Site icon Sanchika

మరుగునపడ్డ మాణిక్యాలు – 45: నాయక్

[dropcap]స[/dropcap]త్యజిత్ రాయ్ చిత్రమేదైనా మరుగునపడింది అని అంటే సినీ అభిమానులు ఒప్పుకోరేమో. అయినా ఈ తరం వారికి ఆయన చిత్రాలు పరిచయం చేయటం కోసం ఇటీవలే చూసిన ఒక చిత్రాన్ని ఎంచుకున్నాను. అదే బెంగాలీ చిత్రం ‘నాయక్’ (1966). రాయ్ చిత్రాలు కొన్ని మూబీ లోనూ, కొన్ని ప్రైమ్ లోనూ చూడొచ్చు. ‘చారులత’, ‘మహానగర్’ చిత్రాలు మూబీ లో ఉన్నాయి. ‘పథేర్ పాంచాలి’, ‘అపరాజితో’, ‘జల్సాఘర్’ ప్రైమ్ లో ఉన్నాయి. ఎన్నటికీ వన్నె తరగని చిత్రాలివి. ‘నాయక్’ చిత్రం మూబీలో ఉంది. ఒక రైలు ప్రయాణంలో ఒక నటుడు తన నటనా జీవితం గురించి అవలోకనం చేసుకోవటం ఈ చిత్రం కథాంశం. ఒక యువతి ఎదుట అతను తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తాడు. మామూలు సినిమాల్లో అయితే వారిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమలో పడ్డారని చూపించేవారేమో. అది వాస్తవికంగా ఉండదు. ఈ చిత్రంలో వారిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారని చెప్పటానికి వేరే మార్గాన్ని ఎన్నుకున్నారు. ఇలాంటి ప్రయోగాలు చేయబట్టే రాయ్ ప్రపంచ ప్రసిద్ధ దర్శకులు అయ్యారు. వాస్తవానికి దగ్గరగా ఉన్నా దీన్ని ప్రయోగం అంటున్నామంటే అప్పట్లో (ఇప్పటికీ) సినిమాలు ఎంత వాస్తవదూరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

వాస్తవప్రపంచానికి దగ్గరగా ఈ చిత్రం ఉంటుందని చెప్పటానికి మరో నిదర్శనం ఈ చిత్రంలో రైలు వాతావరణాన్ని చూపించిన విధానం. పాత చిత్రాలలో చాలా వరకు రైలు పెట్టె చూపించాలంటే కిటికీకి సమాంతరంగా బెర్తులు చూపించేవారు. మధ్యలో అంతా ఖాళీ. నిజజీవితంలో రైలుప్రయాణంలో అలాంటి రైలు పెట్టెలు ఉండవు. చిత్రీకరణకు అనుకూలంగా అలాంటి సెట్లు వేసేవారు. కిటికీలో నుంచి చూస్తే అక్కడ తెర మీద చెట్లు వెనక్కి పోతున్నట్టు ఒక రీలు నడుస్తూ ఉంటుంది. ఈ చిత్రంలో కూడా రైలు సెట్టు వేశారు కానీ జాగ్రత్తగా చూస్తే తప్ప అది సెట్టు అని తెలియనట్టు వేశారు. వెలుతురు కూడా సహజంగా ఉన్నట్టు ఉంటుంది. కళాదర్శకుడు బన్షీ చంద్ర గుప్త ఛాయాగ్రాహకుడు సుబ్రతా మిత్రల పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. అయితే ఒక ప్రసిద్ధ నటుడు రైలులో ప్రయాణిస్తున్నాడు అనేది కొంచెం వాస్తవదూరంగా ఉంటుంది. అది రాజధాని ఎక్స్‌ప్రెస్ కావటం కొంతలో కొంత నయం. విలాసవంతమైన రైలు. అక్కడ అందరూ కాస్తో కూస్తో ధనవంతులే. పైగా ఎవరి భేషజాలు వారివి. ఒక నటుడికి ప్రాముఖ్యత ఇస్తే చులకన అయిపోతాం అనే భావన ఉంటుంది. రాయ్ కున్న పరిశీలనాశక్తికి ఒక ఉదాహరణ ఏమిటంటే నాయకుడు ఒక సందర్భంలో ‘చెయిర్ కార్‌లో ఉన్న ఆమెని ఒకసారి రమ్మని చెప్పండి’ అనటానికి “ఆ పెట్టెని ఏమంటారు.. సిట్టింగ్ అని ఏదో..” అంటాడు రైలు పర్యవేక్షకుడితో. అతను “చెయిర్ కార్, సర్” అంటాడు. మనం కూడా ఒక్కోసారి వస్తువుల పేర్లు మర్చిపోతూ ఉంటాం. ఇలాంటి చిన్న విషయాలు కూడా పరిశీలించి స్క్రీన్ ప్లే లో పెట్టిన రాయ్ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. రాయ్ వ్రాసిన స్క్రీన్ ప్లేలు చాలా వరకు కథలు, నవలల ఆధారంగా వ్రాసినవే. అయితే ‘కాంచన్ జంఘా’ తర్వాత రాయ్ సొంత కథతో వ్రాసిన స్క్రీన్ ప్లే ‘నాయక్’ చిత్రానిదే.

