మరుగునపడ్డ మాణిక్యాలు – 46: ఎ ఫ్యూ గుడ్ మెన్

0
3

[dropcap]దే[/dropcap]శరక్షణ విషయంలో పొరపాట్లు జరగకూడదు. అయితే సైనికుల్లో ఎవరికైనా తగినంత శరీరదార్ఢ్యం లేకపోతే ఏం చేయాలి. అతన్ని తీసేయవచ్చు. కానీ దేశం కోసం ఇంకా కష్టపడి దార్ఢ్యం పెంచుకోవాలి అంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కొందరికి ఆ సత్తువ ఉండదు. దీన్ని దేశభక్తిలో లోపం అనుకోకూడదు. మానవత్వంతో ఆలోచించాలి. కానీ కొన్ని దేశాల సైన్యంలో ఇలా ఆలోచించేవారు తక్కువ. అలాంటప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయో చూపించిన ఆసక్తికర చిత్రం ‘ఎ ఫ్యూ గుడ్ మెన్’ (1992). ఇందులో ఒక సైనికుడు సైన్య స్థావరంలో తన తోటి సైనికులు చేసిన దాడిలో మరణిస్తాడు. ఈ సంఘటనపై న్యాయవిచారణ జరుగుతుంది. న్యాయవిచారణ అంటేనే ఆసక్తికరంగా ఉంటుంది. అలాంటిది సైన్యంలో జరిగిన న్యాయవిచారణ కావటంతో ఇంకా ఉత్కంఠభరితంగా ఉంటుంది ఈ చిత్రం. సొనీ లివ్ లో లభ్యం. ‘ఎ ఫ్యూ గుడ్ మెన్’ అంటే ‘మంచిమనుషులు కొందరున్నారు’ అనే అర్థం వస్తుంది.

క్యూబాలో ఉన్న అమెరికా నౌకాదళ స్థావరంలో విలియమ్ సాంటియాగో అనే సైనికుడు కసరత్తుల్లో అందరికంటే వెనకబడి ఉంటాడు. అతనికి ఆయాసం, కళ్ళు తిరగటం, తీవ్రమైన అలసట లాంటి లక్షణాలు ఉంటాయి. అతను తనను సైనికుడిగా కాక వేరే పనికి బదిలీ చేయమని కోరతాడు. ఎవరూ పట్టించుకోరు. ఇది ఇలా ఉండగా అతను డాసన్ అనే నిఘా సైనికుడు సరిహద్దు అవతల ఉన్న శత్రువు స్థావరం మీద తుపాకీ పేల్చటం చూస్తాడు. కాల్పుల విరమణ సమయంలో ఇలా చేయటం తప్పని సాంటియాగోకి తెలుసు. అతను నౌకాదళ దర్యాప్తు సంస్థకు ఉత్తరం వ్రాస్తాడు. తనని బదిలీ చేస్తే ఒప్పందానికి విరుద్ధంగా జరిగిన కాల్పుల సంఘటన గురించి వివరాలు చెబుతానని అంటాడు. డాసన్ మాత్రం శత్రువుల నిఘా సైనికుడు తన మీద కాల్పులు జరపటానికి సిద్ధపడుతుంటే రక్షణ నిమిత్తం తాను కాల్చానని అంటాడు. ఫిర్యాదు సంగతి తెలియగానే స్థావరపు కమాండర్ జెసెప్, లెఫ్టినెంట్ కల్నల్ మార్కిన్సన్, లెఫ్టినెంట్ కెండ్రిక్ సమావేశమౌతారు. కెండ్రిక్ సైనికులకి అధికారి. కెండ్రిక్ పై అధికారి మార్కిన్సన్. మొత్తం స్థావరాన్ని శాసించేవాడు జెసెప్. మార్కిన్సన్ సాంటియాగోని బదిలీ చేసేద్దామని అంటాడు. జెసెప్ అతన్ని చులకన చేసి మాట్లాడతాడు. కెండ్రిక్‌తో సాంటియాగోకి సరైన శిక్షణ ఇవ్వమని చెబుతాడు. తోటి సైనికులు సాంటియాగో మీద దాడి చేయకూడదనే ఉద్దేశంతో కెండ్రిక్ సైనికులందర్నీ సమావేశపరిచి ఎవరూ సాంటియాగో జోలికి వెళ్ళకూడదని ఆదేశం ఇస్తాడు.

