[dropcap]మా[/dropcap]నసిక వ్యాధుల గురించి మన దేశంలో అవగాహన తక్కువే. కొన్ని వ్యాధులు పరిస్థితుల వల్ల కలిగితే కొన్ని మెదడులో అనుకోని రసాయనిక చర్య (కెమికల్ రియాక్షన్) వల్ల కలుగుతాయి. ‘లగే రహో మున్నాభాయ్’ (2006) లో మెదడులో అనుకోని రసాయనిక చర్య వల్ల నాయకుడికి గాంధీజీ కనపడతారు. ఆ చిత్రాన్ని తెలుగులో ‘శంకర్ దాదా జిందాబాద్’ గా తీశారు. సినిమా కాబట్టి అలా చూపించారు అనుకోవటానికి వీలు లేదు. నిజానికి దర్శకుడు వాస్తవానికి దగ్గరగానే చూపించాడు. స్కిజోఫ్రేనియా అనే వ్యాధి లక్షణాలు ఇవి. ఈ వ్యాధి ఉన్నవారికి ఏవో మాటలు వినపడుతున్నట్టు, కొందరికి ఎవరో మనుషులు కనపడుతున్నట్టు భ్రమ కలుగుతుంది. ఆ మనుషులు పరిచయమున్న వ్యక్తులో, ప్రముఖ వ్యక్తులో కానక్కరలేదు. ఊహాజనితమైన వ్యక్తులు కూడా కనపడవచ్చు. ఈ వ్యాధి వయోజనులకు వస్తేనే కష్టం, మరి జూనియర్ కాలేజీ వయసున్న కుర్రాడికి వస్తే ఎలా ఉంటుంది? అదే ‘వర్డ్స్ ఆన్ బాత్రూమ్ వాల్స్’ (2020) కథ. నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం. హిందీ శబ్దానువాదం కూడా అందుబాటులో ఉంది.
‘వర్డ్స్ ఆన్ బాత్రూమ్ వాల్స్’ అంటే బాత్రూమ్ గోడలమీద రాతలు. కాలేజీల్లో బాత్రూమ్ గోడల మీద పిచ్చిరాతలు రాయటం కొందరు కుర్రాళ్ళకి అలవాటు. కొన్ని మరీ అసభ్యంగా ఉంటాయి. వాటి విషయం వదిలేస్తే ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి ప్రేమలో పడ్డారా లాంటి రాతలు ఉంటాయి. ఒక అబ్బాయికి మానసిక వ్యాధి – మామూలు భాషలో పిచ్చి – ఉందని తెలిస్తే మిగతా విద్యార్థులకి తెలిస్తే ఎలా ఉంటుంది? బాత్రూమ్‌లో ఎలాంటి రాతలు రాస్తారు? అలాంటి పరిస్థితి రాకుండా గుట్టుగా జూనియర్ కాలేజీ (అమెరికాలో హై స్కూల్ అంటారు) ముగించుకుని పాకశాస్త్ర కళాశాల (Culinary art college) కి వెళ్ళాలని ఆడమ్ తాపత్రయం. అతనికి వంట చేయటమంటే చాలా ఇష్టం. కానీ అతనికున్న వ్యాధి వల్ల అవాంతరాలు ఎదురవుతాయి. క్యాన్సర్ ఉన్నవారికి అందరూ సానుభూతి చూపిస్తారు కానీ మానసిక వ్యాధి ఉన్నవారిని వదిలించుకోవాలనే చూస్తారు అని అతని భావన. మరి అతను అనుకున్నది సాధించాడా?