కథలోకి వెళితే అరిందమ్ ముఖర్జీ ఒక పెద్ద సినిమా నటుడు. పెళ్ళి కాలేదు. అతను ఒక అవార్డ్ అందుకోవటానికి కలకత్తా నుంచి దిల్లీకి వెళ్ళటానికి తయారవుతూ ఉంటాడు. అతని మేనేజర్‌తో అతని సంభాషణలో తెలిసేదేమిటంటే అతను అసలు వెళ్ళాలనుకోలేదు. కానీ మనసు మార్చుకున్నాడు. సమయం లేకపోవటంతో విమానం టికెట్ దొరకలేదు. రైల్లో వెళుతున్నాడు. “ఒక్క రోజు పాటు ఈ గందరగోళం నుంచి దూరంగా పోవాలని వెళుతున్నాను” అంటాడు. ఏమిటా గందరగోళం? అతని తాజా చిత్రం సరిగ్గా ఆడటం లేదు. దానికి తోడు రెండు రోజుల క్రితం అతను ఒక బార్లో ఒక వ్యక్తి మీద దాడి చేశాడు. ఆ వార్త ఎంత తొక్కిపెట్టాలని ప్రయత్నించినా రెండు పేపర్లలో వచ్చింది. ఒక నిర్మాత అతనికి అడ్వాన్స్ ఇవ్వటానికి వస్తాడు. ఆ నిర్మాతతో సరదాగా మాట్లాడుతూనే “ఇప్పుడు వద్దు. వచ్చాక మాట్లాడదాం” అంటాడు అరిందమ్. మనఃస్థితి ఎలా ఉన్నా పైకి నవ్వుతూ మాట్లాడటం అతని నైజాన్ని తెలియజేస్తుంది. నటులందరూ ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది. అలా ఉండకపోతే చిత్రపరిశ్రమలో ఉండగలరా? అతనికో ఫోన్ వస్తుంది. “హీరోయిన్ గారి ఫోన్” అంటాడు మేనేజర్. “నువ్వు అపార్థం చేసుకున్నావు. నీకు అన్నీ వివరంగా చెప్తాను” అంటుందామె. “అవసరం లేదు” అంటాడు అరిందమ్. వారిద్దరికీ సంబంధం ఉందన్నమాట.

రైల్లో రెండు బెర్తులు ఉండే కూపేలో ఒక బెర్తు అరిందమ్ ది. సంప్రదాయవాది అయిన ఒక పెద్దాయనది రెండో బెర్తు. ఆయన వయసు 79 ఏళ్ళు. ఆయనకి సినిమా పరిశ్రమ అంటే వెగటు. పత్రికలకి ఉత్తరాలు వ్రాసి సినిమా వాళ్ళని తూర్పారబడుతూ ఉంటాడు. సినిమా నటుడు తన కూపేలో ప్రయాణం చేయబోతున్నాడని తెలిసి ఖిన్నుడై ఉంటాడు. “మీకు ఇష్టం లేకపోతే నాలుగు బెర్తులు ఉన్న కంపార్ట్మెంట్లో ఒక బెర్తు ఖాళీగా ఉంది” అంటాడు అరిందమ్‌తో రైలు పర్యవేక్షకుడు. “ఓసారి చూద్దాం” అంటాడు అరిందమ్. ఆ పెద్దాయన “నువ్వు మద్యం తాగుతావా? నాకు మద్యం వాసన పడదు” అంటాడు. అరిందమ్ మద్యం సీసా తెచ్చుకున్నాడు. ఇక్కడైతే ఇబ్బందని నాలుగు బెర్తులు ఉన్న కంపార్ట్మెంట్లోకి వెళతాడు. అక్కడ హిరేన్ బోస్ అనే ఓ యాభై ఏళ్ళు పైబడిన వ్యక్తి, ఆయన భార్య, కూతురు ఉంటారు. భార్య వయసు చిన్నదే. కూతురికి 13-14 ఏళ్ళు ఉంటాయి. ఆ అమ్మాయి జ్వరంతో బాధపడుతూ ఉంటుంది. బలహీనంగా ఉండటం వలన పై బెర్తులో పడుకుని ఉంటుంది. అరిందమ్‌ని చూసి ఆమె కళ్ళు మెరుస్తాయి. బోస్ భార్య కూడా “మీ సినిమాలన్నీ చూస్తాం” అంటుంది. బోస్ భారతీయ సినిమాల నాణ్యత బాగాలేదని అరిందమ్‌తో అంటాడు. అరిందమ్ నవ్వుకుంటూ తన సామాను అక్కడ పెట్టుకుని భోజనశాలకి వెళతాడు.