ఆ రోజు రాత్రి డాసన్ తన కింద పని చేసే డౌనీ అనే సైనికుడితో కలిసి సాంటియాగో గదికి వెళ్ళి అతని నోట్లో గుడ్డ కుక్కి, టేపుతో నోరు కట్టేస్తాడు. కాసేపటికి సాంటియాగో నెత్తురు కక్కుకుని మరణిస్తాడు. డాసన్ ఆంబులెన్స్‌కి ఫోన్ చేస్తాడు. డాక్టరు మొదట చావుకి కారణం తెలియదని అంటాడు. తర్వాత విషప్రయోగం జరిగిందని అంటాడు. మృతుడి నోట్లో కుక్కిన గుడ్డ మీద విషం ఉండి ఉండవచ్చని డాక్టరు అంచనా. నిందితుల్ని అమెరికా రాజధానికి తీసుకువస్తారు. ఏం జరిగిందో తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు. డాసన్, డౌనీ తాము సాంటియాగో మీద ‘కోడ్ రెడ్’ చేశామని చెబుతారు. ‘కోడ్ రెడ్’ అంటే అనధికారిక శిక్ష. క్రమశిక్షణ లేని సైనికులకి గుండు గీయటం లాంటి చిన్న శిక్షలు వేస్తారు. ఈ శిక్షల వల్ల సైనికులు దారిలోకి వస్తారని తోటి సైనికులు ఇలా చేస్తారు. ఇవి బయటకి పొక్కకుండా అమలు చేస్తారు. ఒకరకంగా ఇది కాలేజీల్లో జరిగే ర్యాగింగ్ లాంటిది. అది నిబంధనలకి విరుద్ధం. కానీ ర్యాగింగ్ జరుగుతుంది అని అందరికీ తెలుసు. ఆటపట్టించటం లాంటివి పర్వాలేదు. మితిమీరితేనే ప్రమాదం. డాసన్, డౌనీ సాంటియాగో నోరు కట్టేసి అతనికి గుండు గీయాలని అనుకున్నామని అంటారు. ఎందుకు? అతను డాసన్ మీద ‘చాడీలు’ చెప్పాడు. చాడీలు చెప్పటం తప్పు. ఏమైనా ఉంటే తన అధికారికి చెప్పాలి. దర్యాప్తు సంస్థకి ఉత్తరం వ్రాయటం తప్పని వారి ఉద్దేశం. అయితే తాము విషప్రయోగం చేయలేదని డాసన్, డౌనీ అంటారు. విషప్రయోగం చేస్తే ఆంబులెన్స్‌కి ఎందుకు ఫోన్ చేస్తారు? ప్రాసిక్యూషన్ వారు ఈ విషయాన్ని పట్టించుకోరు. పన్నెండేళ్ళ శిక్ష వేస్తామని అంటారు.

డాసన్ నిజంగా ఎటువంటి కవ్వింపు లేకుండా కాల్పులు జరిపాడా? లేక తప్పు చేసినందుకు ఫిర్యాదు చేసిన సాంటియాగోని విషప్రయోగం చేసి చంపాడా? సాంటియాగో ఫిర్యాదు చేయటం తప్పా? అతను బదిలీ కోసం ప్రయత్నించాడు. ఎవరూ పట్టించుకోలేదు. ఇక చివరికి తాను చూసిన కాల్పుల సంఘటన ఉపయోగించుకుని బదిలీ చేయించుకోవాలని చూశాడు. అతను పొరపాటు పడి ఉండవచ్చు. ఫిర్యాదు మీద ఎలాగూ విచారణ జరుగుతుంది. నిజానిజాలు తేలతాయి. అలాంటి పరిస్థితిలో ఆషామాషీగా ఎవరూ ఫిర్యాదు చేయరు. తోటివాళ్ళ మీద ఫిర్యాదు చేసిన వాళ్ళందరూ చాడీకోరులని అనుకోవచ్చా? ఇలాంటి ప్రశ్నలు ప్రేక్షకుల మదిలో మెదులుతూ ఉండగానే ఇంకా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి.

డాసన్, డౌనీ తరఫు లాయరుగా డానియెల్ క్యాఫీ అనే యువ లాయరుని నియమిస్తుంది నౌకాదళ న్యాయవిభాగం. అతను తొమ్మిది నెలల క్రితమే నౌకాదళంలో లాయరుగా చేరాడు. కారణం అతని తండ్రి నౌకాదళంలో కల్నల్‌గా పనిచేశాడు. చాలా దక్షత గలవాడిగా పేరు పొందాడు. అయితే డానియెల్ నౌకాదళం మీద ప్రేమతో చేరలేదు. చనిపోయిన తండ్రి కోరిక మేరకు చేరాడు. అతనికి కోర్టుకి వెళ్ళకుండా బయటే ఒప్పందాలు చేసుకుని కేసులు ముగించటం అలవాటు. ఒప్పందమంటే నిందితుడు తప్పు చేశానని ఒప్పుకుంటే ప్రాసిక్యూషన్ వారితో బేరాలాడి తక్కువ శిక్ష పడేలా చేయటం. కాదని కోర్టుకి వెళితే పెద్ద శిక్ష పడుతుందని బెదిరించి నిందితుడిని ఒప్పించటం. అయితే అతనికి హత్య కేసు ఇవ్వటం ఇదే తొలిసారి. డానియెల్ తెలివైనవాడే. కానీ నేరం చేయలేదని సాక్ష్యాధారాలు లేకపోతే శిక్ష అనుభవించటం తప్ప వేరే దారి లేదని నమ్మేరకం. ఈ కేసులో పన్నెండేళ్ళ శిక్ష సబబే అని అతని అభిప్రాయం. ఈ కేసు విషయంలో అతన్ని పర్యవేక్షించే అధికారిణి జొయాన్. కేసు సరిగా వాదించేలా చూడటం ఆమె పని. డానియెల్ సరిగా వాదించడని ఆమెకి అర్థమైపోతుంది. అతనికి ‘కోడ్ రెడ్’ అనే పద్ధతి ఒకటుందని కూడా తెలియదు.