ఆడమ్ తండ్రి ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు అతని తల్లి బెత్ దుఃఖంలో ఉంటే ఆడమ్ ఆమెకి వంట చేసి పెట్టేవాడు. అలా వంట అంటే ఇష్టం ఏర్పడింది. అయితే కొన్నాళ్లకి అతనికి ఏవో మాటలు వినపడటం మొదలవుతుంది. ఇద్దరు మనుషులు కూడా కనపడుతూ ఉంటారు. ఒకరు ఎప్పుడూ అమ్మాయిల గురించి మాట్లాడే యువకుడు. ఇంకొకరు జెన్ కళని వంటబట్టించుకున్న యువతి. జెన్ కళ అంటే మనకి యోగా ఉన్నట్టే చైనా వాళ్ళకి ఉన్న ఒక పద్ధతి. జెన్ కళలో ఆరితేరినవారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఆడమ్‌కి వీళ్ళే ఎందుకు కనపడతారు అనే ప్రశ్నకి ఎంత పెద్ద వైజ్ఞానికులైనా జవాబు చెప్పలేరేమో! మనకి కలల్లో ఎవరెవరో కనపడుతూ ఉంటారు. ఆ మనుషులు ఎవరో మనకి తెలియకపోవచ్చు. ఎప్పుడో ఎక్కడో మనం చదివినదో, చూసినదో వారి స్వభావంలో కనపడుతుంది. ఇదీ అంతే. ఈ విషయాలేవీ ఆడమ్ బెత్‌కి చెప్పడు. కొన్నాళ్ళకి బెత్ కొత్త ప్రియుడు పాల్ వారితో నివసించటం మొదలుపెడతాడు. ఇలా కొత్త బంధాలు ఏర్పరచుకోవటం పాశ్చాత్య దేశాలలో మామూలే. తల్లి జీవితంలోకి కొత్తగా వచ్చిన మనిషిపై కొడుకు అక్కసుతో ఉండటం ప్రపంచంలో ఎక్కడైనా మామూలే!
ఒకరోజు ఆడమ్ కాలేజీలో ప్రయోగశాలలో ఉండగా ఒక నల్లని పొగ ఆకారంలో ఒక శక్తి తన మీద దాడి చేస్తున్నట్టు అతనికి అనిపిస్తుంది. అక్కడున్న వస్తువులన్నీ గాలిలో వేగంగా సుడి తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అతను కంగారుపడి తప్పించుకోబోతే అతని చేయి తగిలి ఒక రసాయనం అతని స్నేహితుడి చేయి మీద పడుతుంది. చేయి కాలిపోతుంది. ఆడమ్‌ని ఆ శక్తి బారి నుండి కాపాడటానికి ఒక వస్తాదు, అతని ఇద్దరు శిష్యులు దుడ్డుకర్రలతో పోరాడుతున్నట్టు ఆడమ్‌కి కనపడుతుంది. వారు కూడా అతని భ్రమలో భాగమే. ఈ భ్రమలన్నీ అతని వ్యాధి లక్షణాలే. అప్పటి నుంచి ఆ వస్తాదు ఆడమ్‌కి తరచు కనపడుతుంటాడు. ఒక్కోసారి యువకుడు, యువతి, వస్తాదు ముగ్గురూ అతనికి కనపడతారు. ఎవరి సలహాలు వారు ఇస్తూ ఉంటారు. వస్తాదు సాధారణంగా ఆడమ్‌ని ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే దుడ్డుకర్ర ఝళిపిస్తూ “వేసెయ్యమంటావా?” అంటూ ఉంటాడు. ప్రయోగశాలలో దాడి జరుగుతున్న భ్రమ కలిగిన సమయంలో ఆడమ్ ఒక మూల చేరి భయంతో వణికిపోతుంటాడు. నిజానికి అక్కడ ఏమీ జరగలేదు. అతని వింత ప్రవర్తన అందరూ చూస్తారు. పైగా అతని స్నేహితుడికి అతని వల్ల తీవ్రమైన గాయమయింది. దాంతో అతన్ని కాలేజీ నుంచి తొలగిస్తారు. అతనికి స్కిజోఫ్రేనియా అని డాక్టర్లు నిర్ధారిస్తారు. బెత్ కొడుకుని తీసుకుని ఎన్నో హాస్పిటళ్ళ చుట్టూ తిరుగుతుంది. ఆడమ్ ఎన్నో మందులు వాడతాడు. కానీ లాభముండదు. యువకుడు, యువతి, వస్తాదు కనిపిస్తూనే ఉంటారు. కొన్నాళ్ళకి ఒక కొత్త మందు గురించి తెలుస్తుంది. ఆ మందు ఇంకా ప్రయోగాల దశలోనే ఉంటుంది. బెత్ ఎలాగైనా తన బిడ్డ బాగవ్వాలని ఆ ప్రయోగంలో ఆడమ్ పేరు నమోదు చేస్తుంది. అతని కేసు పరిశీలించి అతనికి ఆ మందు ఇవ్వటానికి ఒప్పుకుంటారు కంపెనీ వాళ్ళు. ఆడమ్‌కి తన మీద ప్రయోగాలు చేయటం ఇష్టం ఉండదు. అందుకని మందు వేసుకోనంటాడు. బెత్‌కి మాత్రం ఆ మందు మీద నమ్మకంగా ఉంటుంది.
