Site icon Sanchika

మరుగునపడ్డ మాణిక్యాలు – 49: వింటర్ స్లీప్

[dropcap]చి[/dropcap]న్న ఊళ్ళలో సంపన్న కుటుంబాలు ఒకటో రెండో ఉంటాయి. ఎక్కువ ఆస్తులు వారివే ఉంటాయి. వారి మీద ఆధారపడి బతికేవారు చాలామంది ఉంటారు. ఒకప్పుడు అంతరాలు చాలా ఉండేవి. ఇప్పుడు అందరూ సమానమనే భావన పెరిగింది. అయితే సంపన్నులలో ఒకరకమైన అక్కసు ఉంటుంది. ‘నా మీద ఆధారపడి ఉన్నవారు నన్ను లెక్క చేయకపోవటమేమిటి?’ అనుకుంటారు. ఇంకోపక్క ‘నేను సమాజానికి ఇంకా ఏమైనా చేయాలా?’ అనే ఆలోచన కొంతమందిలో ఉంటుంది. దానాలు చేద్దామని ఉంటుంది. కానీ అపాత్రదానమౌతుందా అనే ఆలోచన పీడిస్తూ ఉంటుంది. ఒకవేళ అవసరమైనవారికి దానం చేయాలన్నా వందసార్లు ఆలోచిస్తారు. ఇంటిలో గొడవలు మామూలే. చిన్న ఊళ్ళో ఉండటం కన్నా నగరంలో ఉండొచ్చు కదా అనే కోరిక ఉంటుంది. ఇలాంటి ఘర్షణని ప్రభావవంతంగా చూపించిన టర్కిష్ చిత్రం ‘వింటర్ స్లీప్’ (2014). అర్థికంగా స్థిరంగా లేనివారిని వదిలేసి సంపన్నవర్గాల ఘర్షణని చూపించటమేమిటి అని కొందరు అనవచ్చు. అన్ని కథలూ చెప్పటమే కళాకారుల పని. జమీందారీలు పోయి అర్థికంగా చితికిపోయినా పైకి మాత్రం పటాటోపంగా ఉండేవారి కథలు చూశాం. కానీ పెద్దల ఆస్తులు అనుభవిస్తూ చుట్టూ ఉన్నవారితో పొసగక బాధపడే ఒక సంపన్నుడి కథ ఇది. చుట్టూ ఉన్నవారంటే బయటివారే కాదు ఇంట్లోవారు కూడా.

ఈ చిత్రంలో చాలా భాగం సంభాషణలతోనే నడుస్తుంది. కేవలం మాటలతో ఒరిపిడి (ఫ్రిక్షన్) ఎలా పుడుతుందో చూసి నిజంగా అబ్బురపడాల్సిందే. మొదట్లో వచ్చే ఒక సన్నివేశంలో తప్ప ఒకరి మీద ఒకరు సవాళ్ళు చేసుకోవటం ఉండదు. కళ్ళెర్ర జేయటం ఉండదు. అభిప్రాయాలు చెప్పటంతోనే ఒరిపిడి పుడుతుంది. మూడు గంటల చిత్రం మాటలతో నడిపించి ఎక్కడా బోరు కొట్టకుండా తీసిన దర్శకుడు నూరీ బిల్గే జెయ్లాన్ నిజంగా గొప్ప దర్శకుడనే చెప్పాలి. ఈ చిత్రానికి కాన్ చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రం అవార్డు దక్కింది. మూబీలో లభ్యం. ‘వింటర్ స్లీప్’ అంటే శీతాకాలం విరామం. కథానాయకుడికి చెందిన హోటల్ శీతాకాలం రావటంతో నెమ్మదిగా ఖాళీ అయిపోతుంది. ఆ సమయంలో జరిగిన సంఘటనల సమాహరమే ఈ చిత్రం. శీతాకాలంలో తుర్కియే (టర్కీ) లో మంచు బాగా కురుస్తుంది. చలి విపరీతంగా ఉంటుంది. బయట మంచు ముసురుకున్నట్టే ఈ చిత్రంలోని పాత్రల మనసుల్లో అసంతృప్తులు ముసురుకుంటాయి. మంచులో ఒక్కోసారి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కష్టమే. అలాంటిదే అసంతృప్తులతో పెనుగులాడటం కూడా.