డానియెల్, అతని సహచరుడు శామ్, జొయానా కలిసి జెసెప్, మార్కిన్సన్, కెండ్రిక్ లతో మాట్లాడటానికి క్యూబా వెళతారు. అక్కడ సాంటియాగో గదిని పరిశీలిస్తారు. కెండ్రిక్ తోడుగా వస్తాడు. జొయానా అతన్ని “సాంటియాగోని హత్య చేశారని మీ అభిప్రాయమా?” అని అడుగుతుంది. “అతని చావుకి కారణం అతనికి నీతి లేకపోవటమే” అంటాడతను. తర్వాత డానియెల్ జెసెప్‌ని సాంటియాగో ఫిర్యాదు గురించి తెలిసిన తర్వాత ఏం నిర్ణయం తీసుకున్నారని అడుగుతాడు. జెసెప్ “సాంటియాగోని బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. తెల్లారితే విమానం ఎక్కి వెళ్ళిపోయేవాడు. ఇంతలోనే ఇలా జరిగింది” అంటాడు! ఇది అబద్ధమని ప్రేక్షకులకి తెలుసు. డానియెల్ బృందానికి తెలియదు. జెసెప్ ఎందుకు అబద్ధం చెప్పాడు? సాంటియాగోని బదిలీ చేయటానికి అంగీకరించలేదంటే అతనికి తోటి సైనికుల నుండి ప్రమాదముందని తెలిసి కూడా బదిలీ చేయలేదంటారని అతని ఆలోచన. బదిలీ అయ్యేవాడిని డాసన్, డౌనీ విషప్రయోగం చేసి చంపేశారని అతని వాఙ్మూలం. బదిలీ మాట అబద్ధం. మరి విషప్రయోగం మాట నిజమా? డానియెల్ ఇంకేమీ ప్రశ్నించకుండా బయల్దేరబోతాడు. ఇంతలో జొయానా జెసెప్‌తో “కోడ్ రెడ్ అనేది ఎక్కడ జరిగినా సహించకూడదని నౌకాదళం ప్రధాన కమాండర్ ఆదేశించారు. ఈ స్థావరంలో కోడ్ రెడ్ జరగట్లేదని నమ్మకంగా చెప్పగలరా?” అంటుంది. జెసెప్‌కి కోపం వస్తుంది. “నేను కోడ్ రెడ్‌కి వ్యతిరేకం. నాకు తెలియకుండా కోడ్ రెడ్ జరిగితే జరగొచ్చు. నేను పట్టించుకోను. మీరు బ్యాడ్జీలు తగిలించుకుని వస్తే నేను వణికిపోతానని అనుకోకండి” అంటాడు. జొయానా నోటమాట రాక ఉండిపోతుంది. డానియెల్ బయల్దేరుతూ “బదిలీ ఆదేశం కాపీ ఒకటి నాకు కావాలి” అంటాడు. “మర్యాదగా అడిగితే ఇస్తాను” అంటాడు జెసెప్ కఠినంగా. డానియెల్ ఖంగు తింటాడు. “మీకు అభ్యంతరం లేకపోతే బదిలీ ఆదేశం కాపీ ఇవ్వండి” అంటాడు. “నో ప్రాబ్లమ్” అంటాడు జెసెప్.

జెసెప్ వాదన ఏమిటంటే తమ దళం దేశరక్షణ కోసం అహర్నిశలూ శ్రమిస్తోంది. అందువల్ల దేశప్రజలు సురక్షితంగా ఉన్నారు. ‘ఏదో ఒక సంఘటన జరిగిందని నన్ను ప్రశ్నించటానికి మీకెంత దమ్ము?’ అని అతని ప్రశ్న. ఇక్కడ ఒక మనిషి ప్రాణం పోయింది. ప్రాణానికి విలువ లేదా? యుద్ధభూమిలో ప్రాణం పోతే అది ఎంతో గౌరవం. తోటి సైనికుల దాడిలో చనిపోతే అది అవమానం కాదా? ‘వాళ్ళు కావాలని చంపేశారు. నేనేం చేయగలను?’ అనేది జెసెప్ మాటల సారాంశం. డానియెల్ బృందం అమెరికాకి తిరిగి వచ్చాక మార్కిన్సన్ జెసెప్ అనుమతి తీసుకోకుండా క్యూబా స్థావరం నుంచి వెళ్ళిపోయాడని తెలుస్తుంది. జెసెప్ అబద్ధం చెప్పాడని అతనికి తెలుసు. బదిలీ ఆదేశం సాంటియాగో చనిపోయిన తర్వాత తయారు చేశారు. దాని మీద అతని సంతకమే ఉంది. ముందు నుంచీ బదిలీ చేయమని చెబితే వినకుండా సాంటియాగో చనిపోయిన తర్వాత దొంగ కాయితాలు సృష్టించి అతని చేత సంతకం చేయించారు. అతనికి ఇది మింగుడుపడలేదు.