బోస్‌కి అంత వయసున్నా భార్య చిన్నది కావటం ఏమిటి? ఇక్కడే రాయ్ చెప్పాలనుకున్న విషయానికి బీజం పడుతుంది. సినిమా వాళ్ళు చరిత్రహీనులు అని చాలామంది అనుకుంటారు. కానీ సామాన్యుల్లో చపలచిత్తులు లేరా? సినిమా వాళ్ళకి ప్రచారం వస్తుంది కాబట్టి వారి బాగోతాలు బయటపడతాయి. సామాన్యుల చాపల్యాలు బయటపడవు. బోస్ పర్యవేక్షకుడితో “మా వాళ్ళు ఇక్కడ భోంచేస్తారు. నేను భోజనశాలలో తింటాను” అంటాడు. కుటుంబంతో కలిసి భోంచేయటం కూడా ఇష్టం లేని స్వభావం. కాస్త దూరంగా ఉన్న కంపార్ట్మెంట్లో ఒకాయన బయటకి వచ్చి అటుగా వెళుతున్న పర్యవేక్షకుడితో “హిరేన్ బోస్ గారు ఈ రైల్లోనే ప్రయాణిస్తున్నారా?” అని అడుగుతాడు. అతనికి బోస్ సంగతి ఎలా తెలుసు? వాకబు చేసి మరీ వచ్చాడన్న మాట. అతని పేరు ప్రితీష్ సర్కార్. ఒక ప్రకటనల సంస్థలో పని చేస్తాడు. బోస్‌ది ఎగుమతులు దిగుమతుల వ్యాపారం. ఆయన వ్యాపారానికి ప్రకటనల కాంట్రాక్టు దక్కించుకోవాలని సర్కార్ ప్రయత్నం. సర్కార్ భార్య అతనితో ప్రయాణిస్తూ ఉంటుంది. ఆమె యౌవనవతి, సౌందర్యవతి.

అదితి ఒక మహిళల పత్రికకి ఎడిటర్. చిన్న వయసే. ఒక గ్రాంట్ కోసం అదే రైల్లో దిల్లీకి వెళుతుంటుంది. చెయిర్ కార్లో ప్రయాణిస్తుంది. ఆమెకి ఒక జంట పరిచయమౌతుంది. ఆ జంటలోని స్త్రీ భోజనశాలలో అరిందమ్‌ని చూసి అదితి అతన్ని ఇంటర్వ్యూ చేస్తే పత్రిక అమ్మకాలు పెరుగుతాయి అని అంటుంది. అదితికి సినిమాలంటే పెద్ద ఆసక్తి లేదు. హీరోలను సకలకళావల్లభులుగా, దైవసమానులుగా చూపిస్తారని, అలా ఎవరూ ఉండరని ఆమె అభిప్రాయం. సినిమాల గురించి వేయకపోతే పత్రికలు నడవవని ఆ స్త్రీ అంటుంది. పత్రిక పాఠకురాళ్ళు కూడా అడుగుతున్నారని అదితి అంటుంది. టాస్ వేసుకుని బొమ్మ పడితే వెళతానని అంటుంది. బొమ్మే పడుతుంది. అదితి వెళ్ళి అరిందమ్‌కి తన పత్రిక గురించి చెప్పి ఇంటర్వ్వూ ఇవ్వమని అడుగుతుంది. ప్రజాదరణ పొందటం ఎలా ఉందని, ఏమైనా వెలితి, విచారం ఉందా అని అడుగుతుంది. ఆమె అందరిలా అతని జీవితకథ, అతని ఇష్టాయిష్టాల గురించి అడగదు. అయినా అవన్నీ అప్పటికే ఎన్నో పత్రికల్లో వచ్చేశాయి. అతని తలిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. నాటకాలు వేసేవాడు. ఇరవై ఏడేళ్ళ వయసులో సినిమాల్లోకి వచ్చాడు. అదితి అడిగిన ప్రశ్నలకి అతను “మేం నీడల్లో బతికేవాళ్ళం (నీడలంటే తెరపై బొమ్మలని అర్థం). మా రక్తమాంసాలు ప్రదర్శించకపోవటమే మంచిది. నా మార్కెట్ దెబ్బ తింటుంది” అంటాడు. “మీ మార్కెట్ అంత నాజూగ్గా ఉందని తెలియక అడిగాను” అంటుందామె లేస్తూ. ఆమె లోని ధీరత్వం, పైపై మెరుగులు కాక అంతరంగాలపై ఆమె ఆసక్తి చూసి “మీరు పైకొస్తారు” అంటాడతను. “పైకి రావాలంటే చాలా శ్రమ పడాలి” అంటుందామె. “అయితే మేం అలవోకగా పైకొచ్చామంటారా?” అంటాడతను. “నాకేం తెలుసు?” అని ఆమె వచ్చేస్తుంది. తన కొత్త స్నేహితురాలితో “వీళ్ళు గ్రీన్ హౌస్‌లో ఉన్న మొక్కల్లాంటివారు. వెలుగు పడితే వాడిపోతారు” అంటుంది.