ఆయ్దిన్ తుర్కియేలో ఒక ఊళ్ళో ఉండే సంపన్నుడు. అక్కడ కొండల మీద ఇళ్ళు కొండలను తొలిచి కట్టినవి. చూడటానికి ఎంతో విశిష్టంగా ఉంటాయి. ఆ ఊరికి వేసవిలో పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఆయ్దిన్ తన విశాలమైన ఇంటిలో కొంత భాగం హోటల్‌గా మార్చాడు. హోమ్ స్టే లాగన్నమాట. పర్యాటకులు వచ్చి అక్కడ ఉంటారు. ఆయ్దిన్‌కి ఆ ఊళ్ళో వేరే ఇళ్ళు, దుకాణాలు కూడా ఉన్నాయి. వాటిని అద్దెకి ఇచ్చేశాడు. ఒకప్పుడు నాటకాలలో నటించేవాడు. ప్రస్తుతం చాలా సమయం తన స్టడీ రూమ్‌లో కూర్చుని ల్యాప్‌టాప్ సహాయంతో పరిశోధన చేస్తూ ఉంటాడు. టర్కిష్ రంగస్థలం గురించి ఒక పుస్తకం రాయాలని అతని ఆశ. స్థానిక పత్రిక కోసం వ్యాసాలు కూడా రాస్తూ ఉంటాడు. అయితే ఇంకా జమీందారీ లక్షణాలు పోలేదు. అతనికి హిదాయత్ అనే ఒక సహాయకుడు ఉంటాడు. అన్ని పనులూ చేస్తూ ఉంటాడు. ఆయ్దిన్ అద్దెలు సరిగా రావటం లేదని, చట్టంలో అద్దెకున్నవారికి రక్షణ ఎక్కువగా ఉందని వాపోతూ ఉంటాడు. “ఒక్కోసారి అంతా అమ్మేద్దామని అనిపిస్తుంది” అంటాడు హిదాయత్‌తో. “మీరు మరీ మెతకగా ఉంటారు. అందుకే వీళ్ళు అలుసు తీసుకుంటున్నారు” అంటాడు హిదాయత్.

ఒకరోజు వారిద్దరూ ఒక జీపులో వస్తూ ఉంటే ఒక కుర్రాడు జీపు మీద రాయి విసురుతాడు. అద్దం పగులుతుంది. ఆ కుర్రాడిని ఇంటికి తీసుకువెళ్ళి అతని తండ్రి ఇస్మాయిల్‌తో మాట్లాడతాడు హిదాయత్. ఆయ్దిన్ దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఇస్మాయిల్ గంభీరంగా ఉంటాడు. మాటా మాటా పెరుగుతుంది. అసలు జరిగిందేమిటంటే ఇస్మాయిల్ ఉండే ఇల్లు ఆయ్దిన్‌కి చెందినది. అతను కొన్ని నెలలుగా అద్దె చెల్లించలేదు. అందుకని హిదాయత్ కొందరు మనుషులను పంపిస్తే వాళ్ళు ఇస్మాయిల్ ఇంటిలోని టీవీ, ఫ్రిజ్ తీసుకొచ్చారు. అడ్డుపడిన ఇస్మాయిల్‌ని కొట్టారు. పరువు పోయిందని ఇస్మాయిల్‌కి కోపం. తండ్రిని కొట్టారని పిల్లవాడికి కోపం. అందుకే జీపు అద్దం పగలగొట్టాడు. ఇస్మాయిల్ పిల్లవాడిని చెంప దెబ్బ కొడతాడు. తర్వాత తన పరువు తీసినందుకు హిదాయత్ మీద దాడి చేయటానికి ప్రయత్నిస్తాడు. హిదాయత్ ఎదురు తిరుగుతాడు. అప్పుడే వచ్చిన ఇస్మాయిల్ తమ్ముడు హామ్దీ అడ్డుపడతాడు. అన్నని లోపలికి పంపిస్తాడు. హిదాయత్‌కి, ఆయ్దిన్‌కి క్షమాపణలు చెబుతాడు. అద్దె త్వరలో తెచ్చేస్తానని అంటాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత హిదాయత్‌ని తిట్టుకుంటూ లోపలికి వెళతాడు.

ఆస్తులు ఆయ్దిన్ తండ్రి అజమాయిషీలో ఉన్నపుడు అంతా సామరస్యంగా ఉండేదని హామ్దీ అంటాడు. ఇది నిజమేనా? అంటే అప్పట్లో పరిస్థితులు బావుండేవని సూచన. ఇస్మాయిల్ జైలుకి వెళ్ళొచ్చాడు. అతనికి ఉద్యోగం దొరకట్లేదు. హామ్దీ ఇమామ్ (ఇస్లామ్ మతగురువు) గా పనిచేస్తాడు. అతని సంపాదనతోనే ఇల్లు గడవాలి. అతను ఆయ్దిన్ దగ్గరకు వచ్చి “మమ్మల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టకండి. మా బాల్యమంతా ఆ ఇంట్లోనే గడిచింది. కొన్నాళ్ళు గడువు ఇవ్వండి” అంటాడు. ఆయ్దిన్ “ఇలాంటి విషయాలు చూసుకోవటానికి హిదాయత్ ఉన్నాడు. లాయర్లు ఉన్నారు. నాకు ఈ విషయాలు తెలియవు. మీరు హిదాయత్‌తో మాట్లాడండి” అంటాడు. నిజానికి ఆయ్దిన్‌కి హామ్దీ మీద మంచి అభిప్రాయం లేదు. వారు అద్దెకున్న ఇంటికి వెళ్ళినపుడు అతను పరిసరాలను గమనించాడు. అక్కడ పరిశుభ్రత లేదు. పాత వస్తువులు చెల్లాచెదురుగా ఉన్నాయి. మతగురువు పరిశుభ్రత పాటించాలి కదా అని అతని వాదన. పైగా అతను లోపల ఒకటి ఉంచుకుని పైకి ఒకటి మాట్లాడతాడని అంటాడు. ఇదీ నిజమే. హామ్దీ హిదాయత్‌ని తిట్టుకోవటం ప్రేక్షకులగా మనం చూస్తాము. అయ్దిన్ మతాన్ని పాటించడు కానీ మతగురువు ఎలా ఉండాలో అని అతనికి కచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి.