జొయానాకి కెండ్రిక్ మీద అనుమానం వస్తుంది. అతను సాంటియాగో నీతి లేని వాడని అన్నాడు. అతనే కోడ్ రెడ్ అమలు చేయమని డాసన్‌కి చెప్పాడని జొయానాకి అనిపిస్తుంది. ఆమె, డానియెల్ కలిసి వెళ్ళి డాసన్‌ని, డౌనీని మళ్ళీ ప్రశ్నిస్తారు. “కెండ్రిక్ మీకు కోడ్ రెడ్ చేయమని చెప్పాడా?” అని డానియెల్ అడుగుతాడు. అవునంటాడు డాసన్! “ముందే ఎందుకు చెప్పలేదు?” అంటే “మీరు అడగలేదుగా?” అంటాడు. కెండ్రిక్ సైనికుల సమావేశం ముగిసిన తర్వాత తమ గదికి వచ్చి కోడ్ రెడ్ చేయమని చెప్పాడని అంటాడు. జొయానా, డానియెల్ ప్రాసిక్యూషన్ లాయర్‌కి ఈ విషయం చెబుతారు. అయితే కెండ్రిక్ వాఙ్మూలంలో ఈ విషయం లేదు. కెండ్రిక్ అబద్ధం చెబుతున్నాడని డానియెల్ అంటాడు. వ్యవహారం ముదురుతూ ఉందని గమనించి ప్రాసిక్యూషన్ లాయరు కమాండర్ జెసెప్‌కి ఇబ్బంది కలగకుండా ఈ కేసుని ముగించాలని నౌకాదళ ఉన్నతాధికారులు అనుకుంటున్నారని, అందుకని తాను శిక్షని రెండేళ్ళకి తగ్గిస్తానని అంటాడు. అలా ఒప్పందం చేసుకుందామని అంటాడు. కాదని కోర్టుకి వెళితే అన్నిరకాల అభియోగాలూ వేసి పెద్ద శిక్ష పడేలా ప్రయత్నిస్తామని అంటాడు.

డానియెల్ డాసన్ కి ఒప్పందం చేసుకోమని చెబుతాడు. రెండేళ్ళ శిక్ష అంటే సత్ప్రవర్తనతో ఆర్నెల్లలో బయటపడొచ్చని అంటాడు. డాసన్ ఒప్పుకోడు. “మేం ఆదేశాలు పాటించాము. మా తప్పు ఏమీ లేదు. మీరు చెప్పిన ఒప్పందం ప్రకారం మేము తప్పు చేశామని ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది. తప్పు చేయనపుడు ఎందుకు ఒప్పుకోవాలి? కోర్టులో మేం తప్పు చేశామని రుజువైతే ఎంత శిక్ష అయినా అనుభవిస్తాం. కానీ శిక్ష తగ్గటం కోసం తప్పు చేశామని ఒప్పుకోం” అంటాడు. నిందితులు ఒప్పందానికి ఒప్పుకోకపోతే లాయరేం చేయలేడు. కోర్టుకి వెళ్ళల్సిందే. డానియెల్‌కి అసహనం కలుగుతుంది. జొయానాతో “వాళ్ళు ఆదేశాలే పాటించి ఉండవచ్చు. కానీ ఎలా నిరూపిస్తాం? నేను చెప్పింది వాళ్ళు వినట్లేదు కాబట్టి వేరే లాయర్ని పెట్టమని జడ్జిని అడుగుతాను” అని వెళ్లిపోతాడు. అయితే కోర్టులో నిందితుల్ని హజరు పరచినపుడు అతను మనసు మార్చుకుంటాడు. తమ క్లయింట్లు నిర్దోషులని జడ్జికి విన్నవిస్తాడు. కేసు విచారణ ప్రారంభమవుతుంది. డానియెల్ మనసు ఎందుకు మారింది? అతనికి పెద్దగా అనుభవం లేదు. కోర్టు బయట ఒప్పందాలు చేయించటం అతని అలవాటు. అలాంటప్పుడు తనకు హత్య కేసు ఎందుకిచ్చారని ఆలోచించాడు. ఈ కేసు కూడా కోర్టు బయట ఒప్పందం చేయించి ముగిస్తాడని, నిందితులకి ఎంతో కొంత శిక్ష పడుతుందని, పెద్ద హడావిడి లేకుండా అంతా సద్దుమణుగుతుందని న్యాయవిభాగం వారు భావించారని అతనికి అర్థమవుతుంది. అతని అంతరాత్మ అతనికి నిందితుల తరఫున పోరాడమని చెబుతుంది.