మరో పక్క భోజనశాలలో సర్కార్ బోస్‌ని కలిసి తమ ప్రకటనల సంస్థ గురించి చెబుతాడు. బోస్ దేశదేశాలు తిరిగి వచ్చినవాడు. ఏవేవో గొప్పలు చెబుతూ ఉంటాడు. సర్కార్ అతన్ని పొగుడుతూ ఉంటాడు. సర్కార్ భార్య అక్కడికి వస్తుంది. నిజానికి సర్కారే ఆమెని కాసేపాగి అక్కడికి రమ్మని చెప్పాడు. ఆమె అందాన్ని ఎరగా వేసి పని సాధించాలని అతని పథకం. పథకం పారినట్టే ఉంటుంది. బోస్ ఆమె అందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. “ఆడవాళ్ళు ఈ రోజుల్లో అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మీరు ప్రకటనల్లో మీవారికి తోడుగా ఉండండి” అంటాడు. దిల్లీ చేరాక తమ ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు. అయితే ఆమెకి ఈ వ్యవహారం నచ్చదు. సర్కార్ తర్వాత ఆమెని కాస్త సరసంగా ఉండమని అంటాడు. “కాలేజీలో నాటకాల్లో నటించేదానివి కదా. కాస్త నటించు” అంటాడు.

అరిందమ్‌కి ఒక హీరోయిన్‌తో సంబంధం ఉంది. అది బయటపడకూడదని అతను ప్రయత్నిస్తూ ఉంటాడు. పేపర్లో వచ్చిన వార్త తాలూకు వివరాలు బయటపడితే అతనికి నష్టం. అందుకని అదితికి ఇంటర్వ్యూ ఇవ్వకుండా తప్పించుకుంటాడు. బోస్ లాంటి వాళ్లకి సినిమా అంటే చిన్నచూపు. వాళ్ళు చెత్త చూపిస్తారని అంటాడు. తాను వ్యాపారం చేసి దేశాన్ని ఉద్ధరిస్తున్నానని అనుకుంటాడు. అందులో ఎన్ని లోపాయికారీ పద్ధతులు ఉన్నాయో! అందమైన స్త్రీలని చూస్తే చొంగ కార్చుకుంటాడు. సర్కార్ తన భార్య అందాన్ని ఎరగా వేసి కాంట్రాక్టు సాధించుకోవాలని చూస్తాడు. వీళ్ళు శీలవంతుల లాగా చెలామణి అవుతారు. వీరిని ఎవరూ ఇంటర్వ్యూ చేయరుగా! తర్వాత సర్కార్ భార్య తనకి సినిమాల్లో నటించటానికి అనుమతి ఇవ్వమంటే “అసంభవం” అంటాడు. దీని అర్థం ఏమిటి? గుట్టుగా జరిగితే సరే. అందరి నోళ్ళలో పడితే మాత్రం పరువు పోతుంది! ఇదే హిపోక్రసీ!!

అరిందమ్ తన బెర్తుకి వెళ్ళి ఒక కునుకు తీస్తాడు. అతనికో కల వస్తుంది. అందులో అతను నోట్లు నిండిన ప్రదేశంలో అనందంగా విహరిస్తూ ఉంటాడు. ఇంతలో అస్థిపంజరాల చేతులు కింద నుంచి వస్తాయి. ఆ చేతుల్లో ఉన్న ఫోన్లు మోగుతాయి. అతను పారిపోవటానికి ప్రయత్నిస్తాడు. ఒకచోట ఊబి ఉంటుంది. నోట్లతో నిండి ఉంటుంది. అతను అందులో కూరుకుపోతాడు. దూరంగా ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతని శరీరం అతుకులతో ఉంటుంది. “శంకర్ దా, కాపాడు” అంటాడు అరిందమ్. అతను చేయి చాస్తాడు. అంతలోనే అరిందమ్ ఊబిలో కూరుకుపోతాడు. చటుక్కున మేల్కుంటాడు. ఓ చిన్న స్టేషన్ వస్తే దిగుతాడు. టీ తాగుతాడు. భోజనశాలలో భోంచేస్తున్న అదితి కనిపిస్తుంది. రైలెక్కి ఆమె దగ్గరకి వెళతాడు. “మీ దగ్గరుంటేనే కాస్త ఊరటగా ఉంటుంది” అంటాడు. తన ఖ్యాతి ప్రభావానికి లోను కానిది ఆమె ఒక్కతే  ఇన్నాళ్ళకి అతనికి తారసపడింది. తనకొచ్చిన కల గురించి చెబుతాడు. “శంకర్ దా కాపాడతాడనుకున్నాను” అంటాడు. “ఎవరా శంకర్ దా?” అంటుంది అదితి. అతనికి కనపడకుండా హాండ్ బ్యాగ్ అడ్డుపెట్టి నోట్సు వ్రాసుకుంటుంది. “అతని దర్శకత్వంలో నాటకాలు వేసే వాళ్ళం. అతనికి సినిమాలంటే పడదు. నాకు సినిమా చాన్స్ వచ్చింది. అతను సినిమా నటులు తోలు బొమ్మల లాంటి వాళ్ళని, వరసగా రెండు సినిమాలు ఫ్లాప్ అయితే సినిమా నటుడి పని అంతే అన్నాడు. అతను చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు” అంటాడు. అతని తాజా చిత్రం సరిగా ఆడట్లేదని అతని ఆందోళన. “మీ సినిమాలేం ఫ్లాప్ అవలేదా?” అని అడుగుతుంది అదితి. “ఇంతవరకూ కాలేదు” అంటాడతను. శంకర్ దా గురించి ఇంకా చెబుతూ “అతను అకస్మాత్తుగా నా కళ్ళెదుటే మరణించాడు. అతని కాష్టం కాలుతుండగానే నేను సినిమాల్లో చేరాలని నిర్ణయించుకున్నాను. మీకిది తప్పుగా అనిపిస్తుందేమో” అంటాడు. “వాస్తవం అలాగే ఉంటుంది” అంటుంది అదితి. “అదేగా సినిమాల్లో లేనిది” అంటాడతను. ఇంకా తన నటనా జీవితంలో జరిగిన సంఘటనలు చెబుతాడు. అందులో అతను చేసిన తప్పులు కూడా ఉంటాయి. చివరికి అతనికి ఆమె ఎలా ఊరట కలిగిస్తుందనేది మిగతా కథ.