ఒకప్పుడు అందరూ మతాన్ని పాటించేవారు. మతగురువులకి ప్రాముఖ్యం ఉండేది. వారి పోషణ ఊరివాళ్ళే చూసుకునేవారు. క్రమంగా మతాన్ని పాటించనివారు పెరిగారు. మతగురువులకి ప్రాముఖ్యం తగ్గింది. వారు జీవనోపాధి కోసం ఉద్యోగాలు చేసుకోవటం మొదలుపెట్టారు. ఇస్మాయిల్ లాంటి కొందరు అభాగ్యులు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చాయి. జైలుకి వెళితే చిన్న ఊళ్ళో అందరికీ తెలిసిపోతుంది. బతకటమే కష్టమైపోతుంది. హామ్దీ లౌక్యంగా ఉంటాడన్నమాట నిజమే. కానీ మతాన్ని పాటించనివారు మతం పేరు చెప్పి హామ్దీ లాంటివారిని తప్పుపట్టడం సబబేనా? వారి జీవితాలు అలా కావటానికి మతం పాటించనివారు ఒక కారణం కాదా? ఆయ్దిన్ తండ్రి మతం మీద గౌరవంతో వారి కుటుంబాన్ని ఆదరించాడేమో. ఇప్పుడు ఆయ్దిన్ మతం పేరు చెప్పి వారిని కించపరుస్తున్నాడు.

ఆయ్దిన్ భార్య నిహాల్. ఆమె అతనికన్నా వయసులో చాలా చిన్నది. ఆమెకి ఓ ప్రత్యేకమైన గది ఉంటుంది. ఆమెను కలుసుకోవటానికి ఒక టీచర్ వస్తుంటాడు. వారిద్దరూ కలిసి సమాజ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించిన విషయాలు మాట్లాడటానికి టీచర్ వస్తుంటాడు. ఆయ్దిన్ అప్పుడప్పుడూ అనుమానంతో బయటి నుంచి దొంగచాటుగా ఆమె గదిలోకి చూస్తూ ఉంటాడు. ఆయ్దిన్ చెల్లెలు నెజ్లా. ఆమె కూడా ఆయ్దిన్ ఇంట్లోనే ఉంటుంది. ఆమె తండ్రి ఆ ఊళ్ళో కొన్ని ఇళ్ళు ఆమె పేర్న రాశాడు. ఆమె పూర్తి కథ మనకి తర్వాత తెలుస్తుంది. అందరూ చదువుకున్న వాళ్ళే. ఆయ్దిన్ స్టడీ రూమ్‌లో ఉన్నప్పుడు అక్కడికి స్వతంత్రంగా వచ్చేది నెజ్లా మాత్రమే. నిహాల్ కూడా రాదు. నెజ్లా కాస్త దూరంగా కూర్చుని పత్రికలు చదువుతూ కాలక్షేపం చేస్తుంది. అతను వ్రాసే వ్యాసాల గురించి మాట్లాడుతూ “స్థానిక పత్రికలో వ్రాసి ఏం ప్రయోజనం? ఏదైనా పెద్ద ప్రత్రికలో రాయొచ్చు కదా” అంటుంది. ఆయ్దిన్ “నాది చిన్న రాజ్యమే కావచ్చు, కానీ నేనిక్కడ రాజుని” అంటాడు. అతను మాట్లాడేది పత్రిక గురించి కాదు, ఆ ఊరి గురించి అని అనిపిస్తుంది. స్థానికంగా తన మాట చెల్లాలని అతని ఆశ. హామ్దీ పేరు వాడకుండా మతగురువుల గురించి ఒక వ్యాసం వ్రాస్తాడు. మతగురువులు ఆదర్శంగా ఉండకుండా మతాన్ని కించపరుస్తున్నారని వ్రాస్తాడు.