జూనియర్ కాలేజీ ముగించి పట్టా తీసుకోకపోతే ఆడమ్ పాకశాస్త్ర కళాశాలకి వెళ్ళే అవకాశం ఉండదు. అందుకని అతన్ని ఒక కొత్త కాలేజీలో చేర్చటానికి బెత్, పాల్ అతన్ని తీసుకువెళతారు. అక్కడి ప్రిన్సిపాల్ షరతులు పెడుతుంది. చికిత్స కొనసాగించాలని, మంచి మార్కులు తెచ్చుకోవాలని అంటుంది. అతని వ్యాధి విషయం ఎవరికీ చెప్పకూడదని అందరూ నిర్ణయించుకుంటారు. ఈ సన్నివేశంలో మొదట ఆడమ్‌కి వస్తాదు కనపడి “ప్రిన్సిపాల్‌ని వేసేయమంటావా?” అంటాడు. అతను కాల్చి పారేసిన సిగరెట్టు పడటంతో అక్కడ అంతా తగలబడిపోతున్నట్టు ఆడమ్‌కి భ్రమ కలుగుతుంది. అయితే అది భ్రమ మాత్రమే అతనికి తెలుసు. ఈ సన్నివేశం వినూత్నంగా ఉంటుంది. అందరూ మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. చుట్టూ మంటలు వ్యాపిస్తూ ఉంటాయి. కొత్త చికిత్స ఎలా ఉందని ప్రిన్సిపాల్ అడిగితే “అయామ్ ఆల్ ఫైర్డ్ అప్” అంటాడు. అంటే “నాలో ఏదో జ్వాల రగిలించినట్టు ఉంది” అని. దీనికి రెండర్థాలు! ఆడమ్ పరధ్యానంగా ఉండటంతో పాల్ ఆడమ్‌ని రెట్టిస్తాడు. పాల్ తనని తప్పు చేసినవాడిలా చూస్తున్నాడని తర్వాత బెత్‌తో అంటాడు ఆడమ్. అతని మనసు మంచిదని అంటుంది బెత్. కొత్త మందు వేసుకుంటే అంతా సర్దుకుంటుందని అంటుంది.
కాలేజీలో ఆడమ్‌కి మాయా అనే అమ్మాయి పరిచయమవుతుంది. ఆమె చాలా తెలివైనది. బాగా చదువుతుంది. కాలేజీలో ఇతర కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటుంది. అయితే కాస్త వ్యాపారధోరణి ఉంటుంది. అవసరమైన వాళ్ళకి హోమ్ వర్క్, అసైన్‌మెంట్లు చేసి పెట్టి డబ్బులు తీసుకుంటుంది. ఆమె ఒక విద్యార్థి దగ్గర డబ్బులు తీసుకుంటుండగా ఆడమ్ చూస్తాడు. ఆమె అతని దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. అతనికి ఆ సమయంలో యువకుడు, యువతి, వస్తాదు కనపడుతూ ఉంటారు. యువకుడు, యువతి మాయాతో ఎలా మాట్లాడాలో సలహాలు ఇస్తూ ఉంటారు. ఆడమ్ అటూ ఇటూ చూస్తూ ఉంటే మాయా “నీకు ఏమన్నా తేడానా?” అంటుంది. వస్తాదు కోపంగా ఆమె మీద దాడి చేయబోతాడు. ఆడమ్ “వద్దు” అంటాడు గట్టిగా. మాయా విస్తుపోతుంది. “నాకు అప్పుడప్పుడూ విపరీతమైన తలనొప్పి వస్తూ ఉంటుంది. అందుకే ఇలా” అని అబద్ధం చెబుతాడు. “నిన్ను కాస్త బెదిరిద్దామని వచ్చాను కానీ నీ వల్ల పెద్ద ప్రమాదమేమీ లేదని అర్థమైంది. నీకేమైనా సాయం కావాలంటే చెప్పు” అని ఆమె వెళ్ళిపోతుంది. ఆమె ఆత్మవిశ్వాసం చూసి అతను అబ్బురపడతాడు. అతనికి లేనిది అదే. అబ్బాయిలకి అమ్మాయిలెవరైనా నచ్చితే చావటానికి కూడా సిద్ధపడతారు. ఆడమ్ మాయాకి చేరువయే అవకాశం కోసం తన భ్రమలని వదిలించుకోవాలని అనుకోవటంలో వింతేముంది? అందుకే మందు వేసుకోవటం మొదలుపెడతాడు. కొత్త కాలేజీలో చేరిన మొదట్లో అతనికి మార్కులు తక్కువ వస్తూ ఉంటాయి. అందుకని బెత్‌ని, పాల్‌ని ఒప్పించి మాయా చేత ట్యూషన్లు చెప్పించుకోవటం మొదలుపెడతాడు. మాయాకి కావాల్సిన డబ్బులు ముడుతూ ఉంటాయి. మందులు వాడటంతో కొన్నాళ్ళకి అతని భ్రమలు తగ్గిపోతాయి. యువకుడు, యువతి, వస్తాదు కనపడటం మానేస్తారు. మార్కులు కూడా బాగా వస్తుంటాయి.