అరిందమ్ చిన్న పిల్లలతో, ముసలివాళ్ళతో మట్లాడే సీన్లు అతనిలో ఉన్న మంచితనాన్ని చూపుతాయి. జ్వరంతో ఉన్న అమ్మాయిని ఒక సందర్భంలో నుదురు తాకి ఎలా ఉందో చూస్తాడు. అతను నిద్ర మాత్రలు వేసుకుంటుంటే ఆమె “ఇందాక నిద్రమాత్రలు లేకుండా పడుకున్నావుగా” అంటుంది. “మాత్రలు వేసుకోకపోతే నిద్ర రాదేమో అని భయం” అంటాడు. తనని విమర్శించే ముసలాయన “నీకు పెళ్ళయిందా?” అని అడుగుతాడు. “చట్టబద్ధంగా పెళ్ళయిందా అని అడుగుతున్నారా?” అంటాడు అరిందమ్. “సభ్యసమాజంలో ఇంకే రకం పెళ్ళి ఉంటుంది?” అంటాడాయన. “అయితే నేను బ్రహ్మచారినే” అంటాడు అరిందమ్. ముసలాయనకి విషయం అర్థమౌతుంది. కోపం వస్తుంది. “నైతిక విలువలే ఏ జాతికైనా ముఖ్యం” అంటాడు. “ఓరి దేవుడో. నాకు వేరే పనుంది” అని అక్కడినుంచి పారిపోతాడు అరిందమ్. ఆయనతో వాదించకుండా, చిరాకు పడకుండా తప్పుకుంటాడు. అతనిలో సహృదయం ఉంది. అయితే సినీ పరిశ్రమ అతన్ని మార్చేసింది. మంచితనానికి, స్వార్థానికి సంఘర్షణ. అందుకే మద్యం, నిద్రమాత్రలు. తర్వాత వచ్చే సన్నివేశంలో మద్యం మత్తులో ముసలాయన దగ్గరకి వచ్చి పరిహాసంగా నవ్వుతాడు. అంతలోనే అతని అంతరత్మ అతన్ని వారిస్తుంది. అతని సంఘర్షణని ఎంతో ప్రభావవంతంగా చూపించారు రాయ్.

బెంగాల్లో ‘మహానాయక్’ అని పేరు తెచ్చుకున్న ఉత్తమ్ కుమార్ తొలిసారి రాయ్ దర్శకత్వంలో ఈ చిత్రంలో నటించాడు. నిజజీవితంలో సూపర్ స్టార్ అయిన అతను ఈ పాత్రకి ఎంత సరైన నటుడో ఈ కథ అతని ఇమేజ్‌కి అంత ప్రమాదకరం. అయినా అతడు ధైర్యంగా నటించాడు. ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. షర్మిలా టాగోర్ అదితి పాత్రని చాకచక్యంగా పోషించింది. అరిందమ్ ఎంత పేరున్న వాడైనా ఆమె వ్యక్తిత్వం ముందు చిన్నబోతాడు. అంతటి ఉన్నతమైన పాత్ర ఇది. రైల్లో ఉన్న ఆడవాళ్ళందరూ అరిందమ్ మోజులో ఉంటే ఆమె మాత్రం అతన్ని ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నవాడిగా అంచనా వేస్తుంది. అంతే కాదు, అందరిలాగే అతనిలో బలహీనతలు ఉన్నాయని ఆమెకి తెలుసు. ఆమె స్నేహితురాలు ఆమె అరిందమ్‌తో మాట్లాడటం చూసి ‘ఆ రోజు బార్లో ఏం జరిగిందో అడుగు’ అని కాగితం మీద ఒక సందేశం పంపుతుంది. అయినా ఆమె ఆ మాట ఎత్తదు. మనుషుల మనస్తత్వాలను పసిగట్టే ఆమె చురుకుదనం తెలియటానికి అరిందమ్‌కి ఎక్కువ సమయం పట్టదు. రాయ్ ఈ విధంగా ఆమెని అతనికి సమఉజ్జీగా మలిచాడు. ఈ చిత్రానికి ఉత్తమ బెంగాలీ చిత్రంగా జాతీయ అవార్డు వచ్చింది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూశాక ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించేముందు మరో హెచ్చరిక ఉంటుంది.