ఒకరోజు అతని స్నేహితుడు సుయావి వస్తాడు. ఆయ్దిన్ తనని ధనసహాయం కోరుతూ ఒక ఈమెయిల్ వచ్చిందని చెబుతాడు. సుయావి అభిప్రాయం కావాలని అంటాడు. నిహాల్‌ని కూడా పిలిపిస్తాడు. ఆమె అభిప్రాయం కూడా తీసుకుంటానని అంటాడు. నిజానికి అతడు కాసేపు ఆమె తన ఎదురుగా ఉండటానికి ఆమెని రప్పించినట్టు ఉంటుంది. పైగా నేను కూడా సమాజానికి సేవ చేస్తున్నాను అని గొప్ప చెప్పుకోవటానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంటుంది. ఈమెయిల్ చదివి వినిపిస్తాడు. అందులో ఒక యువతి అతని వ్యాసాలు చదివానని, అవి తనని ఎంతో ప్రభావితం చేశాయని అంటుంది. తమ ఊళ్ళో కుట్టు పని నేర్పిస్తున్నామని, దానికి ఒక కేంద్రం నిర్మించాలని, దానికి సహాయం చేయమని అడుగుతుంది. ఆయ్దిన్ “నాకు ఇది నిజాయితీ గల కోరికలా అనిపిస్తోంది” అని నిహాల్ అభిప్రాయం అడుగుతాడు. “ఎందరో పిల్లలు పాడుపడిన పాఠశాలల్లో ఇబ్బందులు పడుతున్నారు. అది ముఖ్యం. ఇది అంత ముఖ్యం కాదు. కొత్త కేంద్రం నిర్మించటం ఎందుకు? ఎక్కడో కాస్త చోటు దొరకకపోదు. కాస్త రంగులు వేసుకుని అక్కడే కుట్టుపని నేర్పించవచ్చు” అంటుంది. ఆమె తనని పొగుడుతుందని అనుకున్న ఆయ్దిన్ విస్తుపోతాడు. సుయావి తనకే అభిప్రాయమూ లేదంటాడు. ఆయ్దిన్ నిహాల్‌తో “నువ్వు సహాయం చేయొద్దనటం ఆశ్చర్యంగా ఉంది” అంటాడు. “మేము పాఠశాలల కోసం కొన్నేళ్ళుగా విరాళాలు సేకరిస్తున్నాం. ఇప్పటి దాకా పట్టించుకోని మీరు ఇప్పుడు హఠాత్తుగా దాతృత్వం చూపిస్తున్నారే” అంటుంది. ఆయ్దిన్ మారు మాట్లాడకుండా ఉండిపోతాడు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత సుయావి “ఈ పేదరికం ఒక ప్రకృతి విపత్తు లాంటిది. దేవుడి అభీష్టం. మనమేం చేయలేం. నువ్వొక రచయితవి. సృజన చేయటం నీ పని. ఈ సమాజ సేవ చేసేవారు వేరే ఉన్నారు. వారికి వదిలెయ్” అంటాడు. నిహాల్ ముందు ఈ మాట అనటానికి అతనికి మనసొప్పలేదు. ఆమెకి ఈ మాట నచ్చదని తెలుసు.

చిత్రం మొదట్లో హోటల్లో అతిథిగా ఉన్న ఒకతను ఆయ్దిన్‌తో “మీ వెబ్‌సైట్లో గుర్రాల ఫోటోలు ఉన్నాయి. మీ హోటల్లో గుర్రాలున్నాయా?” అంటాడు. “మా హోటల్లో లేవు. ఈ ప్రాంతంలో అడవి గుర్రాలు తిరుగుతూ ఉంటాయి. అదే మా వెబ్‌సైట్లో పెట్టాం” అంటాడు ఆయ్దిన్. తర్వాత ఒక వ్యాపారితో మాట్లాడి ఒక అడవి గుర్రాన్ని పట్టి ఇవ్వమని చెబుతాడు. అతను ఒక అడవి గుర్రాన్ని బంధించి తెస్తాడు. ఆయ్దిన్ తన వ్యాపారం కోసం ప్రకృతిని వాడుకోవటానికి కూడా వెనకాడడు. పత్రికలో మాత్రం ఈ ప్రాంతమంతా నాగరికత పేరుతో సంస్కృతిని మరచిపోతోందని అంటాడు. చెప్పేదొకటి చేసేదొకటి. అయితే మనసులో సంఘర్షణ మొదలైన తర్వాత ఆ గుర్రాన్ని వదిలేస్తాడు. కీర్తి కోసం దానం చేయాలనుకున్నాడు. అతని భార్య అతని భేషజాన్ని గ్రహించింది. అతని వదాన్యతలో హేతుబద్ధత లేదని ముఖం మీద చెప్పింది. ఎవరో యువతి అతని వ్యాసాలని పొగిడేసరికి అతను ఉబ్బిపోయాడు. చాలామంది ఇలాగే ఉంటారు. చిత్రంలో తర్వాత ఆయ్దిన్ నిహాల్ చేసే సమాజ సేవలోని పద్ధతులని విమర్శిస్తాడు. అతను అక్కసు వెళ్ళగక్కుతున్నట్టు ఉంటుంది. అయితే ఈ చిత్రం ఎవరినీ వదిలిపెట్టదు. నిహాల్ ఆలోచనావిధానాన్ని కూడా ప్రశ్నిస్తుంది. మనుషులకి నిత్యావసరాలకి లోటు లేకపోతే జీవితంలో కొత్త ఆశయాలు పుట్టుకొస్తాయి. తామేదో గొప్ప పని చేస్తున్నామని, అవతలి వారు చేయట్లేదని కొందరు విమర్శలకి దిగుతారు. కొందరు జీవితానికి కొత్త అర్థం కోసం పాకులాడుతూ ‘నీ జీవితం ఏమంత గొప్పగా ఉంది’ అని అవతలి వారిని వేళాకోళం చేస్తారు. మొదట్లో ఆయ్దిన్‌ని ప్రోత్సహించిన నెజ్లా కూడా తర్వాత అతన్ని విమర్శిస్తుంది. పద్ధతులని విమర్శించకుండా ఉద్దేశాలని గౌరవించాలని ఈ చిత్రం సందేశం ఇస్తుంది. ఉద్దేశాలలో నిజాయితీ ఉందో లేదో ఎవరికి వారు పరిశీలించుకోవాలి. నిహాల్ ఆయ్దిన్ దాతృత్వాన్ని విమర్శించకుండా ‘అలా కాదు, ఇలా చేయండి’ అని చెప్పి ఉంటే బావుండేది కదా? ‘నీది దానం చేసే స్వభావం కాదు’ అని అర్థం వచ్చేటట్టు ఆమె మాట్లాడింది. దాని వెనక వేరే కారణాలు ఉండొచ్చు. అలాంటి వాటిని సహృదయంతో పరిష్కరించుకోవాలి కానీ ఒకరి మీద ఒకరు ఎప్పుడూ అసహనంగా ఉంటే జీవితాలు నరకమౌతాయి.