ఎక్కడైనా న్యాయవ్యవస్థలో లొసుగులు ఉంటాయి. జడ్జీలు తమ వద్దకు వచ్కిన కేసులు నిష్పక్షపాతంగా విచారిస్తారు. అయితే న్యాయవ్యవస్థలో జడ్జీలది చరమ స్థానం మాత్రమే. జడ్జీ దగ్గరకు వెళ్ళకుండా తప్పుడు ఒప్పందాలు చేయటానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతాయి. నేరం ఒప్పుకుంటే తక్కువ శిక్ష పడుతుందని, లేకపోతే పెద్ద శిక్ష పడుతుందని నిందితుల్ని బెదిరిస్తారు. సివిల్ కేసుల్లో మధ్యవర్తిత్వం మంచిదే. క్రిమినల్ కేసుల్లో మధ్యవర్తిత్వం ఏమిటి? నేరం ఎక్కడ జరిగిందో తేలాల్సిందే. అయితే ఉన్నత పదవులు ఆశించే కమాండర్ జెసెప్ లాంటి వాళ్ళు ఇలాంటి కేసుల్ని నీరుగారుస్తారు. కెండ్రిక్ అదేశాల ప్రకారం నేరం జరిగిందని తేలితే జెసెప్ దక్షత ప్రశ్నార్థకమవుతుంది. అది జెసెప్‌కి ఇష్టం లేదు. అందరూ జెసెప్‌కి సాయంగా నిలబడ్డారు. ఒక ప్రాణం పోయిందనే సంగతి ఎవరికీ పట్టదు. అదే విషాదం. ఇంతకీ సాంటియాగో ఎందుకు మరణించాడు? విషప్రయోగం జరిగిందా? లేకపోతే కేవలం నోటిలో గుడ్డ కుక్కి కట్టేయటం మాత్రం చేత చనిపోవటం ఏమిటి? ఈ ప్రశ్నలకి సమాధానం కోర్టు విచారణలో తెలుస్తుంది. గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే కెండ్రిక్ ఆదేశం ప్రకారం తాము కోడ్ రెడ్ చేశామని డాసన్ ముందు చెప్పలేదు. అలా చెప్పటం కూడా చాడీయే అవుతుందని అతని భావన. అతని వ్యక్తిత్వం ఎలాంటిదో దీని వల్ల తెలుస్తుంది. అయితే డానియెల్ అడిగినపుడు నిజమే చెప్పాడు. సత్యానికి అతను ఇచ్చిన ప్రాధాన్యత అది.

ఆరన్ సార్కిన్ తాను వ్రాసిన నాటకానికి కొన్ని మార్పులు చేసి ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే వ్రాశాడు. రాబ్ రైనర్ దర్శకత్వం వహించాడు. డానియెల్‌గా టామ్ క్రూజ్, జెసెప్‌గా జాక్ నికల్సన్, డాసన్‌గా ఉల్ఫ్ గ్యాంగ్ బాడిసన్, జొయానాగా డెమీ మూర్ నటించారు. నికల్సన్‌కి ఉత్తమ సహాయనటుడిగా పలు అవార్డులు వచ్చాయి. ఆస్కార్ నామినేషన్ కూడా వచ్చింది. మానవత్వాన్ని కాలరాసే వారికి శిక్ష పడాలంటే ఈ రోజుల్లో ఎంత కష్టమో చూపించటంలో ఈ చిత్రం కృతకృత్యమైంది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూశాక ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించేముందు మరో హెచ్చరిక ఉంటుంది.

విచారణలో తొమ్మిది మందితో కూడిన ధర్మాసనం ఉంటుంది. ఉపోద్ఘాతాలు అయిన తర్వాత డాక్టరుని సాక్ష్యం చెప్పటానికి ప్రవేశపెడతారు. విషప్రయోగం వల్ల లాక్టిక్ యాసిడోసిస్ జరిగి సాంటియాగో మరణించాడని డాక్టరు చెబుతాడు. లాక్టిక్ యాసిడోసిస్ అంటే శరీరంలోని కణాలు ప్రాణవాయువుకి బదులు రక్తంలోని చక్కెరని వినియోగిస్తే లాక్టిక్ యాసిడ్ పుడుతుంది. అది ఊపిరితిత్తుల్లో రక్తస్రావం అయ్యేలా చేస్తుంది. విషప్రయోగం వల్ల ఇది జరిగిందని డాక్టర్ అంటాడు. మరి విషం తాలూకు ఆనవాళ్ళు దొరకలేదేమని ప్రాసిక్యూషన్ లాయరు అడుగుతాడు. కొన్ని విషపదార్థాలు ఆనవాళ్ళు లేకుండా పోతాయని డాక్టరు అంటాడు. తర్వాత డానియెల్ డాక్టరుని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాడు. “విషం లేకుండా గుడ్డ మరీ లోపలికి కుక్కితే లాక్టిక్ యాసిడోసిస్ జరిగే అవకాశం ఉందా?” అని అడుగుతాడు. డాక్టర్ ఒక్క క్షణం మాట్లాడకుండా ఉండిపోతాడు. డానియెల్ రెట్టిస్తే “గుండె గానీ మెదడు గానీ బలహీనంగా ఉంటే ఆ అవకాశం ఉంది. అయితే ఆ బలహీనత తీవ్రంగా ఉంటేనే అలా జరుగుతుంది. ఆ బలహీనత మామూలు పరీక్షల్లో బయటపడకపోయినా లక్షణాలు ఉంటాయి. గుండె నొప్పి, ఊపిరి అందకపోవటం, అలసట లాంటి లక్షణాలు ఉంటాయి” అంటాడు. డానియెల్ దగ్గర సాంటియాగోకి సంబంధించిన మెడికల్ రిపోర్టులు ఉంటాయి. అందులో ఈ లక్షణాలన్నీ ఈ డాక్టరే ధృవీకరించినట్టు ఉంటుంది. ఆ రిపోర్టు చూపించినా డాక్టరు విషప్రయోగం వల్లే లాక్టిక్ యాసిడోసిస్ జరిగిందని అంటాడు. “మీరు సరిగా పరీక్షించలేదు కాబట్టి సాంటియాగోకి బలహీనమైన గుండె ఉందని తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు మీ తప్పు ఒప్పుకుంటే మీరు చిక్కుల్లో పడతారనే ఇలా అంటున్నారు” అంటాడు డానియెల్. ప్రాసిక్యూషన్ లాయరు “అబ్జెక్షన్” అంటాడు. జడ్జీ సమర్థిస్తాడు. అయితే డానియెల్ చెప్పాలనుకున్న విషయం ధర్మాసనం సభ్యులకి అర్థమవుతుంది.