అరిందమ్ తన మొదటి రోజు షూటింగ్ గురించి అదితికి చెబుతాడు. ముకుంద లాహిరి అనే సీనియర్ నటుడు అతని తండ్రి పాత్ర వేస్తాడు. అరిందమ్ స్వరం తగ్గించి మాట్లాడుతుంటే అతను విసుక్కుంటాడు. “పెద్దవాళ్ళ ఎదుట స్వరం తగ్గించే మాట్లాడాలి కదా” అంటాడు అరిందమ్. “నాకే నేర్పుతావా? నా స్వరంతో నీ స్వరం పోలి ఉండాలి” అంటాడు ముకుంద. అరిందమ్ ఊరుకుంటాడు కానీ తర్వాత తన మేనేజర్‌తో “ఆయన ఏ పాత్ర వేసిన ఒకేలా నటిస్తాడు. జనం ఆహా ఓహో అంటారు. నాకు కావాలనే అడ్డుపడ్డాడు. ఆ సీన్లు పాడయ్యాయి. ఆయన లోపాలు తెలిసిపోతాయనే నాకు అడ్డుపడ్డాడు” అంటాడు. తర్వాత అరిందమ్‌కి పేరు ప్రఖ్యాతులు వచ్చాక ఒకరోజు ముకుంద అతని దగ్గరకి వస్తాడు. ఆరోగ్య పరిస్థితి దిగజారిపోయింది. “నాకేమైనా వేషం ఇప్పించు. కాపలాదారు వేషమైనా సరే” అంటాడు. అరిందమ్ అతనికి ఏ సహాయం చేయడు. ఇది విన్న అదితి “మీ పగ తీర్చుకున్నారన్న మాట. ఆయన మిమ్మల్ని అవమానించిన సంగతి మీరు మర్చిపోలేదుగా” అంటుంది. “అమ్మో! అసాధ్యురాలివే” అంటాడు అరిందమ్.

తర్వాత తన స్నేహితుడి సంగతి చెబుతాడు. ఆ స్నేహితుడు కార్మిక నాయకుడు. అరిందమ్‌ని కార్మికుల కోసం ఏమైనా చేయమని అడిగేవాడు. అరిందమ్ పెద్ద నటుడయ్యాక ఒకరోజు ఆ స్నేహితుడు వస్తాడు. తనతో పాటు రమ్మంటాడు. కార్మికులు ధర్నా చేస్తున్న చోటికి తీసుకువెళతాడు. అరిందమ్‌ని ప్రసంగించమంటాడు. అరిందమ్ “నేనిలాంటి పనులు చేస్తే ఇరుకులో పడతాను. కావాలంటే డబ్బులిస్తాను. నన్నొదిలెయ్” అని వచ్చేస్తాడు. కార్మికుల హక్కుల కోసం గళం విప్పలేని తన అసమర్థతకి లోలోపలే బాధపడతాడు. “అంతగా ఎందుకు మారిపోయానో తెలియదు” అంటాడు అదితితో. అదితికి అతని మీద జాలి వేస్తుంది. నోట్సు వ్రాసుకోవటం మానేస్తుంది. “మీరు ప్రజలకి వినోదం పంచుతున్నారు. మీ పని మీరు బాగా చేసినంతవరకు చింత పడనక్కరలేదు” అంటుంది. “నేను చింత పడుతున్నానని ఎందుకంటున్నారు?” అంటాడతను. “పొద్దుటి నుంచి మార్కెట్ పడిపోతుందని అంటున్నారుగా” అంటుందామె. “అవును. జనాన్ని నమ్మలేం” అంటాడతను. “ఆ జనమే మిమ్మల్ని ఇంతవారిని చేశారు” అంటుందామె. “మీతో వాదించలేను” అంటాడతను.

శంకర్ దా అన్నట్టు రెండు సినిమాలు ఫ్లాప్ అయితే అతనికి మార్కెట్ ఉండదు. అదే అతని భయం. అందుకని వివాదాలని దూరంగా ఉండాలి. కార్మికులకి సాయంగా మాట్లాడితే పారిశ్రామికవేత్తలకి నచ్చదు. వారు పెట్టుబడి పెట్టకపోతే ఎలా? ఇదే స్వార్థం. ఒకవేళ మార్కెట్ పడిపోతే ఏం మునిగిపోతుంది? మళ్ళీ నాటకాలు వేసుకోవచ్చుగా. అమ్మో సినిమాల్లో నటించి మళ్ళీ నాటకాలో వేయటమే!? పరువు పోదూ? ఇదే ఆందోళన. ఈ పరువు కోసమే పాకులాట. ఇలాగే ఎందరో నటులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏమిటి పరువు? ఎవరో అనుకునేదాని మీద మన పరువు ఆధారపడుతుందా? మనకు నచ్చినట్టు మనం ఉండలేమా? ఈ ఆలోచనాధోరణి ఇప్పటికీ రాలేదు. అహంకారం వదులుకుంటే జయాపజయాలు సమానంగా తీసుకోగలం. అదితి అతన్ని సముదాయించటానికి ప్రయత్నిస్తుంది. అతను కూడా బలహీనతలు, భయాలు ఉన్న మనిషే. వాటిని ఆమెతో పంచుకున్నాడు. ఆమెకి అతని మీద సానుభూతి కలుగుతుంది.