ఒకరోజు నెజ్లా హఠాత్తుగా ఒక ప్రశ్న వేస్తుంది. “క్రౌర్యాన్ని ఎదిరించకుండా ఉంటే ఎలా ఉంటుంది?” అంటుంది. ఆమెలోని మానసిక సంఘర్షణకి ఈ ప్రశ్న ఒక ప్రతిరూపం. “అలా అయితే సంఘం కుప్పకూలిపోతుంది” అంటాడు ఆయ్దిన్. మర్నాడు ఉదయం అల్పాహార సమయంలో ఈ చర్చ కొనసాగుతుంది. నిహాల్ కూడా ఉంటుంది. నెజ్లా “ఒక ఉదాహరణ చెబుతాను. ఒక దొంగ మన దగ్గరున్న పెయింటింగ్ దొంగిలించకూడదని మనం అనుకుంటే అతనికి ఆ పెయింటింగ్ మనమే ఇచ్చేస్తే ఎలా ఉంటుంది? అతను సిగ్గుపడి దొంగతనం చేయకుండా ఉంటాడేమో” అంటుంది. ఆయ్దిన్ “ఎంత మతిలేని ఆలోచన ఇది! ప్రజలు హత్యలు చేసుకోండని నిలబడితే కొందరు హంతకులు సిగ్గుపడి హత్యలు మానేస్తారని హత్యలని అనుమతిస్తామా?” అంటాడు. “నువ్వేమన్నా అను! ఇది కొన్ని సమస్యలకి పరిష్కారం అని నాకనిపిస్తోంది. నన్నెవరన్నా చంపాలనుకుంటే నేను ఎదురు తిరగకుండా ఉండిపోతాను. అప్పుడు ఆ హంతకుడి మనస్సాక్షి అతణ్ని ఆపుతుందేమో” అంటుంది నెజ్లా. “ఎదురుతిరిగితే నీ ప్రాణం దక్కవచ్చు కదా. ప్రాణం కాపాడుకోవటం మంచిదే కదా” అంటాడు ఆయ్దిన్. “ప్రాణం కాపాడుకోవటం అంత ముఖ్యమేమీ కాదు” అంటుంది నెజ్లా. ఇదంతా వింటుంటే మనకి అంగుళిమాలుడి కథ గుర్తొస్తుంది. అంగుళిమాలుడు చంపటానికి మీదకి వస్తుంటే బుద్ధుడు ప్రశాంతంగా నిలబడి “నా ప్రాణమే కావాలంటే తీసుకో” అంటాడు. అంగుళిమాలుడిలో పరివర్తన కలుగుతుంది. ఈ కథకి వేరే పాఠాంతరాలు కూడా ఉన్నాయి. నెజ్లా మాటలు విని నిహాల్ “నాకు ఆమె ఆలోచనావిధానం అర్థమైంది” అంటుంది. ఆయ్దిన్ ఆశ్చర్యం ప్రకటిస్తాడు. అసలు నెజ్లా ఇలా ఎందుకు ఆలోచిస్తోంది?