ఆడమ్ మందు వేసుకోవటానికి ఇంకో కారణం కూడా ఉంది. బెత్ పాల్ ప్రేమలో సాంత్వన పొందుతోందని ఆడమ్ గమనిస్తాడు. అతనికి మెదడులో ఘర్షణ జరుగుతూ ఉంటుంది. “నువ్వు నీ తల్లి జీవితాన్ని పాడు చేస్తున్నావు. నీలాంటి కొడుకుని ఆమె కోరుకోలేదు. నీ తండ్రి నీలో ఏదో లోపముందని తెలిసే వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళకి నీ సంగతి అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు నీ తల్లి కూడా నిన్ను వదిలేస్తుంది” అని మాటలు వినిపిస్తూ ఉంటాయి. సాధారణంగా మనం మానసిక వ్యాధి ఉన్నవాళ్ళ గురించి విన్నపుడు వారి కుటుంబంలోని వారి మీద సానుభూతి చూపిస్తాం. కానీ వ్యాధి బారిన పడ్డవారి గురించి ఎంతమంది ఆలోచిస్తారు? వారి మనసులో ఎంత ఘర్షణ ఉంటుందో మనం చెప్పగలమా? ఆడమ్ తాను తన తల్లి సంతోషానికి అడ్డు అని అనుకున్నాడు. నిజానికి ఆమె అతని కోసం తాపత్రయపడుతోంది. అవగాహన లేని వారైతే ‘నీకే ఎందుకు ఇలా జరిగింది?’ అని అతని ముందే విలపించవచ్చు. కానీ ఆమె ‘ఇదొక వ్యాధి. వ్యాధి ఎవరికైనా రావచ్చు. దీన్ని ఎదుర్కొందాం’ అనే ఆలోచించింది. అతను ‘నేను లేకపోతే అమ్మ సంతోషంగా ఉంటుంది కదా’ అనుకోవటం మొదలుపెట్టాడు. ఇదే విషాదం. అందరూ మంచివాళ్ళే. అయితే అందరూ విధికి తల వంచవలసిందే. ఆడమ్ మందు వేసుకుంటూ ఉంటే క్రమంగా అతని భ్రమలు మాయమవుతాయి. అయితే అప్పుడప్పుడూ అతని చేతులు వణుకుతూ ఉంటాయి. ఒకరోజు మాయాతో డేట్కి కూడా వెళతాడు. అయితే తన పరిస్థితి గురించి ఏమీ చెప్పడు. పాత కాలేజీలో తాను ఎవరితోనో గొడవపడ్డానని, అందుకే కాలేజీ నుంచి పంపించేశారని చెబుతాడు. ఆమె తెలివైనది. అతను గొడవపడే రకం కాదని ఆమెకి తెలుసు. అయినా అతన్ని ఎక్కువ వివరాలు అడగదు.