మరో పక్క సర్కార్ భార్య అరిందమ్ దగ్గరకి వచ్చి “నాకు సినిమాల్లో చాన్సు ఇవ్వండి” అంటుంది. “మీవారిని నాతో మాట్లాడమనండి” అంటాడతను. తర్వాత ఆమె భర్తతో “నేను మీరు చెప్పినట్టు చేస్తాను. బోస్‌తో సరసంగా ఉంటాను. అయితే మీరు అరిందమ్‌కి నేను సినిమాల్లో చేరటం పట్ల మీకు అభ్యంతరం లేదని చెప్పాలి. మీ ఉద్యోగం మీకుంటుంది. నా పని నాకుంటుంది” అంటుంది. అతను “అసంభవం” అంటాడు. తర్వాత బోస్‌ని కాకా పట్టటానికి అతనితో చదరంగం ఆడతాడు. చివరికి బోస్ “మీ ప్రతిపాదన గురించి ఆలోచించి చెబుతాను” అని తప్పించుకుని వెళ్ళిపోతాడు.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

అరిందమ్ తన కంపార్ట్మెంట్‌కి వెళతాడు. జ్వరంతో ఉన్న అమ్మాయి తేరుకుని ఉంటుంది. ఆ అమ్మాయి అరిందమ్ అంతరాత్మకి ప్రతీక. ఆమె తేరుకుందంటే అదితితో మాట్లాడిన తర్వాత అరిందమ్ మనసు తేలికపడిందని సూచన. నిద్రమాత్రలు వేసుకుని పడుకోవటానికి ఉద్యుక్తుడవుతాడు. అతనికి మరో జ్ఞాపకం మనసులో మెదులుతుంది. ఒకరోజు ప్రమీల అనే యువతి అతని ఇంటికి వస్తుంది. “మీ సినిమాలో నాకు అవకాశం ఇవ్వండి” అంటుంది. అతను తన చేతిలో ఏమీ లేదంటాడు. ఆమె ఎంతకీ వినకపోతే “రేపు రండి” అంటాడు. “రేపు రాత్రికి రమ్మంటారా?” అంటుందామె. అతను ఇబ్బందిపడతాడు. “సినిమాల్లో అమ్మాయిలతో సరసంగా ఉంటారు. ఇప్పుడు భయపడతారేం?” అంటుందామె. “ఇది నా సంస్కారం, నా పెంపకం” అంటాడతను. ఈ జ్ఞాపకం నుంచి బయటకి వచ్చి నిద్రపోతాడతను. మళ్ళీ కల వస్తుంది. కలలో ఒక అడవి. అక్కడ అతను, ప్రమీల నటించిన చిత్రం పోస్టర్ ఉంటుంది. ప్రమీల అతన్ని కవ్విస్తూ పరుగెడుతూ ఉంటుంది. అతను వెంబడిస్తాడు. అక్కడ ఒక బార్ తరహాలో కుర్చీలు ఉంటాయి. చాలామంది కూర్చుని ఉంటారు. అతను “ప్రమీలా, ప్రమీలా” అని పిలిస్తాడు. ఒకతను లేచి “నా భార్య కోసం వెతుకుతున్నావా?” అంటాడు. “నీ భార్యా?” అంటాడు అరిందమ్. “నాటకాలాడుతున్నావా? స్కౌండ్రల్” అంటాడతను. అరిందమ్ అతన్ని కొడతాడు. ఇంతలో అరిందమ్‌కి మెలకువ వస్తుంది. నిద్రమాత్రలు కూడా పని చేయటం లేదు. మద్యం సీసా పట్టుకుని బయటికి వస్తాడు. పూటుగా మద్యం తాగుతాడు. అయినా ఆందోళన తగ్గదు. రైలు పెట్టె తలుపు తెరిచి చూస్తూ ఉంటాడు. మనసులో ఏదో వేదన. తలుపు మూశాక అటుగా వెళుతున్న రైలు పర్యవేక్షకుడిని పిలిచి అదితిని పిలిపిస్తాడు. ఆమె వస్తుంది. “ఆ రోజు బార్లో ఏం జరిగిందో చెబుతాను” అంటాడతను. “వద్దు. చెప్పొద్దు” అంటుందామె. “ఎందుకు?” అంటాడతను. “నేను ఊహించగలను” అంటుందామె. “అంత ఊహాశక్తి ఉందా? అయితే నా సినిమా ఎందుకు ఫ్లాప్ కాబోతోందో చెప్పండి” అంటాడు. “మీరు మనసు పెట్టి నటించలేదు కాబట్టి” అంటుందామె. అతను నిర్ఘాంతపోతాడు. “ఎంత తెలివి!” అంటాడు. మళ్ళీ “మీరు వెళ్ళండి” అంటాడు. ఆమె “ముందు మీరు వెళ్ళండి. తర్వాత నేను వెళతాను” అంటుంది. అతను ఆమె సునిశిత బుద్ధికి అబ్బురపడుతూ కాస్త వెటకారంగా “నా గురించి ఏమైనా వ్రాసుకోండి. ఐ డోన్ట్ కేర్!” అంటాడు. తన కంపార్ట్మెంట్‌కి వెళ్ళి తూలుతూ బెర్తు మీద పడతాడు. అక్కడున్న అమ్మాయి అతన్ని చూసి కన్నీరు పెట్టుకుంటుంది. ఆమె తల్లి ఆమెని సముదాయిస్తుంది.