సాంటియాగోకి గుండె బలహీనత లక్షణాలన్నీ ఉండేవి. అయితే డాక్టరు సరిగా పరీక్షించలేదు. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. గుండె బలహీనత వల్లే సాంటియాగో కసరత్తులు చేయలేకపోయేవాడు. అధికారుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎవరైనా పని సరిగా చేయకపోతే పని తప్పించుకుంటున్నారని అనుకుంటారు కానీ వారికి నైపుణ్యం లేదని అనుకోరు. అందరూ చేస్తున్నారు, నువ్వెందుకు చేయవు అనేది చాలా తప్పుడు వాదన. కొందరికి కొన్ని పనులు చేసే సత్తా ఉండదు. వారికి వేరే పనులు ఇవ్వాలి. కానీ చాలామంది ఒత్తిడి చేసి ఆ పనే చేయిస్తారు. ఇక్కడ అదే జరిగింది. సాంటియాగో సరిగా ప్రయత్నించటం లేదనే అందరూ అనుకున్నారు. అందుకే అతని బదిలీ కోసం అడిగితే ఒప్పుకోలేదు. కొన్ని ఆరోగ్య సమస్యలు సాధారణ పరీక్షల్లో తెలియవు. లక్షణాలు బయటపడినపుడు లోతుగా పరీక్షించాలి. డాక్టరు ఆ పని చేయలేదు. తోటివారు సాంటియాగోని ఎగతాళి చేశారు. గత్యంతరం లేక ఫిర్యాదు చేశాడు. అదే అతనికి శాపమయింది. తలచుకుంటే గుండె బరువెక్కుతుంది. పిల్లలను ఒత్తిడి చేసే తలిదండ్రులు, ఉద్యోగులను ఒత్తిడి చేసే అధికారులు జాగ్రత్తగా ఉండాలి. ‘తారే జమీన్ పర్’ చిత్రంలో పిల్లవాడు డిస్లెక్సియా కారణంగా సరిగా చదవలేకపోతే తండ్రి వాడు ఆకతాయితనంతో మొండికేస్తున్నాడని అనుకుంటాడు. అది తప్పని తేలుతుంది. అలాగే ఉద్యోగులు పని చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నారో గమనించాలి. ముఖ్యంగా అధికారులకు ఈ నైపుణ్యం ఉండాలి. ఇతరులతో పోల్చకూడదు. పనిదొంగలూ ఉంటారు. వారినీ, వీరినీ సరిగా గుర్తించాలి.

విషప్రయోగం జరగలేదు కాబట్టి డాసన్, డౌనీకి చంపాలనే ఉద్దేశం లేదని నిరూపణ అయింది. సాంటియాగో ప్రమాదవశాత్తూ చనిపోయాడు. అయితే అతని నోరు కట్టేయటం నేరమే. అదేమో కెండ్రిక్ చెప్పటం వల్ల చేశామంటారు వాళ్ళు. కెండ్రిక్ కోర్టులో హాజరవుతాడు. తాను కోడ్ రెడ్ చేయమని ఆదేశించలేదని చెబుతాడు. ఒకరోజు రాత్రి మార్కిన్సన్ డానియెల్‌ని రహస్యంగా కలుసుకుంటాడు. కెండ్రిక్ కోడ్ రెడ్ చేయమని ఆదేశించాడని చెబుతాడు. కెండ్రిక్ ఆ ఆదేశమిస్తుండగా మార్కిన్సన్ చూడలేదు కాబట్టి అతని మాట చెల్లదని డానియెల్ అంటాడు. బదిలీ ఆదేశం సాంటియాగో మరణం తర్వాత తయారు చేశారని చెబుతాడు. తాను దాని మీద సంతకం చేశానని అంటాడు. ఈ మాటే కోర్టులో చెప్పమంటాడు డానియెల్. అయితే తాను జెసెప్‌కి ధైర్యంగా ఎదురు నిలబడలేకపోవటం వల్లే సాంటియాగో ప్రాణం పోయిందనే అపరాధభావంతో మర్నాడు ఆత్మహత్య చేసుకుంటాడు మార్కిన్సన్!

మార్కిన్సన్ లాంటి అధికారులు మానవత్వంతో ఆలోచిస్తారు. వారిని పై అధికారులు తొక్కిపెడతారు. సైన్యాన్ని నడిపించటంలో దేశాధినేతల పద్ధతే సైనికాధుకారుల్లో ఉంటుంది. భారతీయ సైన్యంలో శాంతికాముకత, మానవత్వం ఎక్కువ. ఇతర దేశాల సైన్యాల్లో అలా ఉండదు. కొన్ని దేశాలు కయ్యానికి కాలు దువ్వుతాయి. కొన్ని దేశాలు తమ ప్రయోజనాల కోసం పెద్దరికం నెత్తి మీద వేసుకుని పెత్తనం చేస్తాయి. అలాంటి చోట్ల మానవత్వానికి విలువ ఉండదు. మానవతావాదులు అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతారు. మానవత్వం వారికి దేశద్రోహంలా కనిపిస్తుంది.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. చిత్రం చూసే అవకాశం ఉన్నవారు ముందు చిత్రం చూడాలని గట్టిగా కోరుతున్నాను. చివర్లో కోర్టు సీనులో జాక్ నికల్సన్ (జెసెప్ పాత్రధారి) నటన అద్భుతంగా ఉంటుంది.