మాయా డబ్బులు తీసుకుని ఇతర విద్యార్థులకి పని చేసిపెడుతోందని ప్రిన్సిపాల్‌కి తెలిసిపోతుంది. అయితే ఆమె స్టార్ విద్యార్థి కాబట్టి ఆమెని కాలేజీ నుంచి తొలగించదు. కానీ అప్పటి నుంచి మాయా ఆడమ్‌కి ట్యూషన్ చెప్పటం మానేస్తుంది. అతను ఆమెకి తన వ్యాధి గురించి ఏమన్నా తెలిసిందా అని భయపడతాడు. ఆమెతో మాట్లాడటానికి ఆమె ఇంటికి వెళతాడు. అయితే అది ఆమె ఇల్లు కాదు. ఆమె అసలైన ఇల్లు ఏదో తెలుసుకుని అక్కడికి వెళతాడు. ఆమె తండ్రి ఇళ్ళకి మరమ్మత్తులు చేసే చిన్న తరహా కాంట్రాక్టరు. అయితే అతనికి కాలు విరగటంతో ఇంట్లోనే ఉంటాడు. మాయా తల్లి మరణించింది. మాయాకి ఇద్దరు తమ్ముళ్ళు. ఇల్లు గడవటం కష్టంగా ఉంటుంది. అందుకు ఆమె ఒక రెస్టారెంట్లో పని చేస్తూ ఉంటుంది. ట్యూషన్ మానేయటానికి కారణం అదే. మాయా పనికి వెళ్ళిందని, వచ్చేస్తుందని ఆమె తండ్రి ఆడమ్ ని లోపలికి ఆహ్వానిస్తాడు. ఇంట్లో అందరూ ఫ్రీజర్లో పెట్టిన రెడీమేడ్ పదార్థాలు తింటుంటే ఆడమ్ తాను వంట చేసి పెడతాడు. మాయా తిరిగివచ్చి తన సంగతి అతనికి తెలిసిపోయిందని అక్కసుతో ఉంటుంది. తర్వాత ఇద్దరూ ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె అతనితో “మా పేదబతుకులు చూసి జాలిగా ఉందా?” అంటుంది. అతను ఆమెని సముదాయిస్తాడు. అతను ఆమెకి తన పరిస్థితి గురించి చెప్పాలని అనుకున్నాడు. కానీ ఆమె పరిస్థితి చూసి ఏమీ చెప్పలేకపోయాడు. ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. మన కష్టాలే పెద్దవి అని అనుకుంటాం. మన కంటే కష్టాలు పడేవాళ్ళు ఎందరో ఉంటారు. ‘నాకే ఎందుకు ఇలా జరిగింది?’ అనుకోవటం బలహీనత. మన పరిస్థితులను అధిగమించటమే మనం చేయాల్సిన పని. మనకు లేని దాని గురించి బాధ పడటం కన్నా ఉన్న దాన్ని చూసి కృతజ్ఞతగా ఉండటమే సరైన దృక్పథం.
అయితే ఆడమ్‌కి మరో అవాంతరం వస్తుంది. అతను వేసుకునే మందు కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. చేతులు వణకటం ఎక్కువవుతుంది. కళ్ళు తిరుగుతూ ఉంటాయి. నాలుక రుచి పసిగట్టటం మానేస్తుంది. దీని కారణంగా వంట సరిగా చేయలేడు. బెత్‌కి చేప్పేవాడేమో కానీ అదే సమయంలో ఆమె తాను గర్భవతినని చెబుతుంది. “ఇలాంటి సమయంలో అనుకోకుండా గర్భం వచ్చింది. కానీ నీకు నేను ఎప్పుడూ అండగా ఉంటాను” అంటుంది. ఇన్ని కొత్త విషయాలు తెలియటంతో అతనికి ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ తప్పించుకోవటానికి అతను మందు వేసుకోవటం మానేస్తాడు. దాంతో అతని భ్రమలు మళ్ళీ మొదలవుతాయి. యువకుడు, యువతి, వస్తాదు మళ్ళీ కనిపించటం మెదలవుతుంది. తనని అందరూ వదిలించుకోవాలని చూస్తున్నారని, అందుకే తన తల్లి వేరే బిడ్డని కంటోందని అతని మెదడు అతనికి చెబుతూ ఉంటుంది. మాయాకి దగ్గరవుతాడు. కానీ ఆమెకి తన వ్యాధి సంగతి చెబితే ఆమె తనకు అండగా నిలబడటం కోసం తన జీవితాన్ని కూడా పాడు చేసుకుంటుందని అతని భయం. ఒకరోజు కాలేజీలో ఆమెని కసురుకుంటాడు. ఇది ప్రిన్సిపాల్ చూస్తుంది. ఇదిలా ఉండగా బెత్‌కి అతను మందు వేసుకోవటం మానేశాడని తెలుస్తుంది. “సైడ్ ఎఫెక్ట్స్ గురించి నాకెందుకు చెప్పలేదు” అని బెత్ అంటే “నీకు చెప్పి లాభమేంటి? పాల్ వచ్చినప్పటి నుంచి అంతా మారిపోయింది” అంటాడు. పాల్ ప్రిన్సిపాల్‌కి ఈమెయిల్ చేస్తుండగా ఆడమ్ చూస్తాడు. అతనికి భయం ఎక్కువవుతుంది. పాల్ ఏం చేశాడు? ప్రిన్సిపాల్ ఎలా స్పందించింది? బెత్ ఏమన్నా చేయగలిగిందా?
