే అనుకుంటావు. అది తెలిసినవాణ్ణి నేనే అని గర్వంగా ఉంటుంది” అంటాడు. ఆమె కరిగిపోతుంది. అతని కౌగిట్లో ఒదిగిపోతుంది. చివరికి అతను ఆమెతో కలిసి నడుస్తూ తాను తన భయాలను మర్చిపోతున్నానని గుర్తిస్తాడు.

ఎలాంటి వారైనా సరైన తోడు దొరికితే సాంత్వన పొందుతారు. ప్రపంచం మీద ఉన్న కసి పోతుంది. ఆ తోడు కొందరికి మంచి మనుషుల రూపంలో దొరుకుతుంది. కొందరికి దేవుడి రూపంలో దొరుకుతుంది. మంచి వారిలోనే దేవుడు ఉంటాడు. ఉన్నన్ని నాళ్ళు ప్రశాంతంగా ఉండటం కన్నా కావలసిందేముంది. వయసుతో నిమిత్తం లేకుండా ఒకరికొకరు తోడుగా ఉండగలిగితే అదే భాగ్యం, అదే స్వర్గం. ఎన్నాళ్ళు కలిసున్నామనేది కాదు, ఎంత ప్రేమగా ఉన్నమనేదే ముఖ్యం. సాటివారికి మంచిని పంచటమే ప్రధానం.

Exit mobile version