తర్వాత నెజ్లా నిహాల్‌తో మాట్లాడుతున్నపుడు ఆమెలోని సంఘర్షణ మనకి అర్థమవుతుంది. నెజ్లాకి విడాకులయ్యాయి. ఆమె మాజీ భర్తకి తాగుడు అలవాటుంది. ఆ వ్యసనం ఇప్పుడు ఇంకా పెరిగిందని నెజ్లాకి తెలిసింది. అతని పరిస్థితి దిగజారటంలో తన తప్పు కూడా ఉందని నెజ్లా అనుకుంటుంది. “అతని క్రౌర్యాన్ని నేను భరించి ఉంటే అతను పశ్చాత్తాపపడి ఉండేవాడేమో. విడాకులివ్వటం వల్ల అతని బతుకూ పాడయింది, నేనిక్కడ మనశ్శాంతి లేకుండా ఉన్నాను” అంటుంది. నిహాల్ “ఒక వయసు వచ్చాక మనుషులు మారరు. అతని క్రౌర్యాన్ని సహించి ఊరుకుంటే అతను తాను చేసేది తప్పు కాదని అనుకుని ఉండేవాడు” అంటుంది. “అతను ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాడని నాకనిపిస్తోంది. అతనికి అవకాశం ఉంటే నా దగ్గరకి వచ్చేవాడు. కానీ అతనికి ఆయ్దిన్ అంటే భయం. అందుకే రాడు. ఒక్కోసారి నేనే వెళ్ళి క్షమాపణ చెప్పాలని అనిపిస్తుంది” అంటుంది నెజ్లా! “కానీ మీ తప్పు ఏమీ లేదు కదా” అంటుంది నిహాల్. “అదే నా బలం. నా తప్పు లేకుండా అతనికి క్షమాపణ చెబితే అతను సిగ్గుతో నీరైపోతాడు. అప్పుడు అతనిలో మంచితనం మేల్కొంటుంది” అంటుంది నెజ్లా. “ఇదేం తర్కం! అయినా మీ ఇష్టం. మిమ్మల్నెవరూ ఆపరు. ఆ తర్వాత పరిణామాలు మీరే భరించాలి” అంటుంది నిహాల్. ఒక్కసారిగా నెజ్లా తీరు మారిపోతుంది. “నేనొకవేళ వెళ్ళాలనుకుంటే మీ అందరికీ దూరంగా వెళ్ళాలి కాబట్టి వెళతాను. ఇది మా నాన్న ఇల్లు. నా ఇష్టమొచ్చినప్పుడు వస్తాను, ఇష్టం లేకపోతే వెళతాను” అంటుంది. అసలు విషయమేమిటంటే ఆమెకి ఆ చిన్న ఊరు నచ్చలేదు. ఒక సందర్భంలో ఆమె విదేశంలో ఉండి వచ్చానని అంటుంది. భర్తతో పాటు విదేశం వెళ్ళి వచ్చిందని అనుకోవచ్చు. అలాంటి జీవితం వదిలి ఈ ఊరికి వచ్చానే అనే బాధ ఉంది. భర్త దగ్గరకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అని ఆలోచించింది. దానికి వేసే ముసుగులే ఈ క్షమాపణలు, సౌజన్యాలు. మనిషికి ఉన్నదానితో సంతృప్తి ఉండదు. ఇంకా ఏదో కావాలి. డబ్బు ఉంటే స్వతంత్రం లేదని బాధ. స్వతంత్రం ఉంటే గౌరవం లేదని బాధ. ఇలా ఏదో ఒకటి. నెజ్లా ఎందుకు వెళ్ళదు? భర్త మారకపోతే ఎలా అనే భయం ఉంది. ‘మీరు వద్దంటేనే ఆగిపోయాను’ అని ఒకసారి, ‘నేను వెళతానంటే నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారు’ అని ఒకసారి అంటుంది. తన జీవితం సరిగా లేదని వేరేవారిని నిందించటం. సామరస్యంగా భార్యాభర్తలు మాట్లాడుకుంటే చాలా కాపురాలు నిలబడతాయి. కానీ ఆధునిక సమాజంలో పంతాలు ఎక్కువైపోయాయి. అందరూ రాజీ పడవలసినదే. రాజీ పడనంటే ఒంటరి జీవితమే మిగులుతుంది. మొదట నెజ్లా ప్రశ్న విని ఆమె అంతఃశాంతిని సాధించిందేమో అనిపిస్తుంది. కానీ ఆమె మనసులో ఉన్నది తీవ్ర అసంతృప్తి అని చివరికి తెలుస్తుంది.

తర్వాత నెజ్లా ఆయ్దిన్‌తో కూడా గొడవ పడుతుంది. గొడవ అంటే పెద్దగా అరుచుకోవటం ఏమీ ఉండదు. ఇద్దరూ స్టడీ రూమ్‌లో కూర్చుని ఉంటారు. ఒకరి మీద ఒకరు మాటల బాణాలు వేసుకుంటూ ఉంటారు. నెజ్లా మెత్తగానే చురకలు వేస్తూ ఉంటుంది. ఈ సన్నివేశం చూడాల్సిందే కానీ చెబితే సరిపోదు. తన జీవితం నిస్సారంగా ఉందనే అక్కసుతో ‘నీ జీవితం ఏమంత గొప్పగా లేదు’ అని నెజ్లా ఆయ్దిన్‌ని కించపరుస్తుంది. ఈ సన్నివేశంలో కేవలం మాటలు, ఫొటోగ్రఫీ, ఎడిటింగ్‌తో ఉత్కంఠను కలిగించాడు దర్శకుడు. కేవలం మాటలతో ఇంత ఉత్కంఠ కలిగించటం నేను వేరే ఏ చిత్రంలోనూ చూడలేదు.