జూలియా వాల్టన్ రాసిన నవల ఆధారంగా నిక్ నవేదా ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే వ్రాశాడు. థోర్ ఫ్రాయిడెంతాల్ దర్శకత్వం వహించాడు. ఆడమ్‌గా చార్లీ ప్లమర్, బెత్‌గా మాలీ పార్కర్, మాయాగా టేలర్ రసెల్ నటించారు. బెత్‌గా నటించిన మాలీ పార్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒక తల్లికి బిడ్డ మీద ఉండే ప్రేమ, బిడ్డ తనని మాటలంటున్నా భరించే ఓర్పు, కుంగిపోకుండా నిలబడే ధైర్యం అన్నీ ఉన్న పాత్ర ఇది. మాలీ పార్కర్ చక్కగా పోషించింది. కాలేజీలో ఉండే చర్చ్‌లో ఫాదర్‌గా ఆండీ గార్సియా నటించాడు. కేవలం వైజ్ఞానికంగానే కాకుండా మతపరంగా కూడా ఆడమ్ వ్యాధిని పరిశీలించటం మెచ్చుకోదగ్గ విషయం. కొన్ని ప్రశ్నలకి విజ్ఞానం సమాధానం ఇవ్వలేదు. అప్పుడు విశ్వాసమే నడిపిస్తుంది. ఆడమ్ తనకి దేవుడంటే నమ్మకం లేదని అంటాడు. “పాపాలు దాచుకునే వాడు బాగుపడడు” అని ఫాదర్ ఆడమ్‌తో అంటాడు. ఇక్కడ పాపం అనే మాట ఘాటుగా ఉంటుంది, కానీ ఉద్దేశమేమిటంటే సత్యాన్ని ఆమోదించాలి. సత్యాన్ని దాచటం కూడా తప్పే. పైగా దాచిన సత్యం బయటపడుతుందనే భయం అనుక్షణం వేధిస్తుంది. ఇలాంటి విషయాలు విజ్ఞానం చెప్పదు. మతం, మంచి సాహిత్యం చెబుతాయి. అందుకే విజ్ఞానంతో పాటు మంచి విలువలు బోధించటం కూడా అవసరం.
ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు.
ప్రిన్సిపాల్ బెత్‌ని, పాల్‌ని పిలిపించుకుని మాట్లాడుతుంది. ఆడమ్ మందు వేసుకోవటం మానేశాడని తెలిసి అతన్ని సస్పెండ్ చేస్తుంది. అతను పూర్తిగా కుంగిపోతాడు. ఇంటికొచ్చాక తల్లితో గొడవపడతాడు. పాల్ కావాలనే ఇదంతా చేశాడని, తనని మానసిక వైద్యశాలకి పంపించేయాలని అతని ప్రయత్నమని అంటాడు. బెత్ అతన్ని సముదాయించాలని ప్రయత్నిస్తుంది. కానీ ఆడమ్ వినడు. ఆరోజు రాత్రి కాలేజీలో ఒక పార్టీ జరుగుతూ ఉంటుంది. ఆడమ్ మాయాతో కలిసి వెళదామనుకుంటాడు కానీ సస్పెండ్ అయ్యాడు. అయినా వెళ్ళటానికే నిశ్చయించుకుంటాడు. అయితే వెళ్ళే ముందు మందు బిళ్ళలు ఎక్కువ వేసుకుని వెళతాడు. అలా అయితే తనకి భ్రమలు కలగకుండా ఉంటాయని అతని ఆశ. కానీ అక్కడ అతనికి తన మీద ఏదో దాడి జరుతున్నట్టు అనిపిస్తుంది. ప్రిన్సిపాల్ అతన్ని ఎందుకు వచ్చావని ప్రశ్నిస్తుంది. అతను ఆమెని తోసి పారిపోతాడు. దాడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుండగా పై అంతస్తు నుంచి కింద పడతాడు.