ప్రమీల పెళ్ళి కాలేదని అరిందమ్‌కి చెప్పింది. ఆమెతో అతను సంబంధం పెట్టుకున్నాడు. తీరా చూస్తే ఆమెకి పెళ్ళయింది. బార్లో ఆమె భర్తతో గొడవ పడ్డాడు. అతని సంస్కారం అతని చాపల్యానికి లొంగిపోయింది. సినిమా చాన్సుల కోసం యువతులు పెళ్ళి కాలేదని చెప్పటం జరుగుతూనే ఉంటుంది. జ్ఞానపీఠ్ అవార్డు పొందిన రావూరి భరద్వాజ ‘పాకుడురాళ్ళు’ నవలలో మంజరి పాత్ర అలాంటిదే. ప్రమీల ఫోన్ చేసి అంతా వివరిస్తానని అంటే అతను వద్దన్నాడు. పెళ్ళికాని అమ్మాయితో సంబంధం ఉంటే తప్పు లేదని అనుకున్నాడు, అతనికీ పెళ్ళి కాలేదు కాబట్టి. కానీ ఆమెకి పెళ్ళయిందని తెలిసి అతను హతాశుడయ్యాడు. ఇంకో పక్క ఒకే రకం సినిమాలు చేసి విసుగు వచ్చింది. తాజా సినిమాలో మనసు పెట్టి నటించలేదు. ఇప్పుడా సినిమా సరిగా ఆడట్లేదు. అరిందమ్ నైతికంగా, వృత్తిపరంగా కూడా పతనమయ్యాడు. అదితికి తన అక్రమసంబంధం గురించి చెబితే ఆమె తన పత్రికలో వేస్తుంది. ఆ రకంగా ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చని అతను అనుకున్నాడు. మరి తన మార్కెట్ సంగతి ఏమిటి? అతనికి ఎక్కడో నైతిక జీవనమే అన్నిటి కన్నా ముఖ్యమనే భావన ఉంది. అయితే అదితి ముందే ఊహించింది. అరిందమ్‌కి ఆత్మహత్య చేసుకునే ఆలోచన కూడా మనసులో మెదిలే ఉంటుంది. అది అదితి గ్రహించింది. తొందరపాటులో అఘాయిత్యం చేసుకోకుండా అతన్ని కాపాడింది. భౌతికంగానే కాదు మానసికంగా కూడా అతనికి రక్షణ కలిగిస్తుంది. అది ఎలాగంటే..

మర్నాడు ఉదయం అరిందమ్ నిద్రలేచి మామూలుగానే ఉంటాడు. అక్కడున్న అమ్మాయికి తన ఫోటో మీద ఆటోగ్రాఫ్ ఇస్తాడు. ఫోటోలు వెంట తీసుకుని వెళుతుంటాడన్నమాట. అదితిని భోజనశాలలో కలుస్తాడు. “మనసులో ఏదో వెలితిగా ఉంది” అంటాడు. ఆమె “మీరు చిరకాలం జనాదరణ పొందుతారు. మీ మార్కెట్ బావుంటుంది” అంటుంది. తన ఇంటర్వ్యూ నోట్సు చింపి పారేస్తుంది. “అదేంటి? మన మాటలు జ్ఞాపకం పెట్టుకుని ఇంటర్వ్యూ వ్రాస్తారా?” అంటాడతను. “నా జ్ఞాపకాల్లోనే ఉంచుకుంటాను” అంటుందామె. అతను చకితుడై ఉండిపోతాడు. రైలు గమ్యం చేరుకున్నాక ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు.

అతనిలోని మంచితనాన్ని ఆమె పసిగట్టింది. నైతికత మిగిలి ఉంటే అదే అతన్ని కాపాడుతుందని ఆమెకి తెలుసు. అలాంటి మనిషి జీవితాన్ని రచ్చకీడ్చటం ఆమెకి ఇష్టం లేదు. అందుకే ఇంటర్వ్యూ ప్రచురించకూడదని నిశ్చయించుకుంది. తన పత్రిక అమ్మకాలు పెంచుకోవటానికి ఒక మనిషి రిగ్రెట్స్‌ని, పొరపాట్లని వాడుకోవటం తప్పు అని ఆమె భావన. అదే ఆమె ఔన్నత్యం. అరిందమ్‌కి కొత్త జీవితం లభించినట్టయింది. అతను దాన్ని సార్థకం చేసుకుంటాడనే ఆమె ఆశ. అతని ప్రయత్నమూ అదే!

Exit mobile version