కథ అనేక మలుపులు తిరుగుతుంది. విచారణలో కెండ్రిక్ డాసన్ గదికి వచ్చినపుడు డౌనీ అక్కడ లేడని కూడా తేలుతుంది. ఇది డానియెల్ బృందానికి ఎదురుదెబ్బ. మార్కిన్సన్ చనిపోయాడు. ఇవన్నీ దాటుకుని సాగుతారు. చివరికి జెసెప్‌ని కోర్టుకి రప్పిస్తారు. సాంటియాగోకి తోటి సైనికుల నుంచి ప్రమాదం ఉన్నందువల్లే అతన్ని బదిలీ చేయటానికి నిర్ణయం తీసుకున్నామని చెబుతాడు జెసెప్. తర్వాత డానియెల్ ప్రశ్నల సరళి నాటకీయంగా ఉంటుంది. “క్యూబా నుంచి ఇక్కడికి విచారణ కోసం వచ్చారు కదా. ఎన్ని బట్టలు తెచ్చుకున్నారు? మీ ఫోన్ రికార్డులు చూశాం. మీరు ఇక్కడికి వస్తున్నారని ఇక్కడున్న మీ బంధువులకి, స్నేహితులకి ఫోన్ చేశారు కదా” అని ప్రశ్నిస్తాడు. జెసెప్ అసహనంగానే అవునని చెబుతాడు. డానియెల్ “మీరు ఒక్కరోజు ఇక్కడికి వచ్చినందుకే బట్టలు తెచ్చుకున్నారు. ఫోన్లు చేశారు. మరి సాంటియాగో శాశ్వతంగా బదిలీ అవుతున్నానని, తెల్లవారగానే విమానంలో వెళ్ళిపోతానని తెలిసి కూడా బట్టలు సర్దుకోలేదు. ఎవరికీ ఫోన్ చేయలేదు. ఎందుకంటారు? మీరు బదిలీ చేయాలనుకోలేదు కాబట్టే కదా?” అని అడుగుతాడు. తెలివైన లాయర్లు ఇలాంటి విషయాలు ఆలోచిస్తారు. సాంటియాగో గది పరిశీలించినపుడు అతని బట్టలన్నీ ఇంకా బీరువాలో తగిలించి ఉన్నాయని డానియెల్ గమనించాడు. సాంటియాగో కనీసం తన కుటుంబం వారికి ఫోన్ చేయలేదు. జెసెప్ కాస్త ఇరుకునపడ్డట్టు ఉంటాడు కానీ తెలివైనవాడు కాబట్టి సర్దుకుంటాడు. “అతను తెల్లారకముందే లేచి బట్టలు సర్దుకుందామని అనుకున్నాడేమో. అతనికి స్నేహితులెవరూ లేరేమో. నేను విద్యావంతుడినే గానీ అతని అలవాట్లు, జీవితం గురించి నాకేం తెలుసు?” అంటాడు దర్పంగా. డానియెల్ ఖంగు తిన్నట్టు ఉండిపోతాడు.

డానియెల్ తేరుకుని “కెండ్రిక్ సైనికుల సమావేశంలో సాంటియాగో జోలికి ఎవరూ వెళ్ళవద్దని చెప్పిన తర్వాత సైనికులు ఆ మాటని బేఖాతరు చేసే అవకాశం లేదంటారా?” అని అడుగుతాడు. జెసెప్ “ఆదేశాలు పాటించటమనేది సైన్యంలో అత్యంత ముఖ్యం. లేకపోతే ప్రాణహాని జరగవచ్చు. మా సైనికులు ఆదేశాలు అతిక్రమించరు” అంటాడు. “మరి అలాంటప్పుడు సాంటియాగోకి తోటి సైనికుల నుంచి ప్రమాదం ఉందని ఎందుకన్నారు? మీ ఆదేశాలు పాటించేటట్లయితే సాంటియాగోకి ప్రమాదం ఏముంది? అలాంటప్పుడు బదిలీ అవసరం ఏమిటి? ఇదంతా నాటకం. మీరే కోడ్ రెడ్ చేయమని కెండ్రిక్‌కి చెప్పారు కదా?” అంటాడు డానియెల్. ఈసారి ఖంగు తినటం జెసెప్ వంతవుతుంది. “సత్యమేమిటో నాకు తెలియాలి” అని డానియెల్ రెట్టిస్తాడు. జెసెప్ అగ్గి మీద గుగ్గిలమవుతూ “సత్యాన్ని భరించే శక్తి నీకు లేదు. మా రక్షణలో మీరు హాయిగా ఉంటారు. పైగా మమ్మల్నే ప్రశ్నిస్తారా? అంతగా కావాలంటే తుపాకీ పట్టుకుని సరిహద్దుల్లోకి రండి. లేదంటే మాకు కృతజ్ఞతలు చెప్పి మీదారిన మీరు పొండి” అంటాడు. డానియెల్ వదలకుండా “మీరు కోడ్ రెడ్ ఆదేశించారు కదా?” అంటాడు. “ఔను! నేనే ఆదేశించాను” అంటాడు జెసెప్ అమితాగ్రహంతో. జెసెప్ ఆదేశాల వల్లే సాంటియాగో ప్రాణం పోయిందని తేలటంతో అతన్ని అరెస్టు చేయమని జడ్జీ ఆదేశిస్తాడు. జెసెప్ కోపంతో రగిలిపోతూ డానియెల్‌పై దాడి చేయబోతాడు. అతన్ని మార్షల్స్ ఆపుతారు. కోర్టు నుంచి బయటకు తీసుకునిపోతారు. తర్వాత కెండ్రిక్‌ని అరెస్టు చేయటానికి ఆదేశాలు జారీ అవుతాయి.