లేచేసరికి హాస్పిటల్లో ఉంటాడు. బెత్, పాల్ అక్కడే ఉంటారు. అయితే ఆడమ్ బెల్టులతో మంచానికి కట్టేయబడి ఉంటాడు. అతను ప్రమాదకరంగా ఉన్నాడని డాక్టర్లు ఆ పని చేస్తారు. మాయా అతన్ని చూడటానికి వస్తుంది. ఆమె తనని ఆ పరిస్థితిలో చూడటం అతనికి ఇష్టం ఉండదు. కోపంతో అందర్నీ వెళ్ళిపొమ్మంటాడు. అతన్ని ఒక మానసిక వైద్యశాలలో పెడతారు. ఒకరోజు ఫాదర్ అతన్ని చూడటానికి వస్తాడు. ఆ రోజే కాలేజీలో గ్రాడ్యుయేషన్ జరగబోతోందని చెబుతాడు. “మన లోపాలు అంగీకరిస్తేనే మనకి వాటిని ఎదుర్కొనే శక్తి వస్తుంది” అని చెబుతాడు. ఆడమ్‌తో కలిసి ప్రార్థన చేస్తాడు. తర్వాత అతని తల్లి అతన్ని చూడటానికి వస్తుంది. ఒక ఉత్తరం ఇస్తుంది. అది పాల్ ప్రిన్సిపాల్‌కి రాసిన ఉత్తరం. అందులో అతను “ఆడమ్‌ని కాలేజీ నుంచి తొలగించాలనుకోవటం అమానవీయం. మీరు అసంబద్ధమైన భయంతో సంకుచితంగా ఆలోచిస్తున్నారు. మా అబ్బాయిని సంకుచితమైన ఆలోచన ఉన్నవారి నుంచి కాపాడటం నా కర్తవ్యం. మీరు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను” అంటాడు. ప్రిన్సిపాల్ ఆడమ్‌ని తొలగించాలని అనుకుంది. పాల్ వ్యతిరేకించాడు. ఆడమ్ మందు వేసుకోవటం మానేశాడని బెత్ నిజాయితీగా చెప్పింది. ఆడమ్ ప్రవర్తనలో మార్పుకి కారణం మందు మానేయటమేనని తెలియటంతో ప్రిన్సిపాల్ అతన్ని కేవలం కొన్నాళ్ళు సస్పెండ్ చేసింది. ఈలోగా మళ్ళీ అతను గాడిన పడతాడని అందరి ఆశ. ఆడమ్ అపోహల వల్ల పరిస్థితి క్షీణించింది.