దర్శకుడు నూరీ బిల్గె జెయ్లాన్ తన భార్య ఎబ్రూ జెయ్లాన్‌తో కలిసి వ్రాసిన స్క్రీన్ ప్లే ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించాడు. ఆంటాన్ చెకోవ్ వ్రాసిన నవలిక ‘ద వైఫ్’ ఈ చిత్రానికి మూలం. అలాగే ఫియొడోర్ డోస్టొయెవ్స్కీ వ్రాసిన ‘ద బ్రదర్స్ కరమజోవ్’ నవలలోని ఒక ఉపకథని కూడా తీసుకున్నారు. నేను ఈ రచయితల రచనలు చదవలేదు. ఈ చిత్రం చూశాక చదవాలని నిశ్చయించుకున్నాను. ఈ స్క్రీన్ ప్లే వ్రాయటానికి దంపతులిద్దరూ చాలా శ్రమించారట. చిత్రం చూస్తుంటే అంతా సహజంగా ఉన్నట్టు ఉంటుంది కానీ ఆ సహజత్వం వెనకాల ఎంత కృషి ఉందో ఆలోచిస్తే అర్థమవుతుంది. ఈ స్క్రీన్ ప్లే వ్రాసేటపుడు దంపతులిద్దరూ వాడి వేడి చర్చలు చేసేవారట. కొసమెరుపేమిటంటే ఈ చిత్రం తర్వాత ఎబ్రూ జెయ్లాన్ ఇక తన భర్తతో కలిసి స్క్రీన్ ప్లేలు వ్రాయకూడదని నిర్ణయించుకుంది! ఈ చిత్రంలో నటీనటులు జీవించారనే చెప్పాలి. ముఖ్యంగా ఆయ్దిన్‌గా నటించిన హాలుక్ బిల్గినర్, నెజ్లాగా నటించిన డెమెట్ ఆక్బాగ్. ఒకే కడుపున పుట్టినవారి మధ్యలో ఉండే కోపతాపాలు అద్భుతంగా అభినయించారు. ఈ చిత్రానికి పోస్టర్‌గా ఉపయోగించిన పెయింటింగ్ (పైన చూపినది) చిత్రంలో ఒక గోడ మీద ఉండటం వింత అనుభూతిని కలిగిస్తుంది.

చిత్రంలో చిన్న చిన్న సంఘటనలు సహజత్వానికి దోహదం చేస్తాయి. పనిమనిషి చేత పనులు చేయించుకుంటూ ఆ పనుల్లో లోపాలు ఎత్తి చూపించటం ఉంటుంది, కానీ పాతకాలంలోలా దూషించటం ఉండదు. అల్పాహారం చేస్తున్నప్పుడు తేనె గడ్డకట్టి ఉండటంతో ఆయ్దిన్ పనిమనిషితో “వేరే తేనె ఉందా? లేకపోతే ఈ తేనెని వేడి నీళ్ళలో పెట్టు” అంటాడు. హామ్దీ ఆయ్దిన్‌ని కలుసుకోవటానికి వచ్చినపుడు బూట్లు బయట వదిలి లోపలికి వస్తాడు. చలి ఎక్కువ ఉండటంతో అతని కోసం ఆయ్దిన్ పనిమనిషి చేత ఇంట్లో వేసుకునే చెప్పులు తెప్పిస్తాడు. హోటళ్ళలో ఇలాంటి చెప్పులు అతిథులకి ఇస్తారు. ఆమె ఆడవాళ్ళ చెప్పులు తెస్తుంది. ఆయ్దిన్ ప్రశ్నిస్తాడు కానీ హామ్దీ పర్వాలేదంటాడు. ఇలాంటి సంఘటనలు తెలుగులో కె. విశ్వనాథ్ సినిమాలలో తరచు కనపడేవి. కొన్ని కథకి దోహదం చేస్తాయి, కొన్ని మనుషుల స్వభావాలని చూపుతాయి. హామ్దీ బూట్లు బురదపట్టి ఉంటాయి. అది చూసి ఆయ్దిన్ అతనికి శుభ్రత లేదు అనుకుంటాడే కానీ వర్షం పడిన నేల మీద అతను దూరం నుంచి నడిచి వచ్చాడని ఆలోచించడు. నెజ్లా తన గాజు గ్లాసులు పనిమనిషి డిష్ వాషర్‌లో పెట్టటం వల్ల పగిలిపోయాయని, పనిమనిషి జీతం కోస్తానని అంటుంది. నిహాల్ వద్దంటుంది. నెజ్లా సర్దుకుని “నా మనసేం బాగాలేదు. అందుకే ఊరికే కోపం వస్తోంది” అంటుంది. మనుషుల్ని ప్రేమించాలి, వస్తువుల్ని వాడుకోవాలి. మనం వస్తువుల్ని ప్రేమిస్తున్నాం, మనుషుల్ని వాడుకుంటున్నాం. వస్తువులు, బంధాలు ఏవీ శాశ్వతం కాదు. అది తెలుసుకుని ఆత్మవిచారం చేయగలిగితే మనిషికి శాంతి లభిస్తుంది. పరిస్థితులు మరీ దిగజారిపోతే ఏవైనా నిర్ణయాలు తీసుకోవచ్చు కానీ ఒడిదుడుకులకి తట్టుకుని నిలబడటమే శ్రేయస్కరం. ఒడిదుడుకులు రాగానే పారిపోవటం బలహీనతే అవుతుంది.