జెసెప్ కూడా సాంటియాగో పిరికివాడని, అతన్ని దారిలో పెట్టాలంటే కాస్త భయపెట్టాలని, ఆ భయం వల్ల అతను ఇంకా శ్రమిస్తాడని అనుకున్నాడు. అతనికి ఆరోగ్యం బాగాలేదనే ఆలోచనే జెసెప్‌కి రాలేదు. రహస్యంగా కోడ్ రెడ్ ఆదేశించాడు. దేశరక్షణలో ఎలాంటి సాకులు ఉపేక్షించనని అంటాడు. కానీ పరిస్థితులను సరిగా అవగాహన చేసుకోవాలనే ఆలోచన లేదు. మార్కిన్సన్ చెప్పినా వినలేదు. ఫలితంగా ఒక ప్రాణం పోయింది. తప్పు ఒప్పుకుంటే పరువు దక్కేది. కానీ తన తప్పు లేదని చెప్పుకోవటానికి దొంగ కాయితాలు సృష్టించాడు. అతని ధోరణి ఏమిటంటే ‘కోడ్ రెడ్ సరైన పద్ధతే. మీరు కాదంటే నేను మానను. ఈ పద్ధతులు ఉంటేనే సైన్యం బలపడుతుంది. బలహీనుడైన సాంటియాగో చనిపోయాడంటే అది సైన్యానికి మంచిదే’ అని. మానవత్వం లోపించిందని చెప్పటానికి ఇంతకంటే ఏం కావాలి? ఇక్కడ జాక్ నికల్సన్ నటన గురించి చెప్పుకోవాలి. “యూ కాంట్ హ్యాండిల్ ద ట్రుత్” (సత్యాన్ని భరించే శక్తి నీకు లేదు) అన్న అతని డైలాగ్, అక్కడ అతని నటన చిరస్మరణీయంగా ఉంటాయి. మానవత్వం లేని మనుషులు ఇలాగే ఉంటారు కదా అనిపిస్తుంది.

జెసెప్ అరెస్ట్ తర్వాత ధర్మాసనం తీర్పు ఇస్తుంది. డాసన్, డౌనీ హత్య చేయలేదని తీర్మానిస్తుంది. అయితే ఒక సైనికుడికి ఉండవలసిన లక్షణాలు వారిలో లేవని అంటుంది. వారిని నౌకాదళం నుంచి  డిజానరబుల్ డిశ్చార్జ్ (అమర్యాదపూర్వక ఉద్వాసన) చేస్తున్నట్టు ప్రకటిస్తుంది. అది విని డౌనీ హతాశుడవుతాడు. డాసన్ “సైనికుడంటే సాంటియాగో లాంటి బలహీనులని రక్షించాలి. మనం అతన్ని రక్షించకపోగా అతని చావుకి కారణమయ్యాం. అదే మన తప్పు” అంటాడు. కోడ్ రెడ్ చేసే సమయానికి డాసన్‌కి సాంటియాగో ఆరోగ్య పరిస్థితి తెలియదు. కోర్టు విచారణలో తెలిసింది. ఒక బలహీనుడి మీద దాడి చేసి అతన్ని చంపేశానని అర్థమయింది. అందుకే అతను ధర్మాసనం తీర్పుని అర్థం చేసుకున్నాడు. అసలు తప్పు జెసెప్‌ది. సరైన వైద్యపరీక్షలు చేయించి ఉంటే సాంటియాగో పరిస్థితి తెలిసేది. అతనిలో పశ్చాత్తాపం కూడా లేదు. ఇదంతా మామూలే అన్నట్టు ఉంటాడు. ర్యాగింగ్ లాంటివి కూడా ఎంత విపరీతంగా మారుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఎన్ని నిబంధనలు పెట్టినా ఆగటం లేదు. నిబంధనల వల్ల లాభం లేదు. మార్పు విద్యార్థులలోనే రావాలి. అది జరగాలంటే విద్యావ్యవస్థ మారాలి. ఈ చిత్రం సైన్యం గురించే అయినా నాకు మన విద్యావ్యవస్థతో పోలికలు కనపడ్డాయి. తప్పు చేసినవారికి శిక్షలు పడితే అది గుణపాఠంగా పని చేస్తుంది. కానీ తప్పు చేసిన వారు తప్పించుకోవటానికి సాయం చేసే వారెందరో! అలాంటి సమయాల్లో ధైర్యం గల మంచిమనుషులు కొందరైనా ఉంటే బావుంటుంది. ఈ కాలంలో అది అత్యాశేనేమో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here