ఆడమ్ ఉత్తరం చదివాక పరుగున వెళ్ళి హాస్పిటల్ కింది అంతస్తులో ఉన్న పాల్‌ని కలుసుకుని అతన్ని కౌగిలించుకుంటాడు. బెత్, పాల్ ఉండగా తనకి ఏ భయం అవసరం లేదని అతనికి అర్థమవుతుంది. గ్రాడ్యుయేషన్‌కి తీసుకెళ్ళమని బెత్‌ని, పాల్‌ని అడుగుతాడు. అందరూ కలిసి వెళతారు. వేదిక మీద పట్టాలు ఇస్తూ ఉంటారు. ఆడమ్ వెళ్ళి ప్రిన్సిపాల్ చేతిలో నుంచి మైకు తీసుకుంటాడు. ఫాదర్ ప్రిన్సిపాల్‌కి అతన్ని మాట్లాడనివ్వమని సంజ్ఞ చేస్తాడు. మాయా ఇతర విద్యార్థులతో కలిసి వింటూ ఉంటుంది. ఆడమ్‌కి ఒక నల్లని పొగ అతని మీద దాడి చేస్తున్నట్టు అనిపిస్తుంది. అయినా ధైర్యంగా నిలబడి “నాకు నా పట్టా కావాలి. లేకపోతే నా ఆశలు నెరవేరవు. నాకు స్కిజోఫ్రేనియా ఉంది. అది మెదడులో అవాంఛిత రసాయన చర్య వల్ల వచ్చే వ్యాధి. దాని వల్ల నాకు భ్రమలు కలుగుతాయి” అంటాడు. నల్లని పొగ నెమ్మదిగా మాయమవుతుంది. “నాకు నా వాళ్ళు ఎంతో సాయం చేశారు. కానీ నేను వారిని దూరం చేసుకున్నాను. అందరిలా ఉండాలని కోరుకున్నాను. బాత్రూమ్ గోడల మీదకి నా పేరు ఎక్కకూడదని అనుకున్నాను. నేను ప్రేమించినవారి నుంచి నిజం దాచాను. వాళ్ళ జీవితాలు నేను పాడు చేస్తున్నానని అనుకున్నాను. నా వ్యాధి కారణంగా నన్ను ఎవరూ ప్రేమించరని అనుకున్నాను. నేను అందరిలా లేనని నన్ను కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. నాకు వ్యాధి ఉంది నిజమే, కానీ అదే నా గుర్తింపు కాదు” అంటాడు. బెత్, పాల్ లతో కలిసి బయటికి నడుస్తాడు. మాయా వెనకాలే వస్తుంది. యువకుడు, యువతి, వస్తాదు కూడా అతనికి కనిపిస్తూ ఉంటారు. అతను మాయాతో “నాకు భ్రమలు జీవితాంతం ఉంటాయి. మందులు పని చేయకపోవచ్చు. నా కోసం నీ జీవితం పాడు చేసుకోవద్దు” అంటాడు. ఆమె “నా నిర్ణయం కూడా నువ్వే తీసుకుంటే ఎలా? ఐ లవ్యూ” అని అతన్ని ముద్దు పెట్టుకుంటుంది. వేదిక మీద అతను మాట్లాడిన మాటలు బయటకు పొక్కటంతో కాలేజీ యాజమాన్యాన్ని అందరూ తప్పు పడతారు. ఆడమ్‌కి కాలేజీ వాళ్ళు పట్టా ఇస్తారు. దానితో అతను పాకశాస్త్ర కళాశాలకి వెళతాడు.
చివరికి ఆడమ్ “నిజాయితీ, ప్రేమ ఉంటే పిచ్చి తగ్గుతుందని నేను చెప్పటం లేదు. కానీ అవి ఉంటే పరిస్థితులు మెరుగవుతాయి. మనం ప్రేమించేవారి దగ్గర నిజాలు దాచకూడదు. మన లోపాలు వారికి తెలియాలి. ప్రేమంటే గుణాలే కాదు, లోపాలు కూడా స్వీకరించటమే” అంటాడు. మందులు మానసిక వ్యాధులను నయం చేయకపోవచ్చు. కానీ సొంతవాళ్ళ ప్రేమ ఉంటే భ్రమలను తట్టుకునే ధైర్యం వస్తుంది. ఈ చిత్రంలో ఆడమ్‌కి ప్రేమకి కొదవలేదు. కానీ తాను ప్రేమకి అర్హుణ్ణి కాదని అనుకున్నాడు. అది సమాజం తప్పు. మానసిక వ్యాధి ఉన్నవారిని వివక్షతో చూడకూడదు. జాగ్రత్తగా ఉంటూనే వారికి ప్రేమని పంచాలి. అది వ్యాధి మాత్రమే అని వారికి భరోసా ఇవ్వాలి. వారు అన్ని చదువులూ చదవలేక పోవచ్చు, అన్ని ఉద్యోగాలూ చేయలేకపోవచ్చు. కానీ వారికి నచ్చిన పనేదో వారిని చేసుకోనివ్వవచ్చు. అమెరికా లాంటి దేశాలలో ఈ అవగాహన ఎక్కువ ఉంది. అయినా వివక్ష తప్పడం లేదు. మరి మన దేశంలో అవగాహన కూడా తక్కువే. అది పెరగాలని ఆశిద్దాం.