ఈ క్రింద చిత్రం లోని ఒక ముఖ్య ఘట్టం ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం ముగింపు ప్రస్తావించలేదు.

ఆయ్దిన్, నెజ్లా అహంకారపూరితమైన వ్యక్తులని తెలిసిపోతూనే ఉంటుంది. మరి నిహాల్ సంగతి ఏమిటి? ఆమె ఒక బాధితురాలి లాగా కనిపిస్తుంది. ఆమె సమాజ సేవ చేస్తూ ఊరట పొందుతూ ఉంటుంది. ఆయ్దిన్ ఆమె పద్ధతులను తప్పుపడతాడు. మళ్ళీ మనసు మార్చుకుంటాడు. “నీకు ఎలా మంచిదనిపిస్తే అలా చేసుకో” అంటాడు. ఆమె సేకరించే విరాళాలకి పది వేల లిరాలు (అప్పట్లో 3 లక్షల రూపాయలు) గుప్తదానంగా ఇస్తాడు. కొన్నాళ్ళు ఇస్తాన్బుల్ (తుర్కియేలో ముఖ్యనగరం) లో ఉండివస్తానని వెళతాడు. నిహాల్ అతనిచ్చిన డబ్బు తీసుకుని హామ్దీ ఇంటికి వెళుతుంది. ముందు హామ్దీతో మాట్లాడుతుంది. ఇస్మాయిల్ జైలుకి ఎందుకు వెళ్ళాడని అడుగుతుంది. “ఇస్మాయిల్ భార్యని కొందరు వేధించేవారు. ఒకరాత్రి ఆమె లోదుస్తులు బయట ఆరేసినవి ఎవరో దొంగిలించారు. ఇస్మాయిల్ వారిని పట్టుకోవటానికి ప్రయత్నించాడు కానీ వాళ్ళు దొరకలేదు. మర్నాడు బజార్లో కొందరు ఇస్మాయిల్‌ని చూసి నవ్వారు. అతను ఒకడిని చాకుతో పొడిచాడు. అందుకని శిక్ష పడింది. ఇప్పుడు ఉద్యోగం లేదు. తాగుడుకి అలవాటు పడ్డాడు” అంటాడు హామ్దీ. నిహాల్ అతనికి డబ్బు ఇస్తుంది. అతను అర్థం కాక ఆశ్చర్యపోతాడు. ఆ మొత్తం చాలా ఎక్కువని అంటాడు. ఇంతలో ఇస్మాయిల్ వస్తాడు. హామ్దీ విషయం చెబుతాడు. ఇస్మాయిల్ ఆ డబ్బు చేతిలోకి తీసుకుని “నా కొడుకు ప్రాణాలకు తెగించి తండ్రి అవమానానికి ప్రతీకారం చేసినందుకు కొంత, హామ్దీ ఆయ్దిన్‌ని వేడుకున్నందుకు కొంత, నేను నా కొడుకు కళ్ళెదురుగానే దెబ్బలు తిన్నందుకు కొంత, మీరు మీ అపరాధభావాన్ని డబ్బుతో పోగొట్టుకోవాలని ఇచ్చింది కొంత – అంతా కలిపి ఇంత అయిందన్నమాట. కానీ ఈ పనికిమాలిన తాగుబోతుకి మీద ఉదారగుణాన్ని అర్థం చేసుకునే మంచితనం లేదు” అని ఆ డబ్బు అక్కడే ఉన్న చలిమంటలో పారేస్తాడు. నిహాల్ నిర్ఘాంతపోతుంది.

పేదలకి కూడా ఆత్మాభిమానం ఉంటుందని ఇస్మాయిల్ భావం. వారిని గౌరవంగా చూడాలి. వారి పరిస్థితులని అర్థం చేసుకుంటే అదే వారికి చాలు. మామూలు యజమానులు అద్దె కోసం గొడవ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఆయ్దిన్ లాంటి వాళ్ళు సంపన్నులు. ఆస్తులు వ్యవహారాలు ఎవరికో అప్పగించి కేవలం వ్యాసాలతో సమాజాన్ని ఉద్ధరిద్దామని అనుకుంటే ఏం లాభం? ఒకవేళ వ్యవహారాలు ఎవరికైనా అప్పగించినా కొన్ని విషయాల్లో కలగజేసుకోవాలి. ‘తీవ్రమైన చర్యలు తీసుకునే ముందు నాకు చెప్పండి’ అని ఆయ్దిన్ కలగజేసుకుని ఉంటే ఇస్మాయిల్‌కి అవమానం తప్పేది. ఎవరి ఊరిలో వారు ఊరి జనానికి ఆసరాగా ఉంటే చాలు, ప్రపంచం బావుంటుంది. వ్యాసాలు వ్రాయటం వల్ల వచ్చే ప్రయోజనం కన్నా సానుభూతితో మెలగటమే సత్వర ఫలితాలు ఇస్తుంది.

Exit mobile version